అంతర్జాతీయ జల సత్కార గహ్రీత – సునీతా నారాయణ్‌

– డా. స్‌. వి. సత్యనారాయణ

“నేను ఎక్కడి కెళ్లినా, ఏ ప్రాంతాన్ని సందర్శించినా అక్కడి మంచినీటి వ్యవస్థ ఎలా ఉంది? మురుగునీటి వ్యవస్థ ఎలా ఉందని గమనించడం నా జీవన విధానంగా మారిపోయింది. పర్యావరణ ఉద్యమకారిణిగా ప్రారంభమైన నా జీవన యాత్ర క్రమంగా డ్రైనేజీ ఇన్స్‌పెక్టర్‌ స్థాయికి పరిణమించింది. నేడు ప్రపంచాన్ని కలవరపరుస్తున్న సమస్యలు – నీటి కాలుష్యం, వాయుకాలుష్యం. ఇవి ప్రాణాంతక సమస్యలుగా మారిపోయాయి” అంటూ నిబద్ధత నిండిన స్వరంతో సునీతా నారాయణ్‌ ప్రకటించారు.

ఇటీవల హైదరాబాద్‌ నగరంలోని ఎల్వి ప్రసాద్‌ కంటి ఆస్పత్రిలో జరిగిన విద్యా దినోత్సవంలో సునీతానారాయణ్‌ ముఖ్య అతిధిగా పాల్గొని, స్నాతకోత్సవ ప్రసంగం చేశారు. “మీరు ప్రజలకు చూపునిస్తున్నారు. సమాజాన్నీ, లోకాన్నీ చూసే అవకాశం కల్పిస్తున్నారు. మేము మెరుగైన సమాజాన్నీ అభిలషిస్తున్నాం. అందమైన లోకాన్ని ఆకాంక్షిస్తున్నాం. మీరు ప్రసాదించే చూపుతో సుందరమైన దృశ్యాలను ఈ దేశ ప్రజలు చూసే వ్యవస్థ కోసం మేం పరితపిస్తున్నాం. సామాజిక దురన్యాయాలు, వాతావరణ కాలుష్యం, ఆ సమానతలూ, అణచివేతలూ, అవినీతితో నిండి ఉన్న లోకాన్ని చూడకుండా దృష్టిపోయినా బావుండేదని ప్రజలు భావించే లోకాన్ని నిరసిస్తున్నాం. చూపులేని వారు కూడా పచ్చని వాతావరణాన్ని, పరిశుభ్రమైన ప్రకృతిని చూడాలని పరితపించే రోజులకోసం కలగంటున్నాం” అంటూ ఆమె ఉద్వేగభరితం గా ప్రసంగించారు.

సెంటర్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌ మెంట్‌ (సిఎస్‌ఇ) సంచాలకులు, ఆ సంస్థ నిర్వహిస్తున్న పర్యావరణ పత్రిక “డౌన్‌ టు ఎర్త్‌” సంపాదకులు, ప్రచురణకర్త, క్రియాశీల పర్యావరణ ఉద్యమకారిణి సునీతా నారాయణ్‌. “రానున్న కాలంలో ఒక దేశం సంపన్న దేశమా? పేదదేశమా? అని నిర్ణయించేది నీరే. నేడు ప్రపంచమంతా ఎదుర్కొంటున్నది నీటి కరువు సమస్య కాదు, నీటి నిర్వహణమే అసలు సిసలు సమస్య”- అన్న స్పష్టమైన అవగాహన గల సునీత చిన్నప్పుడే తండ్రిని కోల్పోయారు. తల్లి పెంపకంలో పెరిగారు. నలుగురు అక్కా చెల్లెళ్ళ మధ్య, ఆత్మీయతలూ, ఆప్యాయతల మధ్య క్లాస్‌లో ఎప్పుడూ ఫస్ట్‌ ఇన్‌ ఫస్ట్‌ ర్యాంకర్‌గానే రాటుదేలారు. న్యూఢిల్లీలోని మోడరన్‌ స్కూల్‌లో 1970 చివర్లో పాఠశాల చదువు ముగించే రోజుల్లోనే చిప్కో ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. క్రమంగా పర్యావరణ పరిశీలనం, పర్యావరణ సమస్యలు ఆమె జీవితంలో అంతర్భాగమైపోయాయి. డిగ్రీ పూర్తి చేసుకుని, గుజరాత్‌లోని పర్యావరణం, వన్యప్రాణుల రక్షణ మీద అధ్యయనం చేయడానికి అహ్మాదాబాద్‌ వెళ్లారు.

ఆ తరువాత ముంబాయిలోని ‘నేచురల్‌ హిస్టరీ సొసైటీ’లో కొంత కాలం పనిచేశారు. కుదురుగా ఉద్యోగంలో స్థిరపడడానికి ఆమె మనస్సంగీకరించలేదు. అక్కడ్నించి ఢిల్లీ వెళ్లారు. 1982లో ‘సెంటర్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌’లో కార్యకర్తగా చేరి, క్రమక్రమంగా డైరెక్టర్‌ స్థాయికి ఎదిగారు.

భారతదేశ పర్యావరణ సమస్యలమీద అభినివేశంతో అధ్యయనం చేయడం, ఇదే సమస్యపై వ్యాసాలూ విశ్లేషణాలూ రాయడంతో ఆమె రచనా వ్యాసంగం ప్రారంభమయింది. తాను జర్నలిస్టుననీ, పర్యావరణ ఉద్యమ కారిణని ప్రకటించుకున్న సునీతా నారాయణ్‌ – నీరు, పర్యావరణం, మానవ హక్కులు, ఆరోగ్యం, ప్రజాస్వామ్య విలువలు కోసం నిర్విరామ కృషిని కొనసాగిస్తున్నారు.

శీతల పానీయాల్లో పురుగుల మందులు కలుపుతున్న విషయాన్ని బయట పెట్టడం ద్వారా ఆమె పేరు దేశప్రజల దృష్టిలో పడింది. గొప్ప సంచలనాన్ని రేకెత్తించింది. తరువాత రూపొందిన ‘టైగర్‌ టాస్క్‌ ఫోర్స్‌’కు చైర్‌ పర్సన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న సునీత దేశవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తూ, ప్రజలను చైతన్య పరచడానికి అంకితమై శ్రమిస్తున్నారు.

“నీటి వినియోగానికి సంబంధించి ప్రజల్లో చైతన్యం తీసుకురావడం, వ్యవ సాయం, పరిశ్రమలు, గృహ వినియోగంలో నీటిని పొదుపుగా వాడాలన్న స్పృహను కలిగించడం, పర్యావరణ పరిరక్షణ, కాలుష్య రహిత సమాజస్థాపన, ఢిల్లీలో కొన్ని బస్సుల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశ పెట్టిన సిఎన్‌జి విధానాన్ని దేశంలో ఇతర ప్రధాన నగరాలకు విస్తరింపజేయడం” తమ ప్రధాన లక్ష్యాలుగా ఆమె చెబుతుంటారు.

ప్రపంచంలోని వివిధ దేశాలలో విభిన్న జీవన రంగాలలో నిబద్ధతతో పనిచేస్తున్న ఉద్యమ మేధావులు వందమందిని గుర్తించి, బ్రిటన్‌లోని ఒక అధ్యయన సంస్థ జాబితాను రూపొందించింది. అందులో ఆరుగురు భారతీయ మేధావులకు స్థానం లభించింది. ఆ ఆర్గురిలో ఐదుగురు విదేశాలలో క్రియా శీలంగా పనిచేస్తున్న భారతీయులుకాగా, భారతదేశాన్ని తన క్షేత్రంగా ఎన్నుకున్న ఏకైక ఉద్యమకారిణి సునీతానారాయణ్‌.

గత సంవత్సరం స్టాక్‌ హోమ్‌ సిటీ హాల్‌లో జరిగిన ఒక ఉత్సవంలో స్వీడన్‌ రాజు కార్ల్‌ ఎక్స్‌.వి.ఐ చేతుల మీదుగా 2005 స్టాక్‌హోమ్‌ వాటర్‌ ప్రైజ్‌ కింద లక్షాయాభైవేల డాలర్ల అవార్డునూ, స్ఫటిక శిల్పాన్ని సునీత అందుకున్నారు. స్టాక్‌ హోమ్‌ ఇంటర్నేషనల్‌ వాటర్‌ ఇన్‌స్టిట్యూట్‌ నెలకొల్పిన ఈ అరుదైన ప్రపంచ జల సత్కారాన్ని పొందిన తొలి భారతీయ మహిళగా ఆమె రికార్డ్‌ సృష్టించారు.

నిజాయితీ, నిబద్థత, నిరాడంబరతలను తమ వ్యక్తిత్వంలో భాగంగా మలుచుకుని పురోగమిస్తున్న ఈ తరం పర్యావరణ ఉద్యమకారిణి సునీతానారాయణ్‌ నేటి తరానికి స్ఫూర్తిదాయకం.

Share
This entry was posted in సమాచారం. Bookmark the permalink.

One Response to అంతర్జాతీయ జల సత్కార గహ్రీత – సునీతా నారాయణ్‌

  1. sony says:

    చాలా బాగున్నది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో