చివరి మజిలీలో స్నేహం

మ. రుక్మిణీ గోపాల్‌
”బామ్మా, నీ ఫ్రెండు, అనంతరామయ్య గారు పోయారట.”
అప్పుడే అన్నం తిని కంచం పడెయ్యటానికి లేస్తున్న నన్ను ఒక్కసారిగా నిస్సత్తువ ఆవరించింది. లేచినదాన్ని మళ్లీ కుర్చీలో కూర్చుండిపోయాను. ఈ వార్త మోసుకొచ్చినది నా మనమరాలు, పద్మ. అది ‘ఫ్రెండు’ అని అనటంలో ఎంత అంతరార్థం ఉందో గ్రహించాను. అయినా చిన్నపిల్ల, దానిననుకోటం తప్పు. పెద్దవాళ్ల మాటలను బట్టే పిల్లలు కూడా అభిప్రాయాలు ఏర్పరుచుకుంటారు, వాళ్లకు విచక్షణాజ్ఞానం వచ్చేదాకా.
తిన్న తిండంతా నీరు కారిపోయినట్లనిపించింది. అయినా తప్పదుగా, నెమ్మదిగా లేచి వెళ్లి కంచం సింకులో పడేసి చెయ్యి కడుక్కుని వచ్చి పడక్కుర్చీలో కూర్చున్నారు. నెమ్మదిగా అనంతరామయ్యగారు పోయిన షాక్‌నుంచి తేరుకోటం మొదలెట్టాను. పద్మను పిలిచి ”ఎప్పుడు పోయారే? ఎలా పోయారు?” అని అడిగాను. ”పొద్దుటే, హార్ట్‌ఎటాక్‌ట” అంది పద్మ.
ఈ సమయంలో రోజూ అయితే ఏదో పుస్తకం తీసుకుని కాసేపు భుక్తాయాసం తీర్చుకోటం నాకలవాటు. కాని ఇవాళ ఏదీ చదవాలని పించలేదు. నిన్న సాయంత్రమే ఆయన ఇక్కడకు వచ్చి నాతో కొంచెంసేపు మాట్లాడి వెళ్లారు. ఎప్పుడు ఏం జరుగుతుందో ముందుగా తెలి యదు కదా! కొంచెం విచారం, నిస్సహాయతతో కూడుకున్న ఆయన ముఖం కళ్ల ముందు సాక్షాత్కరించినట్లు కనపడింది. ‘పోనీలే  ఇప్పటిికైనా  భగవంతుడు ఆయన మీద దయ తలచి ఇహలోకబాధలనుండి ఆయనకు విముక్తి కలిగించాడు’ అనుకున్నాను. నా మనసు గతంలోకి వెళ్లింది.
‘అనంతరామయ్య గారు మా పక్క వీధిలోనే ఉంటారు. రిటైరయిన మనిషి. కొడుకు ఈ ఊర్లో ఉద్యోగం చేస్తున్నాడు. రిటైరవగానే ఉద్యోగపు ఊరు వదిలేసి కొడుకు దగ్గరకొచ్చి ఉంటున్నారు. రిటైరయేముందరే భార్య పోయిందట. వయసులో నేను ఆయన కంటే ఐదు సంవత్స రాలు పెద్ద. భర్తను పోగొట్టుకున్న దురదృష్టవంతురాల్ని. అయినా కొన్నాళ్లు ఒంటరిగా కాలక్షేపం చేశాను. కాని అనారోగ్య కారణం చేత కొడుకు దగ్గరకు రాక తప్ప లేదు. ఆయన రోజూ సాయంత్రం మా ఇంటి ముందు నుంచి దగ్గరలో ఉన్న పార్కుకు వెడుతూ ఉండేవారు. నేను రోజూ సాయం త్రం వీధి వరండాలో కుర్చీ వేసు కుని కాలక్షేపం కోసం వీధిలో వచ్చే పోయేవాళ్లను చూస్తూ కూర్చుం టాను. రోజూ వెడుతూ ఆయన నన్ను గమనించేవారు. నేనూ ఆయనను గమనించేదానిని. కాని ఎప్పుడూ మాట్లాడుకోలేదు. ఓరోజు ఆయనకు ఏం తోచిందో మా గేటు తీసుకుని లోపలకు వచ్చారు. ”ఎప్పుడూ ఒక్కరూ అలా ఒంటరి గా కూర్చుని ఉంటారు. పోనీ పార్కుకు రాకూడదండీ కాలక్షేపం అవుతుంది” అన్నారు. నేను మర్యాదకు లేచి నిలబడి ”నాకు నడుం నెప్పండీ, ఎక్కడికీ నడవ లేను. రండి, కూర్చోండి” అంటూ గోడవారగా ఉన్న ఇంకో కుర్చీని ముందుకు జరిపాను. ఆయన కూర్చుంటారని అనుకోలేదు. ‘ఏదో మాట వరసకి అడిగారు, వెళ్లిపోతా ర’నుకున్నాను. కాని ఆయన వచ్చి కూర్చున్నారు. సాధారణంగా ఇద్దరు పెద్దవాళ్ల మధ్య జరిగే సంభాషణ లాంటిదే మామధ్య జరిగింది. ‘పిల్లలు, కొడుకుల ఉద్యోగాలు, మనవలు, వాళ్ల చదువులు, పెద్దతనంలో వచ్చే అనారోగ్యాలు, ఇలాంటివే మాట్లాడుకున్నాం. కాసేపటికి ఆయన లేచి ”ఇంక వెళ్తాను” అని పార్కువేపు వెళ్లిపోయారు.
అది మొదలు ఇంచుమించు ప్రతి సాయంత్రం ఆయన పార్కుకు వెళ్లేముందు కాసేపు మా వరండాలో కూర్చుని నాతో కబుర్లు చెప్పి (కొంచెంసేపు) వెళ్లేవారు. ఎక్కడకూ వెళ్లలేని నా ఒంటరితనాన్ని చూసి జాలిపడుతూ ఉండేవారు. మొదట్లో కేవలం నా ఒంటరితనం మీద జాలి కొద్దీ కాసేపు మాట్లాడి వెడుతున్నారనుకున్నాను. కాని క్రమేణా ఆయన ఒంటరితనాన్ని బాపుకుందుకు కూడా వస్తున్నారని అర్థమైంది. ఒక్కొక్కప్పుడు పార్కుకు కూడా వెళ్లకుండా ఇక్కడే గడిపేసి వెళ్లిపోయే వారు. నాకూ బాగానే ఉందనిపించేది. ఇంట్లో నాతో మాట్లాడేవారు కూడా ఎవరూ లేరు. ‘ఈవిడతో మాట్లాడేందుకేముంటుంద’ని వాళ్ల అభిప్రాయమేమో! మనిషి సంఘజీవి, ఎంత ఒంటరితనానికి అలవాటుపడ్డా ఎప్పుడో ఒకప్పుడు కొంతసేపు సాటివాళ్లతో కాలక్షేపం చేయాలని ఉంటుంది. కాని ఇంట్లో దానికి అవకాశాలు తక్కువ.
కొంత చనువు ఏర్పడ్డ తరవాత క్రమంగా మా సంభాషణ స్వవిషయాలలోకి వెళ్లేది. అప్పు డప్పుడు ఆయన తన గోడు చెప్పు కునేవాడు. ‘కోడలు అసలు గౌర వంగా చూడదట. ఏదో మోయలేని భారం మీద వచ్చి పడినట్లుగా మాట్లాడుతుందట. అక్కడికీ ఆయన కొచ్చే పెన్షనంతా, కొద్దిగా తన స్వంత ఖర్చులకు ఉంచుకుని మిగతాది వాళ్లకే ఇచ్చేస్తాడట. కొడుకు ఏమీ కలగజేసుకోడట. ”నాన్నా మీకిక్కడెలా ఉంది, అన్నీ సౌకర్యంగా ఉన్నాయా?” అని ఎప్పుడూ అడగడట. (మాటవరసకైనా) తను పూర్తిగా కోడలి దయాధర్మాల మీద ఆధారపడి బతుకుతున్నాడట.’ నా పరిస్థితీ అలాంటిదే అయినా ఆయన్ని ఓదార్చేందుకు ప్రయత్నించాను. ”చూడండి అనంతరామయ్యగారు, ఇప్పుడు ప్రతి ఇంట్లోను పెద్దవాళ్ల పరిస్థితులు అలానే ఉన్నాయి. మనం ఈ వయసులో ఇంకొకరి సాయం లేనిదే ఒంటరిగా బతకలేం గదా! వారి మీద ఆధారపడక తప్పదు. అదే బహుశా వాళ్ల అలుసుకు కారణమేమో కూడాను. వేదాంతాన్ని ఒంటపట్టించుకుని ఇది మన కర్మ అనుకుని భరించవలసిందే.” నా మాటలు ఆయనకెంత ఓదార్పునిచ్చాయో తెలియదు. ఈ వయసులో ఆయన మనఃప్రవృత్తిని నేనర్థం చేసుకోగలను. ఎందుచేతంటే నేనూ అదే పరిస్థితిలో ఉన్నాను. పెద్దవయసు వచ్చాక కడుపున పుట్టిన పిల్లలే నిరాదరణ చూపుతుంటే భరించటం కష్టమే. మొగ్గ పూవుగా మారటం ఎంత సహజమో కోడళ్లకు అత్తమామలంటే గిట్టకపోవటం కూడా అంత సహజమే అనుకుంటాను. కొడుకులెప్పుడూ కోడళ్ల పక్షమే! ఆఖరికి మనం ఎంతగానో ప్రేమించే మనవలు కూడా తల్లిదండ్రుల మాటలను పట్టి బామ్మ, తాత అంటే ఆ ఇంటికి పట్టిన చీడపురుగుల్లా భావిస్తున్నారు.
మా రెండు కుటుంబాలకు ఎక్కువ సన్నిహితం లేకపోయినా పేరంటాలు మొదలగువాటిల్లో ఆడవాళ్లు కలుసుకుంటూ ఉండటం వల్ల పరిచయాలు ఏర్పడ్డాయి. మా మనవలు, ఆయన మనవలు కలిసి ఈ వీధిలోనో, ఆ వీధిలోనో ఆడుకుంటూ ఉంటారు. ఓరోజు ఆయన మనవడు అడిగాడు కూడాను ”తాతయ్యా పార్కుకెళ్లకుండా ఇక్కడ కూర్చుని కబుర్లు చెపుతున్నావేమిటి?” అని. అలాగ ఆయన ఇక్కడకొచ్చి నాతో కబుర్లు చెబుతూ కూర్చుంటున్నట్లు ఆయన కుటుంబంలోవారికి తెలిసింది. మేము కేవలము కోడళ్ల మీద నేరాలు చెప్పుకోటానికి సమావేశమౌతున్నట్లు అపోహలు బయలుదేరాయి. ఒకటి రెండుసార్లు మా కోడలు ”ఇద్దరికీ పనాపాటా? వండివార్చి పెడుతుంటే సుష్టుగా తిని కోడళ్ల మీద నేరాలు చెప్పుకుంటూ కూర్చుంటారు” అని వినీ వినపడనట్లుగా అంది. నేను విననట్లు ఊరుకున్నాను. మేము కేవలం కోడళ్లను గురించి మాత్రమే మాట్లాడుకోవటం లేదు. అనేక ఇతర విషయాలు కూడా మాట్లాడు కుంటున్నాము. ఇంచుమించు ఒకే ఈడువాళ్లం కనుక మా అభి ప్రాయాలు కూడా చాలా భాగం కలుస్తున్నాయి.
ఎందుకొచ్చిన గొడవ ఆయన్ని రావద్దని చెబుదామా అని పించింది. కాని ఆ ముసలాయన్ని చూస్తే జాలేస్తోంది. మనసులో ఏదైనా బాధ కలిగితే అది ఇంకొకరికి చెప్పుకుంటే ఆ బాధ కొంత తగ్గు తుంది అంటారు. పాపం ఆయనకు ఇంక చెప్పుకునేవారు ఎవరూ లేరు. నాతో చెప్పుకుని నా ఓదార్పుతో కొంత ఉపశమనం పొందుతున్నారు. నా పరిస్థితీ ఇలాంటిదే. నాకు మాత్రం చెప్పుకునేవారు ఎవరున్నారు? నా కడుపులో బాధ ఆయనతో పంచుకోవటంవల్ల నాకూ కొంత మనశ్శాంతి కలుగుతోంది. అంచేత ఆయన రాకను నేనూ కాంక్షిస్తున్నాను. ప్రతి సాయంకాలం ఆయన రాకకోసం ఎదురు చూస్తున్నాను. ఆ మధ్య ఆయనకు బాగా పడిశం పట్టి రెండు మూడు రోజులు రాలేదు. ఆ రెండుమూడు రోజులు నాకేమీ తోచలేదు. అంచేత ఆయన రాకకు నేను అంతరాయం కలిగించదలచుకోలేదు.
ఆయన రాక యథాప్రకారం సాగుతోంది. మా ఇద్దరి మధ్యా చనువెక్కువైన కొద్దీ ఆయన ఇంకా మనసు విప్పి తన గోడు చెప్పుకోటం మొదలుపెట్టాడు. ‘కోడలు తిండి విషయంలో కూడా చాలా భేదం చూపెడుతోందిట. వాళ్లు తినే తిండి వేరుట, ఈయనకు పెట్టే తిండి వేరుట. మధ్యాహ్నం కొడుకు ఇంటికి రాడుట, అంచేత అప్పుడు ఆయనకు పెట్టే తిండి కొడుక్కి తెలిసే అవకాశమే లేదుట. రాత్రులు వాళ్లు బాగా ఆలస్యంగా తొమ్మిది దాటితే కాని భోంచెయ్యరట. ”పెద్దవారు, ఆలస్యంగా తింటే మీకు అరగదు” అని ఈయనకు పెందరాళే పెట్టేస్తుందిట. కొడుకు పేపరు చదువుకుంటూనో, టి.వి. చూస్తానో హాల్లో కూచుంటాడట. అంతేకాని ఒక్కసారైనా వచ్చి ”ఏం తింటున్నావు నాన్నా” అని మాటవరసకైనా అడగడట. ”నేను మధ్యలోనే ఆయన మాటలకు అడ్డు తగిలాను. పోనీ ఒకసారి ఇలా జరుగుతోందని మీ అబ్బాయికి చెప్పలేకపోయారా” అన్నాను. ”అయ్యో ఒకసారి ఆ ముచ్చటా అయిందండీ. నేను చెప్పినదానికి మావాడికి కోపం కూడా వచ్చింది. భార్యను వెనకేసుకొచ్చాడు.” శ్యామల అలా ఎప్పుడూ చెయ్యదు. సాంప్రదాయమైన కుటుంబంలోంచి వచ్చిన పిల్ల. నీకేదైనా పెట్టలేదంటే అది ‘పెద్ద వయసు, నీకు పడద’ని పెట్టి ఉండదు. అంతేకాని దురుద్దేశంతో కాదు” అన్నాడు. ఇంక నేనేం మాట్లాడగలను? వాడికి భార్య మీద ఉన్న నమ్మకం తండ్రి మాట మీద లేదు!” ఇది విన్న తర్వాత ఇంక నేను మాత్రం ఆయనకు ఏం సలహా ఇవ్వగలను! ఇలాంటివి నాకు స్వానుభవాలే. మిగతా విషయాలు ఎలా ఉన్నా తిండి విషయంలో భేదం చూపించటం దారుణమే! కాని చెయ్యగలిగేదే ముంది?
ఈ మధ్య మా కోడలి విసుర్లు కూడా కొంచెం ఎక్కువయాయి. ”జోగీ జోగీ రాసుకుంటే బూడిద రాలిందట! అలా ఉంది వీళ్ల పద్ధతి. ఆయనకు ఈవిడా, ఈవిడకు ఆయనా సరిపోయారు. ఐదయేసరికి చక్కా వచ్చేస్తాడు. ఎవరూ ఆఫీసుకన్నా అంత టంచనుగా వెళ్లరు. ఈవిడ అంతకంటే, టీ తాగేసి ఆయనొచ్చేసరికి రెడీగా కూచుని ఉంటుంది స్వాగతం చెప్పడానికి! అంతరోజూ కబుర్లేం ఉంటాయో చెప్పుకోడానికి! ఇలా కబుర్లు, కాకరకాయ అంటూ ఊరట్టుకు తిరగకపోతే ఇంట్లో కోడలికేదైనా కాస్త సాయం చేయొచ్చు కదా. ఏ బజారు పనులన్నా చేస్తానని అనొచ్చు కదా! ఒకత్తీ ఇంట్లో చాకిరీ చేసుకోలేక చస్తోందిట. ఆఖరికి భోజనానికి టేబిల్‌ మీద కంచమన్నా పెట్టుకోడట. కోడలు పెట్టవలసిందే” ఇలా మధ్యమధ్య నాకు వినపడేటట్లు అనేది.
ఎవరేమనుకున్నా యథాప్రకారం మా సమావేశాలను కొనసాగించటమే ఈ విసుర్లకు కారణమేమో అనుకుంటాను. అయినా మేము మాట్లాడుకుంటుంటే వీళ్లకేం నష్టం? ‘అమ్మా పెట్టాపెట్టదు, అడుక్కుతినానివ్వదు’ అని సామెత ఉంది. అలాగ, వీళ్లు మాట్లాడరు, అదృష్టం బాగుండి ఎవరైనా మాట్లాడేవాళ్లు దొరికితే అదీ సహించలేరా? వాళ్లు మాత్రం ‘మా అత్తగారు ఇలాగ, మా మామగారు అలాగ’ అని తమ ఈడువాళ్లతో చెప్పుకోటం లేదా? చెప్పుకోకపోతే ఆయనింటి సంగతులు మా కోడలికెలా తెలిశాయి? నేనేమీ వెళ్లి ఆయన కోడల్ని ‘ఇలా ఎందుకు చేస్తున్నావ’ని ఎప్పుడూ అడగలేదే? లేదా ఇరుగుపొరుగు వాళ్లతో ఆయన కోడలిలాంటిదని చెప్పలేదే?
ఎవరేమనుకున్నా ఆయన్ని రావద్దని చెప్పటానికి నా మనసంగీకరించలేదు. ఆయన మీద ఒక విధమైన జాలి ఏర్పడింది. ఆడవాళ్లకున్నంత సహింపుగుణం సాధారణంగా మొగవాళ్లకుండదు. అంచేత ఇలాంటి పరిస్థితులలో వాళ్లు ఎక్కువ బాధపడతారు. కొంతసేపు నాతో ఏదో చెప్పుకుంటే నా ఓదార్పుతో ఆయన మనసు కొంచెం తేలికపడుతోందేమో ఈ అవకాశం కూడా ఆయనకు ఎందుకు లేకుండా చెయ్యాలి? రెండు ముసలి మనసులు ఒకరితో ఒకరు ఏదో చెప్పుకుని కొంత ఓదార్పును పొందుతుంటే వీళ్లకెందుకింత బాధ? వెనుకటి రోజుల్లో ఓ సినిమా వచ్చింది. నేను చూడలేదు కాని చూసినవాళ్లు దాని కథ చెప్పారు. ‘అందులో ఇలాగే ఇద్దరు పెద్దవాళ్లు పరిస్థితులను బట్టి ఒకరికొకరు దగ్గరయేసరికి, అందులో ఒకరు మగ, ఒకరు ఆడ కావటంతో కన్నపిల్లలే రంకుతనం కూడా అంటగట్టారట!’ ఆ కథతో పోల్చి చూసుకుంటే మా పరిస్థితి మెరుగ్గానే ఉంది. ఇంకా ఎవరూ అంతమాట అనలేదు!’
ఇంత త్వరగా ఆయన ఆయుర్దాయం మాడిపోతుందనుకోలేదు. నిన్న సాయంత్రం ఆయన చాలా అస్థిమితంగా ఉన్నట్లనిపించింది. కోడల్ని గురించి చాలా కోపంగా మాట్లాడారు. ”నేనంటే పిసరంత గౌరవం గాని, అభిమానం గాని లేదు. ఈ పీడ ఎప్పుడు విరగడై పోతుందా అన్నట్లు మాట్లాడుతుంది. నేనేం ఉత్తినే కూర్చుని వీళ్లింట్లో తినటం లేదు. ఇంచుమించు నా పెన్షనంతా వాళ్లకే ఇచ్చేస్తున్నాను. నా కొడుకెప్పుడూ దాని పక్షమే. తండ్రి మంచిచెడ్డలు కూడా కొంచెం కనుక్కోవాలన్న ఆలోచన వాడికెప్పుడూ రాదు. ఇంతకీ నా భార్య పోవటం నా దురదృష్టం. అదే బతికుంటే ఇద్దరం ఎలాగో అలాగ కాలక్షేపం చేసేవాళ్లం. ఈ పెన్షను డబ్బుతో ఏ ‘వృద్ధాశ్రమం’లోనో చేరిపోవచ్చు. కాని అది వాళ్లకు, నాకు కూడా అంత గౌరవప్రదమైంది కాదని ఆలోచిస్తున్నాను. భగవంతుడు నాకెన్నాళ్లు ఆయుర్దాయమిచ్చాడో, నేనింకా ఎంతకాలం ఈ మనస్తాపం అనుభవిస్తూ బతకాలో!” ఇంచుమించు కళ్లనీళ్ల పర్యంతమై నిన్ననే ఆయన అన్న ఈ మాటలు నా చెవుల్లో గింగురుమంటున్నాయి. ఈనాటితో ఆయన కష్టాలు గట్టెక్కాయి. అదృష్టవంతుడు, క్షణికంలో ప్రాణం పోయి ఉంటుంది. అందరికీ అంత సునాయాస మరణం లభిస్తుందా? ఇలా కాకుండా దేనివల్లో మంచం పట్టి కొంతకాలం తీసుకుంటే! అప్పటి ఆయన పరిస్థితిని తలుచుకుందుకే నాకు భయంగా ఉంది. ఆ స్థితిలో కోడలిచేత ఎన్ని చీపురు మొట్టికాయలు తినవలసి వచ్చేదో. సున్నితమనస్కుడైన ఆయన అది భరించగలిగేవాడా?
మళ్లీ నా మనవరాలు పరుగెత్తుకొచ్చింది. ”బామ్మా ఇంక శవాన్ని లేవనెత్తేస్తారుట. నీ ఫ్రెండ్‌ని ఆఖరిసారిగా ఓసారి చూడవా?” అనడిగింది. ”నాకు చూడాలని లేదే” అన్నాను. నా సమాధానం విని పద్మ తెల్లబోయింది.
నా మనసులో జరిగే సంఘర్షణ దానికేం తెలుసు? సజీవమైన ఆయన ముఖం నాకళ్లలో ఉంది. దాన్ని చెరిపేసి నిర్జీవమైన ముఖాన్ని ఆ స్థానంలో నిలపదలచుకోలేదు.
భర్త పోయిన తరవాత ప్రారంభమైన నా ఒంటరితనం మళ్లీ ఇంకొకసారి కొత్తగా ప్రవేశించినట్లు అనిపించింది. ఇంక సాయంత్రాలు ఎవరికోసం నిరీక్షించక్కరలేదు.
(భూమిక నిర్వహించిన కథ/వ్యాస రచన పోటీల్లో సాధారణ ప్రచురణకు స్వీకరించిన కథ)

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

3 Responses to చివరి మజిలీలో స్నేహం

 1. పుల్లా రావు says:

  ప్రతి మనిషి జీవిత చరమాంకంలోనూ ఈ సమస్య ఎదురు కాక తప్పదు. దీన్ని జయించాలంటే చెయ్యగలిగిందొక్కటే ముసలితనం రాకుండా ఏవయినా మందులు కనిపెట్టడం లేదా ముసలివాళ్ళు కాకుండానే చచ్చిపోవడం. ఈ రెండూ మనచేతిలో లేనివి కాబట్టీ మనం చెయ్యగలిగింది ఇది ఒక్కటే.
  ఇలాంటి కథలు రాసుకోవడం.
  స్నేహితుని మరణ వార్త ఎంతటివారినైనా ఇలాగే కుంగతీస్తుంది.
  ఆ సందర్భంలో ఎవరికైనా ఇలాగే అనిపిస్తుంది. జీవం లేని ముఖాన్ని చూడటానికి చాలా గుండె ధైర్యం కావాలి. అది అందరికీ వుండదు. అందుకే ఆ ముఖాన్ని చూడటానికి ఇష్ట పడరు.

 2. manikyamba says:

  చాలసహజంగ వుంది కధ ఇది అందరు అనుభవిస్తున్న వ్యధ. దీనికి
  పరిష్కారం మనచేతులోనే వుందికాని మనం చెయ్యడానికి ప్రయత్నం చెయ్యం

 3. Grace says:

  Just thought i would comment and say neat design, did you code it yourself? Looks great.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో