అద్దె తల్లి కథలు

ఆచార్య మూలె విజయలక్ష్మి
వైద్యశాస్త్ర పరిజ్ఞానం నూతనకోణాలను ఆవిష్కరిస్తోంది. మహమ్మారిలాంటి జబ్బులను మటు మాయంచేసే మందులు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. జీవనప్రమాణం పెరిగింది. ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. వైద్య పరిజ్ఞానాన్ని దుర్వినియోగపరుస్తూ సామాజిక పరిస్థితులు ఆడపిల్ల పుట్టుకను శాసిస్తున్నాయి. రక్తం, కిడ్నీలు, కళ్ళు వ్యాపారవస్తువులయ్యాయి. ఇప్పుడు పిండం నవమాసాలు తలదాచుకొనే గర్భసంచికూడా. సంతానంలేని దంపతులకు వరప్రసాదిని అయిన ఈ పద్ధతి మహిళలకు శాపంగా మారుతోంది. భార్యఅంటే తనసొత్తు, తన ఇష్టారాజ్యం అనే పురుషాహంకారంతో మాటిమాటికి భార్య గర్భసంచిని అద్దెకివ్వడానికి పూనుకుంటున్నాడు. తొమ్మిదినెలల  గర్భసంచికి అద్దెరెండుమూడు లక్షలు, వైద్య ఖర్చులు, తల్లి పోషణ. విదేశీజంటలు అద్దెతక్కువని భారతదేశం వైపు మొగ్గు చూపుతున్నారంటే ఇక్కడి దౌర్భాగ్యస్థితిని అంచనాకట్టవచ్చు.
సంతానహీనులయిన దంపతులు సంతానం పొందడంకోసం అద్దె తల్లినాశ్రయిస్తున్నారు. స్త్రీ అండాశయంలో అండంవిడుదలయినా గర్భందాల్చలేని, గర్భందాల్చినా నిలవని పరిస్థితులున్నపుడు దంపతులనుండి అండం వీర్యకణాలనుసేకరించి ఫలదీకరణం చెందించి అద్దె తల్లి గర్భంలో ప్రవేశ పెడతారు. నవమాసాలు పిండం ఆమె కడుపులో పోషించబడుతుంది, సంరక్షించబడుతుంది. ప్రసవించినతర్వాత పేగుతెంచుకుని పుట్టినబిడ్డను అద్దె ఇచ్చిన వారికి అప్పగించాలి. ప్రసవించేంతవరకు యజమానుల అధీనంలో, డాక్టర్ల పర్యవేక్షణలో ఉండాలి. అండోత్పత్తి సరిగాలేనప్పుడు ఇతరులలేదా అద్దెతల్లి అండాన్ని పరస్పర అంగీకారంతో వినియోగించే పద్ధతి ఉంది.
రెండవపద్ధతి అద్దెతల్లి గర్భాశయంలోకి వీర్యకణాలు ఇంజెక్ట్‌ చేయడం.
మూడవది పిండమార్పిడి. తల్లిగర్భసంచి నుండి పిండం వేరు చేసి అద్దెతల్లి గర్భంలో ఉంచడం. ఈ ప్రక్రియ అండంఫలదీకరణం చెందిన నాలుగు నుంచి ఆరువారాలలోపు జరగాలి. అంటే గర్భాశయంగోడలకు అతుక్కొనకమునుపే మార్పిడి చేయాలి.
అద్దెతల్లి అండాన్నిగాని, ఇతర పురుషుల వీర్యకణాలను గాని ఈ ప్రక్రియలో వినియోగించినప్పుడు క్రోమోజోమ్స్‌ ద్వారా బిడ్డ వారి లక్షణాలను పుణికిపుచ్చుకొనే అవకాశంవుంది. గర్భసంచి అద్దెకిస్తున్న మహిళకు 40 సంవత్సరాలలోపు వయస్సు, శారీరక ఆరోగ్యం ఉండాలి. వివాహిత అయితే భర్త అనుమతి అవసరం. శీలం, రంకు తనం వంటి పదాలకు చోటులేనందువల్ల వితంతువులు, యువతులు ముందుకొస్తున్నారు. ఇటీవల ఒక విదేశీ జంట ఇద్దరూ పురుషులే అద్దెతల్లి (రీరిజీవీబిశిలి ళీళిశినీలిజీ) ద్వారా ఆడశిశువును పొందిన విచిత్ర సంఘటన దూరదర్శన్‌లో ప్రసారం చేయడం విదితమే.
సంతానం కల్గించడమే లక్ష్యంగా సంతానం పొందేమార్గాలను అన్వేషిస్తూ సూచిస్తూ వైద్యులు ముందడుగు వేస్తున్నారు. అద్దెతల్లి ఎదుర్కొనే మానసిక, శారీరక, సామాజిక సమస్యలుగాని, పురుషుని నియంత్రణగాని, అన్నెంపున్నెం ఎరుగని పసికందుపాట్లనుగాని పట్టించుకొనే నాధుడులేడు. తెలుగు కథారచయితలు అద్దెతల్లి సమస్యలపట్ల స్పందించారు. ఈ కోణంసృశించిన కథలు మూడు. అవి కోమలాదేవి – అనిర్వచనీయ బాంధవ్యం (1967) శాంతి నారాయణ-అద్దెతల్లి (2004) శీలాసుభద్రాదేవి -గోవుమాలచ్చిమి (2008).
అద్దెకుగర్భాన్ని ధరించిన పేదరాలి మాతృప్రేమ, ధనవంతురాలి మనసులో మానవత్వం పరిమళించడం అనిర్వచనీయబాంధవ్యం ఇతివృత్తం.
పద్మగర్భవతి. ఆమెలో ఇక పిండం వృద్ధిచెందలేదు. శస్త్రచికిత్సతో ఆ పిండం తీసి మరొక గర్భంలో పదిలపరచాలి. భర్త అవిటితనం, ముగ్గురు పిల్లల పోషణ పద్మ దైన్యస్థితి సావిత్రిని సమ్మతింప చేసాయి. ఆపరేషన్‌ విజయవంతమైంది. సావిత్రి ఇంటిపని చేసినా, సావిత్రి కోసం తెచ్చిన తిండి పిల్లలు తిన్నా, పిల్లాడు అనారోగ్యంగా ఉంటేచూసుకొన్నా పద్మ సహించేదికాదు. సావిత్రిది మాతృహృదయం. సావిత్రి కడుపులో పెరుగుతున్న తన బిడ్డపట్ల ఆరాటం పద్మది. డాక్టరుకూడా సావిత్రిని స్వేచ్ఛగా వుండనివ్వమని హెచ్చరించింది. ఆటుపోట్లతో కాలంగడిచింది. పండంటి బిడ్డను కన్నది. పుట్టినవెంటనే పద్మతీసుకువెళ్ళింది. సావిత్రి బిడ్డనుచూడాలని స్పర్శించాలని తహతహలాడింది. డాక్టర్లనుప్రాధేయపడింది. డాక్టర్ల బలవంతంపై సావిత్రి దగ్గర బాబును వదిలింది. ఇరవై ఒక్క రోజుల ఆ ఎడబాటు పద్మకు తల్లి హృదయమేమిటో తెలిసివచ్చేలా చేసింది. ”ఈదినాలలోనాకు… భోజనం సహించలేదు… ఎక్కడికి వెళ్ళాలనిపించలేదు నాహృదయాన్ని బాబు మూర్తి ఆవరించింది. వాడుకళ్ళలో మెదిలేవాడు. నాప్రతి అణువు బిడ్డకోసం తహతహలాడిపోయేది… ఆలోచించాను. ఈ ఎడబాటు సావిత్రిగారికి ఎంత సహించరానిదో ఊహించగలిగాను”. తల్లిప్రేమ అనుభవంలోకి వచ్చింది కాబట్టే బాబును స్వీకరిస్తూ ”మీరు బాబుకు… పెద్దతల్లి… పెదతండ్రి” మీరుబాబును చూడాలనుకొంటే ఎప్పుడైనా తమ ఇంటి తలుపులు తెరిచే ఉంటాయని ఆహ్వానించింది.
మాతృ ప్రేమకు నిర్వచనం చెప్పిన కథ ”అద్దెతల్లి”.
భర్త మరణంతో అత్తమామలు, ఇద్దరుపిల్లల బాధ్యత సుజాతమీదపడింది. అయిదారు ఇళ్ళల్లో పాచిపని చేసి పూట గడుపుకొచ్చేది. ఇంతలో గోరుచుట్టు మీద రోకలిపోటులా కొడుక్కి బ్రెయిన్‌ ట్యూమర్‌. ఆపరేషన్‌ చేయించాలంటే యాభైవేలు అవసరం. ఆ అవసరం సుజాతను అద్దెతల్లిగా ఉండటానికి అంగీకరించాయి. తను పనిచేస్తున్న యింటిలో విఠల్‌రావ్‌ దంపతులకు సంతానంలేదు. అండం విడుదలకాలంలో విఠల్‌రావు శారీరక సంబంధంతో గర్భం దాల్చింది. తొమ్మిదినెలల అనంతరం తాను అద్దెతల్లి కాబట్టి బిడ్డను అప్పగించాలి. కన్నపేగు అనుబంధాలను కాలరాయాలి అనే నిర్ణయంతోనే కాలంగడిపింది. బిడ్డ అంగవైకల్యంతో పుట్టడంతో విఠల్‌రావు దంపతులు బిడ్డను స్వీకరించలేదు. పైగా మంచిబిడ్డను కనిమ్మని, లేకుంటే డబ్బులు వాపసు ఇమ్మనిపట్టుబట్టారు. మహిళామండలిని ఆశ్రయించి, మండలి ఆసరాతో విఠల్‌రావు దంపతులను రచ్చకీడ్చింది. కోర్టుకెక్కింది.
”… సుజాత కనిన బిడ్డను కోర్టు సమక్షంలో విఠల్‌రావు స్వీకరించాలి. డబ్బును ఆశగా చూపి ఆమె మాతృత్వాన్ని వాడుకొని రభస చేయడం వల్ల ఆమె సమాజంలో పరువుకోల్పోయింది. అందుకు పరిహారంగా విఠల్‌రావు ఆమెకు రెండు లక్షల రూపాయలు కోర్టు సమక్షంలో చెల్లించాలి” కోర్టుతీర్పుతో విఠల్‌రావు బిడ్డను తీసుకున్నాడు. కొత్తస్పర్శతో బిడ్డ ఏడుపులంకించుకున్నాడు. అమ్మ హృదయం బద్దలయింది. బిడ్డను లాక్కొంది. పరిహారంగా ఇచ్చిన డబ్బు అత్తమామల పోషణార్థం వృద్ధాశ్రమంవారికిచ్చి ముగ్గురు బిడ్డలతో తెరచాటుకు వెళ్ళింది.
అద్దెతల్లిగా మారిన పేదమహిళ మనోవేదనను చిత్రించిన కథ ‘గోవుమాలచ్చిమి’.
చావుతప్పి కన్నులొట్టపోయినట్లు గల్ఫ్‌దేశాల నుంచి ఉత్తచేతులతో తిరిగి వచ్చాడు నారాయణ. భార్య ఇద్దరు పిల్లల పోషణభారమైంది. ”విదేశాల్లో బిడ్డలు లేనోళ్ళు గుజరాత్‌లోని ఓ ఊళ్ళో హాస్పిటల్‌కి వస్తున్నారంట. ఆ ఆస్పటల్‌లో కనటానికి ఇష్టమున్న ఆడోళ్ళ కడుపులోకి ఇంజక్షన్లతో పిండాన్ని పంపి గర్భం వచ్చేలా చేస్తారట. తొమ్మిది నెలలూ మోసినందుకు, పిల్లల్ని కన్నందుకు మస్తు డబ్బు ఇస్తారట! అన్న స్నేహితుని సలహాతో తన భార్యను సంసిద్ధం చేశాడు. అయిష్టంగానే పిల్లలభవిష్యత్తు కోసం వెంకటలక్ష్మి సమ్మతించింది. చకచక పరీక్షలు గట్రా పూర్తయ్యాయి గర్భనిర్ధారణయింది. తిండి వంట బట్టి నిగ్గుతేలింది. పిల్లలపై గాలి వదల్లేదు. నారాయణ కార్ఖ్ఖానాలో పనిసంపాదించాడు. పిల్లలను కూడా అక్కడికే మార్చాడు. ప్రసవానంతరం తల్లీ బిడ్డ ఆరోగ్యంగా ఉండటంతో పదిరోజుల్లోపే బిడ్డను తీసుకు వెళ్ళారు విదేశీజంట. వాళ్ళు ఇచ్చిన డబ్బుతో గుడిసె కొనుక్కున్నారు. కూరగాయల వ్యాపారం పెట్టాడు. వెంకటలక్ష్మి, కాబోయే తల్లుల ఆలనాపాలనా చూసే ఆయాగా అదే ఆసుపత్రిలో కుదిరింది. జీవితం నిమ్మదించిందని సంతోషించింది. కొన్ని నెలలకే నారాయణ వెంకటలక్ష్మి గర్భసంచి అద్దెకివ్వడానికి రంగం సిద్ధంచేయటంతో దిమ్మెరపోయింది.
ఈ మూడు కథలను వైద్య పరంగా, మహిళ మానసిక, శారీరక పరంగా, సామాజిక పరంగా విశ్లేషించుకుందాం. అనిర్వచనీయ బాంధవ్యం రచనాకాలంనాటికి వైద్యరంగంలో సంతానోత్పత్తికి అద్దెకు గర్భసంచిని వాడడం అరుదైన అంశం. తల్లి నుంచి అద్దె తల్లికి పిండ మార్పిడి జరిగింది.
అద్దె తల్లి కథలో అండం విడుదలకాలంలో సంతానం కోరుకున్న పురుషుడితో లైంగిక సంబంధం వల్ల గర్భందాల్చింది. రచయితకు శాస్త్ర పరిచయం లేకపోవటాన్ని సూచిస్తోంది. అద్దెకు గర్భసంచి ప్రక్రియలో వైద్య శాస్త్రరీత్యా లైంగిక సంబంధాలుండవు. మూడవ కథలో మహిళ గర్భందాల్చడానికి వీర్యకణాలను ఇంజెక్ట్‌ చేసే పద్ధతి ప్రయోగించారు.
పిండమార్పిడి ద్వారాకాని, ఇంజెక్షన్‌ పద్ధతి ద్వారాకాని మహిళ గర్భందాల్చడం సహజ ప్రక్రియకు భిన్నమైనవి. గర్భందాల్చటంకోసం గర్భాశయాన్ని ఉత్తేజంచేయడానికి మందులు వాడకం తప్పనిసరి. అలాగే గర్భంనిలవడానికి అధికమోతాదులో ఈస్ట్రోజన్‌, ప్రోజెస్ట్రోన్‌ వాడుతారు. ఒకటికి నాలుగు సార్లు గర్భసంచిని అద్దెకుఇవ్వడంవల్ల ఇవి ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి.
పిండం గర్భంలో ఉన్నప్పుడు షుగర్‌, బి.పి. లక్షణాలు చాలామందిలో కన్పిస్తాయి. అవి ప్రసవానంతరం సమసిపోవచ్చు లేదా కొనసాగవచ్చు. మూడోనెల వరకు సాధారణంగా గర్భవతులకు వాంతులవటం, తిండిసహించకపోవటం ఆ తర్వాత బిడ్డ పెరుగుదలతో శారీరకభారం పెరుగుతుంది.
ప్రసవం పునర్జన్మ వంటిదంటారు. కానుపుకష్టమై మరణించే సంఘటనలు ఎన్నో. కాన్పుకష్టమైనప్పుడు బిడ్డను బయటకుతీయడానికి చేసే సిజేరియన్‌తో కడుపుకోత. శారీరకంగా ఒకదాని తర్వాత ఒకటిగా పొందే ఇబ్బందులన్నీ అద్దె తల్లి భరించాలి.
వాంతులు వికారంతో లేవలేక సతమతమవుతున్నపుడు వీళ్ళ కోసం తనశరీరాన్ని ప్రాణాన్ని ఎందుకు పణంగా పెట్టాలి అని గోమాలచ్చిమిలో వెంకటలక్ష్మి బాధపడుతుంది. అంతేకాదు నిండు గర్భిణిలు బరువుగా తిరగటం చూసి పేదరికంవల్లనే కదా తన లాంటి వాళ్లందరూ ఇక్కడ చేరారు అని జాలి పడుతూ తన పరిస్థితికి కారణాలను విశ్లేషించుకుంటుంది. యజమానుల ఆధ్వర్యంలో టైంప్రకారం తిండి మందులు అబ్బినా తన బిడ్డల కడుపుకాదని తన కడుపునింపుకోగలదా! అందుకే అనిర్వచనీయ బాంధవ్యంలో తాను తెచ్చిన పండ్లు పలారాలు సావిత్రి కోసం మాత్రమే అని పద్మ అన్నప్పుడు వాళ్ళు తిన్నారు నా కడుపు నిండిపోయింది…. దీని అర్థం మీకు బోధపడదు పద్మగారు అంటుంది.
అద్దెతల్లి కడుపులో తన వంశాంకురం పెరుగుతోంది. అన్నకారణంగా పురుషుడు ఆమె పట్ల అభిమానం చూపించటం మొదలై దారిమళ్ళవచ్చు. ఆమెతో సాంగత్యం పెంచుకొని భార్యను నిర్లక్ష్యం చేయటమో, విడాకుల్విటమో జరగవచ్చు. అద్దెతల్లి కథలో విఠల్‌రావు సుజాతతో మళ్ళీ మళ్ళీ సంబంధాన్ని కోరుకోవటంలో పురుషుని బలహీనత, స్త్రీ వ్యామోహం స్పష్టమవుతుంది.
ప్రసవించిన వెంటనే బిడ్డను యజమానులకు అప్పచెప్పాలనే నియమం తల్లీ బిడ్డల సహజ సంబంధాన్ని దెబ్బతీయటంలేదా! అన్నెంపున్నెం ఎరుగని పసిబిడ్డ కన్నపేగుకు దూరమవుతోంది. గర్భంలో ఉన్నప్పుడు అమ్మ స్పర్శ అనుభవించిన పసికందు నూతన వాతావరణానికి అలవాటుపడాల్సి వస్తుంది తల్లి పాలతో రోగనిరోధక శక్తి పెరుగుతుందని, తల్లి పాల ప్రాముఖ్యాన్ని వైద్యులునొక్కి చెప్తున్నారు. అద్దెతల్లి అయినా రక్తాన్ని పంచుకొని పుట్టింది ఆ తల్లికేగా! అద్దెతల్లి అయినా పసిబిడ్డ వైపు ఆలోచిస్తే తల్లి నుంచి దూరం చేసే హక్కు ఎవరిచ్చారు? అదే పరిస్థితి అద్దె తల్లిలో ఎదురయ్యింది. కోర్టు ఆదేశాలతో విఠల్‌రావు బిడ్డను స్వీకరించినప్పుడు కొత్త స్పర్శతో బిడ్డ కెవ్వుమంది. సుజాత మాతృత్వం మేల్కొనింది. బిడ్డను అక్కున చేర్చుకుంది. ఈ తొమ్మిదినెలలు అనుబంధం బిడ్డని అప్పగించక పోయే పరిస్థితులకు దారితీయవచ్చు.
బిడ్డను ఏకారణంచేతనైనా యజమానులు స్వీకరించకపోతే పేదరికంలో కొట్టుమిట్టాడేవారికి మరో బిడ్డ అదనపుభారం కాదా! కోర్టునాశ్రయించే స్తోమత, మహిళా సంఘాల నాశ్రయించే అవగాహన ఎంతమందికుంటుంది. అనాధగావదిలేస్తే ఆ తప్పెవరిది? అద్దె తల్లి కథలో ఇలాంటి సమస్య ఏర్పడుతుంది. అంగవైకల్యంతో పుట్టిన బిడ్డను తమకొద్దని, మరో బిడ్డను కనిమ్మని లేకపోతే తామిచ్చిన డబ్బు తిరిగిమ్మని నిలదీసారు. అలాంటి బిడ్డ తమకే పుట్టివుంటే అని ఒకక్షణమాలోచించకలేకపోయారు. కోర్టు ఆదేశాలప్రకారం యజమాని బిడ్డను స్వీకరించాల్సి వచ్చింది. కానీ తల్లి ప్రేమ అందుకు అడ్డుపడింది.
డబ్బు వ్యామోహం చాలచెడ్డది. భార్య గర్భాన్ని అద్దెకిస్తే ఏశ్రమా లేకుండా లక్షలుచేతిలో పడ్తున్నాయి. పదేపదే గర్భాన్ని అద్దెకివ్వడానికి భర్త బలవంతంచేస్తే ఆ స్త్రీ మానసిక, శారీరక పరిస్థితి ఏమిటి? అయిష్టంగా అంగీకరించటం వల్ల డిప్రెషన్‌కు లోనవ్వచ్చు అనారోగ్యం పాలపడవచ్చు. వెంకటలక్ష్మి కట్టుగొయ్యకు కట్టిన గోవు పరిస్థితికి నెట్టేసింది. గోవుమాలచ్చిమి అయింది.
ఈ మూడు కథలో అద్దె తల్లి పరంగా, పసికందు పరంగా ప్రస్తావించిన సమస్యలు అవాంఛనీయం. తల్లి పాలను పొందడం తల్లి ఒడిలో నిద్రించడం. బిడ్డజన్మహక్కు మానవవిలువలను దెబ్బతీసే ఈ చర్య పట్ల మానవహక్కుల సంఘం స్పందించాల్సివుంది. అలాగే నవమాసాలు కడుపులో పెరిగి రక్తంపంచుకుని పుట్టిన బిడ్డపై అద్దెతల్లికి ఎలాంటి మమతానురాగాలు ఉండవనగలమా!
తరతరాలుగా శ్రమదోపిడీకి, వివక్షకు, కుటుంబ హింసకు గురవుతూ అస్తిత్వంలేకుండా మనుగడసాగిస్తున్న మహిళకు పురుషుని నుండి ఎదురవుతున్న మరో సమస్య ఇది. పురుషుడు బలవంతం చేసినప్పుడు పదేపదే గర్భసంచి అద్దెకివ్వడానికి మహిళలు తమ శరీరంపై తమకే హక్కుందనీ తమ మనసు నీ శారీరక ఆరోగ్యాన్ని దెబ్బతీసేచర్యలకు సమ్మతించేది లేదని ఖరాఖండిగా చెప్పగలగాలి. వైద్యశాస్త్రం సాధించిన ప్రగతిని సమాజం మహిళకు శాపంగా మార్చడం శోచనీయం. సంతానంపై మక్కువ ఉన్న దంపతులు ఇన్ని ఇబ్బందులున్న అద్దెతల్లిని ఆశ్రయించక అనాథను ఆదరించి అక్కున చేర్చుకుంటే!

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

One Response to అద్దె తల్లి కథలు

  1. RAMBABU says:

    విజయ లక్ష్మి గారు,

    చాలా బాగా చెప్పారు. మాతృ ప్రేమను అమ్ముకునే స్తితికి దిగజారటం చాల బాధాకరం.శ్రమను దోచుకునే వాళ్ళకి ఇవేమీ కనపడవు కేవలం డబ్బు తప్పితే. ఇటువంటివాటిని ఎవరూ ప్రోత్సహించకూడదు.మీరన్నట్టు సంతానం కావాలనుకున్న తల్లిదండ్రులు , అనాధ పిల్లలను పెంచుకోవటం మంచిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో