స్త్రీలు రచించిన నాటికలు – పరిశీలన

డా|| వి. త్రివేణి
(1930-40 మధ్యకాలంలో గృహలక్ష్మి పత్రికలో ప్రచురింపబడిన నాటికల వరకు పరిమితం)సంస్కృతాంధ్ర సాహిత్యాలలో నాటక ప్రక్రియకు ఉత్కృష్టమైన స్థానం ఉంది. ”కావ్యేషు నాటకం రమ్యం”, ”నాటకాంతం హి సాహిత్యమ్‌”, ”నాటకాంతమ్‌ హి కవిత్వమ్‌” అని సంస్కృత పండితులు సంబోధించారు. తెలుగు నాటక రచనా కాలాన్ని నాటక సాహిత్యాన్ని రెండు శాఖలుగా విభజించారు. 1) తెలుగు సాహిత్యం ఆరంభం అయినప్పటి నుంచి క్రీ.శ. 1860 వరకు మొదటిదశ. దీనిని యక్షగాన వీధి నాటక కాలంగా పేర్కొనవచ్చు. 2) క్రీ.శ. 1860 నుంచి క్రీ.శ. 1960 వరకు రెండవ దశ. దీనిని ఆధునిక నాటక రచనా కాలంగా పేర్కొనవచ్చు. తెలుగు నాటక రచన, దాని వికాస ప్రదర్శనలు విదేశీయులగు పార్శీ పాశ్చాత్యుల నాటక రంగ ప్రభావం చేత వృద్ధి పొందాయి.
ఆంగ్లేయులు భారతదేశంలోని కలకత్తా, బొంబాయి, మద్రాసు మొదలగు ముఖ్యపట్టణాలలో ఆంగ్ల నాటకాల ప్రదర్శనను ఆరంభించారు. ఇలాంటి ప్రదర్శనలకు విద్యావంతులు, సంపన్నులు, జమీందారులు, రాజులు ఆహ్వానింపబడేవారు. వీరు ఆంగ్ల నాటకాలచే ఆకర్షితులై భారతీయ నాటకరంగాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నించారు.
క్రీ.శ. 1860లో ”మంజరీ మధుకరీయము” అనే ప్రకరణం స్వతంత్రంగా రచించిన శ్రీ కోరాడ రామచంద్రశాస్త్రి గారు తెలుగు నాటక రచన చేసినవారిలో ప్రథములు. ఆ తర్వాత తెలుగులో అనువాద నాటకాలు, పౌరాణిక నాటకాలు, చారిత్రక నాటకాలు, సాంఘిక నాటకాలు కాలానుగుణంగా రచించబడ్డాయి. వీటితోపాటు నాటిక, ఏకాంకిక, ప్రహసనాలు ఇంచుమించుగా కొన్ని నాటక లక్షణాలకు సమాంతరంగా రచింపబడ్డాయి.
నాటిక, ఏకాంకిక, ప్రహసనాలను విమర్శకులు, ప్రేక్షకులు నాటికలుగానే పరిగణిస్తారు. ”నాటికా రచనకు ప్రకరణము నాలుగు విధాలుగా కలుగవచ్చును. విశిష్టమైన సన్నివేశము లేదా కథ, విలక్షణమైన పాత్ర, క్లిష్టమైన సమస్య, ఉత్తేజకమైన వాతావరణము, సన్నివేశము ప్రేరకమైనచో తదుచితమైన పాత్ర సృష్టి జరుగును లేదా సందేశమొసంగుట జరుగును. పై నాలుగింటిలో ఏది ప్రేరకమైనను వస్తువునందు నిబిడత్వము, రచనలో బిగి, కథనంలో ఉత్సుకత ఉన్నప్పుడే అది ఉత్తమ రచన కాగలదు” (పి.యస్‌.ఆర్‌. అప్పారావు – తెలుగు నాటక వికాసము)
సంస్కృతంలో దశ రూపకాలతో పాటుగా ఉపరూపకాలను కూడా పేర్కొనడం జరిగింది. నాటిక, ప్రకరణం, భాణిక, హాసిక, వ్యాయోగిని, డిమిక వంటి ఉపరూపకాలు దేశి లక్షణాలతో ప్రదర్శింపబడేవి. కాని సంస్కృత నాటిక లక్షణాలను, ఆధునిక తెలుగు నాటిక లక్షణాలకు కొంత భిన్నమైన సామ్యం కనిపిస్తుంది.
నాటికలలో సాధారణంగా రెండు లేదా మూడు అంకాలుంటాయి. పెద్ద నాటకాలకు ఎక్కువ సమయం పడుతుంది. నాటికల ప్రదర్శనకు తక్కువ వ్యవధి అవసరం అవుతుంది. నవలకు, కథానికకు నిర్మాణంలో శిల్పంలో భేదం ఉన్నట్లే నాటకానికి, నాటికకు భేదం ఉంది. నాటికలో పాత్రల సంఖ్య కూడా తక్కువగా ఉంటుంది. సన్నివేశాలు, సంఘటనలు పరిమితంగా ఉంటాయి. కథ తొందరలోనే వేగం పుంజుకొని పరాకాష్ఠను చేసుకొంటుంది. ఏకాంకికలో స్థల, కాలైక్యాలు విధిగా ఉండి ఏకరంగంగా ఉండాలి. ఏకాంకికకు సంక్షిప్తత ప్రధానాంశం. వస్తు స్వీకారంలో, పాత్రోన్మీలనంలో, ఆధ్యంతాల నిర్మింతిలో, సంవాదాలలో అన్నింటిలో సంక్షిప్తతత అవసరం. ఇతివృత్తంలో ప్రాసంగికాలు ఉండవు. ఎక్కువ పాత్రలుండవు. శిల్పంలో నాటికా రచన కంటే కూడా ఏకాంకిక రచన మరింత క్లిష్టమైంది. పటిష్టమైంది. నాటికలు, ఏకాంకికలు రచించిన వారిలో విశ్వనాథకవిరాజు, పాకాల వేంకట రాజమన్నారు, భమిడిపాటి కామేశ్వరరావు, నార్ల వేంకటేశ్వరరావు, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, చింతాదీక్షితులు, గోరాశాస్త్రి, చలం, జి.వి. కృష్ణారావు, గొల్లపూడి మారుతీరావు మొదలగువారు ప్రసిద్ధులు.
నాటక సాహిత్యంలో స్త్రీ రచయిత్రులకు కూడా సముచితస్థానం ఉంది. నాటి గృహలక్ష్మీ వంటి పత్రికల్లో అనేక నాటకాలు, నాటికలు, ఏకాంక నాటకాలు వ్రాసి ప్రచురించారు. నాటకాలు వ్రాయడమే గాక వాటిపై పరిశోధనలు చేసిన నాటక సాహిత్యాన్ని మహిళా లోకానికి అత్యంత చేరువలోకి తెచ్చారు. స్త్రీల సమస్యలు నాటకరంగంలో అత్యధిక ప్రాధాన్యాన్ని సంతరించుకొన్నాయి. స్త్రీ అంశమే కేంద్ర బిందువుగా స్వీకరించి నాటక రచనా నిర్మాణం చేశారు. స్త్రీ జనాభ్యుదయం పట్ల రచయిత్రులకు ఆసక్తి పెరిగి, దానికి అనుగుణమైన నాటకాలను రచించారు. నిశితమైన పరిశీలనల ద్వారా సామాజిక పరిస్థితులకు, అవసరాలకు స్పందించి స్త్రీల కౌటుంబిక సామాజిక స్థితిగతుల గురించి ప్రచారంలోకి వస్తున్న నూతన భావజాల ప్రభావంతో స్త్రీల జీవితాన్ని ఇంతకుముందుకంటే భిన్నంగా చూడగల కొత్తచూపును అలవరచుకొని నిర్మాణాత్మకంగా రచనలు సాగించారు. స్త్రీ చైతన్యానికి, ఎదుగుదలకు అడ్డుగా ఉన్న మూఢవిశ్వాసాల పట్ల అసహనాన్ని, అసంతృప్తిని, ఆక్రోశాన్ని ప్రకటించారు. స్త్రీల వ్యక్తిత్వ వికాసానికి అడుగడుగున అవరోధంగా నిలిచే సమస్యలను తొలగించడానికి మార్గాలు అన్వేషించారు. స్త్రీకి సంకెళ్ళుగా ఉన్న సామాజిక ఆంక్షలను, కట్టుబాట్లను, సనాతన సంప్రదాయ ఛాయలను ఛేదించడానికి ప్రయత్నించారు. స్త్రీకి కలిగిన నిర్ణీత పరిధుల మధ్య మెలగవలసిన పరిస్థితిని తొలగించి విస్తృత నేపథ్యాన్ని ఏర్పరచారు. మానసిక ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, తెగువను ప్రదర్శించడానికి అనువైన పరిస్థితులను, వాతావరణాన్ని సృష్టించారు.
ఆధునిక కవిత, కథ, నవల వంటి సాహిత్య ప్రక్రియల్లో రచయిత్రులు స్త్రీ జీవితాన్ని అభివ్యక్తీకరించినంత దృఢంగా నాటక ప్రక్రియలో ఆవిష్కరించలేకపోయారు. దానికి కారణాలు అనేక రకాలుగా ఉన్నా, కొంతవరకు స్త్రీ జీవితాన్ని గూర్చిన ఆలోచన, ఆర్తి స్త్రీ నాటక రచయిత్రులలో కనిపించడం గమనించవచ్చు. ఇంతవరకు స్త్రీలు సాధించిన ప్రగతికి ఆధారమైన పరిస్థితుల నేపథ్యాన్ని గూర్చి, స్త్రీ జనాభ్యుదయం కోసం గతంలో చేసిన ప్రయత్నాల సాఫల్యాలను గూర్చి విశేషంగా నాటకాలలో తెలపడం జరిగింది.
ఈ ప్రభావం బహుశ కందుకూరి వీరేశలింగం పంతులు గారి ఉపదేశాల వల్ల కలిగి ఉండవచ్చు. స్త్రీ జనాభ్యుదయం కోసం అహర్నిశలు శ్రమించిన వీరేశలింగం స్త్రీ విద్యావశ్యకతను, స్త్రీ పునర్వివాహ ఉద్యమాన్ని, బాల్యవివాహాల నిషేధాన్ని తేవడంలో తీవ్రంగా కృషి చేశారు. 1920వ దశకం నుంచి నాటక రచనా కౌశలం రచయిత్రులలో ఏర్పడటం స్త్రీ విద్యావ్యాప్తికి, సంఘ సంస్కరణోద్దేశ్యాలకు పంతులు గారి సిద్ధాంతాలను అనుసరించడం గమనించవచ్చు. నాటి గృహలక్ష్మీ పత్రికలలోనే  గంగవరపు సీతాదేవి గారు రచించిన ”ప్రతిక్రియ”, శ్రీమతి సి.వి. రమణమ్మ గారు రచించిన ”మానవ ప్రకృతి” వంటి ఏకాంక నాటకాలు,  మరువూరు వేంకట సుబ్బమ్మ గారి ”మాలసుబ్బి బాప్టీజము”,  నాయిని హనుమాయమ్మ గారి ”సుశీల”,  పోలాప్రగడ సత్యకళాదేవి గారి ”ఏడి?-ఏమైపోయాడో!!”, ”ఆత్మసమర్పణ” వంటి నాటికలను 1930-40 సం||లలో వ్రాసి ప్రచురించారు. ఇవి అత్యంత ఆదరణను పొందాయి.
ముందుగా గంగవరపు సీతాదేవి గారు రచించిన ”ప్రతిక్రియ” నాటికను పరిశీలిద్దాం. ఇది సెప్టెంబర్‌ 1933లో గృహలక్ష్మీ పత్రికలో ప్రచురించబడింది. నాలుగు పాత్రలు గల ఈ నాటకంలో రంగారావు, మీనాక్షిలు భార్యాభర్తలు, వీరి పిల్లలు శ్రీనివాసరావు, భానుమతి. ఈ నాటకంలో స్త్రీ పురుషుల మధ్య అసమానతలు, తెలివితేటలలో తేడాలు మొదలైన విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మహిళా మండలుల ప్రసక్తి కూడా ఉంది. ఇంటి బాధ్యత, ఇతర సదుపాయాల విషయంలో స్త్రీలు ప్రముఖమైన పాత్ర వహిస్తారనే విషయం తెలుస్తుంది. భార్యాభర్తల మధ్య సంభాషణలో అన్ని విషయాలలో స్త్రీలు తెలివితేటలు గలవారని సహనం, సమయస్ఫూర్తి, ప్రేమ వంటి విషయాల్లో స్త్రీలు అత్యధిక సామర్థ్యాలను చూపుతారని నాటక రచయిత్రి తెలియజేశారు. పిల్లల ఆలనాపాలనా విషయంలో, వారికి కావలసిన అవసరాలను తీర్చడంలో స్త్రీలు మాత్రమే ముఖ్యభూమికను వహిస్తారని తెలుస్తుంది. ఇన్ని బాధ్యతలు మోస్తున్నా, పురుషాహంకారాన్ని స్త్రీ మౌనంగా భరిస్తూనే ఉందని శ్రీమతి గంగవరపు సీతాకుమారి ఆనాడే తెలిపారు. ఈ నాటకంలో పిల్లలు చేసిన ఒక అల్లరి పనికి మీనాక్షిపై రంగారావు నిప్పులు చెరగడం, పిల్లలను పెంచడం రాదని, వంట చేయడం రాదని దూషించడం మొదలైనవి పురుషులలోని క్రూర స్వభావ వైచిత్రిని తెలుపుతాయి. మొదట రంగారావు తెలివితేటలు మాసొత్తేనని, స్త్రీలకు కేవలం చీరలు, సొమ్ములపైనే ఆకర్షణ ఎక్కువని వాదించినా, చివరికి పురుషులపై స్త్రీలు దయ చూపకపోతే అది ”సానపట్టిన వజ్రమే” అవుతుందని అంటాడు. అంతటితో నాటకం సుఖాంతం అవుతుంది. మూడు రంగాలలో  గంగవరపు సీతాకుమారి రచించిన ఈ నాటకంలో స్థల, కాలైక్యాలలో సంయమనం పాటించడం జరిగింది. మొదటి రంగస్థలం సౌధాంతర్భాగ మందలి గది, రెండవ రంగస్థలం సాయంసమయంలో సౌధ బహిర్భాగము, మూడవ రంగస్థలం భోజనాల సావడి వంటి స్థల కాలాదులతో ప్రధానాంశాన్ని సంక్షిప్తం చేయడం జరిగింది. ఈ నాటకంలో రచయిత్రి వ్యవహారిక భాషాశైలిని అనుసరించారు. సంభాషణలు క్లిష్టంగా, దీర్ఘంగా లేకుండా చాలా చిన్న చిన్న వాక్యాలతో సాగించారు.
”మానవ ప్రకృతి” అనే ఏకాంకిక నాటకాన్ని  సి.వి. రమణమ్మ గారు డిశంబర్‌ 1937లో గృహలక్ష్మీ పత్రికలో ప్రచురించారు. ఈ నాటకంలో మూడు రంగాలు ఉన్నాయి. నాటకారంభంలో రావుగారి  యిల్లు వర్ణింపబడింది. నాటకానికి సంబంధించిన స్థలం, సమయం, సందర్భం మొదలైన అంశాల్లో నాటి నాటిక రచయిత్రులు ఎలాంటి మెలకువలు పాటించారో ఈ నాటకారంభాన్ని పరిశీలిస్తే తెలుస్తుంది. ఈ నాటకం మొత్తం సంఘ సంస్కరణోద్దేశం దృష్ట్యా కథానిర్మాణం జరిగినట్లుగా తెలుస్తుంది. రావుగారి ఇంట్లో గుమ్మానికెదురుగా ఉన్న గోడకు తగిలించిన రాజారామమోహనరాయ్‌, కేశవచంద్రసేన్‌, వీరేశలింగం పంతులు ఫోటోలను బట్టి భవిష్యత్‌ నాటకదర్శనం కనిపిస్తుంది. నాటక రచనాకాలం నాటి సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతులన్నింటిని ఈ చిన్న నాటకం తెలియజేస్తుంది. ఆనాడు ఉన్నతోద్యోగుల నెలసరి జీతం 200 రూ||లు ఉన్నట్లుగా తెలుస్తుంది. నాటక రచయిత్రి  సి.వి. రమణమ్మ గారు రావుగారి మణి నటనలోనూ, సంస్కరణాంశాలను ప్రవేశ పెట్టారు. రావు, మణిల సంభాషణల్లో నానీ స్వభావ లక్షణాలను వెల్లడించారు.
మణి మాట్లాడుతూ నానీని రావుగారికి పరబ్రహ్మ స్వరూపులుగా పరిచయం చేస్తుంది. ఈ నాటకంలో రచయిత్రి సంస్కరణవాదాన్నే గాక ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. రావు గారు బ్రహ్మసమాజ సిద్ధాంతాలను అనుసరించేవారైతే నానీ అద్వైత సిద్ధాంత మార్గాలను అనుసరించేవారుగా రచయిత్రి ప్రతిపాదించారు. నాటికాలంలో బ్రహ్మసమాజం ప్రభావం అధికంగా ఉందని, అంతటి ప్రభావవంతపు బ్రహ్మమతంలో కూడా పరబ్రహ్మను గూర్చిన జ్ఞానం అర్థరహితమైందని నానీ మాటల్లో తెలుస్తుంది. బ్రహ్మమతంలో పరబ్రహ్మను ఆదిమధ్యాంతరహితుడని, ప్రేమమయుడని, విశ్వమయుడని మానవులను అల్పులుగా, జీవాత్మ పరమాత్మలకు మధ్య అవాంతరాలు, సుదీర్ఘమైన అవధులు ఉన్నట్లుగా నానీ వాదంలో రచయిత్రి తెలిపారు. అదే విధంగా మణి పాత్రలో విశ్వగర్భుడైన పరమాత్మలోనే ఈ ప్రపంచం అంతా ఉందని, ఈ ప్రపంచంలో పరమాత్ముడు లేడని, ఈ చిన్నదైన ప్రపంచం అసంపూర్ణమైందని, దీని ద్వారా సంపూర్ణత్వాన్ని గ్రహించడానికి ప్రేమబంధాన్ని అర్థం చేసుకొని, ప్రేమమయుడైన పరమాత్ముడి స్వయంపరిపూర్ణాన్ని సదా జ్ఞాపకం తెచ్చుకోవాలని తెలిపారు. శంకర మతావలంబికులు నిర్గుణోపాసకులని, ఆత్మ పరమాత్మల భేదాన్ని ఛేదిస్తారని, ఆత్మాభివృద్ధికి పాటుపడుతారని, మానవ ప్రకృతికి నిరీశ్వరవాదమే అనువైందని నానీ అన్న మాటలకు అనుభవం విజ్ఞానం అమితంగా గల మణి ఆత్మ పరమాత్మలకు భేదం లేనప్పుడు ఈ జ్ఞాన సముపార్జన, ఈ ఛేదనా ప్రయత్నం శుష్కప్రయాస అని వాదించారు. దీని ద్వారా కుల కల్మషాలు పెంచుకోవడం, అమర్యాద ప్రవర్తనలకు దిగడం, చాలా హేయంగా ఉందని, భగవంతుని విషయంలో యుద్ధం చేయవలసిన పని లేదని, ఈశ్వరుడు అనే తలంపుతో తలలు పగులగొట్టుకోవడం భావ్యం కాదని, అయినా ఒకే దారిలో పోవడం మానవ ప్రకృతికి విరుద్ధమైందని, మన ధర్మం, మన విధి మనం నెరవేర్చాలని, ప్రళయానికి వేరు వేరు దార్లైతే, ప్రపంచానికి ఒక్కటే దాని అని, మనం చేయవలసింది కేవలం ప్రయత్నమేనని ఉపదేశిస్తుంది. అటు బ్రహ్మసమాజ మతావలంబికుల్లో, ఇటు నిర్గుణోపాసకుల్లో ఉన్న వైషమ్యాన్ని నాటక రచయిత్రి మణి పాత్ర ద్వారా ఖండించారు.
ఆదర్శాల పేరిట, సంస్కరణల పేరిట సమాజంలో పెద్ద మనుషులుగా చెలామణి అవుతున్న వారు తమ విషయానికి వచ్చే వరకు స్వార్థం పూనడం ఈ నాటకంలో కనిపిస్తుంది. రావుగారు తన కూతురును ఇన్‌స్పెక్టర్‌ శ్యాంకు ఇచ్చి వివాహం చేయదలిచినప్పుడు, పెళ్ళిచూపుల సమయంలో శ్యాం స్త్రీ స్వాతంత్య్రంపై మాట్లాడిన అసభ్య మాటలకు, స్త్రీ స్వాతంత్య్రంపై ఆయనకు ఉన్న చులకన భావానికి వ్యతిరేకంగా మణి పాత్రలో రచయిత్రి ఈ క్రింది విధంగా పలికిస్తుంది.
”ఇన్‌స్పెక్టర్‌ గారూ, క్షమించండి. మీ బోటి మగవారితో మాట్లాడవలసి వచ్చినందుకు నేనూ చాలా చింతిస్తున్నాను. మీకు స్త్రీ అంటే ఉన్న నీచోద్దేశ్యాన్ని పటాపంచలు చెయ్యాలనే సంకల్పంతోనే నేనీ నాలుగు ముక్కలు చెప్పాల్సి వచ్చింది. మీ ఉద్దేశ్యంలో స్త్రీ అంటే దాసి, బానిస, వంటకత్తె… ఆమె బుద్ధి ప్రళయాంతకము. కాని, యికనైనా తెలుసుకోండి మీరు పురుషుని సౌఖ్యార్థము సృజింపబడిన విలాసవస్తువుగ… దాస్య పరికరముగ… పరిగణిస్తూ ఉన్న ఆ వస్తువులో ఒక జీవం ఉందని… అభివృద్ధికాదగ్గ ఆత్మ ఒకటుందని… దీని కారణంగానే స్త్రీ ఆది భవిష్యజ్జాతి నిర్మాత్రి, ఉత్తేజకారిణి… దేవి అవుతూ ఉందని. స్త్రీ నడవడి గానీ, ప్రవర్తన గానీ, భావాలు గానీ, జీవితోద్దేశం గాని తెలిసికోకుండా వివాహమాడడానికి వచ్చిన మీ మేధస్సును ఏమని కొనియాడాలి! (గృహలక్ష్మి పత్రిక – పు.773)
ఈ నాటకాంతంలో రచయిత్రి మణి సంభాషణలో ఈ ప్రపంచంలో జరిగే అనర్థాలన్నింటికీ కారణం విచక్షణా జ్ఞానం లేకపోవడమేననే విషయాన్ని తెలియజేశారు. పూర్తిగా వ్యవహారిక శైలిలో వ్రాసిన ఈ నాటకంలో మణి చాలా పరిణతి చెందిన పాత్రగా పోషింపబడింది. ఆధ్యాత్మిక, సంస్కరణ భావజాలం వర్ణింపబడింది. స్త్రీ స్వేచ్ఛ కాంక్షింపబడింది.
నురువూరు వేంకట సుబ్బమ్మ గారు ”మాలసుబ్బి బాప్టీజము” అనే నాటికను 1930, అక్టోబర్‌ నెలలో రచించి ప్రచురించారు. హిందూ సమాజంలో ఉన్న కులమతాల వైషమ్యాలను, వాటి ప్రభావంతో ఉన్నత వర్గానికి చెందినవారు తక్కువ కుల వర్గీయులపై ప్రదర్శించే ఆధిపత్యాన్ని, ఈ దాటిని తట్టుకోలేక దళితులు బాప్టీజం స్వీకరించే విధానాన్ని రచయిత్రి ఈ నాటికలో వివరించారు. ఈ నాటికలో మూడు రంగాలున్నాయి. మూడు పాత్రలున్నాయి. రామాబాయమ్మ ఛాందస భావాలు కలిగి ఉండి అగ్రవర్ణ వర్గానికి చెందిన మహిళగా కనిపిస్తుంది. సుబ్బి దళితవర్గానికి చెందిన స్త్రీ, నాటి సామాజిక అవరోధాలను అధిగమించడానికి క్రిష్టియనుగా మారుతుంది. వారి సహకారంతో డాక్టరుగా ఉన్నత చదువులు చదివి సమాజంలో మంచి స్థానంలో ఉంటుంది. ఝాన్సీ మంచి సంస్కరణ భావాలు కలిగిన మహిళ. రామాబాయమ్మ కులం పేరుతో సుబ్బిని దూషిస్తే ఝాన్సీ కల్పించుకొని కులమతాల పట్టింపులను విడిచిపెట్టాలని, మానవ నడవడికను మార్చుకోవాలని ఉపదేశిస్తుంది. నాటి మత మార్పిడులు ఏ విధంగా జరిగాయో, ఏ పరిస్థితులు కల్పించబడ్డాయో సుబ్బి తన అంతరంగంలో తలుచుకొన్న మాటలను క్రింది విధంగా గమనించవచ్చు.
”సుబ్బి – (తనలో) రేపు ఆదివారము బాప్టీజమిప్పించెదమని మిరియమ్మగారనుచున్నారు. క్రీస్తుమతమునందు నాకంత నమ్మకము లేదు కాని పొట్ట కూటికై చేరవలసి వచ్చుచున్నది. ఆనాడు రామాబాయమ్మ గారన్న మాటలు నా హృదయమును ములుకుల వలె నాటుకొని ఈ తుచ్ఛజన్మ మేలవచ్చినదా అని చింతించుతూ ఈ దారిన వెళ్ళుతున్న దేవుడంపిన దూతవలె నా పాలిటికి ఈ మిస్సమ్మ అగపడి పాఠశాలలు తెరచిన చేర్పించెదనని చెప్పినది. ఆవల డాక్టరు పరీక్షకు పంపెదనని చెప్పింది. దేవుని కటాక్షము వల్ల ఐదు సంవత్సరములు గడచి గట్టెక్కిన అదృష్టవంతురాలని! మా బోటి దీనులకు పరోపకారము చేయుటకంటే యింకేమి కావలెను యీ మిషనరీలకు” (గృహలక్ష్మీ-618)
చివరకు రచయిత్రి ఛాందస భావాలను వదిలి హిందూ మతోద్ధారణకు కృషి చేయాలని సూచించారు.
ఆగష్టు, సెప్టెంబర్‌ 1931లో  నాయిని హనుమాయమ్మ గారు వ్రాసిన ”సుశీల” నాటిక గృహలక్ష్మీ పత్రికలో ప్రచురించబడింది. ఈ నాటికలో వాసుదేవరావుగారి రెండో భార్య సుశీల. తను రెండో భార్య అయినా తన కుమారుడి కంటే సవితి కుమారుడైన ప్రభాకరుడిని ఎక్కువ ప్రేమానురాగాలతో పోషిస్తుంది, ఉత్తమ గృహిణిగా, ఉన్నతమైన భావాలు కలిగిన మహిళగా, అత్తగారిని ఆదరభావంతో చూసే కోడలిగా రచయిత్రి సుశీల పాత్రను తీర్చిదిద్దారు.
1933 ఆగష్టు, నవంబర్‌ నెలలో పోలాప్రెగడ సత్యకళాదేవిగారు ”ఆత్మసమర్పణ”, ”ఏడీ? – ఏమైపోయాడో!!” అనే నాటికలు వ్రాసి ప్రచురించారు. ”ఆత్మసమర్పణ నాటికలో రామారావు ఆత్మార్పణం కనిపిస్తుంది. గాంధీ గారి ప్రభావంతో జాతీయోద్యమంలో పాల్గొని సంఘసేవా కార్యక్రమాలను చక్కగా నిర్వహించడం, చివరికి ఆయన ఆత్మార్పణంతో కుటుంబమంతా వీధి పాలుకావడం వంటివి ప్రేక్షకులకు గుండె తడిని కలిగిస్తాయి. రామారావు గారి సంస్కరణ నేపథ్యం, సమాజాభివృద్ధికి చేసిన కృషి వంటిది నేటి యువతకు ఆదర్శప్రాయమైనవిగా భావించవచ్చు. ”ఏడీ?-ఏమైపోయాడో!!” నాటికలో సరోజనీతో మోహనుడు, విజయుడు జరిపిన సంభాషణలో నాటికాలంలో యువత ఆలోచనలు, భవిష్యత్తుపై ఆశలు, విద్యావిధానం, సంస్కరణలు, తల్లిదండ్రులపై పిల్లలు చూపించవలసిన బాధ్యత వంటి అంశాలు చోటుచేసుకున్నాయి. రచయిత్రి  పోలాప్రెగడ సత్యకళాదేవి గారి శైలి సరళంగా, భాష వ్యావహారిక రూపంగా దర్శనమిస్తాయి. పాత్రలు అత్యంత సహజంగా పోషింపబడ్డాయి.
గృహలక్ష్మిలో ప్రచురించబడిన నాటికలే గాక 1980 దశకంలో అత్తిలి పద్మావతి గారు ఊరేగింపు అనే నాటికను, సంధ్యా ఛాయ అనే సాంఘిక నాటకాన్ని రచించారు. స్త్రీలు రచించిన సాంఘిక నాటకాల్లో ”సంధ్యా ఛాయ” నాటకం మొదటిది. ”క్విట్‌ ఇండియా” అనే నాటకం సుమ, ”వారం వారం” అనే నాటిక పావని, ”సంప్రదాయమా నీకిది న్యాయమా?” అనే నాటిక నాగశ్రీ గారలు రచించి తెలుగు నాటక సాహిత్యంలో సుస్థిర స్థానాన్ని పొందారు. అదే విధంగా నాటక సాహిత్యంపై పరిశోధనలు చేసిన మహిళలు – డా|| కాళ్ళకూరి అన్నపూర్ణమ్మ గారు ”భారత నాటకములు” అనే సిద్ధాంత గ్రంథాన్ని, డా|| జయప్రభ గారు ”నాలుగో గోడ” అనే సిద్ధాంత గ్రంథాన్ని ప్రచురించారు. శ్రీమతి కాంచనపల్లి కనకమ్మ గారు ”అభిజ్ఞాన శాకుంతలము” అనే సంస్కృత నాటకాన్ని ఆంధ్రీకరించారు. ఈ విధంగా ఆధునిక తెలుగు నాటక సాహిత్యంలో స్త్రీలు కూడా తమవంతు బాధ్యతను నిర్వహిస్తూ నాటకాలు, ఏకాంక నాటకాలు, నాటికలు రచించిన విశేష ఆదరణను పొందారనడంలో అతిశయోక్తి లేదు.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

One Response to స్త్రీలు రచించిన నాటికలు – పరిశీలన

  1. కపిల రాంకుమార్ says:

    ఆర్టికల్ బావుంది. అయితే 1960 నుండి 2010 దాదాపు ఇప్పటి వరకు మహిళా నాటక రచయిత్రుల గురుంచి కూడ సమాచారం అందిస్తే బావుండునేమొ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో