నిర్బంధ వైద్యమందిరం కథ

అబ్బూరి ఛాయాదేవి
సత్యసాయిబాబా నుంచి సామాన్య పౌరుడి వరకూ అయిదు నక్షత్రాల ఆసుపత్రిలో చేరితే అంతే సంగతులు!
1991లో మా ఆత్మీయ బంధువు – 54 ఏళ్ళ ఇంజనీర్‌కి జరిగిన ఆఖరి అనుభవాన్నే కళ్ళారా చూసి ‘ఆఖరి అయిదు నక్షత్రాలు’ అనే కథ రాశాను. అందులోని ఆఖరి వాక్యాలు : ”నిజానికి మరణాన్ని కొనుక్కోవడానికి అంతదూరం అంత ప్రయాసపడి ఎవరూ వెళ్ళనక్కర్లేదు మనం పిలిచినా పిలవకపోయినా, రావాల్సిన సమయంలో అదే వస్తుందని అర్థమైంది”.
ఆ విషయమై ఇంకా ఎవరికీ జ్ఞానోదయం కాకపోగా, అనవసరపు ఆశలూ, అజ్ఞానం పెరుగుతున్నాయి. ఆధునిక సాంకేతిక వైద్య పరికరాలు రోగులకు ‘రిలీఫ్‌’ నిస్తాయనీ, ‘రక్షిస్తా’యని ఆశించడం మానడంలేదు. ‘అణుబాంబులు’ ప్రపంచ శాంతికి ఎంత ‘ప్రయోజనకరం’ అవుతాయో, ఆధునిక వైద్య పరికరాలు కూడా ప్రజారోగ్యానికి అంతే ‘ప్రయోజనకరం’ అన్న సత్యాన్ని ఇంకా ఎవరూ గ్రహించడంలేదు.
ఆ రోజుల్లో నేను రాసిన కథ కొంత సంచలనాన్ని సృష్టించింది సమాజంలోని వివిధ వర్గాల్లో, కొన్నాళ్ళ తర్వాత, టి.వి., దూరదర్శన్‌లో ఒక చర్చా కార్యక్రమం ఏర్పాటుచేశారు. ముఖ్య కార్పొరేట్‌ హాస్పిటల్స్‌ యజమానులను ఒక ప్రముఖ ఆంగ్ల వార్తా పత్రిక ఉపసంపాదకుడు ఇంటర్వ్యూ చేసే కార్యక్రమం. అందులో, ఒక ప్రముఖ యజమాని స్పష్టంగా చెప్పాడు. ”మేము ఇన్ని కోట్లు ఖర్చుపెట్టి ఆ పరికరాలను ఏర్పాటు చేశాక, వాటివల్ల ప్రయోజనం పొందవద్దా? ఇన్ని సదుపాయాల్ని మేము ఇక్కడ ఏర్పాటు చేసినా, రాజకీయనేతలు, ప్రభుత్వాధిపతులూ అమెరికా వెళ్ళి వైద్యం చేయించుకుంటారెందుకు?” అన్నారు. కాస్త మానవతా దృక్పథం ఉన్న డా|| కాకర్ల సుబ్బారావుగారు మాత్రమే వాస్తవికంగా మాట్లాడారు. ”అన్ని జబ్బులకి సూపర్‌ స్పెషలిటీస్‌ ఆసుపత్రులకు పరుగులు పెట్టనక్కర్లేదని మా డ్రైవరు, పనివాళ్ళులాంటి వాళ్ళకి చెబుతుంటాను. హార్ట్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ వంటి సమస్యలకోసం వాటిని ఉపయోగించుకోవాలి” అన్నారు.
1993లో మావారు వరద రాజేశ్వరరావుగారు శ్వాసకోశ వ్యాధితో విపరీతంగా బాధపడుతుంటే (భరించే సహనం లేక కొంత), తెలిసిన వైద్యులు ఆసుపత్రిలో చేర్చమని సలహా ఇచ్చారు. మేము ఆ ఏర్పాట్లు చెయ్యబోతూంటే, ”నన్ను అక్కడికి తీసుకెళ్ళి చంపకండే” అన్నారు ఆయన కణతలునొక్కుకుంటూ. ఆయన్ని ఆరోగ్యవంతుణ్ణి చెయ్యాలనే ఆశతో, ఆయన్ని బలవంతంగా బంధుమిత్రులం దగ్గరుండి తీసుకువెళ్ళి, ఆయన అనుకున్నంత పనీ చేశాం. 28 రోజులు పట్టింది ఆ పనికి! ఆసుపత్రికి తీసుకువెళ్ళగానే ముందు స్ట్రెచర్‌ మీద పడుకోబెట్టి జనరల్‌ వార్డ్‌వైపుకి పోనిచ్చి, అక్కడ పరీక్షలు చేశాక, మళ్ళీ స్ట్రెచర్‌ మీద పడుకోబెడితే, ఇంటికి పంపించేస్తున్నారనుకుని ఆయన చిరునవ్వు నవ్వారు. కానీ, ఆయన్ని పై ఫ్లోర్‌లో ఉన్న రెస్పిరేటరీ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌కి తీసుకువెళ్తుంటే గాభరాగా చూశారు మావారు.
అక్కడికి తీసుకువెళ్ళాక ఏవో ఏర్పాట్లు చేస్తూ, వరండాలో కూర్చున్న నన్ను లోపలికి పిలిచారు. నేను భయపడుతూ వెళ్ళాను. ఆయన నోట్లోంచి ‘డెంచర్స్‌’ పట్టుకువెళ్ళమన్నారు. తెల్లబోయాను. మొదటిసారి అటువంటి పనిచేశాను! తరవాత వాళ్ళు కొన్ని నిముషాలపాటు శ్రమపడి, వెంటిలేటర్‌ గొట్టం అమర్చారు. దాన్ని మావారు గట్టిగా పట్టుకుని అరనిముషంలో పీకిపారేశారు. డాక్టర్లు నిర్ఘాంతపోయి ”మీరు అలా చెయ్యకూడదండీ” అంటూ మళ్ళీ పెట్టడానికి ప్రయత్నిస్తూ (ఈలోగా ముక్కు గొంతూ ఎంత రప్చర్‌ అయాయో ఊహించుకోవచ్చు), ”ఒక్క గంటసేపు ఓర్చుకోండి, అంతా సర్దుకుంటుంది” అన్నారు అనునయంగా. ”నన్ను ఒక్కగంటసేపు పాటు ఇంటికి పంపించండి, మళ్ళీ వస్తాను” అన్నారు మావారు తన సహజ ధోరణిలో. కానీ, జానపదకథలో ఆవుని దూడ దగ్గరికి పులి అయినా పంపించిందిగాని ఆసుపత్రిలో డాక్టర్లు మాత్రం మావారిని వదల్లేదు.
వెంటిలేటర్‌ ఏదో ఉద్ధరిస్తుందనీ, శ్వాసతీసుకోవడంలోనూ కఫాన్ని ‘క్లియర్‌’ చేయడంలోనూ సహకరిస్తుందనీ అనుకున్నాం. కానీ అది ‘పద్మవ్యూహం’ లాంటిదని ఒక డాక్టరే అన్నాడు. దానితో రోగి మంచానికి కట్టుబడిపోతాడు. పైగా హార్ట్‌లంగ్‌ మెషీన్‌ అమర్చడం, సెలైన్‌, మందులూ, ‘ఆహారం’ చేతి నరంద్వారా ఎక్కించడానికి ఏర్పాటూ వీటన్నిటితో రోగి మంచానికి కట్టుబడిపోతాడు. తనంతట తను పక్కకి కూడా కదల్లేడు. మలమూత్ర విసర్జనలో స్వయంకృషికి ఆస్కారం లేదు. అటెండెంట్స్‌ మీద ఆధారపడడం. వాళ్ళు అనుసరించే పద్ధతికి రెండుపూటలు గడవకుండానే బెడ్‌సోర్‌ ఏర్పడటం, వాటికి మళ్ళీ మందులూ, ‘ఎయిర్‌బెడ్‌’ ఏర్పాటూ! రోగి ముక్కులోంచి గొంతుద్వారా గొట్టాలు ఏర్పాటుచేయడం వల్ల నోరు విప్పి తనబాధ చెప్పుకునే అవకాశంపోతుంది. చిన్న నోట్‌బుక్‌ మీద పెన్‌తో రాశారు మావారు ”హౌ లాంగ్‌ దిస్‌ టార్చర్‌?” అని.
అధికారభాషాసంఘం అధ్యక్ష హోదా ఆయన్ని ఆదుకోలేదు. అందరిలాగే ఆయనా అయిదు నక్షత్రాల ఆసుపత్రిలోనే అంతమయారు. ఆ వార్డులో ఒక్కొక్క రోగిపోయి, బెడ్‌ ఖాళీ అయినప్పుడల్లా ఆయనకి జ్వరం వచ్చేది. ఒకసారి ఒక న్యూట్రిషన్‌ స్పెషలిస్ట్‌ వార్డ్‌లోకొచ్చి నాలుగు బెడ్లు ఖాళీగా ఉండటం చూసి, నవ్వుతూ తోటి డాక్టర్‌తో ”నలుగుర్ని ఒక్కసారి లేపేశారే!” అన్నాడు. ”పిల్లికి చెలగాటం, ఎలక్కి ప్రాణసంకటం” అన్న సామెత గుర్తుకొచ్చింది. నన్ను ఒకసారి మా వారు నోట్‌బుక్‌ ద్వారా అడిగారు ”నేను క్రైసిస్‌లో ఉన్నప్పుడు ఎక్కడున్నావ్‌?” అని. నన్ను లోపల ఉండనిచ్చే వారు కాదు కొన్ని సమయాల్లో. వరండాలోకి వెళ్లి కూర్చోమనేవారు. ఆయన ఎవరితోనూ చెప్పుకోలేక నిస్సహాయంగా దిక్కూ మొక్కూలేనట్లు మంచం మీదపడి ఉండేవారు. పక్కన ఉండి భర్తకి ఏదైనా సేవ చేసే అవకాశం ఉండేదికాదు. అన్నింటికీ మెషీన్లే కదా! ఒకసారి ఆయన కాఫీ తాగాలని ఉందన్నారు. వెంటనే, ఆ ఆసుపత్రికి దగ్గరలోనే ఉన్న మిత్రుడి ఇంటినుంచి మంచి కాఫీ ఫ్లాస్క్‌లో తెప్పించి డాక్టరుకీ, నర్సుకీ చెప్పి ఇచ్చాం. వాళ్ళు గొట్టంలోంచి పోశారు. కొంత సేపయాక మావారు కాఫీ ఏది అని రాశారు నోట్‌బుక్‌లో. ”ఇచ్చారు కదా గొట్టం ద్వారా” అన్నాను. ఆయన నాలుక బయట పెట్టారు ”రుచి ఏదీ!” అన్నట్లు. చివరికి ఆయన నిస్పృహ చెందుతుంటే, ”మీకు ‘విల్‌పవర్‌’ ఉండాలండీ” అన్నాను. నోట్‌బుక్‌ తీసుకుని, ”బిల్‌పవర్‌ కూడా ఉండాలి” అని రాశారు. అదే ఆయన ఆఖరి హాస్యోక్తి!
మరొక కేసు-
తండ్రి శతజయంతి ఉత్సవానికి వచ్చిన వరద రాజేశ్వరరావుగారి అన్నగారు చెన్నైకి తిరిగివెళ్లాక జబ్బుపడి ఒక అయిదు నక్షత్రాల ఆసుపత్రిలో చేరారు. కొడుకులు చేర్పించారు. నేనూ, ఆయన కూతుళ్ళు చూడటానికి వెళ్ళాం. ఇలాగే వెంటిలేటర్‌ తోనూ, హార్ట్‌లంగ్‌మెషీన్‌తోనూ, సెలైన్‌ బాటిల్‌ కనెక్షన్‌తోనూ ఉన్నారు. స్సృహలో లేకుండా, 7 శాతం క్రమంగా 70 శాతంకి పెరగవచ్చుకదా” అన్నారు. ఆ డాక్టరే, (చిన్నవాడూ, మంచివాడూ) మమ్మల్ని పక్కకి పిలిచి, ”నా తండ్రి ఈ పరిస్థితుల్లో ఉన్నా, నేను వీటిని తొలగించమనే చెబుతాను” అన్నాడు. దాంతో కొడుకులు ధైర్యం తెచ్చుకుని ”సరే మీ ఇష్టం” అన్నారు. అంతే, ఆ మెషీన్లని తొలగించిన ఇరవైనాలుగు గంటల లోపునే రోగి మరణించినట్లు నిర్ధారించారు. ఆ మెషీన్లని వాడటం అవసరానికి మించి వాడటం డబ్బు గుంజడానికేనని మరోసారి రుజువైంది
ఇంకో కేసు –
మా దగ్గరి బంధువైతే రిటైరైన కొత్తలో ‘సి.జి.హెచ్‌.ఎస్‌.’ ద్వారానే ఒక కార్పొరేట్‌ ఆసుపత్రిలో చేరాడు. చేరినప్పుడు పరిస్థితి అంత తీవ్రంగా లేదు. కానీ త్వరలోనే విషమించింది. కూతురు (డాక్టరు) అమెరికా నుంచి వచ్చి వారం రోజులుండి, వైద్యం బాగానే జరుగుతోందని గమనించి, తిరిగి వెళ్ళిపోయింది. పరిస్థితి మరింత విషమించిందని తెలిసి, కొడుకు వచ్చాడు (సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌) అమెరికా నుంచి. తండ్రి మెషీన్‌ కనెక్షన్‌తో ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో అద్దాల వెనకాల ఉన్నాడు. ఎన్నాళ్ళుండాలో, రోగి పరిస్థితి ఎలా ఉందో స్పష్టం కావడంలేదు. అమెరికాలో అతని ఉద్యోగంలో సెలవు కావల్సినంత స్థితి లేదు. ఎన్నాళ్ళు ఉండాలో, ఎప్పుడు వెళ్ళాలో, వెళ్ళాలో వెళ్ళకూడదో తెలియని సందిగ్ధస్థితిలో నన్ను సంప్రదించారు. ఆ హాస్పిటల్లో నాకు తెలిసిన ఒక వైద్య నిపుణుడికి పరిస్థితి తెలియజేసి, సలహా అడిగాను. రోగి పరిస్థితి గురించి హాస్పిటల్‌ అధికారులతో మాట్లాడాడు. రోగికి అమర్చిన సాంకేతిక వైద్య పరికరాలను తొలగించారు. 24 గంటలలోగా మరణించినట్లు ధృవీకరించారు.
అయిదేళ్ళక్రితం నాకు ఆస్థ్మా ఎక్కువైపోయి, ఊపిరి తీసుకోలేని స్థితిలో ఆయాసపడుతూ బాధపడుతున్నాను. మా ఫ్యామిలీ డాక్టరు ఊళ్ళో లేడు సమయానికి. నా శ్రేయోభిలాషిణి అయిన ఒక పెద్దావిడ ద్వారా ఆవిడకి సంబంధించిన హాస్పిటల్‌కి వెళ్ళాను. ఒక లేడీ డాక్టర్‌ నన్ను పరీక్షించి, ”పరిస్థితి సీరియస్‌గా ఉంది. మీరు వెంటనే హాస్పిటల్లో ఎడ్‌మిట్‌ అవాలి” అంది.
”సారీ, నాకు కుదరదండీ, ఏవైనా మందులు ప్రిస్‌క్రైబ్‌ చెయ్యండి” అన్నాను. ఆవిడ మందులు రాసిన కాగితంమీదే మార్జిన్‌లో, ”ఈవిడ ఎడ్‌మిట్‌ అవడానికి అంగీకరించలేదు” అని రాసింది. అంటే, నాకేదైనా అయితే, తన బాధ్యతలేదని సూచిస్తున్నట్లు. నేను పట్టించుకోలేదు. ఒక కార్డి జోన్‌, ఇంకా ఇతర మందులూ రాసింది. వాటిని వాడాను. పదిహేను రోజుల్లో కోలుకున్నాను! ఆవిడ సూచన ప్రకారం ఎడ్‌మిట్‌ అయి ఉంటే పరిణామం ఎలా ఉండేదో ఊహించుకోవచ్చు.
అయితే, ఆసుపత్రినుంచి ఎవరూ బతికి బయటపడరని కాదు. ఈ మధ్య మల్లాది సుబ్బమ్మ గారు మృత్యుద్వారం వరకూ వెళ్ళి తిరిగి వచ్చారు. ఈ రోజో రేపో అన్నట్లుగా ఉంది పరిస్థితి అని తెలిసి, నేను ఒక మిత్రురాలితో కలిసి ఆవిడని ఉంచిన ఆసుపత్రికి వెళ్ళాను. పరిస్థితి విషమంగానే ఉంది. సరే, ఏం చేస్తాం అనుకుని, అంతిమ వార్తకోసం ఎదురుచూశాం. కానీ ఏ కబురూ తెలియకపోతే, కొద్దిరోజులు పోయాక, ”ఆవిడ ఎలా ఉన్నారండీ?” అని కొడుకుని ఫోన్‌లో అడిగాను. ”ఇంటికి తీసుకొచ్చామండీ ఫరవాలేదు” అన్నాడు. ”ఆవిడ కోలుకోవడం చాలా అద్భుతం కదా! మీరు బాగా చూసుకున్నారు” అన్నాను ప్రశంసిస్తూ. ”ఆవిడ ఎవరనుకున్నారు మేడమ్‌! – మల్లాది సుబ్బమ్మగారు కదా!” అన్నాడు కొడుకు నవ్వుతూ.
అయిదేళ్ళ క్రితం నేను ఆస్థ్మా ఎటాక్‌ నుంచి కోలుకున్నాక నాకు రెండో కంటి ఆపరేషన్‌ కూడా జరిగింది. మళ్ళీ ఈ మధ్య ఆస్థ్మా ఎక్కువైంది. రెండుసార్లు స్టెరాయిడ్స్‌ వాడినా తగ్గలేదు. మూడోసారి మళ్ళీ మందు మార్చారు మా ఫ్యామిలీ డాక్టరు. నాకు హాస్పిటల్లో చేరడం ఇష్టంలేదని ఆయనకి, తెలుసు. మధ్యలో సివియర్‌ డయేరియా పట్టుకుని మరింత నీరసించిపోయాను. అయినా, నాకు కావల్సిన, నాకు పడే ఆహారం చేసుకుని పరిమితంగా తింటూ, కావల్సినది తాగుతూ (వేడి పాలూ, టీ, ఎలక్ట్రాల్‌ వంటివి), నా పనులు ఇంట్లోవీ, బయటవీ ఆయాసపడుతూనే చేసుకుంటున్నాను. ఖపం బయటికి రాక చాలా అవస్థపడుతున్నా, ఓపిగ్గా దగ్గుతున్నాను. రాత్రిళ్ళు పక్క, వాటా వాళ్ళకి నా దగ్గు చప్పుడు ఇబ్బంది కలిగిస్తుందని తెలిసినా, నా బాధ నేను పడుతున్నాను.
మా చుట్టుపక్కల భవన నిర్మాణం చేసేవాళ్ళు లారీల్లో కంకర తీసుకొచ్చి తెల్లవారుఝామున పెద్ద చప్పుడు చేయడం, గుండె బరువెక్కేటట్లు మోటారు నడిపి శబ్దాలు చేస్తూంటే అందరం భరించడం లేదా? క్రికెట్‌ మ్యాచ్‌ గెలిచినా అర్థరాత్రి దాటాక టపాకాయలు పేల్చి నా దగ్గువల్ల కలిగే ఇబ్బంది అంతకంటే ఎక్కువదా అనుకుని నా బాధ నేను పడుతున్నాను. ఆయాసపడుతున్నా నా పనులు చేసుకోవడం మానడం లేదు. మా ఇంటికి దగ్గర్లో పెద్ద చెత్తకుండీల సెంటర్‌ ఉంది. దానిపక్కనే జిరాక్స్‌ మెషీన్‌ నడిపే చిన్న షాపు వుంది. అక్కడికి అవసరమైనప్పుడు వెళ్తున్నాను. ఏ బాక్టీరియా నన్ను పట్టుకుని బాధించడం లేదు. హాస్పిటల్లో ‘ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌’లో బాక్టీరియా సోకకుండా రోగిని అద్దాల వెనక అట్టిపెట్టినా, ఇన్‌ఫెక్షన్స్‌ ఏర్పడి, కిడ్నీ ఫెయిల్యూర్‌, లివర్‌ ఫెయిల్యూర్‌ ఏర్పడుతూనే వున్నాయి. మల మూత్రాల విసర్జన సహజంగా శరీరం కథలికల సహాయంతో జరక్కుండా రోగిని మంచానికి కట్టిపడేసినట్లు చేసి, కీథటర్‌ వంటివి పెట్టి ఎక్కువసేపు దాన్ని వాడితే మళ్ళీ ఇన్‌ఫెక్షన్‌ వస్తుందని డాక్టర్లు చెబుతూనే రోగిని అవస్థపెడుతూ ఉంటారు. మలమూత్రాల ద్వారం వద్ద ఇరిటేషన్‌ ఏర్పడితే, ఇంట్లో అయితే, సోఫ్రామైసిన్‌ వంటి అయింట్‌మెంట్‌ వాడి నయం చేసుకోవచ్చు. కోతి పుండు బ్రహ్మరాక్షసిని చెయ్యకుండా.
నేను ఆస్థ్మాతో ఎంత తీవ్రంగా బాధపడుతున్నా, ప్రస్తుతం నేను ఎటువంటి ‘నిర్బంధవైద్య మందిరం’లోనూ నిస్సహాయంగా చావు బతుకుల మధ్య కొట్టుకోకుండా, మా ఇంట్లోనే ఉండి బాధపడుతున్నా, స్వేచ్ఛగా ఉన్నాను – నా పనులు నేను చేసుకుంటూ, శారీరకంగా శ్రమపడుతున్నా, మానసికంగా ఒత్తిడి లేదు కనుక బి.పి. కంట్రోల్‌ లోనే ఉంది. కొత్తగా వచ్చే మందులు వాడుతున్నాను డాక్టరు సూచించినట్లుగా. ”పోనీ, హోమియోపతి వాడరాదూ?” అని కొందరూ, ”ఆయుర్వేదంలో మంచి మందులున్నాయి. త్రిఫల చూర్ణం వాడి చూశారా?” అని కొందరూ సలహాలిస్తూ ఉంటారు. ఎవరికీ ఏ మందుల్లోనూ సంపూర్ణ విశ్వాసంలేదు. విష్ణువు కాకపోతే శివుడు, శివుడు కాపోతే మరో స్వామీజీ అని భక్తులు ప్రయత్నించినట్లు రోగులకు కూడా సలహాలిస్తూ ఉంటారు బంధుమిత్రులు.
ఇంకా బతకాలన్న కోరిక నాకు లేకపోయినా, ఆస్థ్మా ఉధృతం తగ్గి, ఆ బాధనుంచి బయటపడతానన్న నమ్మకం నాకుంది. ఒకవేళ ఆయాసం భరించలేక, గుండె ఆగిపోయినా అంతకన్న అదృష్టం ఏముం టుంది? ‘నిర్బంధ మందిరం’లో నిస్సహాయంగా రహస్యంగా చావు బతుకుల మధ్య ఊగిసలాడకుండా, నా పరిస్థితి నలుగురికీ తెలిసేటట్లు స్వేచ్ఛగా ఉన్నానన్న తృప్తి ఉంది!  (వార్తలో ప్రచురితమైంది)

Share
This entry was posted in ప్రత్యేక వ్యాసాలు. Bookmark the permalink.

One Response to నిర్బంధ వైద్యమందిరం కథ

  1. sivalakshmi says:

    కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఉండే వాస్తవ పరిస్థితుల్ని కళ్ళకు కట్టించిన చాయాదేవి గారికి కృతజ్ఞతలు.”నిర్భంధ వైద్య మందిరం” కి వెళ్ళే ముందు బాగా అలోచించి నిర్ణయం తీసుకోవాలని తెలియజెప్పినందుకు వారికి ధన్యవాదాలు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.