మచ్చెమ్మకి ‘దారి పెళ్లయింది’

మల్లీశ్వరి
ఆ రోజు తరగతి గదిలోకి అడుగుపెట్టేసరికి మచ్చెమ్మ అనే పాడేరు అమ్మాయికీ కౌండిన్య అనే విశాఖ అబ్బాయికీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. దానిని చర్చలోకి మళ్ళించాక తేలిన విషయం ఏంటంటే గిరిజనుల సంస్కృతిలో భాగమైన ‘దారి పెళ్లి’ అనే ఆచారం మీద వాదన మొదలై ఇద్దరూ చెరో పక్షం తీసుకుని పోట్లాడుకుంటున్నారని.
కొన్ని గిరిజన తెగలలో అమ్మాయిలకి గానీ అబ్బాయిలకి గానీ చిన్న వయసులో జబ్బు చేస్తే తగ్గడానికి దారి పెళ్లి చేస్తామని మొక్కుకుంటారు. జబ్బు తగ్గిపోతే అమ్మాయిలకి రజస్వల అయ్యేలోపు అబ్బాయిలకి పన్నెండు పదమూడేళ్ళ లోపు వాళ్ళ వూరి బయట నాలుగు తోవలు కలిసే కూడలిలో దారి పెళ్లి చేస్తారు. ఈ పెళ్ళిళ్ళ ప్రత్యేకత ఏంటంటే పూజలూ పెళ్లి భోజనాలూ అట్టహాసంగానే జరుగుతాయి. కానీ పెళ్లి మంటపంలో అమ్మాయో అబ్బాయో ఒక్కరే ఉంటారు. తాళి కట్టడాలూ కట్టించుకోడాలూ ఉండవు. ఒకరికి మరొకరితో జరిగే పెళ్లి కాదిది. ఒక్కరికే జరిగే పెళ్లినే దారి పెళ్ళిగా పిలుస్తారు. ఒకసారి దారి పెళ్లి జరిగిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ భవిష్యత్తులో సహచరులను ఎంచుకుని చేసుకునే పెళ్లిని మాత్రం నిరాడంబరంగా చేసుకుంటారు.
మచ్చెమ్మకి దారి పెళ్ళయ్యింది అని తెలిసి ”అసలు పెళ్ళే పెద్ద తంతు…అణచివేత…మళ్ళీ ఈ దారి పెళ్లి లాంటి మూఢ నమ్మకాలని ఆచారాల్ని వ్యతిరేకించకుండా సమర్థించుకుంటే ఎట్లా?” అంటూ ఆవేదనతో వాదిస్తున్నాడు కౌండిన్య.
”ఆ మాట చెప్పడానికి నువ్వెవరు?! మా ఆచారాల్ని నమ్మకాల్ని కించపరచే హక్కు నీకు లేదు….వాటి వెనుక అంతరార్థం ఏవుందో మా కన్నా నీకు ఎక్కువ తెలుసా? తప్పో ఒప్పో మేం ఆలోచించగలం… మేం మాట్లాడగలం… ” ఆత్మ గౌరవానికి భంగం కలిగినందుకు అవమానపడుతోంది మచ్చెమ్మ.
‘నాకు తప్పు అనిపించింది ఎక్కడ జరిగినా నేను ప్రశ్నిస్తాను’ అంటాడు కౌండిన్య. ‘అట్లా కుదరదు’ అంటుంది మచ్చెమ్మ. చివరికి విసిగిపోయి ”నేను కాబట్టి నీతో వాదించుకుంటూ కూచున్నాను. అదే బోండా జాతి స్త్రీలయితే నీ విమర్శ సంగతి సరే…. చూపుల్లో చిన్న హేళన కనిపించినా బాణం వేసి కొట్టేస్తారు తెలుసా” అంటూ వలిసె పువ్వు లాంటి మచ్చెమ్మ అగ్గి పువ్వై పోయింది. కొన్నాళ్ళ క్రితం క్రైస్తవ మైనార్టీ స్త్రీల సాహిత్యం పై జరిగిన సదస్సుకి వెళ్ళినపుడు ఒక సెషన్లో ముగ్గురు ఉపన్యాసకులు క్రైస్తవ మైనార్టీ రచయిత్రుల కవిత్వం, గేయాలూ కథలు అన్న అంశాల మీద మాట్లాడారు. అందులో ఎక్కువ భాగం మతాన్ని కీర్తించేవిగా ఉన్నాయి. మైనార్టీ మత స్త్రీలపై మెజారిటీ మతస్తుల దాడుల గురించిగానీ, మతం స్త్రీల పట్ల చూపించే వివక్ష గురించి గానీ అవగాహన స్పృహ లేకుండా సాగిన ఆ ఉపన్యాసాలు చాలా మందికి నిరాశ కలిగించిన మాట వాస్తవం.
అయితే మరి కొందరు విప్లవ రచయిత్రులకి నిరాశతో పాటు చాలా కోపం కూడా వచ్చింది. దానిని దాచుకునే ప్రయత్నం ఏ మాత్రం చేయకుండా చాలా బాహాటంగా మాటల ద్వారా ముఖకవళికల ద్వారా ప్రకటించారు. మత బోధనలు వినడానికి సదస్సుకి వచ్చామా అంటూ నిప్పులు చెరిగారు. ప్రాథమిక దశలో స్త్రీలు సమూహాలుగా సంఘటితం కావడానికి, తమకున్న అతి చిన్న స్పేస్‌లో నుంచి దొరికిన ఆసరాని పట్టుకుని తమని తాము వ్యక్తీకరించుకోడానికి చేసిన ప్రయత్నాల్లో భాగంగా వచ్చిన సాహిత్యం ఎపుడో ఒక సారి విన్నందుకే అంత ఒళ్ళు జలదరిస్తే…. ఇళ్ళలో వీధుల్లో పాఠశాలల్లో, కార్యాలయాల్లో సాహిత్య సదస్సులో అనేక పబ్లిక్‌ స్థలాల్లో అనేక రూపాల్లో జరిగే మెజారిటీ మత బోధనల సంగతేంటి? వాటి పట్ల మన తక్షణ స్పందన ఏంటి?
అట్లాగే ముస్లిం స్త్రీల బురఖా పద్ధతి మీద మిగతా మతాల వారూ తెలంగాణా వాదుల ఆగ్రహావేశాల పట్ల సీమాంధ్రులూ తరుచుగా అసహనాన్ని ప్రకటిస్తూనే ఉంటారు. లోపాలుగా ఎత్తి చూపుతూనే ఉంటారు. ఈ విమర్శలు తప్పుకాకపోవచ్చు కానీ మానవీయమైనవేనా?
ఆధునికతనీ లౌకిక విలువల్నీ సమానత్వభావనల్నీ యధాతధంగా అనుసరించడానికి చేసే ప్రయత్నాల్లో ఇలాంటి అసహనం కలిగే ప్రమాదం ఉంది. స్థిరపడిన అభిప్రాయాల్లోంచీ విలువల్లోంచీ చూస్తే దారి పెళ్లి, మత బోధనా సాహిత్యం, బురఖా పద్ధతి, ఉద్యమకారుల ఆగ్రహంలాంటివి తప్పుగా తోచవచ్చు. కానీ వాటిని అర్థం చేసుకోడానికి ఆయా అంశాలకి సంబంధించిన బాహ్య పరిస్థితుల వాస్తవికత పట్ల అవగాహన అవసరం. పరువు హత్యలూ యాసిడ్‌ దాడుల లాంటివి ఎక్కడ జరిగినా ఎవరు చేసినా ఏ సమాజమూ ఆమోదించదు. కానీ సంక్లిష్టమైన వివాదాస్పదమైన అంశాలపై బయట నుంచి పెట్టే విమర్శకి బాధ్యత అవసరం. ఏదో ఒక వైఖరిని తీసుకోడానికో, ప్రయోజనాన్ని ఆశించో, ఆధిపత్య ధోరణితోనో చేసే విమర్శ ఆయా వర్గాల అభద్రతకి కారణమౌతుంది.
తమకి భిన్నమైన వాటిని తమ జ్ఞానానికి లొంగని వాటిని చులకనగా చూసే దాడి చేసే, అణచి వేసే, పై చేయి సాధించే వైఖరిని దాటుకుని అంతర్గత విమర్శ పెట్టేవారికి బలాన్ని చేకూర్చేదిగా బయటవారి విమర్శ ఉండడం అస్తిత్వ ఉద్యమాలతో అట్టుడుకుతున్న సమాజాలకి విలువైన అవసరం.

Share
This entry was posted in లోగిలి. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో