ప్రశ్నిస్తే…..

పూసపాటి రాజ్యలక్ష్మి
తెల్లవారింది. ఎప్పటిలా సూర్యోదయం, చల్లని గాలి, ప్రకృతిలో ఏ మార్పు లేదు, తన పని తాను చేసుకుపోతుంది. మారుమూల పల్లెలో బక్కచిక్కి నులకమంచం మీద అర్థాకలితో కాళ్ళు ముడుచుకొన్న చెన్నయ్యకు రోజంతా చాకిరి చేసి చేసి అలసిపోయి వచ్చే కూలి తిండికి చాలక, వైద్యం చేయించుకోలేక వంకర తిరిగిపోయిన కాళ్ళు, చేతులతో కళ్ళల్లో ప్రాణం నిలుపుకుంటూ భర్తకు గిన్నెలో పులినీళ్ళు యిస్తున్న మంగమ్మకు దూరంగా వస్తున్న పోలీసులను చూసి చేతిలో నుండి గిన్నె జారిపోయింది.
ఏయ్‌, లంజాముండా కళ్ళు కనిపించటం లేదా అంటూ చెన్నయ్య లేని ఓపిక తెచ్చుకొని అరుస్తుంటే పోలీసుల వాసన కనిపెట్టి పిల్లిలా అయ్యాడు.
ఏరా, నీ కొడుకు జాడ ఎక్కడో తెలిసిందా అని రకరకాల ప్రశ్నలు సంధిస్తున్నారు పోలీసులు.
అయ్యా, నాకు తెలియదు, తెలియదు అనే మాట ఇరవై ఏళ్ళ నుండి చెబుతూనే వున్నాను. వాడు వుంటే ఈ బతుకులు ఇట్లా వుండేవా! బాగా సదువుకునేటోడు, డాక్టరు అయి యింటికి వస్తాడనుకున్న, వాడి జాడ తెలియక ఇరవ ఏళ్ళు అయినాది. ఎట్లగుంటడో కూడా గుర్తుపట్టలేము. వాడు డాక్టరు అయి వచ్చి వుంటే మా బతుకులు రాజాలాగా వుండేవి. కాని ప్రజల పాలిట డాక్టరు అయి మాకు శాపం యిచ్చాడు.
చాల్లే, ప్రజల డాక్టరు అయి జనాలను మోసం చేసి కోట్లు సంపాదించాడు, తెలుసా ముసలి నా కొడకా.
అయ్యా, అంత సంపాదిస్తే కుక్కి మంచం, పుల్లనీళ్లు మాకెందుకయ్యా, ముసలిది మందులు లేక నాటువైద్యం చేయించుకొని ఎట్టా ఎముకల గూడులా అయిందో చూడండయ్యా. ఎప్పుడు మీవాళ్ళందరూ మాపైనబడి ఏడుస్తారు. వాడు ఎలా వున్నాడో, ఏమి చేస్తున్నాడో కూడా మాకు తెలియదు.
ఏరా, ముసలి ముండా కొడకా, ఏమి తెలియదు అంటూనే చాలా మాట్లాడుతున్నావు. ఏ కొడుకు తల్లిదండ్రులను వదిలి యిన్నేళ్ళు ఏడకు పోతాడురా! మీ బతుకులే అబద్దపు బతుకులు. మీవాడి కోసం జల్లెడ పడుతున్నాము. యిప్పటికి మా పోలీసోళ్ళను, నాయకులను ముప్పతిప్పలు పెడుతున్నాడు. అయినా ఎలాంటి కొడుకును కన్నావురా! మీవాడు ఎవరినయినా చంపాలని ప్లాను వేశాడు అంటే చాలు, ఆపటం ఎవరి వల్లా కాదు. అంత మంచి తెలివితేటలు వున్నోడు. యిలాంటి వాడు మా డిపార్టుమెంటులో వుండవలసినోడు, అనవసరంగా అడవులపాలయ్యాడు. సరే, ఆచూకి తెలిస్తే చెప్పకపోయావో నిన్ను లేపేస్తాము జాగ్రత్త.
జ               జ               జ
టి.వి.ల ముందు జనం ఎంతో ఉత్కంఠతో వార్తలు చూస్తున్నారు. ఈ తెల్లవారుఝామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో శ్రీనివాస్‌ మరణించాడు. యాభై మంది పోలీసులు నలుగురు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటరులో ముగ్గురు తప్పించుకున్నారు. శ్రీనివాస్‌ కాల్పుల్లో మరణించాడు. మిగతా ముగ్గురి ఆచూకి కానరాలేదు. పోలీసులు వారికోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.
శ్రీనివాస్‌ చింతపల్లి గ్రామంలో చదువుకొని స్కూలు ఫస్టు వచ్చి వరంగల్‌లో డాక్టరుగా చదువుతూ ఎన్నో ఉద్యమాలలో విద్యార్థి నాయుడిగా పని చేశాడు. తదుపరి చదువును కొనసాగించకుండా అన్నలలో చేరిపోయి అతి కొద్దికాలంలో అంచలంచెలుగా ఎదిగి కేంద్ర కమిటీ సభ్యుడయ్యాడు. అనేక దాడుల వెనుక ఆయన హస్తముందని పోలీసులు తెలుసుకున్నారు. ఆయన అపార పరిజ్ఞానంతో మందుపాతరలు, ఆయుధాలకు సంబంధించి కొత్త పంధాను ప్రవేశపెట్టినట్లు సమాచారం. దాడులకు ఎంత పకడ్బందీగా ప్రణాళిక రచించగలరో, రాజకీయ, ఆర్థిక రంగాలపై అంత అనర్గళంగా మాట్లాడగలిగే సత్తా వున్న నేత శ్రీనివాస్‌. అపార పరిజ్ఞానానికి ఆయన చిరునామా అని అందరూ ఒప్పుకునే మాట. యితన్ని పట్టి యిస్తే పదిల లక్షలు బహుమతి ప్రకటించింది ప్రభుత్వం అని చెప్పుకుపోతుంది న్యూస్‌ రీడర్‌.
వార్తలు వింటున్న వారు మనస్సు చలించి, ఒక నిట్టూర్పుతో ఛానల్‌ మార్చి డాన్స్‌ బేబి డాన్స్‌ చూస్తున్నారు.
జ               జ               జ
ఎంత విచిత్రం, నిన్ననే పోలీసులు వచ్చి శ్రీనివాస్‌ గురించి అడిగివెళ్ళారా, తెల్లారేపాటికి చచ్చిపోయినాడని ఊరిలోని జనం ఆశ్చర్యంగా మాట్లాడుకుంటున్నారు. మన ఊరివాడు ప్రజలకోసం పనిచేస్తుండు, మాయదారి పోలీసులు చంపి పొట్టనపెట్టుకున్నారు. ఈ విషయం తెలిస్తే ఆ ముసలోళ్ళు తట్టుకోలేరు. ఎంత దూరాన వున్నా కొడుకు బాగా వున్నాడని వీళ్ళు బతుకుతున్నారు. వాడు చచ్చిపోయినాడని తెలిస్తే ఆ ముసలోళ్ళు గుండె పగిలి చస్తారు. విషయం తెలియకుండా జాగ్రత్త పడటం అయ్యే పని కాదు. మన బిడ్డ కదా! ఊరికాడికి తీసుకొచ్చి వాడి అమ్మ నాన్నకు చివరిచూపు చూపించి ఈడనే మట్టి చేయాల. అప్పుడయినా ఈ ముసలోళ్ళకి తెలుస్తది కదా! అదీ కాకుండా పెద్ద పెద్దోళ్ళు ఆఖరి చూపుకోసం ఈడకు వస్తున్నారట. ఈ ఊరు ఛాయకు పోలీసులు తప్పితే ఎవ్వరు రారు. అలాంటిది శ్రీనివాస్‌ కోసం ఇంత మంది జనాలు చూడటానికి వస్తున్నారు. ఏమయినా మన శ్రీనుగాడు గొప్పోడు.
జ               జ               జ
శ్రీనివాస్‌ హత్యకు కారకులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, హోం మంత్రి. మానవ హక్కులను కాలరాస్తున్నారు. అరెస్టు చేసి, బందీని చేసి నిస్సహాయుడిని చేసి చంపి ఎన్‌కౌంటరు అని చిత్రీకరిస్తున్నారు. సంఘటన జరిగిన స్థలాన్ని పరిశీలిస్తే ముందుగా చంపి ఆయుధాలు చేతిలో ఉంచినట్లు వుంటే ఎన్‌కౌంటరు అని పోలీసులు చెబుతున్నారు. సంఘటనా స్థలంలో ఎన్‌కౌంటరు గుర్తులు కానరావటం లేదు. నెల రోజుల క్రిందట అతన్ని అరెస్టు చేసారని, హోం మంత్రిని అడిగితే అలాంటిది ఏమీ లేదని ప్రకటన యిచ్చిన రెండురోజులకే ఎన్‌కౌంటరు అయ్యాడు. పోలీసుల మీద హత్యానేరం పెట్టవలసిందే. అరెస్టు అయిన వ్యక్తిని కోర్టుకు తీసుకొని వెళ్ళకుండా, చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారని ప్రజా ఉద్యమనేత వెంకట్రావు మాట్లాడుతున్నారు.
యిది మానవ హక్కుల ఉల్లంఘన. మానవ హక్కుల దృష్టికి విషయాన్ని తీసుకొని వెళుతున్నాము. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాము. శ్రీనివాస్‌కు విప్లవ జోహార్లు, విప్లవ జోహార్లు, అమర్‌ రహే శ్రీనివాస్‌, అమర్‌ రహే అంటూ విప్లవ గొంతులు అరుస్తూనే ఉన్నాయి.
జ               జ               జ
భోజనాలు చేస్తూ కూర్చున్న సురేంద్ర కుటుంబ సభ్యులు ఎన్‌కౌంటరు గురించి మాట్లాడుకుంటున్నారు. ప్రజాస్వామ్యం సమాన హక్కులు అని రాసుకుంటున్నాము గాని ఎక్కడ వున్నాయి? శ్రీనివాస్‌ మంచి ఉద్యమ నాయకులు, ఒక విధంగా మార్కిస్ట్‌ పార్టీకి కుడిభుజం లాంటివాడు. ఎన్నో పోరాటాలు, కష్టాలు పడి ఈ స్థాయికి ఎదిగి ఉంటాడు. ప్రజల పక్షాన రాజ్యం చేస్తున్న ఆకృత్యాలను నిలదీసినందుకు పాపం ప్రాణాలు పోగొట్టుకున్నాడు. రాజ్యహింసకు బలైపోయాడు. పెత్తందారి వ్యవస్థ ఆధిపత్యం ఎంతటి దురాగతానికైనా పాల్పడుతుంది. మానవ హక్కులు మచ్చుకైనా కానరావటం లేదు. ప్రశ్నించేవాడిని ఆధిపత్యం సహించజాలదు. అంత ఎందుకు మా ఆఫీసరుని ఈ పని చేయటంలో మీ తప్పు వుందని నోరు జారి మాట్లాడినందుకు నన్ను మారుమూల పల్లెకు ట్రాన్స్‌ఫర్‌ చేసి పగ తీర్చుకున్నాడు. అలాంటిది రాజ్యాంగ వ్యవస్థను ప్రశ్నిస్తే ఊరికే వుంటారా కసి తీర్చుకోరా! అవును నాన్నా! నేను కూడా స్కూలులో టీచర్‌ను ప్రశ్నించినందుకు నాకు పనిష్‌మెంటు యిచ్చింది అని చిన్న కొడుకు అంటున్నాడు. ఏమయినా పోరాట పార్టీలలో క్రింది స్థాయి నుండి పెద్ద నాయకత్వానికి ఎదగటం అంత ఆషామాషి కాదు. పాపం శ్రీనివాస్‌ గురించి ఆలోచిస్తే అన్నం కూడా తినబుద్ది కావటం లేదని ఉపన్యాసం యిస్తున్నాడు. ఆ స్థాయికి ఎదిగిన నాయకుడు ఒంటరిగా దొరకటం అంత సాధ్యమయ్యే పని కాదు. అతని చుట్టూ దాదాపు పాతిక మంది పహరా కాస్తుంటారు. అలాంటిది పోలీసులకు ఎలా దొరికాడో ఏమో అంటుండగా పెద్దకొడుకు ఆవేశంతో అదికాదు నాన్న ద్రోహులు అతన్ని దగ్గర మనుషులు సమాచారం యిచ్చి అతన్ని తప్పుదోవ పట్టించి పోలీసులకు పట్టించారు. డబ్బు కోసం మనిషి ప్రాణాలు తీయటం పెద్ద కష్టం కాదు నాన్న.
అందరూ ప్చ్‌…. అని ఒక నిట్టూర్పు విడిచారు. శ్రీనివాస్‌ గురించి కథలు కథలుగా మాట్లాడుకుంటున్నారు. మానవహక్కుల గురించి పదే పదే మాట్లాడుకుంటున్నారు. ప్రభుత్వాల గురించి విమర్శిస్తూనే వున్నారు.
యింత చర్చ నడుస్తున్నా సమత అన్నం మెతుకులు కలుపుకుంటూ దీర్ఘాలోచనలో పడింది.
యిది గమనించిన సురేంద్ర ”ఏమిటి సమతా యింత మౌనంగా వున్నావు. యిలాంటి సంఘటనలు జరిగినప్పుడు అన్ని విషయాలు విశదీకరించి అనర్గళంగా మాట్లాడుతావు కదా!”
”నిజమే. గతంలో అయితే అలానే మాట్లాడేదానను. కాని సింధు చనిపోయిన తరువాత మాట్లాడవలసిన అవసరం లేదనపిస్తుంది.”
సింధు ప్రస్తావన రాగానే అందరూ నిశ్చేష్టులయ్యారు. చూడు సురేంద్ర యిప్పటిదాకా మాట్లాడుతూ రాజ్యాన్ని ప్రశ్నించినా, విమర్శించినా, న్యాయం కోసం పోరాడినా, హక్కుల గురించి మాట్లాడినా రాజ్యం హింసిస్తుందని అంటూ ప్రభుత్వాన్ని దుయ్యబడుతున్నావు సమాజపరంగా, రాష్ట్ర రాజకీయాలను, దేశ రాజకీయాలను విమర్శిస్తున్నావు. అదే పరిస్థితి ఒక కుటుంబంలో జరిగితే దాన్ని సమస్యగా చూడకుండా, పెద్ద మేధావిలా ప్రసంగం ఇస్తున్నావు. శ్రీనివాస్‌కు, సింధుకు తేడా ఏమిటి? న్యాయం కోసం పోరాడే వ్యక్తులు అమరులవుతారని, ఈ యిద్దరి విషయంలో నగ్న సత్యం. ఒక వర్గం పట్ల, సమాజం పట్ల స్పృహతో ప్రాణాలు కోల్పోతే వీరమరణం అంటున్నారు. రాజ్యహింసను విమర్శిస్తూ మానవ హక్కులు కాలరాస్తున్నారు అంటున్నారు. అదే సమాజపరంగా కాకుండా ఒక కుటుంబంలో జరిగిన పెత్తందారి ఎన్‌కౌంటరుని ఎవ్వరూ మానవ హక్కుల ఉల్లంఘన క్రింద మాట్లాడటం లేదు. అదే నా ఆవేదన, నా మౌనం.
”ఏమిటి సమత చాలా ఆవేశంగా మాట్లాడుతున్నావు. సింధు, శ్రీనివాస్‌తో వీరమరణం పొందింది అంటావా! నీ ఆలోచన నాకు అర్థం కావటం లేదు.”
”అవును మీకు అర్థం కావు. శ్రీనివాస్‌ను నిస్సహాయుడిని చేసి ఎన్‌కౌంటర్‌ చేసి దారుణంగా చంపారని అందరూ ముక్త కంఠంతో మాట్లాడుతున్నారు. అదే సింధు ఒక కుటుంబంచేత నిస్సహాయురాలిగా ఎన్‌కౌంటర్‌ చేయబడింది. ఆమె మరణం మానవ హక్కుల ఉల్లంఘన క్రింద నమోదు కాలేదు.”
జ               జ               జ
ఉదయాన్నే పూజ ముగించుకుని ప్రసాదాన్ని పరమేశంకు చేతిలో పెడుతూ ఎదురుగా కూర్చుంది వరమ్మ. యింతలో యిద్దరు పోలీసులు వచ్చి హుస్సేన్‌సాగర్‌లో ఒక శవం దొరికింది. అది మీ అమ్మాయి సింధూదని అనుమానిస్తున్నారు. మీరు వచ్చి గుర్తుపడితే తదుపరి జరగవలసిన తంతు జరిపించాలి. త్వరగా బయలుదేరండి అని హడావిడి పెట్టారు. ఏమీ అర్థంగాని ముసలి దంపతులు ఖిన్నులై ఏమి చేస్తున్నారో తెలియకుండా అసంకల్పితంగా పోలీసు జీబులో కూర్చున్నారు.
పోస్టుమార్టం అయిన తరువాత సింధును యింటికి తీసుకొని వచ్చారు. రెండు సంవత్సరాల క్రింద కళకళ లాడుతూ, తుళ్ళుతూ నట్టింట్లో తిరిగిన సింధు శవమై యింటికి చేరింది. ఆ వూరిలోని వాళ్లందరు గుంపులు గుంపులుగా వచ్చి చూసిపోతున్నారు. టి.వి.లలో వరకట్నానికి బలైన మరొక యువతి సింధు. ఆమె నలుగురు అన్నదమ్ముల తరువాత పుట్టిన ఒక్కగానొక్క అమ్మాయి. యింట్లో బాగా గారాబంగా పెరిగింది. చిన్నతనం నుండి చలాకిగా చదువుల్లోనే కాకుండా అన్ని రంగాలలో ముందుండేది. చిన్నతనం నుండి ఎంతో కష్టపడి చదివి స్వయంకృషితో ఉద్యోగం సంపాదించుకుంది. మగపిల్లల మధ్య మగపిల్లాడిగా పెరిగింది. మొదట నుండి ఆత్మవిశ్వాసంతో, ధైర్యంతో వుండేది. ఎక్కడ తప్పు అని తెలిస్తే అక్కడ ప్రతిఘటించేది. మధుతో వివాహం జరిగి రెండు సంవత్సరాలు అయింది. వరకట్న దాహానికి, భర్త అనుమానాలకు నిండు ప్రాణం బలైపోయింది అంటూ న్యూస్‌రీడర్‌ చెప్పుకొనిపోతుంది.
టి.వి.లో చూస్తున్న వారు యిలాంటి హత్యలు షరా మామూలే కదా! రోజుకు ఎన్ని చూడటం లేదు అనుకుంటూ, చానల్‌ తిప్పుకొని మొగలిరేకులు సీరియల్‌లో నిమగ్నమయ్యారు.
జ               జ               జ
విషయం తెలుసుకొని మహిళా సంఘాలు రంగంలోకి దిగాయి. సింధు మృతికి ఆమె భర్త, వారి కుటుంబ సభ్యులు బాధ్యులు. వారిని వెంటనే అరెస్టు చేయాలి. సింధుని నిస్సహాయురాలిని చేసి, ఒంటరిని చేసి, మోసం చేసి విహారయాత్రకని తీసుకొని వెళ్ళిన భర్త ఆమెను హుస్సేన్‌సాగర్‌లో తోసాడు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. పోలీసులు వారివైపు మొగ్గుచూపుతున్నారు. ద్రోహిని కాపాడాలని ప్రయత్నిస్తున్నారు. అతనికి సింధు అంటే యిష్టం లేకపోతే విడాకులు యివ్వచ్చు. ఆమె బ్రతుకు ఆమె బ్రతికేది. అలాంటిది ఆమెను బలి తీసుకోవటం అన్యాయం. ఆడవాళ్ళ హక్కులు గూడా మానవ హక్కుల క్రింద వస్తాయి. సింధుకు న్యాయం జరగాలి. వరకట్న హత్యలను రూపు మాపాలి. ఆమె మృతికి కారణాలు తెలియాలి. వెంటనే సి.బి.సి.ఐ.డి. ఎంక్వయిరీ వేయాలి. అప్పటివరకు మా పోరాటం ఆగదు అంటూ మహిళలపై జరిగే అత్యాచారాలను నిరోధించాలి, వరకట్న చావులను నిరోధించాలి. అమర్‌ రహే సింధు, అమర్‌ రహే సింధు అని అందరూ నినాదాలు యిస్తుంటే సింధు అన్నదమ్ములు వచ్చి చేతులెత్తి నమస్కరించి ఎన్ని చేసినా చచ్చిపోయిన సింధు తిరిగిరాదు. దయచేసి మీరు వెళ్ళండి. మా చెల్లెలు ఆత్మహత్య చేసుకుంది. హత్య చేయబడలేదు అని కళ్ళనీళ్ళ పర్యంతరం అవుతూ స్టేట్‌మెంటు యిచ్చారు.
జ               జ               జ
సింధుని పెళ్ళి చేసుకోవాలని మధు కుటుంబం సంవత్సరం పాటు యింటి చుట్టూ తిరిగారు. ఉమ్మడి కుటుంబం అంతగా బ్రతిమలాడుతున్నారని, అమ్మాయిని యిష్టపడుతున్నారంటే బాగా చూసుకుంటారని మధుకి యిచ్చి పెళ్ళి చేశారు. నలుగురి మగపిల్లల తరువాత పుట్టిన ఆడపిల్లని గారాబంగా పెంచాను. మీ చేతుల్లో పెడుతున్నాము, జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి సింధును మధుకి యిచ్చి పెళ్ళి చేశారు.
సంవత్సరం పాటు అంతా బాగానే గడిచింది. ఆస్తులు పంచుకోవటం యిష్టంలేక ఉమ్మడి కుటుంబంగా ఉంటున్నారు. యింట్లో అందరూ కలిసి వున్నా ఎవరికి వారు గోడలు నిర్మించుకొని బ్రతుకుతుంటారు. పైగా మాది ఉన్నత కుటుంబం. యిలానే వుంటారు అని ఎవరికి వారు సర్దిచెప్పుకుంటుంటారు. యింట్లో పెద్దగా ఒకరికి ఒకరికి మాటలు కూడా ఉండవు.
ఏమ్మా సింధు, ఏదోలే మంచి కుటుంబం అని పెళ్ళి చేసుకున్నాము. మీవాళ్ళందరు బాగా సంపాదిస్తున్నారు కదా! కాస్త మంచి మంచి కానుకలు ఒక్కగానొక్క చెల్లివి యివ్వచ్చు కదా! అందరూ కార్లలో తిరుగుతుంటారు నీవు కూడా కార్లో తిరగాలని మీవాళ్ళకు అనిపించదా!
అత్తయ్య గారు, మీరు ఇలా మాట్లాడటం పద్ధతి కాదు. ఈ రోజుల్లో యిద్దరు కలసి సంపాదిస్తుంటేనే కుటుంబాలు అంతంత మాత్రం నడుస్తున్నాయి. వాళ్ళ బాధలు, వాళ్ళ కుటుంబాలు పిల్లలు వాళ్ళు పడుతున్నారు. యింకా ఏమి యివ్వాలి నాకు. నన్ను మగపిల్లాడిగా సమానంగా చదివించారు, ఉద్యోగం చేస్తున్నాను. మీరు అడిగిన కట్నకానుకలు యిచ్చారు. యింకా మీరు ఆశించటం ఏమి బాగాలేదు. యిలాంటి మాటలు ముందు ముందు మాట్లాడకండి. నేను మావాళ్ళ మీద ఆధారపడను, అలాగని మీ కోర్కెలు అంతకంటే తీర్చలేరు వాళ్ళు. స్వయంకృషితో నేను బ్రతకాలి అనుకునేదాన్ని. నా సంపాదన నెల నెల మీకే ఖర్చు చేస్తున్నాను కదా! యింకా గొంతెమ్మ కోర్కెలకు అవకాశం యివ్వకండి అనటం ఆలస్యం అత్తమామల అహం దెబ్బతిన్నది.
విషయం తెలుసుకున్న మధు బాగా మందలించాడు. అతని నుండి మంచి సపోర్టు వస్తుందనుకున్న సింధు ఖిన్నురాలయింది. మధు ముభావంగా వుండటం మొదలుపెట్టాడు. సింధు కాళ్ళ బేరానికి వస్తుందని ఆశించిన మధు, సింధు పెద్దవిషయంగా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతుంది. మధుకి రకరకాల ఆలోచనలు మొదలయ్యాయి. సింధు ఇండివిడ్యువాలిటీగా వుండటం నచ్చటం లేదు. అలాగే ఉద్యోగమే కాకుండా బయట చాలా సామాజిక కార్యక్రమాలు చేస్తూ అందరికి తలలో నాలుకలా వుంటుంది. సింధుతో ఎక్కడకు బయటకు వెళ్ళినా సింధుదే పైచేయిగా వుంటుంది. మనస్సులో ఏదో మూల అతని పురుష అహంకారం నిద్ర లేస్తూ వుంది.
వున్నట్లుండి, సింధు ఈ నెల నండి నీ జీతం మొత్తం నాకు యివ్వాలి. అన్నాడు.
ఎందుకు, ఎంత కావాలంటే, అంతా యింటికి ఖర్చు చేస్తున్నాను కదా! అలాగని జీతం నీచేతికే యివ్వాలన్న దాంట్లో విషయం నాకు అర్థం కావటం లేదు.
నీవు ఖర్చు పెట్టనవసరం లేదు. జీతం మొత్తం యిస్తే నేను ఖర్చు చేస్తాను. యింటికి యజమాని అన్నీ అతని చేతుల మీద జరగాలి. నేను డబ్బులు నిన్ను అడగవలసిన అవసరం లేదు. అందుకే జీతం నాకు యిచ్చి నీకు ఏ అవసరం వస్తే అప్పుడు నన్ను అడిగి తీసుకో, మొగుడుగా నేను పెత్తనం చేయాలి.
సింధుకి కోపం ఎక్కువయింది. యిలా అంటున్నావు కాబట్టి అసలు ఇవ్వను. నా జీతం పైన నీ పెత్తనం అవసరం లేదు. యింట్లో ఖర్చులు చెరి సమానంగా పంచుకుందాము. అంతేగాని నేను అందరిలా గంగిరెద్దులా బ్రతకలేను. ఎప్పుడూ యిలాంటి ఆంక్షలు విధించకు. పరిస్థితులు దారుణంగా వుంటాయి.
ఇలా మొదలయిన గొడవలు ఎంతదాకా వెళ్ళాయంటే, ఉద్యోగం తప్పితే సింధు ఏ కార్యక్రమాలు చేయకూడదు అన్నాడు. ఆఫీసుకు మధుతోనే వెళ్ళటం, మధుతోనే రావాలని అన్నాడు. బయటకు ఎక్కడికి వెళ్ళాలన్నా తనతోనే వెళ్ళాలని అన్నాడు. ఆఖరికి పుట్టింటికి కూడా ఒంటరిగా వెళ్ళటానికి వీలుకాదన్నాడు. ఫోనులో ఎవరితో మాట్లాడినా తన ఎదురుగా, స్పీకరు పెట్టి మట్లాడాలట. ఉద్యోగానికి ఫోను కూడా తీసుకొని వెళ్ళకూడదట. యిలాంటి ఆంక్షలు భరించలేక ఒకరోజు ఎదురు తిరిగింది. అలా ఎదురు తిరగటం చూసి మధు ఉద్యోగం మానేయమన్నాడు. ససేమిరా మానుకోనని సింధు పట్టుబట్టింది. అది సహించలేని మధు సింధును యింకా వేధించటం మొదలుపెట్టాడు. ఆఫీసుకు రావటం అందరిముందు తిట్టటం, అవమానకరంగా మాట్లాడటం, యింకా ముందుకుపోయి సహోద్యోగులతో అక్రమ సంబంధాలు అంటగట్టి మాట్లాడటం, సింధు తిరుగుబోతని ప్రచారం చేయటం మొదలుపెట్టాడు. యిలాంటి ఘర్షణలో సింధు ఎదురు తిరిగి పుట్టింటికి వెళుతున్నానని చెప్పినప్పుడు చేయి పట్టి లాగి బాగా కొట్టి రెండు రోజులు గృహ నిర్భంధం చేశాడు. ఎలాగో వీలు చూసుకొని తన పుట్టింటికి ఫోను చేయబోతుంటే గమనించిన మధు, వద్దు ఎవరికి చెప్పొద్దు, నాది తప్పు అయింది తెలియక యిలా ప్రవర్తించాను ప్లీజ్‌ నన్ను క్షమించు అని కాళ్ళు పట్టుకున్నాడు. యిక నుండి యిలా ప్రవర్తించను అని కాళ్ళావేళ్ళా పడ్డాడు.
సింధును బాగా చూసుకుంటున్నట్లు యింట్లో అందరూ నటించారు. నాలుగు రోజులు వాతావరణం సద్దుమణిగిందన్నట్లు భావన కల్పించి సింధుని జరిగిన విషయాలు మర్చిపోదాం. నాలుగు రోజులు అలా బయట ప్రదేశాలకు వెళ్ళి సరదాగా గడిపివద్దాం అన్నాడు. నిజమని నమ్మిన సింధు సంతోషంగా టూరు వెళ్ళటానికి బయలుదేరింది.
జ               జ               జ
సింధూ గురించి మాట్లాడుతూ సమత చాలా ఆవేశపడుతుంది. ఈ శ్రీనివాస్‌ ఏమీ కాడు, నిన్నటిదాకా ఎవరో కూడా తెలియదు. అలాంటిది అతని గురించి మనందరము మనవాడిగా, మన యింట్లో వాడికి అన్యాయం జరిగినట్లు మాట్లాడుకుంటున్నాం. టి.వి.లలో చూసి అన్నం కూడా తినబుద్ధి కావటం లేదు. మరి శ్రీనివాస్‌కి, సింధుకి తేడా ఏమిటి. యిద్దరూ పెత్తందారి వ్యవస్థను, బానిస సమాజాన్ని ప్రశ్నించారు. సమాన హక్కులను, ప్రతిపత్తిని ఆకాంక్షించారు. దాన్ని సాధించటం కోసం గళం విప్పి మాట్లాడారు. కాని జరిగింది ఏమిటి. రాజ్యం శ్రీనివాస్‌ను ఎన్‌కౌంటర్‌ చేస్తే, కుటుంబం సింధును ఎన్‌కౌంటరు చేసింది. రూపాలు మారాయి, కాని చేతలు ఒకటే. ఒకటి రాజ్యం, యింకోటి కుటుంబం. తేడా లేదు. శ్రీనివాస్‌ది మానవహక్కుల ఉల్లంఘన, కాని సింధు మరణం ఏ హక్కు క్రిందకు రాలేదు. ఆత్మహత్యగా చిత్రీకరించబడింది. యిదేనా ప్రజాస్వామ్యం అంటే? ఒకరు వీర మరణం అయితే యింకొకరు ఆత్మహత్య. ఎంత తేడా వుంది. ఒక సమస్య పట్ల మగవాడు స్పందించిన తీరుకు, ఆడది స్పందించిన తీరుకు ఎంత తేడా వుంది. మరణంలో కూడా వివక్షే. యిలా ఎంత మంది సమిధలు కావాలో. అందుకే చెబుతున్న మీకెవ్వరికి దేన్ని గురించి మాట్లాడే హక్కు లేదు.
ఎన్‌కౌంటర్లు, వరకట్నం చావులు, ప్రేమ హత్యలు నిత్యం జరుగుతూనే వున్నాయి. కాకపోతే సమస్య ఒకటే అయినా వాటి రూపం మార్చుకుంటూ పోతుంది. అంతే తేడా! కొద్దికాలం జనం విని అయ్యో పాపం అని సానుభూతి ప్రకటించేవారు. ఈరోజు అవన్నీ షరా మామూలు అయ్యాయి. నిత్యకృత్యం అయిపోయాయి. వుండేకొద్ది అతి సహజం అయిపోతాయి. మన దేశంలో ప్రజాస్వామ్యం మూడుపువ్వులు, ఆరు కాయలుగా వర్థిల్లుతున్నందుకు అందరం జయహో జయహో అని పండుగలు చేసుకుందాం.

Share
This entry was posted in కధలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో