విమోచన

కవిని
”6 గం||లు అవుతోంది. ఏంటి ఇంకా తయారు కాలేదా?” సోఫాలో కూర్చొని నిద్రపోతున్న 7వతరగతి చదువుతున్న కొడుకు శ్రవణ్‌ను చూసి గుమ్మం బయట నుంచే అన్నాడు మోహనరావు.
తండ్రి మాటవిని నిద్రలోకివెళ్తున్న వాడల్లా కళ్ళు తెరిచి ”మేము తయారయ్యి చాలా సేపయ్యింది డాడీ.” అన్నాడు శ్రవణ్‌.
”మీ అమ్మ ఏది? నేను వాకింగ్‌ చేసిరావటం కూడా అయిపోయింది. ఇట్లయితే మధ్యాహ్నానికి కూడా కర్నూలు వెళ్ళలేరు మీరు.” చెప్పులు బయట వదిలేసి లోపలకు వస్తూ అన్నాడు మోహనరావు.
”అమ్మ ఇప్పుడే తయారవుతోంది.” అప్పుడే అక్కడకు వచ్చిన 9వ తరగతి చదువుతున్న కూతురు శ్రావ్య చెప్పింది.
”ఈ ఆడోళ్ళతో పెట్టుకుంటే ఇంతే…. ఏంటి ఈరోజు మీరు వెళ్ళేదుందా? లేదా? లేకపోతే కారు కాన్సిల్‌ చేసెయ్యనా?” గట్టిగా బెడ్‌రూమ్‌లో ఉన్న రమణికి వినపడేటట్టుగా అన్నాడు మోహన్‌రావు.
”వస్తూనే ఉన్నా… అయి పోయింది. అన్నింటికీ తొందరపడితే ఎట్లా.” గదిలోపల నుండే సమా ధానం చెప్పింది రమణి.
”తొందరగా కానీ…. అయి పాయె టైము.” అన్నాడు మోహనరావు.
”శ్రావ్యా… శ్రావ్యా…” బెడ్‌ రూములోంచి పిలుస్తోంది రమణి. శ్రావ్య వినిపించుకున్నట్టుగా లేదు.
”శ్రావ్యా! మీ అమ్మ పిలు స్తోంది చూడు” అన్నాడు మోహన రావు.
”ఆఁ…. ఏంటమ్మా!”శ్రావ్య అంది.
”ఒక్కసారి తలుపు కొంచెం తీస్తాగానీ లోపలకు రావే…” అన్నది రమణి.
”సరేఁ….” అంటూ లోపల రమణి గడియ తీయగానే లోపలకు వెళ్ళి మళ్ళీ గడియపెట్టింది శ్రావ్య.
మంచంమీద చీరలు పరిచి వాటినే మార్చి మార్చి చూస్తున్న రమణితో ”ఏంటమ్మా…” అన్నది శ్రావ్య.
”ఇదిగో… వీటిల్లో ఏ చీర కట్టుకోనే…. నెమలి పింఛం రంగుకు పసుపు రంగు అంచు ఇది చాలా బాగుంది కదా!… లేకపోతే ఇదిగో ఇదికూడా లేత గులాబిరంగు చీరకు ముదురు గులాబీ రంగు అంచు ఎంత బాగుందో కదా! ఇక ఇదంటావా…. హాఫ్‌ వైట్‌ రంగు చీరకు మెరూన్‌ కలర్‌ అంచు మీ నాన్న మొన్న పండగకు కొన్న చీరె”. చీరల్ని ఒంటిమీద పెట్టుకుని చూపిస్తూ అన్నది రమణి.
”ఏదో ఒకటి కట్టుకోమ్మా… నీకన్నీ బాగానే ఉంటాయి.”
”అలా కాదే… ఏది చాలా బాగుంటుందో చెప్పు.”
”అదిగో… ఆఁ… హాఫ్‌ వైట్‌ చీర బాగుంది”
”అబ్బ…. మీ నాన్నది, నీది ఒకటే టేస్టు. అది కాదే మీ నాన్న తెచ్చే హాఫ్‌ వైటూ, వైటు, లైటు పసుపు రంగు, గోధుమరంగు చీరలు తప్ప పెళ్ళయిన ఈ 15 ఏళ్ళలో ఇంకొక రంగుచీర కట్టే ఎరగను. ఏదో  ఈ మధ్యనే నాకిష్టమైన రంగులు కొనుక్కుంటున్నాను. ఆరెండింటిలో ఏదో ఒకటి సెలక్టు చేస్తావనుకుంటే… మళ్ళీ హాఫ్‌ వైటే సెలెక్టు చేశావంటే బాబూ…. ఆ గులాబీది బాగుంటుందనిపిస్తోందే…”
”అయితే అదే కట్టుకో…. ఏదయితే ఏమవుతుంది. తొందరగా రా అమ్మా… నాన్నకు కోపం వస్తుంది.”
”సర్లే. ఇక నువ్వు వెళ్ళు. ఒక పది నిమిషాలు నన్నెవరూ కదిలీకుండా ఉంటే వచ్చేస్తా.”
శ్రావ్య బయటకు వెళ్ళింది.
రమణి నిన్నంతా ఆలోచించి ఆలోచించి బీరువాలో ఉన్న చీరలన్నింటి లోంచి ఈ మూడింటిని సెలక్టు చేసుకుంది. అయితే ఈ మూడింటిలో ఈరోజుకి ఏ చీర కట్టుకోవాలో, రేపటికి ఏ చీర కట్టుకోవాలో అన్న సందేహం ఇంకా తీరలేదు. అద్దంలో ఒకటికి రెండు సార్లు రెండు చీరల్ని ఒంటి మీద పెట్టుకుని చూసుకుంది. చివరకు పసుపురంగు అంచు ఉన్న నెమలి పింఛం రంగు చీర ఈ రోజు కట్టుకుంటే బానే ఉంటుంది అనుకుంది. కానీ ఈ చీరకు తగినట్టుగా ఎట్లాంటి నెక్లెస్‌ పెట్టుకుంటే బాగుంటుంది. రెండూ ముదురు రంగులే కాబట్టి సింపుల్‌ నెక్లెస్‌ పెట్టుకోవాలి. మరి నల్లపూసల గొలుసు వేసుకోవాలా? వద్దా? నల్లపూసల గొలుసు వేసుకుంటే ఎబ్బెట్టుగా అనిపిస్తుందేమో? బీరువాలో ఉన్న 5 రకాల దిద్దులు, 3 రకాలలో బయటికి తీసి చీరల మీద ఒక్కొక్క నెక్లెస్‌ను పెట్టి చూసి, మరొకసారి పిల్లలకు, మోహనరావుకు చూపించి చివరకు ఒక నెక్లెస్‌ను, చెవి దిద్దుల్ని ఈ రోజు వేసుకునే చీర మీదకు సెలక్టు చేసుకుంది రమణి.
తయారయ్యి బయటకు వచ్చిన రమణిని చూసి ”ఏడ్సినట్టుంది ఈ చీర నీకు. నీ ఒంటిరంగేంటి? నువ్వు కట్టిన చీర రంగేంటి? ఎప్పుడైనా మన ఒంటికి నప్పే రంగులే కట్టాలి. లోపలకెళ్ళి అద్దంలో నీ మొఖం ఒక్కసారి చూస్కో తెలుస్తుంది. నువ్వేమో నలుపు, తెల్లటి వాళ్ళు కట్టే చీర నువ్వు కట్టావ్‌. అమ్మోరి వేషం వేసినట్టుంది”. గబగబా అనేశాడు మోహనరావు.
”అంత బాలేదా… పోనీ వేరే చీర మార్చుకొచ్చెయ్యనా?” దిగాలుగా అడిగింది రమణి.
”ఇక నువ్వు బయలుదేరినట్టే కానీ. కారుని వెళ్ళిపొమ్మని చెప్తాలే.”
”ఇప్పుడు నేనేమి చీర మార్చుకోవటం లేదు.” అలిగినట్టుగా ముఖం పెట్టి అన్నది రమణి.
ఇంతలో ఏదో గుర్తుకు వచ్చిన దానిలాగా ”అరె మీకు నేను చాయ్‌ ఇవ్వలేదు కదా!… ఇప్పుడే వేడిచేసి ఇస్తా….”
”ఏం వద్దులే… చాయ్‌ నేను వేడిచేసుకుని తాగుతానులే ముందు మీరెళ్ళండి.”
”కిచిడీ చేశాను. పెరుగు పచ్చడి కూడా చేశాను. అన్నీ డైనింగ్‌ టేబులు మీదే పెట్టాను.”
”నేను చూసుకుంటానులే.”
చెప్పులు తొడుక్కుని గుమ్మం బయటనుంచొని ”అమ్మా… ఎంతసేపు.” అని విసుగ్గా అంటున్న శ్రావ్య వంక చూసి ”శ్రావ్యా… కొత్త లోలాకులు పెట్టుకోమన్నా కదా… పెట్టుకోలేదు ఎందుకని? నీ పుట్టినరోజున వేసుకున్న డ్రస్సు వేసుకోమని చెప్పాను కదా? ఈ డ్రస్సు వేసుకున్నావేంటి?” తను చెప్పినవి పాటించనందుకు నొచ్చుకుంటూ అడిగింది రమణి.
శ్రావ్య అసహనంగా ఏదో చెప్పబోతుండగానే మోహనరావు కల్పించుకుని ”నువ్వు కట్టుకున్నావుగా? ఇక చాలదా! అది నా కూతురు. దానికిష్టమున్నట్టే అది ఉంటుంది.” ఖరాఖండిగా చెప్పేశాడు.
భర్త మాటలకు మౌనంగా ఉండి. ”సరే…. శ్రావణ్‌ ఏడి? సూట్‌కేసేది?”
”వాడు ఇందాకే కారులోకెళ్ళి కూర్చున్నాడు. సూట్‌కేసు కారులో ఇందాకే పెట్టేశాం.” గబగబా మెట్లు దిగుతూ అన్నాడు మోహనరావు.
కిందకు దిగి రోడ్డు మీదకు వచ్చి కారు ఎక్కబోతున్నదల్లా… ”అరె… శ్రావ్యా… మర్చిపోయాను… ప్లీజ్‌…. ప్లీజ్‌ కొంచెం పైకెళ్లి గాజుల డబ్బాతేవా?”
”ఎక్కడుంది?”
”బెడ్‌రూంలో మంచం మీద పెట్టాను.”    ”గాజుల డబ్బా లేదు… ఏమీ లేదు… ఇక కూర్చోండి” మోహన్‌రావు కసురుకున్నాడు.
”వెళ్ళవే ముందు…” గట్టిగా శ్రావ్యతో అన్నది రమణి.
శ్రావ్య పరుగెత్తుకుంటూ వెళ్ళి గాజులడబ్బా తీసుకుని వచ్చింది.
”ఈ ఆడోళ్ళంతా… ఇంతే వీళ్ళింక బయలుదేరరు కానీ… నువ్వు ముందు కారు స్టాట్‌ చెయ్యి సాంబయ్య” డ్రైవరుతో అన్నాడు మోహనరావు. తనకేమీ పట్టనట్టుగా డ్రైవరు పక్కసీట్లో వెనక్కు ఆనుకుని కూర్చుని ఉన్నాడు శ్రావణ్‌. వెనక సీటులో రమణి, శ్రావ్య కూర్చున్నారు. శ్రావ్య, రమణి కారు ఎక్కి కూర్చోగానే…
”ఈరోజు, రేపు కర్నూలులో ఉంటారు. ఎల్లుండి పొద్దున్నే బయల్దేరి హైద్రాబాదుకు రావాలి.” డ్రైవరు సాంయ్యకు చెప్పాడు మోహనరావు. తెలిసిన డ్రైవరు. సొంత డ్రైవరు లాగా ఉంటాడని ఎప్పుడూ తన ఆఫీసు వాళ్ళు బుక్‌ చేసే ట్రావెల్న్‌ కారునే బుక్‌ చేశాడు మోహనరావు.
ముగ్గురూ మోహనరావుకు ‘బై’ చెప్పటంతో కారు బయలుదేరింది.
జ       జ       జ
కారువేగం పుంజుకుంది. ఇది ఒక రకంగా రమణికి అనుకోని ప్రయాణమే. రమణి పెద్దమ్మకూతురు సరస్వతి రెండు రోజుల క్రితం ఫోను చేసినప్పుడు రమణిని కర్నూలు పంపమని చెప్పింది. సరస్వతి ఇద్దరు కొడుకులు ఉద్యోగరీత్యా వేరే ప్రాంతాలలో ఉంటారు. సరస్వతి ఒక్కతే కర్నూలులో ఉంటుంది. ఊర్లో సరస్వతికి చాలా మంచిపేరు. ఊర్లో ఉన్న పేద, అనాధ మహిళలకు, పిల్లలకు తోచిన సహాయం చేస్తూ ఉంటుంది. ఏదైనా పని మీద హైద్రాబాద్‌ వచ్చినప్పుడల్లా సరస్వతి రమణిని చూడకుండా, కలవకుండా వెళ్ళదు. రమణికి వివాహం అయ్యి 15 సం||రాలు అయ్యింది. ఇంటర్‌ పూర్తి అయ్యి వివాహం అయ్యేదాకా కర్నూలులోనే చదువుకుంది రమణి. ఇంటర్‌ పూర్తి కాగానే హైద్రాబాద్‌లోని ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న మోహనరావుతో వివాహం అయ్యింది రమణికి. వివాహ కావటంతోటే హైద్రాబాద్‌ రావటం జరిగింది. వివాహం అయిన కొద్దిరోజులకే రమణి తల్లి మరణించటం, తండ్రి బెంగుళూరులో ఉన్న రమణి అన్న దగ్గరకు వెళ్ళటం జరిగింది.
ఆ తర్వాత రమణికి కర్నూలు వెళ్ళవలసిన అవుసరం కలగలేదు. సరస్వతి ఎన్నిసార్లు అడిగినా మోహనరావు రమణిని కర్నూలు పంపక పోవటాన ఈ మధ్య హైద్రాబాద్‌ వచ్చినపుడు ‘మీరు కనక రమణిని, పిల్లలను మా ఊరు పంపకపోతే ఇక ఎన్నడూ నేను మీ ఇంటికి రానని’ మోహనరావుతో తెగేసి చెప్పేసింది. ఇకలాభం లేదనుకుని పిల్లలకు సెలవులు ఇచ్చినపుడు పంపుతానని మాట ఇచ్చాడు మోహనరావు. ఎక్కడకు వెళ్ళాలన్నా తను ఉండి తీసుకుని వెళ్ళాల్సిందే తప్ప వంటరిగా ఎప్పుడూ రమణిని, పిల్లలను ఎక్కడికీ పంపలేదు మోహనరావు. ఈసారి ఆఫీసులో సెలవు దొరకక పోవటాన పిల్లలను, రమణిని పంపించి తాను హైద్రాబాద్‌లోనే ఉండిపోయాడు. ఊళ్ళో అందరూ చూడాలనుకుంటున్నారని సరస్వతి రమణికి చాలాసార్లే చెప్పింది. అందర్నీ కలుస్తానన్న, చూస్తానన్న ఆనందం ఒక పక్క ఉన్నా, ఇంకో పక్క ఇందాక మోహనరావు అన్న మాటలు బాధపెడ్తున్నాయి రమణిని. డ్రైవరుకు వినపడకుండా నెమ్మదిగా ”శ్రావ్యా… ఇందాక మీ నాన్న అలా అన్నాడేమే? ఈ చీర నాకంత నప్పలేదా…”
”వదిలేయమ్మా! నాన్న ఏదో ఒకటి అంటుంటాడు. నువ్వు అదే పట్టుకుని బాధపడుతుంటావు.”
”నిజంగా బాలేదేమోనే… అక్కడ ఊళ్ళో అందరూ నన్ను చూసి ఏమనుకుంటారో ఏమో?”
”అబ్బ… అమ్మా… ఇంక వదిలెయ్‌. నాన్న కావాలని అంటాడు. నువ్వు ఫీలవుతుంటావు.”
”సర్లేవే…. నేను నీకిచ్చిన లోలాకుల్ని పెట్టుకోలేదేమే?”
”నాకు అవి పెట్టుకోవడం ఇష్టంలేదమ్మా.”
”మీ అత్తపిల్లలు చూడు. ఎక్కడికైనా వెళ్ళాలంటే ఎలా తయారవుతారో? నువ్వేమో ఎంత చెప్పినా వినవు. మొన్న మీ అత్త ఏమంటోందో విన్నావుగా? నీకెలాగూ తయారవటం రాదు. దాన్నైనా కొంచెం మంచిగ తయారుచెయ్యి అన్లే. నువ్వు పక్కన ఉండి విని కూడా ఇంకా ఎందుకు తయారవటం అని అడుగుతున్నావు?”
”అమ్మా! నీకు ఇష్టమయితే నువ్వు వాళ్ళందరి మాటలు పట్టించుకో. నాకు అవసరం లేదు. ఏ పనైనా నాకు నచ్చితే చేస్తా లేకపోతే లేదు.”
”ఇప్పుడలాగే అంటావు. నేనూ నీలాగే అనుకునేదాన్ని. తర్వాత తర్వాత మనిష్టాలు ఏమీ ఉండవు.”
”తర్వాత సంగతి నాకు తెలియదు. ఇప్పుడైతే నేనింతే.”
”సరే నీ ఇష్టం. నేను చెప్పేది చెప్పా.” కూతురు తనను అర్థం చేసుకోవటం లేదని బాధపడ్తూ మౌనంగా ఉండిపోయింది రమణి.
కారులో వెళ్తున్నప్పుడు చదువుకోవడానికి తెచ్చుకున్న డైలీపేపరులోని హెడ్‌లైన్లు చదువుతోంది రమణి. శ్రావ్య, శ్రావణ్‌ వాళ్లకు నచ్చిన పాటల సి.డి.లు తెచ్చుకున్నారు. శ్రావ్య తెచ్చిన సి.డి.లోని పాటలు శ్రావణ్‌కు నచ్చవు. శ్రావణ్‌ తెచ్చుకున్న పాటలు శ్రావ్యకు నచ్చవు. ఒకళ్ళు సి.డి. వింటూంటే ఇంకొకళ్ళు గొడవ. చివరకు డ్రైవరు సాంబయ్య శ్రావ్య, శ్రావణ్‌ తెచ్చిన సి.డి లు పక్కన పెట్టి తన దగ్గరున్న వేరే పాటల సి.డి. ని వేశాడు. శ్రావ్య మౌనంగా చదువుకోవటానికి తెచ్చుకున్న ఫిజిక్స్‌ బుక్‌ తీసి చదువుకుంటూ కూర్చున్నది. మధురమైన, సున్నితమైన పాత హిందీ పాటలంటే రమణికి చాలా ఇష్టం. ‘సిల్‌ సిలా’, ‘అభిమాన్‌’ లాంటి హిందీ సినిమాలలోని పాటలను కారులో వెళ్తూ వినాలనేది రమణి కోర్కె. పాత తెలుగు పాటల సి.డిలు, హిందీ పాటల సి.డిలు ఇంట్లో ఉన్నాయి. మోహనరావుకు కూడా పాత సినిమాల పాటలంటే చాలా ఇష్టం. ఎప్పుడు ప్రయాణమైనా ఆ సి.డిలను తెస్తుంటాడు. తను ఏ పాటలు వినాలనుకుంటాడో తన అర్థాంగి కూడా అవే పాటలను వింటూ ఆనందించాలనుకుంటాడు. ఎప్పుడైనా రమణి తనకిష్టమైన పాటలు పెట్టమని అడిగినా ”నువ్వు ఒక్కదానివి వింటే సరిపోతుందా? మేమూ మాకిష్టమైన పాటలు వినాలిగా” అంటూ కసురుకుంటాడు. డ్రైవర్లముందు గొడవపడటం ఇష్టంలేక మౌనంగా ఉండిపోతుంది రమణి. మర్చిపోతుందేమోనని రాత్రి టి.వి ముందు సి.డి ని పెట్టిన విషయం ఇప్పుడు గుర్తుకు వచ్చింది రమణికి.” ఇదిగో ఈ చీరల సెలక్షన్లలో పడిపోయి గాజుల పెట్టెనయితే తెచ్చుకుంది కానీ సి.డి ల సంగతే మర్చిపోయింది” మనసులోనే అనుకుంది రమణి.
”శ్రావణ్‌ హిందీపాటల సి.డి లు టి.వి ముందు పెట్టాను తీసుకురాలేదా?” అని శ్రావణ్‌ను అడిగింది రమణి.
”నువ్వు నాకు చెప్పలేదు కదమ్మా!” అన్నాడు శ్రావణ్‌.
”చెప్పకపోయినా మీ సి.డి లు తెచ్చుఉన్నట్లే ఆ సి.డి ని కూడా తెస్తే సరిపోయేది కదరా!”
”కారు మధ్యలో ఎక్కడైనా ఆపి సి.డి కొందాం లేమ్మా” అన్నది శ్రావ్య.
తన కిష్టమైన పాటలు వినే అవకాశం ఉన్నా, వినలేక పోతున్నందుకు మనస్సులోనే నొచ్చుకుంది రమణి.
రమణి తనపక్కనే పెట్టుకున్న గాజుల పెట్టె మూత తీసి అద్దంలో తన ముఖాన్ని ఒకసారి చూసుకుంది.
”శ్రావ్యా…. నిన్నటి కంటె నాముఖంలో ఏమైనా తేడా వచ్చిందా?”
”నిన్నటికీ, ఈ రోజుకీ ఏం తేడా వస్తుందమ్మా” విసుగ్గా అన్నది శ్రావ్య.
”అది కాదే…. కొంచం ముఖం తెల్లగా అనిపిస్తోందా అని.”
”నిన్నటిలాగే ఉన్నది కానీ తలకు పోసుకున్నావుగా అందుకే కొంచం ఫ్రెష్‌గా అనిపిస్తోంది.”
”సర్లే…. నిన్ను కూడా తలకు పోసుకోమన్నానుగా… నువ్వు వినలేదు. నీకంటే వాడే నయం. నేను చెప్పినట్టల్లా వింటాడు. ఊళ్ళకు వెళ్ళేటప్పుడు, ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు చక్కగా తయారవ్వాలని చెప్తాను. విననే వినవు.  మీ నాన్న సపోర్టు ఉండి నీకు ఆడింది ఆట పాడింది పాట అవుతోంది.”
”అబ్బా… అమ్మా… ఏమయ్యింది ఇప్పుడు…. ఇంత చిన్న విషయానికి.”
”పెళ్ళి కాకముందు నేనూ నీకు లాగానే అనుకునేదాన్నే. పెళ్ళయ్యాక ఎన్ని అవమానాలు పడ్డానో తెలుసా?”
”నీకు అయినట్టుగా అందరికీ అవదుగా అమ్మా….”
”సరే నీ ఇష్టం లేవే” అన్నది రమణి.
శ్రావణ్‌ డ్రైవర్ని రకరకాల ప్రశ్నలు వేస్తున్నాడు. సాంబయ్య ఓపిగ్గా సమాధానం చెప్తున్నాడు శ్రావ్య బయటి పరిసరాలను గమనిస్తోంది.
రమణి తన గాజులపెట్టె తెరచి చూసుకుంది. తను పెట్టుకున్నవన్నీ ఉన్నాయా? లేవా? అని. చిన్న అద్దం, దువ్వెన, స్నో, బొట్టు, కాటుక, దువ్వెన, ఒక చిన్న ప్యాకెట్‌లో కొంచెం పచ్చి పసుపు, ఒక చిన్న ప్యాకెట్లో కొంచెం శనగపిండి, రోజ్‌ వాటర్‌, లాక్మే పౌడరు చిన్న డబ్బా, పాండ్స్‌ శాండల్‌ ఉడ్‌ పౌడరు, ఒక బొట్టు బిళ్ళల ప్యాకెట్‌, అన్నీ సరిగానే ఉన్నాయి.
”హమ్మయ్య.” అనుకుంది.
మినరల్‌ వాటర్‌ బాటిల్స్‌ కాకుండా తను ప్రత్యేకం ఇంటినుండి తెచ్చుకున్న మంచినీళ్ళు బాటిల్‌ ఉన్నాయో లేదో చూసుకుంది. అన్నీ ఉన్నాయి.
కారులోకి రమణి కూర్చున్న సీటు మీద ఎండ పడుతుంది. ఇలాగే ఊరెళ్ళేదాకా ఎండ మీద పడుతుంటే చేతులు, ముఖమూ వాడిపోయినట్టుగా, కమిలి పోయినట్టుగా అవుతాయామే! ఈ ఆలోచన రాగానే వెంటనే కారు అద్దం మీద టవలు వేసి అద్దాన్ని నెమ్మదిగా పైకి ఎక్కిస్తోంది రమణి. కారు అద్దాన్ని ఎక్కిస్తూ బయటకు చూసింది.
బయట ఎండ చర్రుమంటుంది. 5, 6 గురు ఆడవాళ్ళు బోరింగ్‌ పంపును కొడ్తున్నారు. నీళ్ళు సన్నని ధారగా వస్తున్నాయి. కొంతమంది తమ బిందెలు నిండాయేమో! నిండిన బిందెల్ని నెత్తికెత్తుకుని ఎండనపడి వెళ్తున్నారు. బహుశా చాలా దూరం వెళ్ళాలో! ఏమో! వాళ్ళ కాళ్ళకు కనీసం చెప్పులు కూడా లేవు. కొంతమంది పసిబిడ్డల్ని చంకన వేసుకుని వెళ్తున్నారు. వాళ్ళలో ఏ ఒక్కరూ ముతకచీరలు తప్ప మామూలు చీరలు కట్టలేదు. ఏ మ్యాచింగ్‌ బ్లౌజ్‌లు వేయలేదు. ఏ స్నో పౌడర్లు పూయలేదు. కారు చాలా దూరం వెళ్ళేదాకా అట్లాగే చూస్తూ ఉండిపోయింది రమణి. ఇంత కష్టం చేస్తున్నారు? ఏ హంగూ, ఆర్భాటమూ లేకపోయినా అందంగానే ఉన్నారే? తనే అందం గురించి ఎక్కువగా ఆలోచిస్తోందా? మనసులోనే అనుకున్నది రమణి.
టైము 9 గం||లు కావస్తోంది. శ్రావ్య టిఫిన్‌ పెట్టమని అడిగింది. పేపరును సగం సగం చేసి ఇచ్చింది. బట్టలమీద పడేసు కోకుండా న్యూస్‌ పేపరును ఒళ్ళో పెట్టుకుని తినమని చెప్పింది రమణి. తనూ ఒక సగం పేపరు ఒళ్ళోపెట్టుకుని టిఫిను తిన్నది రమణి. తనకిష్టమైన పాటల సి.డిని ఎలాగూ తెచ్చుకోలేక పోయింది. అలాగని పేపరూ చదవలేకపోయింది.
కారు కర్నూలు చేరబోతుండగా రమణి ముఖానికున్న బొట్టు బిళ్ళను తీసి కారు అద్దాన్ని కొంచెం కిందకు దింపి బాటిల్‌లోని నీళ్ళను కొంచెం చేతిలోకి తీసుకుని మొహం తడుపుకుంది. పొద్దున ముఖం ఫ్రెష్‌గా, నీటుగా ఉండటానికని ముల్తానామట్టి ముఖానికి రాసుకుంది. ఎక్కువసేపు ఉంచుకోవటానికి టైములేక పదినిమిషాలు మాత్రమే ఉంచుకుంది. అందుకనే కొంచం పసుపు శనగపిండి కలిపి ముఖానికి రాసుకుంది. డ్రైవరుకు ముఖం కనపడకుండా ఉండటానికి తలను కిందికి దింపుకుంది
”అమ్మా! కారులో ఇవన్నీ ముఖానికి రాసుకోవటం ఎందుకే?” రమణి అవస్థ చూసి శ్రావ్య అడిగింది.
”ఏం కాదులేవే ” అని పైకి అంటూ బాగుండదేమో అని మనసులో అనుకుని నెమ్మదిగా ముఖాన్ని టవలుతో తుడుచుకుంది రమణి. కొంతదూరం వెళ్ళాక కారును ఆపించి తను తెచ్చుకున్న బాటిల్‌లోని నీళ్ళతో ముఖాన్ని కడుక్కుంది. టవలుతో సున్నితంగా, నెమ్మదిగా ముఖాన్ని తుడుచుకుంది. మరోమారు గాజులపెట్టె మూత తీసి అద్దంలో ముఖాన్ని చూసుకుంది. ఇందాకటి మీద కొంచెం బాగుంది అని మనసులోనే అనుకుంది. తన ముక్కును ఒకసారి చూసుకుంది. ముఖాన్ని కొద్దో గొప్పో తెల్లగా చేసుకోగలిగా కానీ ముక్కు మారదు కదా! అని మనసులో అనుకుంది రమణి. తల్లినే గమనిస్తున్న శ్రావ్య అడిగింది ”అమ్మా! ఎక్కడికైనా వెళ్ళాలంటే తయారవటానికి నువ్వు ఇంతటైము వేస్టు చేసుకుంటావు ఎందుకమ్మా!”
”నీకు తెల్సుకదా! శ్రావ్య. మొన్న మీ నాన్న మీతోనే అన్నాడు కదా! ఎంతడబ్బు ఖర్చయినా మీ అమ్మ ముక్కును ప్లాస్టిక్‌ సర్జరీ చేయించాలని. మీ నాన్నకు, మీ మేనత్తకు, మీ నాయనమ్మకు నేనెట్లా ఉన్నా నచ్చదే బాబూ. ఏదో కొంచెం బెటరుగా కనపడాలని నా తాపత్రయం అంతే. ఒక్కొక్కసారి నాకే అనిపిస్తుంటుంది…. మీ నాన్నేమో తెల్లగా బాగుంటాడు గదా! నేను ఆయనకు సెట్‌ కాలేదేమోనని. ”నువ్వు కూడా బాగానే ఉంటావమ్మా! కారణం తెలియదు కానీ నాన్న నిన్నెప్పుడు నల్లగా ఉంటావనో, ముక్కు బాలేదనో ఏదో ఒకటి అంటుంటాడు. అట్లాంటప్పుడు నేనింతే. నేను ఇలాగే ఉంటాను. అని నువ్వు అనవచ్చుగా అమ్మా.”
”ఊరికే ఇంట్లో గొడవలు ఎందుకు. మీ చదువులు దెబ్బ తింటాయి ఆయనకు నచ్చినట్టు ఉంటే సరిపోయె.”
”ఇలా ఎంతకాలం సరిపెట్టుకుంటావమ్మా. వంటలో నాన్నకు ఇష్టమయినవే. చీరలు నాన్నకు నచ్చినవే. అన్ని పనులు నాన్నకు నచ్చేవే చేయాలని నువ్వు అనుకుంటావు. కానీ నువ్వెంత చేసినా నాన్న నిన్ను మెచ్చడుకదమ్మా!”
ఇంతలోకి సరస్వతి ఫోను వచ్చింది.
”రమణి ఎక్కడిదాకా వచ్చారు.”
”అక్కా! కర్నూలు దగ్గరకు వచ్చేస్తున్నాం.”
”సరే….” అన్నది సరస్వతి.
పెళ్ళయి అత్తవారింటికి వెళ్ళే దాకా రమణికి తన రంగు గురించి ఆలోచించాల్సిన అవసరమే రాలేదు. పెళ్ళయి మొదటిసారిగా అత్తవారింటికి వెళ్ళినప్పుడు ఆడబిడ్డ పక్కవాళ్ళతో అంటూండగా విన్నది” మా అన్నయ్య భార్య ఎంత తెల్లగా ఉంటుందో! మా తమ్ముడికి ఇట్లాంటి నల్లటమ్మాయి దొరికింది. ఏం చేస్తాం. ముందు మంచి సంబంధం అని చేసుకుందామనుకున్నాము. తర్వాత అమ్మాయి నల్లగా ఉంది కాన్సిల్‌ చేసుకుందామని అంటే. మా తమ్ముడు వింటేగా. చేసుకుందామని అనుకున్నాం కాబట్టి పెళ్ళి చేసుకుంటాను. ఇక వంకలు పెట్టకండి అన్నాడు”. అని చెప్పటం రమణి చెవిన పడింది. అప్పటి నుండి రమణి మనసు మనసులో లేదు. ఇంట్లో సహజంగా చామన చాయ అంటారేగానీ, తన రంగుపట్ల ఇంత వ్యతిరేకత ఉంటుందనేది రమణికి మింగుడుపడని విషయం. తర్వాత తర్వాత అవకాశం దొరికినప్పుడల్లా తమ్ముడితో ”నువ్వు చేసుకున్నావులే నల్లపిల్లని” అని దెప్పిపొడుస్తుండేది ఆడబిడ్డ. మొదటిసారి కడుపుతో ఉన్నప్పుడు రమణి అత్తా, ఆడబిడ్డ, భర్తలది ఒకటే స్మరణ. ”వాడు తెల్లగా ఉన్నాడు. మేమూ తెల్లగనే ఉన్నాం కానీ ఏం లాభం వీడికి నల్లటి ఆడపిల్ల పుడుతుందో? ఏమో?” ప్రతి నిమిషం వాళ్ళకి ఇదే చింత. శ్రావ్య తెల్లగా పుట్టటంతో రమణికి కొంచెం ఊపిరి పీల్చుకున్నట్లయ్యింది. చీరల సెలక్షన్లు అందరూ తమకు నచ్చినవి సెలక్టు చేసుకుంటే… రమణి కూడా తనకు నచ్చిన రంగు సెలక్టు చేసుకోవాలనుకునేది. కానీ రమణి భర్తతో సహా అక్కడున్న వాళ్ళందరూ ”నువ్వు నల్లగా ఉంటావు. ఈ రంగులు ఏం బాగుంటాయి నీకు” అని ఠక్కున అనేవాళ్ళు. అప్పటి నుండి రమణికి ఏ రంగు చీర కట్టాలన్నా సందేహమే. తన వంటికి ఆరంగు నప్పుతుందో? లేదో? అని. పెళ్ళయిన ఈ 15సం||రాలలో ఎలాగైనా కొంచెమైనా రంగు మారి ఫర్వాలేదు. నువ్వు బాగానే ఉన్నావు” అని అనిపించుకోవాలన్న ఆరాటం రమణిది.
కారు కర్నూలు దగ్గరకు వచ్చింది. తెచ్చుకున్న క్రీమును ముఖానికి పూసి, లైటుగా లాక్మే పౌడరు రాసి, ఒకటికి రెండు సార్లు అద్దంలో పెట్టుకున్న నెక్లెస్‌, చీరరంగు తన శరీరానికి నప్పాయో? లేదో? చూసుకుంది రమణి. శ్రావ్యను మొహం కడుక్కొని పౌడరు రాసుకొమ్మని రమణి ఎంత చెప్పినా శ్రావ్య వినిపించుకోలేదు.
ఇంటి ముందు కారు ఆగంగానే సరస్వతి సాదరంగా రమణిని, పిల్లలను ఇంటి లోపలకు ఆహ్వానించింది. వెనకటి విషయాల్ని శ్రావ్య, శ్రావణ్‌లకు చెప్తూ, రమణికి గుర్తుచేస్తూ ఆప్యాయంగా భోజనం వడ్డించింది సరస్వతి. అక్కడి వాతావరణం, సరస్వతి చూపించే మమకారం వాళ్ళకు ఎంతో సంతోషాన్ని ఇచ్చాయి. రమణికి సంబంధించిన చిన్నప్పటి విషయాల్ని చెప్తూ ఉంటే శ్రావ్య, శ్రావణ్‌ ఎంతో ఉత్సాహంగా విన్నారు. రమణి చిన్నప్పటి స్నేహితులూ, రమణిని కలవాలనుకుంటున్న వాళ్ళు రేపుదయం వస్తారని చెప్పింది సరస్వతి. అన్నీ వింటూ ”అక్కా! ఈ చీర నేనుకొన్నదే. చీర రంగు నాకు బాగుందంటావా?” అంటూ చీరకు సంబంధించిన, తన అందానికి సంబంధించిన ప్రశ్నలను మధ్య మధ్యలో రమణి సరస్వతిని అడుగుతూనే ఉన్నది. రమణి అడిగే ప్రశ్నలకు నవ్వుతూ తల ఊపటం తప్ప ఒక్క మాట కూడా మాట్లాడలేదు సరస్వతి.
మధ్యాహ్నం భోజనాలు అయినాక బయటి ఆవరణలో నుంచి వచ్చే చల్లని వేప చెట్టుగాలికి ఎండ, ప్రయాణ బడలిక వలన శ్రావ్య, శ్రావణ్‌ వరండాలో మంచం మీద పడుకుని నిద్రపోయారు. సరస్వతి, రమణి కొంతసేపు పిచ్చాపాటీ మాట్లాడుకున్నారు. తర్వాత రమణిని విశ్రాంతి తీసుకోమని చెప్పి సరస్వతి పనిమీద బయటకు వెళ్ళింది. సాయంత్రం అయినట్టుంది. బయట వరండాలో మాటలు వినపుడుతుంటే ముందు గదిలో పడుకున్న రమణి లేచి వరండాలోకి వచ్చింది. చేతిలో గంపతో, 65 సంవత్సరాల వయస్సున్న ఒక ఆవిడ సరస్వతితో ఏదో మాట్లాడుతుంది. ముదురు ఆకుపచ్చచీర, ఎర్రని జాకెట్టు వేసుకుంది. జుట్టు సగానికి పైగా తెల్లబడి ఉంది. ఆమెను ఎక్కడో చూసినట్టుగా అనిపించింది రమణికి. వరండాలోకి వచ్చిన రమణిని చూసి…. ”సరస్వతమ్మా… ఈ యమ్మ ఎవరు?”
”ఎవరేంటి లచ్చుమమ్మా… మన రమణి”.
”ఆఁ…. రమణమ్మనా… ఆశ్చర్యంగా రమణివంక చూస్తూ…. ‘ఎంత పెద్దగయ్యింది గుర్తుపట్టరాకండా” అంటూ ”రమణమ్మా… నేను లచ్చుమమ్మని… గుర్తుపట్టినావా…. నేను కట్టెల మోపు నెత్తినెత్తుకుని ఎళ్తా ఉంటే… పిలిసి మరీ బొమ్మ గీసేదానివి… నిన్ను నేనెట్టా మరిసిపోతా…” సిన్నప్పుడు ఎంత బాగా బొమ్మలు గీసేదానివి…. ఇప్పుడు కూడా గీత్తన్నావా… ఇప్పుడు ఇంకా బాగా గీత్తుంటావులే… గీసిన బొమ్మలు నీకాడుంటే ఓమారు సూపీరాదమ్మా.”
రమణికి లచ్చుమమ్మ కలగా గుర్తుకువచ్చింది. లచ్చుమమ్మ అడిగిన ప్రశ్నలకు తన దగ్గిర సమాధానం లేదు. బొమ్మలు గీయటం వదిలేసి 15 ఏళ్ళకు పైగా అయ్యింది. ఒక్క నిమిషం మౌనంగా అయి ”ఇప్పుడు నా దగ్గర ఏమీ లేవు లచ్చుమమ్మ” అని ముక్తసరిగా చెప్పింది. లచ్చుమమ్మ అడిగే ప్రశ్నలకు క్లుప్తంగా సమాధానం చెప్పింది. ఇంతలో శ్రావ్య, శ్రావణ్‌ కూడా నిద్రలేచారు. సరస్వతితో మాట్లాడి లచ్చుమమ్మ వెళ్ళిపోయింది. ఈసారి కర్నూలు వచ్చినపుడు గీసిన బొమ్మల్ని చూపీమని మరీ మరీ చెప్పివెళ్ళింది లచ్చుమమ్మ. శ్రావ్య, శ్రావణ్‌లకు రమణి చిన్నప్పుడు ఎంత బాగా చిత్రపటాలను గీసేదో వివరించి చెప్పింది సరస్వతి. సరస్వతి లోపలకు వెళ్ళి, ముందే పెట్టిఉంచిన టీ ని వేడిచేసుకుని, తీసుకు వస్తూ దాంతో పాటూ ఒక పాత సూట్‌కేసును కూడా వాళ్ళముందు తెచ్చిపెట్టింది. ఆ సూటుకేసును చూడగానే గుర్తుపట్టింది రమణి. పెళ్ళయినాక అత్తవారింటికి వెళ్ళేప్పుడు తనతో పాటు ఆ సూట్‌కేసును కూడా పంపాలనుకుంది అమ్మ. ”ఈ పాత పడిన సూట్‌కేసును అత్తవారింటికి తెచ్చుకోలేక పోయింది రమణి. ఆ సూట్‌కేసులో ఏముందో తెలుసుకోవాలని శ్రావణ్‌, శ్రావ్య, రమణి ముగ్గురూ కుతూహల పడుతున్నారు. సూట్‌కేసులో నుంచి అట్టలమీద, కాగితల మీద గీసి ఉన్న రేఖా చిత్రాలను బయటకు తీసింది సరస్వతి.
వాటిని పిల్లల చేతికి, రమణి చేతికి ఇస్తూ….
”శావ్య…. ఇవిగో ఇవన్నీ చిన్నప్పుడు మీ అమ్మ గీసిన చిత్రాలే” అని చెప్పింది సరస్వతి.
ఎన్నో అద్భుతమైన చిత్రాలు, పల్లెటూరులోని ఇళ్ళు, పొలం పనులు చేసేవాళ్ళు, పొలం నుండి గడ్డిమోపు నెత్తిన పెట్టుకుని వచ్చే మహిళలు. నీళ్ళు, కడిలమోపు మోస్తున్న మహిళలు, ఉదయించే సూర్యుడు ఇలా ఎన్నెన్నో…. ఆ చిత్రాలను చూస్తూ ఆశ్చర్యపోతూ, ఆనందపడుతూ శ్రావణ్‌, శ్రావ్య సరస్వతిని ఎన్నో ప్రశ్నలు వేశారు. ”పెద్దమ్మా!…. నిజంగా మా అమ్మే… ఈ డ్రాయింగ్‌ వేసిందా.” ”అవున్రా…. మీ అమ్మ పెళ్ళికాక ముందు అద్భుతమైన చిత్రాలు గీస్తుండేది. ఇవన్నీ చూసి ఇక్కడ తెలిసిన వాళ్ళు మీ అమ్మను ఒకసారి చూస్తామంటేనే పిలిపించాను. ఇవిగో ఇటు చూడండి. హాల్లో గోడ మీద ఫ్రేములు కట్టి, తగిలించి ఉన్న డ్రాయింగ్‌ బొమ్మలు కొన్నవి కావు. మీ అమ్మగీసినవే. మీ నాన్నకు ఇవన్నీ చెప్తే పని లేని పని దండగ అంటాడు. అందుకే వివరం చెప్పకుండా పంపమన్నది.”
”పెద్దమ్మా! నువ్వు చెప్పింది నిజమే… ఈ గోడమీద తగిలించి ఉన్న బొమ్మలో కింద అమ్మపేరు రాసి ఉంది. ఎంత బాగున్నాయి…” గోడ మీద ఉన్న బొమ్మల్ని చూస్తూ శ్రావ్య అత్యంత ఆశ్చర్యంతో అన్నది. శ్రావణ్‌ కూడా ఆశ్చర్యంగా వాటినే చూస్తున్నాడు.
”శ్రావ్యా…. మీ అమ్మమ్మకు మీ అమ్మను గొప్ప చిత్రకారిణిగా చూడాలని ఆశ. ఆమె బ్రతికి ఉన్నంతకాలం నీతో ఎప్పుడు ఈ విషయమే చెప్తుండేది.” ”అవునా… పెద్దమ్మ!” రమణి వంక చూస్తూ ఆనందంగా సరస్వతిని అడిగింది శ్రావ్య.
రమణి తన్మయత్వంతో వాటిని చూస్తూ ఉబితబ్బిబ్బయ్యింది. వచ్చినప్పటి నుండి ఒక్కసారి కూడా తను గీసిన రేఖాచిత్రాలు గోడమీద కనపడుతున్న పట్టించుకోలేక పోయినందుకు మనస్సులోనే బాధపడింది రమణి.
రాత్రి అయ్యింది. అందరూ భోజనాలు చేసి పడుకున్నారు. కర్నూలు వచ్చినప్పటి నుండి సరస్వతిని గమనిస్తూనే ఉన్నది రమణి. 55 సం||రాలు పైబడిన సరస్వతి ఎంత చలాకీగా ఉన్నది. రోజు మొత్తం ఏదో ఒకపనిలో నిమగ్నమై ఉంటోంది. ఎవరెవరో ఆడవాళ్ళు వస్తున్నారు. వాళ్ళకు సలహాలుఇస్తోంది. అనేకరకాలుగా సహాయపడుతుంది. హాల్లో ఉన్న షల్ఫుల నిండా పుస్తకాలే. 5వ తరగతి వరకే చదివిన సరస్వతక్క ఇన్ని పుస్తకాలు చదువుతుందా? తన ఇంట్లో హాల్లో మొత్తం ఆర్టిఫిషియల్‌ బొమ్మలతో నిండిపోయి ఉంటుందే? ఎప్పుడో తను గీసిన బొమ్మల్ని అక్క ఇంత జాగ్రత్తగా భద్రపరిచిందా? అంటే తనలో ఉన్న కళాత్మక శక్తి మీద అక్కకు ఇంత నమ్మకం ఉన్నదన్నమాట. భోజనాలు చేసేటప్పుడు సరస్వతి అన్నమాటలు పదేపదే గుర్తుకు వచ్చాయి రమణికి. ”రమణీ! నీకు తెలుసు నాకు ఈ పాత ఇల్లు. మీ బావ చనిపోయినప్పటి నుండీ వచ్చే పెన్షను తప్ప మరో ఆధారం లేదని. మనదేశంలో ఎంతమంది పేద మహిళలు, ఎన్నో ఇబ్బందులు పడుతూ జీవితాన్ని గడుపుతున్నారు. వాళ్ళకు ఎక్కువగా సహాయపడాలన్న తృష్ణనాలో ఉన్నా… నా ఆర్థిక పరిస్థితి సహకరించటం లేదు. మన కుటుంబంలో చిన్నతనం నుండీ సృజనాత్మకంగా ఆలోచించే దానివి నువ్వొక్క దానివే. అందుకే నీకు ఇవ్వన్నీ చెప్తున్నాను.” నీకున్న వెసులుబాటు నీ ఆర్థిక పరిస్థితే. నీ జీవితాన్ని ఎందుకూ పనికిరాకుండా చేసుకోకు. పేదలు, దయనీయులు, నిర్భాగ్యులైన వారికి చేతనయినంత సహాయం చేయి. వాళ్ళ యదార్థ జీవితాలను నీ అద్భుతమైన చిత్రకళలో రంగరించి చూపించు….”
రాత్రంతా రమణి ఆలోచిస్తూనే ఉన్నది. ”తనలో ఉన్న కళాత్మకతను, సృజనాత్మకతను అతి దారుణంగా చంపుకుని ఎందుకూ పనికిరాని విషయం కోసం ఎంతగా తాపత్రయ పడుతుంది. 15 సం||రాల ఈ వైవాహిక జీవితంలో తనలో ఉన్న సృజనాత్మకతను తాను ఎంతగానో కోల్పోయింది. తను అందమైన బొమ్మగా మారాలనుకున్నదే కానీ…. అద్భుతమైన సజీవ చిత్రాలకు ప్రాణం పొయ్యాలనుకోలేదు… తను కోల్పోయిన జీవితాన్ని ఇక నుంచైనా పొందాలని ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంది రమణి.
జ       జ       జ
తెలతెలవారుతోంది. శ్రావ్య కళ్ళు తెరిచిచూస్తే పక్కన రమణి కనిపించలేదు. ఎక్కడకు వెళ్ళి ఉంటుంది? ప్రక్కన పడుకున్న సరస్వతిని నిద్రలేపింది శ్రావ్య. ఇద్దరూ అన్ని గదుల్లో చూశారు. ఇంటి ముందు కూడా చూశారు. పెరటి తలుపు తీశారు. సూర్యుని ఉషఃకిరణాలు అప్పుడే వెచ్చగా భూమిని తాకుతున్నాయి. చల్లని హాయి గొలిపే వేపచెట్టు గాలి వీస్తోంది. పెరట్లో కుర్చీలో రమణి కూర్చొని ఉన్నది. ఒక చేతిలో పేపరు మరొకచేతిలో పెన్సిలు. ఉదయిస్తున్న సూర్యుణ్ణి పేపరు మీద సజీవంగా చిత్రించటానికి ప్రయత్నిస్తోంది రమణి. శ్రావ్య, సరస్వతి నెమ్మదిగా రమణి దగ్గరకు వెళ్ళారు. నిన్నటిదాకా వేరే వాళ్ళకు నచ్చిన విధంగా వండాలని, ఉండాలని అనుకునే అమ్మ…ఇ ప్పుడు తనకు నచ్చినట్టుగా ఉండాలనుకుంటోంది. రమణిని అలా చూసి చాలా సంతోషపడింది శ్రావ్య. పరమానందంగా రమణికి దగ్గరగా వెళ్ళి ఆప్యాయంగా రమణి బుజం మీద చెయ్యి వేసింది శ్రావ్య. శ్రావ్య కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయింది రమణి. శ్రావ్య కళ్ళు ”అమ్మా! అమ్మమ్మ ఆశల్ని నెరవేరుస్తావు కదూ!” అని ప్రశ్నిస్తున్నట్టుగా అనిపించాయి రమణికి.

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో