మహిళా రైతు అన్నెమ్మ నాయురాలు

అయ్యగారి సీతారత్నం
తెలుగు సాహిత్యంలోనూ, సమాజంలోనూ కూడా రైతు అనగానే తలపాగా కట్టుకొని శ్రమపడే పురుషుడే గుర్తుకొస్తాడుగానీ గుండారు కోక కట్టుకొని శ్రమపడే స్త్రీ గుర్తుకు రావడం తక్కువనే చెప్పాలి.
నిన్న మొన్నటిదాకా రైతులకు ఋణాలుగానీ, శిక్షణగానీ అంటే పురుష రైతులకి మాత్రమే దక్కేవి. నిజానికి స్త్రీలే దుక్కిదున్నడం అయినా మిగిలిన వ్యవసాయ పనిభారంలో ఎక్కువ భాగస్వాములు అయినప్పటికీ వారికి భూమి హక్కు లేకపోవడంతో వారి శ్రమనీ గుర్తింపలేదు. రైతులగానూ వారు గుర్తింపబడలేదు. అందుకనే వ్యవసాయ కుటుంబాల కథలలో స్త్రీలు కనబడతారేగానీ మహిళా రైతులుగా స్త్రీజీవితావిష్కరణ తక్కువనే చెప్పాలి. ఈ లోటును తీరుస్తూ ‘అన్నెమ్మనాయురాలు’ పేరుతో కథల మాస్టారు కాళీపట్నం రామారావు గారు 2006లో శ్రీకాకుళ సాహితి ‘జంఝావతి కథలు’ సంకలనాల కోసం రచించారు.
ఈ కథ నెహ్రూ శకం నుండీ నేటి వరకూ వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పులు, శ్రమజీవులకు కూడా శ్రమపట్ల గౌరవం లుప్తమవడం భోగలాలసత్వం పెరగడం… శ్రమకన్నా శ్రమవలన కూడిన సంపదని పంచుకోవడం కొరకు ఏర్పడిన రాజకీయాలే ఎక్కువ ప్రాధాన్యం సంతరించుకోవడం… శ్రమకి విలువనిచ్చే అన్నెమ్మనాయురాలులాంటివారికి మనోవ్యధగా మారిన సామాజిక విలువలు మనకి స్పష్టమవుతుంది. గ్రామాలలో ఏర్పడే భూతగాదాలూ, వీటిమూలాలూ, వాటిని ఆసరాగా చేసుకొని బ్రతికే ఆనాటి కరణం, మునసబుల వైనం… విధ్వంసం… దానికిగల కారణాలు తెలుస్తాయి.
ఏ కథకైనా కథావస్తువు, వర్ణన పాత్రలు, సన్నివేశాలు, సంభాషణలు, సంఘటనలు కథారూపాన్ని ఆవిష్కరిస్తాయి.
ఈ కథకి ప్రధాన వస్తువు అన్నెమ్మనాయురాలి జీవితం. అన్నెమ్మనాయురాలు కొత్త అగ్రహారానికి పెద్ద కోడలుగా వస్తుంది. వీరి పొరుగూరు యీతపేట. వీటిమధ్య బంజరు. అటుఇటు రైతులు వరకట్టడం ప్రారంభిస్తారు. రెండూళ్ల కరణాలు ఇనాందారుల దగ్గర పట్టాలు పుట్టిస్తారు. కొన్నిమళ్ల మీద ఇద్దరికీ పట్టాలు పుడతాయి. పెద్దల దగ్గర 5-6 ఏళ్లు తగాదాలు నడుపుతూ తరువాత కోర్టుల చుట్టూ తిరుగుతారు. ఇంట్లో బంగారం అంతా ప్లీడర్ల పాలయిపోతుంది. కరణం, మునసబు తగాదాల్ని పెంచుతుంటారు. వోపికలేక కత్తులు, బల్లేలు పట్టుకొని బలాబలాలు తేల్చుకుంటారు. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసేనాటికి ఈ రెండు గ్రామాల మధ్య కొట్లాట ముగుస్తుంది. ప్రపంచాల మధ్య అయినా మారుమూలైనా పోట్లాటకి కారణం ఆక్రమణ స్వభావం, భూదాహమే కారణమని తెలుస్తుంది. ఈ కొట్లాటలో అన్నెమ్మనాయురాలి ఇంట్లో ఒక్కకొడుకు తప్ప అంతా చనిపోతారు. తోటికోడళ్లు పుట్టింటికి పోతారు. ఒక్క కొడుకు యావజ్జీవఖైదు అనుభవిస్తాడు. జైలునుండీ వచ్చేక క్షయతో చనిపోతాడు. మనవడు, కోడలుతో అన్నెమ్మనాయురాలే వ్యవసాయం చేసి ధైర్యంగా నిలబెడుతుంది. మునిమనవడి దగ్గరకి వచ్చేసరికి ఆమె మాట సాగదు. అనవసరమైన ఋణాలు తీసుకొంటూ, వ్యవసాయాన్ని పట్టించుకోకుండా మంత్రి వెంట తిరుగుతూ ఎమ్మెల్యే అయి దండతోవచ్చినా అన్నమ్మకి ఆనందం లేదు. దిగులుతోనే మరణిస్తుంది. స్థూలంగా ఇతివృత్తం ఇది. మిక్స్‌డ్‌ ఎకానమీ, ఋణాలు ఇవ్వడం, వాటిలో మోసాలు, రెవిన్యూ గ్రామోద్యోగుల లంచగొండితనం, మొదలగువన్నీ సుదీర్ఘంగా వివరించారు. అప్పులు తీసుకొని వృధాగా ఖర్చుపెట్టడం, అప్పుల ఊబిల్లో కూరుకుపోవడం వ్యాపార పంటల వలన వచ్చే నష్టాలు భ్రమకు విలువనివ్వకపోవడం… మారుతున్న విలువలు, పోరాటాల గురించీ ఆలోచన కలగజేస్తూ కథ ముగుస్తుంది.
కథలో చెప్పదలచుకొన్న విషయాలు పాత్రల సంచలనం ద్వారా కాకుండా ప్రథమపురుషలో నేరుగా తెలుస్తుంది. దీనివలన ఉపన్యాస రూపకథనం కన్పిస్తుంది. కథ కొద్దిగా వ్యాసరూపాన్ని సంతరించుకొందనే చెప్పాలి.
కథలో వర్ణనలు పరిశీలిస్తే అన్నెమ్మనాయురాలి రూపురేఖలు, ఒక మహిళా రైతుని కళ్ల ముందుంచారు.
”పండు తమలపాకు ఛాయ, శరీరఅంగాల్లో గానీ, చర్మంలో గానీ ఔన్సు కొవ్వైనా లేని కాయ శరీరం. ముఖంలో కొద్దిపాటి ముడతలు అక్కడక్కడ వెండితీగెలు తప్పితే నల్లనిజుట్టు, తెల్లని బొద్దంచుకుచ్చు గుండారు కోక కట్టు. చేతులకు బంగారు మురుగులు. మెడలో ఉసిరికాయలంతేసి పగడాలతో ఏదో బంగారునగ, కాళ్లకు వెండి కడియాలూ, అందెలు. అదీ ఆమె విగ్రహం.”
సాధారణంగా ఏ వయసులో స్త్రీనైనా ఆమె శారీరకసౌష్టవ, సౌందర్యాలతోనే గుర్తిస్తారు చాలామంది రచయితలు, కవులు. కానీ శరీర అంగాల్లో గానీ చర్మంలో గానీ ఔన్సు కొవ్వైనా లేని కాయశరీరం అని చెప్పి ఆమెలోని శ్రామికత్వాన్ని గుర్తింపచేస్తారు రచయత.
అలాగా ఆమె స్వభావవర్ణన కూడా కన్పిస్తుంది. ”అచంచలమైన ఆత్మవిశ్వాసంతో, పట్టుదలతో, కృషితో, ఏ మగవాడికీ తీసిపోని కార్యదీక్షతతో, మాటనేర్పుతో, సూటి వ్యవహారంతో తను చెమటోడ్చి కోడలికి, మనవడికి శ్రమపట్ల గౌరవం పెంచింది. తన సంసారాన్ని మూడుపువ్వులు ఆరుకాయలుగా లేవనెత్తింది. ఎంతటి పెద్ద రచయితయినా పితృస్వామ్యవ్యవస్థ ప్రభావం పోదే! అందుకే ‘ఏ మగవాడికీ తీసిపోని కార్యదీక్ష…” అని ఉపమించారు. స్త్రీలకన్నా మనవాళ్లలో కార్యదీక్ష ఎక్కువ అనే అర్థం స్ఫురించేటట్లుగానే రాసారు. నిజానికి వ్యవసాయదీక్షగా సాగించేది స్త్రీలే. అన్నెమ్మ సౌశీల్యం, ఒక్క చూపుతో దుష్టులను దూరంగా వుంచడం, మరో చల్లని చూపుతో మంచివారిని ఆత్మీయులను చేసుకోవడం ఆమె ప్రత్యేకతలు.
సంభాషణలు పరిశీలిస్తే ఈ కథ మొత్తానికి రెండేరెండుసార్లు అన్నెమ్మనాయురాలు మాట్లాడుతుంది. ఒకసారి అనవసర అప్పులు తీసుకొని భోగత్వాన్ని పెంచుకుంటున్నారనే వ్యధతో మీరెవరూ బాగుపడరు. షావుకార్లు అప్పులిచ్చి రైతుల్ని నాశనం చేసారనుకొంటే ఇప్పుడు ఉద్యోగస్తులు బలవంతాన అప్పులఊబిలోకి దింపుతున్నారు. …రైతులకి ఇనాశకాలమే… అని యంది.
చివరిలో కథకుడు తండ్రితో 80 ఏళ్ల అన్నెమ్మనాయురాలు మునిమనవడి గురించి అతని తిరుగుళ్ల గురించి ఆవేదన తెలియజేస్తుంది. ఆడికి పద్దెనిమిదేళ్లు నిండి ఆరుమాసాలైనా కాలేదు. ఆడిచేతికి ఆస్తి అప్పగిస్తే ఆ ఆస్తి ఏమౌతుందన్న సంగతి సరే… ఆడేమవుతాడు. ఎప్పుడు చూసినా ఇంటిపట్టున ఉండడు. పెళ్లిచేద్దామంటే ఒప్పుకోడు. తెల్లారిలేస్తే బస్సు ప్రయాణాలు, లాడ్జీలంట, హోటేళ్లంట. ఓ మందనెంటేసుకొని రాత్రుళ్లు కూడా అక్కడే మకాం. ఏమైనా అంటే అదిగ ఆ ఎమ్మెల్యే రమ్మనాడు. ఆ ముదనష్టపు మంత్రి మా కులపోడా. కూతుర్నిచ్చి యీరినీ తనవెంట రాజకీయాల్లో తిప్పుకుందామని ఎత్తు… అని ఆవేదన చెందుతుంది.
కథలో సన్నివేశాలు, సంఘటనల గురించి చూస్తే సంఘటనలు రెండు, సన్నివేశాలు రెండు మూడు. కొత్త అగ్రహారానికి యీతపేటకి కొట్లాట ముఖ్య సంఘటన. అలాగే మునిమనవడికి ఋణాలు అక్కరలేకున్నా తీసుకోవడం… శ్రమకి విలువనివ్వకుండా రాజకీయాల్లోకి వెళ్లడం మరో సంఘటన. ఈ సంఘటనలే మిగిలిన సన్నివేశాలకి మూలం. ఈ కథలో భాషని పరిశీలిస్తే తేలికైన భాష, సంపూర్ణత లేని వాక్యాలు, చక్కని ఉత్తరాంధ్ర మాండలికాలైన వొసిలి, పర్రాకులలాంటివి, సహజమైన యాస కన్పిస్తుంది. కొన్ని మంచి విషయాలు చెప్పాలనే రచయిత ఆదుర్దా స్పష్టమవుతుంది. ”సుఖం వేరు, భోగం వేరు, శ్రమ విలువ తెలిసినవారు సుఖానికి విముఖులు కారు. భోగాలంటే వైముఖ్యం ఇహపరాలు రెండింటినీ చెరిచే విధమని వారికి నమ్మకం” అని ఇలా మంచిమాటలు చెప్పే ప్రయత్నం కన్పిస్తుంది. వృధాఖర్చులు తగ్గించాలనే బోధన కన్పిస్తుంది.
మొత్తం మీద ఈ కథలో ఈ క్రింది అంశాలని మనం గుర్తించగలం.
1.    సామాజికంగా గుర్తించని మహిళారైతు స్వరూపస్వభావాలు.
2.    నెహ్రూశకం నుండీ మొదలైన మిక్స్‌డ్‌ ఎకానమీ గ్రామాల మీద  చూపిన ప్రభావం.
3.    వ్యుత్పత్తిని పెంచే వ్యవసాయరంగం కన్నా రాజకీయ రంగం ప్రాధాన్యత సంతరించుకోవడం.
4.    శ్రమ పట్ల గౌరవం లుప్తమవుతున్న వైనం.
5.    రైతుల జీవితంలో వచ్చిన మార్పులు.

Share
This entry was posted in పుస్తక సమీక్షలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.