రచన నా ప్రాణం – కలం నా ప్రియనేస్తం

ప్రొ. ఇందిరా గోస్వామి
ఇంటర్వ్యూ : కొండవీటి సత్యవతి, కొండేపూడి నిర్మల
మార్చి 8న ప్రారంభమైన జాతీయ స్థాయి రచయిత్రుల సభల్లో జ్ఞానపీఠ్‌ పురస్కార గ్రహీత, డా. ఇందిరా గోస్వామి ప్రారంభ సమావేశంలో ఉత్తేజకరమైన ఉపన్యాసం చేశారు. ఈ ప్రసంగం ముగియగానే ‘భూమిక’ గురించి వివరించి ఇంటర్వ్యూ కావాలని కోరినప్పుడు చాలా బిజీగా వుంది షెడ్యూల్‌. చూద్దాంలే అన్నారు. ఆవిడ సమావేశం నుండి వెళ్ళిపోయినా నా బుర్రలో అదే ఆలోచన. ఎలాగైనా ఆవిడని కలిసి మాట్లాడాలి. ఎలా? ఎక్కడ దిగారు అని అడిగితే లేక్‌వ్యూ గెస్ట్‌ హౌస్‌ అన్నారెవరో. కొండేపూడి నిర్మలని పట్టుకుని లేక్‌ వ్యూ గెస్ట్‌హౌస్‌కి వెళదాం వస్తావా? అంటే ఛలో పోదాం అంది. కనీసం మేం వస్తున్నామని ఆవిడకి ఫోన్‌ చేయలేదు. సరాసరి కారేసుకుని లేక్‌వ్యూ కెళ్ళి ఆవిడ రూమ్‌ తలుపు తట్టాం. తడుతూ భయపడ్డాం. ఆవిడ ఏమంటుందోనని. ఆవిడ చీరలోంచి నైటీలోకి మారిపోయి చేతిలో కూల్‌డ్రింక్‌తో రిలాక్సింగ్‌ మూడ్‌లో వున్నారు. మేం డిస్టర్బ్‌ చేసినందుకు సారీ చెప్పాం. ఆవిడ ఎంతో ఆప్యాయంగా నవ్వుతూ మమ్మల్ని ఆహ్వానించారు. నిజానికి ఆవిడ లంచ్‌ చేయడానికి సిద్ధపడుతున్నారు. ఒక్క అరగంట మాతో మాట్లాడండి అని కూర్చున్నాం. మాక్కూడా చల్లటి పానీయాలొచ్చాయి. ఆవిడ ఉంగరాల జుట్టు ఫ్యాన్‌గాలికి ఎగిరి పడుతోంది. ఆవిడ ప్రవాహంలాగా మాట్లాడడం మొదలుపెట్టారు. తెరలు తెరలుగా నవ్వుతూ ఎన్నో విషయాలు ముచ్చటించారు. తన బాల్యం గురించి అడిగినపుడు ఆచిన్న కళ్ళు మిల మిల మెరిసాయి. తన గున్న ఏనుగు రాజేంద్ర గురించి చెబుతున్నపుడు ఆ కంఠం తన్మయంగా మారిపోయింది. తన జీవితంలోని ఆటుపోట్లని గురించి, తన రచనానుభావం గురించి ఎంతో వివరంగా చెప్పారు. ఆవిడతో మాట్లాడుతూ ఆకలినే మర్చిపోయాం. ఇందిర గారితో గడిపిన ఆ రెండు గంటల అనుభవాన్ని గుండెల్లో దాచుకుని బయటకు వస్తూంటే ”నైస్‌ మీటింగ్‌ యూ, కమ్‌ టూ ఢిల్లీ” అంటూ ఆహ్వానించారు. అంతటితో ఆ సమావేశం ముగిసింది. ఈ ఇంటర్వ్యూ విశేషాలు ‘భూమిక’ పాఠకులకు ప్రత్యేకం.
– ఎడిటర్‌
నా చిన్నతనం చాలా వైవిధ్యంగా గడిచింది. ఇలాంటి చిన్నతనం నాకు ఉండేదని మీరెవరూ అనుకోరు. నా చిన్నతనపు రోజులు ఎక్కువగా వైష్టవ మఠాల్లో గడిచాయి. మా పూర్వీకులు జమీందారులు మరియు మత గురువులు కూడా. మా వాళ్ళు బ్రాహ్మణులు. నేను ఎందుకు బ్రాహ్మణ కులంలో పుట్టానో నాకు అర్థం కాదు. (నవ్వులు) సంకటీలు కాయస్థులు. వాళ్ళు బ్రాహ్మణులకు గురువులుగా వుండేవారు. అటువంటి వ్యవస్థ కూడా అప్పుడు ఉండేది. కులవ్యవస్థ ఇదివరకు బలంగా ఉన్నప్పటికీ, ఇప్పుడు ముఖ్యంగా పట్టణాల్లో అంతగా పట్టింపులేదు. ఆ విధంగా, నా చిన్నతనపు రోజులు ఎక్కువగా బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉన్న మఠంలో గడిపాను. మఠాల్లో  ఆ రోజుల్లో గురువులకి ఏనుగులను ఇచ్చేవారు. ఏనుగులు చాలా వుండేవి. మా అన్నకు ఒక గున్న ఏనుగును ఇచ్చారు. దానితో ఆడుకుంటూ ఉండేదాన్ని. దాని పేరు రాజేంద్ర. అప్పట్లో గ్రామంలోని మిగిలిన పిల్లలతో మతాధికారి పిల్లలను ఆడుకోనిచ్చేవారు కాదు. కానీ నేనెప్పుడూ వాళ్ళు చెప్పినదాన్ని వినేదాన్ని కాదు. మాకు ఒక పెద్ద బావి ఉండేది. ఒకవేళ నేను వాళ్ళతో ఆడుకుంటే ఆ బావి నీళ్ళతో స్నానం చేస్తే కాని లోపలకు రానిచ్చేవాళ్ళు కాదు. ఈ విధమైన బాల్యం కొంతకాలం నడిచింది.
గౌహతిలో నాకు మంచి స్నేహితులు ఉండేవాళ్ళు. వాళ్ళతో బ్రహ్మపుత్ర ఒడ్డున ఆడుకుంటూ, పడవలో తిరుగుతూ ఉండేవాళ్ళం. అప్పుడు కొంతవరకు బాల్యం స్చేచ్ఛాయుతంగానే గడిపాం. ఇప్పుడు ఎవరైనా ఆ విధంగా అనుకున్న చోటకి, అనుకున్నట్లు వెళ్ళలేరు. తర్వాత అక్కడే ఒక అస్సామీ ప్రాధమికస్కూల్‌లో చేర్చారు నన్ను. కొంతకాలం అక్కడ చదివాను. ఎందుకంటే అదే స్కూల్లో మా తమ్ముణ్ని కూడా చేర్చారు. ఇంట్లో అతనితో ఆడుకుంటూ ఉండేదాన్ని. తమ్ముడితో ఆడుకుంటానికే ఆ స్కూల్లో నన్ను కూడా చేర్చారు.
(తెరలు తెరలుగా నవ్వులు….)
ఆ రోజుల్లో స్కూల్లో చాలా విచిత్రమైన పరిస్థితులు ఉండేవి. అధికారుల పిల్లలు, మంత్రుల పిల్లలు, చెప్పులు కుట్టేవారి పిల్లలు, జాలరి పిల్లలు ఎవరైనా సరే అందరూ ఒకే బెంచీ మీద కూర్చుని చదువుకునేవారు, వివక్ష ఉండేది కాదు. కొంతకాలం అక్కడ చదివాక, మా నాన్నగారికి అకస్మాత్తుగా షిల్లాంగ్‌కు బదిలీ అయ్యింది. మా నాన్నగారు పబ్లిక్‌ వర్క్‌ ్స శాఖకు డైరెక్టరు అయ్యారు. నన్ను మా చెల్లిని సెంట్‌ మౌంట్‌ స్కూల్లో చేర్చారు. అది ఒక యూరోపియన్‌ స్కూల్‌. చిన్నతనంలో ఉండగానే ఈత నేర్చుకున్నాను. కొండ ఎక్కటం కూడా నేర్పారు. ఆ విధంగా స్కూల్లో జీవితం చాలా వేరుగా ఉండేది. స్కూల్లో యూరోపియన్‌ టీచర్స్‌ చాలా దయార్ద్ర హృదయం కలిగినవారు ఉండేవారు. ఇదే విషయం నా జీవిత చరిత్రలో రాశాను.
క్రమంగా నా మానసిక పరిస్థితి మారిపోతూ వచ్చింది. నాలో ఎప్పుడూ ఒక భయం ఉండేది. ఎందుకనో నేను మా నాన్నగార్ని పోగొట్టుకుంటాననే ఫోబియా పెరుగుతూ వచ్చింది. మా నాన్నగారు చనిపోతారనే భయం ఎక్కువౌతూ వచ్చింది. ఇదే విషయాన్ని ఎప్పుడూ ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉండేదాన్ని. మా స్కూల్లో జేమ్స్‌ అనే ఒకావిడ పనిచేసి రిటైరయింది. ఆవిడ సర్వెంట్‌ క్వార్టర్స్‌లో వుండేది. కొండల్లోంచి నీళ్ళు జారుతూ వుండేవి. నేను అక్కడ కూర్చుని ఈ నీళ్లల్లోకి దూకితే మునుగుతానా లేదా అని అనుకుంటుండేదాన్ని (నవ్వులు). మా నాన్న గురించి ఆలోచించేదాన్ని. అక్కడ కూర్చుని ఏం ఆలోచిస్తున్నావు అని అడిగేది. నాకు ఏం చెప్పాలో, నా భయం గూర్చి ఎలా చెప్పాలో తెలిసేది కాదు. ఇంతలో ఒకరోజు నా కళ్ళముందే నాన్నగారు చనిపోయారు. నేను తట్టుకోలేకపోయాను. నాకప్పుడు 13 సం.లు. నేను ఎంతో డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయాను. నాకు ఇద్దరు అన్నదమ్ములు, ఒక సోదరి ఉండేది. మా అమ్మ ఎంతో అందంగా, హుందాగా వుండేది. అంత అందమైన వాళ్ళని నేనింత వరకు చూడలేదు. మా అమ్మలాగ ఎవరూ ఉండేవారు కాదు. నేను బాధలో ఉన్నప్పుడు నన్ను బాగా ప్రోత్సహిస్తూ ఉండేది. నువ్వు అసాధారణమైన దానివని పొగుడుతూ ఉండేది. మెట్రిక్యులేషన్‌ పాస్‌ అయి కాలేజీ చదువుకి వచ్చాను. నాకు కాలేజీలో చాలామంది ప్రేమికులు ఉండేవాళ్ళు. మా అమ్మగారికి నాన్న పోయాక ఎక్కువ సమయం నాతో గడిపేందుకు ఉండేది కాదు. ఆవిడ బాధలో ఉండేది. తర్వాత నేను కాటన్‌ కాలేజీలో చేరాను. అక్కడ కూడా ఎంతో మంది ప్రేమికులు ఉండేవారు. నేను కూర్చునే బెంచీ మీద నా గురించి కవిత్వం రాసేవాళ్ళు. వాటిని ఇష్టంగా చదివేదాన్ని.
ఒకరోజు మేము క్లాసులో ఉన్నపుడు ఒక పిచ్చి అబ్బాయి పెద్దగా అరవటం మొదలు పెట్టాడు. ఈ అమ్మాయి (నేను) నా కాలిలో ఒక ముల్లు గుచ్చింది. వచ్చి తీయమనండి అని అరవటం మొదలు పెట్టాడు. నాకు ఏం చేయాలో తెలియని స్థితి. కాలేజీ అయ్యాక ఇంటికి వెళ్ళాను. ఇంటి దగ్గర ఇదే పిచ్చివాడు బట్టలు చింపుకొని ఇంటి ఎదురుగా నించున్నాడు. మా అన్న స్నేహితుడు ఉదయశంకర్‌ అనే ఒకతను ఉండేవాడు. అతను, అన్న కలిసి అతన్ని పోలీస్‌ స్టేషన్‌కు తీసికెళ్ళి అప్పగించారు. ఆ విధమైన ప్రేమికులు నాకు ఉండేవారు ఆ రోజుల్లో. (నవ్వులు)
ఆ తర్వాత తీవ్రమైన డిప్రెషన్‌కు గురయ్యాను. ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించాను. వారం రోజులు ఆస్పత్రిలో ఉన్నాను. ఆస్పత్రి నుంచి వచ్చాక నాకు ప్రపంచమే మారిపోయినట్లుగా అన్పించింది. నన్ను అనుమానంగా చూడడం మొదలు పెట్టారు. ఏమి తప్పు చేసిందో? ఎందుకు ఆస్పత్రిలో చేరిందో అనే అనుమానపు చూపులు నన్ను వెంటాడుతూ ఉండేవి. దీని తర్వాత అందరు నా పెళ్ళి గురించి ఆలోచించడం మొదలు పెట్టారు. అందరికి నా గురించి తెలిసిపోయింది. ఇప్పుడు ఈమెకి పెళ్ళి అవకపోతే ఎలా? నా తర్వాత ఆడపిల్ల ఉంది. ఎలా? అనే మాటలు వచ్చాయి. తర్వాత నేను పుట్టినప్పుడు మా అమ్మకి టైం బాగా లేదనీ, ఆమె ముక్క ముక్కలైపోతుందని ఎవరో జ్యోతిష్యం చెప్పారు. దీన్ని నివారించేందుకు ఒక పెద్ద మేకపోతును బలిచ్చి పూజ చేయాలని అన్నారు. ఈ పూజ, బలి నా కళ్ళ ముందు జరిగాయి. అప్పటికప్పుడు ఆ స్థలాన్ని వదిలి నేను పారిపోయాను. నాకు ముందే జంతువులంటే ప్రేమ. ఇది నా ఎదుట జరగటం భరించలేకపోయాను. మా ఏనుగు కూడా అలాగే నా కళ్ళముందే చనిపోయింది. నా ముందు ఉన్న రక్తం మరిచిపోలేకపోయాను. ఈ జరిగిన వాటన్నిటివల్ల, నేను చాలా దురదృష్టవంతురాలిననే నమ్మకం మా అమ్మలో పెరిగింది. నన్ను ప్రశంసించే  వారి సంఖ్య కూడా అలా పెరుగుతూ వచ్చింది. ఇంతలో ఒక అహుం కుర్రాడు కలిశాడు. అహూం అంటే, వారు అస్సామ్‌ని, 7, 8 వందల ఏళ్ళు పాలించిన వంశం వారు. అతను బ్రిటన్‌ నుంచి వచ్చాడు. అతడు నన్ను పెళ్ళి చేసుకుంటానని నా వెంట పడ్డాడు. మా ఇంటికి వచ్చేవాడు. నేను మొదట్లో అతని ప్రతిపాదనకి స్పందించలేదు. బయటికి వెళ్దామని అడిగేవాడు. నేను రోజూ ఏదో ఒక వంక చెబుతుండే దానిని. అతను నన్ను చాలా ఆరాధించేవాడు. ఆ సమయంలో నా మనసు, గాయపడి వుంది. డిప్రెషన్‌లో వున్నాను. మా నాన్న చనిపోవడం నన్ను తీవ్రంగా దెబ్బతీసింది. అలాంటి మానసిక స్థితిలో అతడిని రహస్యంగా పెళ్ళి చేసుకున్నాను. తర్వాత చాలా బాధపడ్డాను అలా చేసినందుకు. అతను నన్ను తనతో రమ్మని వత్తిడి చేయడంతో ఇంక లాభం లేదని మా అమ్మకు చెప్పేసాను. మా అమ్మ ఆశ్చర్యపోయింది. వెంటనే మా అన్న ఆ పెళ్ళి రద్దు చేయించాడు. ఆ ప్రహసనం అలా ముగిసింది. (నవ్వులు)
మా నాన్న లేకుండా ఎలా బతకాలో నాకు అర్థమయ్యేదికాదు. నాకు ప్రాణమైన నాన్నపోయాడు. నా చిన్ననాటి నేస్తం, నాకెంతో ప్రియమైన నా గున్న ఏనుగు రాజేంద్ర నా కళ్ళముందే చనిపోయింది. ఇప్పటికీ రాజేంద్ర గుర్తొస్తే నా కళ్ళు చెమరుస్తాయి. అంత ప్రేమించే దాన్ని రాజేంద్రని.
నా మానసిక స్థితి చూసి మా అమ్మ చాలా బాధపడేది. నాకు పెళ్ళి చెయ్యాలనుకునేది. ఆ సమయంలోనే మా ఎదురింట్లోకి అందంగా ఆకర్షణీయంగా వుండే ఓ కెమికల్‌ ఇంజనీర్‌ వచ్చాడు. అతడే మాధవన్‌ అయ్యంగార్‌. నన్ను పెళ్ళి చేసుకుంటానని అతను ప్రపోజ్‌ చేసినపుడు మొదట నేను పట్టించుకోలేదు. అతని దృష్టిలో నేను చాలా సౌందర్యవంతురాలిని. నన్ను పూర్ణిమ అని పిలిచేవాడు. అతను రెండోసారి ప్రపోజ్‌ చేసినపుడు నేను ఒప్పుకున్నాను. మా పెళ్ళి జరిగి పోయింది. మేము కాశ్మీర్‌ వెళ్ళిపోయాం. పెళ్ళయిన ఒకటిన్నర సంవత్సరాల్లోనే ఫ్యాక్టరీలో జరిగిన ఒక ప్రమాదంలో నా భర్త మరణించాడు. నా ప్రపంచం కుప్పకూలింది. నాకు ప్రియమైన నా గున్న ఏనుగుని, మా నాన్నని ముందే పోగొట్టుకున్నాను. ఇపుడు నా భర్త. నేను అంతా పోగొట్టుకున్నాను. అతని మరణాన్ని తట్టుకోలేక పోయాను. చాలా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయాను. నా జీవితం మారిపోయింది. నిద్ర మాత్రలకి అలవాటు పడ్డాను. ఇలాంటి స్థితిలో ఎక్కువ రోజులుంటే ఏమయ్యేదాన్నోగాని, బృందావనం వెళ్ళడం, అక్కడ పేదరికంలోను, ఒంటరితనంలోను మగ్గుతున్న వితంతువులను కలుసుకోవడం నా జీవితానికో పెద్ద మలుపు. బృందావనం వెళ్ళి వుండకపోతే నేను ఆత్మహత్య చేసుకుని వుండేదాన్ని. ఈ అనుభవం నుంచి రాసిన నవలే ‘నీలకాంతబ్రజ’. అంతవరకు అపుడపుడు రాసే నేను నా భర్త మరణం తర్వాత సీరియస్‌గా రాయడం మొదలుపెట్టాను. మనసు మళ్లించుకోవడానికి రచన చాలా ఉపయోగపడేది. అందుకే నేననుకుంటాను రచన మనసుకి థెరపీగా ఉపయోగపడుతుందని. రచనలు చేయకుండా నేను బతకలేను. నా కలం నా ప్రాణ నేస్తం. అదెపుడూ నాతోనే వుంటుంది.
నా రచనకు నేపథ్యం సమాజమే. నేను చాలా అంశాలు ప్రత్యక్షంగా చూసి, అనుభవంలోకి వచ్చాకే రాస్తాను. నిర్మాణ రంగంలో కూలీల గురించి రాయడానికి వారి మధ్య బతికాను. సెక్స్‌ వర్కర్ల జీవన విధానం, వారి సమస్యలు తెలుసుకోవడానికి నేను ఢిల్లీ రెడ్‌ లైట్‌ ఏరియాలో రోజుల తరబడి వాళ్ళతో గడిపాను. ఈ అనుభవం వారి పట్ల నా దృక్పథాన్ని మొత్తం మార్చేసింది. అందుకే ఏదైనా రాయాలంటే ప్రత్యక్షంగా చూడడం, అనుభూతి చెందడం చాలా అవసరమని నేను భావిస్తాను.
నాకు జ్ఞానపీఠ్‌ అవార్డు రావడం అస్సామీ ప్రజలకు లభించిన గౌరవంగా భావిస్తాను. అస్సామ్‌ నీలి కొండలతో నిండివున్న ఎంతో అందమైన ప్రాంతం. జ్ఞానపీఠ్‌ అవార్డు నాకు వరం లాంటిది. నాకు అవార్డు రాకపోయినా నేను రాస్తూనే వుండేదాన్ని. ఎందుకంటే రాయకుండా నేను బతకలేను. నా రచనలు ఇంగ్లీషులోకి అనువాదమయ్యాయి. అయితే అస్సామీ భాషను ఆంగ్లంలోకి అనువదించడం చాలా కష్టం. ఆ భాషలోని యాస, ప్రాంతీయత, నుడికారం ఆంగ్లంలోకి అంత తేలికగా ఒదగదు. అయినప్పటికీ అనువాదం అనేది తప్పనిసరి అవసరమౌతుంది. ఒకే సమస్యపై పోరాడుతున్నప్పుడు ఆ విషయం గురించి తెలియాలంటే రచనల అనువాదం అవసరం. కానీ, నా రచనల అనువాదాల విషయంలో నాకు చాలా అసంతృప్తి ఉంది. కొన్ని రచనలు మాత్రం సరిగా అనువదించబడినాయి. ఉడా : బ్లడ్‌ స్టెయిన్‌ పేజెస్‌. ఈ పుస్తకాన్ని కొద్ది రోజుల్లోనే ఆవిష్కరించాలని అనుకుంటున్నాను. ఒకటి, రెండు రోజుల్లోనే ఆ పుస్తకం బయటికి వస్తోంది. ఈ పుస్తకం ఢిల్లీ అల్లర్ల మీద రాసింది. ఈ సంఘటన నా కళ్ళ ముందే జరిగింది. ‘నోట్‌ బుక్‌ స్టైల్‌’ లో ఈ పుస్తకాన్ని ఒక సరికొత్త విధానంలో రాయడం జరిగింది. ఆ అల్లర్లలో బాధపడ్డ ఒక విద్యార్ధిని అనుభవమే ఈ కథ. ఈ పుస్తకాన్ని చదివినప్పుడు ఆ పుస్తక అనువాదం చాలా తేలికగా సొంపుగా సాగిందని అనిపించింది. ఈ విధమైన అనువాదం చాలా తృప్తినిచ్చింది. నాకు మిగిలిన రచనల అనువాదాలు అంతగా నచ్చలేదు. నా రచనల్ని నేను మాండలికంలో రాయడం జరిగింది. కాబట్టి, ఈ మాండలికం తెలిసిన వ్యక్తులే వీటిని అనువాదం చేయాలి. ఈ విషయంలో అనువాదకుడికి కూడాకొన్ని సూచనలు ఇవ్వాల్సి వచ్చి వుంటుంది. ఈ మాండలికం తెల్సిన వ్యక్తికి ఇంగ్లీషు కూడా వచ్చి ఉండాలి. ఈ విధంగా ఇంగ్లీషులో అనువాదం నాకు చాలా సమస్యలు సృష్టిస్తోంది.
కవితలకంటే వ్యాసాలనే నేను ఎక్కువగా ప్రాముఖ్యత నిస్తాను. దానిద్వారా పాఠకులకు మనం చెప్పాలనుకున్నది నేరుగా తేలికగా చెప్పవచ్చు. కవిత్వం సుకుమారంగా, మందగమనంగా ఉంటుంది. మనం చాలా ఆలోచించి రాయాలి. ఒక్కోసారి ఆలోచించి రాసేటప్పుడు అనుకున్నది అనుకున్నట్లు రాయలేకపోవచ్చు. అంతేకాకుండా వచనంలో పరిధి ఎక్కువగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. నేను చెప్పదలుచుకున్నది, వచనంలోనే బాగా చెప్పవచ్చునని తలుస్తాను అనుకుంటూ, నన్ను నవలని, చిన్న కథలని నిర్వచించమని యూనివర్సిటీలో కొందరు నన్ను అడుగుతూ ఉంటారు. నవల అంటే ఆకాశం అనీ, చిన్న కథ అంటే ఆకాశ ప్రతిబింబంలో ఒక చిన్న భాగమని చెప్తూ ఉంటాను. నేను 45 నవలలు, దాదాపుగా వేయి చిన్న కథలు రాశాను. 7వ క్లాసునుంచీ రాస్తున్నాను. కథలన్నీ, చిన్న పెద్ద పత్రికల్లో అప్పటినుంచీ ప్రచురించబడుతూ ఉన్నాయి. కొన్ని నా దగ్గర ప్రతులే లేవు. అందుకనే ఇప్పుడు అందరినీ అడుగుతున్నాను. నా కథలు ఉంటే పంపమని. మా అమ్మగారు ఉన్నన్నాళ్ళు అవన్నీ సేకరించి భద్రపరుస్తూ ఉండేది. దాదాపుగా అవన్నీ కలిపితే వేయి కథలు ఉంటాయేమో. ఇప్పుడు నాకు 60 ఏళ్ళు.
ఈ రోజు అన్ని భారతీయ భాషల్లోను స్త్రీలు రాస్తున్నారు. అస్సామీ స్త్రీలు కూడా స్త్రీ వాద దృక్పథంతో రాస్తున్నారు. తెలుగు రచయిత్రులు ఎంతో సెన్సిబుల్‌గా రాస్తున్నారు. (రామాయణ విషవృక్షమని ఎవరో రాసారని విన్నాను. ఎవరు? అని అడిగితే రంగనాయకమ్మ పేరు చెబితే నాకు ఆవిడను కలుసుకోవాలనుంది అన్నారు ఇందిర) అయితే ప్రాంతీయ భాషల్లో రాసేవారికి సరైన అనువాదకులు దొరకకపోతే వారి రచనలు ఇతరులకు తెలిసే అవకాశం లేదు. ట్రాన్స్‌లేషన్‌ డిపార్ట్‌మెంట్‌ పెట్టి ఒక భాషనుంచి ఇంకో భాషకి, ఆంగ్లంలోకి అనువాదాలు చేయాల్సిన అవసరం ఎంతైనా వుంది. లేకపోతే ప్రాంతీయ రచయితలకి సరైన ఎక్స్‌పోజర్‌ లేకుండా పోతోంది.
నన్ను నేను ఫెమినిస్ట్‌గా కాక హ్యూమనిస్ట్‌గా చెప్పుకోవడమే ఇష్టం. ఫెమినిజం హ్యూమనిజమ్‌లో భాగంగానే నేను భావిస్తాను. నేను ‘మానవి’ వాదిని. ఆంధ్రప్రదేశ్‌కి ఇంతకు ముందెపుడూ రాలేదు. మొదటిసారి వచ్చాను. ఇక్కడ ఇంతమంది రచయిత్రులను కలుసుకోవడం సంతోషంగా వుంది” అంటూ ముగించారు  ప్రొ. ఇందిరా గోస్వామి. ( భూమిక, జనవరి-ఫిబ్రవరి 2002 )

Share
This entry was posted in ఇంటర్‌వ్యూలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.