సూఫీ భిక్షుకి ఆమె!

హేమ
కడివెడు కన్నీళ్ళను దాచుకుంటూ శిథిలమైన జీవిత అఖండ శకలాలను ఏరికూర్చి జీవన బీభత్స చిత్రాన్కి వన్నెలను అద్దుకోవాలని కుటుంబం నుండి సమాజ సంక్షోభ అంచులకు చేరుతుంది సూఫీ భిక్షుకిలా ఆమె. ఆమె ఎవరో కాదు సంఘటిత, అసంఘటిత అసలు కారణాన్కి చెందక ప్రభుత్వ దమననీతికో, విదేశీవిదేశాల విధ్వంసానికో లేక దాతృతృప్తి లోగిలిలో పురుడు పోసుకున్న ‘స్వచ్ఛంద సంస్థల’ కార్మికబిడ్డ.
వేకువనే లేచి వంటిల్లు అనే యుద్ధక్షేత్రంలో గెలుపు ఓటమిలకు సంబంధం లేనట్లుగా పోరాడే ప్రతిదీ అమర్చి పరుగులాంటి నడకతో సంస్థకు చేరుతుంది. అక్కడ మహిళా సాధికారత, పేదరిక నిర్మూలనా పథకాల కాడినెత్తుకొని నడుస్తున్న ఆమెకు పక్కింట్లో వదిలేసిన పాపాయి రోదనలు, రాత్రి మీటింగుల తర్వాత యింటికెళ్తే భర్తపెట్టే శారీరక మానసిక చిత్రహింస పరంపరలను, మనసు చేసే పోరాటాన్ని ఫైళ్ళ రూటున దాచేసి అలంకరించిన గానుగెద్దులా నడిచిపోతుంది. ఆమె కనపడనిది ఎక్కడ? 60, 70 దశకాలలో మొదలైన సంక్షేమ సంస్థలలో, 80వ దశకంలో అభివృద్ధి పథకాల హోరులో, తొంభైలలోని దళిత, స్త్రీవాద సంఘాలలో ఆపై ప్రపంచీకరణ నేపథ్యంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న హక్కుల సంఘాలలో, పన్ను ఎగవేతలో భాగంగా కార్పోరేటు సంస్థలు సృష్టిస్తున్న ట్రస్ట్‌లలో ఆమె మనకు తారసపడుతుంది.
ఏది ఏమైతేనేమి! ఆమె ఒక ఒంటరి అడ్డా మాలి  ! ఆమె ఏ సంఘటిత, అసంఘటిత రంగాన్కి చెందినది కాదు. ఏ యూనియన్లు, సైద్ధాంతిక మేధావులు ఆమె అశ్రువులను తుడచి ‘మేమున్నామ’ని ముందుకు రాలేదు. శతాబ్ది లక్ష్యాలు విజన్‌ 2020, దేశం వెలుగు పోతుందని చెప్పిన జాతీయ విధానాలు ఆమెను పరిగణలోకి తీసుకోలేదు. చట్టాలను అవపోసన చేసి అన్యాయాన్ని ఎదురించమని ప్రజల్ని సంఘటితపరిచే ఆమె ఏ చట్టం పరిధిలోకి రాదు. ఏవీ కొన్ని అతికొన్ని సంస్థలలో తప్ప పి.ఎఫ్‌. వైద్య సదుపాయాలకై ఇ.ఎస్‌.ఐ. లాంటి అసంఘటిత కార్మికుల చెందే విధానాలు లేవు. జీతాల్లో తారతమ్యాలు, కోతలు, అవమానాలు, లైంగిక వేధింపులు సర్వసామాన్యమే! ఉద్యోగభద్రత వారి ఊహకందనిదే. పోరాటాలు తప్పితే పే కమీషన్లు, పెన్షన్లు వారి లోగిల్లో విశ్రాంతి తీసుకోవు. కనీసం ఏ కంపెనీలో పనిచేసినా నాలుగు డబ్బులు వెనుక వేసుకునే ఇతర అసంఘటిత స్త్రీల జీవనభద్రత కంటె వీరి భద్రత ప్రశ్నార్థకమే! ఏ క్షణాన యాజమాన్యపు క్రీనీడపడివున్న కాస్తంత ఆసరా పోతుందనే విషాదం మాటున ప్రజాస్వామ్య సాక్షిగా బతుకీడుస్తుంది. పనిచేసేచోట లైంగిక వేధింపుల నిరోధక చట్టం ముసాయిదాలో కూడా ‘ఆమె’ మనకు కన్పించదు. స్త్రీల పట్ల ఎన్నెన్నో గణాంకాలు, సాధికారత అభివృద్ధి కొలతలు! కాని ఆమె ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే చేతికందొచ్చిన పచ్చటి పంటపొలం మీద కట్టివేయబడ్డ దిష్టిబొమ్మలా బతుకు దృశ్యం వెక్కిరిస్తూనే వుంటుంది!
పొట్టచేత పట్టుకొని 8 గం||లకు పైగా, వివిధ సమయాల్లో పనిచేసే ఆమెను స్వచ్ఛంద కార్యకర్తగా పిలుస్తారే తప్ప ఒక కార్మికురాలిగా గుర్తించరు. ఇందులో ఎన్నో రకాలు! ప్రొఫెషనల్‌, నాన్‌ప్రొఫెషనల్‌, వాలంటరీ సోషల్‌ వర్కర్లు యిలా ఏవేవో పేర్లు. పనివిధానం వేరు కావచ్చు కాని బాధ్యతలు ఒక్కటే. ప్రొఫెషనల్‌ సోషల్‌ వర్కర్లకు ఒకటి రెండు సంఘాలు వున్నా అందులో ఎంతమంది వున్నారు? వాటి లక్ష్యాలు, జరుగుతున్న న్యాయం ఏమిటి అన్నది ఆ కోర్సు చదివిన చాలామందికే తెలియదు. యికపోతే నిరంతరం ప్రజల్ని సంఘటితపరిచే ప్రక్రియలో తలమునకలై అటు పితృస్వామ్య భావజాలాన్కి, ప్రపంచీకరణలో అత్యంత ఛీప్‌ లేబర్‌గా మారి సమిధలవుతున్న ఈ కార్మికురాలికి ఎలాంటి సంఘాలు లేవు. వ్యూహాలు, విధానాలు రచించి సమాజమార్పుని కోరి పిడికిలెత్తిన ఆమెకు తమ హక్కులపట్ల నడుంబిగించే అవకాశాలను ‘సేవాతత్పరత’ అనే పేరుతో మసిపూసి కావాలనే మొదట్నుంచి రంగం మూసివేసింది. దోపిడి భావజాలం గురించి మాట్లాడే తాము కూడా దోచుకోబడుతున్నామని తెలిసినా మౌనం ఎందుకు మౌనం వహిస్తున్నారు? తమ హక్కుల్ని తాము పొందలేని ఈ కార్మికులు ఏ సమాజ విముక్తిని కోరుతున్నారు? ఈ ‘సేవ’ ‘దాతృత్వం’ ‘స్వచ్ఛందం’ వెనుక దాగిన కుట్రలేమిటి?
భూమి, వనర్లు స్వంత ఆస్తిగా కాకుండా సమాజపరమై స్వేచ్ఛగా మనిషి వాడుకున్నంత వరకు ఈ ‘స్వచ్ఛంద లేదా దాతృత్వపు’ భావనలు ఏమి సంఘంలో లేవు. ఎప్పుడైతే మనిషికి స్వంత ఆస్తి, స్వలాభం మొదలయ్యాయో అప్పుడే సమాజం వర్గాలుగా విడిపోయి దోపిడి అణిచివేత మొదలయ్యింది. ఆ మూలాల నుంచి పుట్టుకొచ్చిన భావనలు ‘దాతృత్వం, సేవ’, తమ నిరంతర దోపిడి నిరాటంకంగా కొనసాగించడానికే ఆయా వ్యవస్థలు కనుగొన్న నయా సైద్ధాంతిక రూపకల్పనకి మారుపేర్లు. ఈ భావనలు ‘గ్లోరిఫై’ చేయబడి సమాజంలో ఆమోదింపచేసుకున్నాయి దోపిడి వర్గాలు. ఈ భావనలు అనేక రూపాలు ఎత్తుతున్నాయి కూడా! రూపమేదైనా సారం ఒక్కటే! పెట్టుబడిదారీ విధానం మార్కెట్టు కోసం పూర్ణరూపాలైన ప్యూడల్‌ భావజాలాన్ని మరింతగా ఉధృతం చేస్తుంది. యిక దాతృత్వపు మూస నుండి హక్కుల ముసుగులో ప్రపంచీకరణ పెట్టుబడి పేరుతో మార్కెటు కోసం పలు అవతారాలు ఎత్తుతుంది. ఈ మాయా పంజరంలో చిక్కుకుని విలవిలలాడుతున్న పక్షి వైనం ఈ స్వచ్ఛంద కార్యకర్త/కార్మికురాలిది.
మరోవైపు వ్యవసాయం, వృత్తులు కాపాడుకోవడం మొదలైన ప్రజా పోరాటాలు జల్‌, జంగిల్‌, జమీన్‌ వాటిలో దాగివున్న వనర్లు కాపాడుకోవడంకోసం చేస్తున్న పోరాటంగా మారుతున్నాయి. ఈ రోజు మార్కెటు భావజాలాన్కి అశేష ప్రజానీకాన్కి ఘర్షణ మొదలైంది. అందుకే ప్రజలు మార్కెట్టు శక్తులపై దాడి జరిపినప్పుడల్లా స్వచ్ఛంద కార్యకర్తలు గూడా ఈ దాడులకు బలవుతున్నారు. నిన్న, మొన్న జరిగిన అస్మిత, స్పందనల కార్యకర్తలపై దాడి కూడా ఇలాంటిదే. సోంపేట, కాకరాపల్లి సెజ్‌లలో అభివృద్ధి పథకాల పేరున గ్రామాలకు వస్తున్న కార్యకర్తలను కూడా తరిమికొడితే కంటినీరు నింపుకొన్నారు, ప్రభుత్వ దమననీతిలో పావులయ్యారు.
అందుకే ‘ఆమె’ బతుకు ‘ఈగ కథ’లా కాకూడదు. ప్రకృతి, వనర్లు, జీవనోపాధులను, కుటుంబాలను, వ్యక్తిత్వాలను, మానవ సంబంధాలను ధ్వంసం చేసే దాతృత్వపు మూలాలను ప్రశ్నించగలగాలి. ఈ వ్యవస్థచే ఉపయోగించబడి విసిరివేయబడుతూ ప్రాథమిక హక్కుల్ని కూడా కాలరాస్తున్న వ్యవస్థ మీదకి, ఆర్థిక, సామాజిక రంగాల ఆధిపత్య శక్తుల మీదకు ఆమె ఆగ్రహం మళ్ళించగలిగితే ఆమె అడవిబిడ్డే కాగలదు. భ్రష్టుపట్టిన, అవినీతికి మూలమైన, అధికార లాలసతో కూడిన స్వార్థపూరిత దాతృత్వపు నీడల నుంచి దాటితే అప్పటి వరకు వల్లెవేసిన ఐక్యతా, భాగస్వామ్యం, వ్యక్తిగత నిబద్దత నిజమైన ఆయుధాలు కాగలవు. సామాజిక స్పందన, సహానుభూతి కలిసిన నూతన మానవావిష్కరణ దిశగా పయనిస్తున్నవారితో చేయి కలిపితే ప్రజా ఉద్యమాలు మరింత అరుణిమ దాలుస్తాయి. అప్పుడే కదా దోపిడీ, పెత్తనం లేని స్వీయ విముక్తి గీతాన్ని కూడా విశ్వాసాల సారంగిపై సూఫీ భిక్షుకిలా ఆమె పాడగలదు!!

Share
This entry was posted in ఆమె @ సమానత్వం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో