ప్రేమ – పెళ్ళి

అబ్బూరి ఛాయాదేవి
‘ప్రేమ – పెళ్ళి అనే విషయం మీద తాజాగా ఆలోచింపజేస్తుంది  ‘తన్హాయి’ అనే ఈ నవల. మొదట్లో ‘బ్లాగ్‌’లో సీరియల్‌గా వచ్చి, తరువాత పుస్తకంగా ప్రచురితమైంది.
సంప్రదాయాల్నీ, ఆధునిక భావాల్నీ, భారతదేశంలోని వివాహ వ్యవస్థనీ, అమెరికాలోని వివాహవ్యవస్థనీ పోల్చి చూపిస్తూ, ఇక్కడా అక్కడా మానవసంబంధాల్లో వస్తున్న మార్పుల్ని సూక్ష్మంగా పరిశీలిస్తూ, విశ్లేశిస్తూ రాసిన నవల ఇది. ఆ పరిశీలనా, విశ్లేషణ పాత్రల మనోభావాలద్వారా, సంభాషణలద్వారా సహజంగా వ్యక్తం చేయడంవల్ల పాఠకులు ఆసక్తికరంగా చదివేలా, ఆలోచించేలా చేస్తుందీ నవల. ఇది ఈ రచయిత్రి ”తొలి నవల” అనిపించదు.
అమెరికాలో ఉంటున్న రెండు  తెలుగు కుటుంబాల్లో  వివాహేతర ప్రేమ లేపిన కల్లోలాన్నీ, దాని పర్యవసానాల్నీ చిత్రించిన నవల ఇది. రచయిత్రి కథనం అత్యంత ఆసక్తికరంగా, ప్రయోజనాత్మకంగా ఉంది. భార్య భర్తల అనుబంధాలనూ, పిల్లల పెంపకంలో ఎదురయ్యే అనుభవాలనూ, ఉద్యోగ స్థలాల్లో సహోద్యోగులతోనూ, ఇతర మిత్రులతోనూ ఉండే సంబంధాలనూ కళ్ళకు కట్టేటట్లు చిత్రించిన నవల ఇది.
వివాహేతర ప్రేమలో ఒక వైపు హరివిల్లుల్నీ, మరోవైపు తుఫానుల్నీ చిత్రించిన ఈ నవలలో, ప్రేమ భావాల్ని వర్ణిస్తున్నప్పుడు అక్షరాలతో అందమైన ముగ్గుల్ని వేస్తున్నట్లనిపిస్తుంది. ఈ నవలా రచయిత్రి కవయిత్రి కూడా కాబట్టి భావుకత ఉట్టి పడుతుంది ప్రతి అభివ్యక్తిలోనూ.
”అన్నమయ్య చెప్పని, రాయని అనుభూతి ఏదైనా మిగిలి వుందా అనిపిస్తుంది ఈ కీర్తనలు వింటున్నప్పుడు” అని రాసిన రచయిత్రి కల్పనా రెంటాల ప్రేమ గురించి ఈ నవలలో రాయని అనుభూతి ఏదైనా మిగిలి ఉందా అనిపిస్తుంది! అనేక సందర్భాలకు అనుగుణంగా వివిధ కోణాల్లో ప్రేమ భావనని చిత్రించింది. ”రాత్రి రాలిపోయిన పూలకోసం” అనే స్వీయ కవితా ఖండికని రాయకుండా ఉండలేకపోయింది ఈ నవలలో. రకరకాల లలిత గీతాలు ప్రేమకి సంబంధించిన వాటికి సందర్భోచితంగా ‘కోట్‌’ చేస్తూ కథనం సాగించడంవల్ల రచయిత్రికి ఆ పాటలు ఎంత ఇష్టమో తెలుస్తుంది. లలితగీతాల్నే కాకుండా, ఒక చోట, ”పోనీ, /పోతే పోనీ/.. రానీ, రానీ/వస్తే రానీ/ కష్టాల్‌, నష్టాల్‌, కోపాల్‌, తాపాల్‌్‌, శాపాల్‌ రానీ..” అన్న శ్రీ శ్రీ కవితని కూడా మనస్సులో మధన పడుతున్న సందర్భంలో ఉటంకించింది.
మామూలుగా అయితే, అంత తీరికా, ఓపికా లేక, నవలని కొంత చదివాక, ఇంతకీ ఆఖరికి ఏమైందని చివరిపేజీ చూసెయ్యా లనిపిస్తుంది. కానీ, మూడున్నర మైళ్ళ దూరాన్ని చుట్టూ వున్న ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ, అడుగులో అడుగు వేసుకుంటూ నడిచినట్లనిపించింది ఈ నవలని చదువుతూంటే. కావాలనే అంత మెల్లిగా సాగింది నా పఠనం. ప్రతి పేజీలోని ప్రతి అభివ్యక్తినీ ఆస్వాదిస్తూ.
వివాహితులైన రెండు జంటల్లోని నాయికా నాయకులు ‘ప్రేమ’ లో పడిన తరువాత క్షణక్షణం అనుభవించిన మనోవ్యధని రచయిత్రి చిత్రిస్తూంటే, ఎందుకొచ్చిన బాధ, హాయిగా సంసారం చేసుకోక ! అనిపిస్తుంది. ‘ప్రేమ’ పేరుతో పచ్చని సంపారాన్ని చెడగొట్టుకోవడమే కాకుండా, మనశ్శాంతి లేకుండా చేసుకుంటు న్నారనిపిస్తుంది. కానీ ఆ ‘ప్రేమ’ వ్యామోహబలం అటువంటిది! ఏమైనా, స్త్రీ పురుషుల మధ్య ఏర్పడే ప్రేమ ఒక ఆకర్షణ మాత్రమే. ‘ప్రేమ’ అనే పదం చాలా సంకుచితంగా అన్వయించుకుంటున్నాం వ్యక్తి గతంగానూ, సామాజికంగానూ. జిడ్డు కృష్ణమూర్తిగారి దృష్టిలో ప్రేమకి పరిధి లేదు. ‘నేను’, ‘నాది’ అనే భావనకి పరిమితంకాని స్వార్ధం అనే పొగలేని జ్వాల లాంటిది ప్రేమ. ప్రేమించే హృదయం ఉంటే ఎవరినైనా సరే లింగ, కుల, మత, వివక్ష లేకుండా ప్రేమించగలరు. అది కరుణతో కూడిన, మానవత్వంతో కూడిన ప్రేమ. వివాహం అనేది ఒక సామాజిక బంధం. అందులో అందరూ అనుకునే ‘ప్రేమ’ని వెతుక్కోవడంలో అర్థం లేదు. కుటుంబంలోని సభ్యుల మధ్య మానవతా దృష్టి ఉంటే, ఎన్నో రకాలుగా సర్దుబాట్లు చేసుకోగలుగుతారు. ధన సంబంధాలూ, అధికార పూరిత సంబంధాలూ స్వార్థ ప్రయోజనాలూ ముఖ్యమైనప్పుడు తల్లీ పిల్లల మధ్య కూడా ప్రేమ తరిగిపోతోంది. భర్త చాలావరకు మంచివాడైతే, అభిప్రాయభేదాలు వచ్చినా, అవమానాలు ఎదురైనా, పిల్లల కోసం సర్దుకుపోతారు. కుటుంబంలోనూ సమాజంలోనూ పరువు ప్రతిష్టల కోసం కూడా సర్దుకుపోతారు. భర్త కఠినాత్ముడైతే, భార్యాభర్తలు విడిపోవడానికి పిల్లలు కూడా అడ్డురారు.
ఏమైనా, ‘తన్హాయి’ నవలలోని చైతన్య కల్హార దంపతులూ, కౌశిక్‌ మృదుల దంపతులూ వివేకంతో, వాస్తవిక దృష్టితో సంఘర్షణల్ని అధిగమించి, సంసారాన్ని చక్కదిద్దుకునేలా  నవలని ముగించినందుకు రచయిత్రిని అభినందించాలి. ఈ ముగింపు ఎంతోమందికి మార్గదర్శకం అవుతుంది. అయితే, భవిష్యత్తుకి ద్వారాన్ని తెరిచే ఉంచేలా ముగించడం కూడా సహజంగా వుంది. సదుద్దేశంతో ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా, అనుకున్నట్లు సాగదు జీవితం. ఏం జరిగినా ఎదుర్కోవడానికి సంసిద్ధత ఉండాలి. ‘తన్హా’కి ఫుల్‌స్టాప్‌ ఉండదు జీవితంలో.
బ్లాగ్‌లో ఇటువంటి విషయం మీద ధారావాహికంగా నవల రాయడానికీ, ఇంటర్‌నెట్‌ పాఠకుల ప్రశంసల జల్లుకీ, విమర్శలదాడికీ స్పందిస్తూ రచన కొనసాగించడానికే ఎంత ఆత్మవిశ్వాసం ఉండాలో ఊహించుకోవచ్చు. నవలలోని ఆ ‘నలుగురూ’ అనుభవించిన మానసిక సంఘర్షణనీ, ద్వైదీభావాన్నీ రచయిత్రి అత్యంత సమర్ధవంతంగా అక్షరబద్ధం చేసింది. స్త్రీ పురుష సంబంధాల్లో ఇటువంటి సంఘర్షణలు సార్వకాలికం, సార్వజనీనం. శ్రీరాముడు మొదులుకుని, ఈ నవలలోని చైతన్య వరకూ స్త్రీల విషయంలో పురుషుల ఆలోచనలు అలాగే వుంటున్నాయి. అయితే, పురుషులందరూ శ్రీరాముడులాంటివారు కారు పర స్త్రీ వైపు కన్నెత్తి చూడకపోవడానికి. ఈ నవలలో కౌశిక్‌ మొదట్లో చొరవ తీసుకోకపోతే, పురికొల్పకపోతే, కల్హార ఆ ‘ప్రేమ’ లంపటంలో ఇరుక్కునేది కాదు సహజంగానే. స్త్రీ అందంగా ఉండటం, ఆమెకి నచ్చిన దుస్తులు ధరించడం కూడా ఆమె తప్పే అంటారు సామాన్యంగా- అది పురుషుల్ని ఆకర్షించడానికే అన్నట్లు!
ఇటువంటి సంక్లిష్టమైన ఇతివృత్తాన్ని తీసుకుని సహజంగా, సమర్థవంతంగా, ప్రయోజనాత్మకంగా, కళాత్మకంగా నవల రాసిన రచయిత్రి కల్పనా రెంటాల అన్ని విధాలా అభినందనీయురాలు.
తన్హాయి
రచన : కల్పనా రెంటాల
ప్రచురణ :  సారంగ బుక్స్‌ 2011
పే.348, వెల:రూ.199
ప్రతులకు: పాలపిట్ట బుక్స్‌, బాగ్‌లింగంపల్లి, హైద్రాబాద్‌

Share
This entry was posted in పుస్తక సమీక్షలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో