లాకరు

హిందీ మూలం : మృదులాసింహ        తెలుగు మూలం : డా|| నార్ల లావణ్య
ఆ సభాప్రాంగణము అంతా చప్పట్లతో మారుమ్రోగుతోంది. ఆ సంస్థ స్థాపించి నేటికి సరిగ్గా సంవత్సరం. అందువలన వారు వార్షికోత్సవం జరుపుకుంటున్నారు. వేదిక మీద జాగృతి ప్రసంగిస్తుంది. ఆ సంస్థ ద్వారా నిరుపేదలకు, అభాగ్యులకు, వారు చేసిన సేవలను (చేయాలనుకున్న భవిష్యత్‌ కార్యకలాపాలను) వివరిస్తుంది. జాగృతి చూపిస్తున్న శ్రద్ధ, ఉత్సాహం చూసి సభలోని వారందరు ప్రశంసలతో ముంచెత్తారు. తను చెప్పవలసిన విషయాలు ఇంకా ఉన్నవన్నట్లుగా చప్పట్లను ఆపమని సంజ్ఞ చేయగా, సభలో వారందరు ఇంకా ఏమి చెప్తుందోనని ఉత్సుకతతో నిశ్శబ్దంగా కూర్చున్నారు.
రిపోర్టు చదవడం అయిపోయిన తరువాత తల, ఎత్తి కళ్ళకి ఉన్న జోడుని తీసి వేదిక మీద ఉన్న అధ్యక్షులతో ”మీరు అనుమతిస్తే నేను ఈ సంస్థను స్థాపించడానికి వెనుక వున్న కారణాన్ని వివరించి చెపుతాను” అని అనుమతి కోరగా వేదిక మీద కూర్చున్న అధ్యక్షునితో పాటు అతిధులందరూ తల ఊపి అనుమతించారు.
గుండె మీద చేయి వేసుకుని ”నేను ఏది చెబుతున్నానో అది నిజం. నిజం తప్ప మరేమీ నేను చెప్పను” అని ప్రారంభించింది.
”మేము ముగ్గురం అక్కాచెల్లెళ్ళం, అమ్మానాన్న. ఇదీ మా కుటుంబం. దేనికీ లోటులేని సుఖమయ జీవితం. సాయంత్రం మా అన్నగారు ముగ్గురిని కూర్చోబెట్టి చదివించుతూ ఇలా చెప్పేవారు. మిమ్మల్ని పెద్ద చదువులు చదివించి ఆఫీసరు, డాక్టరు, కంప్యూటరు ఇంజనీర్లను చేయాలి. మన ప్రక్కన వున్న కృష్ణారావుగారి ఇద్దరబ్బాయిలు విదేశాలలో వున్నారు. డాలర్లు సంపాదిస్తున్నారు. ఇక్కడ ఆ ముసలి దంపతులు చక్కగా అనుభవిస్తున్నారు. నాకు ముగ్గురు ఆడపిల్లలు అయితే ఏమిటి? మీరు ముగ్గురూ అబ్బాయిల కంటే తక్కువేమీ కాదు. మీ ముగ్గురూ మంచిగా వృద్ధిలోకి వస్తారు, బాగా సంపాదిస్తారు. మీరు ముగ్గురూ లక్ష్మీదేవిలు. లక్ష్మి వస్తూనే వుంటుంది.
వంటింట్లో నుంచి అమ్మ ”జాగృతీ! ఎవరో వచ్చారు చూడు. మరలా చదువుకోవచ్చులే” అని అంటుంటే, ఆమాటలు విన్న నాన్న కోప్పడుతూ ”చూడు చూడు! మీ అమ్మగారి సమాజసేవ. చదువుకునే పిల్లలను మధ్యలో లేపి ఆ భిక్షగాళ్ళకు సేవ చేయాలి” అని చెప్తుంటుంది.
నేను లేచి వంటింట్లోకి వెళ్ళేటప్పటికి వంట పనిలో నిమగ్నమై వున్న అమ్మ నన్ను చూడగానే చీరకొంగుకు ముడివేసి వున్న దానిలోనుంచి ఒక రూపాయి తీసి ”ఇది అతనికి ఇవ్వు ఇంకా అతనికి బాగా దప్పికగా ఉండి ఉంటుంది. కొంచెం మంచి నీళ్ళు కూడా తీసుకొనివెళ్ళు తొందరగా వెళ్ళు”.
నేను ఇష్టం లేకుండానే అమ్మ చెప్పిన పని పూర్తి చేశాను. ఇలా ప్రతిరోజు మా ముగ్గురిలో ఎవరో ఒకరు చదువు మధ్యలో ఆపేసి ఇంటి ముందుకు వచ్చిన బిక్షగాళ్ళ పని, సేవ చేయవలసి వచ్చేది.
అమ్మ వేసవికాలంలో తొందరగా ఇంటి పని ముగించుకుని ఇంటిముందుకు వచ్చిన ప్రతిఒక్కరికి దాహం తీర్చే పనిలో వుండేది. అమ్మచేసే పనిని చూసి నాన్న ‘చలివేంద్రం’ అని పిలవడం మొదలెట్టారు. రోజు మొత్తం గుంపులు గుంపులుగా జనాలు వస్తూనే వుండేవారు. అందరి దాహం తీరేది. ఒకరోజు ఉదయం అమ్మ ఒక ముసలి బిచ్చగత్తెకు వేడివేడి రొట్టె తయారుచేసి పెడుతోంది. కొన్ని ముఖ్యమైన వస్తువులు కనబడలేదు. అమ్మని వచ్చి వెదికి ఇవ్వమని నాన్న పిల్చినా కానీ, అమ్మ ఎంతసేపటికి రాకపోయేసరికి నాన్న కోపంతో ”ఇంటిముందు ఒక అన్నదాన సత్రమునే తెరిచేలా వున్నావే?” అని పోట్లాడసాగారు. అంతేకాకుండా ఆ ముదుసలిని కూడా భయపెట్టి వెళ్ళగొట్టారు.
ఆ సంఘటనకు అమ్మ మనసు చాలా బాధపడింది.
ఎవరితో ఏమీ మాట్లాడలేదు. రోజంతా అమ్మ అదోలా వుంది. సాయంకాలం నిశ్శబ్దంగా వంటపనిలో మునిగిపోయింది. నాన్న వెళ్ళి అమ్మని క్షమాపణ అడిగారు. ఇలా అప్పుడప్పుడూ అవుతూనే వుంటుంది. ఒకరోజు సుమేధ చేయి కాలింది. ఆమె హాస్పిటల్‌లో చేరింది. అప్పుడే అమ్మ మొదటిసారిగా హాస్పటల్‌లో ఒళ్ళు కాలిన వ్యక్తులు వుండే వార్డును, ఆ వార్డులలో వుండే వారి బాధలను కళ్ళారా చూసింది.
సుమేధ కూడా కళ్ళు తెరవని స్థితిలోనే వుంది. మందుల ప్రభావంతో నిద్రలోనే ఉంది. కాని నొప్పితో బాధపడుతూనే వుంది. అమ్మ ఆ వార్డులో 10 శాతం నుంచి 90 శాతం వరకు కాలిన గాయాలతో వున్న 20 మందిని రాత్రంతా మెలకువగానే వుండి చూస్తూనే వుంది. ఎవరైనా కొంచెం బాధతో అటుఇటు కదిలితే నిద్రపోతున్న నర్సులను బంధువులను లేపి వారికి అవసరమైనవి ఇప్పిస్తూనే వుంది. ఉదయాన్నే ఇంటికి వచ్చి పదిమందికి సరిపడా భోజనం/వంట వండుకుని తీసుకుని వెళ్ళేది. ఎవరైనా ఆకలితో వుండడం చూస్తే వారికి తినిపించేది.
అమ్మచేసే ఈ పిచ్చి పనులను చూసి మాకు విసుగు, చిరాగ్గా ఉండేది. కానీ అమ్మ మాత్రం వాటిని ఏమాత్రం లక్ష్యపెట్టేదికాదు. లెక్కచేసేది కాదు.
సుమేధ ఆసుపత్రినుంచి తిరిగివచ్చిన తరువాత కూడా అప్పుడప్పుడు అమ్మ హాస్పటల్‌కు వెళ్ళేది. ఒట్టిగా వెళ్ళడం మాత్రమే కాదు తనతో పాటు ఆహారపదార్ధాలు, పాతబట్టలు, కొంచెం డబ్బులను తీసుకొనివెళ్ళి అక్కడ కష్టాలలో వున్నవారికి సహాయం చేసి వచ్చేది.
నాన్నగారు అమ్మచేసే సమాజసేవా కార్యక్రమాలను అడ్డుకోవా లని ఆలోచించి ఇంటి ఖర్చుకోసం అమ్మకు ఇచ్చే డబ్బును తగ్గించి ఇవ్వనారంభించారు. భోజనంలో రెండు రకాల కూరలు, పచ్చడి, పప్పు, నెయ్యి, మజ్జిగ పులుసుతో అన్నం వడ్డించే అమ్మ హఠాత్తుగా అన్నీ తగ్గించేసింది. ప్లేటులో భోజన పదార్ధాలను చూసి నాన్న ఆశ్చర్యపోయారు. ”నీకు ఇంతకంటే తక్కువ రకం కూరగాయలు దొరకడం లేదా? నీకు కూరలు చేసే ఓపిక లేదా? రోజూ ఎంతో చక్కగా అన్ని రకాల వంటలను వడ్డించేదానివి? ఏమైంది నీకు? నా సంపాదన పెరుగుతుంది కానీ పళ్ళెంలో పదార్ధాలు తగ్గిపోతున్నాయి. నేను ఏమి నీకు డబ్బులకు కొదవ చేయడం లేదు కదా” అని విసురుతో అన్నం ముందు నుంచి లేచి వెళ్ళారు.
ఆ ఘటనతో అమ్మ నొచ్చుకుంది. ‘నావల్ల తప్పు జరిగింది. క్షమించమని’ అడిగింది. కానీ ఆ రాత్రంతా మేము ముగ్గురూ అమ్మమీద అలకతో మాట్లాడలేదు.
నేను అమ్మదగ్గరకు వెళ్ళి అమ్మకి నచ్చచెప్పి నాన్న ఇంటికోసం ఇస్తున్న డబ్బును ఇంటికే ఖర్చు పెట్టమన్నాను. ఆ మాటలకి అమ్మకి కోపం వచ్చి ”ఏమనుకుంటున్నారు మీరంతా? నేను మీ కళ్ళకి దొంగలాగా కనపడుతున్నానా?” అని తీవ్రస్వరంతో మాట్లాడింది. అదికాదమ్మా! మేము నిన్ను దొంగ అని ఎందుకు అనుకుంటాం? అలా ఏమీ అనుకోవడం లేదు. కానీ ఎందుకడుగుతున్నామంటే ఇంటిలో రోజురోజుకి ఆహారపదార్ధాలు తగ్గిపోతున్నాయి?’ అని ఎన్నివిధాలా అడిగినా అమ్మ దగ్గర్నుంచి సమాధానం లేదు.
మేము కూడా ఆ విషయాన్ని అంతటితో వదలకుండా మా మేనత్తకి చెప్పి ఆమెను తీసుకువచ్చి అడిగించాము. అయినప్పటికీ అమ్మ దగ్గరనుండి సమాధానం లేదు. చివరికి విసిగిపోయి అత్త నాన్నను ”నువ్వు మెత్తగా వుంటే వసుంధర ఇలాగే ఇల్లంతా సర్వనాశనం చేస్తుంది. ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. వారికి కట్నాలు ఇవ్వాలి, పెళ్ళిళ్ళు చేయాలి. డబ్బంతా సమాజసేవ కోసం ఖర్చు చేస్తే పిల్లల పెండ్లిళ్ళు ఎలా చేస్తావు?’ అని నాన్నమీద విరుచుకుపడి ఆమె వెళ్లిపోయింది.
కొన్ని రోజులకి మా అక్క పెళ్ళి నిశ్చయమయింది. అక్కకి నగలు, బంగారం పెట్టాలి. అమ్మ దగ్గర చాలా నగలు వున్నాయి. ”నీ దగ్గర ఉన్న నగలలో నుంచి ఒకవంతు నగలు తీసి పెద్ద అమ్మాయికి ఇవ్వమని’ అడిగారు నాన్న. అమ్మ అంగీకరించలేదు సరికదా ”అది నా స్త్రీ ధనం. నేను ఎందుకు ఇవ్వాలి? పిల్లలకి పెండ్లి చేయటం, నగలు చేయించటం తండ్రిగా మీ కర్తవ్యం, ధర్మం” అని చెప్పి వాదించింది. ఆఖరుకి చేసేదేమీ లేక నాన్న నగలు చేయించారు. పెండ్లి ఖర్చులతో పాటు బంగారం ఖర్చుకూడా అదనంగా నాన్నమీద పడింది. అనసూయ అక్కకి అమ్మ నగలలోనుంచి ఒక పెద్ద హారాన్ని తీసి అమ్మ బహుమతిగా ఇచ్చింది.
వివాహం అయిన తర్వాత అమ్మనాన్న ఇద్దరూ ఎడమొహం పెడమొహంగా ఉన్నారు. మా ఇద్దరికీ వీరి పరిస్థితి అర్థం కాలేదు. కానీ ఒకరోజు విషయమంతా తెలిసింది. వీరిద్దరి దెబ్బలాటకి కారణం అమ్మ నగలని, నాన్న వాటిని తీసుకెళ్ళి లాకరులో పెట్టారని, అందుకని అమ్మ నాన్నమీద కోపంగా ఉందని. ఒకరోజు అమ్మ నగల విషయంలో నాన్నతో గొడవపడింది. ”అవి నావి, నా స్త్రీధనం. నేను వాటిని ఎలా కావాలంటే అలా వాడుకుంటాను. వాటిని ఎందుకు లాకరులో పెట్టారు? లాకరు తాళం నాకెందుకు ఇవ్వరు? నేను పోలీసు కంప్లయింట్‌ ఇస్తాను” అని అమ్మ మాట్లాడిన మాటలకు మేమంతా నివ్వెరపోయాం.
ఇంటి నాలుగుగోడల మధ్య వుండే అమ్మకు స్త్రీ ధనం గురించి, భార్యాభర్తల అధికారం గురించి, హక్కుల గురించి ఎలా తెలిసింది? ‘లా’ చదువుతున్న నేను కూడా ఎప్పుడూ వాటి గురించి అమ్మకి చెప్పలేదు. ఒకటిరెండు రోజులు ఎవరూ అమ్మతో మాట్లాడలేదు. కానీ అమ్మ నిశ్శబ్దంగా, బాధగా ఉండడం చూసి నాన్న ఆఖరుకి లాకరు తాళం చెవి అమ్మచేతిలో పెట్టి ‘నీ నగలు నీ ఇష్టం. వాటి గురించి నేను ఇంక అడగను’ అని అనగానే అమ్మ మొహం ఆనందంతో వికసించింది. అమ్మకు ఏది ఇష్టమో అది చేయడం మాకు తప్పలేదు.
రోజులు గడిచిపోతున్నాయి. అమ్మ రోజులో 4, 5 గంటలు గుడిలోనే గడుపుతుంది. నేను కోర్టుకి, నాన్న ఆఫీసుకి, సుమిధ కాలేజీకి వెళుతూనే ఉన్నాము. మేము వచ్చేటప్పటికి అమ్మ బాగా అలసిపోయి వుంటుంది.
అమ్మ అలసిపోయి వుండడం కొద్ది రోజులుగా గమనిస్తున్న నాన్న ఒకరోజు ”వసుంధరా! ఎందుకు గుడిలో 4-5 గంటలు ఉంటావు? అంతసేపు గుడిలో పూజారి కూడా వుండడు. నీవు ఒక్కదానివే అక్కడ ఏం చేస్తున్నావు? ఇంటిలో వుండి కాస్త విశ్రాంతి తీసుకో” అని ఎంత చెప్పినా అమ్మ వినలేదు. సరికదా రోజుకన్నా ఇంకా ఎక్కువ సమయం బయట గడపనారంభించింది. ఒకరోజు వంటింట్లో వంటచేస్తూ పడిపోయింది. అమ్మ చాలా బలహీనంగా వుంది. కాలు విరిగింది. ఆసుపత్రిలో చేర్చవలసి వచ్చింది.
ఆరోజు రాత్రి ఒక అపరిచిత వ్యక్తి మా ఇంటి తలుపులు తట్టగానే నేనే తలుపు తెరిచాను. చీకటిలో తెలియని వ్యక్తిని చూసి నేను భయపడ్డాను. నా ఉద్దేశ్యం గమనించిన వ్యక్తి ”భయపడకమ్మా! నేను వసుంధరగారిని వెదుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. నిన్న గుడిలో ఆమె నోటినుంచి చాలా రక్తం కారింది. అది చూసి కంగారుపడి ఆమెను ఈరోజు ఆసుపత్రికి తీసుకువెళదామని అనుకున్నాం. కానీ ఆమె ఈరోజు గుడికి రాలేదు. ఆమె బాగానే వున్నారు కదా”.
”ఆమె బాగానే వున్నారు కానీ ఆమె ఇంటిలో లేదు. ఆమె కాలు విరిగింది. ఆసుపత్రిలో వున్నారు” అని చెప్పి చాలా విసురుగా తలుపు వేశాను.
నేను ఉదయాన్నే టిఫిను తీసుకుని ఆసుపత్రికి వెళ్ళేసరికి అక్కడ రాత్రి నేను చూసిన వ్యక్తి అమ్మ దగ్గర కూర్చుని మాట్లాడుతున్నాడు. ఆయనతో పాటు మరో ముగ్గురు నలుగురు తెలియని మనుషులున్నారు. వారిని నేను మా ఇంటి దగ్గర ఎప్పుడూ చూడలేదు. వారి వేషభాషలు కూడా చాలా వేరుగా వున్నాయి. నాకు వారు అక్కడ కూర్చోవడం ఇష్టం లేదు. కానీ అమ్మ మాత్రం చాలా సంతోషంగా నవ్వుతూ మాట్లాడుతోంది. నొప్పి మందులతో కాదు వారి రాకవలన కలిగిన ఆనందంతో తన నొప్పి గురించి, బాధ గురించి మరిచిపోయి వారితో ఎంతో సంతోషంగా మాట్లాడుతుంది. నన్ను చూసి ఆమె ఆనందం ఇంకా ఎక్కువయింది. ”అమ్మలూ! నీవు వీరితో రెట్టింపు పనిచేయించావు” అని నా తప్పును ఎత్తి చూపారు.
”జాగృతీ! నిన్న రాత్రి వారికి నువ్వు ఆసుపత్రి పేరు చెప్పకపోవడంవలన పట్టణంలో వున్న ఆసుపత్రులు అన్నీ తిరిగి చివరికి ఇక్కడకి వచ్చారు. అప్పటినుండి ఇక్కడే వుండి నన్ను  కనిపెట్టుకుని చూస్తున్నారు” అని అంది అమ్మ.
వారు అమ్మ అతిథులు అయినా సరే వారికి నేను ధన్యవాదాలు చెప్పలేదు సరికదా వారి మొహాలు చూడడానికి కూడా ఇష్టపడలేదు. ఇంట్లోవారికంటే గుడి దగ్గర పరిచయస్థులే ఎక్కువ అయినారు అనిపించింది. వారు కొంతసేపు వుండి వెళ్ళారు. అప్పుడప్పుడు నలుగురైదుగురు వ్యక్తులు వచ్చి వెళ్తూనే వున్నారు. అమ్మ వారిలో ఒకరిని అన్నా అని పిలిచేది. అతని పేరు తెలియదు కానీ మాలో ఎవరూ అతని పేరు కానీ, అతని వివరాలు కానీ తెలుసుకునే ప్రయత్నం చేయలేదు.
అమ్మ ఆసుపత్రిలో రక్తపు వాంతులు చేసుకుంది. డాక్టరు పరీక్షలో క్షయ అని తేలింది. కాలితో పాటు క్షయకు కూడా చికిత్స చేస్తున్నారు. కాలికి కట్టిన కట్టు విప్పారు. నర్సు, డాక్టరు వచ్చి ఈరోజు అమ్మని నడిపిస్తారు. అమ్మని ఇంటికి తీసుకు వెళ్ళొచ్చని చాలా ఉత్సాహంతో మేము ముగ్గురు ఆసుపత్రికి వెళ్ళాం. కానీ అక్కడ పరిస్థితి ఒక్కసారిగా తలక్రిందులయింది. అమ్మలేచి నుంచోవడం కాదుకదా కనీసం కళ్ళు తెరిచికూడా లేదు. అప్పటికే అమ్మ అన్నా అని పిలిచే వ్యక్తి వచ్చి వున్నాడు.
అతను ఏడుస్తూ చెప్తున్నాడు ”రాత్రి అక్క మాతో నేను ఇంకా జీవించాలని అనుకోవడం లేదు అన్నదని మేమందరం ఎంతో ధైర్యం చెప్పాం. ఆమె ఆరోగ్యం చూసి మేమంతా ఎంతో బాధపడ్డాం. ఉదయంకల్లా ఇలా అయింది. మాకెందుకో అనుమానంగా వుంది” అని ఏడుస్తూ చెప్తున్నాడు.
రాత్రి అమ్మ నిద్రపోయింది కానీ మరలా లేవలేదు. సహోదరుడు అనే వ్యక్తి ”అక్క మనకి చెప్పకుండా వెళ్లిపోయింది. ఇప్పుడు మనకి దిక్కు ఎవరు” అని ఏడుస్తున్నాడు. మృత్యువుకి కారణం ఏమిటి? డాక్టరు పరీక్షలు చేస్తున్నారు. కానీ చూస్తుండగానే 200 మంది ప్రజలు ఆసుపత్రికి వచ్చారు. అందరూ ఏడుస్తున్నారు.
డాక్టరు మా నాన్నగారిని తిడుతున్నారు ”మీరు ఏమి చేస్తున్నారు? ఇంతమందిని ఎందుకు పిలిపించారు? మీకు మీ భార్య చనిపోతుందని ముందుగానే తెలుసా?” అని.
నాన్నగారికి ఏమీ పాలుపోక కంగారుగా, భయంగా వుంది. ఒక పక్క కోలుకుంటున్న భార్య ఎందుకు చనిపోయిందో అర్థం కావడంలేదు. మరోపక్క హఠాత్తుగా తండోపతండాలుగా జనం రావటం, ఇదంతా చూసి నాన్న గాభరాపడిపోయి మాటాపలుకూ లేకుండా ఉండిపోయారు. అమ్మ వెళ్ళిపోయింది. ఆమె శరీరానికి చేయవలసిన కర్మకాండలను చేయడానికి ఉద్యుక్తులయ్యాం. మాకంటే ముందే (సోదరుడు) అతనే అన్ని పనులను చక్కపెడుతున్నాడు. ఎర్రటి అద్దకపు చీరను, పూలదండలను తెచ్చి అమ్మకు వాటిని కప్పాడు. అమ్మ శవం శ్మశానం దగ్గరకి వచ్చేటప్పటికి 500 మందికి పైగా అమ్మకోసం వచ్చే జనాలను చూసి వచ్చారు. ఏమి మాట్లాడాలో అర్థంకాని పరిస్థితి. పంతులుగారిని అతడే పిలిచాడు. ఇంతలో పంతులుగారు ”మీలో జాగృతి ఎవరు?” అని పిలిచారు. వారి కేకు ఈలోకంలోకి వచ్చిన నేను కళ్ళు తుడుచుకుని ”నేను” అని ముందుకు వచ్చాను. ”మీ అమ్మగారికి తలకొరివి నీవే పెట్టాలి. అది ఆమె ఆఖరి కోరిక, ఆమె కోరిక ప్రకారం ఆమెకు తలకొరివి నాచేత పెట్టించారు.
ఆ సహోదరుడు పంతులుగారి ప్రక్కనే నిలబడి అన్నీ చేయించడం, నేను చేసే ఈ పనికి సాక్షిగా అతను అక్కడే నిలబడి చూడడం నాకు చాలా కోపం తెప్పించింది. అమ్మ శ్రాద్ధ కార్యక్రమాలు చేయాలి, గుడిలో పంతులుగారికి భోజన ఏర్పాట్లు చేయమని చెప్పి వచ్చాను. వారందరూ ఏడుస్తూనే వున్నారు. భోజనం చేస్తున్నంతసేపు వారందరి కళ్ళవెంట నీళ్ళు కారుతూనే వున్నాయి.
అమ్మలేకుండా ఇంటిని నడపడం చాలా కష్టంగా వుంది. వంట చేయడం, ఇంట్లో ఏమేం వస్తువులు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకోవడం కష్టంగా వుంది. ప్రతి వస్తువు వెదుకుతుంటే మాకోసం కష్టపడే అమ్మ గుర్తుకువచ్చి ఏడుపు వచ్చేది. అమ్మ ఉన్నంతసేపు అమ్మ విలువ, అమ్మ చేసే పని విలువ తెలియనే లేదు. అమ్మపోయిన తరువాత అమ్మ విలువ తెలుస్తుంది.
అన్న అనే వ్యక్తి ఇంటికి రావటం ఆపేశాడు. మేము ఎంత నిర్లక్ష్యంగా ప్రవర్తించినప్పటికీ వచ్చే మనిషి అకస్మాత్తుగా రావడం మానేశాడు. అతను రాకపోవడం, మా మనసులకి కొంత ఊరటగా వుంది.
అమ్మ పోయి రెండు నెలలు గడిచిపోయింది. నెమ్మదిగా చలి ప్రారంభం అయింది.
నాన్నగారికి స్వెట్టర్‌కోసమని బీరువా తెరిచి స్వెట్టర్‌ తీస్తుండగా లాకరు తాళం చెవి కింద పడింది. నాన్న దానిని చూసి మరలా బాధ పడడం మొదలుపెట్టారు. తాళం చెవిని నిమురుతూ దాచుకునేవారు.
‘ఏమైంది నాన్నా’ అని అడిగితే ”ఇది అమ్మ తాళం చెవి. అమ్మకి, దీనికి ఎంత సంబంధమో కదా. తన నగలు అన్నా, తాళం చెవి అన్నా ఎంత ఇష్టమో కదా! బంగారంలాంటి ఆ అమ్మేలేనపుడు ఆ బంగారము కూడా మనకి మట్టితో సమానం. అమ్మ నన్ను కూడా నమ్మలేదు. తాళం తీసుకున్నందుకే గొడవ చేసింది” అని నాన్న బాధపడేవారు.
”నాన్నా! మీరే అనేవారు కదా ఆడవాళ్ళకి నగలంటే చాలా వ్యామోహమని. బహుశా అదే కావచ్చు. మీరు బాధపడకండి” అని ఎంతో నచ్చచెప్పాం. అలా మూడు నాలుగు రోజులు గడిచాయి. ప్రతిరోజు ఆఫీసుకు వెళుతూ తాళం చెవి చూసుకుని బాధపడేవారు. ఒకరోజు బట్టలని తీసి సర్దుతుంటే బట్టల మధ్యలోనుంచి రెండు బరువైన ప్యాకెట్లు కిందపడినాయి. ఒకదాని మీద నాపేరు, ఇంకోదానిమీద చెల్లి పేరు రాసి వున్నాయి. తెరిచి చూస్తే పెద్ద పెద్ద నగల హారాలు.
నేను, నాన్న బ్యాంకుకు వెళ్ళి అమ్మ లాకరు తెరవాలని నిర్ణయించుకున్నాం. నాన్న తనను తాను సంభాళించుకుంటున్నారు. నగలని చూసి అమ్మ గుర్తుకువచ్చి ఏడుస్తారని నేను నాన్నని గట్టిగా పట్టుకుని నిలబడ్డాను. లాకరు తలుపు తెరిచాం. లోపల అంతా చీకటి. అందులో నగలు వుంటే లైటు అవసరమే వుండదు. ఖాళీ లాకరును చూసి మాకు ఆశ్చర్యమేసింది.
కోపంతో నాన్న మేనేజరు దగ్గరకు వెళ్ళి ”పోలీసు కంప్లయింట్‌ చేస్తా” ననగా, మేనేజరు ”ముందు రిజిస్టర్‌ చూసి తరువాత మీకు తోచింది మీరు చేసుకోండని” రిజిస్టర్‌ ఇచ్చారు. ”ఆమె ప్రతి నెలా వచ్చేవారు. నగలు తీయడం మేము చూడలేదు. కాని ఆమె మాత్రం లాకరు తెరిచేవారు. మేము ఏం చేస్తాము? లాకరు తెరిచి ఆమె నగలు ఆమె తీసుకుంటుంటే మేము ఏం చేస్తాం?” అని సమాధానం చెప్పి వెళ్ళిపోయారు.
నగలకు సంబంధించిన పెద్ద లిస్టు ఇంట్లో వుంది. సహోదరునితో మేము లాకరులో నగలు లేని విషయం చెప్పనేలేదు. కాని అమ్మ గుడిలో 5, 6 గంటలు ఏమి చేసిందో తెలుసుకోవాలని అనుకున్నాం.
అతని దగ్గరకు వెళ్ళి అడిగాము. అతను సున్నితంగా అమ్మ మాటలు చెప్పాడు. ”గుడిలో భగవంతుని ముందు గంట కొట్టి హారతి కళ్ళకద్దుకుంటే ఏమి వస్తుంది? ఆమె ఆసుపత్రికి వెళ్ళేది, బీదలకు భోజనం, డబ్బులు, రగ్గులు, బట్టలు పంచి పెట్టేది. ఎంతోమందికి కాళ్ళు పెట్టించింది. మరి ఎంతోమందికి చూపు రావటానికి కారణమయింది. కొంతమందికి గుండె ఆపరేషను చేయించింది. అందుకే అమ్మ చనిపోయిన రోజున ఎవరూ చెప్పకుండా అంతమంది ఆఖరిసారిగా అమ్మను చూడటానికి వచ్చారు. అమ్మ చనిపోయిన విషయం చెప్పి వుంటే ఇంకా ఎంతమంది వచ్చేవారో! ఆమె చాలా డబ్బులు ఖర్చు పెట్టి నాకు గుండె ఆపరేషన్‌ చేయించింది. ఆమె నా హృదయంలో కొలువైన దేవత. ఆమె మమ్మల్ని వదలి వెళ్లింది” అని ఏడ్చేసాడు.
నాకు తెలియకుండానే సహోదరుడిని పట్టుకుని నేను కూడా ఏడ్చేశాను. నిజంగానే అతను అమ్మకి అన్న అన్పించాడు. నేను కేవలం అమ్మకోసం ఏడ్చాను. అమ్మ మాకు దూరం అయిపోయిందని! అమ్మ లేకపోతే ఎలా అని స్వార్థంతో ఏడ్చాను కానీ ఎప్పుడూ అమ్మ చేసే సమాజసేవని మేము మెచ్చుకోలేదు. రోగులకు చేసే సేవలను మేము ఇష్టపడలేదు. అమ్మలేని లోటు వాళ్ళకి తీరనిది. కొద్ది రోజులవరకు మేము అమ్మని, అమ్మ చేసే పనులను తలుచుకుంటూ బాధపడుతూ వుండిపోయాం. ఏమీ చదువుకోని అమ్మ సమాజం కోసం తన స్త్రీ ధనంతో ఎంతో చేసింది.
అమ్మ వదలివెళ్ళిన పనులను మా ద్వారా పూర్తి చేయాలని భావించాం. అందుకోసం ఈ సంస్థను స్థాపించాం. ఈ సంస్థ పేరు ‘వసుంధరా జనకళ్యాణ సంస్థ’ అని చెప్పి వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్న జాగృతి ఏడుపుతో హాలంతా నిశ్శబ్దమైంది. అక్కడ వున్న ప్రతి ఒక్కరి కంట కన్నీరు కన్పించింది. అందరూ ఒక్క నిమిషం మౌనం పాటించి ఆమెకు శ్రద్ధాంజలి ఘటించారు. తరువాత ఆగకుండా చప్పట్లు మ్రోగుతూనే వున్నాయి.
వసుంధర చేసిన మంచి పనులను, ఆమె నిరాడంబరత్వాన్ని, నిస్వార్ధ సేవా గుణాన్ని, అభాగ్యులకోసం తన నగలను నిస్వార్ధంగా ఖర్చుచేసిన వసుంధర మంచి మనస్సుకు అందరూ అభినందనలు తెలిపారు. వారి అభినందనలు చూసి జాగృతి ముఖంలో ఆనందంతో నిండిన గర్వం తొణికిసలాడింది.

Share
This entry was posted in కధానికలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో