నెత్తురోడిన సిరాచుక్కలు

పసుపులేటి గీత
‘అందమైన పువ్వుల కోసం నన్నడక్కండి,
నా చేతుల మీదా,
పాదాల మీదా,
        పెదవుల మీదా     ఉక్కునరాలల్లుకున్నాయి,
    కాలపు శిలమీద నేను
    చెక్కే శాసనమిదే…’
ఈ శిలాక్షరాలు, ఈ సిరా చుక్కలు దారుణ గాయాలతో కన్నుమూసి ఇప్పటికి ఐదేళ్ళు దాటిపోయాయి. అయినా ఇంకా ఈ భూమ్మీద, ‘తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాల్లో అన్ని చోట్లా మహిళలు అణచివేతకు గురవుతున్నారు. ఇంటా, బయటా వాళ్ళు నలిగిపోతున్నారు. అందగత్తెలైనా, అంద వికారులైనా ఛిద్రమవుతున్నారు. వికలాంగులైనా, కాకున్నా విచ్ఛినమవుతున్నారు. పేదలైనా, ధనికులైనా, అక్షరాస్యులైనా, నిరక్షరాస్యులైనా వాళ్ళింకా మగ్గిపోతూనే ఉన్నారు. బట్టలు ధరించినా, వివస్త్రలైనా ఇంకా విచ్చిపోతూనే ఉన్నారు. మూగ వాళ్లయినా, మాటకారులైనా, పిరికివాళ్ళయినా, ధైర్యవంతులైనా ఆడవాళ్ళు ఇంకా అణగారిపోతూనే ఉన్నారు’ (తస్లిమా నస్రీన్‌). అందుకే తనను పువ్వుల గురించి అడగొద్దన్న ఒక ‘ఎర్రని పువ్వు’ (గొల్‌ ఎ దుడి – నదియా  అంజుమన్‌ కవితా సంపుటి) ఐదేళ్ళ క్రితం వాడిపోయినా, తడి ఆరని ఆ గాయం గురించి నాలుగు ముక్కలు మాట్లాడుకుందాం, కాసిని కన్నీళ్ళు మళ్ళీ పంచుకుందాం.
    నదియా అంజుమన్‌ ఆఫ్గనిస్థాన్‌లోని హేరట్‌కు చెందిన కవయిత్రి. ఒక పెద్ద కుటుంబంలో ఆరో సంతానంగా జన్మించి, అల్లారు ముద్దుగా పెరిగింది. హైస్కూలు చదువును పూర్తి చేసింది. తరువాత తాలిబన్‌ రాజ్యంలో ఆమె చదువు ఆగిపోయింది. ఆ కాలంలోనే నదియా పదాల మీద, కవిత్వం మీద ప్రేమను పెంచుకుంది.
    ‘రాత్రివేళ ఈ పదాలు నా దగ్గరకొచ్చాయి
    నా పిలుపు వినే ఇవి నా చేరాయి
    నాలో ఏ నిప్పు రగులుతోంది, నాకు ఏ నీళ్ళు దక్కుతాయి?
    ఆత్మ పరిమళాల్ని వెదజల్లుతోంది దేహం
    ఈ పదాలు ఎక్కణ్ణుంచి వచ్చాయో నాకు తెలీదు
    పిల్లగాలి నాలోని ఒంటరితనాన్ని తరిమేసింది
    మబ్బుల దివ్వె నుంచి ఈ కాంతి నన్ను చేరింది
    ఇక నేను కోరేదేమీ లేదు, నాకు కావలసిందేమీ లేదు
    అతని పుస్తకంలో నా వెర్రితనం,
    ప్రభూ కాదనకు, దయతో ఒక్కసారి నన్ను చూడు
    ఇది తీర్పు వెలువడే రోజు
    తుది తీర్పులా మౌనం నన్నాశ్రయించింది
    ప్రభువు నాకు జలతారునిచ్చాడు
    ఈ రాత్రంతా జావళులు నా మీద వర్షిస్తూనే ఉంటాయి’ అంటూ అలవోకగా గజళ్ళనల్లింది. అలాగని నదియా కేవలం విరహపు పలవరింతలకే పరిమితమైందా అంటే, లేదు. ‘వారి పెదవుల చీకటి సంద్రాలపై ఎలాంటి చిరునవ్వూ లేదు, కళ్ళ బీళ్ళ నుంచి కన్నీటి వసంతాలూ పూయలేదు, భగవంతుడా, వారి మౌనరోదనలు మబ్బుల్నీ, స్వర్గాన్నీ తాకుతున్నాయా?’ అంటూ ఆఫ్గన్‌ మహిళల అంతరంగ వేదనల్ని అక్షరీకరించింది.
    హేరట్‌లో ఒక ఇంటి ముందు చిన్న బోర్డుని వేలాడదీశారు. దానిపై ‘గోల్డెన్‌ నీడిల్‌ సూయింగ్‌ స్కూల్‌ – ఇక్కడ కుట్టుపని నేర్పబడును’ అని ఉంది. నిజానికి తాలిబన్ల హయాంలో ఆఫ్గన్‌ మహిళలు చదువుకే కాదు, చిరునవ్వుకూ నోచుకోని దుర్భర జీవితాల్ని గడిపారు. ఆ రోజుల్లో వాళ్ళని కేవలం కుట్టుపని నేర్చుకోవడానికి మాత్రమే అనుమతించే వాళ్ళు. అలాంటి చీకటి రోజుల్లో కూడా ఒక చిన్నదివ్వెని వెలిగించాలని ప్రొఫెసర్‌ మొహమ్మదలీ రహ్యాబ్‌ నిర్ణయించుకున్నాడు. నిర్ణయించుకున్నదే తడవు కుట్టుపని కోసం వచ్చిన ఆడవాళ్ళకి సాహిత్య పాఠాలు బోధించడం ప్రారంభించాడు. బురఖాల్ని గోడలకి తగిలించి అక్కడ స్త్రీలు సాహిత్యాన్ని అధ్యయనం చేసేవాళ్ళు. సాహిత్యంపై ఆఫ్గన్ల మక్కువకు అంతు లేదు. ‘మాకు రాజకీయ విశ్లేషణలు వద్దు. ఒక్క కవితా పంక్తితో కుటుంబకలహాలు మాసిపోతాయి, ఒక్క కవితా పంక్తితో ఊరు ఊరంతా ఒకే తాటిపైకి వచ్చేస్తుంది’ అని ఒక ఆఫ్గన్‌ యువకవి అభిప్రాయ పడ్డాడంటేనే, సాహిత్యానికి వాళ్ళిచ్చే స్థానమేమిటో అర్థమవుతుంది. అలాంటి చోట రహ్యాబ్‌ రహస్య సాహితీ బోధన పట్ల ఎందరో ఆకర్షితులయ్యారంటే అతిశయోక్తి కాదు. అలాంటి వారిలో నదియా అంజుమన్‌ కూడా ఒకరు.
    నల్లని బురఖాలోంచి కనిపించే ఆ చిన్ని కళ్ళలో ఎంతో శక్తి ఉండేదని నదియా సహాధ్యాయులు అంటుంటారు. ఆఫ్గన్‌ యువ సాహితీ రంగంలో దియా ఒక ఆశాగీతిగా వినిపించింది. తాలిబన్ల నుంచి ఆఫ్గన్‌ విముక్తి పొందిన తరువాత ఆమె హేరట్‌ విశ్వవిద్యాలయంలో ‘దరీ సాహిత్యాన్ని’ అధ్యయనం చేసింది. దాదాపు అరవై, డెబ్భై వరకు కవితలు రాసిన నదియా ‘గొల్‌ ఎ దుడి’ (ముదురు ఎరుపు రంగు పువ్వు) అనే కవితా సంపుటిని కూడా వెలువరించింది. ఆఫ్గన్‌ మహిళల పారతంత్య్రమూ, వారి వేదనాభరిత జీవితాలూ ఆమె కవితల్లో శక్తివంతంగా ప్రతిఫలించేవి.
‘నాకు పెదవి విప్పాలని లేదు
ఏ పాట మిగిలిందని..?
జీవితమే నన్ను వెలివేసింది
పాడినా, పాడకున్నా పెద్దగా తేడా లేదులే!
నా నోరంతా చేదెక్కిన తరువాత
మాధుర్యం గురించి నేనెందుకు మాట్లాడాలి?
నియంత విందు
నా పెదవి తలుపుని తడుతోంది
ఎవరిని మురిపించాలిక,
నాకే తోడూ లేదు
మాటకీ, నవ్వుకీ, చావుకీ, బతుక్కీ మధ్య తేడా లేదు
నేనూ, నా ఏకాకితనమూ.
విషాదమూ, శోకమూ నిండిన
నేనొక శూన్యగర్భాన్ని
నా నోరు మూతపడాల్సిందే
మనసా, ఇది వసంత వేళని తెలుసు కదా,
వేడుకల వేళనీ తెలుసు కదా
రెక్కలు విరిగిన నేనేం చేయగలను?
ఏళ్ళూపూళ్ళుగా నేను నిశ్శబ్దంగానే ఉన్నాను
కానీ శ్రావ్యతని మరచిపోలేదు
నాలో గుసగుసలాడే ప్రతిక్షణం
ఈ పంజరం బద్ధలయ్యే నాటి
నా పాటలుగా నేను నేనంతా
ఏకాంతంలోంచి ఎగిరే వేళ
నేను నేనంతా ఒక విషణ్ణ గీతమయ్యే వేళ
నా పాటలు నన్ను గుర్తు చేస్తూనే ఉంటాయి.
నేనేమీ, ప్రతి గాలికీ వణికిపోయేంత
బలహీనమైన బూరుగుచెట్టుని కాను.
నేనొక ఆఫ్గన్‌ మహిళను
మౌనరోదనకు చిరునామాను.’
    ‘ఆమె ఒక మంచి కవి, మేథావి. కానీ అందరు ఆఫ్గన్‌ మహిళల్లాగే ఆమె కూడా భర్త చెప్పుచేతల్లోనే నడచుకోవాల్సి వచ్చేది’ అని ఆమె హేరట్‌ విశ్వవిద్యాలయంలో నదియా సహాధ్యాయి నహీద్‌ బకి అంటారు. నదియా ఇలా ప్రశ్నించే, ఎదిరించే కవితల్ని రాయడాన్ని ఆమె భర్త, అతని కుటుంబమూ సహించలేక పోయింది. అడుగడుగునా హింసిస్తూ, చివరికి పాతికేళ్ళు నిండకుండానే ఆమెను బలితీసుకుంది వారి అసహనం. అంతర్జాతీయ సాహితీ లోకం నివ్వెర పోయేలా నదియా 4, నవంబర్‌, 2005 న తన ఇంట్లోనే అనుమానాస్పద రీతిలో శవమై పోలీసులకు కనిపించింది. భర్తే ఆమెను చంపాడని నదియా తల్లి ఆరోపించింది. ‘నాకే పాపమూ తెలీదు, ఏదో గొడవ పడ్డాం, నేను కొట్టాను. ఆమె విషం తీసుకుంది’ అని భర్త అమాయకంగా జైలు గోడల మధ్య నుంచి ప్రపంచాన్ని నమ్మించాలని ప్రయత్నించాడు. చిట్టచివరకు నదియా ‘ఆత్మహత్య’ చేసుకున్నదనే కోర్టు కూడా నమ్మింది. ‘ఈ తుపాను బీభత్సంలో, నీ స్వప్న స్వర్ణ ప్రతిమని ఏ దోపిడిగాడు దోచుకెళ్ళాడు?’ ఏమో, ఎవడో వాడెవడో? దోపిడి మాత్రం జరిగిపోయింది. తాను ప్రేమించిన పదాలే నదియాకు ఉరితాళ్లయ్యాయా? ప్రపంచమంతా గొప్ప కానుకగా భావించిన ఆ పదాల్ని ఆమె సొంతకుటుంబమే అవమానంగా భావించింది. ‘కవితలూ, పాటల పొత్తిళ్ళలో పురిటిబిడ్డనే అయినప్పటికీ, నా కవితలు ఎందకూ కొరగానివయ్యాయి, ముక్కలు, ముక్కలుగా విరిగిపోయాయి, తోటమాలి చేతినే గుర్తు పట్టలేని రెమ్మనయ్యాను’ (నదియా అంజుమన్‌). అక్షరాల నుంచి పొంగి పొరలే జీవనోత్తేజాన్ని కూడా అనుభవించలేనంతగా ఆమె హింసల కొలిమిలో కాలిపోయింది. అందుకే తన కవితలన్నీ శకలాలుగా పగిలిపోయాయంటూ నదియా అక్షరాల అశ్రుధారే అయింది. ‘ఈ మూల పంజరంలో పిట్టనయ్యాను, దిగులుతో పొగిలి పోతున్నాను, రెక్కలు రాలిన నేనిక ఎగరలేను, నేనొక ఆఫ్గన్‌ మహిళను, నేను దుఃఖితను’ అంటూ ఆమె అక్షరాలా కన్నీటి చెలమలెండిన ఎడారే అయింది. నదియా దృష్టిలో మృత్యువు కన్నా భయంకరమైంది స్వేచ్ఛా రాహిత్యం. మనసారా మాట్లాడలేక పోవడం, తనివి తీరా కవిత్వం రాయలేక పోవడం ఆమెకు జీవించి ఉండగానే మరణవేదనను చవిచూపించాయి. ‘ఆ అపరిచిత పర్వతం వెనుక ఎవరు దాక్కున్నారు? / ముత్యపు నిశ్శబ్దంలో ఎవరు నిద్రిస్తున్నారు? / జ్ఞాపకాల్లో ఎవరున్నారు? / పారదర్శకపు నీటి జ్ఞాపకాల్ని తీసుకురండి./ మరపు నదిలో పడి ఈదుతున్న నా బుర్రనిండా చెత్త పేరుకుంది,/ ఆ కొండ వెనుక నుంచి వినిపించిన గొంతుక నాలో ఆలోచనల్ని రేపింది. / అది విధ్వంసకర స్వరం, చేతికి ఏ బంగారపు తాడైనా ఎలా దొరుకుతుంది? /క్రూరత్వపు తుపాను నమ్మకాన్ని సడలించేస్తుంది. / వెండిదళాల వెన్నెల సౌఖ్యాన్ని నువ్వెలా అనుభవించగలవు? /దీనికన్నా మరణం ఇంకొకటి లేదు. /ఒకవేళ నది ప్రవహించకుండా ఆగిపోతే, మబ్బుల నీ మనసులోకి నడిచొస్తే, /వెన్నెల తన చిరునవ్వులతో నిన్ను దీవిస్తే, /కొండ మెత్తబడి పచ్చదనం చివుళ్ళెత్తితే, /కాయలూ, పళ్ళూ కాస్తే,/ కఠినాత్ముల మధ్యలో ఒకే ఒక్క దయాళువు ఉంటే, / ఆ సూర్యుడు ఉదయిస్తాడా? /క్రూరత్వపు తుపానుకు, వరదకీ భయపడి కళ్ల వెనుక దాగిన జ్ఞాపకాలన్నీ చివురిస్తాయా? / ఒక ఆశాదీపం వెలుగుతుందా?’. పర్షియన్‌ కవితా ప్రపంచపు కళ్ళలో వెలిగిన ఆ ఆశాదీపం అన్ని ప్రశ్నల్నీ చిదిమేస్తూ ఆరిపోయింది. ‘నేను మహిళల గురించే ఎక్కువగా రాస్తాను. ఎందుకంటే అందరికంటే ఎక్కువగా బాధలకు గురవుతున్నది మేమే కాబట్టి’ అంటుంది నదియా. రహ్యాబ్‌ ఇతర శిష్యులందరిలాగానే నదియా కూడా తన కవితా ప్రస్థానానికి కుటుంబ ఆమోదం కోసం అహరహం శ్రమించింది. ఇంకా ఈ ప్రపంచంలో స్త్రీలు ఎందరెందరో ‘ఆమోదాల’ కోసం కళ్ళూ, ఒళ్ళూ తూట్లు పడేలా ఎదురు చూస్తూనే ఉన్నారు. ‘అన్ని చోట్లా నాకు తిరస్కారమే ఎదురైంది/ నా చెవిలో కవితల గుసగుసలు మూగబోతున్నాయి/ ఆనందానికి నాలో అర్థాన్ని వెదక్కండి/ నా గుండెలో సంతోషమెన్నడో ఆవిరైంది / నా కళ్లలో నక్షత్రాల జాడల కోసం వెదక్కండి, అదెన్నటికీ నిజం కాని కథే!’ అంటుందామె. కానీ అలాంటి కథల కోసం, అలాంటి ప్రేమ కోసం లోకం కళ్ళలో వత్తులు వేసుకుని ఎదురు చూస్తోంది. నదియా మాత్రం ‘నన్ను ప్రేమ గురించి అడక్కండి / నా ప్రేమ పదాలన్నీ మృత్యుగీతాలే / పువ్వులాంటి ఆశగా అతను నన్ను కోరుకున్నాడు / నా కన్నీటి బిందువేదీ చాలదు / ఈ నేల మీద పుట్టిన అమ్మాయి ఖాసిదా గజల్‌ను పాడుతుంది / ఆమె అందమైన సంగీతోక్తుల్ని చెదరగొట్టిందెవరు? / తోటమాలి నా సంతోషాన్నీ, యవ్వనాన్నీ అర్థం చేసుకోలేడు / వింతగానే ఉంటుంది, ఈ చేతుల నుంచీ, ఈ పాదాల నుంచీ, పదాల నుంచీ వర్తమానపు శిలా ఫలకంపై నా పేరు ప్రవహిస్తూనే ఉంటుంది’ అంటూ ఒక శాశ్వత గాయాన్ని మనకిచ్చి వెళ్ళిపోయింది. ఆమె అంత్యక్రియలకు వేలాది మంది ప్రజలు హాజరై నివాళులర్పించారు. నదియా మరణించేనాటికి ఆమెకు ఆరు నెలల కొడుకు కూడా ఉన్నాడు. ‘నదియా ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు, ఆమెకు తన కొడుకంటే ఎంతో ఇష్టం. ప్రతినెలా వాడి ఎదుగుదలనీ, వాడి ఫోటోల్ని తెచ్చి మాకు చూపేది…’ అంటూ ఆమె స్నేహితురాలు కన్నీరు మున్నీరైంది. ‘గుండెలో ఇంకా నెలకొనని ఎన్నెన్నో ప్రదేశాలున్నాయి, బాధతో తప్ప వాటి ఉనికి కన్ను తెరవదు’ (ఫ్రెంచి కవి, రచయిత లియోన్‌ బ్లాయ్‌), నిజమే…, మన గుండెలో కూడా ఒక శాశ్వత వేదనకి నదియా ఉనికినిచ్చినప్పటికీ, ఆ సిరాచుక్కలు మాత్రం ప్రపంచమహిళల వేదనల్నే కాక ఆకాంక్షల్ని కూడా ఎన్నటికీ నినదిస్తూనే ఉంటాయి.

Share
This entry was posted in సాహిత్య వార్తలు. Bookmark the permalink.

2 Responses to నెత్తురోడిన సిరాచుక్కలు

  1. sivalakshmi says:

    “ఇంకా ఈ ప్రపంచం లో స్త్రీలు ఎందరెందరో “ఆమోదాల “కోసం కళ్ళూ ఒళ్ళూ తూట్లు పడేలా ఎదురు చూస్తూనే ఉన్నారు! “అన్ని చోట్లా నాకు తిరస్కారమే ఎదురైంది! స్త్రీలందరి దయనీయమైన పరిస్తితి ని కళ్ళ ముందుంచిన నదియా కోసం గుండె నీరవుతోంది. గీత గారికి ధన్యవాదాలు1

  2. machani venkateswarlu. says:

    Chalaa vismayaaniguriaiyyanu.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>