ఇంట్లో ప్రేమ్‌చంద్‌ -33

శివరాణీదేవి ప్రేమ్‌చంద్‌       అనువాదం : ఆర్‌. శాంతసుందరి
”అరే ఇక్కడ తల్లినీ, పెళ్లాన్నీ కర్రలతో చావబాదేవాళ్లు నౌకర్లకి థాంక్యూ చెపుతారా?” అన్నాను.
”అందుకే కదా ముప్ఫైఐదుకోట్లమంది ప్రజల మీద గుప్పెడు బ్రిటిషర్లు ఆధిపత్యం చలాయిస్తున్నారు! ఇంట్లో ఆడవాళ్లతో మర్యాదగా మాట్లాడటం చేతకాదు కానీ తెల్లవాళ్ల బూట్లు నాకుతారు!”
ఆయన పలహారం తినటానికి కూర్చున్నప్పుడల్లా మనవణ్ణి ఒళ్లో పెట్టుకుని వాడికి చెమ్చాతో పాలు తాపించేవారు. కమలాపండు తొనలు వలిచి పూసలు నోట్లో పెట్టేవారు. వాణ్ణి ఎత్తుకునే కిందికి దిగివెళ్లేవారు. అక్కడ వాణ్ణి నేలమీద పడుకోబెట్టి గంటలకొద్దీ వాణ్ణి ఆడిస్తూ ఉండేవారు. అప్పుడప్పుడూ వాడు తన బుల్లిబుల్లి చేతులతో ఆయన మీసాలు పట్టుకునేవాడు. ఆయన ఒడుపుగా వాడి చేతుల్ని విడిపించేవారు. పడుకున్నచోటనే వాడికి విరోచనం అయితే, తనే శుభ్రం చేసి, పైకి తీసుకొచ్చేవారు. వాడు ఖరాబుచేసిన జంపకాణానో, పరుపునో ఎండలో వేసేవారు. నేనది చూస్తే, ”ఎవరినైనా పిలిస్తే శుభ్రం చేసేవాళ్లం కదా?” అనేదాన్ని.
”మహాత్ముడు పరాయివాళ్లవి శుభ్రం చేసేవారు, మనది మనం చేసుకుంటే తప్పేమిటి?” అనేవారు.
సాయంకాలం నాలుగవగానే మనవణ్ణి ఎత్తుకుని బైటికి షికారుకి వెళ్లేవారు. పెద్దవాణ్ణి చెయ్యిపట్టుకుని నడిపించుకెళ్లేవారు. వాళ్లిద్దరూ ఆయనకి ఎంతగా మాలిమి అయారంటే, నేను దగ్గరకి తీసుకుందామని ప్రయత్నిస్తే ఆయన ఒళ్లో మొహం దాచుకునేవారు. ఐదు గంటలకి పిల్లల్తో ఇంటికి వచ్చి, తనని కలవటానికి వచ్చిన ఇరుగుపొరుగు కుర్రాళ్లతో కబుర్లు చెప్పేవారు. అప్పుడు కూడా పిల్లలిద్దర్నీ తన దగ్గరే ఉంచుకునేవారు. వదిలిపెడితే వాళ్లమ్మ దగ్గరకెళ్లి ఇబ్బంది పెడతారని అనుకునేవారు.
పెద్ద మనవడికి జ్ఞాన్‌చంద్‌ అని పేరు పెట్టారాయన. అప్పుడు నేను ఒకరోజు, ”ఇంకేదైనా పేరు పెట్టండి!” అన్నాను.
”నీకు బాగాలేదా? నాకు నచ్చింది. మొదట్లో నాపేరు చివర ‘రాయ్‌’ ఉండేది. అందుకే మన పెద్దబ్బాయికి శ్రీపత్‌రాయ్‌ అనీ, రెండోవాడికి అమృతరాయ్‌ అనీ పెట్టాను. ఇప్పుడు నన్నందరూ ‘చంద్‌’గా గుర్తిస్తున్నారు. అందుకే నా మనవల పేర్ల చివర ‘చంద్‌’ రావాలి.
”పేరు గొప్ప ఊరు దిబ్బ! వీళ్లు పెద్దయాక ఎలా తయారవుతారో ఎవరికి తెలుసు? ఒకవేళ దుర్మార్గులుగా అయితే మీ పేరుని అందరూ వెక్కిరించరా? ఆయన జ్ఞానూని ఎత్తుకుని, ”ఏరా వెధవా, విన్నావా? నా పేరుకి మచ్చ తీసుకురావు కదూ?” అంటూ వాణ్ణి ముద్దుపెట్టుకున్నారు.
”ఆఁ, వాడికి మీరు చెప్పిందంతా అర్థమైపోయింది లెండి! ఇప్పణ్ణించే వాణ్ణి చదివించటం మొదలెడితే, పెద్దయాక మీలా పెద్దపెద్ద నవలలు రాస్తాడు! మీ తాతగారు ఏం గొప్ప రచయితని మీరు రచయిత అయారు?”
”తప్పకుండా మా తాతగారిలో ఆ అంశ ఉండే ఉంటుంది. అందుకే నాకీమాత్రం చాతనయింది. తాత గుణాలు మనవలకే వస్తాయి.”
”అదెలా?”
”అది ప్రకృతి వరం. మన పిల్లల్లో కనిపించని గుణాలూ, అవలక్షణాలూ మనవల్లో కనబడతాయి,” అన్నారు.
జ    జ    జ
1935లో కాశీలో ఉండగా ఒకరోజు రాత్రంతా ఈయన జ్వరంతో బాధపడ్డారు. పాలు కూడా తాగలేకపోయారు. రెండోరోజు ఉదయం ఏ నాలుగ్గంటలకో జ్వరం తగ్గింది. మామూలు టైముకి లేచి మొహం కడుక్కుని ఇంకా పలహారం కూడా చెయ్యకుండానే ‘హంస్‌’ కోసం సంపాదకీయం రాసేందుకు కూర్చున్నారు. పాలు పొంగాక పిలిచేందుకు వెళ్లిచూస్తే గదిలో రాసుకుంటున్నారు.
”ఏం చేస్తున్నారండీ?” అన్నాను.
”ఏం చెయ్యటమేమిటి? ‘హంస్‌’ కోసం సంపాదకీయం రాస్తున్నాను, నిన్ననే రాయవలసింది!” అన్నారు.
”చాలా బావుంది. నిన్నంతా ఒళ్లు తెలీని జ్వరంతో పడుకున్నారు, లేవగానే రాసేందుకు కూర్చున్నారా? నేనేమో మీరు పలహారం చెయ్యటానికి వస్తారని ఎదురుచూస్తున్నాను. అసలు పని ఎక్కువయే మీ ఆరోగ్యం పాడవుతోంది. రెండు రోజుల్నించీ అన్నం మాట అటుంచి, పాలు కూడా తాగలేదు, మీరు!”
”ఇంకొక్క ఐదు నిమిషాలు… కంపోజింగ్‌ చేసేవాళ్లు వచ్చి కూర్చున్నారు!”
”ఇంక ఒక్క సెకను కూడా ఇవ్వను,” అంటూ చేతిలోని కలం లాక్కుని, ”మాట్లాడకుండా లేచి రండి!” అన్నాను.
”అరే, నేను రాసివ్వకపోతే వాళ్లు ఎలా కంపోజు చేస్తారు?”
”అవన్నీ నాకనవసరం!”
”నీకు అవసరం కాకపోవచ్చు, కానీ నాకు అవసరమే. ‘హంస్‌’ ఎలా అచ్చవుతుంది? సమయానికి పత్రిక రాకపోతే పాఠకులకి కారణం ఎలా తెలుస్తుంది. నేను జబ్బుపడ్డానని అందరికీ తెలుస్తుందా? వాళ్లకి సరైన టైముకి పత్రిక అందాలి, డబ్బులు కట్టారుగదా?”
”ఈ పిచ్చిమాటలన్నీ తరవాత, ఇంక రాశారంటే చింపేస్తానంతే! లేవండి!!”
అలా బెదిరించేసరికి లేచారు. పలహారం తింటూ ఉండగా కిందినించి ఒక మనిషి వచ్చి, ” ‘హంస్‌’కి మేటర్‌ ఇవ్వండి,” అని అడిగాడు ఆయన్ని.
”నువ్వెళ్లు, ఒక గంటలో సిద్ధం చేస్తారు!” అని నేను జవాబు చెప్పాను.
అతను వెళ్లిపోయాడు, కానీ ఈయన నాతో, ”నన్ను రాయనివ్వలేదు నువ్వు, పాపం అనవసరంగా ఇంతసేపూ వేచి ఉన్నాడు!” అన్నారు.
”అవును, పాపం ‘హంస్‌’ ముత్యాలు కక్కుతోంది కదూ?”
”దేవిగారూ! ‘హంస్‌’ ముత్యాలని కక్కదు, తింటుంది!” అన్నారు నవ్వుతూ.
”అవును తింటుంది. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి నెత్తికెత్తుకుంటారు. మీకు విశ్రాంతి తీసుకోవటమే తెలీదు. చూడండి ఎముకలగూడులా ఎలా తయారయారో! మొన్న రాత్రంతా జ్వరం, నిన్న రోజంతా లేవలేదు, ఈ రోజు జ్వరం తగ్గగానే ‘హంస్‌’ని పట్టుక్కూర్చున్నారు. పైగా ఇది ఎంతకీ పూర్తవని పని. ఈ మధ్యే తెలిసింది నాకు, ఎనిమిదేళ్లలో ఇరవైవేల రూపాయల ఖరీదు చేసే పుస్తకాలు అమ్ముడయాయని. ఆ డబ్బంతా ‘హంస్‌’, ‘జాగరణ్‌’, మీ ప్రెస్సూ స్వాహా చేసేశాయి. ఆ పుస్తకాల రాయల్టీ ఐనా దొరికుంటే, చెయ్యీ కాలూ కదపకుండా పన్నెండువేలు ఇంటికే వచ్చేవి. అలా జరగలేదే! పైగా మరో మూడువేలు అదనంగా కాయితాలకి ఖర్చయింది, వాటికోసం మీరు బొంబాయి వెళ్లారు!”
”నువ్వు అనవసరంగా కోపం తెచ్చుకుంటావు!”
ఆరోజే ఆయనతో పని తగ్గించుకోమనీ, అసలు వదిలెయ్యమనీ చెప్పాను. కానీ ఆయన వింటేగా? అసలు శరీరాన్నీ మనసునీ ఆహుతి ఇవ్వవలసిన అలాటి పనులు చెయ్యటం ఎందుకనేది నా ప్రశ్న. అదే ఆయనతో అన్నాను.
నా కోపాన్ని శాంతింపజేస్తూ, ”రాణీ! నువ్వొకటి మర్చిపోతున్నావు. ఈ పనిలో నేను చేస్తున్న త్యాగమేమీ లేదు, ఇదేదో తపస్సు లాటిదీ కాదు. ఒక మనిషి త్యాగం, తపస్సులా కాకుండా, ఆసక్తితో, సంతోషంగా చేసే పనిని ఆహుతి ఇవ్వటం అనరు. ఒక జూదగాడికి జూదం, తాగుబోతుకి తాగుడు, నల్లమందు భాయీకి నల్లమందూ దొరక్కపోతే ఎంత విలవిల్లాడిపోతాడు? వాటివల్ల ఎంత ఆనందం పొందుతాడు. దాన్ని త్యాగం అంటారా? అలాగే ఈ పని చెయ్యకపోయినట్టయితే నాకు కూడా సుఖంగా, శాంతిగా ఉండదు!” అన్నారు.
”అలా అయితే మీకు కూడా ఇది వ్యసనమే అంటారు, అంతేగా?” అన్నాను.
”అవును, వ్యసనమే, కానీ మంచి వ్యసనం, నా యీ వ్యసనం వల్ల ఎవరికైనా మంచి జరగచ్చు!” అన్నారు.
”ముందు మీరు మీ మంచి గురించి ఆలోచించండి. ఆ తరవాత మిగతావాళ్లకి మంచి చేద్దురుగాని, అదెలాగూ జరుగుతుందో లేదో ఆ భగవంతుడికే తెలియాలి! బక్కచిక్కి చీపురుపుల్లలా తయారయారు, మీకు ఇంకోళ్ల మంచి గురించి ఆదుర్దా!”
”దీపం ఉంది చూశావూ, దానిపని వెలుగునివ్వటం, ఆ పని చెయ్యటం అది మానదు. దానివల్ల అవతలివాళ్లకి లాభమా, నష్టమా అనేది దానికనవసరం. నూనే, వత్తీ ఉన్నంతవరకూ తన పని తాను చేసుకుపోతుంది. అవి అయిపోగానే ఆరిపోతుంది. అప్పుడా దీపం ఎక్కడికి పోయిందో నీకు తెలీదు. అది మళ్లీ వెనక్కి రాదు!”
నాకు కోపం, బాధ తన్నుకొచ్చాయి, ”ఊళ్లోవాళ్ల దీపాల గురించి నాకనవసరం. మీరు ఊళ్లోవాళ్లు కాదు, నా మనిషి, మీ భార్యని నేను. అందుకని మిమ్మల్ని కాపాడుకోవటం నా బాధ్యత, నా కర్తవ్యం. మీరు చాలాకాలం నాతో కలిసి జీవించాలనుకోవటం నా హక్కు!”
”చాలా పొరపాటు పడుతున్నావు. రచయిత జీవితం అలా ఉండదు. అది చాలా బలంగా ఉంటుంది.”
”నాకేం చెయ్యాలో తెలీటం లేదు. చెప్పినమాట వినరు గదా!”
”రాణీ! నిన్ను గమనిస్తూనే ఉన్నాను. నువ్వు మాత్రం తక్కువ తిన్నావా? నా జబ్బు నీకూ అంటుకుంది. నీకు మాత్రం విశ్రాంతి దొరుకుతోందా?”
”నేను విశ్రాంతి తీసుకోక ఏంచేస్తున్నానని? మీలాగ ఒళ్లు హూనం చేసుకునే వ్యసనాలేవీ నాకు లేవు!”
”అవును, అందుకే ఇంత లావుగా ఉన్నావు, పాపం!”
ఒకప్పుడు ‘హంస్‌’ వల్ల మీ ఆరోగ్యం పాడయిందంటే, దాన్ని మూయించేస్తాను, అని నాదిర్‌షాలా శాసించిన నాకు ఆయన పోయాక ఆ పత్రికే ప్రాణంగా మారింది. అప్పుడు దాన్ని ‘హిందీపరిషత్తు’కి ఇచ్చేశాం. మహాత్మాగాంధీ గారి చేతుల్లో ఒక పదినెలలపాటు ఉండిన తరువాత దాన్ని హిందీ పరిషత్తు మూసేసింది. అప్పుడు మా ఆయన జబ్బుగా ఉన్నారు.
”రాణీ, వెయ్యి రూపాయలు బ్యాంకులోంచి తీసి కట్టి ‘హంస్‌’ని బతికించు!” అన్నారాయన.
”ముందు మీ ఆరోగ్యం కుదుటపడనివ్వండి, మంచం పట్టినా మీకింకా ‘హంస్‌’ గురించే ఆలోచనా?” అన్నాను.
”నా అనారోగ్యానికీ, ‘హంస్‌’ పత్రిక రావటానికీ ఏమిటి సంబంధం?”
”పత్రిక పని ఎవరు చూస్తారు?”
”నేనెవరికో ఒకరికి అప్పజెపుతాలే.”
”ఎవరికి? ఎక్కడున్నారు పత్రిక నడిపేవాళ్లు?”
”జైనేంద్ర్‌ చేస్తానన్నాడు.”
మరొకప్పుడైతే నేనేమైనా అనేదాన్నేమో. కానీ అప్పుడు ఇంక మాట్లాడకుండా బ్యాంకులోంచి వెయ్యిరూపాయలు తీసి జమచేశాను.
ఆయన పోయాక చాలామంది స్నేహితులు పత్రిక మూసెయ్యమని సలహా ఇచ్చారు. కానీ ఆ పని నావల్ల కాలేదు, ”లేదండీ, ముయ్యలేను!” అని జవాబు చెప్పాను.
”దీన్నెవరు నడుపుతారు?” అన్నారు.
” ‘హంస్‌’ని తన కన్నబిడ్డలా చూసుకున్నారు మా ఆయన. ఇప్పుడు నేను దాని తల్లి స్థానంలో ఉన్నాను. ఒక తల్లి తన పిల్లల్లో అందరికన్నా బలహీనంగానూ, పనికిరాకుండానూ ఉన్న బిడ్డనే ఎక్కువగా ప్రేమిస్తుంది, అది కూడా ఆ బిడ్డకి తండ్రి నీడ కూడా లేకుండా పోయినప్పుడు. అన్నీ బాగుండి, పైకి వచ్చిన పిల్లలని అందరూ ఆదరిస్తారు, గుర్తిస్తారు, సొంతం చేసుకోటానికి కూడా ఇష్టపడతారు. కానీ సంపాదనా, యోగ్యతా లేనివాళ్ల మొహం ఎవరూ చూడరు! తల్లి తప్ప ఆ బిడ్డని పట్టించుకునే వాళ్లెవరు? నాకు ‘హంస్‌’ అటువంటి బిడ్డ.
జైనేంద్ర్‌ తన తల్లి చనిపోయిందని ఈయనకి ఢిల్లీనించి ఉత్తరం రాశాడు. ఈయన కళ్లనీళ్లు పెట్టుకుంటూ నాదగ్గరకొచ్చి, ”పాపం జైనేంద్ర్‌ ఒంటరివాడైపోయాడు, వాళ్లమ్మ పోయింది!” అన్నారు.
ఆ వార్త విని నేను కూడా బాధపడ్డాను, ”ఏమైందిట?” అన్నాను.
”ఆవిడకి పొట్టలో నీరు చేరటం అనే వ్యాధి చాలాకాలంగా ఉంది. జైనేంద్ర్‌ వాళ్ల నాన్న ముందే పోయారు, ఇప్పుడు తల్లి కూడా పోయింది. చాలా దుఃఖంలో ఉండి ఉంటాడు! అతని తల్లి చాలా మంచావిడ. ఇంతవరకూ కుటుంబభారాన్నంతా ఆవిడే మోసింది. జైనేంద్ర్‌ ఇల్లు వదిలి అటూ ఇటూ తిరుగుతూనే ఉంటాడు, బాధ్యత తీసుకోడు. కానీ తల్లంటే ప్రాణం, ఆవిడ కూడా తన ప్రాణాలన్నీ అతని మీదే పెట్టుకుని బతికింది. ఎంత సజ్జనురాలో అంత ధైర్యవంతురాలు కూడా. రెండుసార్లు ఆవిణ్ణి కలిశాను. నన్నెప్పుడూ పరాయివాడిలా కాక సొంతమనిషిలా చూసేది. అంత ఆప్యాయత చూపించేది!”
”జైనేంద్ర్‌ మామయ్య కూడా వాళ్లింట్లోనే ఉండేవారు కదా?”
”అవును, ఆయన కూడా చాలా సభ్యత, సంస్కారం గలవాడు. అసలు జైనేంద్ర్‌ని చూస్తే అతని కుటుంబం ఎలాటిదో తెలిసిపోతుంది నీకు. లేకపోతే తండ్రిలేని కుర్రాళ్లు దమ్మిడీకి కొరగాకుండా తయారవుతారు! కానీ జైనేంద్ర్‌నీ అతని అక్కనీ కూడా చాలా చక్కగా పెంచారు. వాళ్ల పెంపకం వల్లే జైనేంద్ర్‌ ఇంత చక్కగా తయారయాడు. పాపం అతనికి ఇక ఈ లోకంలో ఎవరూ లేరు.”
”అసలు జైనేంద్ర్‌ స్వతహాగా మంచివాడే.”
”కానీ అబ్బాయిలు మంచివాళ్లా కాదా అనేది పోనుపోను తెలుస్తుంది. ప్రస్తుతం తలిదండ్రుల పెంపకం ప్రభావమే అతనిమీద కనిపించచ్చు.”
”మనం కావాలనుకునేవాళ్లే త్వరగా చనిపోతారు. ఇక్కడ ఎవరికీ అక్కర్లేనివాళ్లని దేవుడు కూడా తనకి అక్కర్లేదనే అనుకుంటాడు.”
”అసలు జైనేంద్ర వాళ్లమ్మది అంత పెద్ద వయసు కూడా ఏమీ కాదు. అప్పుడే చనిపోయి ఉండకూడదు!” అన్నారు.
”ప్రస్తుతం ఆవిడ స్వర్గంలో ఉంది. జైనేంద్ర ఎంత దుఃఖంలో ఉన్నాడో ఆవిడకేం తెలుసు? అసలు ఆవిడ బతికుండగా ఎన్ని కష్టాలు పడింది! కొడుకుని ప్రయోజకుణ్ణి చేసింది కానీ, ఆవిడ వెళ్లిపోయింది కదా? ఏం సుఖపడిందని?” అంటూంటే నాకు కూడా ఏడుపొచ్చింది. ఆయనైతే బాగా కుంగిపోయారు.
గొంతు సవరించుకుని, ”అందుకే నాకు భగవంతుడి మీద నమ్మకం లేదు. అందరూ ఆయన్ని కరుణామయుడంటారు నిజం అదే అయితే దుఃఖంలో ఉన్నవాళ్లని ఇంకా కష్టపెడతాడా? నవనవలాడే తోటని నాశనం చేసి ఆనందం పొందుతాడా? జనం ఏడుస్తూంటే దేవుడికి హాయిగా ఉంటుందేమో! తన శరణుజొచ్చినవాళ్లని ఏడిపిస్తూ, వాళ్ల బాధలు చూసి కరగనివాడు, వాడేం దేవుడు?” అన్నారు.
”చేసుకున్నవారికి చేసుకున్నంత మహాదేవా! అంటారుగా?”
– ఇంకా ఉంది

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.