హృదయ శల్యము – మనోవిశ్లేషణ

 డా|| వి. త్రివేణి
20వ శతాబ్ది ఆరంభంలో సిగ్మండ్‌ ఫ్రాయిడ్‌ మనిషిలోని మానసిక ప్రవృత్తిని తెలుపుతూ మనోవిశ్లేషణా సిద్ధాంతాలను రూపొందించారు. ప్రాచీన గ్రీకు మైథాలజీని, గ్రీకు సాహిత్యంలోని వ్యక్తులను, పాత్రలను, షేక్‌స్పియర్‌ నాటకాలలోని పాత్రలను మొదలగునవి ఉదాహరణలుగా స్వీకరించి మనస్తత్వ విశ్లేషణకు పూనుకొన్నారు.
దీనిని బట్టి ఫ్రాయిడ్‌ కంటే పూర్వమే వివిధ సృజన సాహిత్యాలలో మనోవిశ్లేషణకు లొంగిన పాత్రల చిత్రీకరణ జరిగిందని గ్రహించవచ్చు. రచయితల వాస్తవిక చిత్రణలో మనస్తత్వ విశ్లేషణ అంతర్భూతమైందనీ చెప్పవచ్చు. మనోవిశ్లేషణా పద్ధతులు అటు పాశ్చాత్య సాహిత్యాలతో పాటు ఇటు ఆధునిక తెలుగుసాహిత్య ప్రక్రియల్లోని రచనలను, పాత్రలను ప్రభావితం చేశాయి. మానసిక ప్రవర్తనను అధ్యయనం చేశాయి.
తెలంగాణ కథాసాహిత్యం మనస్తత్వ ప్రతిబింబ లక్షణాలకు సరిసమానమైంది. తొలితరం తెలంగాణ కథల్లోని పాత్రల అంతరంగం మనోవిశ్లేషణాపరంగా అధ్యయనం చేయటానికి అవకాశం ఏర్పడుతుంది. తెలంగాణ తొలితరం రచయితలు ఫ్రాయిడ్‌ సిద్ధాంతాలకంటే ముందుగానే రచించిన తమ కథల్లో పాత్రల మానసిక స్థితిగతులను, అంతఃసంఘర్షణలను ప్రతిబింబింపచేశారు. మానవ ఆలోచనా సరళి, హృదయమార్దవం, పాత్రల చిత్రీకరణలో రచయితల తమదైన ప్రత్యేక శైలిని కనబరిచారు. తెలంగాణ రచయితల కాలాదులు, వారి జీవన నేపథ్యాలు, నాటి రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు వేరైనా, తెలంగాణ సాంస్కృతిక జీవితాన్ని విభిన్నరీతిలో అభివర్ణించారు. యదార్థమైన మానవ ప్రవర్తనలో గల వివిధ చిత్తవృత్తులను ఈ కథలు తెలుపుతాయి. మాడపాటి హనుమంతరావు, ఒద్దిరాజు సోదరులు, ఆదిరాజు వీరభద్రరావు, నందగిరి వెంకటరావు, ఎల్లాప్రెగడ సీతాకుమారి, నందగిరి ఇందిరాదేవి, పొట్లపల్లి రామారావు, పి.వి.నరసింహారావు, ఇటికాల నీలకంఠరావు, మందరామారెడ్డి,  ఇల్లిందల సరస్వతీదేవి వంటి తొలితరం తెలంగాణరచయితల కథలు మనోవిశ్లేషణా పరిధిలోకి వస్తాయి. వీరి కథల్లోని పాత్రల మనశ్చర్యలు, పాత్రల అంతరంగపు సొగసులోని కల్పనలు, చైతన్య స్రవంతికి చెందిన పాత్రల మనోసంఘర్షణలు మొదలగునవి మనోవిశ్లేషణా పద్ధతుల్లో అధ్యయనం చేయవచ్చు.
మనస్తత్వశాస్త్ర సూత్రాల ఆధారంగా సాహిత్యాన్ని అధ్యయనం చేసిన వారిలో సిగ్మండ్‌ ఫ్రాయిడ్‌ ముఖ్యులు. గ్రీకు, ఆంగ్ల సాహిత్యాల్లోని వ్యక్తుల జీవితాలను, పాత్రల ప్రవృత్తులను విశ్లేషిస్తూ తద్వారా రచయితల మానసిక లోతులను కనుగొన్నారు. ఫ్రాయిడ్‌ ప్రతిపాదించిన ”మనోవిశ్లేషణ సిద్ధాంతం” (ఊనీలిళిజీగి ళితీ ఆరీగిబీనీళి జుదీబిజిగిరీరిరీ) లో పై విషయ నేపథ్యం మాత్రమే కనిపిస్తుంది. ఫ్రాయిడ్‌ తన సిద్ధాంతంలో ఎక్కువగా ”అచేతన”కు ప్రాధాన్యత ఇచ్చారు. మానవుడి మానసిక, శారీరక ప్రవర్తనా వైచిత్రికి మూలకారణం అచేతనంలో దొరుకుతుంది. ఫ్రాయిడ్‌ మానవుని మస్తిష్కంలో మూడుభాగాలు ఉన్నాయని అంటారు. 1. చేతనం (్పుళిదీరీబీరిళితిరీ), ఈ చేతనంలో ఉండే విషయాలను వ్యక్తి తెలుసుకోగలుగుతాడు. 2. ఉపచేతనం (ఐతిలీ-్పుళిదీరీబీరిళితిరీ) దీనిలోని విషయాలు వ్యక్తికీ తెలిసీ తెలియని స్థితిలో ఉంటాయి. 3. అచేతనం (ఏదీ-్పుళిదీరీబీరిళితిరీ) అచేతనంలో ఉండే అనుభవాలు కోరికలు బయటికి తెలియవు. అచేతనంలోని విషయాలు వ్యక్తి ప్రవర్తనను విచిత్రంగా నియంత్రిస్తాయి. అచేతనమనస్తత్వ స్థితి వ్యక్తి ప్రవర్తనను నిర్ణయిస్తుందని ఫ్రాయిడ్‌ అభిప్రాయం. పై మూడు విభాగాలకు సంబంధించిన మూడు ప్రకృతులు కూడా మనిషి ప్రవర్తనను తెలుపుతాయని ఫ్రాయిడ్‌ వివరించారు. 1. ఇడ్‌ (|ఖి), 2. ఇగో (జూవీళి), 3. సూపర్‌ ఇగో (ఐతిచీలిజీ జూవీళి) అచేతనానికి సంబంధించింది. ఇందులోని కోరికలు వ్యక్తికి తెలుసు. ఇది ఆ కోరికలను ప్రకటిస్తుందే తప్ప క్రియారూపంలో నెరవేర్చలేదు. ”జూవీళి” వ్యక్తిలోని కోరికలను, ఆలోచనలను బహిర్గతపరిచి క్రియారూపంలో పెడుతుంది. ”ఐతిచీలిజీ జూవీళి” వ్యక్తిలోని కోరికలను క్రియారూపంలో పెట్టేముందు నీతికి, న్యాయవిచక్షణకు, సంఘస్ఫురణకు కట్టిపడవేస్తుంది. విద్యాసంస్కారంతో, సంస్కృతుల ప్రభావంతో, పరిసరాల అవగాహనతో ”ఐతిచీలిజీ జూవీళి” వ్యక్తిలోని ప్రవర్తనాసరళినీ క్రమబద్ధీకరిస్తుంది. వ్యక్తిని సరియైన మార్గంలో నడపటానికి సహకరిస్తుంది. ఈ మూడింటి మధ్య జరిగే సంఘర్షణల అణచివేత (ఐతిచీచీజీలిరీరీరిళిదీ), దమన (ష్ట్రలిచీజీలిరీరీరిళిదీ) కార్యాలను ఫ్రాయిడ్‌ వివరించారు. ఈ సంఘర్షణ వ్యక్తికి తెలియక జరిగిపోతాయని పేర్కొన్నారు.
ఫ్రాయిడ్‌ ఒక వ్యక్తిలోని బాల్యదశలో అంకురించిన లైంగిక భావాల ప్రాధాన్యతను (|దీతీబిదీశిరిజిలి ఐలినితిబిజిరిశిగి) వర్ణించారు. ఈడిపస్‌ కాంప్లెక్స్‌ (ంలిఖిరిచీతిరీ ్పుళిళీచీజిలిని), ఎలక్ట్రా కాంప్లెక్ప్‌ (జూజిలిబీశిజీబి ్పుళిళీచీజిలిని) వంటి విపరీత ప్రవృత్తులు ఏర్పడి, మనిషి జీవితంలో సంక్షోభాలకు దారితీయడం వంటివి కనిపిస్తాయి. ఈ రెండు కోరికలు మనిషి ప్రవర్తనను విచిత్రంగా చిత్రించటం, లైంగిక ప్రవృత్తికి ప్రాధాన్యం ఇవ్వడం గమనించవచ్చు. కలల సిద్ధాంతాన్ని కూడా ఫ్రాయిడ్‌ మనోవిశ్లేషణలో రూపొందించారు. ఇవి ఉపచేతనంలో నిండిఉంటాయి. అవే స్వప్న రూపంలో బయటపడుతుంటాయి. కాని మనిషి బలమైన కోరికలు, అనుభవాలు అచేతనంలో ఉండి వ్యక్తిని సంఘర్షణకు, నిరాశకు, అసంతృప్తికి గురిచేస్తుంటాయి.
ఫ్రాయిడ్‌ తర్వాత మానవుని మస్తిష్కాన్ని అధ్యయనం చేసిన వారిలో ఆడ్లర్‌, యూంగ్‌లు కనిపిస్తారు. ఆడ్లర్‌ క్రీ.శ. 1902-08 మధ్యకాలంలో ఫ్రాయిడ్‌తో కలిసి పనిచేసి, ఫ్రాయిడ్‌ చెప్పిన సూత్రాలను సమర్ధించటమే గాక, ఇంకా కొన్ని విషయాలను తెలియజేశారు. మనిషిలోని అందరికన్నా అగ్రస్థానంలో ఉండాలనే కాంక్ష (ఐశిజీరిఖీరిదీవీ తీళిజీ రీతిచీలిజీరిళిజీరిశిగి) ఉంటుందని ఆడ్లర్‌ అంటారు. ఇది అన్నిటికన్నా మించిన కాంక్ష  ఇది. దీనిని తీర్చుకోడానికి మానవుడు ప్రయత్నిస్తూనే ఉంటాడని వివరించారు. ఈ వాదం ఫ్రాయిడ్‌ ప్రేమ కాంక్ష కంటే అధిక బలమైందని అనుకోవచ్చు. మనిషిలో న్యూనతాభావం (|దీతీలిజీరిళిజీరిశిగి బీళిళీచీజిలిని), ఆధిక్యతాభావం (ఐతిచీలిజీరిళిజీరిశిగి ్పుళిళీచీజిలిని) ఉంటాయని అంటారు. ఈ విధంగా వ్యక్తి తన ఆత్మన్యూనతా భావనను ఆత్మ ఆధిక్యతాభావనగా మార్చుకోవటానికి ప్రయత్నిస్తుంటాడని, ఇలాంటి భావనతోనే వ్యక్తి తన జీవితాన్ని గడిపేస్తుంటాడని ఆడ్లర్‌ వివరణ. ఈయన సిద్ధాంతాలన్నీ వైయక్తిక మనోవిజ్ఞాన శాస్త్రాల (|దీఖిరిఖీరిఖితిబిజి ఆరీగిబీనీళిజిళివీగి) కి సంబంధించినవి.
మనోవిశ్లేషకులలో సి.జి.యూంగ్‌ కూడా ఫ్రాయిడ్‌తో పనిచేసినవాడే. ఇతని సిద్ధాంతం విశ్లేషణాత్మక మనోవిజ్ఞానాన్ని (జుదీబిజిగిశిరిబీబిజి ఆరీగిబీనీళిజిళివీగి)కి సంబంధించింది. ఫ్రాయిడ్‌, ఆడ్లర్‌ల సిద్ధాంతాలను సమన్వయం చేస్తూ దీనికొక నూతన ధోరణిలో యూంగ్‌ రూపొందించారు. ఈయన సిద్ధాంతం ప్రకారం వ్యక్తి యొక్క ”వైయక్తిక అచేతనం” (|దీఖిరిఖీరిఖితిబిజి తిదీబీళిదీరీబీరిళితిరీ), క్రింది పొరల్లో అంటే ”సమిష్టి లేదా ఉమ్మడి అచేతనం” (్పుళిజిజిలిబీశిరిఖీలి తిదీబీళిదీరీబీరిళితిరీ) వ్యక్తిని నియంత్రిస్తుంటుంది. ఇక్కడ సామూహిక అచేతనంలో వ్యక్తి పుట్టుక కంటే పూర్వమే నిలిచిపోయిన భావాలు, సాంప్రదాయాలు నిక్షిప్తమై వ్యక్తి ప్రవర్తనను నిర్ణయిస్తుంటాయి. బాల్యం నుంచి వ్యక్తి తనలో చోటుచేసుకున్న ”ప్రాగ్రూపాల” లేదా మూలరూపాల (జుజీబీనీలి శిగిచీలిరీ) ప్రభావానికి అధీనుడౌతాడు.
సృజనాత్మక రచనలను మనోవిశ్లేషణా నేపథ్యంలో విమర్శించేటప్పుడు ఈ క్రింది లక్షణాలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. 1. పాత్రల ప్రవర్తనలోని వైచిత్రిని మనోవిశ్లేషణ సిద్ధాంత నేపథ్యం నుంచి విశ్లేషించడం. 2. రచయిత జీవించిన కాలం నాటి పరిస్థితుల నుంచి, రచయిత అంతరంగ ప్రవృత్తిని అంచనా వెయ్యడం నుంచి, రచయిత తను సృష్టించిన పాత్రల నేపథ్యం నుంచి విశ్లేషించడం, 3. శైశవానుభవాలు అచేతనంలో ఉండి పెరిగి పెద్దైన తరవాత అతడి ప్రవర్తనను ప్రభావితం చేసే స్థితికి విశ్లేషించడం.
అంతస్సంఘర్షణలు వ్యక్తుల్లో పైకి కన్పించే సహజ గుణాల కతీతంగా జరుగుతుంటాయి. మనోభావానుగుణంగా, స్వభావచిత్రంగా మదింపబడతాయి. సానుకూల పరిస్థితులుగానీ, ప్రతికూల పరిస్థితులు గానీ ఏర్పడినప్పుడు బహిరంగంగా ప్రస్ఫుటమవుతాయి. మానవ జీవితంలో మమేకమై ప్రేమ, స్నేహం, కరుణ, క్షమాగుణం, స్పందన, అభిమానం, ఓర్పు వంటి వాటిల్లోనే గాక ఈర్ష్య, అసూయ, అసహనం, అనిశ్చిత మొదలగు రాగద్వేషాల్లోనూ వెల్లడవుతాయి.
మనోవిశ్లేషణా సిద్ధాంతాలు వ్యక్తుల్లోని మనస్సంఘర్షణల్ని అధ్యయనం చేయటానికి సహకరిస్తాయి.  మనిషి మరో ప్రవృత్తికి సంబంధించిన అంశాల్ని విశ్లేషిస్తాయి. మనిషి అంతరంగపు పొరల్లోని మనస్థితిని అన్వేషించి మనిషిని, మనిషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తాయి.
ఈ మనస్తత్వ లక్షణాలన్నీ తెలంగాణా కథా సాహిత్యాన్ని అధ్యయనం చేయడానికి గ్రహింపదగినవి. తెలంగాణా భౌగోళిక పరిస్థితులు, భాష-మాండలికాలు, నిజాం పాలన, భూస్వామ్య విధానాలు మొదలగు అంశాలను తెలంగాణా తొలితరం కథలు వివిధ దృక్కోణాల్లో వెలువరించాయి. అంతస్సంఘర్షణలను విశ్లేషించాయి. తెలంగాణా కథావికాసంపై గల అపవాదును తొలగించాయి.
”తెలంగాణాకథ వికాసానికి అవరోధంగా నిలిచిన ప్రతికూల వాస్తవికతలో మరొక ముఖ్యమైన అంశం – తెలంగాణలో తెలుగు మధ్యతరగతి అవతరించకపోవడం. సామాజిక విలువల ఘర్షణకు, పరిణామాల స్పందనకు మధ్యతరగతి ఒక అద్భుతమైన వేదిక, వాహిక కూడా. జీవిత వాస్తవికత సాపేక్షంగా నిశ్చలస్థితిలో ఉన్ననాటి ఉన్నత తరగతుల జీవితం కానీ, అట్టడుగు జీవితాలు కానీ కథనానికి గొప్ప వస్తువులను ఇవ్వలేవు. కథా సాహిత్యానికి ఇతివృత్తాలను, పాఠకులను కూడా మధ్యతరగతే అందించాలి” (తనను తాను తెలుసుకుంటున్న తెలంగాణా పు.5) అని తెలంగాణా కథాపరిశోధకులు కె.శ్రీనివాస్‌ పేర్కొన్నారు. మధ్యతరగతి భావాలు, అభిప్రాయాలు సహజంగా ప్రభావితం అవుతాయి. అవి నేరుగా కథాసాహిత్యంలోకి చొచ్చుకొని పోతాయి. అటు ఉన్నత తరగతికి చెందినవారు, ఇటు అట్టడుగు తరగతికి చెందినవారిలో అంతగా భావప్రాప్తి సంభవించదు. మనస్సంఘర్షణలు, ఒడిదుడుకులు, మానసిక వైవిధ్యం వంటి అంశాల మధ్యతరగతి వర్గాలలో కన్పించినంతగా ఇతరులలో గోచరించవు. నిజాం నిరంకుశ పాలనలో మనోవ్యాకులతకు, శారీరక హింసలకు గురైన తెలంగాణా ప్రజల వ్యతిరేక ఉద్యమ నేపథ్యంలో కదం తొక్కారు. సృజనాత్మక రచనలకు పూనుకున్నారు. అందులో భాగంగానే మొదట తెలంగాణలో కవిత్వం, నవల, కథాసాహిత్యాలు వెలిసాయి.
ప్రముఖ రచయిత్రి డా|| ముదిగంటి సుజాతారెడ్డి ”తొలితరం తెలంగాణా కథలు” సంకలన గ్రంథం బట్టి చూస్తే మొట్టమొదటి తెలంగాణా కథ మాడపాటి హనుమంతరావు గారి ”హృదయశల్యము”. మాడపాటి విద్యావంతుడైనా, మధ్యతరగతి వర్గానికి చెందినవాడు. 1910 ఫిబ్రవరిలో గురజాడ ”దిద్దుబాటు” ఆంధ్రపత్రికలో అచ్చయితే, అదే పత్రికలో 1912 జనవరిలో మాడపాటి ”హృదయశల్యము” అచ్చయింది.
రచించడం వేరు, అచ్చు వేయడం వేరు. కథను ముందే రాసినా, అచ్చువేయడంలో జాప్యం జరగవచ్చు. మాడపాటి కథపై కూడా తెలంగాణా విమర్శకులు ఇదే సందేహాన్ని వ్యక్తపరిచారు. తెలంగాణా కథా పరిశోధకులు ముదిగంటి సుజాతారెడ్డి ఈ కథపై గల సంశయాన్ని తెలుపుతూ ”ఆంధ్ర భారతికి కథను మొదట పంపింది మాడపాటియేనేమో! అది అచ్చుకాక మూలన పడి ఉండి మొదటి కథ అన్న కీర్తిని దక్కించుకోలేకపోయిందా! ఒకవేళ ఆంధ్ర భారతిలో అచ్చయిన తీరుతెన్నులను తవ్వి వెలికితీస్తే దీనిలోని సత్యం బయటపడుతుందేమో! ఆఖరికి తెలుగులో రెండో కథారచయిత అన్న పేరయినా మాడపాటికి దక్కాలి” అని అన్నారు. తెలుగు సాహిత్యంలో ”హృదయ శల్యము”ను తొలితరం కథగా నిల్పడం కోసం నేటి తెలంగాణా కథ పరిశోధకులమైన మనందరిపైనా బాధ్యత ఉందని గుర్తుంచుకోవాలి. మాడపాటి 13 కథల్లో రెండు కథలు స్వతంత్రమైనవి కాగా, పదకొండు ప్రేమ్‌చంద్‌ కథలకు స్వేచ్ఛానువాదాలు చేశారు. ఇందులో ఏడు కథలను 1915లో మచిలీపట్నంలోని సరస్వతి నికేతనము వారు ”మల్లికాగుచ్ఛము” పేరుతో, మరో రెండు కథలను 1940లో అణాగ్రంథమాల వారు ”మాలతీ గుచ్ఛము” పేరుతో, తర్వాత మాడపాటి 10 కథలను 1984లో ఆంధ్ర సారస్వత పరిషత్తు ”మల్లికా గుచ్ఛము” పేరుతో ప్రచురించాయి. తొలితరం తెలంగాణా కథల మొదటి పుస్తకంగా మాడపాటి ఏడు కథల ”మల్లికా గుచ్ఛము”ను పేర్కొనవచ్చు.
ఆనాడు హైదరాబాదుకు చెందిన విద్యావంతులు అత్యంత సహజంగా ఉర్దూ వచన సాహిత్య ప్రభావంలో పడ్డారు. ఇది పరాయి భాషే అయినా హైదరాబాదీయులకు ఉర్దూ రెండో సొంత భాషగా మారిపోయింది. పారశీ స్థానంలో ఉర్దూ వ్యాప్తి స్వయంగా ఒక దేశీయతను రూపుదిద్దుకుంది. స్వేచ్ఛావిహంగంలా విహరించింది. మాడపాట,ి ప్రేమ్‌చంద్‌ కథల అనువాదంలోని రచనా విధానంలోనూ, గురజాడ సమకాలంలోని కథల రచనా విధానంలోనూ విభేదం కన్పిస్తుంది. తెలుగు కథా సాహిత్యం నుంచి తెలంగాణా ఆధునిక సాహిత్య వికాసం స్వయంగా ఒక ప్రత్యేకమైన పాయగా విభజించబడింది. అందుకే కె.శ్రీనివాస్‌ మాడపాటి రచనా వైవిధ్యాన్ని గూర్చి తెలుపుతూ ”మాడపాటి హనుమంతరావు చేత రాయించింది ఉత్తరాది ఉర్దూ సాహిత్యమే తప్ప, ఇంగ్లీషు సాహిత్యమో, బెంగాలీ సాహిత్యమో కాదు” అని అన్నారు. అలా అని మాడపాటి వీరేశలింగం, గురజాడల సాహిత్యాలపైన విద్వేషాన్ని చూపలేదు. వారి సాహిత్యాలను చదివి, అందులోని సంస్కారదృష్టిని ప్రశంసించేవారు. నాటి తెలుగు కథా సమకాల రచనా విధానంలో మాడపాటి శైలి విభిన్నమైందని, ఆయన జీవితచరిత్ర వ్రాసిన ప్రసిద్ధ చరిత్రకారుడు ఆదిరాజు వీరభద్రరావు తెలుపుతూ ”ఆంధ్రములో కథానికలు నూతనపద్ధతుల మీద మొట్టమొదట వ్రాసిన కీర్తి హనుమంతరావుకే చెందవలసి యున్నది” అని వివరించారు. ఈ మాటలో ఎంతో విశ్వసనీయత ఉంది. మొదటి నుంచీ తెలంగాణా కథలు సామాజిక సమస్యలతో, ప్రజల జీవన మనస్సంఘర్షణలతో రచింపబడ్డాయి.
మాడపాటి సామాజికోద్యమాల్లో భాగంగా స్త్రీ జనోద్ధరణకూ, స్త్రీ విద్యకు కృషి చేశారు. ఆయన స్వతంత్రమైన కథలు ”హృదయ శల్యము, నేనే”లో సంఘ సంస్కరణాభావాలు కన్పిస్తాయి. ముఖ్యంగా ”హృదయశల్యము”లో మగవాళ్ళు ఆడవాళ్ళను అకారణంగా అనుమానించటాన్ని, శీలాన్ని శంకించటాన్ని వస్తువుగా గ్రహించారు. మాడపాటి కాలంనాటి రోజుల్లో అప్పుడప్పుడే స్త్రీలు గడప దాటి బయటి ప్రపంచంలోకి వస్తున్నారు. ఉద్యమాల్లో మగవాళ్ళతో కలిసి పనిచేస్తున్నారు. అలాంటి సందర్భంలో నిష్కారణంగా మగవాళ్ళు ఆడవాళ్ళని శంకించడం సరికాదని, ఒక గొప్ప సందేశాన్నందిస్తూ ఆయన ఈ కథను రచించారు.
ఈ కథలో కాకతీయ సామ్రాజ్ఞి రాణి రుద్రమదేవి ఒక పాత్రగా ప్రవేశిస్తుంది. అందువల్ల ఈ కథ చారిత్రక కథగా కూడా భాసిస్తుంది. అయినా ఇందులో సామాజిక సమస్యే చిత్రింపబడింది. భార్యాభర్తల మనస్తత్వాన్ని, అంతస్సంఘర్షణల్ని మాడపాటి అతిసహజంగా వర్ణించారు. రుద్రమదేవిని ప్రవేశపెట్టడం వల్ల, ఓరుగల్లు నగర ప్రాంతంలో కథా సంఘటన జరిగిందని వర్ణించడం వల్ల ఈ కథ తెలంగాణా వాతావరణాన్ని, తెలంగాణాతనాన్ని సంతరించుకొంది. త్రిలింగ రాజ్యాన్ని కాకతి రుద్రమదేవి మహావైభవంగా పరిపాలించింది. తన రాజ్య యోగక్షేమాలు తెలుసుకోవడం కోసం రుద్రమదేవి పురుషవేషంలో సంచరించేదనేది చారిత్రక సత్యం. కాకతీయుల కాలంలో ఓరుగల్లుకు, అంబాల గ్రామానికి ఎక్కువగా రాకపోకలు జరుగుతుండేవి. ఈ గ్రామం దేవికి చాలా ఇష్టమైంది. కాకతీయ సామ్రాజ్య ధురీణయైౖన రుద్రమదేవి తన పేరుమీదగానే ”అంబాల” అనే నామంతో గ్రామాన్ని నిర్మించినట్లుగా, రుద్రమదేవికి ”అంబ” అనే నామాంతరం ఉన్నట్లుగా, విశిష్టమైన చరిత్ర కలదిగా ”ప్రతాపచరిత్రము” అనే గ్రంథం చెపుతుంది. ఈ రెండు గ్రామాల మధ్య ఉన్న సాంద్రమైన అరణ్యం దోపిడీగాళ్ళకు ఆశ్రయమైంది. పురుష వేషంలో ఉన్న రుద్రమదేవి ఓరుగల్లునుంచి అంబాలకు వెళుతుంది. అదే మార్గంలో అంబాల నుంచి ఓరుగల్లుకు పల్లకీ యందున్న యువతి (యమున) తన భర్త అశ్వారూఢుడైన ప్రతాపుడితో కూడి వస్తూ దోపిడీ నాయకుని చేతిలో చిక్కుతుంది. ఇదీ కథారంభం.
మాడపాటి ”హృదయ శల్యము” (1912) కథ రచించినప్పటికీ ఫ్రాయిడ్‌ సిద్ధాంతాలు ప్రచారంలో లేవు. అయినా ఇందులోని పాత్ర చిత్రణ, కథాశిల్పం మనోవిశ్లేషణా పద్ధతిలో అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. దోపిడీగాండ్ర నాయకుడికి చిక్కిన యమున మానసిక స్థితిని, భయాందోళనలను రచయిత సుస్పష్టంగా చిత్రించారు. ”మొదట నీ దృశ్యమాయె హృదయమును ఛేదించు నట్లుండినను, వెంటనే సహజ దౌర్భల్యమాయె యెదను వదలి యా స్థలమును గట్టి గుండె యాక్రమించెను”. (హృదయశల్యము పు.2) ఈ విధంగా జరిగేది జరుగకపోదని గుండెను రాయి చేసుకొని, ధైర్యంతో దోపిడీ నాయకునిపై తన కటారుతో ఎదురుతిరగటానికి సిద్ధమైంది. అది రాత్రివేళ కావటం, శుక్లపక్ష సమయం కావటం, యమున పల్లకీని మోస్తున్న బోయీలకు నిరుత్సాహం కలిగింది. అందులోనూ అది అరణ్య ప్రాంతం. తన భర్త ప్రతాపుడు గుఱ్ఱంపై వస్తూ, దాని యొక్క మందగమనం చేత వెనుకబడిపోయారు. దాదాపు ఒక మైలుదూరం వారిద్దరి మధ్య ఏర్పడింది. ఒక్కసారిగా చీకటి పొదల నుంచి నల్లటి ఆకారాలతో, అదే రంగు కలిగిన దుస్తులతో దోపిడీ ముఠా పల్లకీని చుట్టుముట్టింది. ఇలాంటి సమయంలో యమున పడే మనస్సంఘర్షణ, భావ సమరం క్రమక్రమంగా అధికమైంది. ఎంతో ధైర్యంతో దోపిడీ నాయకునిపై తిరుగుబాటుకు సిద్ధపడినా ఫలితం లేకపోయింది. పురుష వేషంలో ఉన్న రుద్రమదేవి అశ్వికుడై సంచరిస్తూ, తన కనుల ముందు జరిగే ఘోరమైన చర్యను తప్పించాడు.
తన ప్రాణాన్ని రక్షించినందుకు యమున కృతజ్ఞత చెప్పడానికి ప్రయత్నించినా ఈ హఠాత్పరిణామానికి తేరుకోక అచేతన స్థితిలోకి దిగజారిపోవడం కన్పిస్తుంది. దానికి ప్రతిచర్యగా ”ఆనందాతి శయమామె నోట మాట వెలవడనీయలేదు. ముత్తియముల వంటి బాష్పకణములామె కనుదమ్ముల నుండి పరంపరలుగా వెడలి నును జక్కులపై జారించు, అప్పుడు దేదీప్యమానముగ వెలుంగుచుండిన చంద్రకిరణములు ప్రతిఫలించుటనే ధగధగ వెలుగుచుండెను.” (హృదయశల్యము పుట.3) యమున మనసులోని భావ ప్రకంపనలను, కృతజ్ఞతా చూపులను గ్రహించిన అశ్వికుడు ”అప్రయత్నముగ ముందడుగిడి యాముద్దియను తన వక్షమున కదిమికొని కన్నీరు కార్చుచుండుటయు, మైలు దూరమున వెనుకబడి యుండిన యా ముద్దురాలి భర్త యా స్థలమునకు వచ్చుటయు నొక్క తూరియే సంభవించెను”. (హృదయశల్యము – పు.3). అతిత్వరలో అక్కడికి చేరుకొన్న ప్రతాపుడికి, అక్కడి వారి భయాందోళనా నేపథ్యం, భీభత్స వాతావరణం జరిగిన సంఘటనను చెప్పకనే చెపుతుంది. తన ప్రియమైన భార్యను రక్షించి ఉపకారం చేసిన అశ్వికునికి ప్రత్యుపకారంగా తనేమీ చేయలేకపోతున్నందుకు ఆవేదన పడి, సమయము దొరికినప్పుడు తమ ఇంటికి వచ్చి తప్పక ఆతిథ్యం స్వీకరించాలని వేడుకొన్నాడు. అశ్వికుని పేరడుగగా ”రుద్రదే…” అనే మాట వినిపించగానే, సహజంగా పురుషవేషంలో ఉన్నాడు కాబట్టి ”రుద్రదేవుడు”గా భావించాడు.
ప్రతాపుని కృతజ్ఞత, మాటల్లో సంశయం లేకపోయినా, దారిన పోయే అశ్వికుడు తన భార్యను ఆలింగనం చేసుకోవడమనే చర్యను జీర్ణించుకోలేకపోయాడు. ఇక్కడే ప్రతాపుడి అహంకారం బయటపడుతుంది. భావ సంఘర్షణల్లో ఉన్న ప్రవర్తనా వ్యవహారంలో ప్రదర్శితమవుతుంది. ”పురుషుల హృదయము బహు సులభముగా సందియములకు దావొసంగును”. (హృదయశల్యము – పు.4) అనే వాక్యంలో పై దుర్ఘటన ప్రతాపుడి మనసులో అనేక సందేహాలకు దారితీసింది. ప్రతాపుడిది స్వచ్ఛమైన మనస్సే. అశ్వికుడు యమున ప్రాణాలు రక్షించినప్పటి నుంచి అతడి హృదయంలో మాలిన్యం చోటు చేసుకుంది. ”వస్త్రము పైబడిన మచ్చను కడిగివేయవచ్చును, కాని హృదయమున బడిన మచ్చ దుడిచివేయుట దుస్సాధ్యము” అని, ”ఒక వెలగల ముత్తియమును బగులగొట్టితిమేని, దానికి బ్రతిగ దన్మూల్యమగు ధనమునిచ్చిన నేరము తీఱిపోవును, కాని ఒక్కరి మనస్సును జితుకగొట్టితిమేని ప్రపంచమునగల యెట్టి మూల్యవంతమగు వస్తువును నా కొఱత దీర్పజాలదు” అని రచయిత ప్రతాపుడి హృదయాందోళనల్ని పై యదార్థమైన లోకరీతులతో వ్యక్తపరిచారు. హృదయమనే క్షేత్రంలో విషవృక్షం పుట్టి, ప్రతాపుడి మనస్సును కృశింపజేసి, ”హృదయశల్యము” గావించబడింది.
ప్రతాపుడు తన భార్యతో ప్రవర్తించే విధానాన్ని, మనస్థితిని ‘అచేతన’ ఏదీ-్పుళిదీరీబీరిళితిరీ చర్యలలో చూపవచ్చు. ”భార్య యెదుటనున్న వేళ, వికాసమును ముఖమున వ్యక్తపఱచుచు, నెవ్వరును లేని తరుణమున దీర్ఘ విచారమున మున్గియుండును. అంతకు మున్ననుదినము ప్రేయసితో గూడ సాయంసమయములందు గృహారామమున విహారమొనర్ప నలవాటుపడి యుండిన ప్రతాపుడు, ఒకనాడు తలదిమ్ముగా నున్నదనియు, మరియొకనాడు గాలి కడు చల్లగా వీచుచున్నదనియు, మిషల బన్న దొడంగెను. విశ్రామ సమయములందభ్యంతర గృహమున నామె సరస గూర్చుండి వినోద సంభాషణమున బ్రొద్దు పుచ్చునాతండు, అట్టి యవకాశము లభించినపుడు ‘ఉక్కుగానున్నద’ని గాని, ‘వాకిట నెవరో పిలుచుచున్నట్లున్న’దని గాని పల్కుచు లేచిపోవును. పని కలిగివచ్చు పెద్దమనుషులతో (బూర్వము వలె వివరముగ మనసిచ్చి భాషించుట మాని నాల్గు మాటలతో సరిపుచ్చి వారి నవ్వల కంపివేయుచుండెను”. (హృదయశల్యము – పు.5) ఇక్కడ ప్రతాపుని అంతరంగాన్ని రచయిత సుస్పష్టంగా వ్యక్తపరిచారు. ఒక్కోసారి మనిషి మన ఎదుట కనిపించినా, అతని భావాల్లో, ప్రవర్తనలో తీవ్ర పరిణామం ప్రదర్శితమవుతుంది. సాధారణంగా అచేతన స్థితిలో మనిషి ముప్పాతిక బంధింపబడగా, అతికొద్దిశాతం మాత్రమే చేతనా వ్యాపకంలో కన్పిస్తాడు. అదే స్థితిలో ప్రతాపుడి పాత్రను అర్థం చేసుకోవచ్చు.
భర్త మానసికస్థితి కారణాన్ని తెలుసుకొన్న యమున మనసులోని సంఘర్షణలు తీవ్రరూపాన్ని దాల్చాయి. ఒకనాడు రుద్రదేవుడు అతిథిగా వీరింటికి వచ్చినపుడు యమున సందిగ్దావస్థ ఇలా ఉంది.
”ప్రతాపుడు రుద్రదేవు రాక వినగానే మనస్తాపమున మఱగుపఱచి సగౌరవముగ నతనినెదుర్కొని లోనికి దోడి వచ్చెను. తనకీయబడిన యాతిథ్యమునకు రుద్రదేవుడు కృతజ్ఞత దెల్పెను. యమున కనబడినప్పుడయ్యతిథి యామెను కుశల ప్రశ్నము చేసెను. కాని యుత్సాహపూర్వకమగు ప్రత్యుత్తరము బడయ జాలండయ్యె. ప్రతాపుడెంత సంతోషము జూపినను, నా దంపతుల హృదయకమలము యడుగున కలక్కున మెదలుచుండిన కంటకము నాతడు కనిపెట్టకపోలేదు. ఇవ్విధముగ నా యతిథి రెండు దినములచ్చట గడిపెను. ఈ దిన ద్వయమును నామె మనస్సు చిత్ర విచిత్రమగు తర్కవితర్కమున మునిగి కర్తవ్యము నిర్ణయింపజాలక తొట్రుపడుచుండెను”. (హృదయశల్యము – పు.6)
”కంటకము” అనే పదంలోనే ప్రతాపుడు, యమునల పాత్రల మధ్య భావ సంఘర్షణ అభివ్యక్తమవుతుంది. మనోవిశ్లేషణా సిద్ధాంతాల అవగాహనకు ఈ కథ అద్దం పడుతుంది. సహజ సిద్ధమైన పాత్ర చిత్రణ, విలక్షణమయిన శిల్పరూపం ఇందులో కన్పిస్తుంది. పాత్ర ప్రవర్తనలో గల చిక్కుముడులను మనోవిశ్లేషణా సూత్రాలతో విశ్లేషించడానికి అనువుగా ఉంటుంది. ఇరుపాత్రల వెనుక రచయిత నడిపిన అంతరంగ పొరలు సహజ సుందరంగా పొదగబడినాయి. ఈ రెండు పాత్రల్లో ”చైతన్యస్రవంతి” విధానం కనిపిస్తుంది. మనోగత భావ సంశయంలో ఈ తరహా విధానం బయల్పడుతుంది. కథాశిల్పం చర్య మొత్తం చైతన్య స్రవంతిని అనుసరిస్తుంది.
ఇరువురి కంటక స్థితిని గ్రహించిన రుద్రదేవుడు, తనవల్ల వారీస్థితికి వచ్చినందుకు అనేక విధాలుగా ఆవేదన పడతాడు. వారిద్దరి మనస్తాపాన్ని తొలగించాలని నిర్ణయించుకుంటాడు. అందుకే యమున అతనిని దుర్భాషలతో దూషించినా బదులు పలుకడు. ”అమ్మా! నేనేల నిందింపబడుచున్నానో యెఱుగను. నాడు నిన్ను గాపాడుటయే నేను చేసిన ఘోర పాపమైనచో, పరోపకార మహాత్మ్యమును నీవు నాకు గడు చక్కగ బోధించితివి!” (హృదయశల్యము – పు.6) అని అశ్వికుడు తిరస్కార మాటలతో తిప్పిగొడతాడు.
మనిషి మనస్తత్వాన్ని, ప్రవర్తనను, వెలుగునీడలతో సహా మాడపాటి అద్భుతమైన ప్రతిభ చూపించారు. ఈ కథలోని మూల పాత్రలూ మనోవైజ్ఞానిక నేపథ్యంలో విమర్శించడానికి అనువైనవి.
ఈ విశ్లేషణలోనే ఇంకా యమున పాత్రను లోతుగా అధ్యయనం జేస్తే, యమున చాలా రిప్రెషన్‌ స్థాయిలో పడిపోయినట్లుగా కన్పిస్తుంది. తన ఇంటికి వచ్చిన అతిథితో డిప్రెషన్‌కు లోనైన తన మాటలను మనస్సులోనే దాచుకోకుండా ”చాలు చాలును, బహు సన్మార్గుడవు! నాటి నీ దుశ్చేష్ఠమూలమున నా పచ్చని కాపురము పాడైపోవు దినము దెచ్చితివి! ఆ విధముగ మా దాంపత్య సుఖమును దగ్ధము చేసి యంతటితో బోక మరల నికట వచ్చి మమ్ము వేధించుటకు నీకు సిగ్గు లేదా?” (హృదయశల్యము – పు.6) అని అన్నది. ఆమె మనసులోని అలజడి ఒక్కసారిగా బయటకు వచ్చి ఎలాంటి పదజాలముతో దూషించినా అశ్వికుడు సంయమనం పాటిస్తాడు. ఇక్కడ యమున తనయందు జరిగిన సంఘటనకు ఆత్మన్యూనతా భ్రాంతికి లోనవుతుంది. యూంగ్‌ సిద్ధాంతం ప్రకారం యమున తన ఆత్మన్యూనతను, ఆధిక్య భావనగా మార్చుకొనేందుకు ప్రయత్నం చేయడం గమనించవచ్చు. యమునలోని ”వైయుక్తిక అచేతన” (|దీఖిరిఖీరిఖితిబిజి తిదీబీళిదీరీబీరిళితిరీ) స్థితి క్రమక్రమంగా క్రింది పొరల్లో ”సమిష్టి అచేతన” (్పుళిజిజిలిబీశిరిఖీలి తిదీబీళిదీరీబీరిళితిరీ) స్థితికి చేరుకొంటుంది. ఈ కథలో మాడపాటి యమున పాత్ర చిత్రణలో చూపిన అలజడిని నాటి సమాజ స్త్రీ జనోద్ధరణకు దారితీసింది. మాడపాటి నాటి కాలంలో అప్పుడప్పుడే సమాజంలోకి వస్తున్న మహిళలు యమున లాంటి మనస్థితిని అనుభవించి ఉంచవచ్చు. ఆడవాళ్ళపై మగవాళ్ళ అనుమానాలకు తెర తొలగిస్తూ, ఈ కథలో గొప్ప సందేశాన్ని అందించారు.
ప్రతాపుడి ఇంటికి అతిథిగా అశ్వికుడు వచ్చిన రెండు రోజుల తర్వాత సైనికుని దుస్తులు ధరించిన మరొక అశ్వికుడు వస్తాడు. గుఱ్ఱము దిగి ప్రతాపుడికి నమస్కరించి ”అయ్యా! మూడుదినముల క్రింద నిచ్చటకు వచ్చిన మా మహారాజ్ఞి రుద్రమదేవి గారిని వెంటనే దర్శింపవలసి యున్నది” అని అంటాడు. అప్పటికి ఆ దంపతులిద్దరు తమ ఇంటికి అతిథిగా వచ్చిన అశ్వికుడు రుద్రదేవుడు కాదని, పురుషవేషంలో ఉన్నది త్రిలింగ సామ్రాజ్యానికి రాణియగు రుద్రమదేవి అని తెలుసుకొంటారు. తమ మూర్ఖత్వానికి ఇద్దరూ రాణి పాదాలపై పడతారు. రాణి దంపతులిద్దరినీ పైకి లేపి ఎంత ఆప్యాయంగా – ”అమ్మాయీ! నీవట్టంటివని నేను క్రోధమునభినయించితిగాని యనుభవింపలేదు. ఆనాడు స్త్రీజాతికి సహజమగు మార్దవము చేతను నా వేష స్వభావమును మఱచి జాలిచే నిన్ను కౌగలించుకొంటిని, కాని పురుష వేషమున నున్న నేనట్లు చేయుట నీ భర్తకనుమానము సంపాదించునను మాట తరువాత స్మరణకు వచ్చి మిమ్ము మరల నొకమారు దర్శింపననుజ్ఞ వేడి నేడు నీ యతిథినై యిటకు వచ్చితిని. నీ నిష్కాపట్య స్వభావమును మీ పరస్పరానురాగమునకు నానందించితిని, కాని కొంతకాలము మీ మనస్తాపమునకు గారణభూతనైనందుకును నన్ను మీరు మన్నింపవలెను” (హృదయశల్యము – పు.7) అని పలికింది.
పాత్రల అంతరంగాల్లోని అనుమానాలన్నీ పై సన్నివేశం పటాపంచలు చేస్తుంది. మాడపాటి సన్నివేశ కల్పనలో, పాత్రపోషణలో సరియైన మనో సిద్ధాంతాలను వింగడించవచ్చు. చివరికి పాత్రలన్నీ ”హిపోక్రసీ”ని వదిలి సరళతరమైన జీవనానికి పూనుకొంటాయి. యమున, ప్రతాపులు హృదయ శల్యమును వీడి స్వచ్ఛమైన మనస్సుతో, దృఢ నిశ్చయంతో బ్రతకడానికి సిద్ధపడతారనే విషయాన్ని ఈ కథలో మాడపాటి తెలియజేశారు. మనోగతాలు, మనస్సంఘర్షణలు కథ మొత్తం పాత్రల బహిరంతర ప్రాంతాలందు స్పృశింపజేసి రచయిత అత్యద్భుతమైన కథావైచిత్రిని ప్రదర్శించారు.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.