పెళ్ళి అనబడు రాచముష్టి కీడ్ర

– కొండేపూడి నిర్మల

”మొగుడు” కాని వాడ్ని మొగుడుగా ఊహించి ఇంద్రుడివి, చంద్రుడివి అని పొగడ్డం కష్టంగా వుందక్కా….” అంది పొద్దున్న మా పిన్ని కూతురు చాటింగులో. రాజేశ్వరికి నెల్లాళ్ళ క్రితమే ఒక పెళ్ళి సంబంధం చూశారు. చూపులకి తల్లి, తమ్ముళ్ళు, దూర బంధువులుకూడా వచ్చారు. పిల్ల బావుందని వెంటనే చెప్పారు. నాన్చడం తమకు ఇష్టం వుండదన్నారు. అబ్బాయి అమ్మాయితో ఏకాంతంగా మాట్లాడాలన్నాడు. మేడ మీదికి వెళ్ళి మాట్లాడుకున్నారు. ఆ మాటలు ఇంకా కొనసాగించడం కోసం మొబైలు నంబరు అడిగి తీసుకున్నాడు. మిత్రులకి చూపించడం కోసం ఫోటో సి.డి. అడిగి పుచ్చుకున్నాడు. హమ్మయ్య! మన రాజీ ఒక ఇంటిదయిపోతోంది. అనుకుని అయిన వాళ్ళంతా ఆనందబాష్పాలు కార్చారు.

ఆ తర్వాత అబ్బాయి తల్లి రంగ ప్రవేశం చేసింది. ”పెళ్ళి ఎలా చేద్దామనుకుంటున్నారు.” అడిగింది డాంబికంగా….

”మీ ఇష్టం” అన్నారు మా వాళ్ళు వినయంగా….

కట్నం ఎలాగూ ఇవ్వలేనన్నారు కాబట్టి పెళ్ళి ఘనంగా చెయ్యాలంది. లాంఛనాలన్నీ మోతగా వుండాలంది. ఫలానా పెళ్ళిహాలు తీసుకోవాలంది. ఫలానా దుకాణంలో నగలు, బట్టలు తమ బంధువులకు నచ్చినట్టు కొనాలంది. ఫలానా ఘన మైన తిండి తమకు వద్దన్న కొద్దీ తినిపించాలంది. తిన్నది అరక్కపోతే ఆ ఫలితాలు చూపడం కోసం విశాలమైన మరుగు దొడ్లు వుండాలంది. తాము ఏ వాహనం మీద వస్తే దాని దారి బత్తెం భరించాలంది. అటు ఏడు తరాలు ఇటు ఏడుతరాలు ఈ పెళ్ళి వైభవం చూడటం కోసమే బతుకుతున్నారంది. ఇంకా మర్చిపోయినవి ఏమైనా వుంటే పెద్ద వాళ్ళని అడిగి దూర శ్రవణం ద్వారా మోత మోగిస్తానని అంది.

మా వాళ్ళకి నోరు తడారి పోయింది. లెక్కవెయ్యడానికి చేతి వేళ్ళు సరిపోక గాల్లోకి చూడ్డం మొదలు పెట్టారు. అంత డబ్బు లేదంటే ఏ ఒక్కరూ సహించరు కనక అది మా సంప్రదాయం కాదన్నారు. ఇది అచ్చి రాదన్నారు. నానా అబద్ధాలూ, మొత్తుకోళ్ళూ వీళ్ళూ కూశారు.

వాతావరణం చేపల మార్కెట్టు స్థాయికి వచ్చేసింది. నల్లగా వుండటం వల్ల డిస్కవుంటులో దొరికాడనుకున్న అబ్బాయి, సంపాదనతో సహా బోనస్గా దొరికిందనుకున్న అమ్మాయీ ఇద్దరూ దిక్కులు చూస్తూ కూచున్నారు. అప్పటి వరకూ అబ్బాయీ తల్లిలో మావాళ్ళకు నచ్చినట్టు కనిపించిన కారణాలన్నీ ఇప్పుడు నచ్చకుండా పోయాయి. పాతికేళ్ళ క్రితం తండ్రికి కట్నం తగ్గించడం కోసం ఎదురింటి కుర్రాడితో వెళ్ళిపోవడం, ఆ కుర్రాడు పదేళ్ళకే ఇంకో కుర్రమ్మనే వెళ్ళిపోవడంతో మిషను కుట్టీ,అప్పడాలు వత్తి, పిల్లలిద్దర్ని చదివించి వృద్ధిలోకి తేవడం అన్నీ కొట్టుకుపోయి కేవలం దుష్ట పాత్రధారిగా నిలబెట్టాయి.

ఈ పక్క మా పిన్ని కూడా తండ్రికి కట్నం బరువు తగ్గించడం కోసం నచ్చని వాడిని చేసుకుని మూడు దశాబ్దాలు కాపురం చేసిన అసంతృప్తితో కొడుకులకి ఘనమైన పెళ్ళిళ్ళూ చేసి, వాళ్ళెవరూ చూడకపోతే ఈ కూతురితో ఒంటరిగా వుంటోంది.

ఇద్దరు తల్లులూ ఒకే లాంటి జీవితం లోంచి వచ్చారు కనక గొడవలు వుండవని నేను భ్రమ పడ్డాను కాని అలా జరగలేదు. వాళ్ళ జీవితంలో మాటలాడటానికి దొరికిన ఈ ఒక్క సందర్భం ఒదులుకోదల్చుకోలేదు.

అబ్బాయి తల్లి అరచి, అరిచి మంచి నీళ్ళూ అడిగి పర్సులోంచి మందు గోళీ తీసి వేసుకుంది. ఆవిడ అశాంతికి గురి అయితే రక్తపోటు, మధుమేహం వస్తాయిట. అమ్మాయి తల్లి నీళ్ళు కూడా అడగలేదు. ఆవిడకి కళ్ళ నిండా నీళ్ళే. విపరీతమైన తల నొప్పితో మొహమంతా ఎర్రబడిపోయింది. అవమానం ఆవిడని దహించి వేస్తోంది. అటు ఇటు మొగవాళ్ళు ఎంతో మర్యాదగా కూచున్నారు. ఆడదానికి ఆడదే ఎంత శత్రువో చూశావా చెప్పడానికి ఆ సన్నివేశం ఉదాహరణగా వుంది.

అంతా జరిగి పది రోజులయింది. అమ్మాయికి అబ్బాయికి ముందుకెళ్ళాలో వెనక్కెళ్ళాలో తెలీడంలేదు.

”ఛీ..ఛీ.. వెధవ పెద్దలు అంత చీప్గా ఎలా వుంటారో ఎమిటో… అప్పు చేస్తే పోలా? చేస్తూనే వున్నారు కదా తొక్కలో వుద్యోగాలు మనం పుట్టుక ముందు నుంచి…ఎంత దాచారు?… భూదేవంత అరుగేసి ఆకాశమంత పందిరేసి పెళ్ళి చేసే ఎవరింటి లోనైనా మనం పుడితే ఎంత బావుంటుంది డార్లింగు.. అనుకుంటున్నారు.

కట్నం తగ్గించడం కోసం ప్రేమించిన, రాజీ పడిన వాళ్ళిద్దరి అమలకంటే, కట్నం/లాంఛనాలు రాబట్టటానికి నిశ్శబ్దపాత్ర పోషణ చేస్తున్న అటు ఇటు మగవాళ్ళ కంటే రేపటి తరం రాజేశ్వరి, రాజారావులు ఎక్కువ భావదాస్యంలో వున్నట్టు నాకు కనిపిస్తున్నారు. వాళ్ళకి అసలు ఘర్షణ లేదు.

”నచ్చానా లేదా డియరూ” అని అబ్బాయి అడుగుతాడు. ”నువు” ఇంద్రుడివి, చంద్రుడివి” అని అమ్మాయి చెబుతుంది.

ఇంతకంటే మంచి గిరాకీ తగలక పోతుందా-అని అమ్మా నాన్నలు చూస్తున్నారు.

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.