‘మార్చి 8’కి వందేళ్లు మహిళా సాధికారత ఎక్కడ?

పి.వి.శేషారత్నం
(భూమిక నిర్వహించిన కథ/వ్యాస రచన పోటీల్లో మూడవ బహుమతి పొందిన వ్యాసం)
అంతర్జాతీయమహిళా సంవత్సరం ప్రారంభమై 2010 మార్చికి వందేళ్లు… అయితే ఈ వందేళ్లలో స్త్రీలు ఎంత సాధికారత సాధించారు ఎంతటి అభివృద్ధి సాధించారో ఇంకా ఎంత సాధించవలసిఉందో అనేదే అంచనా వెయ్యవలసి ఉంది.
అంతర్జాతీయ మహిళా సంవత్సరం 1975లో మనదేశంలో అడుగుపెట్టాక స్త్రీలు గళం విప్పడంతో వరకట్న నిషేధం, ఆస్తిహక్కు వంటి కొన్ని హక్కులు మహిళలు సాధించుకున్నా ‘అందరికీ ప్రగతి’ దశాబ్దాలు గడచినా సాధ్యం కాలేదు, ఇంకా కొన్ని సామాజిక వర్గాల మహిళలు దయనీయమైన స్థితిలోనే ఉన్నారు. అన్ని వర్గాల స్త్రీలు ఉద్యమాల ద్వారా చర్చలద్వారా సాహితీ వేత్తలు తమ రచనలద్వారా మన స్త్రీలను మనమే చైతన్యవంతం చేస్తూ పురోభివృద్ధి మార్గంలోకి నడిపించవలసిన అవసరం ఉంది.
ఆడపిల్ల పుట్టిందీ అంటే ‘అయ్యో ఆడపిల్లా’ అనే రోజులు పోయాయనుకుని మనం సంబరపడిపోతున్నాం.
‘ముదితల్‌ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించినన్‌’ అని అలనాడు ముక్కు తిమ్మనాచార్యుడు అన్నట్టుగా ఈనాడు అంతరిక్షరంగం వరకు అమ్మాయిలు అవలీలగా దూసుకుపోతూ ఆకాశంలో సగం అనిపించుకుంటున్నారు అని ఆనందపడుతున్నాం.
ఎప్పటికప్పుడు మహిళా సాధికారత వచ్చేసిందీ అని ఉత్సాహంతో పొంగిపోతున్నాం.
అయితే ఈ ప్రగతి అందరు మహిళలకీ సాధ్యమవుతోందా? అలనాటి నుంచీ ఉన్న ఆడపిల్లలపై వివక్ష పూర్తిగా పోయిందా? మన దేశంలోని ఆడపిల్లలంతా సుఖశాంతులతో బ్రతుకుతున్నారా? అనే ప్రశ్నలకు సమాధానం ‘లేదు’ అనే వినవస్తోంది.
”ఎవరూ ఆడపిల్లలుగా పుట్టరు-తయారు చేయబడతారు…
ఎవరూ మగపిల్లలుగానూ పుట్టరు- తయారుచేయ బడతారు…” -అంటే ఇక్కడ సమస్యకు మూలాలు వ్యవస్థలోనే ఉన్నాయి.
అభివృద్ధి సాధించిన విజ్ఞానశాస్త్రం సాయంతో గగనంలోకి దూసుకుపోతున్న అమ్మాయిలొకవైపు లింగనిర్ధారణ పరీక్షలతో ఆడపిల్లని తెలిసి… గర్భస్థ పిండాలను కరిగించేసుకుంటున్న అమ్మానాన్నలు ఇంకొకవైపు… విద్యలో అందరికంటె ముందుకు ఆకాశంలో చుక్కంత ఎత్తుకు… డాక్టర్లుగా కలెక్టర్లుగా పోలీసు అధికారులుగా ఎదిగిపోతున్న అమ్మాయిలొకవైపు… ప్రేమోన్మాదుల అమానుష ఆమ్లదాడులతో అవశేషాలైనా మిగలని చిట్టి చెల్లెళ్లొకవైపు… ఒకవైపు ప్రగతి రథంలో ముందుకెళ్తున్న బాలికలతోబాటు… అక్రమరవాణాకు గురయి కామాంధుల కబంధ హస్తాల్లో నలిగిపోతున్న బాలికలు మరోవైపు…
కారణాలు ఒకటీ రెండూ కావు… నిరక్షరాస్యత, పేదరికం, నిరుద్యోగం, వివక్షలతోబాటు ప్రేమను ద్వేషాన్ని పెంచి పోషిస్తున్న సినిమాలు, సీరియళ్లు సాహిత్యం… అన్నీ… అన్నీ పెడదోవ పట్టిస్తున్నాయి.
ఆడపిల్లలనే వివక్షతో తల్లిదండ్రులే చేస్తున్న అన్యాయంతో గ్రామాల్లో విద్యకు దూరమై, బాల్య వివాహాల బందీలై, నగరాల్లో ర్యాగింగులకు, అత్యాచారాలకు గురవుతూ అటు భౌతికదాడులతో ఇటు మానసిక వ్యాధులతో కృంగిపోతున్నారు మన ముద్దుగుమ్మలు…
గృహిణులయ్యాక రేపటి తరాన్ని ఈ సంఘానికి అందించవలసిన ఈనాటి చిట్టి తల్లులను… మనం ఈనాడు కటిపాపలుగా కాపాడితేనే రేపు ఇంటి దీపాలయ్యే మన ఇంటి మహాలక్ష్ములు వీళ్లు…
అనాదిగా స్త్రీ పురుష ప్రాకృతిక వ్యత్యాసాలు వైవిధ్యాలు వైమనస్యాలు, వైషమ్యాలు ఉండనే ఉన్నాయి.
ఆడవాళ్లు అన్నిరంగాల్లోకీ విస్తరిస్తున్నారు. కీలకపదవులు చేపడుతున్నారు అంతరిక్షంలోకి కూడా అడుగు పెట్టారు అంటూ ఎంతో గర్విస్తాం. అబ్బో అభివృద్ధి పథంలో పయనిస్తున్నారని సంబరపడుతుంటాం.
అయితే వాస్తవంలో మహిళల పరిస్థితి ఏమంత మెరుగ్గా లేదని ఇంకా వెనకబడే ఉన్నారని ఎవరైనా పరకాయప్రవేశం చేసి మన ఇళ్ళల్లోకి తొంగి చూస్తే అర్థమవుతుంది.
అమెరికన్‌ సోషియలాజికల్‌ అసోసియేషన్‌ చైనాలో చేసిన సర్వే ప్రకారం గృహిణులకు ఎంతో ప్రతిభాపాటవాలున్నా భర్తలకు సహకరించడంతోను పిల్లల పెంపకంలోను గడచిపోతోంది అని ఏప్రిల్‌ 2010 సంచికలోని సర్వే వెల్లడించింది. అక్కడ భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులైన కుటుంబాల్లో 8484 మంది వృత్తినిపుణులు కాగా 17648 మంది నాన్‌ ప్రొఫెషనల్‌ పనివారు ఉన్నారట. వీరిలో మగవారు వారినికి 60 గంటలు పనిచేస్తుంటే భార్యలు ఇంటిపనిభారం వల్ల అన్ని గంటలు కేటాయించలేకపోతున్నారట. కెరీర్‌ పరంగా ఎంతో ఎదగాలని ఉన్నా స్త్రీలు తన కెరీర్‌ కంటే భర్తల కెరీర్‌కే ప్రాధాన్యత ఇవ్వాల్సివస్తోందిట. ఒక్కమాటలో పురుషులు కుటుంబభారాన్ని మోయడానికి స్త్రీలు ఇంటిని చక్కదిద్దుకోవడానికి అనే ఆలోచనే ఆచరణాత్మకం అవుతోంది. ఇక భర్త సహకరించని కారణంగా కెరీర్‌ వదిలేసుకుంటున్న ఆడవారూ ఉన్నారు. అలాగని బయట ఉద్యోగమూ చెయ్యక తప్పని స్థితి. అందువల్ల ఇంటిపనిలో ఒత్తిడి వల్ల… భర్త ఇంటిపనిలో సహకరించనందున కెరీర్‌ వదిలేసి ఇంటికే పూర్తిగా అంకితమయిపోతున్నారు.
చైనాలో కంటె మన ఇండియాలో పరిస్థితి మరింత దయనీయం. పురుషుల ఆలోచనల్లో మార్పువచ్చి ఇంటిపనులు పిల్లల పెంపకం విషయంలో కొంచెం సహకరిస్తే స్త్రీ కెరీర్‌ పరంగా ఎదిగే వెసులుబాటు వస్తుంది అని జగమెరిగినసత్యం.కాని అలా సహకరించే పురుషపుంగవుల శాతం మనదేశంలో అతి స్వల్పమని మనకి తెలియనిది కాదు.
కళ, చట్టం, టెక్నాలజీ, చదువు ఏరంగంలోనూ పురుషులకంటే మహిళలు తీసిపోని స్థితి అయినా కుటుంబ పరిమితుల మధ్య బాధ్యతలనే ఊతకర్రలమధ్యే వారు మిగిలిపోతున్నారు. స్త్రీలను ప్రతిభ ఉండీ ఏమీ చెయ్యలేని నిస్సహాయతే ఎక్కువ బాధిస్తుంది. ఇంక అసలు విషయానికి వస్తే… మహిళలకు సాధికారత రావడం అంటే ఏమిటి?
మగవారితో సమానంగా మనమూ మన జన్మహక్కులను అనుభవించడం… వారికున్నట్టే మనకీ అన్ని విషయాలలోను సాధికారత ఉండడం… కాని ఈక్రింది విషయాలలో మన ఇప్పటికీ అంటే వందేళ్లయినా సాధికారత సాధించామా?
ు    గర్భస్థ పిండం పరిరక్షణ
ు    లింగ వివక్షత
ు    పుట్టిన బాలికల రక్షణ (ఆరోగ్యం)
ు    ఎదిగే వయసులో రక్షణ
ు    అక్రమ రవాణానుండి రక్షణ
ు    (ఆత్మహత్యలు చేసుకోకుండా) మానసిక పరమైన రక్షణ
ు    భౌతికదాడుల నుండి రక్షణ
ు    అత్యాచారాల నుండి రక్షణ
ు    ర్యాగింగ్‌నుండి రక్షణ
ు    సాంఘిక దురాచారలనుండి రక్షణ
ు    తనను తాను రక్షించుకోవడంలో శిక్షణ
ు    ఆడపిల్లల చదువు
ు     బాల్యవివాహాల నుండి రక్షణ అంటే యుక్త వయసు రాకుండానే వివాహాలు
ు    జనాభాలో పురుషులతో సమానంగా సగానికి చేరువలో ఉన్నా ఇంకా చట్టరూపం దాల్చని మన మహిళా రిజర్వేషన్‌ బిల్లు…
వీటన్నింటిలో అతివలు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్య… ఆడపిల్లల అక్రమ రవాణా…. ముఖ్యంగా ఇది గ్రామీణ ప్రాంతాలలో జరుగుతోంది.
ప్రధాన కారణం నిరక్షరాస్యత… పేదరికం… ఇంకా జనాభా పెరుగుదల, నిరుద్యోగం… అనుకుంటున్నా ఇలా అక్రమరవాణా ట్రాఫికింగ్‌కు గురి అయిన అన్నెంపున్నెం తెలియని ఆడపిల్లలు ఎన్నో కష్టనష్టాలకు గురవుతున్నారు.
అక్రమరవాణాకు గురవుతున్న బాలికలు – ప్రేమ పేరుతో మోసపోవడం, పెళ్ళి చేసుకుంటానని నమ్మించి తీసుకెళ్లడం, ఉద్యోగం చూపిస్తానని ఎర చూపించడం… జరుగుతోంది. పేదరికం పరిస్థితిలో ఉన్న కుటుంబానికి దళారులు గురిపెడతారు. ఉద్యోగం చూపిస్తానని… కుటుంబంలో వైద్యానికి సంబంధించి ఆపరేషన్‌ జరిగితే డబ్బు సాయం చేస్తామనో చెప్తారు.
తల్లిదండ్రులు సరిగ్గా లేకపోవడం… మారుటితల్లి కావడం… తండ్రి తాగుబోతు అయిన చిన్నాభిన్నమయిన కుటుంబంలోని బాలికలకు ఏదో ఎర చూపించి వేరే చోటికి తీసికెళ్లి మంచి సంబంధాలు చూపించి పెళ్లి చేస్తామని చెప్పి ఎక్కువగా బొంబాయి, ఢిల్లీ, కలకత్తా పూనా, గోవా వంటి ఆపంతాలకు తరలించడం… లేదా గ్రామాలనుండి హైదరాబాదు… అక్కడినుంచి ఇతర రాష్ట్రాలకు ఒక నెట్‌వర్కు ద్వారా తరలిస్తారు. ఆడపిల్లలను నగరాలకు అక్రమ రవాణా చేయడం…. వారిని వెట్టి చాకిరీకి, బలవంతపు వేశ్యావృత్తికి… గృహదాస్యం, మాయ పెళ్లిళ్లు అక్రమ ఉద్యోగాలు అక్రమ దత్తతల వంటి చట్ట విరుద్ధమైన కార్యక్రమాల్లోకి బలవంతాన దించుతారు. తద్వారా ఎన్నో సమస్యలు… చట్టపరమైన అంశాలుంటాయి. చట్టంలోని లొసుగులు కారణంగా సమాజంలో పేరుకుపోయిన అవినీతి కారణంగా నిందితులకు తప్పించుకుపోతున్నారు.
తొలిదశలో గ్రామీణుల్లోని నిరక్షరాస్యత, అమాయకత్వాలను వినియోగించుకుని అక్రమ రవాణాదారులు బాలికలుఇల్లు వదిలేలా చేసేందుకు ఉద్యోగాలిప్పిస్తామనడం, పెళ్లి చేస్తామనడం, చేసుకుంటామనడం చేస్తున్నారు. దానితో దళారీల పెళ్లి ప్రస్తావనకు నగరంలోని ఆధునిక జీవిత ప్రలోభాలకు బాలికలు మోసపోతుంటారు. ఒక్కోసారి స్థానికంగా పెళ్లి తతంగం ముగుస్తుంది కూడా… అయితే అలా గ్రామాలు వదిలిన బాలికలు మళ్లీ గ్రామాల్లోకి అడుగు పెట్టడం లేదు. ఎందుకంటే వారు వెళ్లేది అత్తారిళ్లకి కాదు… వేశ్యాగృహాలకు కనుక… ఒక్కోసారి వయోధికులైన పురుషులు అమాయకపు బాలికలను ఉద్యోగాలప్పిస్తామని మోసం చేస్తుంటారు.
ఇంకోసారి దూరాప్రాంతాల్లోని తమ బంధువులకిచ్చి పెళ్లి చేస్తామని పిల్లను తీసికెళ్లి అక్కడనుంచి వేశ్యాగృహాలకు తరలిస్తున్నారు. మహిళా సాధికారత అంట మనలను, మన ఆడపిల్లలను రక్షించుకోవడంలో మనమే ప్రధాన పాత్ర ధరించడమే…
అంటే… మభ్యపెట్టి మాయచేసి తీసుకెళ్తున్నారు అందుకని ముఖ్యంగా తల్లిదండ్రులు ఎలా అప్రమత్తంగా ఉండాలి అనేది తల్లిదండ్రులకు కౌన్సిలింగ్‌ ఇవ్వాలి. అంటే బాలికలు అక్రమ రవాణా అయితే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారు..తిరిగి వచ్చాక వారి జీవితం ఎలా ఉంటుంది తెలియజెప్పాలి. ఆడపిల్లకి సరైన శిక్షణ ఇప్పించి ఆర్థికంగా ఆదుకోవడం…ఆడపిల్లల చదువు మధ్యలో మాన్పించకుండా కొనసాగించడం చెయ్యడంలో ప్రభుత్వానికి అండగా నిలవాలి.
ప్రభుత్వపరంగా అప్రమత్తంగా ఉండడం కోసమే ప్రతి గ్రామంలోను గ్రామసంఘాల నిఘా పెట్టడం జరుగుతోంది. గ్రామాల్లోకి అపరిచితులు వస్తే నిఘా సంఘాలకి తెలియజేస్తారు. కిశోర బాలికలు…అంటే 11-18 సంవత్సరాల ఆడపిల్లలను చైతన్యవంతం చెయ్యడం…వారితోనే బాలికా సంఘాలు ఏర్పాటుచెయ్యడం చేస్తున్నారు. ఇందులో ముగ్గురు ఛేంజ్‌ ఏజంట్లు ఉంటారు. వారికి శిక్షణ ఇస్తారు. ముఖ్యంగా ఈ వయసు ఆడపిల్లల్లో వచ్చే మార్పుల మీద, అక్రమ రవాణా విషయమై మేల్కొని ఉండాల్సిన అవసరం గురించి జీవిత నైపుణ్యాల గురించి అక్రమ రవాణాను ఎలా తప్పించుకోవాలి శిక్షణ ఇస్తున్నారు. విజిలెంట్‌ గ్రూప్‌లో స్వయంసహాయక సంఘాల మహిళలు, గ్రామంలోని యువ నాయకులు ఉంటూ తమ ఊళ్లోని కిశోర బాలికలకు శిక్షణ ఇచ్చేలా చేస్తోంది ప్రభుత్వం. జిల్లాస్థాయి కమిటీలో కలెక్టర్‌ చైర్మన్‌గా జిల్లా పోలీసు సూపరింటెండెంటు ప్రాజెక్టు డైరెక్టరు శిశు సంక్షేమ శాఖవారు వీళ్లంతా ఎప్పటికప్పుడు విషయ సమీక్ష చేస్తుంటారు.
ఏది ఏమయినా బాలికల అక్రమ రవాణా అనేది ఖండించవలసిన విషయం…ఈ దేశ పౌరులుగా బాధితులైనవారికి పునరావాసం విషయంలోను ప్రభుత్వానికీ మనవంతు సహకారం అందించాలి. మెరుగైన సమాజానికి స్వాగతం పలకాలి. మన దేశ ఆడపడుచులను మనమే కాపాడుకోవాలి…
మరో ముఖ్యమైన సమస్య అమ్మాయిలపై ఆమ్ల దాడులు…
ఒకప్పుడు మనదేశంలో జీవన సౌందర్యం తాలూకు సంస్కృతి పరిఢవిల్లేది.
యత్ర నార్యస్తు పూజ్యంతే అని అమ్మాయిలను గౌరవించే… సమానంగా గుర్తించే వేదసంస్కృతి ఆకాశంలో సగంగా కీర్తించే సంస్కృతి ఉండేది…కాని ఆ సంస్కృతి ధ్వంసమైపోయాక వచ్చిందే ఇప్పటి విధ్వంస సంస్కృతి.
అమ్మాయి వెంటబడని ప్రేమించమని వేధించని దృశ్యం లేకుండా ఏ సినిమా అయినా వస్తోందా. అమ్మాయిల అంగాంగ ప్రదర్శన లేని ఒక్క టీవీ షో అయినా ఉంటోందా? అమ్మాయంటే ఆటవస్తువుగా ఆస్తిగా హక్కుభుక్తంగా భావించని కథనం ఒక్కటైనా ఉందా?
ఈనాటి క్షీణ విలువలలో మానవత్వం మొహం చాటు చేసేసుకోని పౌరసమాజం ఉందా? సంపాదించు… ఖర్చు పెట్టు. అనుభవించు… ఇదేగా ఈనాటి సంస్కృతి…పబ్‌లు, బార్లు…అలంకరించిన వీధులు…రంగుల వలలు విసిరే అంగడి బజారులు ఇదేగా ఈనాటి మన సంస్కృతి…డబ్బుంటే అమ్మాయి ప్రేమించి తీరాలి…లేకపోతే దాడి…
రూట్‌ కాజ్‌ ఆఫ్‌ క్రైం ఈజ్‌ సొసైటీ…నేరాలకు మూలం సమాజం. వికృత సంస్కృతులకు నీరాజనాలు పట్టడంలో మన అల్పత్వం ఉంది. విలువల పతనంలో రేపటి హింసోన్మాదుల తెగింపు ఉంది. కారణం అబ్బాయిల మానసిక రుగ్మతా? పురుషాహంకారమా? చెయ్యని తప్పుకు నెత్తురు చిమ్ముతూ…పచ్చని బతుకులు నెత్తురు చిమ్ముతున్నాయెందుకని? అయేషా…స్వప్నిక…శ్రీలత…శ్వేత…ఈ పరంపర ఆగదా…
అది మనందరి మనసులను మెలిపెడుతున్న వ్యథ…మెదళ్లను తొలుస్తున్న బాధ…అన్నీ అంతుచిక్కని ప్రశ్నలే…
మీకో విషయం తెలుసా? ఇలాంటి దాడులవల్ల సిరిమల్లె పువ్వు లాంటి చంద్రముఖుల ప్రపంచం కూలిపోతోంది. రంగు రంగుల స్వప్నంలాంటి ఆమె జీవితం హఠాత్తుగా మసకబారుతోంది.
సమాజం కలతపడినా ప్రతి తల్లీదండ్రీ కన్నీళ్లు పెట్టినా సమాజం అయ్యో అని ఆక్రోశించినా ఇది కథా? కాదు…
అభంశుభం తెలియని అమ్మాయిల నిత్య వ్యధ…తెల్లని మనసుగల అమాయకపు సిరిమల్లెపువ్వుల కథ…
ఈ కథకు ముగింపు ఇదయినా కావచ్చు…లేదా బొగ్గులా మాడిపోయి పసివాడిపోయి జీవితాంతం కుమిలిపోయే సిరిమల్లె కన్నీటికథయినా కావచ్చు…ఒక్కసారి కళ్లు తెరచి…కాదుకాదు… మనసులను తెరచి…అటు చూడండి…వీధివీధికీ ఓ సిరిమల్లె కనిపిస్తుంది.
ఆ సిరిమల్లె మనసు పాలల్లా తెల్లనిది. మంచులా చల్లనిది…అమాయకమైన ఆ సిరిమల్లె ఏపాపం ఎరుగనిదయినా ఆమ్లదాడికి గురయి ఎలా విలవిలలాడుతోందో చూడండి.
జ                  జ                  జ
”డాక్టరంకుల్‌…నన్ను బ్రతికించండంకుల్‌…నేను బాగా చదువుకోవాలి…డాక్టర్‌ని కావాలి…పల్లెటూళ్లలో వైద్యసాయం లేక ఎవరూ చచ్చిపోకూడదు…అయ్యో ఈ బాధ తట్టుకోలేక పోతున్నాను…నేనేం తప్పుచేసానంకుల్‌…నాకెందుకీ శిక్ష…డాడీ… వాడు వేధిస్తున్నాడని మీకు చెప్పాను కదా…’నీ భవిష్యత్తు పాడవుతుంది… ఓర్చుకోమ్మా అన్నారు…ఓర్చుకున్నా అయినా…నామీద యాసిడ్‌ పోసాడు డాడీ…నన్నెంతో ప్రేమిస్తారే…వాడిని మీరేమీ చెయ్యలేక పోయారెందుకని డాడీ…పోలీసంకుల్‌…ఆరోజు మీరు చూసారుకదా వాడు నన్ను చెంపమీద కొట్టడం…మరి వాడిని ఏమీ చెయ్యలేదేం అంకుల్‌…నానమ్మా…నేను బ్రతుకుతానా…బ్రతకాలి నానమ్మా… డాక్టరంకుల్‌ నన్ను బ్రతికించండి. అయ్యో నా మొహంమీద యాసిడ్‌ పడి కాలిపోయిందని నా మొహం చూసుకుని నేను బాధపడతానని అనుకోకండి అంకుల్‌…నేను బాధపడినా ఫరవాలేదు…నేను మీలా డాక్టర్‌ కావాలి…పల్లెల్లో పేదలకి వైద్యం చెయ్యాలి…అంకుల్‌…నాకేమీ కనిపించడం లేదెందుకని? డాడీ…నాకు భయమేస్తోంది. నన్ను గట్టిగా పట్టుకో డాడీ…పోలీసంకుల్‌ పారిపోతున్నాడు…వాడిని పట్టుకోండి అంకుల్‌…మీకు నాలాంటి అమ్మాయి లేదా? ఉంటే తప్పకుండా వాడిని వదిలిపెట్టేవారు కాదంకుల్‌…నాకోసం ఏడవకు నానమ్మా… నాకు మంచి ర్యాంకు వస్తుంది. నాకు చావాలని లేదు నానమ్మా… నేను…డా…క్ట…ర్‌ని కా…వా…లి…
జ                  జ                  జ
ఊరు, పేరు మారుతున్నాయి తప్ప దారుణాలు రోజురోజుకీ పెరుగుతున్నాయే తప్ప తరగడం లేదు. ప్రాంతం ఏదయినా వ్యక్తులు వేరయినా జరుగుతున్న ఘటనలన్నీ దారుణమైనవే. ప్రేమ పేరిట వేధింపులు…కాదంటే ఆమ్ల దాడులు…లేదా హత్యలు…
భరతమాతగా దేశానికి మాతృమూర్తి గౌరవాన్ని ఇచ్చి పూజిస్తున్న చోటనే మగువలపై వరుసగా ఇలా ఉన్మాదుల అఘాయిత్యాలు మన సభ్య సమాజాన్ని నివ్వెరపాటుకు గురిచేయడం లేదూ…అమ్మాయిలపై ఈ అకృత్యాలకు కారణమేంటి అని ఎన్ని మార్లని విశ్లేషించు కుంటాం…???
అమ్మాయిల ఎదుగుదలకు ఓర్వలేనితనమా? వ్యక్తిత్వ ప్రకటన జీర్ణం కాకనా? ఎంతటి బాధలకు గురిచేసినా లోలోపల కుములుతున్న దిక్కారాన్ని స్వతంత్ర నిర్ణయాన్ని వ్యక్తం చేసే అమ్మాయిలను ఆకళింపు చేసుకోలేకనా?
ఇన్నేళ్ల ఆధిపత్యానికి బీటలు పడుతున్నాయనా? అహం దెబ్బతిని అఘాయిత్యాలా? నన్నే ఇష్టపడాలంటూ ఈ శాసించడం ఎందుకని? తప్పు ఆడవాళ్లదా? మగవాళ్లదా సమాజానిదా? అని ప్రశ్నించడం లేదు. మన కళ్లెదుట…మనకు ఇలా జరుగుతుందని తెలిసీ వీటిని ఎందుకు అదుపు చెయ్యలేకపోతున్నామనేదే ప్రశ్న……
కుటుంబ పరువుకోసం ప్రాకులాటలా? అబ్బాయి ఉన్నత వర్గానికి చెందినవాడనా? ఎవరింటి ఆడపిల్లో ఎలా పోతే మనకెందుకనే ఉదాశీనతా?
ఇక తల్లిదండ్రుల విషయానికొస్తే… ఆడమగపిల్లల పెంపకంలో లోపాలూ కనిపిస్తున్నాయి. లేకపోతే…ఒకే కుటుంబం నీడలో ఒకే అమ్మానాన్న గొడుగుక్రింద మనయింటి కొడుకులు, కూతుళ్లు ఎవరి మూసలో వారు రూపుదిద్దుకోవడమేంటి?
అసలు మన సామాజిక వ్యవస్థలోనే ఒక లోపం ఉంది. ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే మనకెందుకనే సమాజ ధోరణి…దీంతో నడిరోడ్డు మీద ఏం జరుగుతున్నా పట్టించుకోనితనం…ముఖ్యంగా మీడియాలో ఇలాంటి సంఘటనలు పదేపదే చూపించడం…మితిమీరిన స్వేచ్ఛ పేరుతో పిల్లలు పబ్‌లకు ఆకర్షితులై కూడా ఒంటరిగా వెళ్లి ప్రమాదాలు కొనితెచ్చుకోవడం.
ఇటువంటి ఆగడాలు జరిగినపుడు అమ్మాయిలు, వారి తల్లిదండ్రులు, సంబంధిత విద్యాసంస్థలు, కౌన్సిలింగులు నిర్వహించి యువతీయువకులను చైతన్యం చెయ్యనపుడు ప్రయోజనమేమిటి?
గొడవ జరిగితే పిల్ల భవిష్యత్తు ఏమవుతుందోననే భయం. పోలీసులకి చెబితే ప్రయోజనం ఉంటుందనే నమ్మకం సడలిపోయేలా చట్టం ప్రవర్తన…ఇక అమ్మాయి పరంగా చూస్తే: కళాశాలలో యాజమాన్యానికి ఫిర్యాదు చేయడం కేవలం భవిష్యత్తులో భద్రతకోసమే.
ఉన్మాదిపై ఒత్తిడి తేవడం కోసమే…కాని అతడిపై ఒత్తిడే ఉండడంలేదు…కళాశాలకు రావడం తప్పడం లేదు. ఆవేదనను గొంతు దాటకుండా దిగమ్రింగక తప్పడంలేదు. అంతకుమించి అమ్మాయిలు ఆత్మాభిమానంతో బ్రతికే హక్కును గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. యువతరంలో తప్పుడు భావాలకు ప్రలోభాలకు దూరంగా ఉంచగల సామాజిక ఉద్యమం నిర్వహించే ఉద్దేశం శక్తీ మనకి లేదా? విజయోన్మాదంతో స్వార్ధంతో పెరుగుతున్న నవతరానికి విలువల గురించి సాటి మనుషులను సగౌరవంగా పరిగణించాల్సిన అగత్యం బోధించాల్సిన బాధ్యత పౌర సమాజానికి లేదా?
ఫిర్యాదు చేయడానికి వచ్చే ఆడపిల్లల సమస్యలను సానుభూతితో వినడానికి స్పందించడానికి పోలీసు యంత్రాంగంలో చిన్న ప్రయత్నమైనా జరగదా?
యువజన సంఘాలు, మహిళా సంఘాలు మంచి సంస్కృతి కోసం పోరాడే సంస్థలు ఈ సమస్యను స్వీకరించాలి. కేవలం నినాదాలతో సమస్య తీరదు. సమస్య ఉన్నచోటే పరిష్కారమూ లభిస్తుంది. కాస్త మానవత్వంతో ఆలోచించాలి అంతే…ఎందుకంటే ఇది ఇంటింటా ఉన్న యువతీయువకుల సమస్య…ఆడపిల్లల భద్రతకు సంబంధించిన సమస్య…
ఒక హింసాత్మక సంఘటన జరిగేదాకా ఆగకుండా వేధింపుల తొలిదశలోనే జోక్యం చేసుకోవాలి. విద్యాసంస్థల యాజమాన్యాలు, ఉపాధ్యాయుల పౌరసంస్థలు వెనువెంటనే స్పందించాలి.
మగతనపు ఊబిలోంచి కొడుకులను విముక్తి చేయండి… అమ్మాయిలలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించండి. అందు కోసం ఎవరో ఎక్కడ్నుంచో రారు. మన పిల్లలు…కాపాడుకోవలసిన బాధ్యత మనదే మనదే ముమ్మాటికీ మనదే…
అమ్మాయిలెందుకు పదేపదే దాడులకు గురవుతున్నారు?
ప్రేమిస్తున్నామని వెంటబడి వేధిస్తుంటే ధైర్యంగా ఎదుర్కొని స్పష్టంగా మాట్లాడగల స్వేచ్ఛ అమ్మాయిలకు లేకపోవడం…అందరిలో నిన్నే ఎందుకు గొడవపెడతాడు అంటూ ఇంట్లో పెడర్ధాలు తీస్తారని, చదువు మాన్పిస్తారని భయం…అందుకే…ఏం చెయ్యాలి?
నిర్భయంగా అమ్మాయి తన బాధను పంచుకునే వాతావరణం ఇంటాబయటా లభ్యంకావడం…అమ్మాయిల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేలా నిపుణులతో శిక్షణాశిబిరాలు తరచూ నిర్వహించడం…ఆత్మరక్షణ కోసం మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకునే అవకాశాలు కల్పించడం…అమ్మాయిల ఫిర్యాదులకు తక్షణమే స్పందించి ఆకతాయిలపై నిఘావేసే రక్షణవ్యవస్థ ఉండడం…
వ్యక్తిగతవిషయం అని కళాశాల యాజమాన్యాలు వదిలేయక అమ్మాయిల రక్షణకి యాజమాన్యం, ఉపాధ్యాయ బృందం రక్షణగా నిలవడం…ఇక అబ్బాయిల ప్రవర్తన విపరీతంగా ఉంటే ఆలసించక మానసిక నిపుణులను సంప్రదించడం… మనిషి స్వార్ధం, దుర్మార్గం, బాధ్యతారాహిత్యం కారణంగా పొగల సెగలు కక్కుతూ అమ్మాయిలపై ఎడతెగకుండా కురుస్తున్న ఆమ్ల వర్షాలతో…కత్తుల దాడులతో శరీరం బొబ్బలెక్కి…చర్మం ఊడిపోయి…మాంసం ఉడికిపోయిన అమ్మాయిల శరీరాలలో ఎవరికీ తమ అమ్మాయిలు కనిపించడం లేదా? అని సాధికారతతో ప్రశ్నించండి. కాసులు రాలని కేసుల ఆర్తనాదాలు వినిపించకుండా చట్టం చెవులు మూసుకోకుండా సాధికారతతో ఉద్యమించండి. అప్పుడు ఎందుకిలా? అనే శేషప్రశ్నకు తావే ఉండదు.
స్త్రీ సకలచరాచర సృష్టికి మూలం…కదిలే జనప్రవాహానికి సాక్షీభూతం… తన హక్కులకోసం గొంతెత్తిన స్త్రీ ఇప్పుడు ప్రవాహపు ఉరవడి…కొత్త చరిత్రకు ఆమె వేస్తున్న ప్రతి అడుగూ ఇకపై ఒక ఒరవడి. స్త్రీ తన ఆత్మగౌరవాన్ని కాపాడుకునే దశలోకి ఎప్పుడో అడుగుపెట్టింది.
జీవితం ఒక ఆట అనుకోవడంకంటే ‘ఆటే జీవితం’ అనుకుంటే సవాళ్లను అధిగమించగలమన్న ఆత్మవిశ్వాసం దానంతట అదే వస్తుంది. స్వేచ్ఛగా మాటల్ని ఎగరేయగల హక్కు మన చేతుల్లోనే ఉంది. వేలాది పడగనీడలు మనపైవాలి భూతద్దాలు ఎక్కుపెట్టినాసరే మనల్ని మనంగానే ఆవిష్కరించుకుందాం… స్వేచ్ఛగా మన జీవితాలను మనమే అలంకరించుకుందాం.
సాంఘిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో సమానస్థానం మన మహిళలకు దక్కాల్సిందే.
జనాభాలో సగానికి దగ్గరగా ఉన్న మనకి…పాలించే హక్కుకోసం ఎన్నో ఏళ్లుగా జరుగుతున్న పోరాటం ఎందుకు విజయం సాధించడం లేదు? ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు…చట్టసభలో ప్రవేశపెట్టినపుడల్లా మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఎందుకు అందరి ఆమోదం పొంది చట్టరూపం దాల్చడం లేదు? ఇటీవలే పురిటి గండాలు దాటి రాజ్యసభలో ఎట్టకేలకు ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్‌ బిల్లు లోక్‌సభలో విజయం సాధిస్తుందా? కాలమనే వెండి తెరపై వేచి చూడడం కాదు మనం చెయ్యాల్సింది.
ఈ సంవత్సరపు అంతర్జాతీయ మహిళా సంవత్సరపు నినాదం ”సమాన హక్కులు, సమానావకాశాలు…అందరికీ ప్రగతి”
అందరి ప్రగతిని కాంక్షించే మనమే ఆ నినాదంతో ముందుకెళ్దాం. సృష్టిలో సగాలయినపుడు అవకాశాల్లో కూడా సగాలమవుదాం. కాలుష్యపుకోరల్లో చిక్కుకున్న ప్రపంచంపై ఆధారపడడం కాదు ఆధారమవుదాం. కాలుష్యానికి చికిత్స చేద్దాం.
అందుకే…ఎప్పుడో ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురు చూడకుండా మన మహిళా సాధికారతను పోరాటంతో మనమే సాధించుకుందాం. అప్పుడు మన ముందుతరం ఆడపిల్లలనైనా అన్యాయాలకు ఆహుతి కాకుండా మన మహిళలమే చట్టపరంగా కాపాడుకోగలుగుతాం. ఏవంటారు?

Share
This entry was posted in ప్రత్యేక వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో