మా పెద్దమ్మ

హిందీమూలం: సూర్యబాల
అనువాదం. ఆర్‌ శాంతసుందరి

మా పెద్దమ్మ చనిపోయి ఇప్పటికి ముఫ్ఫె ఐదేళ్ళు. పోయేటప్పుడు ఆవిడ వయసు ఏ డెబ్భై ఐదో ఎనభైయో ఉండి ఉంటాయనుకుంటా. అయినా ఇప్పటికీ ఒక్క రోజు కూడా నేను ఆవిడని తలుచుకోకుండా ఉండలేను! అది నాకెంతో అవసరం. స్త్రీవాదం ఊపందుకున్న ఈ వాతావరణంలో ఒక్కోసారి ఎటు పోవాలో ఏం చెయ్యాలో తెలీని సందర్భాలు ఎదురవుతుంటాయి. అలాటి కటిక చీకటి క్షణాల్లో ఆవిడ గురించిన ఆలోచనలు కాగడాలాగ నాకు దారి చూపిస్తాయి. జీవితాంతం భర్త ఉపేక్షనీ, తిరస్కారాన్నీ, అతను చేసే అవమానాలనీ భరిస్తూ బతికిన పెద్దమ్మ ఎప్పుడూ ఛలోక్తులు విసురుతూ, వ్యంగ్య బాణాలు వేస్తూ నవ్వటం, నవ్వించటం చూసి నేను అవాక్కయిపోయేదాన్ని!
మా అమ్మకన్నా పదకొండేళ్ళు పెద్దది ఆవిడ. పెదనాన్న అందరూ మగవాళ్ళలాగ ఇంట్లో ఉండేవారు కాదు. ఇంటి వెనకాల ఆయనకి విడిగా ఒక వంటిల్లూ, డ్రాయింగ్‌ రూమూ, ఆరుబైట ఒక పెద్ద అరుగు ఉండేవి. అక్కడ ఆయన చూట్టూ ఎప్పుడూ నౌకర్లూ చాకర్లూ, స్నేహితులూ మూగి ఉండేవాళ్ళు. ఇల్లూ సంసారం ఈ బంధాలేవీ లేకుండా హాయిగా ఎప్పుడూ జల్సా చేసుకుంటూ గడిపేవారు ఆయన.
అంత పెద్ద భవనంలో ఎటువంటి దర్జాలూ హంగులూ  లేకుండా పెద్దమ్మ రెండే రెండు గదుల్లో తన పిల్లలతో ఉండేది. టీచర్‌ ఉద్యోగం చేసుకుంటూ పిల్లల్ని పోషించుకునేది. డబ్బుకి ఎంత కటకటలాడినా, పిల్లలకిగాని తనకిగాని ఆరోగ్యం బాగాలేకపోయినా, ఎప్పుడూ ఆవిడ నోటంట ఫిర్యాదనేది ఎవరూ వినలేదు… భర్త ఎదుట చెయ్యి చాపలేదు. అదే పేటలో,  ఆత్మాభిమానంతో తలెత్తుకుని బతికింది. వీటికోసం ఆవిడ చెల్లించిన మూల్యం.. అది దాదాపు ఒక శతాబ్దం కిందట సమాజంలో తెరల వెనుక ఉండే స్త్రీలో ఏ కొద్దిమందికో మాత్రమే సాధ్యమయుండేది.
కేవలం పదకొండేళ్ళ వయసులో, మామూలు మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఆ పిల్ల, పేరున్న ధనికుల ఇంటికి కోడలుగా వెళ్ళింది. అత్తారింట్లోని ఐశ్వర్యం చూసి పులకరించిపోయింది. కానీ ఒక నాలుగైదు రోజుల్లోనే ఆ భవనంలోని మఖమల్‌ దిళ్ళూ, పట్టు తివాసీలూ, వెండి నగలూ…వీటిలాగే  ఎటువంటి స్పందనలూ, ప్రేమ, ఆప్యాయతలూ లేని తన భర్త కేవలం పేరుకే భర్త అనీ, నిజమైన జీవన సహచరుడు కాదనీ ఆమెకు అర్ధమైపోయింది. అతని సరదాల్లో, సరసాల్లో ‘భార్య’ అనే మనిషికి ఎక్కడా స్థానం లేదు. అయినా పెళ్ళిలో ఆమెకి పెట్టిన నగలు మాత్రం అప్పుడప్పుడూ పనికి వచ్చేవి, అంతే, తన అద్దాల మేడలో  తీర్చుకునే సరదాలతో విసిగిపోతే, ఏ కలకత్తాకో, రంగూన్‌కో పారిపోయేవాడు అతను.
చివరికి తన పూర్వీకులు ఎంతో కష్టపడి సంపాదించినంతా అతను బూడిదపాలు చేసేశాడు. ఇనప్పెట్టె ఖాళీ అయిపోగానే ఉన్న ఇళ్ళని వేలం వెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా అతని సరదాలు మాత్రం తగ్గలేదు. తన మగతనాన్నీ, తన భర్త అనే హోదానీ రుజువు చేసుకోవాలనో ఏమో, ఇద్దరు పిల్లలని భార్యకి కన్నాడు.. ఒక కొడుకూ, ఒక కూతురూ. కానీ తండ్రిగా అతను బాధ్యతలేవీ నిర్వహిస్తే ఒట్టు! పెద్దమ్మ ఒక్కతే పిల్లలని చూసుకుంటూ ఉండేది.
ఈ సంగతులన్నీ మా అమ్మమ్మకీ తాతకీ తెలుస్తూనే ఉండేవి. కానీ ఇంకేమీచెయ్యలేకా, ఎవరైన అటువేపొస్తే కూతురికీ, మనవడికీ మనవరాలికీ, రహస్యంగా వీలైనంత డబ్బు పంపేవాళ్ళు. పుట్టింటికి వచ్చెయ్యమని ఎన్ని ఉత్తరాలు రాసినా ఆత్మాభిమానం పెద్దమ్మని ఆ పని చెయ్యనిచ్చేదికాదు.
కానీ ఉత్త ఆత్మాభిమానం పిల్లల కడుపులు నింపదని ఆవిడ గ్రహించింది. అందుకే ఒకరోజు భర్త ఆమెని ఆమె కాళ్ళకున్న వెండి కడియాలు తీసివ్వమనేసరికి, ధైర్యం కూడగట్టుకుని, ”ఇవమ్మితే వచ్చే డబ్బుతో పిల్లలకి పాలు కొనచ్చు కదా!’ అంది. రెండ్రోజులు పిల్లలు పాలు తాగక పోతే వచ్చే ప్రమాదమేమీ లేదనీ, తెలివైనదైతే పెసరపిండి ఉడకబెట్టి పిల్లలకి పట్టి ఉండేదనీ, ఇలా భర్త ఎదుటపడి నోరు జాడించేది కాదనీ భర్త దురుసుగా జవాబు చెప్పి కడియాలు లాక్కున్నాడు.
ఆమె ఓర్పుకి అది పరీక్షా క్షణమైంది.ఒక నిప్పురవ్వ మనసులో రగిలినట్టయింది.. కడియాలు లేని ఈ కాళ్లు ఇప్పుడు స్వేచ్ఛని సంపాదించుకున్నాయి! నా దారి నేను వెతుక్కునేందుకు ఇదే సరైన అవకాశం. ఇక ఈ కాళ్ళని ఎవరూ ఆపలేరు. గాజులూ, ఉంగరాలూ, వంకీలు లేని ఈ బోసి చేతులు ఇక ఎవరిముందూ బిచ్చం అడగవు ఈ ప్రపంచాన్ని నా హక్కు నాకిమ్మని అడుగుతాను. నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతాను! అనుకుంది పెద్దమ్మ.
ఆవిడకి అందరికన్నా మా నాన్న అంటేనే ఎక్కువ ఇష్టం. ఆయన మీద చాలా నమ్మకం. ఆయన సాయంతో ఒక ట్యూటర్‌ని పెట్టుకుని, ప్రైమరీ, మిడిల్‌ స్కూల్‌ పుస్తకాలు తెప్పించుకుంది. పసిపిిల్ల పొత్తిళ్ళు మధ్య తన స్కూల్‌ తెరిచింది. సాయంకాలం రెండు గంటలు ట్యూటర్‌ దగ్గర చదువుకునేది. మర్నాడు అంట్లు తోము కుంటూ, బట్టలుతుక్కుంటూ, పిల్లలకి స్నానం చేయిస్తూ పాఠాలు వల్లె వేసేది. కానీ పాపం ఎన్నిసార్లు చదివినా అవి గుర్తుండేవి కావు. ఆవిడ పైకి వల్లె వెయ్యడంతో ఆ పాఠాన్నీ తనకి కంఠతా కూడా వచ్చేసేవని అమ్మ నాకు చెప్పింది. ఎలాగో కష్టపడి మిడిల్‌ వరకూ దేకింది. అప్పుడు మా నాన్న ఆవిడని ఒక పేరున్న టీచర్స్‌  ట్రైనింగ్‌ స్కూల్లో చేర్పించాడు.. ఆ స్కూల్‌ ఉన్నది ప్రయాగలో. అక్కడ హాస్టల్లో ఉండి ఆవిడ  చదువుకోవాలి. అప్పుడు పిల్లల సమస్య వచ్చింది. పెద్దమ్మ పిల్లలని తన వెంట తీసుకెళ్తానని పట్టుబట్టింది.కానీ పాలుతాగే  పసిపిల్లలనైతేనే అక్కడ తల్లితో ఉండనిస్తారని ఆమెకి తెలిసింది.
ఆ  ట్రైనింగ్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ బ్రిటిషు మహిళ. పెద్దమ్మ తను వెళ్ళి ఆవిడని కలుస్తానని, మాట్లాడి చూస్తానని అంది. ఆ మహిళ చాలా కరాఖండిగా ఉంటుందని అందరూ అనేవాళ్ళు. ఆవిడ దగ్గర అపాయింట్‌మెంట్‌ తీసుకుని, వెళ్ళి మాట్లాడి, ఆవిడ అనుమతి సంపాదించుకుని మరీ వచ్చింది. ఒక వారం తరువాత, జమీందార్ల ఇంట్లో ఘోషా లో బతికిన పెద్దమ్మ, చదువుతోపాటు, మైదానంలో ప్లీటెడ్‌ స్కర్ట్‌ వేసుకుని డ్రిల్‌ కూడా చెయ్యసాగింది. అక్కడే ఒక చెట్టుకింద ఆవిడ కొడుకు తన చెల్లెల్ని ఆడిస్తూ ఉండేవాడు.
ట్రైనింగ్‌ అయిపోగానే అదే ఊళ్ళో ఒక ప్రెమరీ స్కూల్లో ఆవిడకి టీచర్‌ ఉద్యోగం వచ్చింది.
ఈ కథంతా ఎవరో చెప్పగా నేను విన్నది. ఆవిడ నోటంట నేనెప్పుడూ తన భర్త వేసిన వేషాల గురించి ఏమీ వినలేదు. అలాగే తన జీవన పోరాటాన్ని  గురించి కూడా ఆవిడ ఎప్పుడూ చెప్పేది కాదు. ఇంకొకరి సానుభూతి కోరిన మనిషికాదు. అలాటి స్వభావమూ కాదు, తీరికా లేదు. ఆవిడ తనకంటూ ఒక ప్రపంచాన్ని సృష్టించుకుంది. ఫీనిక్స్‌ పక్షిలాగ కాలిన బూడిదలోంచి మళ్ళీ  సజీవంగా పైకెగిరిన మనిషి ఆవిడ!
పోరాటాలు చాలామంది చేస్తారు…చెయ్యాల్సి వస్తుంది. కానీ జీవితాంతం కొనసాగుతూ గాయాల మీద గాయాలు తగులుతూ, ఒళ్ళంతా రక్తం కారుతూంటే, అవి కనిపించకుండా ధైర్యమనే పువ్వుల దుప్పటి కప్పుకుని బతికెయ్యటం చాలా కొద్దిమందికే సాధ్యం.
ఈ కష్టాలన్నీ చాలా నట్టు, పెద్ద వయసులో ఆవిడ ఎడమకాలుకి గేంగ్రీన్‌ వచ్చింది. మోకాలికి ఐదంగుళాలకింద కాలు తీసేశారు. నెలల తరబడి ఆస్పత్రిలో నకిలీ కాలు అమర్చుకొచ్చారు. మళ్ళీ ఎన్నో  నెలలపాటు నడక అభ్యాసం చెయ్యాల్సివచ్చింది. ఆవిడ వెనక్కి వచ్చి రిక్షా దిగుతుంటే మేమందరం కాళ్ళకి నమస్కారం చేసేందుకు పరిగెత్తాం. ఆవిడకి నకిలీ కాలు పెట్టారని మాకు తెలీదు..ఆవిడ తన కష్టాలు ఎవరికీ చెప్పుకునే రకం కాదు గదా! అందుకే నకిలీ కాలు చూసి ఖంగుతిన్నాం.
ఆవిడ పుణ్యస్త్రీ గానే చనిపోయింది. ఆవిడ పాపిట్లో సింధూర్‌ నింపుతున్నప్పుుడు పెదనాన్నకి ఏడుపాగలేదు. భోరుమని ఏడ్చాడు. పెద్దమ్మఆత్మ అప్పుడు, ఆఖరి గెలుపు తనదే కదా అనుకుని,  తప్పకుండా నవ్వుకునే ఉంటుంది.

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో