మాతృవేదన

డమాముల గాయత్రి
మాతృత్వపు మధురిమలతో…
ఒడిలో చేరనున్న శిశువు తలపులతో…
తన్మయత్వం చెందాల్సిన మనసు
కనుపాపలు కనే కమ్మని కలలకు దూరమై
భరించలేని ఆవేదనను ఉగ్గబట్టుకుని
మౌనవేదనలో నలుగుతోంది
కడుపులో పెట్టుకుని కాపాడాల్సినవాడే
పుట్టబోయేది ఆడపిల్లేనని తెలుసుకొని
కాలయముడై కడుపులోనే కరిగించి
చెత్తకుండి పాలు చేస్తున్నా…
ఎదిరించలేని అసహాయత
చస్తూనే బ్రతుకుతూ… బ్రతుకుతూనే చస్తూ
బ్రతకలేక చస్తూ… చావే బ్రతుకైన వేళ
మృత్యుఘడియలకు చేరువౌతూ…
అలసిసొలసిన అమ్మ గుండెలో
ఇంకిపోయిన కన్నీరు
తన ప్రాణాల్ని సైతం లెక్కచెయ్యక
మృత్యుదేవతతో పోరాడి ఓడుతున్న
కసుగందుకై ఆరాటపడుతున్న మాతృహృదయం
మాతృత్వపు మమకారాన్ని అర్థం చేసుకోలేని
ఓ పురుషాహంకారమా తెలుసుకో
రాయికీ రప్పకీ చెట్టుకూ పుట్టకూ మొక్కి
పురిటినొప్పులతో ప్రాణాన్నే పణంగా పెట్టి
వాత్సల్యంతో నీకు జన్మనిచ్చేది స్త్రీ
పెరిగి పెద్దయ్యే క్రమంలో తుమ్మినా ఏడ్చినా
కంటికి కునుకు లేకుండా సేవలు చేసి
పస్తులుండి నీ కడుపు నింపేది స్త్రీ
తన చేతుల్నే రక్షణ కవచంలా చేసి
నిన్ను కంటికి రెప్పలా చూసుకునేది స్త్రీ
తోబుట్టువై త్యాగానికి ప్రతిరూపంలా నిలిచి
తన కలల్ని కన్నీటి రూపంలో వదిలి
నీకు బంగారు భవిష్యత్తునిచ్చేది స్త్రీ
అంతటి సహనశీలి నీకు అమ్మగా కావాలి
భార్యగా కావాలి చెల్లిగా కావాలి
కూతురుగా మాత్రం వద్దా?!?
ఇదేనా సభ్యసమాజానికి నువ్విచ్చే ఆదర్శం
మృత్యువు ప్రతిరూపమా…
మానవత్వం లేని మృగమౌతావని తెలుసుంటే…
మీ అమ్మ నీకు జన్మనిచ్చేదా?
ఓ స్త్రీ నీతో సహజీవనం చేసేదా?
ఆడబిడ్డ పుట్టుకకు ఏ విధంగానూ స్త్రీ కారణం కాదన్న
ఆలోచనే కరవైన కర్కశత్వమా
వినిపించలేదా చిదిమేసిన పసిగుడ్డు ఆక్రందన?!?
కనిపించలేదా అమ్మ ఆవేదన?!?
సృష్టికి మూలం మగువేనని తెలుసుకో
మగువ లేనిదే మగవాడి పుట్టుక లేదని తెలుసుకో
నిజాన్ని గుర్తెరిగి
మనిషిలా జీవించడం నేర్చుకో
నిన్ను కన్న మనసు మురిసేలా నడచుకో.
(భూమిక నిర్వహించిన 2011 కథ, వ్యాస, కవితల పోటీలో ప్రధమ బహుమతి పొందిన కవిత)
నేలతల్లి ఆడది – అయినంపూడి శ్రీలక్ష్మి
పొరలు పొరలుగా తవ్వి
మడులు మడులుగా కట్టి తడులుపెడితే
సేద్యానికి సిద్ధమై ముత్యాల మెతుకులిస్తుంది నా నేలతల్లి
పలకలు పలకలుగా తొలిచి
మొజాయిక్‌లా మారిస్తే
ఇంటికీ అందమైన శోభను చేకూరుస్తుంది నా నేలతల్లి
పోట్లు పోట్లుగా పొడిచి
ముక్కలు ముక్కలుగా చెక్కితే
రాక్షస బొగ్గుగా మారి ఇంధనమై నిలుస్తుంది
పచ్చటి పసిమి దేహాన్ని
బంగారు గనులుగా తొణికినా
ఒళ్లంతా తనకు తానే చెక్కుకుని
చెలిమలు చెలిమలై దాహార్తిని తీరుస్తుంది
నా నేలతల్లి
గుండె గూటిని తెరిచేసి
మనందరి కోసం
ఉప్పుసంద్రాన్నయినా ఉత్సాహంగా మోస్తుంది
బృందాన్ని మించిన అమ్మతనం చూపుతుంది
ఆ కమ్మదనంలో కన్నీళ్ళు తెప్పిస్తుంది.
‘ని’వేదన – ములుగు లక్ష్మీమైథిలి
ఎన్నాళ్ళు, ఎన్నాళ్ళిలా?…
నిన్నెంతగా నేను ప్రేమిస్తున్నానో?…
నన్నంతగా ద్వేషిస్తున్నావు…
ద్వేషించటానికి ఈ జన్మ చాలదనుకుంటా…
ఈ పోరాటం, ఈ ఆరాటం ఎన్నాళ్ళు?
నీకు, నీ వారికి నేను ఆజన్మాంతం శత్రువునే,…
కానీ, అజాతశత్రువును…
డబ్బుకోసం వేధించేవాళ్ళు,
మందుతాగి వేధించేవాళ్ళు,
అందంగా లేవని వేధించేవాళ్ళు ఉన్నారు.
కానీ, ఇందుకు భిన్నంగా వేధించేది నువ్వు…
ఏమిటి శాపం? ఏమిటి నా లోపం?
నిత్యమూ వేదనా రోదనలేనా?
కడలిలో నీరు ఇంకిపోతుందేమోకానీ,
కళ్ళలో నీరు ఇంకా ఊరుతున్నది.
శీతాకాలంలో వడగాల్పులేలా?
ఏకాలంలోనూ పడిగాపులేలా?
దెబ్బలతో శరీరం వడలిపోయింది.
మాటలతో మనసు సడలిపోయింది.
నువ్వు రావటం క్షణం ఆలస్యమైనా
నా కళ్ళు తెరిచిన వాకిళ్ళు,
నీకోసం, నీ ప్రేమకోసం,
నీ గెలుపుకోసం, నేను ఓడిపోతూనే ఉంటా…
నీ కఠోరపలుకులైనా,
నాకు కర్ణామృతమె.
నీ మౌనం, నేను భరించలేని సంద్రం.
మాటల మరాఠీ  -  శారదాహన్మాండ్లు
వాడు గోడ మీది బల్లిలా
ఓ అల్ప ప్రాణిని
నోట కరచుకొని
అహింసాగానం చేస్తుంటాడు
నీతిమంత్రాల్ని వల్లిస్తున్న దయ్యమై
దైవతత్వాన్ని పీడిస్తుంటాడు
పదిమంది బానిసలను వెనకేసుకొని
స్వాతంత్య్రంతోనే
సమరం చేస్తుంటాడు
వాడు మబ్బై కర్తవ్యసూరీడుకు
అడ్డుపడుతూ మురిసిపోతుంటాడు
చుట్టూ జేబులకు చీడపురుగై
గల్లబుడ్డిలా గలగలమంటాడు
మంచితనానికి
మొండి వాదనల అడ్డుగోడల్ని కట్టే
మాటల మరాఠీ వాడు
నల్ల కళ్ళజోడులోంచి
పౌర్ణమిలో వెలుగును వెతుకుతాడు
విలువల వలువలు రాల్చుకొని
నగ్నంగా నిలబడి
పచ్చని వృక్షాన్ని పరిహసిస్తాడు
వేరుపురుగై
సమాజ తరువును తొలుస్తూ
నట్టల్ని బెదిరిస్తుంటాడు
పెంచుకున్న ప్రతిష్ఠ మూలాలలోకి
మనకు తెలియకుండానే
ప్రవేశించే వైరస్‌ వాడు
వాడిని పోల్చడానికి
ఇంకా నిఘంటువులో
పదాలు చేర్చలేదు
కనిపిస్తే కాస్త పురుగులమందు
తాగించండి
సమాజానికి
చీడ విరగడవుతుంది.

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>