అభివృద్ధి – వెలుగు నీడలు

( ఇటీవల మరణించిన ఆర్‌.ఎస్‌.రావుగారికి భూమిక నివాళి)

ఆర్‌.ఎస్‌.రావు
మా యూనివర్సిటీ పక్కనే  హీరాకుడ్‌ డ్యాము వుంది. మహానది మీద కట్టిన ఈ ఆనకట్ట స్వాతంత్య్రా నంతర భారతదేశంలో మొట్ట మొదటి బహుళార్ధసాధక ప్రాజెక్టు. కొన్ని వేల ఎకరాలకి నీటి సరఫరా నుండి అనేక ప్రాంతాలకు విద్యుత్‌ శక్తి సరఫరా దాకా వివిధ  ప్రయోజనాలు నిర్వర్తించే  ఈ ప్రాజెక్టు  మన ఆభివృద్ధికి ఒక ప్రతీక. అయితే దీని చుట్టు ప్రక్కల గ్రామాలకు ఇంకా కరెంటు రాలేదు.
ఈ గ్రామాలలోని ఓ గ్రామంలో ఒక గిరిజనుణ్ణి ఈ అనకట్ట మీద అభిప్రాయం అడిగితే ”దీపపు  సెమ్మ చుట్టు వెలుతురు ఉన్నా దాని క్రింద కొంతభాగం అది సృష్టించే నీడలో ఉండాల్సిందేకదా” అని ఎంతో తాత్వికంగా చెప్పాడు. అతని వ్యాఖ్య మన దేశంలో ‘అభివృద్ధి’పై ఒక ఎక్స్‌రే రిపోర్ట్‌లా అనిపించింది.
‘అభివృద్ధి’ అనే భావన ఏకకాలంలో క్లిష్టమైనదనీ, సులభంగా అర్ధమయ్యేదీ కూడా. సులభంగా ఎందుకు అర్ధమవుతుందంటే ‘అభివృద్ధి’ కున్న స్పష్టమైన దర్శనీయత వల్ల క్లిష్టమయింది. ఎందుకంటే దాని వెలుతురుని అనుభవించి అర్ధం చేసుకోగలిగినంత సులభంగా, అది సృష్టించే నీడల్ని అర్ధంచేసుకోలేం కాబట్టి. ఆ వెలుగులో నీడల గురించే ఈ వ్యాసం.
మన దైనందిన జీవితానుభవాలను, మన మెరిగిన ప్రాజెక్టులు, ఫ్యాక్టరీలు, సంస్థలు, విద్యాలయాలు మొదలైన వాటి కార్యకలాపాలను, మన చుట్టూ జరిగే సంఘటనల నేపథ్యాన్ని- వీటన్నిటి సారాన్ని పోగు చేసి పరిశీలిస్తే ఈ అభివృద్ధి విశ్వరూపం, దాని ఫలితాలు చాలావరకూ అవగాహన అవుతాయి. ఇవన్నీ మనకు ‘అభివృద్ధి’లోని వేర్వేరు అంశాల్ని విడమర్చి చెప్తాయి. ఈ వివిధాంశాల మధ్య వైరుధ్యాలు నీడల్ని వెలుగులోకి తీసుకొచ్చి మన మధ్య ‘అభివృద్ధి’ అనే భావనని చర్చనీయాంశం చేస్తున్నాయి. హీరాకుడ్‌ చుట్టు ప్రక్కల కరెంటు లేని గ్రామాలలో గిరిజనుల జీవితం కానివ్వండి,కారంచేడు ఘర్షణ కానివ్వండి, విజయవాడ అల్లర్లు కానివ్వండి- అన్నీ ఈ ‘అభివృద్ధి’ వెలుగు నీడల్ని విశదపరిచేవే. మన రాష్ట్రంలో కాటన్‌ దొర చలువవల్ల వందేళ్ళకు పైగానే చరిత్రను  నిర్మించుకున్న ఈ ‘అభివృద్ధి’ పర్యవసానాలు ఇప్పుడు ఒక రూపధారణ చేసుకుంటున్నాయి.
ఆనకట్ట కానివ్వండి, ఫ్యాక్టరీ కానివ్వండి, ఆ మాట కొస్తే యూనివర్సిటీ కానివ్వండి. సాధారణంగా చూస్తే ఓ పెద్ద ఉత్పత్తి శక్తిగా కనిపిస్తుంది. దాని వెనుక తప్పనిసరిగా ఎంతో జ్ఞానం దాగి ఉంటుంది. ఈ ఘనీభవించిన మానవజ్ఞానం మానవుడి ఉత్పత్తి శక్తుల పెరుగుదలకి ఒక సూచిక
హీరాకుడ్‌ ప్రాజెక్టుకాని, కాటన్‌దొర కట్టిన ఆనకట్టలు కాని తీసుకుందాం. ఒకానొక నదీజాలాల ప్రవాహాన్ని ఆపి, లేదా కుదించి, ఆ నీటిని ఇతర అవసరాలకు మళ్ళించేందుకు కావలసిన పరిజ్ఞానం సంపాదించి సిమెంటు, ఇనుము, ఇతర పదార్థాలను సృష్టించి, వాటిని అవసరమైన స్థలానికి అవసరమైనంత మేరకు మళ్ళించి, ఆ నీటి వేగాన్ని అడ్డుకోవడానికి అవసరమైనంత శక్తిగల ఓ అడ్డుగోడను లేపటం వెనుక ఎంతో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం వుంది. ప్రకృతి చలన సూత్రాలను ఉపయోగించి ఒక విశాల మానవహస్తం అనంత జలప్రవాహాన్ని అడ్డుకుని మానవ ప్రయోజనాలకు మళ్ళించడం మనల్ని అప్రతిభుల్ని చేస్తుంది. అందుకే ఎంతో మానవ జ్ఞానం ప్రోగుపడిన ఫలితంగా పెరిగిన మానవుడి ఉత్పత్తి శక్తులకు ఈ ఆనకట్ట ఒక సూచిక అవుతుంది.
ఇలా ఏ అభివృద్ధి పథకం  తీసుకున్నా దానివెనుక అనంతమైన జ్ఞానం కన్పిస్తుంది. ఈ జ్ఞానం మానవ మేధస్సు నుండి క్రమానుగతంగా పెరుగుతుంటుంది. ఈ పెరుగుదల ఫలితంగా ఉత్పత్తి శక్తులు వికసిస్తాయి. వాటి వికాసపు ఫలితంగా ‘అభివృద్ధి’ జరుగుతుంది. ఈ అభివృద్ధి కారణంగా ‘అభివృద్ధి పథకాలు’ వివిధ రూపాల్లో ముందుకు వచ్చాయి. మున్ముందు వస్తూంటాయి. ఆనకట్టలు, గనులు, కార్ఖానాలు, ఎత్తయిన మేడలు, ఆ మేడలమీద ఎగురుతూ వెళ్ళిపోయే విమానాలు, కంప్యూటర్లు, ఆ కంప్యూటర్లు చెయ్యగల ఎన్నో విచిత్రమయిన పనులు- ఈ ‘అభివృద్ధి’కి గల అనేకానేక రూపాలు మనకు సుపరిచితాలే. అయితే వాటి సారం ఏమిటి?
ఏ ఉత్పత్తి శక్తుల పెరుగుదల అయినా, దాని వెనుక నిబిడమయిన మానవ శ్రమ, విజ్ఞానాల ఫలితమే. ఆ విజ్ఞానం ఒకానొక ప్రాపంచిక దృక్పథం కారణంగా పెంపొందుతుంది. అంటే అంతిమ పరిశీలనలో ఏ రూపంలో కన్పించే ‘అభివృద్ధి’ పథకమయినా, ఒకానొక ప్రాపంచిక దృక్పథం నుండి జనిస్తుందని తేల్చి చెప్పవచ్చు. ఆ రకంగా ఆయా అభివృద్ధి పథకాల సారం వాటికి కారణమైన ప్రాపంచిక దృక్పథమే. అందుచేత ఏదైనా పథకాన్ని తీసుకుని ఇది అభివృద్ధి అవునా కాదా అని తేల్చుకోవాలనుకున్నపుడు ఆ అభివృద్ధి పథకం ప్రాపంచిక దృక్పథంలో ఏమైనా మార్పులు తీసుకొచ్చిందా, లేదా అప్పటికే బలంగా వున్న వేరొక ప్రాపంచిక దృక్పథంలో తానే ఒక భాగమైపోతుందా అనే అంశాన్ని జాగ్రత్తగా గమనించాలి.
ఒక్కమాటలో చెప్పాలంటే ఒకానొక దేశకాల పరిస్థితులలో మనిషికి,ప్రకృతికి మధ్యగల సంబంధాన్ని లేక వైరుధ్యాన్ని గురించి తెలియచేసే ఒకానొక దృక్పథాన్ని ఒక నిర్ధిష్టమయిన ప్రాపంచిక దృక్పథంగా చెప్పుకోవచ్చు. మనిషికి, ప్రకృతికి మధ్య ఉండే సంబంధంలో ఐక్యత ప్రధానంగా ఉందా లేక ఘర్షణ ఎక్కువగా ఉందా అనే అంశం అతడి ప్రాపంచిక దృక్పథాన్ని నిర్వచిస్తుంది. మనిషికి ప్రకృతితో ఐక్యత అనేది ఘర్షణ కంటే ప్రధానమైనదిగా ఉంటే అప్పుడు అతని జ్ఞానం పెరగడానికి, తద్వారా అతడి ఉత్పత్తి శక్తుల పెరుగుదలకి, దాని మూలంగా సాధ్యమయ్యే అభివృద్ధికి అవకాశముండదు. ఇది ఫ్యూడల్‌ ప్రాపంచిక దృక్పథం అంటే ప్రకృతి అందించే వనరులని యథాతథంగా వాడుకోవడం తప్ప,దాని చలన సూత్రాలను పరిశీలించి వాటిలో దాగిన రహస్యాలను ప్రశ్నించి, అంతకుముందు సేకరించిన జ్ఞానాన్ని మెరుగుపరచడం, ఈ ఫ్యూడల్‌ ప్రాపంచిక దృక్పథంలో ఉండదు. ప్రకృతితో మమేకమవడం లేదా సర్దుకు పోవడం దీని ప్రధాన లక్షణం. ఈ ఫ్యూడల్‌ ప్రాపంచిక దృక్పథంలో ఉండే జ్ఞానమంతా అందించే కానుకగా, ఉన్నదున్నట్లుగా ప్రకృతి వనరులని వినియోగించుకోవడంగా ఉంటుంది. అంతిమ పరిశీలనలో అది నిరంతర పరిణామానికి గురి అయ్యే పరిశోధనా  స్రవంతిగా కాక, ఎల్లప్పుడు యథాతథంగా కొనసాగుతూ ముందు తరాలకు పవిత్రంగా అందించబడే నమ్మకాల ప్రవాహంగా ఉంటుంది. చివరికి జ్ఞానమనేది కొంత  అనుభవం ప్రాతిపదికగా ఏర్పడిన ఓ తిరుగు లేని విశ్వాసంగా మారిపోతుంది.
అందుకే నిజమైన ‘అభివృద్ధి’ ఉత్పత్తిశక్తుల పెరుగుదలకు దోహదపడుతుందని మనకి తెలుసు. ఆ ఉత్పత్తి శక్తుల పెరుగుదల వివిధ రంగాలలో మానవజ్ఞానం వికసించడం మూలంగా జరుగుతుందని తెలుసు. ఈ జ్ఞాన వికాసం ప్రకృతి కరుణకోసం ఎదురుచూస్తూ కూర్చోదు. అది ప్రకృతి నియమాలను శోధించి, భేదించి అనేక అడ్డంకులకు అధిగమించే నిరంతర సంఘర్షణ ఫలితం. ఇలా నిర్విరామంగా ప్రకృతితో మనిషి సాగించిన ఘర్షణ నుండే అనేక ఆవిష్కరణలు జనించాయి. ఊహకందని అభివృద్ధి సాధ్యపడింది. ప్రకృతితో ఐక్యత కంటే ఘర్షణ ప్రధానమైన ఒకానొక ప్రాపంచిక దృక్పథమున్నపుడే ఇలాంటి జ్ఞానవికాసం సాధ్యమవుతుంది. దీనిని ప్రస్తుతానికి పెట్టుబడిదారీ ప్రాపంచిక దృక్పథం అని చెప్పవచ్చును.
ఆనకట్టల విషయాన్నే తీసుకుందాం. సింధులోయ నాగరికతా కాలంనుండీ మనిషి కాలువలు త్రవ్వడం, నీటిపారుదల సదుపాయాలు మెరుగుపరుచుకోవడంలాంటివి చేస్తూ వచ్చాడు. అయితే అది ప్రకృతి అనుగ్రహించిన మేరకు తప్ప, ప్రకృతిలో నిబిడమై ఉన్న సూత్రాల ఆధారంగా దానితో ఘర్షణపడి, మరింత మెరుగైన సౌకర్యాలను సృష్టించుకోవడం కాదు. అది ఫ్యూడల్‌  ప్రాపంచిక దృక్పథంలో సాధ్యంకాదు. అలా జరగాలంటే ప్రకృతితో ఘర్షణతో ఘర్షణలో భాగంగా, ప్రకృతి నియమాలను గ్రహించి  ఆర్జించిన జ్ఞానంతోనే సాధ్యపడుతుంది. కోస్తా ఆంధ్రాలో విజయవాడలోని ‘అభివృద్ధి’ కూడా  ఈ రకం జ్ఞానంవల్లే సాధ్యమయింది. కాటన్‌దొర కట్టిన ఆనకట్టలు, తద్వారా వ్యవసాయరంగంలో వచ్చిన మార్పులూ, ఆ రంగం నుండి అదనపు విలువ ఇతర రంగాలలోకి రావడం అనే క్రమంవల్లే ఈ ‘అభివృద్ధి’ సాధ్యమయింది. మనదేశంలో ఈ అభివృద్ధి ఏ ప్రాపంచిక దృక్పథాన్ని జనరేట్‌ చేస్తుందనేదే మన ముందున్న ఏకైక ప్రశ్న. వంద సంవత్సరాల ‘అభివృద్ధి’ మిగిల్చిన శేషప్రశ్న.
ఈ ప్రశ్నకి సమాధానం మన రోజువారీ జీవితంలో అంతర్లీనంగా మెసులుతూనే ఉంటుంది. ఉదాహరణకి ఇంట్లో ఎవడైనా కుర్రవాడు టేబిల్‌ మీద ఉన్న పెన్నుని తీసుకున్నాడనుకోండి. వాడిలో అనేక ప్రశ్నలుంటాయి. దాన్ని వాడు రకరకాలుగా పరీక్షిస్తాడు. అటు, ఇటు తిప్పుతాడు, దాని భాగాల్ని విడదీస్తాడు. వాటిని మళ్ళీ కలుపుతాడు. ఏదో కొత్త విషయం తెలుసుకున్న విచిత్రానుభవానికి గురి అవుతాడు. వాడిలో ఈ కుతూహలం ప్రకృతితో ఘర్షణలాంటిది. కాని ఈ లోగా పెద్దవాళ్ళోవరో వస్తారు. ఈ పెన్ను ఎందుకు ముట్టుకున్నావని కసిరి దాన్ని జాగ్రత్తగా వాడుకోవాలని హెచ్చరిస్తారు. వాళ్ళ హెచ్చరిక ప్రకృతితో ఐక్యతని ప్రతిపాదిస్తుంది. పెన్నుగురించి ఎన్నో ప్రశ్నలున్న పిల్లవాడు ”పెన్నుని విప్పడం తప్పు, దాన్ని పదిలంగా భద్రపరుచుకోవాలి.” అనే భావజాలాన్ని ఒక నమ్మకంగా స్వీకరిస్తాడు. ప్రశ్నించే మానవుడి ప్రాపంచిక దృక్పథంవలన, జ్ఞానంవలన్న తయారయిన పెన్ను,సాంప్రదాయంగా వస్తున్న నమ్మకాలని మరింత బలోపేతం చేసే సాధనం అవుతుంది.
హీరాకుడ్‌ ఆనకట్ట కట్టాక నిజంగా ఉత్పతిశక్తులు పెరిగి, అది ఆ రకం ఆనకట్టల్ని విదేశీ సహాయం లేకుండా కట్టగలిగే జ్ఞానాన్ని మనకిచ్చి అభివృద్ధి కారకమై ప్రాపంచిక దృక్పథంలో మార్పులు తీసుకువచ్చి ఉంటే ఈ ఆనకట్టలవలన, అభివృద్ధి వలప పురోగమనం సాధ్యమవుతుందనే స్పృహ ప్రజలలో వచ్చి ఉండేది. అయితే ఈ ఆనకట్ట ప్రక్కనే కొత్తగా కడుతున్న రేంగాలి ఆనకట్టకి వ్యతిరేకంగానూ, ఇదే జిల్లాలో ప్రభుత్వం చేపట్టిన ఓ పెద్ద అల్యూమినియం ఫ్యాక్టరీ (బాల్‌కో)కి వ్యతిరేకంగానూ ప్రజలు పోరాడుతున్నారు. ఈ ప్రజాందోళన ఏమిటి సూచిస్తున్నట్లు? అలాగే వందసంవత్సరాల కోస్తా ప్రాంత అభివృద్ధిక్రమం ప్రాపంచిక దృక్పథంలో మార్పు తెచ్చి ఉంటే విజయవాడలో ఒక హత్య, అంత పెద్ద ఎత్తున కుల తగాదాలకు దారితీసి ఉండేదికాదు. ఈ బీభత్సకాండ, ముదిరిపోతున్న కులతత్వం, విధ్వంసక ప్రవృత్తి, విశృంఖలంగా పెరుగుతున్న రాజ్యహింస దేనిని సూచిస్తున్నట్లు?
ప్రకృతితో మానవుడు జరిపే నిరంతర సంఘర్షణ ఫలితంగా వచ్చిన జ్ఞానం, ఆ జ్ఞానం వికాస ఫలితంగా మనకు సాధ్యమయిన అభివృద్ధి, ఆ సంఘర్షణను నిరాకరించే ప్రాపంచిక దృక్పథానికి మరింతగా బలాన్ని చేకూరుస్తున్నాయి. మరో భాషలో చెప్పాలంటే మనదేశంలో ఎంతగా అభివృద్ధి జరిగితే అంతగా ఫ్యూడల్‌ ప్రాపంచిక దృక్పథం బలపడుతూ వస్తోంది. ఎంత పెద్ద వెలుగు వెనక అంత పెద్ద నీడలా, హీరాకుడ్‌లో ఆనకట్టనీ, బీసెంటు రోడ్డులో భవనాల్ని, అభివృద్ధి భౌతిక రూపాలను ‘అభివృద్ధి’గా మనం పరిగణిస్తూ వస్తున్నాం. కాని అభివృద్ధి అంటే ప్రాపంచిక దృక్పథంలో మార్పు అని మనం గుర్తించగలిగిననాడు ‘అభివృద్ధి’ మన జీవితాల్లో సృష్టిస్తున్న విధ్వంసకాండని, మన మనస్సులో సృష్టిస్తున్న గందరగోళాన్ని అర్థం చేసుకోగలిగిన వాళ్ళమవుతాం. అప్పుడు బహుశ హీరాకుడ్‌ ప్రక్కన కరెంటు లేని గ్రామంలో గిరిజనుడు చెప్పిన దీపపు సెమ్మ క్రింద చీకట్ల్లో పోరాడుతున్న ప్రజలను నడిపించే ప్రాపంచిక దృక్పథమే అభివృద్ధిగా ఆవిష్కరించుకుంటాం
(‘మనలోమనం -సామాజిక అభివృద్ధి తీరుతెన్నులు’-1990 గౌరవ సంపాదకుడు-కాళీపట్నం రామారావు)

Share
This entry was posted in నివాళి. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో