తెంచుకున్న బంధం

మ. రుక్మిణీ గోపాల్‌
ముష్టి  సుబ్బారాయుడు గారంటే ఆ ఊరిలో తెలియని వారు లేరు. అంటే ఆయన ఎంతో ప్రసిద్ధమైన వ్యక్తి అని పొరపాటు పడకండి. ఆయన పేరులోనే తెలుస్తోంది ఆయన వృత్తి. ప్రతి ఉదయం పెందరాళే లేచి స్నానం చేసి, నుదుట నిండుగా విభూతి రేఖలు పెట్టుకుని, శుభ్రంగా తోమిన పెద్ద రాగిచెంబు చేత్తో పట్టుకుని ఇంటింటికి వెళ్ళి ‘సీతారామాభ్యన్నమః’ అంటూ ఆరోజు తిథి వార నక్షత్రాలు, దుర్ము హూర్తం మొదలగునవి చెప్పి ఆ ఇంటి వారు తెచ్చిన బియ్యాన్ని చెంబులో పోయించుకుంటారు. అదే ఆయన సంపాదన. ఆ పొద్దుట ఎన్ని బియ్యం దొరికితే అన్నిటితోనే ఆరోజంతా సరి పెట్టుకోవాలి. ఏపెళ్లో, వడుగో లాంటి శుభకార్యాలు జరిగితే ‘బ్రాహ్మడు’ కదాని ఎవరైనా కొంచెం దక్షిణ ఇస్తే అది ఆయన పై సంపాదన. ఆయన, భార్య, ఇద్దరు పిల్లలు ఆ సంపాదనతోనే బతకాలి.
కొంతకాలానికి సరియైన పోషణ లేక అనారోగ్యంపాలై భార్య గతించింది. కొడుకు కొంచెం ఎదిగాడు గాని వాడికి చదువబ్బలేదు. తండ్రి సాధించగా, సాధించగా ఒక దర్జీ దగ్గర కుట్టుపని నేర్చుకోటం ప్రారంభించాడు. కొంత కాలమై ఆ పనిలో కొంత నిపుణత కలిగిన తరవాత ఆ దర్జీ ఇచ్చే తృణమో, ఫణమో తెచ్చేవాడు. భార్య పోయిన కొద్దికాలానికే ఈ సంసార భారాన్ని మోయలేనన్నట్లుగా సుబ్బారాయుడుగారు కూడా పోయారు. కష్టాలు ఒంటరిగా రావన్నట్లు ఆ కుటుంబం ఉండే ఆ ఒక్క గది వసతి కూడా లేని పరిస్థితి ఏర్పడింది. ఆ ఇంటివారు ఆ ఇల్లును అమ్మేసు కుంటున్నారు. అంచేత గది ఖాళీ చెయ్యాలి. ఆ ఇంటివారు సుబ్బారాయుడు గారి పేదతనంమీద జాలిపడి ఉండేం దుకు అద్దె లేకుండా ఆ గది ఇచ్చారు. సుబ్బారాయుడుగారి కొడుకు, రామానుజం సంపాదన అతని తిండికి కూడా సరిపోదు. ఇప్పుడు ఇంకొక గది అద్దెకు తీసుకుని ఉండే తాహతు అతనికి లేదు. అందరూ గదులు ఉత్తినే ఇవ్వరు కదా! తనొక్కడే కాదు, చెల్లెలు లలిత కూడా ఉంది. తనొక్కడు అయితే ఆ దర్జీకొట్టు అరుగుమీదే పడుకుంటాడు. కాని ఆడపిల్లను అలా పడుకోబెట్టలేడు కదా?
లలితకు పదేళ్లు నిండాయి. పరిస్థితుల ప్రభావం వల్ల ఆ పిల్ల మనసు కొంచెం పరిణతి చెంది ఆలోచించుకునే శక్తి గలదిగా అయింది. అన్న పరిస్థితి ఆమెకు తెలుసు. తామిద్దరినీ పోషించే శక్తి అతనికి లేదని తెలుసు. ఆమెకో ఆలోచన వచ్చింది. ”అన్నయ్యా, ఏలూరులో మన రమణమ్మత్తయ్య ఉంది కదా, నన్నక్కడికి తీసుకు వెళ్లు. నేను అత్తయ్య దగ్గరుంటాను. ఇక్కడ నీ తంటాలు నువ్వు పడు” అంది. రామానుజానికి ఈ ఆలోచన బాగానే ఉందనిపించింది. రమణమ్మ సుబ్బారాయుడి గారి చెల్లెలు. కాని ‘రమణమ్మత్తయ్యకు, తమకు మధ్య ఎక్కువ రాకపోకలు లేవు, అసలు లేవనే చెప్పవచ్చు. తన తండ్రి ముష్టి సంపాదనలో సాంప్రదాయ ప్రకారం ఇంటి ఆడపడుచును తీసుకు రావటం, ఓ చీరపెట్టి పంపించటం లాంటిది ఎన్నడూ జరగలేదు. బంధువుల ఇళ్లలో జరిగే ఏ శుభకార్యాలలోనో కలుసుకునేవారు. ఇప్పుడు వెడితే మేనకోడల్ని ఆదరించి దగ్గర ఉంచుకుంటుందా? అయినా ఇంకోదారి లేదు. ప్రయత్నించి చూడాలి.’
దర్జీని బతిమాలి కొంత డబ్బు ముందుగా తీసుకుని చెల్లెలితో ఏలూరు వెళ్లాడు. రమణమ్మత్తయ్య పెద్దకొడుకు వడుగుకు తామందరు వెళ్లిఉన్న కారణంచేత ఇల్లును సులభంగానే కనుక్కోగలిగాడు. తమ తండ్రి పోయాడని కబురు పెట్టినా కూడా రమణమ్మత్తయ్య రాలేదన్న సంగతి గుర్తుంది. కాని  అవసరం తమది కనక వాళ్లింటికి రాక తప్పలేదు.
వాళ్లను చూసి రవణమ్మత్తయ్య మొహంలో అన్నయ్య పిల్లల్ని చూసిన సంతోషం ఎక్కడా కనపడలేదు. చాలా ముభావంగా ఉంది. భోజనం పెట్టే సమయంలో కూడా ఎక్కడా ఆప్యాయత కనపడలేదు. భోజనాలు అయింతర్వాత రామానుజం తను వచ్చిన పనిని బైట పెట్టాడు. తన పరిస్థితిని వివరించి చెల్లెల్ని ఆమె దగ్గరుంచుకోమని ప్రాధేయపడ్డాడు. రవణమ్మ మనసు ఏ మాత్రం కరగలేదు. ”చూడు రామానుజం, మా పరిస్థితి ఏమంత గొప్పదికాదు. మధ్యతరగతి కుటుంబం మీ మామయ్యగారి ఒక్క సంపాదనతో నలుగురి పిల్లల్ని పోషించుకోవాలి. ఎలాగో నెట్టుకొస్తున్నాం. ఇంకా అదనపు భారాన్ని మోయగల స్థితిలో లేము. ఎలాగో మీ తంటాలు మీరు పడండి” అని నిక్కచ్చిగా చెప్పేసింది. హతాశుడైన రామానుజం చెల్లెల్ని తీసుకుని తిరిగి వచ్చేశాడు.
మళ్లీ పరిస్థితి మొదటికి వచ్చింది. ఏంచెయ్యటానికి రామానుజానికి పాలుపోలేదు. మళ్లీ లలితే ఆలోచించింది. తమ ఇంటికి రెండు మూడిళ్ల అవతల రాధగారని ఉన్నారు. ఆమె చాలా మంచిది. వాళ్ల పెద్దమ్మాయి, దుర్గ ఇంచుమించు తన యీడుదే. తను ఆ పిల్లతో ఆడుకునేందుకు వెడుతూ ఉంటుంది. ఆమె తననెప్పుడూ ఎంతో ఆప్యాయంగా పలకరిస్తుంది. దుర్గకు తినటానికి ఏది పెట్టినా అది తనకు పెడుతుంది. ఇప్పుడు తన గోడు చెప్పుకుంటే ఇంట్లో ఉండనిస్తారేమో!’ అన్న ఆశ ఆ పిల్లలో అంకురించింది. అన్నయ్యతో చెప్పింది. ”అన్నయ్యా, నేను వెళ్లి ఆమెను బతిమాలుకుంటాను. ఆమె చాలా మంచావిడ. నా అదృష్టమెలా ఉందో చూద్దాం” లలిత తనొక్కతే బయలుదేరి రాధగారింటికి వెళ్లింది. కన్నీళ్లతో తన పరిస్థితిని, అన్నగారి అశక్తతను, ఆఖరికి ఉండటానికి గది కూడా లేని స్థితిని’ అన్నీ చెప్పింది. రాధది చాలా జాలిగుండె. లలిత పరిస్థితికి ఆమె గుండె కరిగిపోయింది. ”మాయింటి కొచ్చేయమ్మా, మా పిల్లలతో పాటు ఇంత తిని వుందువు గాని” అంది. లలిత చాలా సంతోషించింది. వెంటనే ఆమె పాదాలు పట్టుకుని నమస్కరించింది. ‘ఇంత సులువుగా తన సమస్య తీరిపోవటం’ ఆమెకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ‘రాధగారు మంచి మనిషని తెలుసు, కాని ఇంత మంచి మనిషి అనుకోలేదు’ అన్నయ్యకు చెప్పి వస్తానండీ” అంటూ ఇంటికి పరుగు తీసింది.
లలిత చెప్పినమాట విన్న రామానుజం ఆనందానికి అంతులేదు. భగవంతుడు పూర్తిగా నిర్దయుడు కాడనిపించింది. చెల్లెలికి ఉన్న ఒకటి రెండు జతల బట్టలు, ఆ పిల్ల కప్పుకునే పాత దుప్పటి ఓ సంచిలో పెట్టుకుని చెల్లెల్ని తీసుకుని రాధగారింటికి వెళ్లాడు. ముందుగా ఆమెకు కృతజ్ఞతలు చెప్పుకుని, చెల్లెల్ని అప్పగించి వెడుతుంటే అతని కళ్లు చెమర్చాయి. ”అప్పుడప్పుడు వస్తూ ఉంటాలే” అని చెప్పేసి వెళ్లిపోయాడు. అన్నయ్య వెళ్లిపోతుంటే లలితకు కూడా కొంచెం బాధనిపించింది. ”నా గదిలోకి రా లలితా” అంటూ దుర్గ చెయ్యిపట్టుకుని తీసుకు వెళ్లటంతో ఆ బాధని మర్చిపోయింది.
రాధకు ఇద్దరు ఆడపిల్లలు, ఒక మొగపిల్లవాడు. అందరికంటె చిన్నవాడు మొగపిల్లాడు. ఆడపిల్లలిద్దరు పడుకునే గదిలోనే ఓ మడతమంచంవేసి లలితకు కూడా పక్క ఏర్పాటు చేసింది రాధ. ఆ పిల్ల తెచ్చుకున్న చిరిగిపోయిన పాత దుప్పటి ఎవరో ముష్టి వాళ్లకిచ్చేసింది. ఒక బొంత, ఒక తలగడ, పక్కకు ఓ దుప్పటి, కప్పుకునేందుకు ఓ దుప్పటి ఇచ్చింది. లలిత కట్టుకునే బట్టలు బాగా జీర్ణావస్థలో ఉన్నాయి. అంచేత దుర్గవి రెండు మూడు జతలు ఇచ్చింది. తిండిలో ఏ లోపం చెయ్యకుండా తన పిల్లలకు ఏది పెడితే అదే లలితకు కూడా పెట్టేది. పెద్ద జమీందారీ కుటుంబం కాదు కాని కొంచెం పొలముంది, తినటానికి సరిపడా ధాన్యం వస్తాయి. రాధ భర్త కాస్త మంచి ఉద్యోగంలోనే ఉన్నందువల్ల ఇంట్లో దేనికీ లోటులేదు. వీటన్నిటికంటే చెప్పుకోవలసిన విషయం వారి మనసులు అలాంటివి. రాధ భర్త కూడా రాధకి తగినవాడే.
కొత్తలో లలిత కొంచెం బెరుకుగా ఉండేది. రాధ కూడా తిరుగుతూ ఆమె చేసే పనులలో సాయం చెయ్యాలని ప్రయత్నించేది. కాని ”ఒక్కతెను చేసుకోటం నాకలవాటే, నువ్వెళ్లి దుర్గతోపాటు కూచో” అనేది. సాయంత్రం వేళ దుర్గ బైట ఇరుగు పొరుగు పిల్లలతో ఆడుకుంటూ తనను రమ్మని పిలిచినా వెళ్లేందుకు మొదట్లో కొంచెం జంకేది, ఇంట్లో వాళ్లు ఏమైనా అనుకుంటారేమోనని. వంటింట్లోకి వెళ్లి ”అమ్మగారూ, నాకేమన్నా పని చెప్పండి” అనేది. రాధ నవ్వుతూ ”పిచ్చి పిల్లా, నాకు దుర్గ ఎంతో నీవూ అంతే, వెళ్లి దుర్గతోపాటు ఆడుకో” అని పంపించేసేది.
లలిత మున్సిపల్‌ స్కూల్లో ఐదు క్లాసులదాకా చదువుకుంది. ఐదవక్లాసు పరీక్షల ముందే తండ్రి పోయాడు. అయినా చదువుయందు ఉండే ఇష్టం కొద్దీ ఆ పరీక్ష వ్రాసి పాసయింది. ‘ఇప్పుడూ తనకు చదువుకోవాలని ఉంది, కాని ఎలా కుదురుతుంది? దయతలచి తిండిపెట్టే వాళ్లను చదువుకూడా చెప్పించమని అడగటం ధర్మమా!’
వేసంగిసెలవలు పూర్తయి స్కూళ్లు తెరిచే రోజులు దగ్గర పడుతున్నాయి. దుర్గ ఆరవ తరగతిలోకి వచ్చింది. రాధ ఆలోచనలో పడింది. ‘లలితకు కేవలం తిండిపెట్టినంత మాత్రంచేత సరిపోతుందా? పిల్ల ఎదుగుతుంది. దాని భవిష్యత్‌ ఏమిటి? దాని కాళ్లమీద అది నిలబడగలిగే స్థితిని తీసుకు వస్తే తరవాత దాని బతుకు అది బతుకుంది. అందుకు చదువు ముఖ్యం’ ఆ రోజులల్లో ఆడపిల్లలకు స్కూల్‌ ఫైనల్‌ అయ్యేదాకా స్కూలు ఫీజు కట్టక్కరలేదని రాష్ట్రంలో చట్టం వచ్చింది. కనీసం స్కూల్‌ ఫైనల్‌ దాకా అయినా చదువు చెప్పిస్తే దానికి ఓ దారి ఏర్పడుతుంది! ఇలా ఆలోచించి భర్త దగ్గర ఈ ప్రస్తావన తెచ్చింది. అతను భార్య అభిప్రాయంతో ఏకీభవించాడు. ఫలితంగా లలితను స్కూల్లో చేర్పించటానికి నిర్ణయమైంది. ఈ సంగతి విన్నప్పుడు లలిత తన అదృష్టానికి పొంగిపోయింది.
లలిత దుర్గతోపాటే ఆరవక్లాసులో చేరింది. స్వతహాగా చదువుయందు ఆసక్తి ఉన్నందువల్ల మొదటిరోజునుంచే శ్రద్ధగా పాఠాలు చదువుకోటం, మనకుండా ‘హోమ్‌వర్కు’ చెయ్యటం చేసేది. మూడు నెలల పరీక్షలలో లలితకు మంచి మార్కులు వచ్చాయి. రాధ చాలా సంతోషించింది. చదువుయందు అంత శ్రద్ధ లేని దుర్గకూడా లలిత ప్రోత్సాహం వల్ల ఇప్పుడు కొంచెం శ్రద్ధగా చదవటం మెదలెట్టింది.
ఆ సంవత్సరాంతం పరీక్షలలో దుర్గకంటే లలితకు ఎక్కువ మార్కులు వచ్చాయి. రాధ తన ప్రయత్నం వృథా కాలేదని సంతోషించింది. అంతే కాదు, దుర్గతో ఈసారి పరీక్షలలో లలితతో సమంగా మార్కులు తెచ్చుకోవాలని చెప్పింది.
క్రమంగా లలితకు ‘తను పరాయిది కాదు, తను కూడా ఆ కుటుంబంలో ఒక మనిషే’ అన్న భావం కలగసాగింది. అలా అని ఆ పిల్ల ఎన్నడూ తనకు వాళ్లు చేసిన ఉపకారాన్ని మర్చిపోలేదు. ఆ కృతజ్ఞతా భావం ఆ పిల్లలో ఎప్పుడూ ఉంది, ఉంటుంది కూడాను. అంతే కాదు, ఎంత చనువున్నా ఆ పిల్ల ఎన్నడూ తన హద్దులను దాటలేదు. కాని ఇంట్లో వాళ్లు మాత్రం లలిత పరాయి పిల్ల అన్న విషయాన్ని మర్చిపోయారు. ఏ పండగ వచ్చినా మిగతా పిల్లలతోపాటు లలితకు కూడా కొత్త బట్టలు కొనేవారు. పెళ్లిళ్లకు, పేరంటాలకు తమతో తీసుకువెళ్ళేవారు. అంతే కాదు వాటిల్లో దుర్గ పట్టుపరికిణీలను కట్టుకోమనేవారు. అంత అరమరిక లేకుండా పెరిగింది లలిత ఆ ఇంట్లో.
కాలం గడిచి స్కూల్‌ ఫైనల్‌ పరీక్షలు జరిగాయి. రాథకు ఫస్టుక్లాసు మార్కులకంటె ఎక్కువేవచ్చాయి. ఆ ఊరిలో చదువు అంతదాకానే వుంది. ఆ రోజులలో ఆడపిల్లలను పొరుగూరికి పంపి హాస్టల్‌లో ఉంచి చదివించేందుకు ఇష్టపడేవారు కాదు. దుర్గకు పెళ్లి సంబంధాలు చూడటం మొదలెట్టారు. లలిత పరిస్థితిని బట్టి ఆ పిల్లకు పెళ్లి చెయ్యటంకంటె ఏదైనా ఉద్యోగంలో చేరే అర్హతను కలిగించి, స్వతంత్రంగా బతకగలిగేటట్లు చేయాలని ఆ దంపతులు ఆలోచించారు. లలితను టైపు నేర్చుకుందుకు పంపించటం మెదలెట్టారు.
ఓ రోజున అకస్మాత్తుగా లలిత మేనత్త, రవణమ్మ ఊడిపడింది. ఇంట్లో వాళ్లకు తనను తాను పరిచయం చేసుకుంది. ”బాగున్నావా మేనకోడలా” అంటూ లలితను పలకరించింది. ”బాగానే ఉన్నాను” అంటూ లలిత ముక్తసరిగా జవాబిచ్చింది. గృహస్థ ధర్మప్రకారం మర్యాదచేసి కూర్చోమంది రాధ. రవణమ్మత్త పురాణం విప్పింది. ”ఏవిటో పరిస్థితులు అనుకూలించక పిల్లను దగ్గర ఉంచుకోలేక పోయానుగాని అస్తమానూ దీని యోగక్షేమాలు కనుక్కుంటూనే ఉన్నాను. మా ఊరివాళ్లు ఏదోపనిమీద అస్తమాను ఈ ఊరు వస్తూనే ఉంటారు. వాళ్ల ద్వారా పిల్ల పెద్ద ఉద్యోగస్థుల ఇంట్లో ఉంటోందని, స్కూల్లో చేరి చదువుకుంటోందని విన్నప్పుడు ఎంత సంతోషించానో! పోనీలే పిల్ల ఎక్కడో అక్కడ సుఖంగా ఉంది, అంతే చాలు అనుకున్నాను. స్కూల్‌ ఫైనల్‌ ఫస్టు క్లాసులో పాసయిందని తెలిసి ‘నా మేనకోడలు ఎంత తెలివైంది’ అని మురిసిపోయాను. ఇప్పుడు టైపు నేర్చుకుందుకు పంపించటం చాలా మంచి పనిచేశారు. ఇదయిపోతే ఎక్కడైనా ఏ చిన్న ఉద్యోగమో దొరక్కపోదు. మా పెద్దబ్బాయి బి.ఏ. పాసయాడు. లలితంటే వాడికెంత అభిమానమో! ”అమ్మా నేను మామయ్య కూతుర్ని తప్ప విడిచి ఇంకెవరినీ చేసుకోనం”టున్నాడు. నాకు మాత్రం ఇంతకంటె కావలసింది ఏముంది? ఈ సంబంధం కలిస్తే చనిపోయిన మా అన్నయ్య ఆత్మకు కూడా శాంతి కలుగుతుంది.” అంది. ఆపకుండా మాట్లాడే ఆమె వాగ్ధోరణికి అందరు ఆశ్చర్యపోయారు. ‘ఇన్నేళ్లనుంచీ లేని అభిమానం మేనకోడలిమీద ఇప్పుడెందుకు వచ్చిందో!’ రాధ నెమ్మదిగా ఆలోచించటం మొదలు పెట్టింది. ఆ రోజున అయితే తిండిపెట్టి పోషించాలని ఇంట్లో ఉంచుకుందుకు ఇష్టపడలేదు. ఇప్పుడు పిల్ల చదువుకుని నాలుగు రాళ్లు సంపాదించుకునే స్థితికి వస్తోందని తెలుసుకుంది. చేతికంది వచ్చే పిల్లను వదులుకుందుకు ఎవరు ఇష్టపడతారు? అంచేతే బంధుత్వాన్ని అడ్డుపెట్టుకుని వచ్చింది. అప్పుడు చాలా స్వార్థంగా ప్రవర్తించింది. ఆ మాట నిజమే, అయినా ఎంత చెడ్డా మేనత్త, కొడుక్కు చేసుకుంటానని వచ్చింది. ఎల్లకాలం లలిత కూడా ఒంటరిగా బతకలేదు కదా! లలితకు పెళ్లి చెయ్యాలంటే ఇంతకంటె మంచి సంబంధం తాము మాత్రం తేగలరా? అయినా తొందరపడి మాటివ్వకూడదు. లలితనోసారి అడిగి తనభిప్రాయం ఏమిటో తెలుసుకోవాలి’ అనుకుంది. ”చూడండి లలితను చేసుకుంటానని మీరు రావటం సంతోషంగానే ఉంది. కాని లలిత అభిప్రాయం ఏమిటో కూడా తెలుసుకోవాలి కదా. అది తెలుసుకుని మీకు ఏమాటా చెప్పుతాను” అంది. ”చిన్నపిల్ల, మంచిచెడ్డలు దానికేం తెలుస్తాయి? మీరు పెద్దవాళ్లు ఎలా చెప్తే అలా వింటుంది. అయినా ఇన్నాళ్లూ, పోషించి చదువు చెప్పించారు, మీ మాట కాదంటుందా?” అని రవణమ్మ ముందరికాళ్లకు బంధంవేసింది ”అయినా తనభిప్రాయం తెలుసుకోటం మంచిది కదా, కూర్చోండి, ఇప్పుడే వస్తాను” అంటూ రాధ లోపలికెళ్ళింది.
రవణమ్మ వచ్చి ”బాగున్నావా?” అని పలకరించినపుడు ”బాగానే ఉన్నాను” అని ముభావంగా చెప్పి ఏదో పనున్నట్లు లలిత లోపలికొచ్చేసింది. మళ్లీ బైటకు రాలేదు. లోపలినుండి రవణమ్మ చెప్పేదంతా వింటోనేఉంది. రాధ లోపలికి రాగానే చెప్పింది. నేను అంతా విన్నాను అమ్మగారు. కాని నాకీ సంబంధం వద్దు. టైపు పరీక్షలు పాసై ఎక్కడైనా చిన్న ఉద్యోగం చూసుకుంటాను. నన్ను ఆమెతో పంపించెయ్యకండి” అంది కళ్లనీళ్ల పర్యంతమై. రాధ లలితను దగ్గరగా తీసుకుంది. ”నీ ఇష్టం లేకుండా నిన్నక్కడికి పంపించను. కాని నువ్వు కూడా ఆలోచించుకో.
నీకెప్పటికైనా ఓ తోడు కావాలిగదా! ఎల్లకాలం ఇలాగే ఉండిపోలేవు గదా!” అంది నచ్చచెప్పే ధోరణిలో. ”మీమాట నిజమే అమ్మగారు, ఇంతకంటె మంచి సంబంధం దొరుకుతుందని నేనాశించటం లేదు. కాని స్వయంగా అన్నగారి కూతుర్ని, అనాథనై, తినేందుకు తిండి, నిలవనీడలేని పరిస్థితిలో వెడితే నిర్ధాక్షిణ్యంగా బైటకు పంపించేసింది. అలాంటిది ఇప్పుడు నేను కావలసి వచ్చానా? ఇప్పుడైనా ఎందుకు కావాలనుకుంటోంది? ఈ టైపు పరీక్షలు పాసైన తరవాత ఎంతో కొంత జీతం తెచ్చి నెలా నెలా తన ఒళ్ళో పోస్తాననే కదా? ఈ స్థితిలో ఉన్నాను కాబట్టే నన్ను కోడలిగా చేసుకునేందుకు సిద్ధపడింది. ఆమె నన్ను తిరస్కరించిన రోజును ఈ జన్మలో మర్చిపోగలనా? అప్పుడు పెద్ద మనసుతో మీరే గనక నన్ను ఆదుకోకపోతే నేనీనాడు ఏ స్థితిలో ఉండేదానినో! ఈ జన్మలో నాకు పెళ్ళికాకపోయినా ఫరవాలేదు కాని ఆమెకు కోడలిగా వెళ్లటం నాకిష్టంలేదు” లలిత చెప్పినదంతా రాధ నిదానంగా వింది. ఆ పిల్ల చెప్పినదంతా ‘రైటే’ అనిపించింది. ఆ పిల్ల స్వాభిమానాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయింది. ”లలితా నీ కిష్టం లేనిదే బలవంతంగా ఈ పెళ్లి చెయ్యము. నేను ఏదో ఒకటి చెప్పి ఆమెను పంపించేస్తాను” అని రాధ బైటకు వచ్చేసింది.
”చూడండి రవణమ్మ గారు, లలితకు ఈ పెళ్లి ఇష్టం లేదుట. ఆ పిల్లకిష్టంలేందే మేము బలవంతంగా కట్టబెట్టలేముగా!” అంది రవణమ్మతో. ”ఆ, ఎంత బరితెగించింది! దాని అంతస్తుకు మా అబ్బాయి తగడా? ఏంచూసుకుని ఈ మిడిసిపాటు? ఈ అనాథ పిల్లకు ఇంతకంటె మంచి మొగుడు దొరుకుతాడా? అదీ చూస్తాను. ఏదో తల్లీ తండ్రీ పోయి అనాథగా బతుకుతోంది కదాని జాలిపడి వచ్చాను కాని మా అబ్బాయికి ఇంతోటి పిల్ల దొరకదని కాదు. దీనికన్నీ వాళ్ల అమ్మ బుద్ధులే వచ్చినట్టున్నాయి. అసలు దాన్ని చేసుకుంటానంటూ ఇక్కడకు రావటం నాదే బుద్ధి తక్కువ” అంటూ శాపనార్థాలు పెడుతూ వెళ్లిపోయింది రవణమ్మ.

Share
This entry was posted in కధలు. Bookmark the permalink.

One Response to తెంచుకున్న బంధం

  1. srinu says:

    మీతొ మాట్లాడాలండీ.. త్వరలొనె మాట్లాడతాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో