పి.సరళాదేవి

పి.సత్యవతి
పంథొమ్మిదివందల యాభై అరవై దశకాలలో ఖాసా సుబ్బారావుగారు సంపాదకులుగా వున్న తెలుగు స్వతంత్ర, ఆ పైన గోరాశాస్త్రి, శ్రీదేవి గార్ల సంపాదకత్వంలో నడిచి తరువాత ఆగిపోయిన స్వతంత్ర కొత్త రచయితలకి ఆత్మీయ స్వాగతం పలికేవి. రచయిత పేరు ప్రఖ్యాతులని బట్టి కాక రచనని పట్టి ప్రచురించి ఎందరో రచయితల్ని ప్రోత్సహించిన పత్రికలవి… తన తొలికథలతోనే పాఠకులను ఆకట్టుకున్న రచయిత్రి సరళాదేవి చాలా కథలు స్వతంత్రలోనే వ్రాసారు. శ్రీదేవి కాలాతీత వ్యక్తులు నవల మీద ”ఒక ప్రశస్తి” వ్యాసం కూడా వ్రాసారు. ఆమె తొలి కథ ”బావ చూపిన బ్రతుకు బాట” డిసెంబర్‌ 1955 లో ప్రజాతంత్రలో ప్రచురితమైంది. మొదటి కథా సంకలనం ”కుంకుమ రేఖలు” అరవై రెండులో వచ్చినా ఆమె 1956 నించీ స్వతంత్రలో దాదాపు ఏడెనిమిది కథలు వ్రాశారు. అవి కుంకుమ రేఖలు సంకలనంలో చేర్చలేదు. కుంకుమ రేఖలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం ధారావాహికంగా ప్రసారం చేసింది. ఆమె కథనం, భాష ఆమె పేరుకి తగ్గట్టు అంత సరళంగానూ వుంటాయి… అప్పుడు విజయవాడ కేంద్రంలో అనౌన్సర్‌గా పనిచేసిన శ్యామసుందరిగారి కంఠం అత్యంత మధురమైనదీ, ఆమె మోడ్యులేషన్‌ అనితర సాధ్యమైనదీ కావడాన, సరళాదేవి కథకి ఆమె కంఠం జత జేరి ఆ ధారావాహికకు విశేషాధరణ లభించింది… కుంకుమ రేఖలు కథా సంకలనం రెండవ ముద్రణ పైన ముఖచిత్రం, కథా రచనలోనూ వ్యక్తిగతంగానూ ఆమెలో వచ్చిన ప్రౌఢతా, పరిణతిలకు అద్దంలా వుంటుంది. 1955 లో కథారచన ప్రారంభించిన సరళాదేవి అరవై, డెబ్భై దశకాలలో ఎక్కువ వ్రాసారు. 77లో రెండవ కథా సంకలనం సరళాదేవి కథలు ప్రచురితమైంది. 79లో యువ మాసపత్రికలో కొమ్మా బొమ్మా అనే నవలిక వ్రాశారు… అముద్రితమైన మరో నవలిక చిగురుతో కలిపి 2004త లో పుస్తకంగా తెచ్చారు. తెలుగు సామెతలు సాంఘిక చిత్రణ అనే పరిశోధనాత్మక గ్రంథాన్ని 1986 లో ప్రచురించారు. స్వతంత్రలోనూ మరికొన్ని పత్రికల్లోనూ కవితలు వ్రాసారు. కొందరు రచయిత్రులతో కలిసి షణ్ముఖప్రియ.. సప్తపది అనే రెండు గొలుసు నవలలు కూడా వ్రాశారు.
గోరాశాస్త్రిగారి ముందుమాటతో ప్రచురితమైన ”కుంకుమరేఖలు” సంకలనంలో ఎనిమిది కథలున్నాయి. ”సరళాదేవి కథలు” సంకలనంలో పది కథలున్నాయి. కుంకుమరేఖలులో హేమలత అనే అమ్మాయి అమాయకత్వం నించీ ముక్కు సూటితనం నించీ ప్రపంచపు పోకడలను అర్థంచేసుకుంటూ నొప్పింపక తానొవ్వక బ్రతకడం నేర్చుకున్న వైనం సహజంగా సరదాగా సాగేకథ. పుట్టింటి ఆర్థిక పరిస్థితులనూ అక్కడ డబ్బుతో వాళ్ళు వ్యవహరించే పద్ధతినీ గమనిస్తూ పెరిగిన హేమలత తనకంటూ ఒక కుటుంబం ఏర్పడ్డాక డబ్బుతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలనీ పొదుపుచెయ్యాలనీ అట్లా పొదుపుచేస్తే అవసరపడ్డప్పుడు అప్పుచేసేపని వుండదనీ అనుకుంటూ ఆ రోజుకోసం ఎదురుచూస్తుంది. ఆమె భర్త కూడా తన సాదరు ఖర్చులకుంచుకుని తక్కిన జీతమంతా ఆమెకే ఇచ్చి ఇల్లు నడపమంటె సంతోషపడుతుంది. కానీ తక్కువ జీతాల సంసారాల్లో పొదుపు చెయ్యడం మిగల్చడం అంటే అప్పుచెయ్యకుండ వుండగలగడమేనని అర్థం చేసుకుని అటువైపునించీ దృష్టి మళ్ళించి, తన ముక్కు సూటి స్వభావంతో చిక్కులు కొని తెచ్చుకుని, అందరితో కలసి పోవాలంటే కొంత లౌక్యం, నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరిగే స్వభావం అవసరమని గుర్తించి.. భర్త చేత” ఫరవాలేదు హేమలత బ్రతకడం నేర్చుకుంది” అనిపించుకుంటుంది. హేమలతకు ప్రయివేటుగా బి.ఎ. చదవాలని వుంటుంది. పుస్తకాలు చదివే అలవాటు వుంటుంది. వాటిని జాగ్రత్త పెట్టుకునే అలవాటు కూడా వుంటుంది… పార్థసారధి ఆమెను అర్థం చేసుకున్న భర్త. అందువలన ఆమెకు జండర్‌ పరమైన ఇబ్బందులేమీ లేవు. సరళాదేవి ప్రచురించిన రెండు సంపుటులలోని పద్ధెనిమిది కథల్లో దాదాపు అన్నీ స్త్రీల జీవితాలు, ముఖ్యంగా ఆనాటి దిగువ మధ్య తరగతి స్త్రీల జీవితాల చుట్టూ అల్లుకున్నవే… డబ్బు పొదుపు, లౌక్యంగా మెసలడంతో మొదలుపెట్టిన సరళాదేవి, స్త్రీల లైంగికత.. దాంపత్య సంబంధాలు, సమాజం స్త్రీ పురుషులకు కొన్ని ప్రత్యేక లక్షణాలనూ విధులనూ నిర్ణయించినందువల్ల ఆ ఇద్దరూ కూడా కోల్పోతున్న జీవన ఆనందాలు మొదలైన అనేక విషయాల్ని తన కథల్లో చర్చకు పెట్టారు.. ఆమె వ్రాసిన కాలం అప్పుడప్పుడే స్త్రీలు ఉన్నత విద్యను అందుకుంటున్న కాలం, మధ్య తరగతిలో అప్పటికింకా ఆడవాళ్ళు ఉద్యోగం చెయ్యడం కుటుంబానికి అప్రతిష్ట అనుకునే కాలం… స్త్రీ జీవన గమ్యం వివాహమేనని, వాళ్ళకింకా పద్దెనిమిది రాకముందే పెళ్లి చెయ్యడానికి తొందరపడిన కాలం. అయితే ఈ పరిస్థితి అన్ని వర్గాలలోనూ లేదు. సంపన్నులూ, వివిధ సంస్కరణ ఉద్యమాల వల్ల ప్రభావితమైన వాళ్ల కుటుంబాలలో ఆడపిల్లల చదువు పట్ల కొంత ఆసక్తి కనపరచడం ఆనాటికే వుంది.. ఈ ఆసక్తిని సరళాదేవి గారి ”సరస్వతులను చెయ్యబోతే” అనే కథలో చూడవచ్చు. అపురూపంగా పెంచుకున్న చెల్లెల్ని డాక్టర్ని చెయ్యాలని లేదా ఒక డాక్టర్‌ కిచ్చి పెళ్ళి చెయ్యాలని ఆశపడ్డ అన్నగార్ని నిరాశలో ముంచి ఒక సాధారణ ఉద్యోగిని ప్రేమ పెళ్లి చేసుకుంది అతని చెల్లెలు. పోనీ ఆ చెల్లెలు కూతుర్నైయినా బాగా చదివిద్దామంటే ఆ పిల్ల కూడా అంతే చేసింది… మధ్య తరగతి సంసారాలలో కూతుళ్లకి పురుళ్ళు పోసి పంపడం ఎంత భారమైన విషయమో చెబుతూ కూతుళ్ళెంత బాధ్యతగా ప్రవర్తించాలో కూడా సూచించే మంచి కథ ”కూతుళ్ళు” కుటుంబ సభ్యుల పరస్పర ప్రేమల మధ్యనే చిట్టి పొట్టి అసూయలని సహజంగా వర్ణిస్తూ, దంపతుల మధ్య ఎంత సాన్నిహిత్యం వున్నా కొంత స్వంత స్పేస్‌ కూడా వుండాలని చెప్పిన కథ ”తిరిగిన మలుపు” సరళాదేవి మొదటి సంపుటిలోని కథలకీ రెండవసంపుటిలోని కథలకీ స్పష్టమైన పరిణామం వుంది. ఆమెకు జీవితం పట్ల, స్త్రీ పురుష సంబంధాల పట్ల కల అభిప్రాయాల స్పష్టీకరణ వుంది. రెండవ సంపుటం ”సరళాదేవి కథలు” (1977)లోని పది కథలలోనూ అవి కాక భూమిక… నూరేళ్లపంటలలో ప్రచురణ అయిన రెండు కథలలోనూ ఆమెలో జండర్‌ పరమైన అవగాహన కనిపిస్తుంది. ”ఒక ఇంటి కథ”, ”వాడి కొమ్ములు” ”భిన్నత్వంలో ఏకత్వం” ”పేచీ” ”మర్రి చెట్టినీడలో” అనే కథలు సరళాదేవి జీవన తాత్వికతను ప్రాపంచిక దృక్పథాన్ని తెలిపే కథలు. ఒక ఇంటి కథలో ఒక ఇల్లాలు ”షట్కర్మయుక్త” ను పాటిస్తూ సంసారం నెగ్గుకొచ్చి తనకూతురికి కూడా అట్లావుండడం స్త్రీ ధర్మమని చెప్పినప్పుడు, ఆ కూతురు ఆశ్చర్యపడి ”ఒక మనిషికి ఇంకొక మనిషి ఇంత భారమా అమ్మా?”అని అడుగుతుంది. తన తల్లి ఆషట్కర్మల భారాన్ని మోసింది కానీ తనవల్లయితే కాదనే ఉద్దేశంతో… ఆడపిల్లల ఆలోచనల్లో వచ్చే మార్పుల్ని ప్రశ్నించే స్వభావాన్ని పెంపొందించుకుంటున్న క్రమాన్నీ ఈ కథ అర్థం చేయిస్తుంది.. ”స్త్రీ” అనే కథలో పేదరికం కారణంగా శాంతను చెవిటివాడైన గోవిందుకిచ్చి చేస్తారు… చెవిటివాడూ చదువులేనివాడూ అయిన గోవిందుతో ఉంటూనే తమతో శారీరక వాంఛలు తీర్చుకోమని బంధువులే ఆమెకు సంకేతాలివ్వడమే కాక ప్రత్యక్షంగా అడుగుతారు. శాంత తన పరిస్థితిని అర్థం చేసుకుని, చెవిటితనం కాపురం చెయ్యడానికి అడ్డురాదని, గోవిందు సైకిల్‌ షాపుకి తోడు తనూ మిషన్‌ కుట్టి సంపాదించి ఇద్దరు బిడ్డలకి తల్లై వాళ్ళ జీవితాలను దిద్దుతుంది. కానీ ఆమె కొడుకు ధనవంతుల బిడ్డను చేసుకుని వెళ్ళిపోయినప్పుడు తను చనిపోయినట్లే బాధపడుతుంది. పెద్దల నిర్ణయాలకు బద్దురాలై తనకు వాళ్ళు నిర్ణయించిన భవిష్యత్తుని మౌనంగా అంగీకరించి తనున్న చోటునే నివాసయోగ్యంగా మార్చుకున్న స్త్రీ శాంత.
స్త్రీ పురుష సంబంధాలను గురించి సరళాదేవి గారి అభిప్రాయాలకు అద్దంలాంటి కథ ”వాడికొమ్ములు” సాధారణంగా పూర్వపు అత్తగార్లు కోడళ్ళపై కొడుకులు చూసి ప్రేమకు ఒకింత ఈసు చెంది ”ముందొచ్చిన చెవులకంటె వెనకొచ్చిన కొమ్ములు వాడి” అంటూండేవారు ఈ కథలో యువకుడు ”అవును నిజం అని వాడివే” అని తర్కం చెబుతాడు. అతనిలా అంటాడు మగవాడి జీవితంలో తల్లి ఎక్కువా? భార్య ఎక్కువా? అన్న సమస్య. బహుశా భారతదేశంలోనే వుండి వుంటుంది. ఆడదాని జీవితంలోకి మొగుడు కావాలా, కొడుకు కావాలా అన్న ప్రశ్నను పంపించి, అనేక సినిమాల్లోనూ పుస్తకాలలోనూ ఆడది మొగుణ్ణే ఎంచుకోడం చూపించి అదే ఆదర్శ మహిళతత్వమని చాటారు. అదిచూసి మనందరం చప్పట్లు కొట్టాము. అదే రకంగా పురుషుడు భార్యే ఎక్కువని ఎంచుకుంటే తప్పట్లు కొట్టరెందుచేత? అతనింకా ఇలా అంటాడు. స్నేహ సంబంధమైన దాంపత్య బంధం నువ్వు వూహించగలవా, మామయ్యా? నాకు తెలుసు నువ్వు ఊహించలేవు. అందులో ఒకరు ఎక్కువా ఒకరు తక్కువా లేదు ఉల్టా సీదాలు లేవు. గృహమే స్వర్గసీమ అన్నట్లు వుండాలని నా కోరిక. ”వెనకొచ్చిన కొమ్ములు తప్పకుండా వాడివే మామయ్యా! నువ్వూ నేనూ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అవి వాడివే” అంటాడు తల్లి తండ్రుల పట్ల బాధ్యతలు మరువకుండానే వాళ్ళ అత్యాశలను పక్కనపెట్టి, జీవన భాగస్వామిని ప్రేమించి గౌరవించి జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని అంటాడు.
”భిన్నత్వంలో ఏకత్వం” భర్తల చేతులో హీనమైన పరాభవాలకు గురౌతూ కూడా వారిని విడిచిపెట్టమని ఇద్దరు స్త్రీల కథ. ఒక స్త్రీ పల్లెటూరిది, చదువురానిది. రెండవ ఆమెకు ఎవరూ కల్పించనవసరం లేనన్ని అవకాశాలు వున్నాయి. కానీ ఈమె భర్తకు విడాకులివ్వదు. ఈ కథకు సరళాదేవిగారి ముగింపు వాక్యాలు. ”దుర్మార్గుడైన పురుషుడిని రెచ్చగొట్టే స్త్రీ దుర్మార్గురాలు కాదా? ఈ నిర్ణయంతో వీళ్ళు సాధించదలిచింది ఏమిటి?భయంకరమైన సత్యమేదో కనిపించీ కనిపించనట్టుంది అదే నిజమైతే వీళ్ళ ప్రయాణం ఏ దిక్కుకి?”
ఇదే కథలో విద్యావంతురాలైన రెండవ ఆమెతో ఆమె బాబాయి, ”స్త్రీ విడాకులివ్వడం మళ్ళీ పెళ్ళి చేసుకోడం లోకం హర్షించదేమోకానీ చరిత్ర హర్షిస్తుంది. ఉత్తినే కాలిపోయేకన్న ఒక ఆరోగ్యకరమైన పోరాటంలో నువ్వొక సమిధవై కాలిపోతే..” అంటాడు.
”పేచీ” అనే కథలో కట్నం ఇచ్చి కూతురికి పెళ్లి చెయ్యలేని తండ్రి, తన కూతురితో కేవలం స్నేహం చేస్తున్న హరికిషన్‌ అనే అబ్బాయిని సూటిగా ”నాకూతుర్ని పెళ్ళి చేసుకుంటావా?” అని అడక్క ఎవరో పుట్టించినట్టు తనే వాళ్లమీద పుకార్లు పుట్టించి వాళ్ళిద్దరికీ పెళ్ళయ్యేలా చేస్తాడు… ఈ పేచీ సంగతి తెలిసిన అల్లుడు భార్యని పుట్టింటి గుమ్మం తొక్కవద్దంటాడు. ఇక్కడ స్త్రీలకి నిర్ణయాధికారాలేమీ లేవు వాళ్ల జీవితాలతో ఆడుకునేది ఇద్దరూ పురుషులే.. మర్రిచెట్టు నీడలో అనే కథలో మర్రిచెట్టు నీడలో ఇతర మొక్కలు విస్తరించనట్లు తల్లి అక్క చెల్లెళ్ళకు ఒక్కగానొక్కడైన కొడుకు/తమ్ముడు వాళ్ళ అతిప్రేమ అనే పొసెసివ్నెస్‌ లోపడి కొట్టుకున్నంతకాలం తనకి తన భార్యతో నిజమైన ప్రేమతో కూడిన జీవితం దొరకదని అర్థమై ట్రాన్స్‌ఫర్‌కి పెట్టుకుంటాడు.
సరళాదేవి రెండు నవలికలు లేదా పెద్ద కథలు కూడా ఇద్దరు స్త్రీల జీవితాలలోని సంక్షోబాన్ని చిత్రిస్తాయి. రెండు నవలికలలోని ప్రధాన స్త్రీ పాత్రలు దిగువ మధ్యతరగతి వాళ్ళే. ”చిగురు” అనే నవలికలో విమలని, ఆ ఇంటి ఆర్థిక పరిస్థితుల వల్ల ఆమె కన్న చాలా పెద్దవాడూ, మూడో పెళ్ళివాడూ, అయిదుగురు బిడ్డలతండ్రి అయిన రమాపతికి ఇచ్చి పెళ్ళి చేస్తారు. అతను పెళ్ళి చూపుల్లోనే తానీ పెళ్ళి పిల్లల కోసమే చేసుకుంటున్నానని స్పష్టంగా చెప్పాడు. ఆమేరకు అతను విమలను ఆ అయిదుగురు పిల్లలమధ్యా కుమ్మరించేసి చేతులు దులిపేసుకున్నాడు. ఆమెకేసి కన్నెత్తి చూడలేదు. రమాపతిది ఒక వింత మనస్తత్వం అతనేం చెప్పాలనుకున్నాడో సూటిగా చెప్పడు. పెద్ద దృశ్యం సృష్టిస్తాడు. దాన్ని అర్థంచేసుకుని ఇంట్లో వాళ్ళు మసలాలి. దాదాపు విమల ఈడువాడే అయిన రమాపతి పెద్దకొడుకు హరి ఒక్కడే ఆ ఇంట్లో ఆమెని అర్థం చేసుకున్నవాడు. అతను రమాపతి పెద్ద భార్య కొడుకు. తక్కినవాళ్ళు రెండవ భార్య పిల్లలు. రెండవ భార్య అతని చెత్త వృత్తులన్నింటినీ భరించి సమర్థంగా కాపురం నడుపుకొచ్చింది. విమల ఒక వంట మనిషిగా పిల్లల్ని చూసుకునే మనిషిగా మిగిలిందనీ స్త్రీలకైనా పురుషలకైనా సహజసిద్ధమైన శరీరక వాంచలు తీరకపోవడం పెద్ద లోటనీ విమలకు అన్యాయం జరిగిందనీ తెలుసుకుని ఆమె తల్లి ఆ దిగులుతోనే మరణించింది. విమల తల్లి రమణమ్మ బాల వితంతువు. ఆమె పరిస్థితి చూసి రంగారావనే యువకుడు జాలి పడ్డాడు. రమణమ్మ కూడా అతనిపట్ల ఆకర్షితురాలైంది. స్నేహితుల సహాయంతో వేరే ఊర్లో వారికి వివాహం జరిగింది. ”శారీరక అవసరాలు స్త్రీకి వేరూ పురుషుడికి వేరూ వుండవనీ ప్రకృతి స్త్రీ పురుషులిద్దరిమధ్యా ఒకేరకం ప్రభావం చూపిస్తుందనీ సంప్రదాయం మాత్రమే స్త్రీలకు కళ్ళాలు బిగించిందనీ రమణమ్మ నమ్మకం. (రచయిత్రి నమ్మకం). అందుకే ఆమె తనకూతురికి తామే అన్యాయం చేశామని క్షోభించింది. రమాపతి కొడుకు హరి తండ్రిని సరిగ్గా అంచనా వేయగలిగాడు” నాన్నకు ఆంగికంగా ఆడది కావాలి. కానీ దాన్ని సాధించడమెలాగో తెలియదు. సక్రమంగా కట్టుకున్న ఇల్లాలిని ఆదరించడమే తెలియదు. సూటిగా ప్రయత్నించడం, మెల్లిగా స్నేహం చెయ్యడం తీయగా కవ్వించడం హాయిగా ఆకర్షించడం ఆయనకు చేతకాదు. సమాజం ఆ నేర్పుని పురుషులలో చంపేసింది. ఆడదాని మీద హక్కులిచ్చి పెళ్ళి పేరుతో ఎన్నో అవకాశాలిచ్చి పాతివ్రత్యం పేరుతో ఆడదాన్ని కట్టిపడేసి పురుషునిలో ఆ నేర్పుని చంపేసింది”. పితృస్వామ్య వ్యవస్థ వల్ల లభించిన హక్కు అధికారాలు పురుషులను మానవసహజమైన అనుభూతులకెలా దూరంచేశాయో చెబుతుంది రచయిత్రి హరి మాటల్లో…
”కొమ్మా బొమ్మా” నవలికలో మంగ ఇంకా స్కూల్లో చదువుతూండగానే తండ్రి ఆమెకు పెళ్ళి నిశ్చయం చేస్తాడు. కానీ పెళ్ళినాటి రాత్రే ఆ భర్త పారిపోతాడు. అందుకు కారణం మంగేనని అత్తగారు యాగీ చేస్తారు. అసలు మొదటిరాత్రంటే ఏమిటో కూడా తెలీని మంగ భర్త ఎందుకు పారిపోయాడో తెలీని మంగ అన్ని అపవాదుల్ని భరించింది. కూతురికి జరిగిన అన్యాయానికి కలత పడి ఆ ఆవేదనతో తల్లి మరణించింది. తండ్రి ఆర్థికంగా చితికిపోయాడు. స్నేహితురాలి తల్లి కమలమ్మ ప్రోత్సాహంతో మళ్ళీ చదివి స్కూల్‌ టీచర్‌గా చేరి చనిపోయిన అక్క పిల్లల బాధ్యత కూడా తీసుకుని తోటి టీచర్‌ అయిన ఆనందరావుని వివాహం చేసుకోవాలనే ఒక మంచి నిర్ణయం తీసుకున్న సమయంలో పారిపోయిన భర్తనంటూ నాయనమ్మని వెంటపెట్టుకుని ఒక వెంగళప్ప వస్తాడు. ఇరుగూ పొరుగూ పంచాయితీలు పెడతారు. అతన్ని అక్కడే వుండనియ్యమంటారు. స్త్రీధర్మాలు ప్రబోధిస్తారు. ఆడదానికి మగదిక్కు ఎంత అవసరమో నొక్కి వక్కాణిస్తారు. వచ్చినతను అసలో నకిలీయో తెలియదు. అంతకు ముందు అక్క భర్త వచ్చి ఆమెను బలవంతం చెయ్యబోయి ఆమె ప్రతిఘటించగా ”చూసుకో నిన్నేం చేస్తానో” అని బెదిరించిపోయాడు. ”తన ఇంట్లో తన అరుగు కింద చేరి తన బ్రతుకుని పంచాయతీ చేసే హక్కు వీళ్ళకెవరిచ్చారు? తన జీవితం తన చేతుల్లోనించీ జారిపోయి ఎప్పటికప్పుడు ఎవరి చేతుల్లోనో పడుతోంది. ఈ ఆడది ఎందరి దయాదాక్షిణ్యాల మీద బ్రతకాలి” అని ఆవేదన పడింది. చివరికి వచ్చినవాళ్లు చెప్పకుండా పారిపోవడంతో మంగ ఊపిరి పీల్చుకోగలిగింది. స్త్రీల జీవితాలలో వివాహ వ్యవస్థ ఎంత సంక్షోభాన్ని సృష్టిస్తోందో, చదువుకుని సంపాదిస్తున్న స్త్రీలు కూడా సంప్రదాయాల వలలో ఎట్లా చిక్కుకుపోతున్నారో సరళాదేవి ఈ నవలలో చెప్పారు. చిగురు నవలలో హరి, కొమ్మా బొమ్మాలో ఆనందరావు గోపీ రంగారావు హృదయమున్న పురుషపాత్రలు. రమణమ్మ, కమలమ్మ, రమ ఆలోచన కల స్త్రీలు.
స్త్రీల అంతరంగాన్ని ఎరిగిన సరళాదేవి డెబ్భైల తరువాత వ్రాయడం తగ్గించకపోతే ఎనభైల తరువాత స్త్రీలలో పెరిగిన జెండర్‌ స్పృహతో ఇంకా మంచి కథలు వ్రాసి వుండేవారు. సరళాదేవి నవలికలకు ముందుమాట వ్రాసిన మృణాళిని అన్నట్లు ఆమె ”ఇంకా వ్రాయవలసిన రచయిత్రి”.
రచయిత్రి శీలా సుభద్రాదేవికి అక్క డాక్టరు శ్రీదేవి స్నేహితురాలు అయిన సరళాదేవి 1937లో జన్మించి 2007లో మరణించారు.

Share
This entry was posted in రాగం భూపాలం. Bookmark the permalink.

2 Responses to పి.సరళాదేవి

  1. సత్యవతి గారూ, స్ఫూర్తిదాయకమయిన సమీక్ష. నేను చదివే ఉంటాను కానీ ఇప్పుడు మీ వ్యాసం చదివిన తరవాత లీలగా గుర్తొస్తున్నాయి. నాకు చాలా నచ్చిన కథ, ఎదురు చూసిన ముహూర్తం. స్త్రీలలో చైతన్యాన్ని ఆ రోజుల్లోనే శక్తివంతంగా చిత్రించారని నేను అనుకుంటున్నాను.
    మంచి రచయిత్రిని మరొకసారి గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.

  2. Seela Subhadra Devi says:

    సత్యవతి గారూ
    మా పెద్దక్కయ్య పి.సరళాదేవిని గూర్చి మీరు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.మర్చిపోయిన సాహిత్యరంగానికి ,కొత్త తరం రచయితలకి మీరు రాసిన వ్యాసం ఆమెరచనలనూఆమె దౄక్పధాన్ని తెలియజేస్తుందని అనుకుంటున్నానటు ఆమె కుటుంబపరిధిలో మాత్రమే రాసినందుకే గుర్తింపు రాలేదేమో అనే భావం అమెకు ఉండేదేమో నన్ను కేవలం స్రీసమస్యలకు పరిమితంకాకుండా వస్తుపరిధిని విస్త్రుత పరుచుకోమని అంటూఉండేది.సుమారు 20 సంవత్సరాలకు ముండే పి.సరళాదేవి తనకు తెలియకుండానే ఒకవాదానికి అంకురార్పణగా రచనలు చేసిందనే భావనతోనే అక్కయ్యకు నా కవితలలో స్ర్రీ పరంగా గల కవితల్ని ఎంపిక చేసి “ఆవిష్కారం”సంపుటిని కృతజ్నతాపూర్వకంగా అంకితం చేశాను..వ్యాసం చదివాక మనసులొ మాట రాయాలని అనిపించి రాశాను.మీకు మరో సారి ధన్యవాదాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>