అమ్మకు నా అక్షర నీరాజనం

డా. ఎ. విద్యారాణి
ప్రపంచంలో  ప్రతి వ్యక్తికి అమ్మా నాన్నల స్మృతులు అపురూపం. మన బాల్యజీవితం ఎక్కువగా వారితో పెనవేసుకుని వుంటుంది. అసలు బాల్యం మధురాతి మధురం. అమ్మ పెట్టే గోరుముద్దలు, అమ్మ చేతి దెబ్బలు రెండు మధురమే. మా  బాల్యం గూడా అలాగే గడిచిపోయింది.
అయితే ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏమిటంటే మాకు బుద్ధి తెలిసినప్పటినుండి మేము ఐదుగురం మాత్రమే ఉన్న రోజులు చాలా తక్కువ. మా ఇంట్లో చదువులకో, ఉద్యోగాలకో మా బాబాయిగారి పిల్లలు, మా అమ్మవేలు విడిచిన పింతల్లి పిల్లలు, వాళ్ళ పిల్లలు, వీళ్ళుగాక మా అమ్మ మేనమామ పిల్లలు వీళ్ళందరూ గాక ఎందరో అనాథలూ మా ఇంట్లో ఉండేవాళ్ళు ఏండ్లతరబడి.
తమాషా ఏమిటంటే ప్రతి చిన్న విషయానికి ముఖ్యంగా రాజకీయాలగురించి గొడవపడే అమ్మానాన్నగారు, ఈ ఇంట్లో ఉండే మనుష్యుల గురించిగాని, వాళ్ళకయ్యే ఖర్చు గురించి గాని దెబ్బలాడుకునేవారు కానేకారు. ఏమిటో వాళ్ళతోపాటు మాకు కూడ ఇంట్లో జనాలుండడం అలవాటయ్యింది.
ప్రొద్దున లేచినప్పటినుండి రాత్రి పడుకునే వరకు ఎవరికి ఎలా సహాయపడాలో అనే ఆలోచన తప్ప డబ్బు ఎలా సంపాదిద్దాం, ఎలా దాచుకుందామా అనే ఆలోచన ఇద్దరికీ లేదు.
మాకు తెలియనివారైనా సరే వచ్చి ఆపదలో ఉన్నాము పిల్ల పెండ్లికి డబ్బు అవసరం అనిగాని అడగడం ఆలస్యం, వెంటనే నాన్నగారు ఆయన దగ్గర ఎంత ఉంటే అంత డబ్బు ఇచ్చేసేవారు. ఇక అమ్మ ఎన్నో విధవావివాహాలకు తన మంగళసూత్రాలను తీసి యిచ్చేసి, మళ్ళీ చేయించుకోవడం పరిపాటి అయిపోయింది. చివరకు ఒకసారి మంగళసూత్రాలు ఇచ్చేసి తర్వాత నాకెందుకే ఇంకా ఈ మంగళసూత్రాలు అని సూత్రాలు లేకుండానే సుమంగళిగా వెళ్ళిపోయింది పెద్ద ముత్తయిదువ మా అమ్మ.
కులమత భేదాలన్నా, ఆచారాలన్నా అమ్మకు తగనిమంట. ఆవిడ ఉద్దేశ్యములో సర్వమానవ సమానత్వాన్ని అన్ని కోణాల్లో పాటించేది. ఇతర రాజకీయ నాయకులలాగా ఉపన్యాసాలిచ్చి ఇంట్లో ఆచరించకపోవడము కాదు, ఆమె వ్యవహారం, ఏమి చెప్తుందో అదే ఇంట్లోనూ చేసేది. అందుకే మా యింట్లో గౌసియా, పోచమ్మా వీళ్ళందరూ చక్కగా స్నానం చేసి, వంట చేసేవాళ్లు. నాన్నగారికి కొంతకాలం బాధగా ఉండేదికాని, తరువాత, తరువాత అలవాటయిపోయి, ఏమి పట్టించుకునేవారు కాదు. ఆయన మటుకు తెల్లవారుఝూమున లేచి స్నానం చేసి ధావళి కట్టుకొని సంధ్యవార్చు కునేవారు. ఇద్దరూ గాంధేయవాదులు ఆయన సిద్ధాంతాలనే పాటించేవారు. నాన్నగారు చనిపోయేవరకు ఖద్దరు కట్టారు. అమ్మ కొంతకాలం వరకు ఖద్దరే కట్టింది. మాకు చదువుకోడానికి ఒక గది కూడా ఉండేదికాదు, ఒక్క మా  అన్నయ్య మాత్రమే ఇంజనీరింగు చదువుతున్నాడు కాబట్టి వాడి గదిలోకి ఎవ్వరూ వెళ్లేవారు కాదు. ఇక మా నాన్నగారు అన్ని కాలాలు వరండాలోనే పడుకునేవారు, పాపం ఆయనకు ఇంట్లో పడుకోవడానికి జాగా ఉంటేగా, ఇంటి నిండా ఎప్పుడూ, ఎవరో ఆడవాళ్ళు ఉంటూనే ఉండేవారు.
ఆ రోజులే వేరు, ఇంటికి అర్ధరాత్రి మనిషి వస్తే ఎవరనిగాని, ఎవరి తాలుకా అని గాని, ఏ పనిమీద అని అడగకుండా ముఖ్యంగా ఆడవాళ్ళని అమ్మ వంట ఇంట్లో అన్నం ఉంది ఏవో పచ్చళ్ళుంటాయి, హాయిగా వేసుకుని తిని పడుకో రేపు ప్రొద్దున మాట్లాడుకుందాము అనే వాళ్ళు యిద్దరూ, అంతేగాని వాళ్ళు దొంగలా లేక ఏ దొంగలయినా తలుపు తెరిచి పెడతారేమో అనే ఆలోచనా, భయం ఇద్దరికీ ఉండేది కాదు. అంతేగాదు అసలు తలుపులు వాళ్ళు తెరిచి పెట్టడం లేదు మా యింటి తలుపులకు గొళ్ళాలు ఎప్పుడూ పెట్ట్లుకునే వాళ్ళకాం. ఆ వచ్చిన వాళ్ళకు నాలుగు అక్షరముక్కలు వస్తే జ్ఞానకుమారి హెడాగారిని అడిగి వాళ్ళకు గ్రామ సేవికా ట్రైనింగు మొదలయిన వాట్లలో సీట్లు ఇప్పించి పంపించేది మా అమ్మ. చదువు అసలు రానివాళ్ళకు కొన్ని ఏండ్లు మా యింట్లోనే ఉంచుకొని వాళ్ళకు చదువో, కుట్లో ఏదో ఒకటి నేర్చించి ట్రైనింగ్‌లకు ఉద్యోగాలకు పంపించేది. వాళ్ళకు ట్రైనింగ్‌కు  వెళ్ళబోయేముందు బట్టలు, వాళ్ళకు కావలసిన పక్కబట్టలు, కంచాలు ఇంకా కొంత డబ్బుయిచ్చి పంపించేది. వాళ్లు ట్రైనింగ్‌ పూర్తి అయి ఉద్యోగాల్లో చేరేదాక  తనే గార్డియన్‌గా ఉండి వాళ్ళకు ఏ లోటు లేకుండా చూసుకునేది. ఒక్కక్కసారి రాత్రి చూసుకుంటే దుప్పట్లు ఉండేవికావు, ఏమ్మా మా దుప్పట్లేవి అంటే కౌసల్యకో, లక్ష్మికో ఇచ్చి పంపాను. నా చేతిలో కొత్తవి కొనడానికి డబ్బుల్లేవు. ఒక రెండు రోజులు ఆగండి మీకు కొనిపెడతాను. అందాక ఏదో ఒక పాత చీర కప్పుకోండి అని  చెప్పిన సంఘజీవి. ఇంతేగాక వాళ్ళల్లో ఎవరైనా విధవ స్త్రీలుగాని, భర్తవదిలేసిన వాళ్లుగాని రెండవ వివాహానికి ఇష్టపడితే వారికి తగ్గ పెండ్లి కొడుకును వెతికి ఖర్చులు పెట్టుకొని పెండ్లి చేసి పంపించేది. అలా ఎన్నో పెళ్ళిళ్ళు చూసాము మా యింట్లో. అంతేకాదు మా స్నేహితులకు కూడా ఇండ్లలో ఇష్టపడని ప్రేమికులకు మా ఇంట్లోనే  పెండ్లిండ్లు జరిగేవి. ఓ 50 మందికి అందరం కలిసి వంటలు చేసేవాళ్ళము, ఒకళ్లు వెళ్లి  కొత్త బట్టలు పెండ్లికి కావలసిన సామానులు తెచ్చేవాళ్ళం. మా ఇంటి పురోహితులు కృష్ణమూర్తిగారు వచ్చి పెండ్లి జరిపించేవారు. అమ్మ వచ్చి అమ్మాయి పేర్లు కూడ మార్చేసేది ఒక్కొక్కసారి.
ప్లేగు రోజుల్లో ఊరంతా వెలేసిన పేషెంటును అమ్మానాన్న గారు ధైర్యంగా ఇంట్లో పెట్టుకొని అతను చనిపోతే భార్యాపిల్లలకు తగిన సహాయం చేసిన గొప్పదనం వారిదే.
ఒకసారి అర్ధరాత్రి సిఫిలిస్‌ వచ్చిన అమ్మాయి వళ్ళంతా కురుపులతో వస్తే అట్టే పెట్టుకుని మర్నాడు డాక్టరు బాలకృష్ణగారి దగ్గరకు తీసుకుని వెళ్ళితే  ఆయన ”సీతాకుమారిగారూ, ఇంట్లో అమ్మాయిలను పెట్టుకొని ఈమెను ఎందుకండీ ఉంచుకుంటారు అని, గవర్నమెంటు ఆసుపత్రిలో చేర్చిద్దాము. ట్రీట్‌మెంట్‌గూడా చాలా ఖరీదు” అంటే వెంటనే అమ్మ, మా అమ్మాయి అయితే పంపించేస్తానా అని మీరు ట్రీట్‌మెంటు మొదలు పెట్టండి బాలప్పా అంది. ఆయన, మీ ఔదార్యానికి చెయ్యెత్తి దండం పెడుతున్నాను. సరే అయితే ట్రీట్‌మెంటు నేను ఫ్రీగా ఇస్తాను. మీరు ఆమెను ఉంచుకొండి ఏం చేస్తాం అని అన్నారు. తరువాత రెండేళ్ళకు ఆ అమ్మాయికి జబ్బు నయం అయ్యాక ఎక్కడో ఉద్యోగం ఇప్పించి పంపించింది.
ఇంత విశాల దృక్పథం ఉన్న మా అమ్మ బహుశా తన పిల్లలు తప్పుత్రోవ త్రొక్కకూడదని అనుకుందేమో, ఇద్దరికీ 15 సం. వచ్చేటప్పటికీ పెళ్ళి చేసేసింది.
ఇక నాన్నగారు స్వయంగా చేసిన సంఘసేవకు లెక్కలేదు. ఆంధ్రా బుక్‌హౌస్‌  అని ఆ రోజుల్లో పేరు పెట్టుకోవడమే (నిజాం పాలనా కాలంలో) చాలా రిస్క్‌.. నాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెట్టుకోవడం మాములు మాట కాదు. అయినా ధైర్యంగా ”ఆంధ్రా బుక్‌ హౌస్‌” అని పెట్టుకోవడం ఆయన ఆంధ్రాభిమానమే. ఇక ఆ బుక్‌ హౌస్‌ నిజంగా చదువుకునే పేద విద్యార్ధులకు హౌసే. పుస్తకాలు కొనుక్కోలేని వాళ్ళకి నాన్నగారి బుక్‌హౌస్‌ ఒక లైబ్రరీలాంటిది. ఎం.ఎ., పి.హెచ్‌.డి చేసే వాళ్ళందరికి నాన్నగారు బీదవారైతే ‘బాబూ జాగ్రత్తగా చదువుకొని తెచ్చివ్వండి పుస్తకాలు’ అని అనేవారట. ఒకసారి ప్రొ. చేకూరి రామారావుగారు, ముక్తేవి లక్ష్మణరావుగారు మీ నాన్నగారి గొప్పతనం మీకేం తెలుసు, మాకు తెలుసు అని పై సంగతి చెప్పారు. నాన్నగారు ఏనాడు అమ్మని ఇంట్లో ఉన్నవాళ్లు ఎవరనిగాని ఎన్నాళ్లుంటారనిగాని అడిగేవారు కాదు. అంతేకాదు వాళ్ళతో చాలా స్వతంత్రంగా అమ్మా దేనికి మొహమాటపడకండి, మీ ఇంట్లో ఉన్నట్లే ఉండండి, మా సీతాకుమారికి కోపమెక్కువ. బడబడ అనేస్తుంది, కాని మనస్సు చాలా మెత్తన అందుకని ఆమె మీమీద దేనికైనా అరిస్తే ఏమీ అనుకోకండి అని చెప్పేవారు.. వాళ్ళు మా నాన్నగారిని నాన్నగారనే పిలిచేవారు. తన ఖర్చులన్నీ తగ్గించుకుని ఇంట్లో జనాలకు ఏ లోటు రానివ్వకుండా చూసుకున్న వ్యక్తి మా నాన్నగారు. నాన్నగారు వాళ్ళు హైదరాబాదు వచ్చిన కొత్తల్లో, బ్రాహ్మణులు చనిపోతే, మోసే బ్రాహ్మలు దొరికేవారు కాదట, అందుకని ఖండవల్లి లక్ష్మీరంజనం గారు, బాలేందు శేఖరంగారు, నాన్నగారు, కస్తూరి కృష్ణారావుగారు ఇంకా కొంతమంది కలిసి ఒక సంస్థగా ఏర్పడి హైదరాబాద్‌లో ఏ బ్రాహ్మణకుటుంబంలో మరణం సంభవించినా శవవాహకులుగా వీళ్ళు తయారయ్యేవారట. తరువాత, తరువాత నాన్నగారు మా శర్మ మామయ్య, కస్తూరి కిషన్‌రావుగారు వాళ్ళు ఎవరు పోయినా మోయడానికి వెళ్ళేవారట. బ్రాహ్మణ, అబ్రాహ్మణ అనే భేదభావం లేకుండా ఎవరైనా ఊర్లనుండి వచ్చి అడ్రసులు తెలీకుండా వెతుకుంటే నాన్నగారు వాళ్ళను మా ఇంట్లో ఉండమని అమ్మకు చెప్పి ఆయన వెళ్ళి ఇల్లు వెతుక్కొని వాళ్ళని దింపి వచ్చేవారు. ఈ లోపల వీళ్ళు పండ్లు తోముకొని , కాఫీలుతాగి, ఫలహారాలు చేసి కొన్ని సార్లు కొంతమంది కునుకుకూడ తీసి భోజనం  చేసి కూర్చునేవారు, ఇలాంటి సేవలన్నీ నాన్నగారు తన 80 వ ఏట వరకూ చేసారు. ఇక ఎవరు షాపుకు వచ్చినా పిల్ల పెళ్లి చెయ్యాలని డబ్బులేదనో, పిల్లలు చదువుకొచ్చారు ఫీజుకు డబ్బులేదంటేనో వెంటనే కాష్‌బాక్స్‌లో ఎంత ఉంటే అంత ఇచ్చేసేవారు. మీరు తలకు మించి దానాలు చేస్తుంటే ఇల్లు గడిచేదెలా అని తిట్టుకునేవారు.
అమ్మ పదేళ్లు కీస్‌ హౌస్కూల్లో సీనియర్‌ తెలుగు పండిట్‌గా కూడా ఉద్యోగం చేసింది. నిజంగా ఏ పని చేయడానికి పూనుకున్నా దాన్లో అందరికన్నా మంచిపేరు తెచ్చుకునేది. ఇప్పటికీ ఆవిడను తలచుకుంటూనే ఉంటారు ఆవిడ స్టూడెంట్స్‌. మాకు ఇంత మంచి తెలుగు వచ్చిందంటే దానికి మా సీతాకుమారిగారి భిక్ష అని విన్నపుడు మనస్సుకు ఎంతో సంతోషం కలుగుతుంది. అంతేకాదు ఎంతమందో బీదపిల్లలకు స్కూలు ఫీజులు కట్టేది. వాళ్ళకు పుస్తకాలు, బట్టలు కొని పెట్టేది. ఈ విధంగా ఆ పదేళ్ళలో గూడ అంటే 1946 నుంచి 1956 వరకూ తనకు చాతనయినంత సేవ స్కూలు వారికి చేస్తూనే ఉండేది. అంతేకాదు స్కూల్లో ప్రతి  ప్రోగ్రాముకు తనే బుర్ర కథలు, గేయ నాటికలు, నాటకాలు ఇవన్నీ రాయడమే కాకుండా పిల్లలకు తర్ఫీదుగూడ తానే ఇచ్చేది. కీస్‌ హైస్కూలు వారి వార్షికోత్సవ ఫంక్షనుకు అమ్మ నాటకమే హైలైటుగా ఉండేది. ముఖ్యంగా పురాణగాధలు తీసుకొని, పాటలు, పద్యాలు రాసి రాగయుక్తంగా వాళ్ళతో పాడించేది. ఆవిడ రాసిన పుండరీకుడు, రాధాకృష్ణ అహల్య నాటకాలు కన్నులకు కట్టినట్లుగా ఉంటాయని నాటి స్టూడెంట్స్‌ ఇప్పటికీ చెపుతుంటారు.
ఇక మా అమ్మ జీవితంలో క్ష్లైమాక్స్‌ ఒక పాపను పెంచడం. అది 1963వ సంవత్సరం. మా రెండోబాబు కృష్ణ పురిటికి వెళ్లి అమ్మా వాళ్ళ ఇంట్లో ఉన్నాను. మా బాబు పుట్టిన కొన్ని నెలలకు ఒకరోజు తెల్లవారు ఝూమున పసిపిల్ల ఏడుపు. నా ప్రక్కలో మా బాబు చక్కగా నిద్దరపోతున్నాడు. ఆశ్చర్యంతో ముందరగదిలోకి వచ్చి చూద్దుముగదా. నేనూ మా అక్క అమ్మ ప్రక్కలో ఒక పసిపాప. ”అమ్మా ఈ పాప ఎవరంటే ”వెంటనే ” నా పాపే” అంది. తరువాత తెలిసింది. ఒక పెండ్లి కాని అభాగ్యురాలు పిల్లని చంపి తను చద్దామని అనుకుంటుంటే ఎవరో ఓ పుణ్యాత్మురాలు సీతాకుమారి అనే ఆవిడుంది. ఆవిడ దగ్గరకు వెళ్లు నీ బాధలు తీరుతాయి అని చెప్పిందట. ఆ తల్లి పిల్లను మా అమ్మకు అప్పగించి, వెళ్లిపోయింది. ఇదీ ఆ పాప వెనుక కథ. ఇక  తెల్లవారాక, నాన్నగారు ”సీతా మనము పెద్దవాళ్ళమయ్యాం, ఎన్నాళ్లు బ్రతుకుతాం, కాబట్టి అవసరమయిన డబ్బుకట్టి అనాధ శిశు సంక్షేమంలో చేర్పిద్దాం అని అన్నారు. మేము ముగ్గురం ఈ సలహా బాగుందన్నాం. అయితే అమ్మ దానికి ఒప్పుకోకుండా దాని అదృష్టం బాగుంటే భగవంతుడే మనకు ఆయుష్షు పోస్తాడు కాబట్టి నేను ఈ పాపను ఎవ్వరికీ ఇవ్వను, నేను పెంచుతానని స్పష్టంగా చెప్పి లోపలికి వెళ్లిపోయింది.
ఈ సంఘసేవ ఒక ఎత్తు, ఆవిడ సాహిత్య సేవ ఒక ఎత్తు, పగలంతా సంఘసేవ, రాజకీయాలు, సభలు, సమావేశాలు, ఇక తీరికెక్కడిది సాహిత్య సేవకు. అందుకని తెల్లవారు ఝూమున లేచి రేడియో ప్రసంగాలయినా, ఎవరైనా రాసి ఇమ్మంటే బుర్ర కథలు, సన్మాన పత్రాలు, పద్య పంచరత్నాలు, పత్రికలకు వ్యాసాలు ఇవన్నీ రాయడం మా అక్కయ్య శశివంతు. మా బావగారిది ట్రాన్స్‌ఫర్‌ ఉద్యోగం కాబట్టి చాలాకాలం అక్కయ్య అమ్మకు తోడుగా ఉండేది. అన్నయ్యగూడ ఎక్కడో రాజస్ధాన్‌లో ఉండేవాడు. అందుకని అక్క బావగారు వీళ్ళను కనిపెట్టుకొని ఉండేవారు ఏ విషయమయినా సరే నిమిషాలమీద రాసేది. నా సిద్ధాంత వ్యాసానికి గూడ చాలా సహాయం చేసింది. ఆవిడకు తను బతికుండగా నేను పిహెచ్‌డి అనిపించుకోవాలన్న కోరిక. కాని నే నా కోరిక తీర్చకుండానే పోయింది. అయితే నాన్నగారు నా కాన్వొకేషన్‌కు వచ్చి చాలా సంతోషించారు.
మా ఇంట్లో కూర్చోడానికి సరియైన కుర్చీలు ఉండేవి కాదు, కాని ఆత్మీయతా అనురాగాలకు లోటు లేదు. ఇంటికి వచ్చిన అతిధి, అర్ధరాత్రి వచ్చినా ఆవిడ చేతి వంటగాని, టీగాని తాగకుండా పోవడానికి వీల్లేదు. ఆ రోజుల్లో వంట గూడ చాలా బాగా చేసేది. అడివి బాపిరాజుగారు ”అమ్మా సీతాకుమారి నీ చేతి పులిహోర తినాలమ్మా అనేవారు. నిమిషాలమీద చేసేది. అలాగే ఎన్‌.వి దొరస్వామిగారు, కమలాదేవి, మీ వంకాయ కూర అన్నం తినడానికి వచ్చా అనేవారు రాత్రి 9 గం.లకు అమ్మ విసుక్కోకుండా చేసి పెట్టేది. సరియైన ఫర్నిచరు లేని ఆ ఇంటికి అమ్మానాన్నగార్ల మీద అభిమానంతో ఎంతోమంది కవులు, రాజకీయవేత్తలు ఎన్నో రకాల విశిష్ట వ్యక్తులు వచ్చేవారు. అడవి బాపిరాజుగారు, బూర్గుల రామకృష్ణారావుగారు, మాడపాటి హనుమంతరావుగారు, గుడిపూడి ఇందుమతీదేవి, వల్లూరి బసవరాజుగారు, దాశరథి, ఆళ్వారుస్వామి, దివాకర్ల వెంకటావధానిగారు, ప్రొ. బిరుదు రామరాజుగారు, అప్పటి విద్యాశాఖామంత్రి పి.వి.నరసింహారావుగారు, ముఖ్యమంత్రి అంజయ్యగారు డా. సి. నారాయణరెడ్డిగారు, రావి నారాయణరెడ్డి గారు ఇలా ఎందరోవిశిష్ట వ్యక్తులు అమ్మను కలవడానికి వచ్చేవారు. మర్చేపోయాను. ఎంకిపాటలు రాసిన నండూరు సుబ్బారావుగారు కూడ వచ్చి మా ఇంట్లో ఆయన రాసిన పాటలు పాడడం, నాకు ఇంకా జ్ఞాపకం. మా ఇల్లు సాహిత్య చర్చలకు, రాజకీయ చర్చలకు ఆలవాలం. ఆ రోజుల్లో అంటే 1960 నుండి 65 వరకు అనుకుంటాను. నారాయణరెడ్డిగారు మాకు రెండిళ్ళదూరంలో ఇంట్లో అంటే (వెల్దుర్తి మాణిక్యరావుగారి ఇంట్లో) ఉండేవారు రోజుకొకసారైనా మా యింటికి వచ్చి అమ్మకు వారు రాసిన గేయాలో, పద్యాలో, పాటలో వినిపించి వెళ్ళేవారు. అది మా కుటుంబంతో వారికున్న సాహచర్యం, ‘నన్ను దోచుకుందువటే వన్నెల దొరసానీ’ అనే పాట ముందు మేమే విన్నామని గర్వంగా చెప్పుకునేవాళ్ళం. ఆంధ్ర యువతీ మండలిని ఆ ఇంట్లోనే రెండు గదుల ఇంట్లో స్థాపించి తానే సెక్రటరీగా చాలాకాలం ఉండి, ఇల్లిందల సరస్వతిదేవిగారు, రంగమ్మ ఓబుల్‌రెడ్డిగారు, అనంతలక్ష్మమ్మగారు, కనుపర్తి వరలక్ష్మమ్మగారు, బసవరాజు రాజ్యలక్ష్మిగారు, వీళ్లందరి సహకారంతో ఆ మండలిని వృద్ధిలోకి తెచ్చింది. మాకు పండగలన్నీ ముఖ్యంగా ఉగాది, విజయదశమి యువతీ మండలిలోనే. ఇక ప్రమదామండలి ఆవిడ స్థాపించిన రెండో సంస్థ.
ఇంతేకాదు స్వాతంత్య్రోద్యమంలో గాంధీగారి సత్యాగ్రహ పిలుపు విని తానుగూడ జైలుకు వెళ్లడానికి సిద్దపడిందట మా అమ్మ. మొదటి దఫా సంగెం లక్ష్మీబాయమ్మగారు, మరికొంతమంది స్త్రీలు రెండవ గ్రూపులో అమ్మ పేరు ఉంది. ఈ లోపు గాంధీగారు స్త్రీల నెవ్వరినీ జైలుకు పంపే ఏర్పాటు చెయ్యవద్దని గట్టిగా చెప్పడం వలన పోలేకపోయినందుకు ఎన్నో రోజులు బాధపడ్డది. అయితే బ్రిటిషువారు బాంబులువేస్తే ఎలా తప్పించుకోవాలి అనే ఎ.ఆర్‌.పి. ట్రైనింగ్‌ కూడా తాను పొందింది. స్వాతంత్య్రోద్యమంలో బహిష్కరించిన సంగతులను, కరపత్రాలను తనతోబాటు తీసుకుని చేరవేసిన ఘనత అమ్మదే. ఆవిడకు మాక్జిమ్‌ గోర్కీ ‘అమ్మ’ పుస్తకం చదవడమంటే చాలా ఇష్టం. అది ఒక వందసార్లు చదివి వుంటుంది. మాకు తెలిసి రజాకారు మూమెంటప్పుడు, స్వాతంత్రోద్యమమప్పుడు నిజాం ప్రభుత్వం మా ఇంటి మీద నిఘా పెట్టి ఉంచింది. ఎప్పుడూ సభలకు అమ్మ వెళ్ళినా ఆడపోలీసులు ఈవిడ వెంబడే ఉండేవారు. ఇంతేకాదు ‘విశాలాంధ్ర మూమెంటులో బూర్గుల రామకృష్ణారావుగారి వెంబడి ఉండి ”విశాలాంధ్ర వచ్చేవరకు విరామమే లేదు మనకు” అని అరిచి ఉపన్యాసాలు ఇచ్చి రాత్రి పగలు తిరిగిన వ్యక్తి మా అమ్మ. ఒక సభలో విశాలాంధ్ర రాకపోతే తాను ఆత్మాహుతి చేస్తానని శపథం చేసింది. మా అందరికి టెన్షన్‌, ఎందుకన్నావే అమ్మా అంటే ‘ఏం భయంలేదు’ అని ధైర్యం చెప్పి తాను ఎంతో ధైర్యంగా నిలబడిన వ్యక్తి, కొంతమంది తెలంగాణా ఆందోళనకారులు మా ఇంటికి వచ్చి బాగా గొడవపెట్టుకొని వెళ్ళారు. అయితే అప్పటి ప్రభుత్వం మాకు పోలీసుకాపలా గూడ పెట్టింది. చివరకు ఆంధ్రావతరణానికి కర్నూలుకు కూడా వెళ్లి బ్రహ్మానందాన్ని పొందిన వ్యక్తి. కృష్ణాపత్రికలో ఆనాడు ఆవిడ రచనలు ప్రచురింపబడేవి. ఇప్పుడు పిరాట్ల వెంకటేశ్వరరావుగారికి (కృష్ణాపత్రిక సంపాదకులు) కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఇలా రాసుకుంటూ పోతే అమ్మ సంగతులెన్నో  మస్తిష్కంలో మెదలుతూ ఉంటాయి. ఎంత రాసినా ఆవిడ గురించి తక్కువే, అమ్మలేని లోటు అనుక్షణం కనబడుతూనే ఉంది. ఆవిడ చేసినదాంట్లో, వీసమెత్తుకూడ చేయలేకపోతున్నామనే బాధ మా ముగ్గురికీ ఉంది. అయితే ముగ్గురమూ ఆవిడ కీర్తికి మచ్చరాకుండా మా చేతనయినంత సహాయం ఎదుటివారికి చేస్తూ ఉన్నాం.
అయితే ఇక్కడ ఒక ముఖ్య విషయం చెప్పాలి. మా భారతి గురించి (ముక్తేవి భారతి) నేను ఎం.ఎ.లో క్లాస్‌మేట్స్‌మి. ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రాణస్నేహితులం. ముక్తేవి లక్ష్మణరావుగారికి మా అమ్మా, నాన్నలపై గౌరవం, నాన్నగారన్నా, ఆంధ్రాబుక్‌హౌస్‌ అన్నా లక్ష్మణరావుగారికి అభిమానం. ఈ ఇరువురు  మా అమ్మానాన్నలను బాగా ఎరిగినవారు. అందుకని భారతి ఎప్పుడూ నాతో ”మీ అమ్మగారి రచనలు అచ్చువేద్దామే విద్యారాణి, పట్టుకొనిరా” నేను సహాయం చేస్తాను అని రెండు మూడేళ్ళనుంచి అంటోంది. ఈ ఆలోచన నా మనసులో మా అమ్మపోయినప్పట్నుంచీ వుంది. భారతి ఇందులో చొరవ చూపెట్టకపోతే అమ్మ రచనలు ఎక్కడున్నవి అక్కడే ఉండేవి. నిజంగానే నేను మా అన్నయ్య అశోక్‌ మా అక్కయ్య శశి, ముగ్గురం భారతి మాకు చేసిన ఈ ఉపకారానికి తగిన ప్రత్యుపకారం చేయలేని వారం.
మా అమ్మ రచనలు వెలుగులోకి తెచ్చిన స్నేహమయి భారతికి నేనేమియ్యగలను!! నా మనసులో పొంగిపొర్లిన భావకుసుమాలు దండగుచ్చి భారతికి వేయగలను- అంతే..
(‘యల్లాప్రగడ సీతాకుమారి జీవిత విశేషాలు’ సౌజన్యం)

Share
This entry was posted in ప్రత్యేక వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో