పోలవరం ప్రాజెక్టుపై ప్రజలు, పర్యావరణ రక్షణకు ప్రత్యామ్నాయ డిజైన్‌

ఎం. ధర్మారావు, చీఫ్‌ ఇంజనీర్‌ (రిటైర్డ్‌)
పోలవరం బహుళార్థక ప్రాజెక్టు వివాదాల మూలంగా మరోసారి వార్తల్లోకెక్కింది. ఒక అభివృద్ధి ప్రాజెక్టు దేశంలో ప్రజలు, నిపుణులు, రాజకీయ పార్టీలను విభజించడం దురదృష్టకర మైన విషయం. అందుకు దారితీసిన పరిస్థితులు కిందివిధంగా వున్నాయి.
ు    ప్రాజెక్టు ద్వారా ఆశిస్తున్న ఫలితాలు అందుకునేవన్నీ ఇప్పటికే బాగా అభివృద్ధి చెందిన డెల్టా ప్రాంతాలు. గిరిజనుల జీవితాల్ని పణంగా పెట్టడం ద్వారా లాభపడేదీ ఉన్నతవర్గాలకు చెందినవారే. ఈ ప్రాంతంలో ఇప్పటికే ఆధునిక సదుపాయాలు, వనరులు, నిర్మాణాలు పుష్కలంగా వున్నాయి.
ు     పోలవరం రిజర్వాయరు నిర్మాణం ద్వారా రెండులక్షల ఎకరాల సాగుభూమి, అటవీ భూమి మునిగిపోతుంది. పెరుగుతున్న జనాభాకు తగిన విధంగా వ్యవసాయభూమి అందుబాటులో లేకుండాపోవడం దేశానికి తీరని నష్టాన్ని కలిగిస్తుంది.
ు    300 కి పైగా గ్రామాలు మునకకు గురవుతాయి.
ు     రెండులక్షలకు పైగా ప్రజలు .. అందులో 65 శాతం మంది గిరిజనులు, దళితులు వారి జీవనోపాధిని కోల్పోయి నిరాశ్రయుల వుతారు.
ు    ఇప్పటికే అవిరళంగా నీటివనరులను అనుభవిస్తున్న డెల్టా ప్రాంతాలకు ఇంకా అభివృద్ధిని పంచడంవల్ల రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలు నిర్లక్ష్యానికి గురై ప్రాంతీయ విభేదాలు, అసమానతలు తలెత్తే అవకాశాలున్నాయి.
ు    ఇతర రాష్ట్రాల ప్రయోజనాల్ని కూడా ఆంధ్రప్రదేశ్‌ పొందుతుండటం కారణంగా ఇతర రాష్ట్రాలతో విభేదాలు తలెత్తే అవకాశాలున్నాయి.
ు     వన్యసంపద, వృక్షసంపద, విస్తారమైన అడవులు, మృగసంరక్షణ కేంద్రం, పలు చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాంతాలు ముంపునకు గురవుతాయి.
అణచివేతకు, నిర్లక్ష్యానికి గురవుతున్న గిరిజనుల సంక్షేమం, స్వీయపాలన కోసం రాజ్యాంగం ఇచ్చిన హామీలు నెరవేరకపోవడంవల్ల న్యాయపరమైన చిక్కులు ఎదురవుతున్నాయి. ప్రాజెక్టు డిజైన్‌ విషయమై ఇప్పటికే నిపుణులమధ్య అనేక అభ్యంతరాలున్నాయి. వరద అంచనాలు, బ్యాక్‌వాటర్‌ ప్రభావాలను ఉపగ్రహం ద్వారా తీసిన చిత్రాల ఆధారంగా పరిశీలిస్తే .. ప్రభుత్వం చెప్తున్న లెక్కలకూ, వాస్తవాలకూ ఏమాత్రం పొంతన లేదు. డిజైన్‌ విషయంలో పారదర్శకత లేనేలేదని, నష్టపోతున్నవారి వివరాల్ని కూడా వెల్లడించడం లేదని పలు ఆరోపణలున్నాయి. వాతావరణ ప్రభావ నిర్ధారణ నివేదికలు వాస్తవదూరంగా వున్నాయి; నష్టాల తగ్గింపుకు తీసుకుంటున్న చర్యలూ ఖచ్చితమైనవికావు. జనాభిప్రాయాలు కూడా వేర్వేరుగా వున్నాయి. పర్యావరణ నిపుణులు, గిరిజనులు ప్రాజెక్టును రద్దుచేయాల్సిందే అని కోరుతుండగా, ప్రాజెక్టు లబ్దిదారులు మాత్రం ప్రాజెక్టును వెంటనే నిర్మించాలని డిమాండ్‌ చేస్తున్నారు.
ప్రకృతి, పర్యావరణం, వనరుల పంపిణీలో లబ్దిదారులందరికీ సమాన వాటా ఇవ్వడం ద్వారా ప్రాజెక్టు వల్ల జరిగే నష్టాన్ని బాగా పరిమితం చేసేందుకు దేశంలో ఇప్పటికే అమలవుతున్న పలు ఆధునిక జాతీయవిధానాల్ని సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ పరిశీలించి ప్రత్యామ్నాయ ప్రాంతాలను, ప్రత్యామ్నాయ డిజైన్‌ను రూపొందించాల్సివుంది. సహజమైన అడవుల్ని పెద్దస్థాయిలో నరికివేయడం, భారీసంఖ్యలో ప్రజల్ని నిర్వాసితుల్ని చేయడం, స్థానికుల తరతరాల జీవనశైలిని విచ్ఛిన్నం చేయడాన్ని నివారిస్తూ పునరాలోచించుకోవాల్సిన కీలకమైన సందర్భం ఇది. అయితే, దురదృష్టవశాత్తూ ఈ ప్రతిపాదనలన్నీ కాగితాలమీదేే వుండిపోతున్నాయి. ప్రభుత్వం కూడా ఈ ప్రతిపాదనల్ని సీరియస్‌గా పరిశీలించడానికి, సరైనవిధంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఇష్టపడడంలేదు. ఫలితంగా సమాజంలో ఎక్కువమంది ప్రజల సంక్షేమం కోసం కొంతమంది తమ జీవితాల్ని, హక్కుల్ని పోగొట్టుకోవాల్సివస్తోంది. పరిస్థితిని క్షుణ్ణంగా అర్థం చేసుకోవడంపై ఆసక్తి లేని కారణంగా ప్రభుత్వం ప్రత్యామ్నాయ విధానాల్ని నిర్లక్ష్యం చేస్తోంది. సుప్రీంకోర్టు నియమించిన సెంట్రల్‌ ఎంపవర్డ్‌ కమిటీ తదితర నిపుణుల కమిటీల ప్రతిపాదనల ప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సివుంది.
ఈ వివాదాలన్నీ పరిష్కారం కావాలంటే … 300 గ్రామాలు మునిగిపోయి, ప్రజలు నిరాశ్రయులు కాకుండా; మరోవైపు పట్టణాలు, పంటభూములకు అవసరమైన నీటి సరఫరాకి హామీ ఇస్తూ … ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయ డిజైన్‌ను రూపొందించడం వల్ల మాత్రమే సాధ్యం.
గోదావరినదీ ప్రవాహంలో హైడ్రాలజీ సిస్టమ్‌పై ఇప్పటికే సమగ్రమైన పరిశోధనలు జరిగాయి. పోలవరం కంటే ఎత్తున వున్న దుమ్ముగూడెం ఆనకట్ట ద్వారా సీలేరు నదిపై ఇప్పటికే జలవిద్యుత్‌ పథకాలు అమలవుతున్నాయి. చిన్నస్థాయి బ్యారేజీల నిర్మాణం, కొండల్లో సొరంగాల తవ్వకం ద్వారా గోదావరి జలాలను అన్ని ప్రాంతాలకూ తరలించేందుకు అవకాశం వుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఈ ప్రత్యామ్నాయ ప్రతిపాదనలను అమలు చేయడం ద్వారా ప్రజలు, రాష్ట్రాల మధ్య వివాదాలకు ఆస్కారం వుండకపోగా, ఒక పెద్ద ప్రాంతాన్ని మునకబారినుంచి కాపాడుకోగలుగుతాం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అవసరమే లేకుండానే దాని ద్వారా ఆశిస్తున్న నీటివనరుల ఫలితాలన్నీ నిస్సందేహంగా పొందవచ్చు.
ప్రత్యామ్నాయ ప్రతిపాదనల ముఖ్యాంశాలు :
ు    దిగువ సీలేరు జలవిద్యుత్‌ కేంద్రం వద్ద సీలేరు నుంచి నీటిని మళ్ళించి సొరంగం ద్వారా ఏలేరు నదిలోకి పంపిస్తే ఎడమవైపున్న ప్రాంతాల ప్రజల సాగునీరు, మంచినీటి అవసరాలన్నీ తీరతాయి. ఈ ప్రవాహాన్ని ఉపయోగించుకుని విద్యుత్‌ ఉత్పాదన చేయగలగడం మరో ప్రయోజనం.
ు    దుమ్ముగూడెం ఆనకట్టపై గోదావరికి సమాంతరంగా ఒక కాలువను తవ్వి, కృష్ణా-గోదావరి పరీవాహక ప్రాంతాలను విభజించే కొండలమధ్యలో సొరంగాన్ని నిర్మిస్తే కుడివైపు ప్రాంతాల ప్రజల అవసరాలు తీరడంతోపాటు, కృష్ణాబ్యారేజీకి నీటిని సులభంగా తరలించవచ్చు.
ు    సోకులేరు, పాములేరు వంటి కొండల ఉపరితలాలపై బ్యాలెన్సింగ్‌ (స్టోరేజీ) రిజర్వాయర్లను నిర్మిస్తే అవి డెల్టా మరియు ఇతర ప్రాంతాలలో తాగునీటి పథకాలకు కొరత సమయాల్లో ఉపయోగ పడతాయి.
ఈ ప్రతిపాదన అందరికీ ఉభయతారకంగా వుండేలా, తూర్పు కనుమలు, ఇతర డెల్టా ప్రాంతాల్లో మునకలు నివారించి, సామాజికంగా ఎవరికీ ఇబ్బందుల్లేనివిధంగా రూపొందించడం జరిగింది. మరీ ముఖ్యంగా .. ఈ ప్రతిపాదిత డిజైన్‌ ఇప్పటికే అందుబాటులో వున్న పథకాలు, నిర్మాణంలో వున్న సాగునీటి పథకాలకు సమాంతరంగా రూపొందించింది కాబట్టి పెద్దస్థాయిలో గ్రామాల మునక, ప్రజల నిర్వాసితను నివారించి ఆధునిక మానవుడు నాగరికతా పథంలో మరింత అభివృద్ధిని సాధించేందుకు వీలవుతుంది.
ఈ నేపథ్యంలో, ప్రజలు, పర్యావరణానికి ముప్పు కలిగించే విధంగా ప్రణాళికలు తయారై, ప్రజలు తీవ్ర ప్రతిఘటనతో రద్దయిన గుజరాత్‌లోని హెరాన్‌, కేరళలోని సైలెంట్‌వ్యాలీ ప్రాజెక్టుల వివరాలను కూడా మీ పరిశీలన కోసం ఇందులో పొందుపరుస్తున్నాను. వీటి పరిశీలనల ఆధారంగానే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని రద్దు చేయాలని, ప్రత్యామ్నాయ ప్రతిపాదనల్ని అమలు చేయాలని కోరుతున్నాను.
ప్రత్యామ్నాయ డిజైన్‌ సమగ్రమైన వివరాల్ని మీ పరిశీలన కోసం జతచేయడం జరిగింది. ఈ ప్రతిపాదనను అమలు చేయాల్సిందిగా ప్రభుత్వానికి పెద్దఎత్తున సూచించడం ద్వారా మన గిరిజన సోదరుల జీవితాలు అగాధాల బారినపడకుండా, పర్యావరణాన్ని సంరక్షించు కునేందుకు మీ వంతు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
ఈ ప్రతిపాదనను సంబంధితులందరికీ సమర్పించడం సాధ్యం కాకపోవచ్చు; కానీ నాకు అవకాశం ఇస్తే, ప్రత్యామ్నాయ ప్రతిపాదనలను మరింత వివరంగా రూపొందించేందుకు నేను వాలంటరీ సేవల్ని అందించగలను.
జతపరిచినవి :
పోలవరం ప్రాజెక్టు ప్రత్యామ్నాయ డిజైన్‌కు సంబంధించిన కాన్సెప్ట్‌ నోట్‌
పరిచయం
60 సంవత్సరాల క్రితం ఆనాటి అవసరాలు, ప్రాధాన్యతలు, అభీష్టాలు, ఆర్థిక పరిస్థితుల ఆధారంగా రూపకల్పన చేసిన పోలవరం సాగునీటి ప్రాజెక్టును ఇవ్వాల్టి పరిస్థితులకు అన్వయించుకోవడం సాధ్యం కాదు. ఆనాటి ప్రధానోద్దేశ్యం ఆహారోత్పత్తి, సంక్షేమం మాత్రమే. కానీ ఈరోజు పర్యావరణం, వాతావరణం, భూమిని కోల్పోతున్న ప్రజల జీవితాలు, నష్టపరిహారం చెల్లింపు మొదలైన అనేక అంశాలు కూడా ప్రాజెక్టు నిర్మాణంలో కీలక భాగస్వామ్యం తీసుకుంటున్నాయి.
ప్రకృతి వనరుల సౌలభ్యతకు సంబంధించి దేశం ఎదుర్కొంటున్న ప్రమాదకర పరిస్థితులను ప్రస్తావించకుండా, చర్చించకుండా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుమీద చేపట్టిన ఏ చర్చా కూడా ఫలవంతం కాబోదు. అభివృద్ధిని ఇంకా వేగంగా సాధించాలన్న ఆశతో పరిగెడుతున్న ప్రస్తుత వినియోగ సంస్కృతే దేశంలో ప్రకృతి వనరుల సమతుల్యత దెబ్బతినడానికి మూలకారణం. దీన్ని పునరుద్ధరించడానికి చేస్తున్న ప్రయత్నాలు వాతావరణాన్ని, పర్యావరణాన్ని మరింత దెబ్బతీస్తూ సామాజికంగా వెనుకబడ్డ తరగతులవారిని మరింత వెనక్కి నెడుతున్నాయి. వీటికితోడు సామాజిక, రాజకీయ తారతమ్యాలూ మరొక అవరోధం.
పోలవరం ప్రాజెక్టు పేరుతో తూర్పుగోదావరి జిల్లా పోలవరం గ్రామంవద్ద గోదావరి నది మీద నిర్మించతలపెట్టిన భారీ రిజర్వాయరు కుడి, ఎడమ కాలువల ద్వారా మొత్తం 7.20 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని ఆశిస్తున్నారు. దీంతోపాటు ఎడమకాలువ ద్వారా విశాఖపట్నం, పరిసర ప్రాంతాలకు 25 టిఎంసిల నీటి సరఫరా, కుడి కాలువనుంచి కృష్ణా బ్యారేజీకి 80 టిఎంసిల నీటి తరలింపు జరుగుతుంది.
పోలవరం రిజర్వాయర్‌ నిర్మాణంవల్ల మొత్తం రెండు లక్షల ఎకరాల భూమి ముంపుకు గురికానుంది; ఇందులో 1.50 లక్షల ఎకరాలు వ్యవసాయభూమి కాగా 0.50 లక్షల ఎకరాలు అటవీభూమి. 300 గ్రామాలు మునిగిపోవడం ద్వారా రెండు లక్షలమంది ప్రజలు నిర్వాసితులవుతారు.
ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి పర్యావరణ సంరక్షణ, గిరిజనుల సొంత పాలన, పునరావాసం తదితర కీలకమైన అంశాలపై వున్న చట్టాలు, నిబంధనల్ని ఉల్లంఘిస్తూ ప్రస్తుతం ప్రాజెక్టు నిర్మాణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇంజనీరింగ్‌, ప్రకృతి, ఆర్థిక, సామాజిక, న్యాయపరమైన అంశాల్లో నిపుణుల సూచనల ఆధారంగా జాతీయస్థాయిలో రూపొందిన ప్రమాణాలను బేఖాతరు చేస్తూ ప్రాజెక్టు నిర్మాణమవుతోంది.
ప్రకృతి పూర్తిగా మనుషుల అవసరాలమేరకు సంతృప్తిపరచ లేనప్పటికీ వారి కనీస స్థాయి అవసరాల్ని తీరుస్తుందని మహాత్మాగాంధీ ఎప్పుడో చెప్పారు. ప్రజలు క్రమశిక్షణతో ప్రకృతి సమతుల్యతను కాపాడుకోకుండా, వనరుల్ని ఇష్టానుసారం ఉపయోగించుకుంటే ప్రకృతి తిరగబడితీరుతుందని హెచ్చరించారు కూడా. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల విభాగంలో పొందుపరించిన 51-ఎ నిబంధన … పౌరుల బాధ్యతలు, ప్రాథమిక హక్కుల గురించి పేర్కొంది. సామాజిక నిర్మాణం, ప్రకృతి పరిశుద్దతను కాపాడడంలో ప్రతి పౌరుడి బాధ్యతా కీలకమైనదేనని స్పష్టం చేసింది. మనం వారసత్వంగా పొందినవానికంటే ఇంకా గొప్ప ప్రపంచాన్ని మన ముందుతరాలకు అందించాల్సిన బాధ్యత మనపై వుందని అందరం గుర్తుంచుకోవాలి.
పర్యావరణాన్ని కాపాడుకుంటూ, ప్రకృతి వనరుల్ని సమర్థవంతంగా వినియోగించుకునే తరహాలో నిర్మాణమవుతున్న పోలవరం బహుళార్ధసాధక ప్రాజెక్టు (ఇందిరాసాగర్‌ ప్రాజెక్టు) సమాజంలో ఎక్కువశాతంమంది ప్రజల సంక్షేమం కోసం .. అభివృద్ధిలో వెనుకబడిన కొందరు ప్రజలు తమ జీవనోపాధిని త్యాగం చేయాల్సిన అవసరాన్ని కల్పించింది. కానీ ప్రాజెక్టువల్ల సర్వం కోల్పోతున్నవారి పునరావాసం కోసం ప్రభుత్వం ఏర్పరిచిన ఈ విధానం చాలా సాదాసీదాగా, ఒక అభివృద్ధి చెందుతున్న దేశం ఆమోదించకూడనిదిగా వుంది.
నీటిని వినియోగించుకునే అంశంలో రాష్ట్రాలు ప్రజల భూముల్ని ఆక్రమించడం, వారిని బలవంతంగా నిరాశ్రయుల్ని చేయడం వంటి పనులకు పాల్పడకూడదని జాతీయ నీటివిధానం స్పష్టంగా చెప్తోంది. భవిష్యత్‌లో ఎదురవబోయే ఇబ్బందుల్ని కూడా దృష్టిలో వుంచుకుని ఇటీవలికాలంలో జాతీయ విధానాలు, తాజా పర్యావరణ చట్టాలు .. సంప్రదాయిక పద్ధతుల స్థానే ఆధునిక విధానాల్ని అవలంబించడం, ఒకరి అభివృద్ధి కోసం మరొకరు తమ జీవనోపాధిని త్యాగం చేయాల్సిన అవసరం లేకుండా జాగ్రత్తలు తీసుకోవడాన్ని తప్పనిసరి చేశాయి.
పోలవరం ప్రాజెక్టు సమాజంలోని భిన్నవర్గాల ప్రజలమధ్య, ప్రాజెక్టులో భాగస్వాములైన రాష్ట్రాలమధ్య వివాదాలకు, ఆందోళనలకు తెరతీసి ప్రాజెక్టు నిర్మాణాన్ని రద్దుచేయాలనేంతవరకూ వెళ్ళింది.
పర్యావరణం, ప్రజల పరిరక్షణ కోసం ప్రత్యామ్నాయ విధానాలు, నిర్దేశకాల రూపకల్పన
సామ్యవాదపంథాలో సమాజాన్ని నిర్మించడం, సమాజంలోని అన్నివర్గాల ప్రజలకీ సమన్యాయం అందించడం, అభివృద్ధి ఫలాలు అందరికీ సమానంగా దక్కేలా చేయడం, ముఖ్యంగా అణచివేతకు గురైన వర్గాలవారి అభివృద్ధిని కాంక్షిస్తూ మనదేశం ఒక విలువైన రాజ్యాంగాన్ని ఏర్పాటుచేసుకుంది.
జాతీయ నీటివనరుల విధానం అమలులో అనాలోచితంగా ముందుకు వెళ్ళకుండా కొన్ని చట్టాలు చాలా స్పష్టంగా మార్గాల్ని నిర్దేశించాయి. వీటి ప్రకారం ప్రభుత్వాలు ఏ ప్రాజెక్టును చేపట్టదల్చినా అందుకు ముందస్తుగా పలు అంశాల్లో పరిశోధించి, అభివృద్ధి పేరుతో ప్రజల జీవనోపాధికి, పర్యావరణానికి నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాల్సివుంది.
జాతీయ విధానం మరియు చట్టాలు
కేంద్రప్రభుత్వం విస్పష్టంగా నిర్వచించిన తాజా జాతీయ గిరిజన విధానం ఏమని పేర్కొంటోందంటే …
ఎ) ప్రజాసంక్షేమం, అభివృద్ధి పేరుతో గిరిజనుల (షెడ్యూల్‌ తెగల) జీవనోపాధిని అడ్డుకోరాదని, 50,000 మంది కంటే ఎక్కువమంది గిరిజన ప్రజల్ని నిర్వాసితుల్ని చేసే ఎటువంటి ప్రాజెక్టునైనా చేపట్టరాదని జాతీయ గిరిజన విధానం స్పష్టంగా నిర్దేశిస్తున్నది.
బి) ”పర్యావరణ (పరిరక్షణ) చట్టం, 1986” గిరిజన ప్రజలు, పేదవారి జీవనోపాధి, పర్యావరణానికి నష్టం వాటిల్లకుండా ప్రత్యా మ్నాయ పరిష్కారాలు, ప్రతిపాదనల కోసం శాస్త్రీయంగా అధ్యయనం జరపడం తప్పనిసరని 1994, 1997, 2004 సంవత్సరాల్లో విడుదల చేసిన నోటిఫికేషన్లలో స్పష్టంగా పేర్కొంది. గతంలో చేసుకున్న ఏరకమైన ఒప్పందాలూ చెల్లవని, ప్రతి ప్రాజెక్టూ ఈ చట్టం నిర్దేశాల ప్రకారం మాత్రమే అమలుకావాలని, ఏ ప్రభుత్వమూ సమాజాల్ని, వారి జీవనోపాధిని నిరోధించజాలదని చట్టం పేర్కొంది.
పలు నిపుణుల కమిటీల ప్రతిపాదనలు, మార్గదర్శకాలు
1) ప్రొఫెసర్‌ జయతీఘోష్‌ చైర్‌పర్సన్‌గా ఏర్పాటైన రైతుసంక్షేమ కమిషన్‌ తన ప్రతిపాదనల్లో ”పెద్ద పెద్ద ప్రాజెక్టులు తీసుకుని భారీస్థాయిలో ప్రజల్ని తరలించే బదులు చిన్న చిన్న ప్రాజెక్టుల్ని చేపట్టడం ద్వారా అవే ఫలితాల్ని సాధించవచ్చు” అని పేర్కొంది. ఈ ప్రతిపాదనల్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆమోదించింది.
2)  నిర్వాసితులను సాధ్యమైనంతగా తగ్గించుకోవడం, తరలింపుల అవసరం లేకుండా లేదా సాధ్యమైనంత తక్కువ ప్రభావం వుండేలా ప్రత్యామ్నాయాల్ని రూపొందించుకోవాలని ”రీసెటిల్‌మెంట్‌ మరియు పునరావాస జాతీయ విధానం 2003”లో ప్రతిపాదించింది.
3)  ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించిన ”రీసెటిల్‌మెంట్‌ మరియు పునరావాస విధానం 2005” చెప్తున్న ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం భారీస్థాయిలో ప్రజల్ని నిర్వాసితుల్ని చేయడాన్ని సాధ్యమైనంతవరకూ తగ్గించుకోవాల్సిన అవసరాన్ని గుర్తించింది.
4)  పర్యావరణానికి సంబంధించి అధికారికంగా తీసుకోవాల్సిన 1994, 1997, 2004 సంవత్సరాల్లో విడుదలైన పర్యావరణ ప్రభావనిర్ధారణ ప్రకటనలు (ఎన్విరాన్‌మెంట్‌ ఇంపాక్ట్‌ ఎసెస్‌మెంట్‌ నోటిఫికేషన్లు) ఆయా ప్రాజెక్టుల ప్రత్యామ్నాయ ప్రతిపాదనలను క్షుణ్ణంగా పరిశీలించి, ఎంచుకున్న ప్రతిపాదనను ఎందుకు ఎంచుకోవాల్సివచ్చిందో వివరించాల్సి వుందని స్పష్టం చేశాయి.
5) నదీలోయలు, హైడల్‌ ప్రాజెక్టులకు సంబంధించిన పర్యావరణ ప్రభావ నిర్ధారణ నిర్దేశకాలు కూడా ఇదేరీతిన ప్రతిపాదిస్తూ … నష్టపోతున్నవారికి కల్పించే ప్రయోజనాలకు సంబంధించిన భిన్న ప్రతిపాదనలు (ప్రత్యామ్నాయాలు) ఇవే తరహా ప్రభావాలున్న ఇతర ప్రాజెక్టులతో సరిపోల్చుకుంటూ పరిశీలించాల్సి వుంటుంది. ప్రత్యామ్నాయ అంశాలతోపాటు ప్రతిపాదిత ప్రాజెక్టుకు సంబంధించిన భిన్న డిజైన్లను కూడా గమనించాల్సివుంటుంది.
6) సమీకృత నీటివనరుల అభివృద్ధి జాతీయ కమిషన్‌ ప్రతిపాదనల ప్రకారం ఒక భారీ ప్రాజెక్టుకు అంగీకారం తెలిపేముందు ప్రాథమిక సందేహాలన్నిటికీ జవాబు చెప్పాల్సివుంటుంది. ”ప్రకృతితో ఇంత పెద్ద స్థాయిలో జోక్యం చేసుకుంటూ దానికి సమాధానం చెప్పకుండా తప్పించుకోగలరా? ప్రాజెక్టు ఉద్దేశాలు నెరవేర్చడానికి ప్రత్యామ్నాయ మార్గాలు పూర్తిగాకానీ, లేదా కనీసస్థాయిలో కానీ లేనేలేవా?” అని సూటిగా ప్రశ్నించింది.
7) సుప్రీంకోర్టు నియమించిన సెంట్రల్‌ ఎంపవర్డ్‌ కమిటీ ప్రతిపాదనల ప్రకారం .. ముంపునకు గురయ్యే భూమి, అడవులు, నివాసాలు, ప్రజల తరలింపులను సాధ్యమైనంతవరకూ తగ్గించేందుకు ప్రత్యామ్నాయ మార్గాల కోసం తప్పనిసరిగా పరిశోధనలు జరపాల్సిందే. ప్రాజెక్టు అసలు లక్ష్యాల్ని ఏమాత్రం చేరుకున్నా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవడమే సముచితం.
కేంద్రప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై ప్రతిపాదనలు, విధాన నిర్దేశకాలను అంగీకరించాయి కాబట్టి ఇవన్నీ ఖచ్చితంగా అమలు జరిపితీరాల్సిందే. పోలవరం ప్రాజెక్టువల్ల లక్షలాదిమంది ప్రజలు ప్రత్యక్షంగా, పరోక్షంగా నష్టపోతున్నారు; తూర్పు కనుమల వాతావరణం, పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోంది. ప్రాజెక్టు పూర్తయితే ఏ పరిస్థితిలోనూ జరిగిన నష్టాన్ని పూడ్చుకోలేము కాబట్టి, ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయ డిజైన్‌ను రూపొందించేందుకు సమగ్ర అధ్యయనం జరిగితీరాల్సిందే.
ఇప్పటికే సమాజంలోని పలువర్గాలు, పొరుగు రాష్ట్రాలు ప్రాజెక్టు ప్రస్తుత డిజైన్‌ మీద అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళాయి. ఈ అంశాల్ని పరిశీలించేందుకు సుప్రీంకోర్టు ‘సెంట్రల్‌ ఎంపవర్డ్‌ కమిటీ’ని ఏర్పాటు చేసింది. ప్రజలనుంచి పెద్దసంఖ్యలో విజ్ఞప్తుల్ని అందుకున్న అనంతరం ఎంపవర్డ్‌ కమిటీ ఒక నిర్ధారణకు వచ్చి, ప్రాజెక్టు పరిశీలనను మళ్ళీ ప్రారంభించాలని, ప్రాజెక్టుకు అనుమతినిచ్చేముందు పునరాలోచించాలని ప్రతిపాదించింది.
సుప్రీంకోర్టు ఎంపవర్డ్‌ కమిటీ ప్రతిపాదనలు
సుప్రీంకోర్టు నియమించిన ఎంపవర్డ్‌ కమిటీ పోలవరం ప్రాజెక్టును పరిశీలించి, కింద పేర్కొన్న పలు కారణాలరీత్యా ప్రాజెక్టు నిర్మాణంపై పునరాలోచించుకోవాల్సిందే అని అభిప్రాయపడింది. ”ఈ ప్రాజెక్టు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఎంత కీలకమైన అవసరం అయినప్పటికీ, రెండు అతి ప్రాధాన్యమైన అంశాలకు సంతృప్తికరమైన సమాధానాల్లేవు”.
పోలవరం ప్రాజెక్టువల్ల ముంపునకు గురయ్యే తొమ్మిది మండలాల్లోని 276 గ్రామాలకు చెందిన 44,754 కుటుంబాల్లో అత్యధికశాతం మంది పేదప్రజలే. వీరిలో 6875 కుటుంబాలు షెడ్యూల్‌ కులాలకు చెందినవికాగా, 21109 కుటుంబాలు షెడ్యూల్‌ తెగలకు చెందినవి. పోచవరం సమీపంలోని ఎప్పూర్‌ గ్రామంలో నివసిస్తున్న కొండరెడ్డి ప్రజలు అనేక తరాలుగా జీవనోపాధి కోసం అడవిమీదే ఆధారపడ్డారు. వెదురు, కొన్ని అటవీ ఉత్పత్తుల ఆధారంగా జీవిస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణం తప్పనిసరైతే తాము కొండమీదికే వెళ్తాం తప్ప అడవిని వదిలిపెట్టబోమని తేల్చిచెప్పారు. అలాగే, పోలవరాన్ని వ్యతిరేకిస్తున్న రావిగూడెం, జీడిగుప్ప, విస్నూరు గ్రామాల ప్రజలు కూడా అడవి ప్రాంతంలో నివసించడానికే మొగ్గుచూపుతున్నారు.
మొత్తంగా చూస్తే అక్కడి ప్రజలెవరూ తాము వంశపారంపర్యంగా నివసిస్తున్న ప్రాంతాలనుంచి విడిపడి, తమ సాంస్కృతిక వారసత్వాన్ని పోగొట్టుకుని, కష్టాలపాలయ్యేందుకు ఏమాత్రం సిద్ధంగా లేరని అర్థమవుతోంది.
మరో ముఖ్యమైన అంశం పోలవరం ప్రాంతంలోని సహజ అడవులు, అందులోవున్న ‘పాపికొండలు వైల్డ్‌లైఫ్‌ శాంక్చువరీ’లో ఒక పెద్ద భాగాన్ని కోల్పోవడం గురించి. వృక్ష సంపద, జీవనసంపదలకు ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతంగానీ మునిగిపోతే అద్భుతమైన జీవవైవిధ్య పర్యావరణ విధానాన్ని కోల్పోయి మళ్ళీ పూడ్చుకోలేని నష్టాన్ని చవిచూస్తాం. అనేక వన్యమృగాలకు నివాసమైన ఈ ప్రాంతం వైల్డ్‌లైఫ్‌ ప్రొటెక్షన్‌ యాక్ట్‌ 1972లోని షెడ్యూల్‌-1లో పేర్కొన్న ప్రకారం వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంగా వుంది. వీటితోపాటు పలు తరహాల జీవుల ఉనికికే ప్రాజెక్టువల్ల తీవ్రభంగం వాటిల్లుతుంది.
ముంపునకు గురయ్యే అడవులు పులులకు ఆవాస కేంద్రాలుగా వున్నాయి. పలుసర్వేల్లో ఇక్కడ పులుల జాడలు కనిపించాయి. దేశంలో పులుల సంఖ్య నానాటికీ తగ్గిపోతున్నదనేది అందరికీ తెలిసిన సత్యమే. పోలవరం ప్రాజెక్టువల్ల పులుల సంఖ్య మరింత తగ్గిపోతుంది. ఈ సహజమైన అడవులు, పర్యావరణ విధానం ఏమాత్రం మార్చడానికి కానీ, కృత్రిమంగా తయారుచేయడానికి కానీ వీలుపడదు. వీటివల్ల కలిగే ప్రయోజనాలు పైకి కనిపించినా, కనిపించకపోయినా వాటిని డబ్బుతో ఏమాత్రం విలువకట్టలేం. ఈ నష్టాన్ని పూడ్చుకోవడం ఏరూపంలోనూ సాధ్యంకాదు. అడవి ప్రస్తుత విలువను లెక్కగట్టి ఏజెన్సీల ద్వారా చెల్లించే నష్టపరిహారాలు కోల్పోయే వాటి అమూల్యతతో పోలిస్తే ఏమాత్రం సరిపోలవు.
భారీస్థాయిలో సహజమైన అడవుల్ని దెబ్బతీయకుండా, అక్కడి ప్రజల జీవనవిధానాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా పునరాలోచించి, డ్యామ్‌ నిర్మాణానికి ప్రత్యామ్నాయ ప్రాంతం, డిజైన్‌ను ఎంచుకోవాల్సిన అవసరం ఎంతైనావుంది. సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ (సిడబ్ల్యుసి) ప్రాజెక్టు డిజైన్లను ఆమోదించేముందు ప్రస్తుత ప్రతిపాదనలకు వున్న ప్రత్యామ్నాయాలు, ప్రాజెక్టు సాంకేతిక, ఆర్థిక సానుకూలతలు, డ్యామ్‌ సురక్షత, ఇతర సాంకేతికాంశాలు, ప్రాజెక్టువల్ల నష్టపోతున్న ఆయకట్టు ప్రాంతాల ఖచ్చితమైన లెక్కల్ని దృష్టిలోవుంచుకుని ఒక నిర్ణయం తీసుకోవాలి.
పోలవరం ప్రాజెక్టు నేపథ్యం – సమీక్ష – పరిశీలన
గోదావరి నది తూర్పుకనుమలను దాటుకుని దిగువన డెల్టాలోకి ప్రవేశించి సముద్రంలో కలుస్తుంది. తూర్పుకనుమలు విస్తరించివున్న అన్ని ప్రాంతాలతో పోలిస్తే ఈ డెల్టా సారవంతమైన భూములతో ప్రకృతిపరంగా బాగా అభివృద్ధి చెందిన ప్రాంతమనే చెప్పాలి. పూర్తిగా అడవులతో నిండిన ఈ ప్రాంతంలో గిరిజనులు, పేదరైతులే జీవిస్తున్నారు.
ఇప్పటికే అభివృద్ధి చెందిన డెల్టా ప్రాంతంలో మరింత అభివృద్ధిని సాధించడం, 300 టిఎంసిల నీటిని సద్వినియోగం చేసుకోవడం కోసం 60 సంవత్సరాలకుముందే తూర్పుకనుమల్లోని పోలవరం గ్రామం సమీపంలో ఒక రిజర్వాయర్‌ను నిర్మించాలని ప్రతిపాదించడం జరిగింది.
గోదావరి పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న గిరిజన ప్రాంతాల్లో పలు అవసరాలకు నీటివినియోగంపై స్వాతంత్య్రానికి పూర్వమే విస్తృతమైన పరిశోధనలు జరిగాయి. భిన్నప్రాంతాలనుంచి నీటిని మళ్ళించి సముద్రమట్టానికి ఉపరితలంలో వున్న పోలవరం వద్ద కలపాలని, పోలవరం కంటే ముందు గోదావరి ఇంకా ఎత్తులో పారే దుమ్ముగూడెం వద్ద వున్న ఆనకట్ట ద్వారా శబరి, సీలేరు, సోకులేరు, పాములేరు ప్రాంతాలనుండి నీటిని మళ్ళించాలని ఊహచిత్రం గీశారు. ఈ ప్రాంతాలన్నీ బాగా ఎత్తులో వుండడంవల్ల కావల్సినంత నీటిని తూర్పుకనుమల్లో అందుబాటులోవున్న డెల్టా ప్రాంతానికి తరలించవచ్చనే నిర్ణయానికి వచ్చారు. కానీ ఉభయగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లోని తూర్పుకనుమలలో సొరంగాల ద్వారా నీటి మళ్ళింపు కోసం కాలువలు నిర్మించడం ఎలా అన్నదే ప్రధాన సమస్యగా మారింది.
అయితే, దురదృష్టవశాత్తూ ఆనాడు పొడవైన భారీ సొరంగాలు నిర్మించే సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడంవల్ల ఆ ప్రతిపాదనలు అక్కడితో ఆగిపోయాయి. అయినప్పటికీ ప్రాజెక్టు నిర్మాణం తప్పనిసరైనపక్షంలో తూర్పుకనుమలకు దిగువన పోలవరం (వి) వద్ద 150 అడుగులకంటే అత్యధిక నీటిమట్టం (ఎఫ్‌ఆర్‌ఎల్‌) వద్ద రిజర్వాయరు నిర్మించి, 130 అడుగులకంటే ఎత్తున సరఫరా కాలువలు నిర్మించి పంటపొలాలకు నీరందించవచ్చని ఆనాడు సూచించారు.
ప్రాజెక్టు వల్ల ప్రభావితమయ్యే సరిహద్దు రాష్ట్రాలమధ్య 1977 నాటి ఒప్పందం
గోదావరి నదీజలాల్ని వినియోగించుకునే విషయంలో కొన్ని రాష్ట్రాలమధ్య తీవ్ర వివాదాలు ఏర్పడిన విషయాన్ని కూడా ఈ సందర్భంలో మనం ప్రస్తావించుకోవాలి. ఈ వివాదాలవల్లనే చాలా ప్రాజెక్టులు గోదావరి నీటిసరఫరా ట్రిబ్యునల్‌ వద్ద అనుమతికి నోచుకోక ఆగిపోయాయి. ఈ నీటివాటాల వివాదాల్ని పరిష్కరించుకోవడానికి రాజకీయపరమైన మద్దతు అందడంతో 1977-78లో ఒక అవగాహన కుదిరి, గోదావరిపై సముద్రమట్టానికి 150 అడుగుల ఎత్తున పోలవరం ప్రాజెక్టును నిర్మించుకునేందుకు అంగీకరిస్తూ ఆయా రాష్ట్రాలమధ్య ఒక ఒప్పందం కుదిరింది. అయితే, ప్రాజెక్టువల్ల ప్రభావితమయ్యే రాష్ట్రాలు, ఇతర భాగస్వాములందరితో సంప్రదించి, అందరికీ సమ్మతమయ్యేలా వారితో చర్చలు జరిపిన అనంతరమే పోలవరం డిజైన్‌కు సిడబ్ల్యుసి అనుమతించాలనే ఒక నిబంధనను ఒప్పందంలో ఏర్పాటుచేసుకున్నారు.
ప్రాజెక్టువల్ల నష్టపోయే ప్రజలు, ప్రభావిత రాష్ట్రాలనుంచి బలమైన వ్యతిరేకత ఎదురుకావడంతో ఈ పథకం దశాబ్ధాలపాటు నిశ్శబ్దంలో వుండిపోయి, కేంద్రప్రభుత్వం అనుమతుల్ని నిరాకరించడానికి దారితీసింది.
ప్రాజెక్టు ప్రయోజనాలు – కీలకమైన లోపాలు
భారీస్థాయిలో పర్యావరణానికి ముప్పు కలుగుతున్నప్పటికీ, ప్రాజెక్టువల్ల కలిగే ప్రయోజనాలస్థాయి చాలా తక్కువగా వుండడంవల్ల పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తొలినుంచి గట్టి నిరసనలే వినిపిస్తున్నాయి. పోలవరం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రభుత్వం చెప్తున్నవన్నీ అబద్దాలేనని కింద పేర్కొన్న లోపాల్ని గమనిస్తే అర్థమవుతుంది.
ప్రాజెక్టు    పరివాహక ప్రాంతం (ఎకరాల్లో)
చాగల్నాడు ఎత్తిపోతల    35,000
తొర్రిగెడ్డ పంపింగ్‌ పథకం    23,000
ఏలేరు ఆయకట్టు (ఇప్పటికే వుంది)    70,000
తాడిపూడి, పుష్కరం ఎత్తిపోతల ఆయకట్టు    392,000
(186,000 + 206,000)
మొత్తం స్థిరీకరించబడిన ఆయకట్టు    520,000
పోలవరం రిజర్వాయరువల్ల కలిగే భూమి నష్టం    120,000
కాలువల తవ్వకం ద్వారా పోయే భూమి    35,000
పారిశ్రామికీకరణ, పట్టణీకరణ కోసం    30,000
185,000
ప్రతిపాదిత పోలవరం ప్రాజెక్టు ఆయకట్టు    720,000
స్థిరీకరించిన ఆయకట్టు    520,000
ప్రాజెక్టు నిర్మాణంవల్ల పోతున్న భూమి    185,000
పోలవరం ప్రాజెక్టు ద్వారా సాగులోకొచ్చే భూమి    15,000
ఎ) ఆయకట్టును ఎక్కువ చేసి చూపుతున్నారు
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంవల్ల 7.20 లక్షల ఎకరాలకు సాగునీరందుతుందన్నది ప్రతిపాదన. కానీ ప్రభుత్వం పేర్కొంటున్న ఆయకట్టు లెక్కలు సరైనవి కావు. ఇప్పటికే వున్న, నిర్మాణమవుతున్న సాగునీటి ప్రాజెక్టుల ద్వారా కలిగే ప్రయోజనాల్ని కూడా కలిపి పోలవరం వల్ల ప్రయోజనం కింద ప్రభుత్వం చూపిస్తోంది. ఈ 7,20,000 ఎకరాల్లో ఇప్పటికే ఏలేరు, తొరిగడ్డ ఎత్తిపోతల, చాగల్నాడు ఎత్తిపోతల, నాగార్జునసాగర్‌ ఎడమకాలువ, కొవ్వాడ, తాడిపూడి ఎత్తిపోతల పథకాల ద్వారా 5,20,000 ఎకరాలకు సాగునీటి ప్రయోజనం కలుగుతూనే వుంది. కేవలం తాడిపూడి, పుష్కరం ఆయకట్టు ద్వారానే 3.92 లక్షల ఎకరాలు తడుస్తున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా మరో 15000 ఎకరాల ఆయకట్టు పెరుగుతుందని అంచనావేయడం జరిగింది. కాగా ప్రాజెక్టువల్ల నష్టపోతున్నది 1,85,000 ఎకరాలు (1,20,000 ఎకరాలు పోలవరం రిజర్వాయర్‌, 35,000 ఎకరాలు కాలువల తవ్వకం, పారిశ్రామికీకరణ, పట్టణీకరణ కోసం మరో 30000 ఎకరాలు). ఎక్కువ ఆయకట్టు, అధిక లెక్కలు చూపిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికే పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. అదే ఆయకట్టును అనేక పథకాల్లో చూపిస్తుండడాన్ని కూడా మనం గమనించవచ్చు.
బి) సాధారణ వరద పరిస్థితుల్లో 36 లక్షల క్యూసెక్కుల నీటిని తట్టుకునేలా పోలవరం ప్రాజెక్టు డిజైన్‌ను తయారుచేసినప్పటికీ, ఇది 50 లక్షల క్యూసెక్కుల నీటిని తట్టుకుంటుందని చెప్తున్నారు. 36 లక్షల క్యూసెక్కుల వరద వస్తే ఆంధ్రప్రదేశ్‌లోని 276 గ్రామాలు, ఇతర రాష్ట్రాల్లోని 24 గ్రామాలు మునకకు గురవుతాయి. ఇది వెనక్కి తోసుకువచ్చే నీటి ప్రభావం మీద సైద్ధాంతిక అంచనాతో వేసిన లెక్కే కాని శాస్త్రీయ ఆధారాలతో ఖచ్చితంగా గణించింది కాదు.
కానీ రిమోట్‌ సెన్సింగ్‌ ఏజెన్సీ 2006 ఆగస్ట్‌ 7వ తేదీన తీసిన ఉపగ్రహ ఛాయాచిత్రం (25 అక్టోబర్‌ 2006న తెలుగు దినపత్రిక ‘ఈనాడు’లో ప్రచురితమైంది) ప్రకారం ముంపునకు గురయ్యే ప్రాంతం ఇంకా చాలా ఎక్కువని రుజువుచేసింది. ఆరోజుటి వరద కేవలం 28.50 లక్షల క్యూసెక్కులే వుండగా ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 369 గ్రామాలు మునకకు గురయ్యాయి. మనకకు గురయ్యే ఇది 36 లక్షల క్యూసెక్కులంటూ ప్రభుత్వం వేసిన వరద లెక్కలు తప్పని నిరూపించింది. ఆగస్ట్‌ 2006 వరదలు .. పోలవరం ప్రాజెక్టుపై ప్రభుత్వం చెప్తున్న లెక్కలు నిజం కావని నిరూపించింది.
7 ఆగస్ట్‌ 2006 నాటి వరదల్లో వెల్లడైన వాస్తవాల్ని పరిశీలిస్తే అవి మనకు మర్చిపోలేని పాఠాల్ని చెప్పిందని అర్థం చేసుకోవచ్చు. నిజంగా గరిష్టస్థాయిలో 50 లక్షల క్యూసెక్కుల వరదేకానీ వస్తే 400 గ్రామాలు, 2.50 లక్షలమంది ప్రజల మీద ఆ ప్రభావం పడుతుందని విస్పష్టంగా తెలిసిపోయింది. ఇంతకంటే ఎక్కువ వరద వస్తే డ్యామ్‌ విచ్ఛిన్నమై ఊహించలేనంత విలయం ఏర్పడుతుంది. ఇదేగనుక జరిగితే డెల్టా జిల్లాల్లోని 50 లక్షలమంది ప్రజలు, వేల కోట్ల రూపాయల ఆస్తుల నష్టం వాటిల్లే పెనుప్రమాదం వుందని సైంటిస్టులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. లక్షలాదిమంది ప్రజలను నిలువునా నష్టపరిచే ఇలాంటి విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కొనే పరిస్థితిలో మన సమాజం లేదు. ఇన్ని విషమ ప్రమాదాలున్నాయి కాబట్టే నిపుణులు తొలినుంచీ ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నారు.
సి) మేట పెద్ద సమస్య
ఇసుక మేట పేరుకుపోవడం వల్ల డ్యామ్‌ల జీవితకాలం, వినియోగాన్ని తగ్గించే సమస్యలకు గోదావరి నది పెట్టింది పేరు. రిజర్వాయర్లలోకి భారీ ఎత్తున ఇసుకమేటను చేర్చడంలో గోదావరికి పెద్ద చరిత్రే వుంది. గత యాభైఏళ్ళలో నిజాంసాగర్‌, శ్రీరామ్‌సాగర్‌ ప్రాజెక్టులు ఈ ఇసుకమేటలవల్లే 60 శాతం స్టోరేజీ సామర్థ్యాన్ని కోల్పోయాయి. ఇదే సమస్య పోలవరం ప్రాజెక్టును కూడా వెంటాడితీరుతుంది. కనుకనే పోలవరం వల్ల ఫలితం వుండదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వ్యవసాయానికి సాగునీరు, పారిశ్రామిక అవసరాలు, నివాస ప్రాంతాల కోసం నీటిని అందించేందుకు గోదావరి బేసిన్‌లో నీటిమళ్ళింపు పథకాలు మాత్రమే ఖచ్చితంగా సరిపోతాయని నిపుణులు చెప్తున్నారు.
డి) పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత ప్రతిపాదనల విపరిణామాలు
ు    ఆగస్ట్‌ 7, 2006 నాటి ఉపగ్రహచిత్రం ప్రకారం 400కి పైగా గ్రామాలు మునిగిపోతాయి; వీటిలో అత్యధికభాగం గిరిజనుల ఆవాసప్రాంతాలే.
ు    రెండు లక్షల ఎకరాల భూమిని శాశ్వతంగా కోల్పోతాం. ఇందులో లక్షన్నర ఎకరాలు పూర్తిగా పంటలు పండుతున్న భూమి.
ు    రెండులక్షలమందికి పైగా గిరిజనులు (కోయ, కొండరెడ్డి తెగలు) ఆవాసాల్ని కోల్పోతారు. వీళ్ళంతా ఇక్కడినుంచి తరలిపోవడం ద్వారా తరతరాలుగా ఈ కొండలతో మమేకమైపోయిన తమ సంస్కృతిని, గుర్తింపుల్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడడంలేదు.
ు    అటవీభూములు, పాపికొండలు వైల్డ్‌లైఫ్‌ శాంక్చువరీ మునిగి పోతాయి.
ు    ఇంతచేసీ ప్రాజెక్టువల్ల సాగునీటి ప్రయోజనం పొందేది కేవలం 15 వేల ఎకరాలే.

Share
This entry was posted in ప్రత్యేక వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో