ఇంట్లో ప్రేమ్‌చంద్‌-25

శివరాణీదేవి ప్రేమ్‌చంద్‌
అనువాదం : ఆర్‌. శాంతసుందరి

‘హంస్‌’, ‘జాగరణ్‌’ మాసపత్రిక, వారపత్రిక, రెండేసి అచ్చయేవి. ఖర్చు పెరిగింది. బొంబాయి నించి ఫిల్మికంపెనీవాళ్ల దగ్గర్నించి పిలుపొచ్చింది. చంద్రభాల్‌ చౌదరి అనే స్నేహితుడితో ఈయన మాట్లాడారు. ఆయన కూడా బొంబాయి వెళ్ళమనే సలహా ఇచ్చాడు. వాళ్లిద్దరూ నిర్ణయించుకున్నాక మా ఆయన ఆ విషయం నాకు చెప్పారు. ”బొంబాయి చూసొద్దాం, పద!” అన్నారు నాతో. ”ఎందుకిప్పుడు?” అన్నాను. ”సినిమా కంపెనీ వాళ్ళు పిలిచారు” అన్నారు.
”అది సరే, కానీ అక్కడి గాలీ, నీళ్లు మీకు పడద్దా? అసలే మీకు ఏం తిన్నా జీర్ణం కాదు. అక్కడ మీరు ఆరోగ్యంగా ఉండలేరేమో!
”బొంబాయిలో ఎంత మంది ఉండటం లేదు?” అన్నారు.
”అందరితో పోల్చకండి. ఎవరి సౌకర్యం వాళ్లు చూసుకుంటారు. మీరు బొంబాయికెళ్లటం నాకు ఇష్టం లేదు.”
”నువ్వే ఆలోచించు, వెళ్లకపోతే పనులెట్లా అవుతాయి? ఇక్కడ సంపాదించేది మన ఖర్చులకే సరిపోతోంది. మరి పత్రికలెలా నడపటం? ‘హంస్‌’, ‘జాగరణ్‌’ కూడా మన జీవితాలతో ముడిపడి ఉన్నాయి కదా?”
”వీటికోసమని బొంబాయి వెళ్లటమేమిటి?” అన్నాను.
”ఈ ఏనుగులని తగిలించుకున్నాక మేపకుండా ఎలా? అవి మాత్రం బతకద్దూ?” అన్నారు.
”మీరే పని చేసినా ప్రాణంమీదికి తెచ్చుకున్నట్టే చేస్తారు!”
”అక్కడే పొరబడుతున్నావు. ఎవరికో ఉపకారం చెయ్యాలని కాదు కదా నేను రాస్తున్నది? నా మనశ్శాంతి కోసం, నా తృప్తికోసం నేను రాస్తున్నాను. దాన్ని చదివి ఎంతమంది అర్థం చేసుకుంటే నాకంత తృప్తి. పత్రికలు నడిపేందుకు ఎక్కువ డబ్బు పెట్టగలుగుతాను. ఏడాదికి తొమ్మిది వేలిస్తామంటున్నారు. ఒక ఏడాదిన్నర కాలం బొంబాయిలో ఉన్నాక నేనిక్కడికి వచ్చేస్తాను. ఇంటినించే కథలు పంపిస్తూ ఉంటాను. అప్పుడు కూడా వాళ్ళు నాకు ఏటా తొమ్మిది, పదివేలు ఇస్తారు. ఒక ఏడాదిన్నర బొంబాయిలో ఉంటే మనకి వచ్చే నష్టమేముంది చెప్పు? ఆ తరవాత ఇంటిదగ్గరే కూర్చుని హాయిగా సంపాదించుకుంటాను!”
”సరే, అయితే వెళ్లండి!” అన్నాను.
”ఇంకో విషయం చెప్పనా? అక్కడికెళ్తే మరో విధంగా కూడా మనకి లాభమే. నవలలూ, కథలూ రాస్తే ఎక్కువమందికి అవి చేరవు. వీటివల్ల జనానికి లాభం తక్కువ. అదే సినిమా అయితే చాలామంది చూస్తారు. నేను రాసే విషయాలు ఎక్కువ మందికి పనికొస్తాయి.”
”ఎవరికో లాభం వస్తే నాకేంటిట?”
”ఇంక ఎక్కువ రోజులు నేను పని చెయ్యబోవటం లేదు. మహా అయితే ఇంక ఐదారేళ్లు, అంతే!” అన్నారు.
”అంటే అప్పుడే పెన్షన్‌ తీసుకుని ఇంట్లో కూర్చుంటారా?”
”ఈ పని కాకపోతే, మరొకటి. ఇక రాతకోతలు ఆపేసి, పల్లెల్లోకి వెళ్లి అక్కడేమైనా చెయ్యాలని ఉంది.”
”సరే, మీరు పల్లెలకి వెళ్లి అక్కడ పనులు చేస్తూ ఉండిపోతే, ఇక్కడి పనులు ఎలా జరుగుతాయి?”
”అప్పటికి ధున్నూ చేతికి అందికొస్తాడులే. వాడికి ఇక్కడి వ్యవహారాలన్నీ అప్పజెప్పేసి, మనిద్దరం పల్లెటూర్లో పొలం పనులు చేసుకుందాం. ఈరోజుల్లో రైతుల పరిస్థితి చూస్తున్నావుగా? మనలాటివాళ్లు వెళ్లి వాళ్లమధ్యన ఉంటూ, పనులు చేపట్టకపోతే వాళ్లిక బాగుపడరు. వాళ్లలో ఒకరుగా కలిసి మనం పని చేస్తేనే ఏమైనా మార్పు తీసుకురాగలుగుతాం. ఒకటి రెండేళ్లు అలా పనిచెయ్యటం వల్ల తీసుకురాగల మార్పు, జీవితాంతం సుదీర్ఘమైన ఉపన్యాసాలు ఇచ్చినా తీసుకురావటం సాధ్యం కాదు.
”మీరొక్కరూ పనిచేస్తే ఎంతమంది రైతుల జీవితాలని బాగుచేసి వాళ్లకి ఉపకారం చెయ్యగలుగుతారు?”
”నేను ఎన్నోసార్లు చెప్పాను, ఏ పనీ కూడా ఇంకొకరికి ఉపకారం చేసే ఉద్దేశంతో చెయ్యకూడదు. మనిషి తన మనశ్శాంతికోసమే పని చెయ్యాలి.”
”మరి ధున్నూ మీరనుకున్నట్టు ఇక్కడి పనులు చెయ్యకపోతేనో? అప్పుడేం చేస్తారు?”
”నేను వాడిమీద నా బరువు బాధ్యతలేమీ పెట్టబోవటంలేదు. పనిచేసే మనస్తత్వం ఉంటే ఎక్కడో ఒక చోట పని చేస్తాడుగా? బైట ఉద్యోగం కన్నా ఇంట్లో పని చేసుకోవటం లక్షరెట్లు నయం, అవునా? అయినా బైట ఉద్యోగాలెక్కడున్నాయి? చూట్టం లేదూ, ఎంతమంది పనికోసం చెప్పులరిగేలా తిరుగుతున్నారో?”
”ఏమైనా, వాడికీ పని ఇష్టం లేదనుకోండి, బలవంతాన అంటగట్టటం మంచిది కాదనే నా ఉద్దేశం. ఒకప్పుడు మీ తమ్ముడిగురించి కూడా ఇలాంటి ఆశలే పెట్టుకున్నారు, పెద్దయాక నాకు సాయం చేస్తాడు, అనేవారు. అతను మీకేం సాయం చేశాడు? చదువు పూర్తి చేసి, ఉద్యోగం రాగానే పెళ్లి చేసుకున్నాడు. అంతదాకా మనతోటే ఉన్నవాడు పెళ్లయిన మరుక్షణం విడిగా వెళ్లిపోయాడు. ఇక ఇప్పుడు అతనితో మనకి ఎటువంటి సంబంధమూ లేకుండా పోయింది!”
”రాణీ, వాడు తమ్ముడు, అది కూడా సవతి తమ్ముడు!”
”కానీ మీరు అతన్ని కొడుకులాగే ప్రేమించారు కదా? ధున్నూని ప్రేమించినట్టే? మరి కొడుకు మీద మాత్రం ఆశలు పెట్టుకుని ఏం లాభం?”
”తమ్ముడి మీద ఉన్నది జాలితో కూడుకున్న ప్రేమ. కొడుకుది రక్తసంబంధం. తమ్ముడు ఇంకెవరికో పుట్టాడు, ధున్నూ నా రక్తం పంచుకుని పుట్టిన సొంత కొడుకు. తమ పిల్లల్లో తలిదండ్రులు తమనే చూసుకుంటూ బతుకుతారు. మనలాగే మన పిల్లలు కూడా ఉంటారని ఆశిస్తాం.”
”నా ఉద్దేశంలో ఇప్పుడిక ఎవరిమీదా ఆశలు పెట్టుకోకూడదు.”
”రాణీ, మనమెక్కడికో దూరంగా పోవటంలేదు. మన ఊరు, లమహీకేగా వెళ్తున్నాం? అక్కడే ఉంటాం. ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి పిల్లల్ని చూసి వెళ్తాం. బన్నూ ఎంతవరకూ చదువుతానంటే అంతవరకూ చదివిస్తాను. అన్నదమ్ములిద్దరూ కలిసి ఏదో ఒక పని చేసుకుంటారు. నేను రాసి సంపాదించేదాన్లో కొంత వాళ్లకి పంపుతూ ఉంటాను. ఇప్పుడు చెప్పు నీ అభ్యంతరం ఏమిటో!”
”మన పని మనమే చేసుకోవాలి. ఆ బాధ్యత ఇంకోరి నెత్తిన పెట్టకూడదు. కడుపున పుట్టిన పిల్లలే, రేపు మన గురించి, మేమే వీళ్లని పోషిస్తున్నాం, అనుకునే పరిస్థితి రావచ్చు.”
”అన్నీ నా పేరనే ఉంటే వాళ్లలా ఎలా అంటారు? పైగా నా పిల్లలు అంత పనికిమాలినవాళ్లని నేననుకోను. ఒకవేళ అలా తయారైతే వాళ్లని పట్టించుకోకుండా వదిలేస్తాననుకుంటున్నావా? అసలు మనిద్దరం ఒక వేళ అడవిలో ఉండాల్సివచ్చినా పస్తులుండాల్సిన పరిస్థితి రాదు. మనం మరీ అంత చేతకాని వాళ్లం కాదు!”
”ఊఁ! సరే బొంబాయికెప్పుడు మీ ప్రయాణం?”
”ఈ జూన్‌ మొదటి తేదీకల్లా మనిద్దరం అక్కడికి చేరుకోవాలి.”
”అలహాబాదులో రెండు పెళ్లిళ్లు ఉన్నాయి, వెళ్లాలి కదా?”
”అయితే నేను ముందు ఒక్కణ్ణే వెళ్తాను, ఆ పెళ్ళిళ్ల గొడవేదో అయిపోయాక వచ్చి నిన్ను తీసుకెళ్తాను.”
”పిల్లలు కూడా బొంబాయిలోనే చదువుకుంటారా ఇక?”
”ఇప్పుడే ఏమీ చెప్పలేను. అక్కడికెళ్లి చూస్తేకాని తెలీదు.”
”మరి పిల్లల్ని ఇక్కడ వదిలి నేను మీ వెంట వస్తాననుకుంటున్నారా?”
”చెప్పా కదా, అక్కడికెళ్తేగాని ఇదమిద్ధంగా ఏమి చెప్పలేనని?”
తరవాత ఆయన ప్రయాణ సన్నాహంలో మునిగిపోయారు. సామానంతా సర్దుకున్నాక చూసుకుంటే దగ్గర ఒక్క పైసా లేదు. ఉన్న డబ్బేదో బ్యాంకులో ఏడాది వరకూ తీసేందుకు వీల్లేకుండా ఉండిపోయింది. ఎందుకంటే ఈయన బ్యాంకు నుంచి పదిహేనువందలు రుణం తీసుకున్నారు. ప్రెస్‌మేనేజర్‌ని, ప్రెస్‌ ఎకౌంట్‌లో డబ్బేమైనా ఉందా, అని అడిగారు. లేదన్నాడాయన.
నా దగ్గర ఎవరో దాచుకున్న డబ్బు కొంత ఉంది, వాళ్లు అడిగినప్పుడు ఇచ్చెయ్యాలి. దాన్లోంచి రెండువందలు తీసివ్వమని ఆయన అడిగారు. ఒకవేళ అడిగితే వచ్చే నెల ఇస్తానని చెప్పమని అన్నారు.
”నేనా పని చెయ్యలేను. అందులోంచి ఒక్క పైసా కూడా తీసే ధైర్యం నాకులేదు. పైగా ఇక్కణ్ణించి నేను కూడా బైలుదేరితే వాళ్ల డబ్బు వాళ్లకిచ్చెయ్యద్దా?” అన్నాను.
”ఇందులో పెద్ద సమస్యేముంది? అనుకోని ఖర్చువచ్చింది, వాడుకున్నాం, వచ్చేనెల ఇచ్చేస్తాం అని చెప్పు. వాళ్లకి ఎలాగూ అవసరం ఉన్నట్టులేదు.”
”అదంతా నాకు తెలీదు. ఆ డబ్బు నేను ముట్టుకోనంతే. నా దగ్గర ఒక వందరూపాయలున్నాయి ప్రస్తుతం. పదిహేనురోజుల్లో నాకు అవి మళ్లీ అవసరమవుతాయి, పెళ్లికి వెళ్లేప్పుడు కావాలి. మీ మేనేజర్‌తో మాట్లాడండి. ఆ వందా ఆయన పదిహేను రోజుల్లో ఇవ్వగలిగితే, ఈ డబ్బు మీరు పట్టుకెళ్లండి.”
అది విని ఆయన, ”ఈ డబ్బు నీకెలా వచ్చింది?” అన్నారు.
”ఇంట్లో ఉన్నదే? ఎక్కణ్ణించో ఎందుకొస్తుంది?”
”సరైన సమయానికి ఇది పనికొచ్చింది. నాలుగైదు రోజులుగా డబ్బు గురించి చాలా గాభరాపడుతూ ఉన్నాను. ఎక్కడ అప్పు చెయ్యాలో తెలీక చాలా మధనపడ్డాను. అప్పు చెయ్యటం కూడా అంత సులభమేం కాదు కదా!”
”నాకు ముందే చెప్పి ఉంటే మీరలా మధన పడాల్సిన అవసరమే ఉండేది కాదు!”
”నీ కోపమంతా ఆ రెండు పత్రికలమీదా చూపిస్తావని భయ పడ్డాను.”
”అవును, ‘హంస్‌’ కీ ‘జాగరణ్‌’కీ నేను సవత్తల్లిని కదూ?”
”ఏం చేసేది? నాకీ రచనా వ్యాసంగం ఒక పనికిమాలిన రోగంగా మారింది. ఈ అలవాటు వల్ల మధ్యలో నువ్వుకూడా చాలా నలిగిపోతున్నావు. రోగమో, అలవాటో గాని దాన్ని తగిలించుకున్నది నేను, కష్టపడుతున్నది నువ్వు! నా అంతట నేనే ఈ పని చేపట్టాను. దీన్ని నా బాధ్యతగా అనుకున్నాను. ఇప్పుడేమైంది? రాగి దమ్మిడీ లేదు నా దగ్గర; కానీ నువ్వో? మళ్లీ మరోసారి వందరూపాయలు, నువ్వు ఎలా లేదన్నా ఒక పదినెలలు కష్టపడి తపస్సులాంటిది చేసి ఉంటావు. నేనేం పెద్ద డబ్బిస్తున్నాను నీకు? అయినా వందరూపాయలు కూడబెట్టావు. మేనేజర్‌కి నెలకి దాదాపు ఏడొందలు ఇస్తాను. అయినా అతని అకౌంట్‌లో ఒక్క రూపాయి కూడా లేదు. నీకు నేనిచ్చేది నెలకి నూటయాభై, అందులోంచి నువ్వు వందరూపాయలు దాచగలిగావు. డబ్బు ఆదా చెయ్యటం నీకు బాగా తెలుసా, మకా?”
”మహానుభావా! నాకు మీరు ఎక్కువ ఇచ్చి ఉంటారు, అందుకే దాచగలిగాను. నేను కష్టపడి తపస్సులూ అవీ చేసే రకం కాదులెండి!”
ఇరవై రూపాయలు ప్రయాణానికి ఖర్చు అయాయి. మిగతా ఎనభై తనతో తీసుకెళ్లారు. వెళ్లేముందు రోజు రాత్రంతా ఆయన నిద్రపోలేదు, ఎందుకంటే తెల్లారే నాలుగ్గంటలకల్లా రైలు పట్టుకోవాలి. అంతదూరం వెళ్తున్నానన్న ఆందోళన కూడ చాలారోజులుగా ఉన్నట్టుంది, నాకున్న ఇబ్బంది మాట అలా ఉంచి, నాకన్నా ఆయనే ఎక్కువ విచారంలో కూరుకుపోయారు. మాటిమాటికీ ”ఈ పెళ్లిళ్లు లేకపోతే నువ్వుకూడా నాతో వచ్చేదానివి, పిల్లల్ని కూడా తీసుకెళ్లేవాళ్లం,” అంటూ విసుక్కోటం మొదలుపెట్టారు.
”ఇంకా అక్కడ సరైన ఇల్లు కూడా చూసుకోకుండా మమ్మల్నందర్నీ వెంటపెట్టుకుని ఎలా వెళ్తారండీ?” అన్నాను.
”దానికేముంది? అక్కడెంతోమంది స్నేహితులున్నారు. రెండు మూడు రోజులు ఎవరింట్లోనో గడిపేనాళ్లం. ఇల్లు దొరగ్గానే మారిపోయేవాళ్లం. ఇక్కడ నువ్వొక్కదానివీ పిల్లల్ని పెట్టుకుని ఉంటావు, నేనక్కడ ఒక్కణ్ణీ అయిపోతాను, ఇదేం బాగాలేదు! ఏమవుతుందో ఏమిటో, ఏమీ అర్థం కావటంలేదు. సుఖంగా ఉన్నవాణ్ణి అనవసరంగా పిలిచారు వాళ్లు!”
”ఇది మీ అంతట మీరు తగిలించుకున్న లంపటం, ఎవర్నో ఎందుకంటారు? నేను ముందే చెప్పాను, ఎక్కడికీ వెళ్లక్కర్లేదని. మీరే వినిపించుకోలేదు.”
”నీ మాట విననిదెప్పుడు చెప్పు? కానీ బతకటానికి ఏదో పని చెయ్యాల్సిందేగా? తప్పనిసరై ఒప్పుకున్నాను.”
”ఏం లేదు, నేను వద్దంటే మీరెప్పుడు విన్నారుగనక? ఈ తప్పనిసరి పరిస్థితులన్నీ మీరు కొన తెచ్చుకున్నవే.”
”సరే, ఇప్పుడు వీటిని నెత్తికెత్తుకున్నాను, ఇప్పుడేం చెయ్యమంటావు?” అన్నారు అమాయకంగా.
”చేసేదేముంది? తెల్లారగట్టే లేచి రైలెక్కెయ్యటమే.”
పొద్దున్న తనే నన్ను లేపి వెళ్లొస్తానని చెప్పారు. ఆయన గుర్రబ్బండీ ఎక్కుతూంటే కాళ్లకి నమస్కారం చేశాను. నాకు ఏడుపు ముంచుకొచ్చింది.
”ఆ పెళ్లిళ్లేవో అయిపోగానే నాకు ఉత్తరం రాయి. వెంటనే వచ్చి మీ అందర్నీ తీసుకెళ్తాను,” అన్నారు.
ఆయన వెళ్లాక నేను ఇంట్లోకొచ్చి ఒక గంటసేపటి దాకా ఏడుస్తూనే ఉండిపోయాను. నెలా ఇరవైరోజుల నాకాయన దూరంగా ఉండిపోయారు. ఉత్తరాలు రాస్తూనే ఉండేవారు. అప్పుడు అన్నాళ్లు విడిచి ఉండేందుకే చాలా బాధ అనిపించింది. ఇప్పుడు శాశ్వతంగా దూరమైపోయినా, తీరిగ్గా కూర్చుని ఆలోచించగలుగుతున్నాను.
ఆయన రాసిన మొదటి ఉత్తరం నాకు జూన్‌ ఏడోతేదీన అందింది
ప్రియమైన రాణీకి ప్రేమతో,
నేను బొంబాయికి భద్రంగా చేరాను. ఇక్కడ స్టూడియో పని ప్రారంభమైంది. నువ్వూ పిల్లలూ పెళ్లికి జాగ్రత్తగా వెళ్లే ఉంటారని తలుస్తాను. మనమ్మాయిని కూడా అక్కడ కలుసుకునే ఉంటావు. నీ చుట్టూ అందరూ ఉన్నారు, బంధువులూ, పిల్లలూ అందరూ. బొంబాయి ఎంతో పెద్ద నగరం, కానీ మీరెవ్వరూ ఇక్కడ లేకపోవటంతో అంతా శూన్యంగా కనిపిస్తోంది. తరచు, అన్నీ వదిలేసి పరిగెత్తి నీ దగ్గరకి వచ్చెయ్యాలని అనిపిస్తుంది. ఇదంతా ఎందుకు పెట్టుకున్నానా అని నామీదే నాకు చిరాకు కలుగుతూ ఉంటుంది. ఇంకా ఇల్లు అద్దెకి తీసుకోలేదు. ఇల్లు తీసుకుని ఒక్కణ్ణీ ఉంటే ఇంకా ఒంటరిగా అనిపిస్తుందేమో! అందుకే ఇంటి విషయం ఆలోచించటం లేదు. నీ దగ్గర్నించి ఉత్తరం వచ్చిన తరవాతే ఇల్లు వెతుకుతాను. పిల్లలకి ముద్దులు, మీ అక్కయ్యకి నా నమస్కారాలు. అందర్నీ అడిగానని చెప్పు. నేను సుఖంగానే ఉన్నాను, నా గురించి బెంగ పెట్టుకోకు.
నీ
ధనపతరాయ్‌
రెండో ఉత్తరం జూన్‌ 15న రాసినది :
ప్రియమైన రాణీ,
నేనిక్కడ బాగానే ఉన్నాను. జూన్‌ 22న పెళ్లి ఉందని రాశావు. రెండోది 28 జూన్‌ అని రాశావు. వాళ్లెవరింట్లోనో పెళ్లయితే మధ్యలో శిక్ష నాకా? బహుశా జూలైలోపల నీకు రావటానికి కుదరదనే అనుకుంటా. అమ్మాయీ, మనవడూ వచ్చారని తెలిసి సంతోషించాను. నువ్వు చక్కగా వాళ్లందరితో కాలక్షేపం చేస్తూంటే, ఇంకా నెలన్నర రోజులు ఒంటరిగా ఎలా గడపడమా అని నేను ఆలోచిస్తున్నాను. ఎంతసేపని పని చేస్తూ గడపను? ఎంతైనా ఎద్దుని కాను కదా, మనిషన్న తరవాత కాస్త సరదాగా గడపాలని ఉంటుంది. ఇక నాకు అన్నిటికన్నా ఎక్కువ ఇష్టమైనది ఇంటిదగ్గర భార్యాపిల్లలతో సమయం గడపటం. అది తప్ప ఇంకే రకమైన సరదాలూ నాకు లేవని నీకు తెలుసు కదా? భోజనం కూడా సయించటం లేదు. ఇక్కడంతా దొరల పద్ధతి. అది నాకు పడదు. అక్కడైతే మనవడు జ్ఞానూతో కాలక్షేపం చేసేవాణ్ణి, వాడితో ఆడుకునే వాణ్ణి. వాడికి ఈపాటికీ మాటలు వచ్చి ఉంటాయి. బన్నూ, ధున్నూ ఎలా ఉన్నారు? అమ్మాయి బాగానే ఉంది కదా? పెళ్లింట్లో అందరూ సరదాగా గడుపుతూ ఉండి ఉంటారు. పెళ్లాం పిల్లల్ని వదిలి ఉండేవాళ్లకి అది ఎలా సాధ్యమో నాకైతే అర్థం కాదు. నెలరోజులకే నేను డీలా పడిపోయాను. రోజులు లెక్కపెట్టుకుంటూ గడుపుతున్నాను. కానీ తప్పదు కదా! మేనేజర్‌ నీకు డబ్బు పంపించాడా? ఆ సంగతి రాయి. నా గురించి మళ్లీ రాస్తాను. నువ్వెలా ఉన్నావో ఈసారి ఉత్తరంలో రాయి.
నీ
ధనపత్‌రాయ్‌

(ఇంకా ఉంది).

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో