తిరిగొచ్చిన బాల్యానికి పండుగ

కె. సత్యవతి
డిశంబరు 5న నగరం నడిబొడ్డునున్న రవీంద్రభారతి మీద ఒకటా రెండా 1500 పిట్టలు వాలి ఒకటే కిచకిచలు. రంగురంగుల పాలపిట్టలు, పచ్చపచ్చని రామచిలకలు, ఎర్రెర్రని గోరింకలు, పింఛాలు విప్పిన నెమళ్ళు. అబ్బో! ఎంత సందడో! పిల్లల ప్రోగ్రాములంటే నేను ఒక చెవికాదు రెండు చెవులూ కోసేసుకుంటాను. అందరికంటే ముందే వెళ్ళిపోయి రవీంద్రభారతి మీద నేనూ వాలిపోయాను. పిల్లల్లో కలిసిపోయి 57 ఏళ్ళ నా వయసుని ఎడంకాలితో తన్నేసాను. ఇంతలో వచ్చిందండి. ఎవరనుకున్నారు. మొన్నటి కర్నూల్‌ ట్రిప్‌లో టీమ్‌ అందరిని ఎడాపెడా ఎంటర్‌టెయిన్‌ చేసిన డా|| సమతా రోషిణి. పేరులో డాక్టరుగిరీ వుందని పెద్ద డాబుగా వుంటుందనుకునేరు. ఒట్టి భోళాబోళి. నాకంటే అల్లరిలో పన్నెండాకులు ఎక్కువే చదివింది. ఎంతైనా గోదారితీరంవాళ్ళం కదా! ఇద్దరిలోను గలగలలూ ఎక్కువే. గోల చేయడాలూ ఎక్కువే. ఈ ఉపోద్ఘాతం సుత్తేమిటండీ బాబూ అంటూ విసుక్కోకండి. వస్తున్నా. అసలు పాయింటుకి వస్తున్నా.
మీరు రెయిన్‌బో హోమ్స్‌, ఇంద్రధనుస్సు ఇళ్ళు గురించి విన్నారా? మీలో కొంతమందయినా భూమిక మీటింగుల్లో ఈ హోమ్‌లో వుండే పిల్లల్ని చూసే వుంటారు. 2008లో ఆంధ్రప్రదేశ్‌లో ఈ రెయిన్‌బో హోమ్స్‌ మొదలయ్యాయి. సీతాఫల్‌మండిలో మొదటి హోమ్‌ మొదలైనప్పటి నుండి నాకు వీళ్ళతో కనబడని అనుబంధం ఏర్పడిపోయింది. వీళ్ళంతా ఎవరనుకుంటున్నారు. అమ్మానాన్నల వొడుల్లేని, భద్రతలేని, వీధుల్లో ఎండకి వానకి నానుతూ బతికే దిక్కుమొక్కులేని పసిపిల్లలు. వీళ్ళల్లో పాలుగారే కసుగాయలూ వుంటాయి. రోడ్ల కూడళ్ళల్లో అడుక్కుంటూ, రోడ్ల మీద చెత్త కాయితాలేరుకుంటూ, సెక్స్‌ వృత్తిలో వున్న తల్లులకి పుట్టినవాళ్ళు, ఇళ్ళల్లో పనిపిల్లలుగా మగ్గేవాళ్ళు, తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకున్నవాళ్ళ పిల్లలు – ఇలా రకరకాలుగా, నిత్యం పీడనకి, దోపిడీకి (లైంగికంగా) అణిచివేతకి, అక్రమ వ్యాపారాలకి (ట్రాఫికింగ్‌)కి గురయ్యే పిల్లల కోసం మొదలైనవే రెయిన్‌బో హోమ్స్‌. ఈ పిల్లలకి చదువు, ఆరోగ్యం, ఆలనాపాలనా అన్నీ కరువే. ఫలితంగా భయానకమైన చీకటి ప్రపంచంలో మసలుతూ తమని తాము నాశనం చేసుకునే అలవాట్లకు – తాగుడు, డ్రగ్స్‌, సిగరెట్లు లాంటి వ్యసనాలకు బానిసలవుతున్నారు. నిత్యం లైంగిక దాడులకు గురవుతుంటారు.
జాతీయ స్థాయిలో ‘అమన్‌ బిరాదరీ’ అనే ట్రస్ట్‌ ద్వారా ‘రెయిన్‌బో హోమ్స్‌’ కాన్సెప్ట్‌ మొదలై, మన రాష్ట్రంలో ‘అమన్‌ వేదిక’ ద్వారా ఈ కార్యక్రమం నడుస్తోంది.
ఇవి ప్రభుత్వ పాఠశాలల ఆవరణలో, అదే స్కూల్‌ వసతుల్ని ఉపయోగించుకుంటూ నడుస్తున్నాయి.
తల్లిదండ్రుల ఆలనాపాలనా లేని బాల్యం కోల్పోయిన పిల్లల కోసం ఈ హోమ్‌లు ఏర్పడ్డాయి.
బాధ్యతాయుత పౌరులుగా తయారుచెయ్యడం.
హక్కుల ఆధారిత ఆచరణలో – జీవించే హక్కు, రక్షణ పొందే హక్కు, ఎదుగుదల హక్కు, చదువుకునే హక్కులతో ఈ హోమ్స్‌ నడుస్తున్నాయి.
ప్రభుత్వంతో కలిసి ‘అమన్‌ బిరాదరి’ పనిచేస్తుంది. ఎంతో ప్రమాదకర పరిస్థితుల్లో వున్న ఇలాంటి పిల్లల కోసం ప్రభుత్వం చేత పని చేయించేలా వొత్తిడి తెస్తుంది.
మొదట్లో ఆడపిల్లల కోసం రెండు రెయిన్‌బో హోమ్‌లు మొదలై ప్రస్తుతం మగపిల్లల కోసం కూడా కొన్ని హోమ్స్‌ ఏర్పాటయ్యాయి. మరో ఎనిమిది స్వచ్ఛంద సంస్థల్ని కలుపుకుని బాల్యమిత్ర నెట్‌వర్క్‌గా ఏర్పడి ప్రస్తుతం 1570 మంది పిల్లలతో 17 రెయిన్‌బో హోమ్‌లు నగరంలో నడుస్తున్నాయి.
ఇదండీ అసలు సంగతి. ఈ పదిహేను వందల మంది పిల్లలు డిశంబరు 5న రవీంద్రభారతిలో ”తిరిగొచ్చిన బాల్యానికి పండగ” అంటూ ఎంత సందడి చేసారో! నేను అతిథుల్లో ఒకరిగా ఇందులో పాల్గొన్నారు. ఏమి ఆటలు, ఏమి డాన్సులు, ఏమి నాటకాలు. ప్రతి ఒక్కరూ చూసి తీరాల్సిన కార్యక్రమం. విషాదం ఏమిటంటే ఈ పిల్లల మేధస్సును, తేజస్సును, వారి సమస్యలను చూడాల్సిన, వినాల్సిన ప్రభుత్వ ప్రతినిధులొక్కరూ హాజరవ్వకపోవడం. ఇది వారి బాధ్యతారాహిత్యాన్ని, ఇలాంటి పిల్లల పట్ల వారి నిర్లక్ష్య ధోరణిని సూచిస్తుంది. పిలిచిన ముఖ్యఅతిథుల్లో నేను ఒకదాన్నే హాజరవడం వల్ల మిగతా వాళ్ళంతా డుమ్మా కొట్టడంవల్ల చివరలో జరగాల్సిన మీటింగ్‌ రద్దయింది. అయితే – నేను ఈ పిల్లల కోసం స్వయంగా బంతిపూలతో ఓ పెద్ద గుచ్ఛం తయారుచేసుకొని తీసుకెళ్ళాను. పిల్లలందరికీ ఆ పువ్వులు ఇచ్చి ”నాకింత సంతోషాన్ని, నా బాల్య జ్ఞాపకాలని నాకిచ్చిన మీకందరికీ ఈ గుచ్ఛం” అని చెబితే బోలెడు సంతోషపడిపోయారు.
పిల్లలు చేసిన డాన్సులు, వారు కనబరచిన ప్రతిభాపాటవాలు అద్భుతం. రంగురంగుల బట్టల్లో, మేకప్‌లో మెరిసిపోయిన ఆ పిల్లల్ని చూస్తుంటే, వారి ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని గమనిస్తుంటే చాలాసార్లు నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. కన్నీళ్ళ మధ్య మసకమసకగా కనిపించే ఈ పిల్లలు ఈ రోజు రెయిన్‌బో హోంలో ఉన్నందుకు కదా ఇంత సంతోషంగా వున్నారు? లేకపోతే ఎక్కడుండేవాళ్ళు రోడ్లమీద దుమ్మూ, ధూళీ కొట్టుకుపోయి, చింపిరి జుట్టుతో అనారోగ్యాలతో అల్లాడుతూ వుండేవాళ్ళు కదా! అని పదేపదే అనిపించింది. వీళ్ళందర్ని ఆదరించి అక్కున చేర్చుకున్న రెయిన్‌బో హోమ్స్‌, వాటిని నడుపుతున్న అమన్‌ వేదిక, బాల్యమిత్ర నెట్‌ వారిని మనస్ఫూర్తిగా అభినందించాలి. అనూరాధ, అంబిక, ఉషారాణి, తులసీబాయ్‌, ఇందిర తదితరులు ఎంతైనా అభినందనీయులు. ముఖ్యంగా ఈ పిల్లలందరూ ”పాపా” అని పిలుచుకునే ”హర్షమందర్‌” ఈ హోమ్స్‌ వెనకున్న స్ఫూర్తి. ఆ రోజు ఆయన అక్కడే వున్నారు. 2002 గుజరాత్‌ అల్లర్ల నేపథ్యంలో జరిగిన ముస్లిమ్‌ల ఊచకోతకి నిరసనగా తన ఐఎఎస్‌ పదవికి రాజీనామా ఇచ్చిన ఈయన గురించి అందరికి తెలుసు కదా! ఆయనకి అభినందనలు తెలిపి తీరాలి.
ఈ పిల్లలకెన్నో సమస్యలున్నాయి. ఈ హోమ్స్‌ నడపడంలో ఎన్నో ఇబ్బందులున్నాయి. ఇవి నడుస్తున్నవి ప్రభుత్వ పాఠశాలల్లో కాబట్టి అవి ఎలా ఉంటాయో అందరికీ తెలుసు. కరెంటు, నీరు, టాయ్‌లెట్స్‌, డ్రయినేజ్‌ లాంటి కనీస వసతులలేమితో పాటు, పెచ్చులూడే కప్పులు, తలుపులు, దర్వాజాలు లేని కిటికీలు, గుమ్మాలు, సున్నాలకు నోచుకోని గోడలు – ఇవన్నీ సమస్యలే. ఈ సమస్యల్ని పరిష్కరించాల్సిన అధికారులెవ్వరూ మీటింగ్‌కి రాలేదంటేనే వారి చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమైంది. ప్రభుత్వం మీద వొత్తిడి తెచ్చయినా ఈ పిల్లల కవసరమైన కనీస వసతులు ఏర్పడేలా అందరు ప్రయత్నించాలి.
ఆ రోజు ఎంతో సంతోషాన్ని, ఉద్వేగాన్ని పంచిన పిల్లలందరినీ అభినందిస్తూ, వారి సమస్యల పరిష్కారంలో నావంతు కృషి తప్పక చేస్తానని హామీ ఇస్తూ – సమత, నేను చేసిన హంగామా, అల్లరికి మరోసారి హాయిగా నవ్వుకుంటూ…………..
బాల్యమిత్ర నెట్‌వర్క్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న రెయిన్‌బో హోమ్స్‌ వివరాలు ఇక్కడ ఇస్తున్నాం. ఈ హోమ్స్‌లో వున్న పిల్లలందరికీ పౌరసమాజం, సంస్థలు, వ్యక్తుల అండదండలు, సహకారం, సహానుభూతి చాలా అవసరం. మితృలంతా స్పందిస్తారనే ఉద్దేశ్యంతో ఈ హోమ్స్‌ వివరాలు కింద ఇస్తున్నాం.       – ఎడిటర్‌
”అమన్‌వేదిక” ఆధ్వర్యంలో నడుస్తున్న హోమ్స్‌ ఇవి.
1. ప్రభుత్వ ఉన్నత పాఠశాల(గడిస్కూల్‌) ఆవరణలో, లాలాపేట
2. గవర్నమెంట్‌ ప్రైమరీ స్కూల్‌ ఆవరణ, ఘాస్‌మండి, ఆదయ్యనగర్‌,         బైబిల్‌ హౌస్‌దగ్గర
3. గవర్నమెంట్‌ హైస్కూల్‌ ఆవరణ, ముషీరాబాద్‌, సికింద్రాబాద్‌
4. గవర్నమెంట్‌ ప్రైమరీ స్కూల్‌ ఆవరణ, మేడిబావి, సీతాఫల్‌మండి,         సికింద్రాబాద్‌
”అప్స” ఆధ్వర్యంలో నడుస్తున్న హోమ్స్‌
1. గవర్నమెంట్‌ స్కూల్‌ ఆవరణ, జామిత్‌వీధి, రామ్‌గోపాల్‌పేట్‌             పోలీస్‌స్టేషన్‌, సికింద్రాబాద్‌
2. గవర్నమెంట్‌ అప్పర్‌ ప్రైమరీ స్కూల్‌ ఆవరణ, చుడిబజార్‌, బేగంబజార్‌
”ఆంధ్రప్రదేశ్‌ మహిళా సంక్షేమ సొసైటీ” ఆధ్వర్యంలో నడుస్తున్న హోమ్స్‌
1. గవర్నమెంట్‌ ప్రైమరీ స్కూల్‌ ఆవరణ, రవీంద్రనాయక్‌నగర్‌,             చంద్రికాపూర్‌, ఫలక్‌నుమా
2. గవర్నమెంట్‌ ప్రైమరీ స్కూల్‌ ఆవరణ,ఇంజన్‌బౌలి, ఫలక్‌నుమా
”ఎల్‌ఎస్‌ఎన్‌” పౌండేషన్‌
1. గవర్నమెంట్‌ ప్రైమరీ స్కూల్‌ ఆవరణ, మిషన్‌ స్ట్రీట్‌, పాట్‌ మార్కెట్‌,         అశోక్‌నగర్‌, సికింద్రాబాద్‌
2. మిషన్‌ స్ట్రీట్‌ స్కూల్‌ ఆవరణ, మోండామార్కెట్‌, సికింద్రాబాద్‌
”ఆశ్రిత” ఆధ్వర్యంలో నడుస్తున్నవి
1. గవర్నమెంట్‌ ప్రైమరీ స్కూల్‌ ఆవరణ,, నాలాబజార్‌, సికింద్రాబాద్‌
2. గవర్నమెంట్‌ ప్రైమరీ స్కూల్‌ ఆవరణ,మహరాజ్‌గంజ్‌, దూద్‌బౌలి,         హైదరాబాద్‌
”సన్నిహిత” ఆధ్వర్యంలో నడుస్తున్నవి.
1. గవర్నమెంట్‌ స్కూల్‌ ఆవరణ, పార్క్‌లేన్‌
2. గవర్నమెంట్‌  స్కూల్‌ ఆవరణ, తుకారాంగేట్‌
3. మాక్లుగూడా ప్రైమరీ స్కూల్‌ ఆవరణ, ప్యారడైజ్‌, గాంధీబొమ్మ దగ్గర,         సికింద్రాబాద్‌
”బాలతేజస్సు” ఆధ్యర్యంలో నడుస్తున్నవి.
1.గవర్నమెంట్‌ స్కూల్‌ ఆవరణ,హిల్‌ స్ట్రీట్‌, కీస్‌ హై స్కూల్‌ దగ్గర, సికింద్రాబాద్‌  2.గవర్నమెంట్‌ అప్పర్‌ ప్రైమరీ స్కూల్‌ ఆవరణ,కుమ్మరిగూడా, పాస్‌పోర్ట్‌ ఆఫీసు దగ్గర, సికింద్రాబాద్‌

Share
This entry was posted in రిపోర్టులు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో