రవీంద్రుని రచనలలో మానవతాదృక్పథం

డా. జె. భాగ్యలక్ష్మి
రవీంద్రనాథ్‌ ఠాగూరు గురించి, ఆయన దార్శనికత గురించి వ్రాస్తూ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ ”అతడు భూమికి పుత్రుడు కాని స్వర్గానికి వారసుడు” అని అన్నారు.ఈ ఒక్క వాక్యమే రవీంద్రుని వ్యక్తిత్వాన్ని, ఆలోచనాస్రవంతిని, జీవనదృక్పథాన్ని తెలియజేస్తుంది. రవీంద్రుని భావాలు ఆకాశపుటంచుల వరకు సాగినా ఆయన పాదాలు భూమిమీదే ఉన్నాయి. అనునిత్యమూ దైవాన్ని స్మరించినా దైవాన్ని దర్శించింది. వైవిధ్యభరితమైన ప్రకృతిలో, మానవునిలో, శ్రామికునిలో, తల్లిలో, పసిపాపలో, పశుపక్ష్యాదులలో, సర్వత్రా వ్యాపించి ఉన్న చైతన్యంలో.
రవీంద్రుని రచనలన్నింటిలో ఎక్కువగా ప్రచారం పొందిందీ, ప్రపంచవ్యాప్తంగా ప్రజల అభిమానాన్ని పొందిందీ ”గీతాంజలి”. ఈ కావ్యం ఇంతగా సుప్రసిద్ధమవటానికి కారణం 1913లో నోబెల్‌ బహుమతి రావటమేనన్న విషయం ఎవరైనా గ్రహిస్తారు. సాహిత్యంలో నోబెల్‌ బహుమతిని ”గీతాంజలి”కి ”ది గార్డెనర్‌” అనే సంకలనానికి కలిపి ఇచ్చారంటారు. గీతాంజలి 1912లో ప్రచురితం కాగా, ”ది గార్డెనర్‌” 1913లో ప్రచురితమయింది. ఈ రెండు సంకలనాలలో ఠాగూరు ఇదివరకు వ్రాసిన బెంగాలీ కవితల అనువాదాలే ఉన్నాయి. ప్రపంచ భాషలలోని అనువాదాలన్నీ చాలావరకు ఈ అనువాదాలకు అనువాదాలే. ”గీతాంజలి”లోని కవితలన్నీ పరమార్థచింతనతో ఉన్నందున ఠాగూరు కేవలం భక్తికే అంకితమయ్యాడా లేక ఇతర ప్రాపంచిక విషయాలపై దృష్టి సారించాడా, మనుషుల కష్టసుఖాలు పట్టించుకున్నాడా అనే సందేహం రావచ్చు.
రవీంద్రుడు బహుముఖ ప్రజ్ఞాశాలి. సాహిత్యంలో కూడా ఆయన చేపట్టని సాహిత్య ప్రక్రియ ఏదీ లేదు. నవలలు, కవితలు, వ్యాసాలు, నాటకాలు, కథలు రవీంద్రుని విశాల ప్రపంచాన్ని మనముందుంచుతాయి. వీటిలో సంపూర్ణ సమాజం మనకు కనిపిస్తుంది. రాగద్వేషాలు, సంకుచితత్వాలు, స్వార్థం, త్యాగం, అవినీతి, ఆదర్శం – ఒకటేమిటి సంక్లిష్టమైన మానవజీవితం మనకెదురవుతుంది. ఈ రచనలలోనే రవీంద్రుని ఆదర్శాలు, దృక్పథాలు, విలువలు ప్రస్ఫుటమవుతాయి.
రవీంద్రుని దేశభక్తి గురించి తెలియని వారుండరు. భయం, ద్వేషంలేని సమాజం గురించి ఆయన కలలు గన్నాడు. ఆ సమాజంలో అనునిత్యమూ విస్తరించే ఆలోచనా స్రవంతి సత్యం వైపు, పరిపూర్ణత వైపు ప్రవహిస్తుంది. వఇనీలిజీలి శినీలి ళీరిదీఖి రిరీ గీరిశినీళితిశి తీలిబిజీ బిదీఖి శినీలి నీలిబిఖి రిరీ నీలిజిఖి నీరివీనీవ అనే కవిత మనదేశంలో ప్రతి విద్యార్థికీ తెలుసు.
ఇది కేవలం దేశభక్తి కవిత కాదు. ”వసుధైక కుటుంబకమ్‌” అనే పద్ధతిలో మొత్తం ప్రపంచంలోని అన్ని దేశాల సమైక్యతను కోరుకొంటుంది. అందుకే ”ఎక్కడ సంకుచిత స్వదేశ కుడ్యాలతో ముక్కలు ముక్కలుగా చీలిపోదో, ఎక్కడ మాటలు సత్యపులోతులనుండి వెలువడుతాయో, ఎక్కడ పరిపూర్ణత కోసం అవిరామకృషి తన చేతులు చాపుతుందో” అటువంటి స్వతంత్ర స్వర్గంలో తనదేశం మేలుకోవాలని కోరుకొంటాడు కవి.
రవీంద్రుని దృష్టిలో మానవుని అసలైన సంపద ప్రాపంచికమైన ధనవస్తు కనక వాహనాలు కాదు. నిజమైన సంపద సత్య సంపదే. ఇది ఎన్నటికీ తరగని సంపద. సంస్కృతికి సంపదకు సంబంధము లేదు. సంపదనుబట్టి సంస్కృతిని అంచనా వేయలేము. వాస్తవమైన సంస్కృతి ప్రకృతికి దగ్గరగా ఉంటుంది.
ఠాగూరు మతం మానవ మతం. ఆయన వైష్ణవమతం ఉపనిషత్తుల ప్రభావానికి లోనయ్యాడని ఆయన భక్తిగీతాలు చదివినవారందరూ చెపుతుంటారు. రవీంద్రుని మూలమంత్రం విశ్వజనీనమైన ప్రేమ. ప్రతి పదంలో, ప్రతి భావంలో, ప్రతి దృష్టిలో ప్రేమ చిప్పిల్లుతూ ఉంటుంది. అతిసామాన్యమైన దృశ్యాలలో కూడా అంతర్లీనమైన ప్రేమ కనిపిస్తుంది.
”ది గార్డెనర్‌”లోని ఈ సామాన్య దృశ్యం చూడండి.
ఇటుకల తయారీకి భార్యాభర్తలిద్దరూ మట్టి త్రవ్వకంలో నిమగ్నమయ్యారు. వాళ్ళ కూతురు నది వద్దకు వెళ్ళి పాత్రలు, గిన్నెలు తోమితోమి కడుగుతుంటుంది. ఆ అమ్మాయి తమ్ముడు బోడిగుండువాడు, నగ్నంగా, మట్టికొట్టుకున్న దేహంతో తనవెంటే వెళ్ళాడు కాని ఆమె చెప్పినట్లు కొంచెం ఎగువన కూర్చుని అక్క రాకకు ఎదురుచూస్తుంటాడు. నెత్తిన నీళ్ళ కుండతో ఎడమచేతిలో నీళ్ళ బిందెతో కుడిచేతిలో పిల్లవాడితో ఆ పాప తన ఇల్లు చేరుకొంటుంది. తన తల్లికి చిన్నదాసిగా, ఇంటిపనుల భారం మోస్తూ ఉంటుంది. ఒకరోజు ఆ నగ్నబాలుడు కాళ్ళు చాపి హాయిగా కూర్చున్నాడు. నీళ్ళ వద్ద తన అక్క బిందెను ఇటూ, అటూ తిప్పి తిప్పి తోముతూ ఉంది. బొద్దుగా, ముద్దుగా ఉన్న గొర్రెపిల్ల ఒడ్డున గడ్డిపరకలు నములుతోంది. పిల్లవాడిని చూచి ”మే” అంటూ అరచింది. బెదిరిపోయి వాడు కెవ్వుమన్నాడు. కడుగుతున్న పాత్ర వదిలి అక్క పరుగుపరుగున వచ్చింది. తమ్ముడిని, గొర్రెపిల్లను రెండుచేతులా పొదవుకుంది. ప్రేమతో నిమిరింది పశుసంతానం, నరసంతానం ఏకం చేసింది ఈ బంధం.
ఈ కవితలో మరో విషయం మనకు కనిపిస్తుంది. ఈనాడు ఆడపిల్ల బాల్యం గురించి, ఇంటిపనుల భారం గురించి మనమెంతో చర్చిస్తుంటాము. ఈ సమస్య రవీంద్రుని దృష్టి దాటిపోలేదు.
రవీంద్రుని దృష్టిలో స్త్రీని గౌరవించలేని సమాజం, సమాజమే కాదు. స్త్రీ పురుషునికే ఆదర్శంగా ఉంటుంది. స్త్రీపురుషులు సమానమే అయినా స్త్రీ ప్రేమకు, స్ఫూర్తికి కేంద్రంగా ఉండాలి. ఠాగూరు రచనలలో సాంప్రదాయికంగా స్త్రీకి జరుగుతున్న అన్యాయాలను నిరసించటం జరిగింది. ఆమె పట్ల క్రూరంగా వ్యవహరించే తీరును, సాంఘిక దురాచారాలను చాలా వ్యంగ్యంగా విమర్శించటం జరిగింది.
ఆయన సుప్రసిద్ధమైన నవల ”గోరా”లో ఇటువంటి సందర్భాలెన్నో కనిపిస్తాయి.
వినయుడు అనే వ్యక్తి గోరా తల్లి ఆనందమయితో ఒక సందర్భంలో ఇలా అంటాడు. ”అమ్మా నీవు నవ్వుతున్నావు. హఠాత్తుగా నాకింత కోపము వచ్చిందని అనుకొంటున్నావు. నాకు ఎందుకు కోపము వచ్చిందో చెపుతాను. ఆ వేళ సుధీరుడు నిన్ను నైయిహాటీ స్టేషను వద్ద మిత్రుని తోటలోకి తీసుకు వెళ్ళినాడు. మేము షేయలదా స్టేషను విడవగానే వర్షము ప్రారంభమైనది. శోదపూర్‌ స్టేషనులో బండి ఆగినపుడు చూచాను; బంగాళీ బాబు దొరల దుస్తులు వేసుకొని, గొడుగు వేసుకొని రైలుపెట్టెలో నుంచి ఆయన భార్య దిగుతుండగా చూస్తున్నాడు. ఆమె చిన్నబిడ్డనెత్తుకొని, ఒంటిమీద ముసుగు దుప్పటి కప్పుకొని ఆ బిడ్డను ఏదో విధంగా స్టేషనులో ఒక పక్కకి తీసుకుపోయింది. ఆ దీనురాలు సిగ్గుతో చలితో గడగడలాడుతూ తడుస్తున్నది. అతను మాత్రము వస్తువులు పట్టుకొని నెత్తిమీద గొడుగు వేసుకొని మాటాడకుండా చూస్తున్నాడు. నాకు ఒక క్షణంలో ఇలా అనిపించింది. ”మన బంగళాదేశంలో ఎండలోగాని, వానలోగాని, పెద్దమనుషులుగాని, సామాన్యులుగాని ఏ స్త్రీ నెత్తిమీద గొడుగు పట్టరు. భర్త సిగ్గు లేకుండా, ఆయన భార్య ఒంటిమీద వస్త్రము కప్పుకొని మాటాడకుండా తడుస్తూ ఉండగా చూసినాను. ఇంతకంటె లజ్జాకరమైన విషయమున్నదా? స్టేషనులో ఒకరికయినా ఇది అన్యాయము అని కొద్దిగా అయినా తోచినదా?…
”మనము దేశమును మాతృభూమి అని అంటున్నాము. కాని దేశపు ఆ స్త్రీమూర్తి మహిమ దేశములో స్త్రీ లోకంలో ప్రత్యక్షము చేయుము. బుద్ధిలో, శక్తిలో కర్తవ్య బోధలో ఔదార్యములో మన స్త్రీలను పూర్ణ పరిణత, సతేజ, సరళభావముతో చూడక, ఇంట్లో దౌర్బల్యము, సంకీర్ణత, అపరిణతి చూస్తూ ఉంటే ఎన్నడూ దేశ-ఉపలబ్ధికి ఉజ్జ్వలము కానేరదు.” (అనువాదం : శివశంకరస్వామి)
ఇంకో సందర్భంలో గోరా తాను ప్రేమించే సుచరితను చూసి ఆలోచనలో పడతాడు. భారతనారీ ప్రకృతి సుచరితరూపంలో వచ్చిందనుకొంటాడు. అతని ఆలోచనలు ఈ విధంగా సాగుతాయి. ”ఏ లక్ష్మీదేవి భరతవర్షములో పిల్లలను పెద్దవాళ్ళను చేస్తున్నదో, రోగులకు ఉపచారాలు చేస్తున్నదో, ఆర్తులను ఊరడిస్తున్నదో, తుచ్ఛులకు కూడా, ప్రేమ, గౌరవస్థానాలను అనుగ్రహిస్తున్నదో, ఏ దేవి కష్టాలలో, దుర్గతిలో కూడా మన అతిదీనులను విడిచిపెట్టదో, నిర్లక్ష్యము చెయ్యదో, ఆ శక్తి మనకు పూజ్యురాలు అయినప్పటికీ మనలో అయోగ్యుణ్ణి కూడా ఆదరిస్తున్నదో, ఏ శక్తి తన నిపుణ రమ్య హస్త ద్వంద్వమును మన పనులలో వినియోగిస్తున్నదో, చిరసహనశీల అయిన ఏ శక్తి క్షమాపూర్ణ, ప్రేమ, అక్షయ, దానరూపం వల్ల మనము ఈశ్వరుని సన్నిధానము పొందుతామో అటువంటి లక్ష్మీమూర్తి తేజస్సుతో తన తల్లి పక్కన ఆసీనురాలు అయి ఉన్నట్టు ప్రత్యక్షము అయ్యేసరికి గోరా నిండు ఆనందము పొందినాడు. ఈ లక్ష్మి వంక మనము కన్నెత్తి చూడటం లేదనీ, ఈమెను అన్నింటి వెనకాలకూ నెట్టేమని, మన దుర్గతికి ఇంతకంటే మరే చిహ్నమూ లేదనీ, దేశమంటే ఈమేననీ, సమస్త భారత నిగూఢ స్థానంలో, ప్రాణ నికేతనంలో శతదళ పద్మము మీద ఆసీనురాలయినది ఈమే అనీ, మనము అందరమూ ఈమే సేవకులమనీ గోరా తలపోయసాగినాడు. దేశానికి ఈ దుర్గతి పట్టడం ఈమెను అవమానించడం చేతనే. (అనువాదం: శివశంకరస్వామి, ప్రథమముద్రణ 1961, సాహిత్య అకాడమి, న్యూఢిల్లీ)
రవీంద్రుడు సంపన్న కుటుంబంలో పుట్టినందున ఊహాలోకాల్లో తేలిపోతుంటాడని, సామాన్యుల వ్యథ తెలియదని కొందరు అనుకొంటారు. కాని రవీంద్రనాథ్‌ ఠాగూరు పెంపకంలో కూడా సరళత్వమే ఉందని అందరికీ తెలుసు. అదీగాక తాను స్వయంగా పల్లెప్రాంతాలు చూసి శ్రమజీవుల కష్టసుఖాలకు స్పందించాడు. భారతదేశంలోని పల్లెప్రాంతాలు మెరుగుపడాలని ఎంతగానో ఆశించాడు.
”గీతాంజలి”లోని ఈ కవిత శ్రామికులలో రవీంద్రుడు భగవంతుని చూశాడని తెలియజేస్తుంది.
”ఇదిగో నీ పాదపీఠం. నిరుపేదలు, నిర్భాగ్యులు, నిరాశాజీవులు నివసించే స్థానం నీ పాదాలకు             పీఠం.
నీకు పాదాభివందనం చేయాలని వంగినపుడు నిరుపేదలు, నిర్భాగ్యులు, నిరాశాజీవుల మధ్యనున్న నీ పాదాలను స్పృశించలేకపోతున్నాను. నిరుపేదలు, నిర్భాగ్యులు, నిరాశాజీవుల రూపంలో నడుస్తున్నప్పుడు గర్వం నిన్ను ఎన్నడూ చేరుకోలేదు.”
మరో గీతంలో ”పొలం దున్నే రైతు వద్ద, రాళ్ళు కొట్టే శ్రామికుని వద్ద దేవుడున్నాడు. ఎండలో, వానలో వారితోనే ఉంటాడు. ఆయన దుస్తులు ధూళిభరితం. నీ మడిబట్టలు ప్రక్కకు పెట్టు. ధూళిదూసరితమైన స్థలానికి ఆయనలా నడచిరా” అని అంటాడు.
రవీంద్రుని మతం మానవమతం అని ఇదివరకే చెప్పుకొన్నాం. ఆయన రచనలలోనూ ఇది వ్యక్తమవుతుంది. మనిషికీ, మనిషికీ మధ్య తేడాలు ఉండకూడదని, మానవజాతి అంతా ఒకటేనని తెలియజెపుతాడు. ”చండాలిక” నాటకం సమాజంలో మానవుని స్థానం తెలియజేస్తుంది. ”గోరా” నవలలో కూడా గోరా తాను నిష్ఠగా పాటించే హిందూధర్మం, తాను గర్వించే హిందూధర్మం తనది కాదని తెలిసినపుడు అతని ప్రపంచం తలకిందులయింది. అప్పుడు తాను ముక్తుడైనట్లు భావిస్తాడు. ”నేను పతితుడనౌతానని భయం లేదు. ఇక నేలచూపులతో అడుగడుక్కూ పవిత్రతను కాపాడవలసిన పనిలేదు” అని అంటాడు.
ఇదే సందర్భంలో ”నేను భారతవర్షీయుడను. నాలో హిందూ, ముసల్మాన్‌, క్రిష్టియన్‌ అనే సమాజ భేదాలు లేవు. ఈనాడు భరతవర్షంలో ఉన్న అన్ని జాతులూ నావే. అందరి ఆహారమూ నాదే,” అని అంటాడు.
రవీంద్రనాథ్‌ ఠాగూరు జీవితాన్ని స్వీకరించాడు. అవగతం చేసుకొన్నాడు. కృతజ్ఞత తెలిపాడు. సందేహము, నిరాశ, పోరాటం లేవు. ఆయన వ్రాసిన కథలు నిజజీవితంలో ఎదురయ్యే వివిధ వ్యాపకాలున్న వ్యక్తుల గురించి. కథలు వ్రాయటానికి తనకు స్ఫూర్తి ఎలా కలిగిందో ఒక పద్యంలో పేర్కొంటారు.
”సాధారణ జీవితాల గురించి, వారి చిన్న చిన్న దుఃఖాల గురించి, చిన్న విషయాల గురించి కథలు వ్రాయాలనే సంకల్పం కలిగింది. అనేకమైన జ్ఞాపకాల నుండి కొన్ని కన్నీటి చుక్కల గురించి వ్రాశాను.
ఆసక్తికరమైన వర్ణనలు, సంఘటనలు లేవు. నీతిబోధకమూ కాదు. వేదాంతమూ లేదు. కథ చివరకు వచ్చేసరికి ఏ ముగింపూ లేదని కొందరు నిరాశ చెందవచ్చు.
నిర్లక్ష్యం చేసిన, తిరస్కరించిన, ప్రయోజనంలేని జీవితాలను నాచుట్టూ చేర్చుకొని మరచిన విషయాల వర్షాన్ని కురిపిస్తాను.”
ఠాగూరు కథలలో అస్పష్టమైన విషాదరాగం వినవస్తుంది. జీవితాన్ని లోతుగా అర్థం చేసుకొన్నందున కలిగే భావం కనిపిస్తుంది.
ఠాగూరు సృష్టించిన పిల్లల ప్రపంచం అతిరమణీయం. పిల్లలను గౌరవించని సమాజం సమాజమే కాదని అతను భావిస్తారు. పిల్లల ప్రపంచంలో ప్రేమ, అమాయకత్వం ఎలా నిండి ఉంటాయో తెలియజేస్తాడు. ”ది క్రెసెంట్‌మూన్‌”లోని ‘పోస్ట్‌మేన్‌’ కవితలో ఒక భాగం చూడండి.
”పోస్టుమేన్‌ ఉత్తరాలు చాలా తెచ్చాడు
ఊళ్ళో అందరికీ పంచిపెట్టాడు
నాన్నారి ఉత్తరం దాచుకొన్నాడా
పోస్ట్‌మేన్‌ చాలా చెడ్డవాడమ్మా
అయినా నీకు దిగులెందుకమ్మా
కలం, కాగితం తెప్పించవమ్మా
నాన్నారి ఉత్తరం నేనే వ్రాస్తాను
గీత మీదే గీత గురుతుగా వ్రాస్తాను
ఉత్తరం స్వయముగా తీసికొస్తాను
చదవటంలో నీకు సాయపడుతాడు
పోస్టుమేనును నేను నమ్మలేనమ్మా
నా మంచి ఉత్తరం నీకివ్వడమ్మా”
1960లో జవహర్‌లాల్‌ నెహ్రూ సాహిత్య అకాడమీకి ప్రెసిడెంటుగా ఉన్నప్పుడు డాక్టర్‌ సుకుమార్‌సేన్‌ వ్రాసిన ”బెంగాలీ సాహిత్య చరిత్ర” అనే పుస్తకానికి ముందుమాట వ్రాశారు. అందులో రవీంద్రనాథ్‌ ఠాగూరు గురించి వ్రాస్తూ ఇలా అంటారు.
”నా తరంవారు ఆయన అద్భుతమైన వ్యక్తిత్వ ప్రభావంతో పెరిగి పెద్దవారయ్యారు. తెలిసో, తెలియకో ఆయన ప్రభావానికి లోనయ్యారు. ప్రాచీనకాలపు భారతదేశంలోని ఋషిలాగా పూర్వికుల జ్ఞానాన్ని పదిలపరచుకొని, నేటి సమస్యలతో వ్యవహరిస్తూ, భవిష్యత్తు వైపు చూస్తున్నాడు.”
అంత గొప్పవాడయినా రవీంద్రనాథ్‌ ఊహాలోకాల్లో జీవించలేదు. జీవితాన్ని స్వీకరించాడు. దానిని పూర్తిగా జీవించాడు. ఒక విధంగా చూస్తే ఆయన కార్యకలాపాలన్నీ ఏదో విధంగా జీవితానికి సంబంధించినవే.
విశ్వకవి, విశ్వమానవుడు, విశ్వప్రేమికుడు అయిన రవీంద్రనాథ్‌ ఠాగూరు మానవులను ప్రేమించాడు. మానవత్వాన్ని ఆరాధించాడు. అందుకే భూమికి పుత్రుడు, స్వర్గానికి వారసుడు అయ్యాడు.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో