జనగణనలో వాస్తవాలు చెప్పకపోతే ఏం జరుగుతుంది???

కొండవీటి సత్యవతి
ఫిబ్రవరి 9 నుండి 29 వరకు ఆంధ్రప్రదేశ్‌లో జనాభాగణన కార్యక్రమం పెద్ద ఎత్తున మొదలవ్వబోతోంది. ఈ ఇరవై రోజులపాటు ఇంటింటికీ తిరిగి, ఇంటిల్లిపాది వివరాలను సేకరించడానికి దాదాపు లక్షమంది ఎన్యూమరేటర్లు సిద్దమవుతున్నారు. తమకు అప్పగించిన బాధ్యతను జాతీయ ప్రాముఖ్యంగల బాధ్యతగా భావించిన  ఎన్యూమరేటర్లు ఇంటింటికీ తిరగి భవిష్యత్‌ ప్రణాళికల రూపకల్పనకు అవసరమయ్యే అత్యంత కీలకమైన సమాచారాన్ని సేకరించడానికి నడుం బిగిస్తున్నారు. భారతీయ సమాజం భిన్న జాతుల సమ్మేళనం. భిన్న వర్గాల కలయిక. జనాభాలో సగభాగం మహిళలేవున్నారు. అలాగే శారీరక, మానసిక వైకల్యం వున్నవారు వుంటారు. స్త్రీలు, పురుషులు కాకుండా ఇతరులు కూడా వుంటారు. సమాజం భిన్న వ్యక్తుల, సంస్కృతుల కలయికగా వుంటుంది. ఈ సమాచారం అంతా కూడా జనభాగణనలోకి తప్పనిసరిగా రావాల్సి వుంటుంది.
భారతదేశానికి సంబంధించి 1872లో తొలిసారి జనభాగణన జరిగింది. దేశంలోని వివిధ ప్రాంతాలలో, వివిధ సమయాలలో గణన జరిగింది. 1881లో దేశం మొత్తం మీద ఏకకాలంలో జనాభాగణన జరిగింది. అప్పటినుండి ప్రతి పది సంవత్సరాలకొకసారి నిరాటంకంగా జనగణన జరుగుతోంది. ఇప్పుడు (2011లో) జరుగుతున్న జనాభాగణన దేశంలో 15వ జనాభా గణనగాను, స్వాతంత్య్రానంతరం 7వదిగాను చెప్పుకోవాలి.
జనాభా గణన నిర్వహణ ముఖ్యోద్ధేశ్యం ఏమిటంటే భారతదేశం శ్రేయోరాజ్యం, స్వాతంత్య్రం వచ్చినప్పటినుండి సామాన్య ప్రజల ఉపయోగార్ధం పంచవర్ష ప్రణాళికలు, వార్షిక ప్రణాళికలు మాత్రమే కాక ఇతరేతర సంక్షేమ పధకాలు తయారు చేయడానికి కావలసిన క్రింది స్థాయి సమాచారమంతా జనాభా గణన ద్వారానే సేకరించి యివ్వడం జరుగుతుంది.
2011 సం||లలో తలపెట్టిన భారతదేశ జనాభా గణన రెండు దశలలో జరుగుతుంది. ఒకటి ఇళ్ళ జాబితా, ఇళ్ళ గణన,రెండు జనాభా గణన. మొదటి దశ ఏప్రిల్‌ నుండి సెప్టెంబర్‌ నెల వరకు, 2010 మధ్య కాలంలో వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో జరిగింది. ఈ దశలో భవనాల, గణన గృహాలు మరియు కుటుంబాలను గుర్తించి వాటిని ఇళ్ళ జాబితా, ఇళ్ళ గణన షెడ్యూల్‌లో ఒక క్రమ పద్ధతిలో నమోదు చేయడం జరిగింది. ఇళ్ళ జాబితానే కాకుండా మానవ స్థిర నివాసాల స్థితి, ఇళ్ళ కొరత మొదలగు వాటిని అంచనా వేయడం, కుటుంబాలకు లభించే వసతుల సమాచారం కూడా సేకరించబడినది.
ఫిబ్రవరి 9 నుండి 29 వరకు జరగబోయే రెండవ దశ జనాభా గణన చాలా ముఖ్య మైనది. ఒక నిర్ణీత సమయంలో ప్రతి ఒక్క వ్యక్తిని గణన చేసి ఆమె, అతని వ్యక్తిగత వివరాలను సేకరించడమే జనాభా గణన రెండో దశ ముఖ్య ఉద్ధేశం.
రెండవ దశలో మన అందరి వివరాలు సేకరించడానికి ఎండనక, వాననక ఎక్కిన మెట్లు ఎక్కుతూ, దిగిన మెట్లు దిగుతూ, ఎంతో శ్రమకోర్చి ఎన్యుమరేటర్లు మన ఇంటి తలుపు తడతారు. 29 ప్రశ్నలలో మనకు సంబంధించిన సమాచారం వివరంగా, సక్రమంగా, నింపడానికి మనమందరం తప్పనిసరిగ సహకరించాల్సిన అవసరం వుంది. మనం ఏ విషయం చెప్పకుండా దాచినా నష్టం మనకే జరుగుతుంది. ముఖ్యంగా మహిళలు తమకు సంబంధించిన వివరాలను సరిగా చెప్పరు. ఉదా: ఎవరైనా మహిళను నీవు ఏం పని చేస్తావు అని అడిగితే, నేను ఏమీ పనిచేయను, ఇంట్లోనే ఉంటాను అని చెప్తుంది. అలాగే నీకు ఎంత మంది పిల్లలు అని అడిగినపుడు బతికి ఉన్న పిల్లల వివరాలను మాత్రమే చెపుతారు, జరిగిన అబార్షన్స్‌ గురించిగాని గర్భంలోనే చనిపోయిన పిల్లల గురించిగాని, అంగవైకల్యంతో, మానసిక వైకల్యంతో పుట్టిన పిల్లల వివరాలను దాచిపెడతారు. అలాగే తమ వివాహం జరిగిన సంవత్సరాన్ని చెప్పమని అడిగినపుడు, వచ్చిన అధికారులు తమను శిక్షిస్తారనే భయంతో బాల్యవివాహం జరిగినాగాని, ఆ విషయాన్ని వెల్లడించకుండా పెళ్ళినాటికి తమకు 20 సంవత్సరాలు దాటినాయని చెబుతారు, ఆమెకు బాల్యవివాహం జరిగినట్లుగా మన కంటికి కనిపిస్తున్నప్పటికీ, మనం ఆమె చెప్పినవే నమోదు చేసుకోవలసి వస్తుంది. అలాగే మహిళలు ఈ రోజుల్లో చాలా ప్రాంతాలలో తామే కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉంటూ, కుటంబాన్ని నిర్వహిస్తున్నప్పటికీ, ఆ విషయం చెప్పకుండా, ఇంటికి పెద్ద కొడుకు పేరును ప్రస్తావిస్తారు.
పైన ప్రస్తావించిన అంశాలను వివరంగా గమనించినపుడు జనగణన సమయంలో సరి అయిన సమాచారం ఇవ్వకపోతే జరిగే నష్టం ఇప్పుడు చూద్దాం. నిజానికి మన సమాజంలో ఉదయం లేచిన దగ్గర నుండి,రాత్రి పడుకోబోయే వరకు మహిళలు ఎన్నో రకాల పనులను చేస్తూ ఉంటారు. ఇంటి పనితో పాటు, వంటపని, పిల్లల పనిని పనిగా గుర్తించక పోయినప్పటికీ వారు కుటంబ పోషణార్ధం, డబ్బు సంపాదన కోసం రకరకాల పనులు చేస్తూ ఉంటారు. బీడీలు చుట్టడం, విస్తళ్ళు కుట్టడం, పిడకలు చేసి అమ్ముకోవడం, బుట్టలు అల్లడం, పాడి పశువులను పెంచి పాలు అమ్మడం, పళ్ళు కూరగాయలు అమ్మడం, పూలు అమ్మడం, ఇలా రకరకాల పనులు చేసి సంపాదించి కుటుంబం కోసం ఖర్చు పెడుతూ ఉంటారు. అయితే జనగణన ఎమ్యూనరేటర్లు అడిగినపుడు  తాము ఏమీ పని చేయడం లేదని  చెెబుతూ ఉంటారు. అలాగే వ్యవసాయ పనులతో కూడా పూర్తి కాలం పనులు, పాక్షిక పనులు ఉంటాయి. వీటిని కూడా మహిళలు చెప్పరు. నిజానికి ఇంటి దగ్గర ఉండి చేసే అన్ని పనులను నమోదు చేసుకునే వీలు ఉంది. ఈ విధంగా స్త్రీలు చేసే వంటపని, ఇంటి పనే కాకుండా కుటుంబం కోసం  చేసే  అనేక అనేక పనులను జనగణనలో నమోదు చేయక పోవడం వలన స్త్రీల ఉత్పాదక శక్తి నమోదు కాకుండా పోవడమేకాక, స్త్రీలు ఏమి పనిచేయని వారుగా ముద్ర వేయబడుతున్నారు. 2001లో జరిగిన జనగణనలో ఆంధ్రప్రదేశ్‌లో పని స్త్రీ, పురుషుల పని నిష్పత్తి 35.1%, 56.2% ఉంది, ఇది నిజం కాదని మనకు అర్ధమవుతూనే వుటుంది. కాని మహిళలు తాము చేసే పనిని గురించి వివరంగా చెప్పకపోతే ఇలాగే నమోదు అవుతుంది మరి. అలాగే తమకు పుట్టిన పిల్లల గురించిన వివరాలను కూడా సరిగ ఇవ్వకపోతే చాలా నష్టం జరుగుతుంది. ఉదా: జరిగిన గర్భస్రావాలను గురించి, పుట్టిన వెంటనే చనిపోయిన బిడ్డ గురించి సరి అయిన సమాచారం ఇచ్చినట్లయితే ఆయా ప్రాంతాలలో కల్పించవలసిన వైద్య సదుపాయాలగురించి సరి అయిన ప్రణాళికలను రచించడానికి వీలు అవుతుంది. అంటే ఆయా ప్రాంతాలలో గర్భిణి స్త్రీలకు వైద్య సదుపాయాలు అందుతున్నాయా లేదా, సరి అయిన ప్రయాణ సౌకర్యాలు అందుతున్నాయా, రహదారులు సక్రమంగా ఉన్నాయా లేదా వీటన్నింటిని పరిశీలించి ప్రణాళికలో పొందు పరచడానికి వీల వుతుంది. చాలామంది మేము ఒక్కరమే చెప్పకపోతే ఏమవుతుందిలే అని ఆలోచిస్తే, అందరం అలాగే అనుకుంటే రాజు గారి పాలకుండ చందాన అవుతుంది. అందుకని జనగణన ఎన్యుమరేటర్లు మన వద్దకు వచ్చినపుడు తప్పన సరిగ పైన పేర్కొన్న వివరాలను అందిద్దాం. అలా చేయకపోతే జరిగే నష్టం కూడా మనకు అర్ధం అయి ఉంటుంది.
ఇక జండర్‌ విషయానికి వచ్చినపుడు ఇంతకు ముందు వరకు స్త్రీలు, పురుషులు అనే కాలమ్‌ మాత్రమే ఉండేది. ఈ సారి ”ఇతరులు” అనే కాలమ్‌ను కూడా చేర్చడం జరిగింది. అంటే స్త్రీలు, పురుషులుగా మాత్రమే పుట్టకుండా ఏ లింగానికి చెందకుండా పుట్టిన వ్యక్తులు మన సమాజంలో చాలామందే వున్నారు. ఇంతవరకు వీరికి సంబంధించిన వివరాలు ఎక్కడ నమోదు కాలేదు. ఈ సారి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని భిడియపడకుండా తమ వాస్తవ వివరాలను నమోదు చేసుకుంటే మంచిది.
వైవాహిక స్థితికి సంబంధించి కూడా ఇంతకు ముందు వివాహితులు, అవివాహితులు, వైధవ్యం పొందినవారు,విడాకులు తీసుకున్న వారు అనే కాలమ్స్‌ మాత్రమే ఉండేవి. మారిన సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ‘విడిపోయినవారు’ అనే అంశాన్ని కూడా చేర్చడం జరిగింది. వివాహం చేసుకోకుండా కలిసి జీవిస్తున్నవారు (లివింగ్‌ టు గెదర్‌) అనే కాలమ్‌ కూడా చేర్చి వుంటే బావుండేది.
పైన పేర్కొన్న అంశాలు ఒక ఎత్తు అయితే వికలాంగులకు సంబంధించిన సమాచారాన్ని సరిగ్గా రాబట్టలేకపోవడం పెద్ద విషాదం. అందువల్లనే 2001 జనాభా లెక్కల ప్రకారం భారతేదశంలో వికలాంగులు కేవలం 2.1%గా వుంది. ఇది చాలా దేశాల కన్నా తక్కువ. ఉదా. పాకిస్థాన్‌లో 2.3% బంగ్లాదేశ్‌లో 5.6% శ్రీలంకలో 7%, ఆస్ట్రేలియాలో 20% అమెరికాలో 19.3%, బ్రిటన్‌లో 18% జనాభా వికలాంగులుగా ఉన్నారని వారి గణాంకాలు తెలుపుతున్నాయి. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలలో సగటున 6% జనాభా వికలాంగులుగా ఉంటే ప్రపంచ జనాభాలో 2వ స్థానంలో ఉన్న భారతదేశంలో కేవలం 2.1% మాత్రమే వికలాంగులు ఉండటం వెనుక అసలు కారణం జనగణన సమయంలో సరి అయిన సమాచారం ఇవ్వకపోవటమే. భారతదేశం చెబుతున్న 2.1% గురించి ఐక్యరాజ్యసమితి అభ్యంతరం తెలిపి కనీసం 10% మంది అయినా వికలాంగులు ఉంటారని అంచనా వేసింది.
ఈ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని 2011 జనగణన విభాగం వికలాంగులకు సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకుంది. అందులో భాగంగా వికలాంగులను 8 కేటగిరీలుగా విభజించింది. అవి. చూపులో, వినుటలో, మాటలో, కదలికలో, మానసిక మాంధ్యం, మానసిక వ్యాధి, ఏదైన ఇతరములు బహువైకల్యం.
అంగవైకల్యానికి సంబంధించిన ప్రశ్నలు చాలా సున్నితమైనవి.  కావున ఎన్యుమరేటర్లు జాగ్రత్తగా , నైపుణ్యంతో అడగటం చాలా అవసరం. అడుగుతున్న క్రమంలో అంగవైకల్యానికి సంబంధించిన సమాచారాన్ని నమోదు చేయడం ఎందుకు అవసరమో చెబుతూ, అంగవైకల్యంగల వ్యక్తులకు, వారి కుటుంబాల కోసం ప్రభుత్వం రూపొందించే వివిధ పధకాలకు కావలసిన ప్రణాళికలను రూపొందించడం, వాటికి కావలసిన వనరులు కేటాయించడం, తత్సంబంధిత సేవలు సమకూర్చడం అంగవైకల్యంగల వ్యక్తులకు విద్య , ఉపాధి అవకాశాలను అందరితో పాటు సమానంగా కల్పించడానికి తగిన ఏర్పాట్లు చేయడం కోసం అంగ వైకల్యంగల వ్యక్తులకు ప్రభుత్వ రవాణా మరియు ఆరోగ్య సేవలు సమకూర్చడానికి ఈ సమాచారం ఉపయోగపడుతుందని వివరించాలి.
కాబట్టి జనగణన ఎమ్యానరేటర్లు ఫిబ్రవరి 9 నుండి 29 తేదీల మధ్య  మీ ఇంటికి వచ్చినపుడు మీ వ్యక్తిగత వివరాలన్నింటిని సూక్ష్మాతి సూక్ష్మమైన అంశాలన్నింటిని వివరంగా చెప్పడం మీ బాధ్యత. వివరాలను దాచుకుంటే జరిగే నష్టం మనకే, సరి అయిన వివరాలను చెప్పినపుడు మాత్రమే ప్రభుత్వ పధకాలలో  అవసరమైన అందరికీ  మొత్తం భారతదేశ భవిష్యత్తు  ప్రణాళికా పధక రచన జరుగుతుంది. ఎవరెవరికి ఏఏ అదనపు సౌకర్యాల అవసరం వుందో, ఆ విషయం ధృవీకరించబడేది జనగణన లెక్కల ద్వారానే అనే విషయాన్ని మనమందరం మనసులో ఉంచుకుంటూ 29 కాలమ్స్‌తో, చేటలాంటి పేపర్‌తో ఎన్యుమరేటర్‌ మీ ముందు నిలబడినపుడు విసుగు చెందకుండా, ఆత్రుత పెట్టకుండా ఒక గ్లాసు మంచినీళ్ళో, మజ్జిగో ఇచ్చి మన ఇంటికి వచ్చిన వారికి సమాచారం అందించడం మన బాధ్యత.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>