ఇంట్లో ప్రేమ్‌చంద్‌ -31

అనువాదం : ఆర్‌. శాంతసుందరి

మేం సాగర్‌ చేరుకున్నాం. అక్కడ కూడా ఐదు రోజులున్నాం. మా ఆయన గౌరవార్థం ఎన్నో చోట్ల సభలు ఏర్పాటు చేశారు.కథా సదస్సులు కూడా జరిగాయి.
ఒకరోజు కథా సదస్సుకి వెళ్తూ, ”నువ్వు కూడా పద, అమ్మాయిని కూడా వెంట తీసుకెళ్దాం” అన్నారు.
నేను అమ్మాయితో, ”నువ్వు కూడా రా,” అన్నాను.
”అమ్మా! ఇక్కడ ఘోషా పద్ధతి ఉంది. బావుండదు,” అంది.
”అమ్మాయి రాలేదు. నాకు కూడా రావాలని లేదు,” అన్నాను.
”ఎందుకు?”
”ఇక్కడ ఘోషా పాటిస్తారుట.”
”ఘోషా లేదూ, ఏం లేదు, పద!”
”ఆ పద్ధతి ఇంకా పోలేదు కదా?” అన్నాను.
”నా యింట్లో అలాంటిదేం లేదు!”
”కాలాన్ని బట్టీ మార్చుకోవాల్సి ఉంటుంది. నేను ముసలిదాన్ని.”
”సరే, అయితే నువ్వు రా.”
”లేదు, నేను కూడా రాను.”
నేను బైల్దేరననేసరికి ఆయన అల్లుణ్ణీ, మనవణ్ణీ వెంటబెట్టుకుని వెళ్లిపోయారు.
ఐదోరోజు మేమక్కణ్ణించి ఇంటికి బైలుదేరుతూంటే నాకు చాలా దిగులేసింది. అమ్మాయి ఏడవటం మొదలుపెట్టింది. దాని పిల్లాడు మాతో వస్తానని ఏడవసాగాడు.
”వీణ్ణి తీసుకెళ్దాం. నీకు కూడా అక్కడ ఒంటరితనం అనిపించదు,” అన్నారు.
”వద్దు, అమ్మాయి బెంగ పెట్టుకుంటుంది,” అన్నాను.
అప్పుడాయన అమ్మాయితో, ”ఎందుకా ఏడుపు? సెలవలు అయిపోగానే ధున్నూని పంపిస్తాలే. నిన్ను వెంట తీసుకెళ్దామనుకునే అసలిక్కడికి వచ్చాను. కానీ మీ ఆడబడుచు వస్తుందనుకుంటా, కదూ? అదీ సబబే. పాపం ఆవిడ అంత దూరంనించి వస్తోంది నిన్ను చూడటానికేగా! ఒక రెండు మూడు వారాల్లో ధున్నూని పంపిస్తాను,” అన్నారు.
అక్కణ్ణించి మేం అలహాబాద్‌కి వచ్చాం. రైలు దిగగానే మా బంధువొకాయన మాకోసం కారు తీసుకొచ్చి వేచి ఉండటం చూశాం. ”ధున్నూ ఏడీ? మీకెలా తెలిసింది మేమొస్తున్నామని?” అన్నారీయన నవ్వుతూ.
”వాళ్లే చెప్పారు. బహుశా రైలెప్పుడొస్తుందో వాళ్లకి తెలిసుండదు,” అన్నాడు ఆ వచ్చినాయన.
”అయితే పదండి బోర్డింగ్‌ హౌస్‌నించి వాళ్లని కూడా వెంట పెట్టుకుని వెళ్దాం,” అన్నారీయన. అలా అంటున్నప్పుడు, ఇక పిల్లల్ని చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను, అన్న భావం ఆయన మొహంలో కనిపించింది. జైల్లోంచి విడుదలైన మనిషి తన కుటుంబాన్ని చూడాలని తహతహలాడినట్టు! నేరుగా కార్లో బోర్డింగ్‌ హౌస్‌కెళ్లి పిల్లల్ని పేరుపెట్టి పిలిచారు. ఇద్దరూ స్టేషన్‌కి వెళ్లేందుకు ఇంకా తయారవుతున్నారు. ఈయన పిలవగానే బైటికొచ్చారు. అక్కణ్ణించి అందరం లూకర్‌గంజ్‌కి వెళ్లి అక్కడే బసచేశాం.
”ఏమిటి ఇక్కడే ఉండిపోదామనా మీ ఉద్దేశం?” అని అడిగాను రెండు రోజులు గడిచాక.
”అలా ఎలా కుదురుతుంది?” అన్నారు నవ్వుతూ.
మర్నాడు ఇద్దరం మా అన్నయ్యింటికి వెళ్లాం. ఐదు రోజులక్కడే ఉన్నాం. ఐదోరోజున, ”పద, సోరాంవ్‌ వెళ్లి మీ చెల్లెల్ని కూడా చూసొద్దాం,” అన్నారు.
”తప్పకుండా వెళ్దాం,” అన్నాను.
చెల్లెలింట్లో నాలుగైదు రోజులుండి మేం బైలుదేరుతుంటే మా చెల్లెలు, ”అప్పుడే వెళతారా? అదేం కుదరదు! బావగారూ, మా అక్కని ఇక్కడ కొన్నాళ్లు ఉండనివ్వండి,” అంది.
”ఇది చాలా అన్యాయం! ఇంట్లో మేమిద్దరమేగా ఉండేది? ఇదెలా ఉందంటే, పంజరంలో ఉండే పక్షుల జంటలో ఒకదాన్ని విడదీసినట్టుంది!”
”ఒక్క పదిరోజుల్లో ఎవర్నైనా తోడిచ్చి పంపిస్తానుగా, మీకేమీ ఇబ్బంది కలగనివ్వను!” అంది మా చెల్లెలు.
”ఐతే నన్నిక్కడ ఉండిపోవద్దంటారా?” అన్నాను ఆయనతో.
”ఉండాలనుంటే ఉండు. అలా అయితే నేను కాన్పూర్‌కి వెళ్లి వస్తాను.”
”ఎందుకూ? బెనారెస్‌కే వెళ్లచ్చు కదా?”
”ఆ ఇంట్లో ఒంటరిగా ఉండటం నావల్లకాదు!”
”మీరు ఎక్కువగా ప్రెస్‌లోనే ఉంటారు కదా?”
”కానీ రాత్రి ఇంటిదగ్గరే ఉండాలిగా! నువ్వు లేకుండా ఆ ఇంట్లో ఒక్కణ్ణీ ఎలా ఉండేది?”
”అలా అయితే పదండి, ఇద్దరం వెళ్లిపోదాం. ఎలాగో ఒకలా చెల్లెల్ని ఒప్పిస్తాను.”
ఇద్దరం బెనారెస్‌ చేరుకున్నాం. పగలంతా ఆయన ఇంటిదగ్గరే ఉండేవారు. ప్రెస్‌కి ఎప్పుడోగాని వెళ్లేవారు కాదు. నన్ను ఇంటిదగ్గర ఒంటరిగా వదిలి వెళ్లటం అనే ఆలోచన ఆయన భరించలేకపోయేవారు.
ఒకరోజు ఆయన పట్నానికి వెళ్లాల్సివచ్చింది, ”నువ్వు కూడా నాతో పాటు రాకూడదూ?” అన్నారు.
”మీరు అచ్చాఫీసులో కూర్చుంటారు, నేనేం చేస్తాను?”
”అయితే పద నిన్ను బేనియా ఇంట్లో దిగబెడతాను. ఆయన తల్లితో కబుర్లు చెప్పుకుంటూ ఉందువుగాని. ఇక్కడ రోజంతా ఒక్కత్తివే కూర్చునిఏం చేస్తావు?”
”లేదు, మీరొక్కరే వెళ్లండి!” అన్నాను.
”అలా అయితే నేనూ వెళ్లను! పని అదే అవుతుంది. ఇంకోసారెప్పుడైనా ఇద్దరం వెళ్దాం. ఇక్కడ నాకు దొరికే ఆనందం అక్కడెలా దొరుకుతుంది? పదకొండు నెలలుగా జరుగుతున్నట్టే ఇకమీదటా జరుగుతుంది. దాన్ని గురించి పట్టించుకోవక్కర్లేదు,” అన్నారు.
”ఏం, నేను లేకుండా వెళ్లలేరా?” అన్నాను.
చివరికి ఆయన ఆరోజు వెళ్లనేలేదు.
ఐదు రోజుల తరవాత అలహాబాద్‌నించి ఉత్తరం వచ్చింది. ధున్నూకి అమ్మవారు సోకిందన్న వార్త. సాయంకాలం ఏడుగంటల ప్రాంతంలో ఈయనకి ఆ ఉత్తరం అందింది. పగలు ఆయన ఇంట్లోనే ఉన్నారు. మధ్యాన్నం ఇద్దరం కునుకు తీస్తున్నాం. నాకప్పుడు ఒక భయంకరమైన కల వచ్చింది. ఆయన రెండుగంటలకే లేచి వెళ్లినట్టున్నారు. భయంతో నిద్రలేచి ఆయన గదిలోకి వెళ్లిచూస్తే, ఏదో రాసుకుంటూ కనిపించారు. నేను గాభరాపడటం చూసి, ఏమైందని అడిగారు.
”మీరు లేవగానే నన్ను కూడా లేవవలసింది. చాలా పాడుకల వచ్చింది!” అన్నాను.
”నాకేం తెలుసు? అందుకే నిన్నొక్కదాన్నీ వదిలి ఎక్కడికీ వెళ్లటంలేదు.”
సాయంత్రం ధున్నూ అనారోగ్యం గురించి ఉత్తరం రాగానే, ”రేపు ఉదయం బైలుదేరాలి,” అన్నారు.
”నేను కూడా వస్తాను,” అన్నాను.
”వద్దు, భయపడాల్సిందేమీ లేదని రాశారు కదా? అక్కడ ఇక్కాలూ, టాంగాలూ ఏవీ దొరకవు. నువ్వెలా నడవగలవు?”
”లేదండీ, నా మనసు నెమ్మదిగా ఉండదు.”
”నువ్వు రావద్దు, చాలా అవస్థ పడతావు,” అన్నారు బతిమాలుతున్నట్టు.
”ఏవేవో పిచ్చి ఆలోచనలొస్తాయి, నన్ను కూడా రానివ్వండి.”
”పోయినసారి ఉత్తరం రాస్తూ చీవాట్లు పెట్టాను. పాపం ఈ జబ్బులో అది చదువుకుని మరీ బాధపడుంటాడు!”
”ఎందుకు చీవాట్లు పెట్టారు?”
”వాడు దుబారా చేస్తాడు.”
”డబ్బు గురించి ఎప్పుడూ తిట్టకండి.”
”అది మంచి అలవాటు కాదు కదా, తరవాత వాడే అవస్థ పడాల్సివస్తుంది. ఇప్పుడు తల్చుకుంటే బాధగా ఉంది. ఎలా ఉన్నాడో ఏమిటో!”
మేమిద్దరం ఉదయం ఐదు గంటలకి లేచి కాలినడకన బైలుదేరాం. కొంతదూరం వెళ్లాక ఇక్కా (గుర్రబ్బండి) దొరికింది. కానీ ఈలోపల రైలు కాస్తా వెళ్లిపోయింది. అప్పుడు ఒక లారీలో ఎక్కి వెళ్లాం. సాయంత్రం నాలుగున్నరకి ప్రయాగ చేరుకున్నాం. ధున్ను కోలుకుంటున్నాడు. ఏడున్నర దాకా వాడి దగ్గరే ఉన్నాం. ఆ రోజంతా మేం ఏమీ తినలేదు.
ధున్నూకి పూర్తిగా నయమయ్యే సమయానికి బోర్డింగ్‌ హౌస్‌ వాళ్లు ఒక పదిహేనురోజులు సెలవలిచ్చారు. అక్కడి నౌకర్లకి మా ఆయన తలా రెండు రూపాయలూ ఈనాం ఇచ్చారు. మేమిద్దరం పిల్లలతో కలిసి బెనారెస్‌కి వచ్చాం. స్టేషన్‌లో దిగాక, ఒక టాంగావాడు ఎక్కువ బాడుగ అడిగాడని ధున్నూ, వాణ్ణి పంపేశాడు. మరో టాంగా పిలుచుకొస్తానని వెళ్లాడు. బేరం మాట్లాడి తీసుకురావటానికి కొంత సమయం పట్టింది.
”చూశావా, నీ పిల్లల్ని? పాపం బీదవాడు, నాలుగు పైసలు ఎక్కువ అడిగాడే అనుకో, ఇస్తే ఏం పోయింది? తన విషయంలో డబ్బుకి ఆలోచించరు…. ఇది చాలా చెడ్డ అలవాటు. అయినా ఈ లోకం చాలా విచిత్రమైంది!” అన్నారు.
”అవును, అందరూ మీలాగ సన్యాసుల్లా ఉంటారా?”
”ఎందుకుండకూడదు? మన కష్టాల గురించి చెప్పుకుంటూ ఎదుటివాళ్ల బుర్ర తినేస్తామే? మరి ఇంకొకరి కష్టం కూడా అలాంటిదేగా? ఎదుటి వాళ్లని వాళ్లు కూడా మనలాంటి మనుషులే అని అనుకోవాలి. అలా చెయ్యలేనప్పుడు అవతలి వాళ్లు సుఖంగా ఉన్నారని అసూయపడకూడదు. వాళ్లు బాగుపడిపోయారని ఏడ్చేవాళ్లు తమ సుఖం మాత్రమే చూసుకోకూడదు, కదా?”
”మీరు రష్యాలోని డిక్టేటర్‌ లాగ మాట్లాడుతున్నారు!”
ఆయన నవ్వి, ”నేనేం కాదు గానీ! చూస్తూండు, ఏదో ఒక రోజున దేశంలో ప్రతిఒక్కరూ రష్యన్‌ డిక్టేటర్‌ కన్నా కఠోరంగా మారతారు. అప్పుడు నువ్వు కూడా పేదవారు చేసే శరీరశ్రమలాంటిది చెయ్యాల్సి వస్తుంది,” అన్నారు.
”అవును, మీరు పార పట్టుకుంటారు, అప్పుడు!”
ఆయన మళ్లీ నవ్వారు, ”కలం పారకన్నా బలమైనది,” అన్నారు.
”కానీ చేతులు బొబ్బలెక్కవుగా?”
”అది కాదు, నీ పిల్లల సంగతి చెప్పు…” అంటూండగా ధున్నూ టాంగా పిలుచుకొచ్చాడు. అయినా ఇంకా టాంగావాడితో ఏదో గొడవ పడుతూనే ఉన్నాడు.
”ఏమిటయ్యా గొడవ? టాంగా ఇలా తీసుకురా!” అన్నారు. కూలీలు సామాను ఎక్కించారు. దారిపొడుగునా బండితోలే అతని కష్టసుఖాల గురించి అడుగుతూనే ఉన్నారు.
మేం ఇల్లు చేరిన మూడోనాడు బన్నూకి కూడా అమ్మవారు పోసింది. మళ్లీ మా అవస్థలు ప్రారంభం. సాయంకాలం పూట వాణ్ణి మేడమీదికి తీసుకెళ్లి ఆయన ఏవేవో కబుర్లు చెప్పేవారు. ఈలోపల నేను కింద వంట పని ముగించేదాన్ని.
ఒకరోజు బన్నూ తన మంచం మీంచి లేచివచ్చి నా మంచం మీద పడుకున్నాడు. నేనాసరికే నిద్రపోయాను. వాడునా పక్కన పడుకోటం ఆయన చూశారు. ఎంతో మృదువుగా, ”నాయనా, బన్నూ! నీ మంచం మీదికి పోయి పడుకో బాబూ!” అన్నారు.
ఇంకా ఉంది.

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.