ఇంట్లో ప్రేమ్‌చంద్‌-26

అనువాదం : ఆర్‌. శాంతసుందరి
శివరాణీదేవి ప్రేమ్‌చంద్‌

మూడో ఉత్తరం జూన్‌ 24న వచ్చింది :
ప్రియమైన రాణి,
నేను క్షేమంగా ఉన్నాను. నువ్వూ పిల్లలూ కూడా క్షేమంగా ఉన్నారని తలుస్తాను. ఇక రెండు మూడు రోజుల్లో ఇంకోపెళ్లి ఉంది కదూ? ఇవాళ ఇక ఇల్లు అద్దెకి తీసుకున్నాను. రేపు అందులోకి మారిపోతాను. ఇటద్దె యాభై, ఇంట్లోనే ఉండేట్టు ఒక నౌకర్ని పన్నెండు రూపాయల జీతం ఇచ్చి కుదుర్చుకున్నాను. జీతం, భోజనం ఇంట్లోనే. వాడే అన్ని పనులూ చేస్తాడు. బహుశా జూలై ఒకటో తారీకున అక్కడికి వస్తాను. ధున్నూ ఫెయిలయాడని రాశావు. ఏం పరవాలేదులే. ఇలాటివి మామూలే, కానీ మన పిల్లలు ఫెయిలైతే సహజంగానే బాధ ఉంటుంది. వాడు దిగులుగా ఉంటే, అది వాడి తప్పేనని అర్థమయ్యేట్టు చెప్పు. వాడిక్కూడా చిన్న ఉత్తరం రాస్తున్నాను, చదవమని ఇయ్యి, పిల్లలకి నా ముద్దులు. ఇంతక్రితం రాసిన ఉత్తరంలో జ్ఞానూకి మాటలొచ్చాయో లేదా అని అడిగాను నిన్ను. నువ్వేమీ రాయలేదు. ఈసారి రాయి.
నీ
ధనపత్‌రాయ్‌
1, జులై, 1934
ప్రియమైన రాణీ,
ఉభయకుశలోపరి. జూలై పదిహేనుకల్లా నీ దగ్గరకి బహుశా వచ్చేస్తాను. అమ్మాయిని అప్పుడే అత్తారింటికి పంపద్దు. మనపిల్లలిద్దర్నీ ప్రయాగలో చదివిస్తే బావుంటుందేమో. ఇద్దరి పేర్లూ అక్కడ స్కూల్లో రాయించు. హాయిగా అక్కడే చదువుకుంటారు. నిన్నూ, అమ్మాయినీ ఇక్కడికి వెంటపెట్టుకుని వస్తాను. పిల్లల్ని ఇక్కడ స్కూల్లో చేర్పిస్తే, ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. అలా ఒక చోట స్థిరపడి ఖైదీలాగ నేను బతకలేను. ఇంకా ఇక్కడ ఉండటం గురించి ఏమీ నిర్ణయించుకోలేదు. మరి పిల్లల్ని స్కూల్లో ఎలా చేర్పిస్తాను. వాళ్లక్కడ ఉండటమే మంచిది. వాళ్లకి నెలనెలా డబ్బు అవసరం అనిపించవచ్చు. నెలకు వందరూపాయలు వాళ్లకి పంపిస్తాను. వాళ్లకి నీ అవసరం నా అవసరం అంతగా ఉండదు. అన్నిటికన్నా డబ్బే ముఖ్యం అనిపిస్తుందిప్పుడు. కానీ నువ్వు అడగచ్చు నాకు మాత్రం నీ అవసరం, నీ మీద అంత ప్రేమ ఎందుకని? నా జవాబు, దానికి కారణం నాకే ఇంతవరకూ తెలీలేదు! కానీ నువ్వంటే నాకు చాలా ప్రేమ, అది మాత్రం తెలుసు. అసలు నిన్ను ఆరాధిస్తాను, నువ్వులేకుండా బతకటం నరకంలా ఉంటుంది నాకు. తొమ్మిదో తేదీన అబ్బాయిలిద్దర్నీ అలహాబాద్‌ తీసుకెళ్లి స్కూల్లో చేర్పించు. మళ్లీ ఉత్తరం రాస్తాను.
నీ
ధన్‌పత్‌రాయ్‌
15, జూలై, 1934 :
ప్రియమైన రాణీకి ప్రేమతో,
నేను క్షేమం, అక్కడ మీరంతా క్షేమంగా ఉన్నారని తలుస్తాను. పిల్లలపేర్లు కాయస్థ్‌ పాఠశాలలో నమోదు చేయించి మంచిపని చేశావు. వాళ్ల బోర్డింగ్‌ హౌస్‌ ఏర్పాట్లు కూడా చేసే ఉంటావు. ధున్నూ ఉత్తరం రాశాడు. నువ్వు వాడికిచ్చిన డబ్బు సరిపోలేదుట, ఇవాళే వాడికి వందరూపాయలు పంపాను. నేను బహుశా ఇరవైయో తేదీకల్లా అక్కడుంటాను. మిమ్మల్ని వెంటబెట్టుకుని మళ్ళీ ఇక్కడికి రావాల్సి ఉంటుంది. నువ్వు సిద్ధంగా ఉండు. అమ్మాయీ, జ్ఞానూ ఇంకా నీ దగ్గరే ఉన్నారని తలుస్తాను. మిగతా సంగతులన్నీ వచ్చాక చెపుతాను. ఈ ఉత్తరం అందేసరికి నేనే నీ సమక్షంలో ఉంటానేమో!
నీ
ధన్‌పత్‌రాయ్‌
(ఇంకా ఉంది).
మా ఆయన జూలై 25న కాశీకి వచ్చారు. ఆరోజు భోరున వర్షం పడుతోంది. ఈయన ఉదయం నాలుగ్గంటలకి రైలు దిగారు. పూర్తిగా తడిసి ముద్దయిపోయారు. ఇంట్లోకి రాగానే, ”ఏమిటిలా తడిసిపోయారు?” అన్నాను. ఆయన నవ్వి, ”నువ్వు వెచ్చగా ఇంట్లో కూర్చున్నావు, స్టేషన్‌ నించి ఇంటికొచ్చేలోపల ఇలా తడిసిపోయాను. ఎంత పెద్ద వాన! పైగా ఎన్నిసార్లు పిలిచాననుకున్నావు? నువ్వు లేస్తేనా?” అన్నారు.
”సరే, బట్టలు మార్చుకోండి, జలుబు చేస్తుంది,” అని నేనే ఆయన హోల్డాల్‌ విప్పసాగాను. ”నేను తీసుకుంటాగా, నీ వల్ల కాదు, ఎందుకు ఊరికే అవస్థ పడతావు?” అన్నారు.
బట్టలు మార్చుకుంటూంటే గమనించాను, ఆయన బాగా చిక్కిపోయారు.
”ఒంట్లో ఎలా ఉంది?” అని అడిగాను.
”బాగానే ఉంది, బాగానే ఉన్నాగా? నువ్వు చెప్పు ఇక్కడి సంగతులేమిటి?”
”పిల్లల పేర్లు నమోదు చేయించేశాను. ఆ విషయం రాశాను కదా! అమ్మాయి, నేనూ, జ్ఞానూ ఇక్కడున్నాం. మీరు ఎన్నాళ్లు సెలవపెట్టి వచ్చారు?”
”నాలుగైదు రోజులుంటాను.”
”బొంబాయి ఎలా ఉంది? మీకు నచ్చిందా?”
”బాగానే ఉంది.”
”ఆ కంపెనీవాళ్లు ఎలాటివాళ్లు?”
”ఎలాటి వాళ్లని చెప్పను? సినిమా ప్రపంచమే వేరు. అక్కడ అందరూ బాబుగార్లే. నాతో వాళ్ల ప్రవర్తన చాలా బావుందిలే. నేను ఒక ఇల్లు కూడా తీసుకున్నాను. నీకు దాని సంగతి రాశా కదా? పద, నువ్వు కూడా అక్కడుంటే బావుంటుంది నాకు. బెనారస్‌లో లాగే, ఇంటినించి ప్రెస్‌కి వెళ్లేవాణ్ణి, తరవాత ఇంట్లో కూర్చునే పని చేసుకునేవాణ్ణి. అక్కడ కూడా ముందు స్టూడియోకి వెళ్లటం, తరవాత ఇంటి దగ్గరే పని చేసుకోవటం. కానీ ఒక తేడా ఉంది, ఇక్కడ మీరందరూ ఉన్నారు, బెంగ అనిపించేది కాదు, అక్కడ పగలూ, రాత్రీ ఒకటే పని. విహారయాత్రలకి వెళ్లేవాళ్లకి బొంబాయి బావుంటుందనుకుంటా. నాకు మాత్రం, ఇల్లూ, స్టూడియో, ఇవి తప్ప వేరే లోకం లేదు. నాకక్కడ ఏం బాలేదు, దిగులుగా ఉంటోంది.”
”పిల్లల పేర్లు ఇక్కడి స్కూల్లో నమోదు చేయించి తప్పు చేశామేమో!”
”మరేం చేస్తాం? పిల్లల్ని మనతో తీసుకెళ్తే ఇక అక్కడే ఇరుక్కుపోతాం. వెనక్కి రావాలంటే కుదర్దు. ఒకవేళ మధ్యలో వచ్చేస్తే పిల్లల చదువు చట్టుబండలు అయిపోదూ! ఇప్పుడైతే ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చెయ్యచ్చు.”
మర్నాడు అలహాబాద్‌ నుంచి పిల్లలిద్దరూ వచ్చారు. ఇల్లంతా సందడే సందడి! కానీ అది ఎక్కువ సేపు నిలవలేదు. అమ్మా, నాన్నా వెళ్లిపోతున్నారనే భావం పిల్లల్ని పట్టి పీడిస్తోంది. మాకు కూడా దిగులుగానే ఉంది, పిల్లలకి దూరంగా వెళ్లిపోతున్నందుకు. ఆయన ఇల్లంతా పరికించి చూసి, ”అయితే భూకంపం ప్రభావం మన ఇంటిమీద కూడా పడనట్టుందే?” అన్నారు.
”పదిహేను రోజులు కూలీలని పిలిపించి మరమ్మతు చేయించాను కాబట్టి ఈమాత్రం ఉంది,” అన్నాను.
”చాలా మంది ఇళ్లు కూలిపోయాయి, మనది బీటలువారింది, అంతేగా?” అన్నారు.
”అవును, నేనేమీ అనలేదే? అంతా మనమంచికే జరిగింది అనుకుంటాను.”
మూడోరోజున మేమిద్దరం బొంబాయికి ప్రయాణం కట్టాం. అబ్బాయిలు ఇద్దరూ, అమ్మాయి, జ్ఞానూ కూడా మావెంట వచ్చారు.
అలహాబాదు స్టేషన్‌కి చేరగానే నేను పిల్లలకి ఏమైన తినటానికి పెడదామని పొట్లాలు విప్పాను. పిల్లలిద్దరూ తినేందుకు కూర్చున్నారో లేదో, రైలు కూత కూసింది. నేను ఆ పదార్థాలని రుమాలులో చుట్టి, చిన్నబ్బాయి బన్నూతో, ”దీన్ని తీసుకెళ్లి బోర్డింగ్‌హౌస్‌కి చేరుకోగానే ఇద్దరూ తినండి, రాత్రి పదింటికి అక్కడ మీకెవరూ భోజనం పెట్టరు. సరేనా?” అన్నాను.
బన్నూ ఆ పొట్లాన్ని తీసుకుని కాళ్లకి దండం పెడుతూ ఏడ్చేశాడు. వాడికింకా పదమూడేళ్లు, పసివాడు! మొదటిసారి మేమిద్దరం వాణ్ణి వదిలి అంత  దూరం వెళ్తున్నాం. పిల్లలందర్లోకీ ఆఖరివాడు! నాకు కూడా ఏడుపొచ్చింది, కానీ పిల్లలముందు ఏడవటం ఇష్టం లేక, మనసు రాయి చేసుకున్నాను. ఈయన వాడిని ఓదారుస్తూ, ”ఏడవకూడదురా! ఇద్దరూ సఖ్యంగా ఉండండి. ఇద్దరూ కలిసి ఉత్తరాలు రాస్తూ ఉండండి. మళ్లీ దసరాకి వస్తారుగా, అంతవరకూ జాగ్రత్తగా ఉండండి,” అన్నారు.
బన్నూ రైలు దిగి వెళ్లిపోయాడు, కానీ ధున్నూ కిటికీ దగ్గరే వేళ్లాడాడు.
”కిటికీని పట్టుకోకు. వెళ్లు, ఎందుకా ఏడుపు?” అన్నారు ఈయన.
ఇంతలో రైలు మూడోసారి కూత పెట్టింది.
”బాబూ, కిటికీ ఊచలు పట్టుకోకురా!” అన్నారీయన మళ్లీ.
ధున్నూ అక్కణ్ణించే నమస్కారం పెట్టి వెళ్లిపోయాడు.
”ఇక మీరు ఏమైనా తినండి,” అన్నాను.
”నాకు ఆకలిగా లేదు. జ్ఞానూ నిద్రపోయాడా?” అన్నారు.
”ఎక్కడ నిద్రపోయాడు? ఇదుగో, నా ఒళ్లోనే ఉన్నాడుగా?”
నా దగ్గర్నించి తీసుకుని ఆయన వాణ్ణి తన ఒళ్లో కూర్చోపెట్టుకున్నారు. పిల్లలిద్దరూ దగ్గర లేనిలోటు వాడి ద్వారా తీర్చుకుంటున్నారని అనిపించింది నాకు. దోవంతా వాణ్ణి వదల్లేదు. పాలూ, టీ వాడికి తాగిస్తూనే ఉన్నారు. నేను గాని, అమ్మాయి గాని వాణ్ణి ఆయన దగ్గర్నించి తీసుకోబోతే ఏడవటం మొదలుపెట్టాడు. మూడోరోజుకి బొంబాయిలోని దాదర్‌ చేరుకున్నాం. కానీ ఈ ప్రయాణం మాకెవరికీ ఆనందాన్నివ్వలేదు. నెలల తరబడి పిల్లలకి దూరంగా ఉన్నవాళ్లకే మా బాధ అర్థమవుతుంది.
తెల్లారగట్ట నాలుగ్గంటలకి దాదర్‌లోని మా ఇంటికి చేరుకున్నాం. అప్పుడు కూడా పెద్దవాన కురుస్తోంది. వాన వల్ల టాంగాకి అన్నివైపులా గుడ్డ కప్పటంతో నేనేమీ చూడలేకపోయాను.
జ               జ               జ
1935 నాటి సంగతి మగపిల్లలిద్దరూ సెలవులు మాతో గడిపాక మళ్లీ అలహాబాదుకి ప్రయాణమయారు. నేనూ, నా తోడికోడలూ, మా ఆయనా వాళ్లని సాగనంపేందుకు ఇంట్లోంచి బైటికి వచ్చాం. వెళ్లేప్పుడు బన్నూ చాలా బాధపడుతూ ముగ్గరికీ నమస్కారం చేశాడు. ధున్నూ తిన్నగా బండి ఎక్కేశాడు. వాళ్లు వెళ్లాక మా ఆయన నాతో, ”ధున్నూ బాగా పాడైపోయాడు. ఎవరన్నా గౌరవం ఏలదు, ప్రేమా లేదు,” అన్నారు.
”ఏమైంది?” అన్నాను.
”నువ్వు గమనించలేదా? మన ముగ్గురికీ నమస్కారం కూడా చెయ్యలేదు. మనతో ఏ సంబంధమూ లేనట్టే ప్రవర్తించాడు.”
”కాలేజి చదువులకి వచ్చాడు కదా!” అన్నాను.
”అదేం కాదులే. బ్రిటిషువాళ్లు ఇలా ప్రవర్తించరు. బ్రిటిషు కుర్రాళ్లు కూడా తలిదండ్రులని వదిలి వెళ్లేప్పుడు, కావలించుకుని ప్రేమని ప్రకటిస్తారు. వాళ్లలో తండ్రిని ముద్దుపెట్టుకోవటం చాలా మంచిదని నమ్ముతారు. మనం వాళ్లని హృదయం లేని వాళ్లని అనుకుంటాం గాని, అది నిజం కాదు. పనికి మాలిన వాళ్లు వాళ్లలోనూ ఉంటారనుకో!”
”పోనివ్వండి, చిన్నవాడే కదండీ!”
”పోనీవ్వక నేనేం పట్టుక్కూర్చోబోవటం లేదు. తమ బాధ్యతని మర్చిపోయేవాళ్లని చూస్తే బాధగా ఉంది. వాడేదో మహాపరాధం చేశాడని నేను అనటం లేదు. కానీ మన ప్రేమని తిరస్కరించి వెళ్లిపోయాడన్నది మాత్రం నిజం.”
”దానివల్ల నష్టమేం జరిగింది?”
”ప్రత్యక్షంగా నష్టమేమీ జరిగుండకపోవచ్చు, కానీ ఆప్యాయత దెబ్బతింది!”
”ఊఁ!”
”అందరిచేతా ప్రేమించబడేవాడే అందరికన్నా అదృష్టవంతుడు. ప్రేమ ముందు లోకంలోని వస్తువులన్నీ దిగదుడుపే!”
”తనే తెలుసుకుంటాడు ఎప్పుడో ఒకప్పుడు.”
”తెలుసుకుంటాడులే. అదికాదు నేననేది. ప్రేమకి బదులు ప్రేమ దొరకాలి. చిన్నవాళ్లు పెద్దవాళ్ల కాళ్లకి నమస్కరిస్తే వాళ్లకి పెద్దవాళ్ల ఆశీస్సులు దొరుకుతాయి. అవే మనిషిని మనిషిగా చేస్తాయి.
”అయితే ఏమిటి మీరనేది, వాళ్లు జంతువులనా?”
”జంతువులు కాదు, కానీ ఇలాంటి భావాలు లేనివాళ్లు జంతువులతో సమానమే.”
”వదిలెయ్యండి, బాబూ!” అన్నాను.
”వదిలేశాలే, సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాను.”
ఆయన కళాకారుడు, ఆయనది సూక్ష్మదృష్టి. అది నాకర్థం కాదు. అన్ని విషయాలూ గ్రహించగల ఆయన గురించి పక్షపాతబుద్ధితో అభిప్రాయం వెలిబుచ్చటం సాధ్యం కాదు. మా మధ్య జరిగిన సంభాషణ మామూలుగానే ఉన్నట్టు అనిపించచ్చు, కానీ ఆయన మాటల్లో చాలా లోతైన అర్థం ఉందని జాగ్రత్తగా ఆలోచిస్తే తప్ప తెలీదు.
ఇల్లు చేరి, స్నానాలూ అవీ చేసి, పదకొండు గంటలకి భోంచేసి ఆయన స్టూడియోకి వెళ్లేందుకు బైలుదేరుతూండగా, పక్కింటి గుజరాతీ ఆయన, ”అందర్నీ వెంటబెట్టుకొచ్చారా, బాబుగారూ?” అన్నాడు.
”అవునండీ, నా భార్యా, కూతురూ, మనవడూ వచ్చారు. మగపిల్లలిద్దరూ అలహాబాదులో చదువుకుంటున్నారు,” అన్నారాయన.
”రండి, మా ఇల్లు చూద్దురుగాని!”
”ప్రస్తుతం ఆఫీసుకి వెళ్తున్నాను.” అని నాతో, ”వీరి అమ్మగారే నీ గురించి ఎప్పుడూ అడిగేది,” అన్నారు.
నేనావిణ్ణి ఇంట్లోకి రమ్మని ఆహ్వానించాను. ఈయన ఆఫీసుకి వెళ్లిపోయారు. చాలా సేపు ఆవిడా, నేనూ కబుర్లు చెప్పుకున్నాం.
సాయంత్రం ఆఫీసునించి ఆయన మళ్లీ పూర్తిగా తడిసిపోయి వచ్చారు. వెంట ఇద్దరు మనుషులు రెండు మంచాలు మోసుకొచ్చారు.
”మళ్లీ తడిశారా? మంచాలకి ఇప్పుడంత తొందరేమొచ్చింది?” అన్నాను.
ఆయన నవ్వుతూ, ”గొడుగేమైందని అడగవేం?” అన్నారు.
”అవును కదా? గొడుగేదీ?”
”మంచాలు తీసుకొచ్చే హడావిడిలో గొడుగు ఆఫీసులోనే మర్చిపోయాను.”
”ఏమిటంత హడావిడి? ఒకపక్క వాన కురుస్తూంటే ఎవరైనా గొడుగు తెచ్చుకోవటం మర్చిపోతారా? ఇదేం బాలేదు!”
”ఎందుకు బాగాలేదు? మరి ఇన్నాళ్ల తరవాత, రెండు నెలలు బొంబాయి లాంటి నగరంలో ఒంటరిగా గడిపాక, పెళ్లాం పిల్లలు వస్తే ఏ మగాడికైనా హడావిడి ఉండదూ? ఆనందం వల్ల హడావిడి, అందుకే మర్చిపోయాను. మంచాలు కొన్నది కూడా మీకోసమే, ఇల్లూ, సంసారం అన్నాక అన్నీ కావాలిగా?”
”మేమిక్కడికి వచ్చినందుకు మీరు నష్టపరిహారం చెల్లించుకుంటున్నట్టుగా ఉంది. అయినా మీకు సంతోషమే!”
”నువ్వు ఈ మాత్రానికే నష్టపరిహారమంటున్నావు. ఇక్కడ పెళ్లిళ్లకి వేలకి వేలు అనవసరంగా ఖర్చుపెడతారో తెలుసా? టపాకాయలూ, సంగీతం, నృత్యం చివరికి వాళ్లకి దొరికేదేమిటి, ఒక్క భార్యేగా? మరి ఈ రోజు నా ఇంటికి నా భార్య, కూతురు, మనవడు వచ్చారు, ముగ్గురు! అయినా నేను సంతోషించకూడదా? అంటే నేనంత దురదృష్టవంతుడినన్న మాట! దేనికీ నేను ఆనందించకూడదు. కానీ నేనలాంటి వాణ్ణి కాను, దేవుడిచ్చిన దానితోనే తృప్తిగా, సంతోషంగా ఉంటాను.”
”మీలాంటి వారిని చూసే ఈ సామెత వచ్చినట్టుంది, ”పెళ్లికొడుకు నా పెళ్లి అంటూ ఆనందంగా తిరుగుతాడు, కాళ్లకి బేడీలు పడేదాకా తెలీదు!”
”నాకే ఎందుకు సరిపోవాలి, నూటికి తొంభై మంది అలాంటి వాళ్లే. ఇక రుషులకీ, మునులకే తప్పలేదు, ఈ బేడీలు వేయించుకోవటం, నేనెంత? వాళ్లే పెళ్లిని బేడీలనుకోనప్పుడు, నేను సంతోషంగా ఉండటంలో ఆశ్చర్యమేముంది? రోజూ ఇంటికొస్తే ఇల్లు బావురుమంటూ ఉండేది. ఇప్పుడు చూడు, ఎంత కళకళలాడుతోందో!”
ఆఫీసు నుంచి వచ్చి బట్టలు కూడా మార్చుకోకముందే జ్ఞానూ తాతా…. తాతా…. అంటూ వచ్చి కాళ్లకి చుట్టుకున్నాడు.
ఎలాగో ధోవతి మార్చుకుని, ”ఒరే, భడవా! ధోవతి అన్నా మార్చుకోనీరా!” అంటూ వాణ్ణి ఎత్తుకున్నారు. ఇంతలో మా అమ్మాయి టిఫిన్‌ తెచ్చి బల్లమీద పెట్టింది. టిఫిన్‌ తింటూ, కొద్దికొద్దిగా పిల్లవాడికి కూడా తినిపించసాగారు.
ఆ తరవాత ఈయన భోజనం చేస్తున్నప్పుడు స్టూడియోనించి చాలామంది స్నేహితులు ఇంటికొచ్చారు. వాళ్లవెంట వాళ్ల భార్యలు కూడా ఉన్నారు. వాళ్లు తిన్నగా వంటింట్లోకే వచ్చేశారు. వంటవాడు వంట చేస్తున్నాడు, నేనీయన పక్కనే కూర్చుని కబుర్లు చెపుతూంటే ఆయన భోంచేస్తున్నారు. అది చూసి ఆ వచ్చినవాళ్లు, ”ఓ, మీరు ఈయనకి ఇలా పక్కన కూర్చుని భోజనం పెడతారన్నమాట! అందుకే మీరు లేనప్పుడు కడుపునిండా భోజనం కూడా చేసేవాడు కాదీయనగారు!” అన్నారు.                (ఇంకా ఉంది)

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

One Response to ఇంట్లో ప్రేమ్‌చంద్‌-26

  1. vennela says:

    అలాంతి భర్త లభించడము అమె అద్రుష్తము.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.