నిశ్శబ్ద రాగం – కవితా మాధుర్యం

డా|| మన్నవ సత్యన్నారాయణ
ప్రకృతి అందాలను వీక్షించినప్పుడు సుమధుర సంగీతాన్ని ఆకర్ణించినప్పుడు, బాధాసర్పద్రష్టుల కడగండ్లను గమనించినప్పుడు అందరి హృదయాలు స్పందిస్తాయి. అయితే ఈ స్పందనస్థాయి ఆయా వ్యక్తుల సంస్కారంపైన, చిత్తవృత్తిపైన ఆధారపడి ఉంటుంది.         స్వేచ్ఛగా విహరిస్తున్న క్రౌంచమిథునం కిరాతకుని వేటకు నేలకూలిన సంఘటనను చూచిన ఆ కిరాతకుని హృదయం ద్రవించి శోకతప్తమవుతుంది. ఆ శోకమే శ్లోకంగా పరిణమించి ఆదికావ్య ఆవిర్భావానికి కారణ భూతమయినది. అలా అని ప్రకృతిని పరిశీలించిన ప్రతివాడు కవి కాలేడు. భాష మీద పట్టు, భావనాబలం ఉన్నవాడు మాత్రమే కవిగా రాణించగలుగుతాడు.
మంచి భావుకత, అందుకనువైన భాషగల రచయిత్రులలో ఝాన్సీ కె.వి.కుమారి గారు ఒకరుగా పేర్కొనవచ్చు. ఈమె గత 3 దశాబ్దాలుగా వివిధ ఆకాశవాణి కేంద్రాలలో పనిచేస్తూ అపార అనుభవాన్ని గడించారు. నటిగా, నాటక ప్రయోక్తగా, నాటిక రచయిత్రిగా ”విరబూసిన శిలలు” మొ|| సృజనాత్మక రూపకాల రూపశిల్పిగా శ్రోతల అభిమానాన్ని చూరగొన్నారు. ఆంధ్రదేశంలోని ఆయా ఆకాశవాణి కేంద్రాల ద్వారా తమకలాన్ని, గళాన్ని వినిపించి శ్రోతల హృదయాలలో సుస్థిర స్థానాన్ని అందుకున్నారు.
”విరబూసిన శిలలు” మాట వినగానే నా హృదయంలో ఓ ఆనందోద్వేగం! ఈ రోజు నేను ఓ విరబూసిన శిలనే. శిలలను విరబూయించ గలిగేది కేవలం ఆ సృష్టికర్తే, అయితే ఆ విరబూసిన విధానాన్ని ఈ సమాజానికి తెలిపేందుకు ఈ రచయిత్రి ఎన్నుకొన్న మాద్యమం రేడియో డ్రామ. ఆమె ఆలోచనను ప్రోత్సహించి ఆమె రచించి రూపొందించిన మొట్టమొదటి రేడియో డాక్యుమెంటరి డ్రామాను 1989లో ఆకాశవాణి జాతీయవార్షిక పోటీలకు పంపించిన నాటి విజయవాడ స్టేషన్‌ డైరెక్టర్‌ శ్రీ జి.కె. కులకర్ణి గారికి ఈ సందర్భంగా నా అభివందనలు తెలుపుకొంటున్నాను. విరిగిన కాలుకు కొయ్యకాలును అతికించుకొని రక్తమోడుతూ నృత్యం చేసిన లంకా అన్నపూర్ణ గారు, పుట్టుకతోనే దృష్టిని కోల్పోయినప్పటికి తెలుగు సాహిత్యం మీద మమకారాన్ని పెంచుకొని అడవి బాపిరాజు గారి సాహిత్యం మీద పరిశోధనలు చేసి పి.హెచ్‌.డి అందుకొన్న నేను, పోలియో వ్యాధిలో రెండు కాళ్ళు లేకపోయినప్పటికి వీల్‌ ఛైయిర్‌లోనే బ్యాంకులో ఉద్యోగం నిర్వహిస్తూ రాష్ట్రమంతటా ఉన్న తనలాంటి వికలాంగులకు ఒక సంస్థను ఏర్పాటుచేసి దాని ద్వారా సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తున్న శ్రీ వి. బాలాజి ప్రముఖ పాత్రలుగా మా జీవితాలను నాటకీకరించి మా పాత్రలను మా చేతనే నటింపచేయడం ఈ రూపకం ప్రత్యేకత. కాని, దానివలన ప్రయోజనమేమిటి?
ఒక యాక్సిడెంట్‌లో కళ్ళు, కాళ్ళు పోగొట్టుకున్న ఓ యువతిని ఆత్మహత్య ప్రయత్నం నుండి తప్పించేందుకు మా ముగ్గురి జీవితాలను ప్రత్యక్ష వ్యాఖ్యానాలుగా వినిపించి ఆమెకు జీవితం మీద ప్రేమ చిగురింపచేయడం నాటక భాగం. ఈ నాటకాన్ని ఆ డాక్యుమెంటరీని ఎంతో సుందరంగా సమన్వయం చేసి ‘డాక్యుడ్రామా’ గా రచించి రూపొందించిన ఝాన్సీ గారికి నా గుండెనిండా కృతజ్ఞతలు. ఈ రోజు నేను ఈ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వహించగలుగుతున్నానంటే సోదరి ఝాన్సీ కె.వి. కుమారిగారు అందించిన ఆత్మీయ ఆసరాను ఎలా మరువగలను?
ఝాన్సీ గారు తమ ప్రతిభావ్యుత్పత్తుల్ని కేవలం ఆకాశవాణికి మాత్రమే పరిమితం చేయకుండా కథలను, కవితలను, నాటకాలను, దినపత్రికలలో కాలమ్స్‌ను, ఇటీవల నానీలను రచించి సంకలనాలుగా వెలువరించారు. మొట్టమొదటిసారిగా ”నిశ్శబ్దరాగం” పేరుతో 1988లో ఒక కవితా సంకలనం వెలువరించారు. ఇందులో 70 కవితలున్నాయి. రచయిత్రి ”నిశ్శబ్దరాగం” ని డా|| సంజీవదేవ్‌ శ్రుతి చేయగా కొండముది శ్రీరామచంద్రమూర్తి లయను సమకూర్చి కవితా సంకలనాన్ని సుశోభితం చేశారు.
ఈ కవితా సంకలనం ప్రారంభంలో
”ఎరుగను నేను కవిత్వమననేమో
ఎరుగను గేయమనగా నదియేమో
ఎరుగను చాటువును వ్రాయుట ఎటులో” అని ఝాన్సీ గారు తమ వినమ్రతను ప్రకటించారు. అయితే ఈ రచయిత్రికి అటు ప్రాచీన, ఇటు ఆధునిక సాహిత్యాలపైన మంచి పట్టున్నదన్న విషయాన్ని ఈ కవితా సంకలనం రుజువు చేస్తుంది.
”పుట్టించినది నీవు గిట్టించు
వాడవును నీవు
పుట్టుట గిట్టుట నడుమ నాటక
మాడించునది నీవ”
ఈ కవితాభాగాన్ని చదివినప్పుడు ”నానాటి బ్రతుకు నాటకము, కానక కన్నది కైవల్యము పుట్టుటయు నిజము, పోవుటయు నిజము. నట్టనడిమి, పని నాటకము” అన్న అన్నమాచార్యుని కీర్తన స్ఫురిస్తుంది.
‘ఓ ప్రకృతీ’ అన్న శీర్షికతో వ్రాసిన కవితలో ఈ ప్రకృతిలో మమేకమయి పోవాలన్న రచయిత్రి ఆకాంక్ష వ్యక్తమవుతుంది. ఆ కవిత ఇలా సాగుతుంది.
”తనువు నిండా గాయాలైనా
తలపులూరే గానాన్నిస్తుంది వేణువు” అన్న రచయిత్రి పలుకులు
”పిల్లనగ్రోవికి నిలువెల్ల గాయాలు
అల్లనమోవికి తాకితే గేయాలు” అన్న వేటూరి పాటను స్మరింపచేస్తాయి.
కులపతి అడవి బాపిరాజు గారు వ్రాసిన అసంఖ్యాక గేయాలలో ”ఉప్పొంగిపోయింది గోదావరి తాను తెప్పున ఎగిసింది గోదావరి” అన్న గేయం బహుళ ప్రాచుర్యం పొందింది. ఈ గేయం ప్రభావం ఝాన్సీగారిపై ప్రసరించిందో లేదో గాని ”జలవ్యూహం” అన్న కవితా ఖండిక ఇలా సాగింది.
”ఉప్పొంగి పోయింది గోదావరి
వరదలై పొంగింది గోదావరి”
జానపదులకు అత్యంత ప్రీతిపాత్రమైన పండుగలలో సంక్రాంతి ఒకటి. గ్రామీణ ప్రాంతాలలో ఈ పండుగ కోలాహలం అంతా ఇంతా కాదు. ఎంతో ఆనందోత్సాహాలతో గ్రామీణులు జరుపుకునే ఈ పండుగ ఆగమనాన్ని ఝాన్సీగారు తమ కవితలో సహజ సుందరిగా వర్ణించారు.
ఆధునిక సాహిత్య సంద్రంలో ఆయా రచయిత్రులు, కవులు ఆంగ్లపదాలను విరివిగా వినియోగిస్తున్నారు. ఇలా ఉపయోగించి ”శహ్‌భాష్‌” అని పాఠకుల మెప్పును పొందటం అంత సులభమయినది కాదు. ఝాన్సీ గారు ”రివల్యూషన్‌” అనే కవితలో ఆంగ్లపదాలతో అంత్యప్రాసలను నిర్వహించిన తీరు ఆకర్షణీయం :
”రెక్కలు విప్పుకొని
వస్తోందదిగో రివల్యూషన్‌
ఈ సమాజానికదే ఇవల్యూషన్‌
కాకూడదది పొల్యూషన్‌
చివరికదే కావలసిన సొల్యూషన్‌”
ఈ ఆధునిక నాగరిక సమాజంలో అన్ని దానాలకంటే వాగ్దానము సులభంగా చేయదగినది. దీనికి ఏ విధమైన ఖర్చు, కష్టం లేదు. ప్రధానంగా రాజకీయ నాయకులు ఈ వాగ్దాన కళను పోటీపడి ప్రదర్శిస్తూ ఉండటం అందరికి విదితమే.
పురుషాధిక్య స్వభావాన్ని ”ధర్మపత్ని” అన్న కవితలో రచయిత్రి వ్యంగ్యాత్మక ధోరణిలో చెప్పిన తీరు ప్రశంసనీయం.
”ప్రతిఫలము కోరని
పనిమనిషి కావాలి మాకు……
దానవుడైనా….. పతియేదైవమనే
ధర్మపత్ని కావాలి మాకు!!”
ధర్మభూమిగా, కర్మభూమిగా, మాతృభూమిగా, పుణ్యభూమిగా కొనియాడబడుతున్న సుందర భారతదేశ ఈనాటి స్థితిని రచయిత్రి నిశితమైన విమర్శను మేళవించి ఈ విధంగా కవితను వెలువరించారు.
”దేశభోక్తలే దేశభక్తులుగ
రాణించే ధర్మభూమి ”
అనూహ్యంగా పెరుగుతున్న ధరల తీరును చమత్కార జీవితంగా రచయిత్రి వివరించారు.
”గూడెక్కి కొండెక్కి
ఆకసానికెక్కి
చక్కని చుక్కలతో
ముచ్చట్లు పెట్టుకున్నాయ్‌”
తమ కవితలలో రచయిత్రి అలంకారాలకే తలమానికము అయిన ఉపమాలంకార ప్రయోగంలో మంచి కౌశలాన్ని ప్రదర్శించారు.
అల్పాక్షరాలతో హృదయాన్ని తాకేవిధంగా కవిత రాయడం ఝాన్సీగారికి వెన్నతో పెట్టిన విద్య. ”ప్రాయం” అనే ఖండిక ఇందుకు మంచి ఉదాహరణ.
లోకంపోకడ, మనుషుల తత్వాలు నిశితంగా గమనించిన కవి గుండెలోనుండి పెల్లుబికిన జీవన సారమే నిశ్శబ్దరాగం!
ఈ విధంగా ఝాన్సీ కె.వి. కుమారిగారు తమ అపారమైన అనుభవాన్ని కవితల రూపంలో పాఠకలోకానికి అందించిన తీరు అభినందనీయం. చక్కని శైలిలో, అలతి అలతి పదప్రయోగాలతో, ఆలోచింపచేసే భావజాలంతో హృదయాన్ని స్పృశించే విధంగా కవితలల్లి ఝాన్సీగారు రచయిత్రిగా తమకంటూ ఒక ప్రత్యేకస్థానాన్ని ఏర్పరచుకున్నారు. వీరు చేసిన, చేస్తున్న కృషి బహుధా ప్రశంసనీయం. వీరి రచనలన్నింటికీ స్వాగతం.

ప్రచురణ కర్తలు : ఆంధ్రప్రదేశ్‌ సాంస్కృతీ సమాఖ్య – యువ సాహితీ వికాసవేదిక, విజయవాడ, కావలసిన వారు :
శ్రీ నల్లూరి బాబూరావు,
బి – 202, ఎక్స్‌ప్రెస్‌ అపార్ట్‌మెంట్స్‌,
గంగా జమునా బేకరి లేన్‌, లకడికాపూల్‌,
హైదరాబాదు – 500 004.
చిరునామాలో సంప్రదించవచ్చు.

Share
This entry was posted in పుస్తక సమీక్షలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో