చెల్లెలు రాసిన కథలకు అన్న చెప్పిన ఆమె కథ

– డి. రాజేశ్వరి

కన్నడ కథా సాహిత్యంలో, ప్రత్యేకించి ముస్లిం కథా రచయితలలో శ్రీమతి రజియా, ఎస్‌.జె.బి మెరిసి మాయమై పోయిన గగన తార. ఆమె నిజ జీవితం కూడా కథలాంటిది. కథకంటే ఆమె బతుకు గొప్పది, అంటారు ఆమె రాసిన కథలకు ‘మీతో’ అన్న ముందు మాటను రాసిన ఆమె సోదరుడు శ్రీహనీఫ్‌.

శ్రీమతి రజియా ఎస్‌.జె.బి. కథా సంకలనం మహర్‌ (వివాహ ధనం) విడుదలయ్యే నాటికి ఆమె ఈ లోకంలో లేదు. ఆమె చనిపోయిన 40 వ రోజు ‘దువా’ నాటికి ఈ సంపుటాన్ని సిద్ధం చేశారు. ‘మహర్‌’ అన్న పేరుతో ఉన్న మొదటి కథతో పాటు ఈ సంకలనంలో మొత్తం 12 కథలున్నాయి. వీటిలో రెండు తప్ప తక్కినవన్నీ ముస్లిం నేపథ్యంలో సాగినవి. ప్రత్యేకించి ముస్లిం కన్యల జీవితంలో వరకట్న సమస్య తెచ్చే తీవ్రమైన పరిణామాలను చిత్రిస్తాయి.

రజియా కథలు చిన్న కథలకంటే కొంచెం పెద్దవి. ఇవి స్త్రీ వాదాన్ని ఉత్కఠంగా నిరూపించవు. కాని లేతమనస్సుతో సమస్యను ఎదిరించి నిలవాలన్న ఆశయాన్ని ధరించి ఉంటాయి. విడివిడిగా పత్రికలలో వచ్చిన ఈ కథలు పాఠకులను ఆకర్షించడమే కాదు, రజియా కథలు భావగీతాల్లా ఉంటాయని అంటారు. రజియా రాసిన కథల్లో ‘మహర్‌’ గొప్ప సంచలనాన్ని కలిగించింది. సంప్రదాయాన్ని సంప్రదాయంతోనే ఎదిరించిన కొత్త సంఘర్షణ ఈ కథల్లో ఉంది.

రజియా మంగుళూరు జిల్లాలోని బైళ్ళేరు అనే చిన్న గ్రామంలో జన్మించింది. ఒక విశేషమేమిటంటే కర్నాటకలోని ముస్లిం రచయితలలో చాలా మట్టుకు దక్షిణ కన్నడ తీరప్రాంతానికి చెందినవాళ్ళు. రజియా కథలు కూడా గ్రామ నేపథ్యాన్ని ప్రతిబింబిస్తాయి.

‘మహర్‌’ కథలో నాయిక ఇఫరత్‌, పేదవాడైన తన తండ్రి వరకట్నం కోసం అప్పులపాలవడం సహించలేని ఇఫరత్‌, వరుడి కుటుంబం నుండి ఇస్లాం మత ప్రకారం తనకు రావలసిన ‘మహర్‌’ హక్కును పొందాలనుకుంటుంది.

పెళ్ళయ్యాక ఆమె సర్దుకుని పోతుందిలే అని భావించిన వరు డు, ‘మహర్‌’కు అంగీకరిస్తాడు. కాని తొలి రాత్రి ఇఫరత్‌ భర్తను తాకనీయదు. తనకు రావలసిన ధనాన్నిమ్మని అడుగుతుంది. ఆ నాటి నుంచి ఆమె తన పంతాన్ని అధికం చేస్తుందే తప్ప వెనుకంజ వేయదు. వరుని తల్లి, సుఖమివ్వలేని భార్య ఎందుకు..? పుట్టింట్లో విడిచి రమ్మంటుంది. అలాగే అతడు ఆమెను పుట్టింట్లో దిగవిడుస్తాడు. కాని ఇఫరత్‌ తన పట్టుదల వీడదు. పెళ్ళికి ముందు వారు వాగ్దానం చేసినట్టుగా, తనకు ముస్లిం మతం ప్రకారం రావలసిన హక్కును ఇచ్చి తీరాలంటుంది. ఇక భర్త “ఆడదానికి ఆమెకే ఇంత మొండితనం ఉంటే తనకెంత రోషంఉండాలి” అంటూ, తిరిగి వెళ్ళిన నాలుగైదు రోజులకే ఒక తెల్ల కాగితం మీద తలాక్‌ – తలాక్‌ – తలాక్‌ అని రాసి, సాక్షుల సంతకంతో విడాకుల పత్రం పంపుతాడు.
పై కథలో, ఒక నూతన రచయిత్రిగా కాక రజియా చేయి తిరిగి కథకురాలిగా కనిపిస్తుంది. సాధారణంగా తండ్రి చేసిన అప్పుకు తనయుడు బాధ్యుడుగా నిలుస్తాడు. కాని ఈ కథలో కూతురు తండ్రి చేసిన ఋణానికి ఫణంగా తన జీవితాన్ని ముడుపు కడుతుంది. ఇది ఒక స్త్రీ మాత్రమే రాయగలిగిన విశిష్టమైన కథ అని కూడా విజ్ఞులంటారు. భార్యా భర్తల సంబంధంలో భార్య తన హక్కు కోసం పోరాడడం విశేషమైతే, ఒక కన్య కన్న తండ్రి కోసం ఆరాటపడిన ఆవేదన, మానసిక విశ్లేషణ కూడా సున్నితంగా కథనల్లుకుని వుంటాయి.

‘మహర్‌’ కథా సంకలనంలోని కథలన్నీ ‘ఆమె లేదు, కాని మాలో ఆమె కనబడుతుంది. అని ప్రకటిస్తున్నా, అంటూ ఈ పుస్తకానికి “మీతో” అన్న పరిచయాన్ని రాసిన రజియా సోదరుడు ‘శ్రీ హనీఫ్‌’ మాత్రం ఈ కథలను ఆమె రాయకపోయినా బాగుండేది, ఆమె బతికి ఉంటే మా కదే భాగ్యంగా ఉండేది. అని శోక తప్తుడౌతాడు.

శ్రీహనీఫ్‌ సోదరి రజియాను గురించి ఇలా రాస్తారు.

“చెల్లెల్ని మట్టిలో కలిపి ఆమె రాసిన విడివిడి కథలన్నింటిని ఒక్క చోట చేర్చి, వాటిని గురించి కొన్ని మాటల్ని” రాయవలసి వచ్చిన సందర్భం చెప్పడానికి ఏ భాషలోనూ శబ్ధాలుండవు. అసలు ఈ మొదటి మాటల్ని రజియాయే రాయవలసి ఉండింది. సాధారణంగా కథకులే తమ కథలను గురించి పరిచయం చేసుకుంటారు. కాని అందుకు పరిస్థితి ఇప్పుడు తారు మారైంది.

నేనిప్పుడేం రాసినా రజియా చదవదు. ఆమె ఉండగా ఈ కథలసంపుటి ప్రకటితం అయితే బాగుండేదన్న బాధ నాకిక ఎప్పుడూ ఉండనే ఉంటుంది. ఒక నెలరోజులక్రితం (2004, జనవరి) దక్షిణ కర్నాటకం ‘నావుంద’లోని మసీదు పక్కనే ఆమె శరీరాన్ని ఖననం చేసి వచ్చినప్పటి నుంచి, ఈ కథలను ఎన్ని సార్లు చదివానో నాకే తెలియదు, ‘కథకంటే బతుకు గొప్పది’ అన్న మాట ఆమె కథలన్నింటికి వర్తిస్తుంది.

ఈ కథలనిప్పుడు చదువుతుంటే మా చెల్లెలు ఎంత సున్నిత హృదయరాలో తెలిసి వస్తోంది. ఆమె బతికి ఉన్నప్పుడు ఏమో అనుకున్న మాటలు, ఇప్పుడు ఈ కథల వెనుక తమ గుట్టును విప్పతున్నాయి. రజియా కథలన్నీ ఎంతో మృదువైనవి. ఆ మాట కథలను చదివిన వాళ్ళెవరైనా చెబుతారు. ఇప్పుడు నా హృదయంలో గాయంగా మిగిలిన ఆమె గాఢమైన స్మృతులను ఇక్కడ దాఖలా చేస్తాను బహుశా నా దుఃఖానికి తగిన లేపనం అదే అనుకుంటాను.

రజియా ఎస్‌.ఎస్‌.ఎల్‌.సి పరీక్షల్లో గణితంలో తప్పింది. దానినేమీ పట్టించుకోలేదు. ఆమె గాలికి ఎగిరి వచ్చిన ఏ కాగితం ముక్కనైనా సరే అక్కడికక్కడే నిలబడి చదివేది. దొరికిన ఏ పుస్తకాన్నైనా, పత్రికనైనా ఒక్క అక్షరం ముక్క వదలకుండా చదివేది. కాలేజికెళ్ళి నేర్చుకున్నదే నిజమైన చదువని ఆమె ఎప్పుడూ అనుకోలేదు.

రజియా కథలను రాయడం ఎప్పుడు మొదలెట్టిందో కాని, ఆమె కథలు ‘అల్‌అన్సర్‌’, ఉదయవాణి, తుషార, మైలాంజి వంటి పత్రికల్లో ప్రకటితం అయినప్పటి నుంచి, ఆమెకు వచ్చే ఉత్తరాల సంఖ్యకూడా పెరిగింది. అవివాహిత కన్య కథలను రాస్తే, ప్రస్తుతం మనం సమాజంలో ఎలాంటి లేఖలు వస్తాయో, అలాంటివి అనేకం ఆమెకూ వచ్చాయి. అందులోనూ రజియా గట్టిగా నోరెత్తి మాట్లాడలేని ముస్లిం అమ్మాయి, ముక్కు మీద కోపం ఉండే ‘బాప్పా’ ఆ ఉత్తరాలు చూసి విరుచుకుని పడే వాడు. ఇంట్లో రభస జరిగేది. ఇంక నీవు రాసింది చాలు. అని ఎన్నిసార్లు అన్నారో.. ఎక్కడో బెంగుళూరు, బీజాపూర్లలో ఉన్న నాకు తొందరగా రమ్మని పిలుపులొచ్చేవి. అప్పుడు ఊరెళ్ళి అందర్ని సమాధానపరచడం నా బాధ్యత అయ్యేది, అలాగని అన్ని సార్లు అలాగే ఉండేది కాదు. పత్రిక వాళ్ళెవ్వరైనా డబ్బు పంపిస్తే మాత్రం ఇంట్లో వాళ్ళముఖాలు వికసించేవి. ఎక్కడో పోటీలో కథలకు బహుమానం వచ్చినప్పుడు, తెలిసిన వాళ్ళు ‘మీ అమ్మాయి బాగా కథలు రాస్తుంది’ అన్నప్పుడు ‘బాప్పా’ కళ్ళల్లో సంతోషం మెరిసేది. అమ్మకూడా ఆనందించేది.

అందరిలాగే ఉత్తరాలు రాసేవాళ్ళలో ఎస్‌.జె.బి. రజియాను పెళ్ళి చేసుకోడం ఇంకో కథకు సరిపోయినంత విషయం అవుతుంది. నాకు, అతనికి ఉత్తరాల్లోనే పోట్లాటలు జరిగేవి. ఇక పెళ్ళి ప్రస్తావన తప్పనిసరి అయినప్పుడు నన్ను పెళ్ళి చేసుకోక పోతే నీ ముఖం మీద ఆసిడ్‌ పోస్తాను. నేనూ బ్రహ్మచారిగానే ఉండిపోతాను, అని అతడు రజియాకు ఉత్తరం రాసాడు. ఇంట్లో ఎంతో టెన్షన్‌ ముగిసాక, చివరకు అతనితో కలసి భోజనం కూడా చేసాక, నేనతనితో ‘పిల్లనొకసారి చూడు, తరువాత పెళ్ళివిషయం నిర్థారిద్దువుగాని అని అన్నాను. చూసే అవసరం ఇక ఏమీ లేదు… నేను పెళ్ళంటూ చేసుకుంటే ఆమెనే చేసుకుంటాను. ఇది తప్పదు.. అని తెగేసి చెప్పాడు. నేనడ్డుపడి, కాదు ‘ఒకవేళ పిల్లకు కాలు కంటి అయితే?… దేనికైనా మంచిది, పిల్లనొకసారి చూడు.. అన్నప్పుడు ‘రేపు పెళ్ళయిన రెండోరోజే ఒక కాలు పోయిందనుకో.. అప్పుడు నేను ఏంచేయాలి? అని ఎదురు ప్రశ్న వేశాడు.

రజియాను గురించి ఎన్ని స్మృతులని రాయాలి? ఊయలలో పసిపాపగా ఉన్నప్పుడు, ఆ పాప పలికే మొదటి మాటేమిటి? అనుకుంటూ వారాల కొద్దీ తొట్లోకి తొంగి చూసిన ఆ ఘడియల్నా… బడికి తీసుకుని వెళ్ళేటప్పుడు నా చేయి పట్టుకున్న ఆ లేత వేళ్ళనా?..

పెళ్ళయి భర్తతో వెళ్ళేటప్పుడు కళ్ళనిండా నీళ్ళు నింపుకుని, గభాల్న నన్ను కౌగిలించుకున్న ఆ క్షణాల్నా… నా మేనల్లుడు ‘శమ్శాస్‌’ పుట్టినప్పుడు మనసు నిండిన సంతోషంతో మాటలాడిన సమయాన్నా. మోటార్‌ బైక్‌ ఆక్సిడెంట్‌లో స్పృహ కోల్పోయి తెలివి తప్పిన స్థితిలో ఎస్‌.జె.బి మణిపాల్‌ ఆస్పత్రిలో నాల్గురోజులు కోమాలో ఉన్నప్పుడు, అక్కడే ఎమర్జన్సీ వార్డ్‌ బయట కిటికీ ఊచలు పట్టుకుని ‘అన్నా’ అంటూ విల విల ఏడ్చిన ఘట్టాన్నా?…

విధి వక్రిస్తే ఇక ఏం చెప్పాలి.. తరువాత అదే ఎమర్జన్సీ వార్డ్‌ ముందర జనవరి 6, 2000న రాత్రంతా జాగరణ చేసాను. సాయంత్రం ఏడు గంటలకు నేను ఆస్పత్రిని చేరేటప్పటికే డాక్టరు ఇక కేవలం 48 గంటలు అని చెప్పారు. పరుపు మీద పదే పదే వాంతులు చేసుకుంటున్న రజియా, ఆపుకోడానికి యత్నిస్తూ నన్ను చూడగానే ‘అన్నా’ నన్నిక్కడ నుంచి బయటకు తీసుకుని వెళ్ళిపో, అంటూ నా వేళ్ళను గట్టిగా పట్టుకుంది. ఆమె ఎదుట ఏడవ కూడదని దవడలను బిగపట్టి, ఇక ఎంతో సేపు ఉండలేక బయటకు వెళ్ళి భోరున ఏడ్చాను. రాత్రంతా ఒక చోట కూచోలేక, నుంచోలేక అటూ ఇటూ తిరుగుతూ ఉండిపోయా.

మధ్య రాత్రి 2 గంటలకు ఆమెకు ఊపిరితీయడం కష్టం అయిపోయింది. కిడ్నితో పాటు హృదయం కూడా పని చేయడం మానేసింది. డాక్టర్లు సాధ్యమైంత చేసారు. కృత్రిమ శ్వాసను అమర్చారు. తెల్లారు ఝాముకు చేతులెత్తేసారు.

నా స్మృతున్నింటికి ఈ కథల సంపుటి ఒక ఆధారం మాత్రమే. రెండు నెలల క్రితం ఫోను చేసి, దీపావళి విశేష సంచికకు కవిత పంపాను. ఆ పత్రిక వచ్చిన వెంటనే తీసుకునిరా, అంది. ఆపత్రిక వచ్చింది. కవితను చదివాను. కాని ఆమెకు సీరియస్‌గా ఉన్నప్పుడు, నా వెంట తీసుకుని వెళ్ళడానికి కన్నీళ్ళు తప్ప ఇంకేవీ అందుబాటులో లేవు.

రజియా కథల్ని ఆదినుంచి ప్రోత్సహించ డమే కాకుండా మొట్టమొదటి రచనకు ‘డబ్బు’ను కూడా ఇచ్చిన ‘అల్‌ అన్సార్‌’ పత్రికకూ, ఆ పత్రిక వ్యవస్థాపకులు, హితైషులు అయిన ‘అబూబకర్‌ కైరంగళ’ గారికి కృతజ్ఞతలనర్పిస్తాను. ఆల్‌ అన్సార్‌ దక్షిణ కర్నాటకంలోని ప్రతి ఇంట్లో చదివే పత్రిక.
అలాగే, ఆమె కథలనను మెచ్చి పెళ్ళి చేసుకున్న దివంగత ఎస్‌.జె.బి, వివాహాంతరం కూడా ఆమెను రచయితగా ప్రోత్సహించారని బావను తలచుకుంటారు. నావుంద గ్రామస్థులైన ఎస్‌.జె.బి చిన్న వ్యాపారం చేసేవారట.

నాకు తెలుసు, ఈ కథా సంపుటి ఆమె జీవితకాలంలో వెలువడి ఉంటే బాగుండేది. కన్నడ కథాసాగరంలో ఇదొక చిన్న కాగితం పడవ ఇది ఏ తీరం చేరగలదు? బతుకు, కథ అనేవి, పడవ, తీరం లాంటివి. కానీ బతుకే ఒక కథగా మారకూడదు… ఇంతకంటే నేనేం రాయగలను? అంటూ ముగిస్తారు.

(రజియా సోదరుడు శ్రీహనీఫ్‌ ‘ప్రజావాణి’ కన్నడ పత్రిక ప్రధాన సంపాదకులుగా మైసూరులో ఉంటారు)

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.