సరిగ్గా ఇక్కడ మనుషులు జీవించే వారు!

– చంద్రలత

పుట్టి పెరిగిన ప్రాంతం నుంచి మరొక కొత్త ప్రదేశానికి తరలి వెళ్ళడంలో – ఎంతో ఘర్షణ ఉంది. ఎవరైనా అలాంటి నిర్ణయానికి రావడానికి ముందు వారు ఎంతో సంఘర్షణ పడి ఉండాలి. అందుకు ఏదో బలమైన కారణమే ఉండి ఉండాలి. సామూహికంగా, వ్యక్తిగతంగా ఎదురుపడే ఇలాంటి సందర్భాలు మనం చరిత్ర పొడవునా వింటూనే ఉన్నాం.

పుట్టిన నేలను విడిచి వెళ్ళడంలోని దుఃఖం, ఆవేదన, ఆర్తి – కొత్త ప్రదేశాలకు వెళ్ళడం, అక్కడి పరిస్థితులకు అనుగుణంగా కొత్త జీవన మార్గాలను ఆవిష్కరించుకోవడం – ఆ నిర్వాసిత క్షోభ, పునరావాస క్రమం రచయితలను స్పందింపజేస్తూనే ఉంది.

నిర్వాసనకు అనేక నేపధ్యాలు, యుద్ధం, దౌర్జన్యం, దమనకాండ, ప్రకృతి వైపరిత్యం, ఇవన్నీ ఒక ఎత్తు. ప్రగతి పేరిట నిర్వాసితులు కావడం మరొక ఎత్తు.

నిర్వాసితులు కావడం స్త్రీ పురుషులు ఇరువురిపై తీవ్ర ప్రభావం చూపుతుందని అర్థంచేసుకొంటూ, స్త్రీలపై లేదా వారి రచనలపై నిర్వాసన ప్రభావంలో తేడాలేమైనా ఉన్నాయోమో గమనిద్దాం. అలాగే, రచయిత లకు ఈ అంశాలపై స్పందించడానికి పరి మితులు ఏమైనా ఉన్నాయా – కొన్ని తెలుగు రచనల దృష్ట్యా పరిశీలించే ప్రయత్నం చేద్దాం.

ఏ కారణం చేత నిర్వాసితులుగా మిగిలినా అది అక్కడి స్త్రీలను ఒక సున్నితమైన పరిస్థితిలోకి నెట్టివేస్తుంది. ఏ అనుభవమూ ఆనందకరమైనది కాదు.

సంక్షోభం తరువాత కానివ్వండి, సంక్షోభం లేకపోనివ్వండి – ప్రవాస జీవితం స్త్రీలపై లోతైన గాఢమైన ప్రభావాన్ని చూపుతుంది. తీవ్రతలో హెచ్చొచ్చులు ఉండవచ్చును కాక నిర్వాసితులు కావడం అంటే – కులం, మతం, వ్యవస్థలకు అతీతం గా – మూర్తీభవించిన స్త్రీల అనుభవాలు – మానవ అనుభవాలు.

కొత్త ప్రాంతానికి తరలి వెళ్తున్నపుడు తమ సహజసిద్ధ సమూహాన్ని వదలి వెళు తున్నారు. తాము పుట్టి పెరిగిన వాతావరణం లోంచి మరొక కొత్త చోటికి వెళ్ళి – అక్కడ తమకు అనువైన వాతావరణం ఏర్పరచుకోడం ఒక ఎత్తైతే – అక్కడి వాతావరణానికి అనువుగా తమను తాము మలచుకోవడం మరొక ఎత్తు. పరిసరాలకు అనుగుణంగా ఇమిడి పోగల మెళుకువ బహుశా స్త్రీలకు సహజంగానే వస్తుందేమో!

కొత్త వాతావరణాన్ని తమకు అనుగుణంగా మలుచుకోవడమే కాక, తమ కుటుంబానికి ఒక గృహ వాతావరణాన్ని కల్పించే బాధ్యతను వారు సునాయాసంగా నిర్వర్తించగలుగుతారు.

విధ్వంస ప్రేరిత నిర్వాసనలో ఇది మరింత బాధాకరం. పాతగాయాల్ని మాన్పుకొంటూ వెంటాడుతోన్న భయాల్ని తరిమి కొడుతూ – కొత్త ”ఇల్లు” నిర్మించుకోవడం – లేదా పాత జీవితాన్ని పునర్మించుకోవడం – చాలా కష్టం. కఠినం.

లోతైన గాయాలతో బతుకుతూ అనుక్షణం చేసే ఆ జీవన పోరాటం ఎలాంటి పర్యవసానాలకు చిత్రిక అవుతుందో ఓల్గా తమ ”వసంతం రాని ఊరు” లో స్పష్టంగా రాశారు. గుజరాత్లోని ‘బలోల్’ గ్రామం స్వయంగా చూశాక-
”ఇక ఈ ఊరికి వసంతం లేదు
……………..
మనుషులు పుట్టి పెరుగుతారు
వాళ్ళు ఏడుస్తారు నవ్వుతారు
కానీ ఊరికి వసంతం రాదు” (‘గుజరాత్ గాయం’ సంపుటం)

వసంతం రాలేని అలాంటి పునరా వాసపునిర్మాణ క్రమంలో– స్త్రీలు తిరిగి ఎంత నేర్పుతో మునుపటి గృహ వాతావరణాన్ని తీసుకువస్తారో మనకు తెలుసు. ఆ క్రమంలో స్త్రీలకు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగతమైన ”ఆవరణ” ఉంటుందనీ – (Back yard neighbour hood) (Woman space) – అది ఆమె శాశ్వతంగా వదలి వచ్చిందనీ – అది ఆమెకు ఆవసరమనీ – ఉపశమనమనీ బలమనీ – ఎవరం త్వరగా గుర్తించం, గ్రహించం, అర్థం చేసుకోలేం.

పైనుంచి, ఆ ”పెరటిలో అమ్మలక్కల యవ్వారాల”ను అవహేళనకు గురిచేయడం చులకనగా తోసి పుచ్చడం కూడా పరిపాటి.

కానీ, అలా ఆడవారు దగ్గరగా చేరి మాట్లాడుకోవడంలోని మేలును మనం గుర్తించాలి. వారు ఒకరి అనుభవాలను ఒకరు పంచుకొంటారు. సమస్యలకు పరిష్కారాలను వెతుక్కుంటారు. చర్చించుకొంటారు. విభేదిస్తారు. విశ్లేషిస్తారు. నిజానికి, స్వతంత్ర ఆలోచనల్లోని ఆ భిన్నత్వమే వారికి ఉపాయం తట్టవచ్చు. ఉపశమనం కావచ్చు.

ఇంటిలోపలా వెలుపలా ఆమె జీవన పోరాటం నిరాఘాటంగా సాగుతూనే ఉంటుంది. ఇల్లాలి ధర్మంలా. బహుశా అందు చేతనేనేమో వారు ఎంతో ”సులువుగా” చేసినట్లు తోచే వారి పోరాట తీవ్రత, కృషి మన దృష్టికైనా ఆనదు.

మల్లమ్మ ఒక ముంపుకు గురైన సన్నపాటి రైతు భార్య. సంక్షోభ సందర్భాన్ని ఆమె ఎంతో నిబ్బరంగా నిలకడగా ”సులువు”గా ఎదుర్కొంటుంది. ఆమె వ్యక్తిగత అనుభూతుల్ని పక్కనుపెట్టి, కుప్పకూలిన భర్తకు చేదోడు వాదోడుగా నిలబడుతుంది. అతనిని నిలబెడుతుంది. ఇది ఎంత సహజంగా ఉంటుందో చూడండి.

”అంత దుఃఖాన్ని గుండె లోతుల్లోనికి నెట్టి మల్లమ్మ కళ్ళు తుడుచుకుంది. మగన్ని పొదివి పట్టుకొని ఖంగున అంది.

”నీగ్గాని తిక్క పట్టినాదా ఏంది? పుట్టినా పొద్దు మట్టిచేత్ల బట్టుకు పుట్టినావా? ఊర్ల సేద్యపుగాళ్ళంతా నీ తీరును సేల బడి పొర్లుతున్నారా? కష్టం చేసేటోల్లకు కంచంల ఎల్తుండదు. ఆ కట్టమీదకు పోయి తట్ట ఎత్తినా కడుపు నిండదా? ఈ పాపకారి కడుపు నింపనింకెనా ఇంత ఏడుపు ఏడవపడ్తివి!” మల్లమ్మ కడివెడు దుఃఖాన్ని కడుపులో నింపుకొని కట్టుకున్న వాని కంటనీరు తుడిచింది. (దృశ్యాదృశ్యం – నవల)

వారిరువురి జీవన పోరాటంలో ఆమె పాత్ర ఇదీ!

ఎవరైనా మాతృభూమి, పురిటిగడ్డ, జన్మభూమి, పేగుముడి- అన్నపుడు ఆ సంబంధం వారి పురుష సంబంధీకులది. తాత ముత్తాతలదీ, వారి చుట్టు అల్లుకున్న పౌరుషాలు, కథనాలు, పరువు ప్రతిష్టలూ. భూమి పశువులు ఇతర సంపదలూ.

తమ పుట్టిన గడ్డతో స్త్రీల సంబంధం మరోలా ఉంటుంది.

పుట్టినప్పటి నుండీ వారు ”ఆడ” పిల్లలుగా – వారి పుట్టింటి పై పెంచుకొనే మమకారం భావ సంబంధమైనది గానే పెంచబడతారే కానీ, మరే ఇతర సంబంధంతో కాదు. అసలు వారికి అవకాశం ఇచ్చే సంస్కృతే మనకు లేదు. పుట్టినప్పటి నుంచే తమ పురుటి గడ్డకు వారు అతిధులు! తమ చుట్టూ ఉన్న ప్రకృతితోనూ ఇతర సహజ పరిసరాలతో వారికి కలిగే సజీవ సంబంధాలు ఒక అనిర్వచనీయ బంధాలు. ఇది ఒక విధంగా చెప్పాలంటే తమకు చెందిన భూమిపై జీవితం అంతా ధారపోస్తూ ఆ అభాగ్య జీవులు ”గాసగాళ్ళు” పెంచుకొనే అనిర్వచనీయ సంబంధం లాంటిది.

‘మాతృభూమి’ అన్న భావనలో పరిమితులను గమనించండి. ఇంతకీ, అది ఎవరి మాతృభూమి? అమ్మ మాతృభూమి ఏది? ఆమె పురిటిగడ్డతో ఆమెకుగల సంబంధం ఎలాంటిది? అమ్మ ఎప్పుడూ తన పుట్టింటి నుంచి నిర్వాసితురాలే!

వధువు కొత్త కుటుంబంలోకి నడిచి వస్తుంది. ”కొత్త”తో ఆమె మొదటిపోరాటం ప్రారంభం అవుతుంది. కొత్త కుటుంబపు పద్ధతులు, ఆచారాలు, సంప్రదాయాలు, అలవాట్లు-అలవరుచుకోవడం ఒకవైపు – ఇంట్లోను సమాజంలోనూ ఆమెపై విధించబడే అనేకానేక ఆంక్షలు, అధిక్షేపణల మధ్య – ఎంతో కొంత మెళుకువ, నేర్పు (Survival technique) – వారు సాధించగలుగుతారన్నది నిత్యానుభవం.

అదే, మగవారు తమకు అనుకూలమైన వాతావరణాన్ని, అనువైన తమకే స్వంతమైన ఇంటిని, ఊరిని వదిలి పొవాలంటే ఇష్టపడరు. వదులుకోవాలన్నా ఇష్టం ఉండదు. అందుకే గదా, సూదిమొన మోపినంత భూమి కొరకైనా, చేలగట్లు తెగినా, అంగుళం జరిగినా – మహాభారతాలు పల్నాటి యుద్ధాలు!

ఇదంతా ఎంతటి ”పౌరుషేయమో” చూడండి!

”థియర్ ఆఫ్ నేటివిటీ” లోనే జెండర్ పరిమితులు ఉన్నాయి. ఆ ఆలోచనను ”అమ్మ పుట్టిల్లు” కథలో ప్రతిఫలించే ప్రయత్నం చేశాను.

” ‘జహనారా’… ఆరుగురు బిడ్డలు… చచ్చిపోయి, కళ్ళముందున్న శవం… దానికోసం ఏడుస్తున్నారా? వాళ్ళు… లేదు లేదు… శవం కావడానికి సిద్ధంగా ఉన్న మరో బిడ్డను ఒడిలో పెట్టుకొని… ఆ పనేదో అయిపోతే… రెండు కలిపి, ఒకేసారి… అయ్యో తండ్రీ ఎట్లా మర్చిపోవడం… చావును ఒడిలో దాచుకోవడం నువ్వెప్పుడైనా చూశావా?… బహుశ… ‘జహానారా’ ఒడిని చూసైనా తెలుసుకొనుండవూ?” – శ్రీమతి నల్లూరి రుక్మిణిగారు జహానారా ను ఇలా పరిచయం చేస్తారు తమ ”మోయలేని నిజాలు” కథలో.

ఇది కరువు.

సహజ సిద్ధమైన ప్రకృతి వైపరిత్యాల విలయ విధ్వంసాల తరువాత ఊళ్ళకు ఊళ్ళు ఖాళీ చేస్తూ పోయే వలసలు – స్త్రీ పురుషులకు అనంత వేదనలు మిగుల్చుతాయి.

నిజానికి, అన్ని వైపరిత్యాలు ఊహతీతా లేమి కావు, ముఖ్యంగా, దీర్ఘకాల కరువు కాటకాలను అర్థం చేసుకోవడం కష్టమేమీ కాదు.

అటువంటి పరిస్థితులను అంచనా వేయడం, అదుపులో ఉంచుకోవడం – అంతకన్నా కష్టంకాదు. ఈ వైపరిత్యుపు దుష్పరిణామాలు మనుషులకే పరిమితం కావు. జీవ సంబంధమైన ప్రతి విషయాలపై ఈ ప్రభావం పడక తప్పదు.

పశుపక్ష్యాదుల నుంచి పర్యావరణ సమస్యల వరకు – అన్ని చోట్లా అన్నిరూపాల్లో ఇది ప్రభావం చూపుతుంది. సాంఘిక ఆర్థిక పరిస్థితులు కుప్పకూలుతాయి. సాంస్కృతిక రాజకీయ వ్యవస్థలు ఛిన్నాభిన్నం అవుతాయి. ఊళ్ళకు ఊళ్ళు బీళ్ళవుతాయి. ఖాళీలవు తాయి. ఇలాంటి పరిస్థితుల్లో – నిర్వాసితులకు ఎలాంటి పునరావాస కార్యక్రమాలు ఉండవు. ఎందుకంటే, ఇలాంటి వలసలు ”నిర్వాసితం” గానే గుర్తించబడవు. పాలమూరు, రాయలసీమ ప్రాంతాల నుండి తండోప తండాలుగా నిరంతరం సాగే ఈ వలసలు – కరువు నివారణకు చేపట్టే ప్రభుత్వ పధకాల లోని లోపాయికారీ తనానికి నిలువెత్తు సాక్ష్యాలు.

ప్రకృతితో పోరాటం ఒకవైపు – సంఘ విధ్వంసకాలైన అవినీతి, హింసలతో కూడిన రాజకీయ, అధికార గణాలు మరోవైపు – ఇది ఒక అవాంఛనీచ దౌర్భాగ్య పరిస్థితి. ఏమీ చేయలేని నిస్సహయ పరిస్థితిలో – తప్పనిసరి కావడంతోనే వారు కాందీశీకులైనారు- తమదేశంలో తాము!

ఈ సందర్భంలో కొందరు తెలుగు సాహితీ వేత్తలు చాలా ముఖ్యమైన పని చేశారు. ఆ దుర్భర నిస్సహాయ పరిస్థితిని తమ కలాలలో నింపి నలుగురి ముందుకు తీసుకు వచ్చారు. సూచనలు చేశారు. పోరాటం చేశారు. తమ ”ఇనుప గజ్జెల తల్లి” సంకలనంలో రాయలసీమను పట్టి పీడిస్తున్న సుదీర్ఘ కరువులో తలెత్తిన అరాచక అమానవీయ పరిస్థితిని వారు నిజాయితీగా మనముందుంచారు. కరువు కాటుచేత బడికి వెళ్ళలేని సున్నిత సమస్య నుంచి జల పోరాటాల వరకూ రచయితలు వారి కథలలో విపులంగా చర్చించారు.

వారి స్త్రీలను ”గౌరవం”గా బతకమని చెప్పి – పురుషులు పనికోసం ఇల్లు వదలి వెళ్ళారు. ఇది ఎప్పుడూ సుఖాంతం కాలేదు. ఎన్నో కుటుంబాలు వారి స్త్రీల చెమటతోనో రక్తంతోనో బతికి బట్ట కట్టలేదు. ఆమె ”గౌరవం” ”అభిమానం” ఆమె పణంగా పెట్టవలసి వచ్చింది. తన వారందరి జీవితం కోసం.

పేదరికం, ఆకలి, జబ్బులు, చావులు – ప్రకృతి విలయప్రేరిత వలసల కొన సాగింపులు మానవ సంబంధాల్లోని ఆకస్మిక మార్పులు – వంటరితనం, కుటుంబ సభ్యుల్ని, బంధుమిత్రుల్ని కోల్పోవడం – కుంగుబాటు, దిగులు, ఆందోళన, భయం, సామాజిక సంబంధాలు తెగిపోవడం, మారిపోవడం – హింస, నేరం పెరిగిపోవడం – లాంటి పరిస్థితులు నిత్య జీవనంలో మామూలు పరిస్థితులైపోతాయి.

ఆడపిల్లలను స్త్రీలను అమ్మివేయడం లేదా ‘కాంట్రాక్ట్’ పనుల్లో కుదర్చడం, పనికొరకు గల్ఫ్ దేశాల వరకూ పంపడం – నిత్యకృత్యం.

అక్కడికి వెళ్ళిన వారి అతీగతీ, శారీరక మానసిక దోపిడి – తమ కథల్లో ఎంతో హృద్యంగా చిత్రించారు. అలా వెళ్ళినవారు తిరిగి వస్తే – వ్యాధులతోనో, మరణం కోసమో. ఈ కఠోర సత్యము రచయితల కళ్ళ బడకపోలేదు. ఇక, గ్రామాల్లో వంటరిగా మిగిలిన ఆడవారు అక్కడ ఉన్న మగవారి దౌష్ట్యానికి ఎరలు ముఖ్యంగా చిల్లర వర్తకులు, వడ్డీ వ్యాపారులు, ఇతర ‘మధ్యవర్తుల’ కపటాలకు వారి నిస్సహాయపరిస్థితి అంది వస్తూ ఉంటుంది.

జి. నిర్మలారాణి గారు తమ ”కాటేసిన కబురు” కథలో ఇలాంటి ఒక సందర్భాన్ని చిత్రించారు. ఇలాంటి మరో కథ, ”ఇది కథ కాదు” లో ఎం.జయలక్ష్మి రాజు రాస్తారు, ”ఇది సినిమా అయితే ప్రతీకారం తీర్చుకొనే పద్ధతిలో ముగింపు సూచించవచ్చు. ఇది కథ అయితే ముత్యాలమ్మ సమిధగా మారకుండా ఓ పరిష్కారం చూపుతూ కథ ముగించే దాన్ని! కానీ, ఇది కథకాదు!” (ఇనుప గజ్జెల తల్లి)

రచయిత్రులు స్త్రీల గురించి వ్రాసి ఊరుకోలేదు. ఛిన్నాభిన్నమైన మానవ సందర్భాన్ని (Human situation) వివరంగా విపులంగా చిత్రించారు. కరువుకూ ఫ్యాక్షనిజానికి మధ్య నలిగిన ఒక సన్నకారు రైతు గురించి రాస్తారు. షానజ్ గారు తమ ”శేషప్రశ్న”లో. రాజకీయ ఆర్థిక విశ్లేషణలను, కార్యకారణ సంబంధాన్ని రాస్తూ – వారి స్వీయరాజకీయ విలువలని ప్రకటిస్తూ – ఒది ఒక మానవ స్పర్శ. తమ వ్యక్తిగత అభిప్రాయా లతో – పాఠకుల గుండెను తడతారు. ఈ రచయిత్రులు రచయితలు.

”నదిని స్త్రీతో ఎవరు పోల్చారో కానీ- నిజం! తనపై తనకు స్వతంత్రం లేని వారే ఇరువురూ!

భారీ ఆనకట్టలు, పారిశ్రామీకరణ మొదలైన అభివృద్ధి ప్రభావ నిర్వాసితుల వెతలు, పునారావాస కార్యక్రమాలు తరుచు చర్చల్లోకి వస్తూనే ఉంటాయి. ఎందరికో మేలుకలగడం కోసం కొందరి ”త్యాగాన్ని” మన ఆశిస్తాం. మళ్ళీ, మళ్ళీ.

ఇందులో, అస్తవ్యస్తమయ్యేది అటు ప్రకృతి ఇటు మనిషి. దట్టమైన అడవిలో నుంచి కొండాకోనలు దాటి గ్రామాలను పట్టణాలను దాటేస్తూ ముంచేస్తూ – అల్లకల్లో లం మిగుల్చుతుంది ఈ సాంకేతిక ప్రేరిత విలయం.

నీరేటి గాడి భార్య నుంచి నీటిపారుదల ఇంజనీరు భార్య వరకూ – అన్ని వర్గాల స్త్రీలు -ఎలాంటి మినహాయింపులు లేకుండా – ఒక మార్పుకు లోనవుతారు. ఎన్నటికీ వారు మునుపటి వారు కారు.

పొయ్యిలో పుడకలు, పొయ్యిపై కుండ, కుండలో ఎసరు, ఎసట్లో బియ్యం- ఈ ప్రాధమిక అవసరాల కోసం ఎందరో స్త్రీలు ప్రకృతిపై ఆధారపడి ఉన్నారు.

అడవి, నది – వారి జీవితాల్లో భాగం. పల్లె, అడవి, నది-నుంచి వారు దూరంగా విసిరివేయబడినపుడు. ఈ బాధ్యత మరింత పెరుగుతుంది. మరి ఆలోచన, ఆవేదన, ఆందోళన – సరిగ్గా అక్కడే మొదలవుతుంది.

ప్రకృతిని కలచి వేస్తే వారు కలత పడతారు. అందుకేనేమో, వారు పర్యావరణానికి సహజ పరిరక్షకులు అవుతారు.

మిగిలిన లోకమంతా ఆర్థిక ఫలాలపై ముచ్చటపడినప్పటికీ! వారికి తెలుసు ప్రకృతి నుంచి మూలాలు తెంచుకుపోతే తాము మన జాలమని.

నిర్వాసిత పురుషులకు పునరావాస పథకాలు, డబ్బు దస్కాలతో నచ్చచెప్పివచ్చు నేమో కానీ, స్త్రీలు తమ ప్రాధమిక అవసరాలు తీరితే కానీ తృప్తి పడలేరు. అది చాలా అరుదుగా జరుగు తుంటుంది.

సాధారణంగా పునరావాస కేంద్రాలు అడవికి నదికి దూరంగా ఎత్తైన చోట ఉంటాయి. ఒక్క కడవ నీటికోసం వాళ్ళు మైళ్ళు తరబడి నడవవలసి వస్తుంది. పశువుల మేతకు స్థలాలు అనువుగా ఉండకపోవచ్చు. ఈ పనులన్నీ చేసేది ఆడ పిల్లలే!

ఈ విషయాలన్నీ ‘దృశ్యాదృశ్యం’లో విస్తృతంగా వ్రాసేందుకు కొంత ప్రయత్నిం చాను. అలాగే, ఈ అభివృద్ధి పధాన సమిధలైన వారి గురించి తెలుగులో వచ్చిన మరికొన్ని రచనలను పరిశీలిద్దాం.

మానేరు డ్యాం నిర్మాణంలో ముంపు వాసి కథ శ్రీ జూకంటి జగన్నాథం రాసిన ”పునరావాసం”, కూలీల నుంచి ఆసాముల వరకు పునరావాసం ఎలా అందుతుందో అందులో సాధ్యాసాధ్యాలేమిటో శ్రీ జూకంటి చాలా వివరంగా రాశారు. ముంపువాసుల అమాయకత్వము, ఆకస్మాత్తుగా చేతికందిన డబ్బును ఎలా సమర్థించుకోవాలో తెలియని తనమూ, ఆక్రమంలో అతను కోల్పోయినవి, ఎన్నెన్నో-అన్నీ పాఠకులను ఆలోచనలో పడేస్తుంది.

ఇక, పి.వరలక్ష్ష్మికి ఒక యువ ప్రేమి కుల మధ్య అల్లుకున్న రమణీయ, బంధాన్ని వారికేమాత్రం సంబంధంలేని ఒక ఆనకట్ట నిర్మాణం – ఎలా తుత్తినియలు చేస్తుందో సున్నితంగా రాశారు తమ ”ఆనకట్ట” కథలో.

నల్లూరి రుక్మిణి గారు తమ ”ముంపు” కథను తమ రాజకీయ రచనగా పేర్కొంటూనే – ముంపుకు గురికాబోతోన్న ఒక గ్రామ పరిస్థితులు చాలా సున్నితంగా హృద్యంగా చిత్రించారు. అలాగే, తమ రాజకీయ అభిప్రాయాలనూ బలంగా ప్రకటించారు.

ఇక, పారిశ్రామీకరణ పర్యావరణాల వలన పర్యావరణం గొప్ప సంక్షోభంలో పడింది. ముందు చూపు లేకుండా చేసిన తొందరపాటు పని తలనొప్పిలా తయారయింది.

ఈ విచ్చలవిడి దోపిడి మనిషికే పరిమితం కాలేదు. ప్రకృతిని నిలువెత్తున దోచేసింది. పి.చంద్ గారి ”భూనిర్వాసితులు” సంకలనం లోని కథల మూలం ఇదే. సిమెంట్ ఫాక్టరీ, బొగ్గు గనులు, వాటి చుట్టూ నిర్వాసితులైన సామాన్యులు. పి. చంద్గారు తమ రచనలను ”కథల రూపంలోని సామాజిక ఆర్థిక చరిత్ర” గా ప్రకటించారు.

పై కథలలో, పునరావాస సమస్యలతో పాటు అవినీతి, కుళ్ళిపోతున్న యూనియన్లు, మల్టీనేషనల్ కంపెనీలు, గ్లోబలైజేషన్, కక్షలు, పగలు, హత్యలు, పోలీస్లు, కోర్టులు మొదలైన అన్ని అంశాలను వివరంగా రాశారు.

ఇక, ‘దృశ్యం’ నవల భారీ ఆనకట్ట నిర్మాణం నుంచి నదుల ప్రయివేటీకరణ ప్రయత్నాల వరకూ – ఆర్థికం నుంచి పర్యావరణ- సాంకేతిక నైపుణ్యత నుంచి రాజకీయాల వరకూ – స్థానిక నేపధ్యంలో అంతర్జాతీయ చర్చను – పరిచయం చేసే ప్రయత్నం.

బహుశా, ఇది అభివృద్ధి ప్రేరిత నిర్వాసితుల గురించి తెలుగు రచయితల ప్రతిస్పందించిన తీరును పరిచయం చేస్తుందనే అనుకుంటారు.

విధ్వంస ప్రేరిత నిర్వాసితులు అనుభవం – చాలా హేయమైన సందర్భాంలోకి నెట్టివేయబడినట్లుగా – సామాజిక సాంస్కృతిక రాజకీయ ధ్వంస రచనగా – అన్ని మతాలను వర్గాలను ప్రసరిస్తూ – సాగుతుంది.

ఒక మతం పై లేదా వర్గంపై హింస – ఆ వర్గపు స్త్రీలపై హింసగా ప్రతి ఫలిస్తుంది. ”శత్రువు” పై యుద్ధానికి స్త్రీల శరీరాలు రణరంగాలైనాయి.

విధ్వంస ప్రేరిత వలసల్లో – నిర్వా సితులు తరచూ తీవ్రమైన హింసకు లోనవుతూ ఉంటారు. అది సామాజికమూ, మిలటరీ/రాజ్యప్రేరిత, లేదా గృహ హింస కావచ్చును, బతకడమే ఒక పెద్ద సవాలు. ప్రమాదపు టంచులో జీవిస్తూ – ఉండే ఆ నిర్వాసితుల పూర్వ అనుభవం మానభంగం, అంగచ్ఛేదన, చిత్రహింస (Horrific Torture) – ఏదైనా కావచ్చు.
” ఏ గొడవలెక్కడ జరిగినా
నా మాన ప్రాణాలే పేలాలై
గాలిలో కెగురుతూంటే
ఎక్కడికని పరిగెత్తను?

ఏ రాతి గుహల్లో దాక్కోను?” షాజహనా గారు తమ ”ఒంటరి కఫన్” కవితలో ఆవేదనతో లేస్తున్న ప్రశ్నలు. ఎంత లోతు దాగివుందీ ఈ చిన్న ప్రశ్నల్లో!

ఇది అనాగరికం. అమానుషం. ఈ దౌష్ట్యం ఎలాంటి సిగ్గూ – ఎగ్గూ లేకుండా ఎలాంటి సంకోచభయాలు లేకుండా – మన నాగరిక ప్రపంచంలోనే విశ్పంఖలంగా విహరిస్తోంది. గుజరాత్ కానీ, మరోచోటు కానీ, ”గౌరవం” స్త్రీల శరీరంతో ముడిపెట్టినంత వరకూ, ఈ దారుణ హింస కొనసాగుతూనే ఉంటుంది. నిర్లజ్జగా
”తల్లీ…
ఆడదానివై చీల్చబడ్డావు
నిక్కర్లూ బనీన్లు తల్వార్లతో త్రిశూలాలతో
గుడ్డలూడదీసుకొని పురుషాంగాల ప్రదర్శనలతో-”
……..
నేలవు నీవు
మాట్లాడ లేవు
కదలలేవు, కనుమరుగవలేవు, నిశ్శబ్ధ సాక్షివి నీవు- ”డా|| శిలాలోలిత గారి కవితలోని ప్రతిపదం ఒక సత్యమై మనముందు నిల బడితే కదిలిపోకుండా ఎలా ఉండగలం మనుషులం ఎవరైనా?

స్త్రీ పురుషల సంఘర్షణల్లో అనుభవాల్లో కొన్ని సున్నితమైన తేడాలున్నాయి. జరిగిన అనర్థాలలో పేరుకుపోయిన అసంతృప్తి వివిధ రూపాలలో స్త్రీలపై ప్రకటించబడుతుంది. ఇక, ఏవర్గం వారి వారి వర్గం వారిని, ముఖ్యంగా స్త్రీలను, ”రక్షించే” ప్రయత్నాలు మొదలు పెడతారు. ఆపై, ఒక పెదవి విప్పని, కనబడని – సాంస్కృతిక సామాజిక హింస మొదలవుతుంది.

ముఖ్యంగా స్త్రీలు, పిల్లలు అనేక నిర్భంద నియమాలకు గురి అవుతారు. ‘ఎలాంటి దుస్తులు వేసుకోవాలో’ అన్న అంశం నుంచి ఎప్పుడు ఏమి చేయాలో – ఎక్కడ ఎలా ఉండాలో అన్నీ నిర్దేశించేవరకూ – వ్యక్తిగత జీవితాలపై ఒక సెన్సార్ షిప్ ప్రారంభమవు తుంది. తీవ్రమవుతుంది.

ఈ స్వీయ ప్రకటిత ‘స్వయం రక్షితుల’ హింస బారిన స్త్రీల గౌరవం, జీవితం, హక్కులు పడుతాయి? ఇంతకీ, ఎవరా శత్రువు? మన స్వంత బంధువులే. మన రక్త మాంసాలే!

కొండేపూడి నిర్మల గారు ఎంత స్పష్టంగా చెప్పారో తమ ”కట్టె-కొట్టె-కాల్చె” కవితలో.
మిత్రులారా!
శత్రువు ముసుగు వీరుడు కాదు
తన వికృతమైన ముఖ కవళికలకి
మన మొహం తగిలించుకొని తిరుగుతున్నాడు”

స్త్రీలపై హింస లోని తీవ్రతలో కులం, వర్గం, జాతులను బట్టి తేడాలు ఉన్నట్లుగా – తోచవచ్చును. కానీ, ఏ స్త్రీ సామాజిక, వ్యక్తిగత, వ్యవస్థీకృత హింసకు అతీతులు కారు.

అసహనం, కోపం, భయం, అసమర్థత, నిస్సహయత – వాటి రంగులు అవి అద్దుకొని – స్త్రీలపై పరుగులు పెడతాయి. హింస కొనసాగుతుంది. వెలుపలా. లోపలా.

కొండేపూడి నిర్మలగారు ఇదే విషయాన్ని మరింత స్పష్టంగా చెప్పారు, అదే కవితలో
”ఇవాళ మతం, ఎల్లుండి చర్మపురంగు,
నాలుక పొడవు, పుట్టుమచ్చల సంఖ్య…
హత్యాకాండ ఏ కారణంగా జరిగినా
ఆశ్చర్యపోయేది లేదు”
(గుజరాత్ గాయం)

ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో ”రచన” ఎలా వీలవుతుంది? ఎప్పుడు రాయగలరు? ఎవరు రాయగలరు?

అన్నిరకాల నిర్వాసిత పరిస్థితులు, నేపధ్యాలు ఒకటికావు. అలాగే, రచనలు ఒకే రకం కావు.

బాధితులు స్వయంగా రచించే సందర్భాలు, చాలా కొద్దిగా ఉండవచ్చును. వారి సమస్యల పరిష్కారంలోనే వారు మునిగి వుండవచ్చును. కానీ, వారి అనుభవాలను పంచుకోవడంతో మరొకరు రాయవచ్చును.

ఏమైనా, అత్యవసర పరిస్థితిలో ఉన్నపుడు, ప్రమాదపుటంచులో ఉన్నపుడు-ఆ సున్నితమైన సందర్భంలో స్వీయ రక్షణ ప్రధానం అవుతుంది. ఎవరికి వారు పరాయి వారు. ఎంతో కొంత సమాచారాన్ని ఇతరుల నుంచి దాచివుంచే అవకాశం ఉంది.

ఆకస్మాత్తుగా కొత్తవారు వారి వ్యక్తిగత జీవితాల్లోకి ప్రవేశిస్తారు. అభిప్రాయాలు ప్రకటిస్తారు. నిర్ణయాలను నిర్దేశిస్తారు. వారు చుట్టూ ఒక కొత్త ప్రపంచం ఆవరించు కొంటుంది.

అంతకు పూర్వం వారికి తెలియని భావనలు, పరిచయంలేని చట్టాలు, నియమాలు, నిబంధనలు-వారిపై వాలి పోతాయి. నయారక్షకులు బయలు దేరుతారు.

అన్ని రూపాల్లో రంగుల్లోఅంశాల్లో దోపిడీ విజృంభిస్తుంది. అభద్రత, భయం, ఆందోళన చుట్టుముడుతాయి. విషాదం, కోపం, ముంచెత్తుతాయి. జీవితమే ఓ ప్రశ్నార్థకం అవుతుంది. హఠాత్తుగా ఒక యుద్ధరంగంలోకి నెట్టబడతారు. గాయాల్ని మాన్పుకుంటూ. జీవన పోరాటం చేస్తూ.

ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఎలా రాయగలుగుతారు?

”ఏ ఒక్క కథో నన్ను నిలిపి వెయ్యడం లేదు… ఏదో ఒక పాత్ర తీసుకొని… ఒక ఊరు తీసుకొని రాద్దామని కూర్చున్నపుడల్లా… శవాలుగా మారిన వాళ్ళు… మారబోతున్న వాళ్ళు… మా సంగతేమిటి…?..చెప్పు… అంటూ నిలవనియ్యడంలేదు… అందుకే నేనే కథ రాయను… రాయలేను…” అంటూ తన ”మోయలేని నిజాలు” కథలో రాస్తారు నల్లూరి రుక్మిణిగారు, నోట మాట పెగలని దుర్భర పరిస్థితిని కళ్ళారా చూసినప్పుడు ఒక సంఘర్షణ ఎలా రచయితను పట్టి కుదుపు తుందో చాలా సున్నితంగా స్పృశించారు రుక్మిణి గారు.

”ఒక్కటా రెండా ఎన్ని కుటుంబాలు ఎలా ఛిన్నాభిన్నం అయిపోయినాయి. దాన్నంతా మాటల్లో ఎలా పెట్టగలను?” తమ ‘హత్య’ కథలో పి.చంద్ గారు.

అయినా, వారు రాస్తారు. స్త్రీ పురుషులు ఇరువురు.

ఒక సంక్షోభ పరిస్థితిలో రాయడం అంటే – ఒక స్వీయ రక్షణ కావచ్చు. విపత్కర పరిస్థితిని ఎదుర్కొనే ప్రయత్నం కావచ్చు. బలం పుంజుకోవడానికి కావచ్చు. పరిష్కారాలు వెతుక్కోవడానికి కావచ్చు. ఒక ఉపశమనం కావచ్చు. ఒక పోరాటం కావచ్చు.

ఏమైనా-

విధ్వంస ప్రేరితాలైనా కాకున్నా, హింసతో కూడిన లేకున్నా – భూనిర్వాసితుల అనుభవాలన్నీ మానవ హక్కులపై ప్రకంపనలే. ఈ మానవ సంక్షోభం స్త్రీ పురుషులను ప్రభావితం చేస్తూనే ఉన్నది. స్త్రీలపై జెండర్ పరిమితులు వారిని మరిన్ని సున్నిత సమస్యలకు గురిచేస్తున్నాయి.

ఎలాంటి కఠిన పరిస్థితులు ఎదురైనప్పటికీ – ఎటువంటి సెన్సార్షిప్లు మనపై రెక్కలు విప్పుకున్నప్పటికీ – మనం రాస్తాం.

మనకు తెలుసు. మనం రాయాలి. మనం రాస్తాం. రాస్తూనే ఉంటాం. ఎందుకనీ?

కొండవీటి సత్యవతి గారు తేల్చి చెప్పేశారు, వారి సహజశైలిలో, స్పష్టంగా,

”తస్మాత్ జాగ్రత్త!
గుజరాత్లో మొదలు పెట్టిన ప్రయోగాల్ని
మన ఇంటి ముంగిట్లోకి తేబోతున్నారు.
……………
రేపు తమ కత్తుల్ని గురిపెట్టేది మన మీదనే
మన భావ ప్రకటనా స్వేచ్ఛా మీదనే
తస్మాత్ జాగ్రత్త! తస్మాత్ జాగ్రత్త!”

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో