ఎడారి ఓడ కథ

కొండేపూడి నిర్మల
రెండేళ్ల క్రితం వరంగల్‌లో వున్నప్పుడు హెచ్‌.ఐ.వి. ప్రాజెక్టు తాలూకు డాక్యుమెంట్స్‌ తిరగేస్తుంటే, ఆసక్తికరమైన కథ ఒకటి దొరికింది. అదేమిటంటే,
ఒక రిపోర్టరు తన ఎడిటరు సూచన మేరకు చేపలు పట్టే బెస్తవాళ్ల జీవితం గురించి రాయడానికి బయల్దేరుతుందిట. సముద్రంలో పడవల వాళ్ళెవరూ ఇంకా ఇంటికి తిరిగొస్తూ కనబడరు. ఒడ్డున సముద్ర కెరటాల మీద సూర్యబింబం మాత్రం ఈతలు కొడుతూ కనిపిస్తుంది. మన రిపోర్టరు కెమేరా ఎక్కుపెట్టి కావలసినన్ని ఫోటోలు తీసుకుంటుంది. అసలు చేపలు పట్టేవాడిదేముంది సూర్యుడి కార్యక్రమాల గురించి రాయాలి గానీ అనుకుంది.
ఈలోగా పాదాల కింద కితకితలు పెడుతూ ఇసకలోంచి పీత ఒకటి బైటికొచ్చింది. ఉలిక్కిపడి కిందకి వొంగిన రిపోర్టరుకి ఒకదానివెనక ఒకటిగా అయిదారు పీతలు పారిపోతూ కనిపించాయి. ఇందులో ఏది మగ, ఏది ఆడ అని పరిశీలించడానికి ప్రయత్నించి విఫలమై, బెస్తవాడూ వద్దు, సూర్యుడూ వద్దు రాస్తే పీతల కథ రాయాలి అనుకుని నడుచుకుంటూ దగ్గరలోనే వున్న గుట్ట ఎక్కి చిరుచీకట్లో చుక్కల్ని లెక్కపెడుతూ కూర్చుంది. ఆకాశం వంక చూస్తూ పరధ్యానంలో వున్న రిపోర్టరు చేతిలోని కెమెరా జారి గుట్టకింద పడుతుంది. కెవ్వుమని అరుపూ వినిపిస్తుంది. ఎవరా అని కిందికి తొంగిచూస్తే అక్కడ చెంబు పట్టుకుని ఒకరు ప్రకృతి పిలుపుకి జవాబిస్తూ వుంటారు. చీ అని ముక్కు మూసుకుని తన కెమెరా దెబ్బకి వాడి తల గనక బద్దలయితే అప్పుడు కోర్టులో ఎలా వాదించుకోవాలా అని కాస్సేపు తీవ్రంగా ఆలోచించి, కాయితంమీద ఏదో రాస్తుంది. మర్నాడు రిపోర్టు ఏదీ అనీ అడిగిన ఎడిటరుగారి ముందు అప్రయత్నంగా రాత్రి రాసిన కాయితం పెడుతుంది.
”చెంబు పట్టుకుని వెళ్ళేటప్పుడు గుట్టమీద వున్నవాళ్లకి కనబడేలా కూచోవాలి. లేకపోతే బుర్ర పగిలిపోతుంది.” జరిగిందేమిటో అర్థంకాని ఆ ఎడిటరు గారు ఎంత జుట్టు పీక్కున్నాడో మనకి తెలీదు.
మనం ఏ పని మొదలుపెట్టామో దానిమీదే ధ్యాస పెట్టాలి గానీ వేరే విషయాలవైపు మనసు చంచలమై ఎగిరిపోకూడదని చెప్పడానికి స్కూలు పిల్లల ట్రైనింగు క్లాసులో ఈ కథ చెప్పుకోవచ్చు. కానీ చాలాసార్లు మన ఏకాగ్రత చెదరగొట్టడానికి దైహిక బాధలే గుర్తొస్తాయి. అవి మనల్ని అన్ని విధాలా లొంగదీసుకుంటాయి కూడా.
ఒకసారి రైల్లో కూచుని మీటింగులో మాట్లాడవలసింది ఆలోచిస్తూ వెడుతున్నాను. నిర్వాహకులు నాకిచ్చిన సబ్జెక్టు బాగా కొత్తది, న్యాయం చెయ్యలేనేమో అని కూడా అనుమానంగా వుంది. మధ్యలో బాత్రూంకి వెళ్ళాల్సివచ్చింది దగ్గరలో వున్న టాయ్‌లెట్‌ రోతగా వుండటంతో, పక్కనున్న పెట్టెలోకి కదిలే లింకు దాటి వెళ్ళాను. అక్కడా భీభత్సంగానే వుంది. పైగా లోపల గడియ సరిగా లేదు. అలాంటప్పుడు ఒక చెయ్యి తలుపు మీద ఆన్చి ఎవరేనా వస్తారేమోనని బెదురుగా అటే చూస్తూ పని ముగించుకోవచ్చు. లేకపోతే మూలనున్న మురికి బక్కెట్టు నిండా నీళ్లు పట్టి తలుపుకి అడ్డం పెట్టచ్చు. కానీ గౌరవనీయమైన రైల్వేశాఖవారు బక్కెట్టుని గొలుసులతో కట్టేసి, (చెంబు వుండనే వుండదు.) తలుపుని టాయ్‌లెట్‌ సీటుకి దూరంగా పెడతారు కదా… అప్పుడేం చెయ్యాలి? ఆలోచించాను. శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఆలోచనలుంటాయిట కదా. వాష్‌బేసిన్‌ దగ్గర ఎవరో మర్చిపోయిన లీటరు నీళ్ల సీసా తీసుకున్నాను ఎలాగోలా తలుపుని నొక్కి పట్టి, కింద అడ్డంగా సీసా పెట్టాను. ఆ సమయంలో అదే నేను నమ్మిన దైవం. అస్తమానూ గుళ్లనీ, భక్తుల్నీ విమర్శించి అవసరానికి ఆదుకోమంటే దేవుడు ఆదుకుంటాడా ఏమిటి? చచ్చినా ఆదుకోడు. అని మా ఆయన అదే పనిగా శపిస్తాడు కదా, కాబట్టి ఒక పెద్ద మనిషి తలుపు తీసుకుని రాబోయి (రైళ్ళల్లో జెండరు సూచించే గుర్తులుండవు. వారికి లింగవివక్ష లేదన్న మాట) లోపలున్న నేను ఫెడీమని దాన్ని వేసేసరికి తలబొప్పికట్టి కెవ్వున అరిచాడు. ఆ అరుపు వినేసరికి నా గుండె ఆగినట్టయింది. గబాల్నలేచి తప్పు చేసినట్టుగా తల వంచుకుని నా సీటులోకి వచ్చి కూచున్నాను. లోపలెవరేనా వున్నారేమో అని చూసుకోకుండా దూసుకువచ్చినందుకు, లెక్కప్రకారం ఆయన మీద నాకు కోపం రావాలి కదా, కానీ అది మరచిపోయాను. గిల్లార్చుకుపోయినట్టు అరిచిన ఆ అరుపుకి, నీళ్లసీసా అడ్డంపెట్టిందెవరు? అంటూ అరిచిన ఆయన భార్య అరుపులకి నేరం మొత్తం నాదే అయిపోయింది. ఎవర్నీ ఏమీ అనలేక ఆ రాత్రి చాలాసేపు గొణుక్కుంటూ వుండిపోయాను. నిద్ర పట్టలేదు. అంతకుముందు వరకూ కష్టపడి నేను పూసగుచ్చుకున్న ఆలోచనలన్నీ చెల్లాచెదురయ్యాయి. తెల్లారి సభలో నేను మాట్లాడవలసిన విషయంకంటే దీన్ని గురించే ఎక్కువ చెప్పాను.
ఇందాకటి కథలో బెస్తవాళ్ల మీద రిపోర్టు రాద్దామని వెళ్ళిన రిపోర్టరు దగ్గర్నించీ, సందర్భశుద్ధి లేకుండా సభలో మాట్లాడేసిన నాదాకా అన్నీ వ్యక్తిగత వైఫల్యాలుగానే మీకు కనిపించవచ్చు.
నేను చెప్పదల్చుకున్నది ఏమిటంటే, కనీస సదుపాయాలు కల్పించలేని ప్రభుత్వాలకి ఓటు వెయ్యడానికి క్యూలో నుంచున్నప్పుడల్లా భూకబ్జా, గూండా, ధనస్వామ్య, అవినీతి అభ్యర్థుల్లో ఎవరికో ఒకరికి ఓటేసి వచ్చినంత నిర్లిప్తంగా, గడియపడని, నీళ్ళులేని, ఇరుకు, మురికికూపాల్లో మలమూత్రవిసర్జన చేసి రావడానికి, ఆ క్రమంలో సిగ్గూ ఎగ్గూ వదులుకోవడానికి ఇంకా ఎన్నాళ్ళన్ని సిద్ధంగా వుండాలి…? అవి హక్కులుగా ఎప్పటికీ మారవా…? ఎన్నికలు బహిష్కరించిన గ్రామాలు వున్నాయిగానీ, చెరువుమీద అలిగి ఏదో మానేసిన గ్రామాలు వుండవు కదా… కాబట్టి మన బలహీనతలన్నీ పాలనా యంత్రాంగపు బలాలవుతాయి.
ఇంత జరుగుతున్నాగాని నాకొక పనికిమాలిన సందేహం వస్తోంది? గర్భసంచులు సామాజిక సంపదలవుతున్నప్పుడు, మూత్రసంచులు వ్యక్తిగత తిప్పలెలా అవుతాయబ్బా…? రెండూ ఒకే పొట్టలో పక్కపక్కన ఏడుస్తున్నాయి కదా…!

Share
This entry was posted in మృదంగం. Bookmark the permalink.

2 Responses to ఎడారి ఓడ కథ

  1. raani says:

    దీన్ని అద్భుతం అంటే చాలదు. దాన్ని మించిన పదం నాకు తెలీదు. అందుచేత దీన్ని నేను ఇటీవల చదివిన అత్యద్భుతమైన కథ అంటాను. కథ ప్రయోజనం ఏమిటని ఆలోచించినప్పుడు పాఠకుల్ని ఆలోచింపజేయడాన్ని మించిన పరమ ప్రయోజనం ఏముంటుంది గనక ?
    ఇందులో రైళ్ళు అధికారులూ జెండరూ మొదలైన ప్రస్తావనలు వచ్చాయి కాబట్టీ నాకు ఓ సంఘటన గుర్తొచ్చింది. ఒక సారి ఓ రైల్వే ఆఫీసుకి వెళ్ళినప్పుడు నాకూ ఇలాంటి సమస్యే వచ్చింది. టాయిలెట్ వెతుక్కుంటూ వెళ్ళాను. మామూలుగా అన్ని చోట్లా రెండే వుంటాయి. కానీ అక్కడ మూడున్నాయి. ఎడంపక్క లేడీస్ అని వుంది. కుడి పక్కన జంట్స్ అని వుంది. మధ్యన ఇంకో టాయిలెట్టుంది. దానిమీద ఆఫీసర్స్ అని వుంది.
    మన అధికార గణం గురించి ఇంత అద్భుతంగా చెప్పగలిగిన వారింకెవరున్నారు ?

  2. sivalakshmi says:

    ఇదేం రిపోర్టరబ్బా అనుకుంటూ ఉండగానే నెమ్మది గా,నేర్పుగా చివరికి పూర్తి గా తనలో లీనం చేసుకుంది “ఎడారి ఓడ కధ”. ఆలోచనలు పాలకుల పట్ల ఆగ్రహం గా మారేలా చేసింది.. రెండు సంచులు ఒకే పొట్ట లో పక్క పక్క న ఉన్నప్పటికీ”గర్భ సంచులు -సామాజిక సంపదలు , మూత్ర సంచులు వ్యక్తి గత తిప్పలు” అనడం రచయిత్రి జీవిత లోని రక రకాల పార్శ్వాల అనుభవాలను చెప్తూ మనందర్నీ ఈ సమాజం ఎలా ఉందో అలోచించమంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.