బేబీ

బి. బాలాదేవి
(భూమిక నిర్వహించిన 2011 కథ, వ్యాసం, కవితల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన కథ)
ఆడపిల్లల నిరక్షరాస్యత గురించి రాసినవి చదువుతూంటే, టీ.వీ.లో సీరియల్సూ, ఇంటర్వ్యూలు, డిబేట్లు, ఎన్‌.జి.వోల ప్రయత్నాల గురించి చూసి మనసులో ఎక్కడో ఇంకా ఏ ఆడదానికయినా ముల్లుగుచ్చుకుంటున్నట్లుంటుంది. అందులో మారు మూల చిన్న చిన్న ఊళ్లల్లో ఈ నిరక్షరాస్యతకి కారణం బాల్య వివాహాలే అంటే అతి శయోక్తి కాదేమో. అటు వంటిదే ఒక విశ్లేషణ చదివి నప్పుడు, ఆడపిల్లల మెడల్లో పసుపుతాళ్ళు ఎలా పలుపుతాళ్ళుగా ఉరి తాళ్ళుగా మారిపోతు న్నాయో అని నిజంగానే బాధ, వేదన, దు:ఖం మరింత ఎక్కువ యింది – మనసులో.
బంగారం లాంటి పసి తనానికి వివాహాన్ని అంటగట్టి, ఆడపిల్లల చదువులు అక్షరా భ్యాసం అయీ అవకుండానే ఆగి పోతున్నట్లు చేస్తున్నారు. పట్నాల్లో ఆడపిల్లల సంగతి వేరు. దేశం మొత్తం ఏ రాష్ట్రం చరిత్ర చూసినా ఇది ముఖ్యమైన అంశంగానే కన్పిస్తుంది. అటువంటిదే ఒక రాష్ట్రం ఒడిశా.
అక్కడే ఉంటున్న నాకు హఠాత్తుగా బేబీ, వాళ్లమ్మ స్మిత…. వాళ్లిద్దరూ జ్ఞాపకం వచ్చారు. ఏడెనిమిదేళ్ల క్రిందటి సంగతి అది. ఇంకా కళ్లకు కట్టినట్లు అన్నీ కనిపిస్తున్నాయి నాకు. నాలో వచ్చిన ముల్లు ఇంకా ఎక్కువగా మనుసుని తూట్లు చేసింది. ఆ రోజుల్లో ఏమీ చేయలేక పోయాను. ఇప్పుడయినా ఏమయినా చేయగలనా అని అనుమానం. కళ్ల ఎదురుగా జరుగుతున్నది మార్చలేని దురవస్థ మనది. సాంఘిక వ్యవస్థలో ఎంతని మార్పు తేగలరు… కొందరు మాత్రమే?
ఇప్పుడు బేబీకి పద్నాలుగేళ్లయినా వచ్చి ఉంటాయేమో. ఎక్కడుందో… ఎలా ఉందో? దానికి కూడా మన రాష్ట్రంలోని పసుపుతాడు లాంటిదే కాని, కొన్ని క్షణాలు చేతికి కట్టి, జీవితమంతా వివాహ బంధంలో బంధించే ఉంటారా? నాకు తెలియదు. ఆ తాడుతో పెళ్లికొడుకు, పెళ్ళికూతురు చేతులని కలిపికట్టడం ”హాతోగొంఠి” అంటారు. తెలుగులో ”చేతిముడి” అనవచ్చును మనం. పసుపుతాడు కెంత బలం ఉందో ఆ ఎర్రని తాడుకీ అంతే బలం ఉంది. అమ్మాయిల జీవితాలు దాంతో అత్తింటికి అంకితమయి పోతాయి. చదువులూ ఉద్యోగాలూ అవన్నీ కలలూ, మిథ్యలూ వాళ్లకి.
తన బేబీకి చదువు చెప్పించాలన్న పెద్ద కల కంది బేబీ వాళ్లమ్మ – స్మిత. మొదటిరోజూ బేబీని చూసినప్పుడు ముద్దుగా, కొంచెం బొద్దుగా, కళగా ఉన్న మొహంతో ఎంతో ఆనందం కలిగించేలా ఉందది. అయిదేళ్లుంటాయేమో దానికి. మావారు కారు తీసుకుని బయటికి వెళ్లాక, పెద్దగేటు వెయ్యబోతూ, అలవాటు కొద్దీ పక్కింటమ్మాయి, ఆ ఇంటి ఇల్లాలు ఆరతి కోసం పక్క ఆవరణలోకి చూశాను. ఆ లోపల వాళ్ళింటికీ మా యింటికీ కలిపి ఉన్న ఒకే కాంపౌండు వాలుతో కలిపి కట్టిన, పూలమొక్కలతో నిండిన, సిమెంటు కుండీ  దగ్గర ఎవరో ఒకమ్మాయి కొత్తగా కనిపించింది. అంత ఆరోగ్యంగా లేకపోయినా, కళ్లు లోపలికి పోయి, కళ్ల క్రింద నల్లని గీతల్లా ఉన్నా, కొంచెం అందంగానే ఉందనిపిస్తోంది ఆ అమ్మాయి. పక్క పాపిడతో దువ్వి, జడ వేసుకుంది కొంచెం ఒత్తైన జుట్టుని. ఎర్రగా సిందూరం మెరుస్తోంది పాపిడిలో. అయిదడుగుల పొడవు ఉందో లేదో తెలియడంలేదు కూర్చుని ఉండడం వల్ల. చేతులకి ఎర్రని గాజులు నిండుగా ఉన్నాయి. చక్కని లేత అరిటాకు రంగు శంబల్‌పూర్‌ నేత చీరలో ఉందామె. చామన ఛాయ కంటె కొంచెం మెరుగయిన ఛాయలో ఉందామె. అయితే నా కళ్లు ఆమె పక్కనే క్రింద కూర్చుని, పలక మీద వాళ్లమ్మ చెప్పినదేదో రాస్తున్న చిన్న పాపమీద పడ్డాయి. ఎంతో ఆకర్షణీయంగా ఉంది ఆ పాప. మొగ పిల్లవాడి క్రాపులా చేసిన నల్లని జుట్టూ, చెవులకి చిన్నచిన్న రింగులూ, రంగు రంగు పూవుల ఫ్రాకు వేసుకుంది. బొద్దుగా, గుండ్రని మొహంతో ముద్దుగా ఉంది. వాళ్లిద్దరూ నన్ను గమనించలేదు. చదువు ధ్యాసలో ఉన్నారు. వాళ్ల వెనక గేరేజి గ్రిల్లు ఉంది. ఆ గ్రిల్లు తలుపులు తెరిచే ఉన్నాయి – వెనక రూమ్‌ కనిపిస్తూ. చలికాలపు లేయెండని వెచ్చగా ఒంటికి తగుల్తూంటే ఆ ఆవరణలో వాళ్లకి చదువు తప్ప, చుట్టు పక్కల ఏమవుతున్నాదో తెలిసినట్లు లేదు.
మా గేటు తలుపులు మూయ బోతుంటే.. ఆరతి వచ్చింది తన ఇంట్లోంచి బయటికి తమ గేటు దగ్గరికి ”ఆంటీ”- అంటూ నేనూ వాళ్ల గేటు దగ్గరకి వెళ్ళి నిల్చున్నాను. నేను పక్కన ఆ తల్లీ కూతుళ్లని చూడడం గమనించి నట్లుంది కాబోలు ఆరతి అంది నాతో ”మొన్న మీరు కాలేజికి వెళ్లిపోయాక, స్మిత, బేబీ, స్మిత మొగుడు కిషోర్‌ ఈ గేరేజి వెనక గదిలో అద్దెకి దిగారు. మీకు చెప్పాలంటే నాకసలు టైము దొరకలేదు- మా పిన్నత్తగారి కుటుంబం అంతా కటక్‌ నించి రావడంతో. మీకు తెలుసుకదా- చుట్టాలొస్తే హడావుడి. కిషోర్‌ ఎప్పుడో బి.ఏ. పాసయినా, ఉద్యోగం దొరక్క ఒక స్టేషనరీ దుకాణంలో సేల్స్‌మేన్‌గా పనిచేస్తున్నాడు. మనకి దగ్గరే ”పూరీ” జిల్లాలో ఉన్న ”పిప్లీ” ఊరికి కొంచెం దూరం నించి వచ్చారు వాళ్ళు. పక్కన కూర్చున్నమ్మాయిని ”స్మితా- ఇలారా” అని పిలిచింది ఆరతి గేటు తెరిచి, ”ఈ ఆంటీ మన ఇంటికి అటు పక్క ఇంట్లో ఉంటారు. మీరున్న పక్కనే కాలేజీలో రీడరుగా ఉన్నారు. ఇద్దరమ్మాయిలు. బయట పెద్ద చదువులు చదువుతున్నారు. ఆంటీ, అంకుల్‌ మాత్రమే ఉంటారు. అంకుల్‌ మిలిటరీ ఆఫీసరు” ఆరతి చెప్తూంటే వింటూ, స్మిత కష్టపడి పైకి లేవలేక లేచి మా దగ్గరకు వచ్చింది. ఆమెతో పాటు ఆ చిన్న పాపకూడా వచ్చింది. స్మిత నా కాళ్ళకి, నేను ”వద్దు వద్దు” అని అన్నా కూడా, వినకుండా నమస్కారం పెట్టి లేస్తూ తన పిల్లతో ”ఆయీకు ముండియా మారో బేబీ” అని ఒరియాలో అంది. (అమ్మమ్మకి సాష్టాంగ నమస్కారం పెట్టు” అని తెలుగులో అర్థం.)  ఆ పాప తన చిన్న తలని నా కాళ్లమీద పెట్టి, పూర్తిగా మోకాళ్ల మీదకి వంగి, సాష్టాంగ నమస్కారం చేసింది. నాకు ఎవరయినా అలా నమస్కారం పెడ్తే మొహమాటంగా ఉంటుంది. ”దేవుడికి పెట్టండి, చాలు.” అంటాను ఎప్పుడూ. నా మనస్సులో అటువంటి నమస్కారానికి అందరూ ఎంతవరకు అర్హులు అనిపిస్తుంది. అందరూ అర్హులేనా అని ఒకోసారి అనుమానం వస్తుంటుంది.
”ఏం ఫర్వాలేదు ఆంటీ. అది మనదేశపు ఆచారం కదా. అలాగే ఇక్కడ కూడాను. అయినా నేను చెప్పడం ఏమిటి మీకు? మీకే తెలుసు బాగా. నాకంటే మీరే ఎక్కువ. ఒడిశాలోనే, పుట్టి, పెరిగి బ్రతికిన వాళ్లు. నేనేమో జెమ్‌షెడ్‌పూర్‌లో బ్రతికినదాన్ని.” అని నవ్వింది ఆరతి.
”ఆరతి చెప్పింది కదా-అదే మాయిల్లు. వస్తూండమ్మా” అన్నాను స్మితతో, ఏమనాలో తోచక. బేబీని, తలమీద చేత్తో అలవోకగా రాసి, ”నువ్వురా బేబీ, నా దగ్గర చాలా పిల్లల పుస్తకాలున్నాయి. చదువుదువుగాని” అన్నాను.
”అదిప్పుడే కే.జీ క్లాసుకొచ్చింది. మనిళ్లవెనకస్కూల్లోనే వేశాను. అంత బాగా చదవలేదు. కూడ బలుక్కుని చదువుతుంది. కాని నేను చదివి చెప్తాను లెండి” అంది స్మిత.
”సరే అయితే, నేనే తెచ్చి ఇస్తాను లేమ్మా” అంటూ స్మిత భుజం మీద చేయి వేశాను. ”నీకు వీలయినప్పుడురా సాయం కాలంపూట” అని కూడా అన్నాను.
”ఆంటీ చాలా మంచివారు. ఈ వీధి వీధంతా తెలుసును ఆ విషయం. అంకుల్‌ కూడా ఎంతో కలుపుగోలు మనిషి” అంది ఆరతి.
”మరీ అంతగా పొగడకు ఆరతీ. అవును గానీ, పిల్లలు వెళ్లిపోయారు స్కూలుకి?” అన్నాను నవ్వుతూనే.
”వెళ్లారు గానీ, ఇంకా మావారు వెళ్లారు ఆఫీసుకి. మామగారికి పాలవిరుగుడు, పంచదార ఇవ్వాలి. అత్తగారికి మరమరాలు, మిక్శరు ఇవ్వాలి. ఇంకా వంట పనెలాగూ ఉంది. ఆడవాళ్లకి పనులెక్కడ తక్కువ ఉంటాయి ఆంటీ? ఉద్యోగం చేస్తున్న మీకే తప్పలేదు. ఇంక అత్త మామలున్న మాకేం తప్పుతాయి?” అందామె.
నేను లోపలికి వచ్చాను, ఇంట్లోకి. మా వారెలాగూ ఇప్పుడేరారు. ఆయన ఎమ్‌.బి.ఏ. క్లాసులు తీసుకుందికి వెళ్లారు. నాకా రోజు మధ్యాహ్నం క్లాసులుండడంతో వంటచేసుకుని భోజనం చేసి వెళ్లాలి. హడావుడిగా వంటింట్లోకి దూరాను.
నేను ఒకో రోజు ఉదయం పదకొండు గంటలకు కాలేజికి వెళ్లినప్పుడు, స్కూలు నించి వచ్చిన బేబీకి వాళ్లమ్మ చదువు చెప్పడం చూస్తూండేదాన్ని. బేబీ చాలా తెలివైందనీ, స్కూల్లో చేరీ చేరగానే నర్సరీ రైమ్స్‌ పోటీలో ఫస్ట్‌ ప్రైజు తెచ్చుకుని, విద్యామంత్రి చేతినుంచి కప్పు తీసుకుందని ఆరతి చెప్పింది. ఆదివారం పొద్దున్నే ఓ రోజు బేబీ, వాళ్లమ్మ స్మితనీ మా ఇంటికి తీసుకుని వచ్చింది ఆరతి. మావారు బేబీని ఎన్ని ప్రశ్నలో వేసి, ఎంతో ఆడించి, ముద్దు చేశారు. ఆరతి చెప్పగానే సంస్కృత శ్లోకాలూ, జాతీయ గీతాలూ, భజనలు, నర్సరీ రైములు అన్నీ అప్ప చెప్పింది బేబీ. చిలకలాగా ముఖ్యంగా నాకు నచ్చింది. ”వరో దేవస్య ధీమహీ….” అని అంతా పొల్లు పోకుండా ఆశువుగా చెప్పడం. ఎప్పుడో పిల్లలకి కొన్న ‘భారతం” ”రామాయణం ఇంగ్లీషు కామిక్స్‌ పుస్తకాలుంటే తెచ్చి ఇచ్చాను బేబీకి.
తర్వాత్తర్వాత బేబీ, స్మితలతో మాకు చాలా అలవాటయి పోయింది. మాకిద్దరికీ అదొక సందడి. చిన్నతనంలో, ఆ వయసులో పిల్లలు ఎలా ఉండేవారో తల్చుకుని, ఆనందించేవాళ్లం. మా అమ్మాయిలు కూడా సెలవులకి వచ్చినప్పుడు బేబీ చేత అన్నీ చెప్పించుకుని, విని ఆనందించేవాళ్లు. ఆ పిల్ల అంత బాగా చదువుతుందని విని చాలా సరదా పడ్డారు వాళ్లు. ఆ పిల్ల అలా బాగా చదువుకుని పైకి రావాలని మా అందరి కోరిక కూడాను.
స్మిత ఒంట్లో అంత బావుండదని అప్పుడే తెలిసింది. పురుడప్పుడు ఎముకల్లో ఏదో వ్యాధి వచ్చి నడుం కొంచెం వెనక్కి వంగినట్లుంటుంది విల్లులా. అందుకని కళ్లు కొంచెం వంకరగా పెట్టి నడుస్తుంది ఆమె. ఒకవైపు ఎక్కువగా వంగుతుంది. ఒక కాలు వంకరగా అనిపిస్తుందప్పుడు. చేతులు కూడా ఆ వెనక్కి వంగే బరువు వల్ల, వెనక్కి వెళ్తుంటాయి నడుస్తున్నప్పుడు. నాకు చాలా కష్టంగా అనిపించేది ఆమె అలా ఒక పక్కకి వంగి వంగి నడుస్తుంటే చూసినప్పుడు. పదిహేనేళ్లకే పెళ్లయి పదిహేడు పద్దెనిమిదేళ్ల లోపలే ఒక పిల్లవాడు పుట్టిపోవడమూ, తర్వాత ఇరవైఏళ్లకి బేబీ పుట్టడమూ జరిగిందట. బేబీ పుట్టిన తర్వాత నించి ఆ ”ఆక్‌వర్డ్‌” నడక వచ్చిందిట. ఎప్పుడు ఏదో వస్తూనే వుంటుంది ఒంటికి. ఆ అమ్మాయి అలా బాద పడ్తూనే వుంటుంది. చాలా విషయాలు ఆరతి చెప్తూంటుంది- కాలేజినించి వచ్చాక, నేను కాఫీ తాగుతూన్నప్పుడు వచ్చి, భార్యకి మందులిచ్చి ఇంటి పనుల్లో వంట పనుల్లో చాలా సాయం చేసి చూసుకుంటాడు కిషోర్‌. బేబీని దంపతులిద్దరూ చాలా ముద్దుగా, మురిపెంగా పెంచుకుంటున్నారు. తనకి వచ్చే ఏ మూడువేల రూపాయల్లో తామున్న ఆ గదికి అయిదు వందలు అద్దెకిచ్చి, మిగిలిన దాంట్లో ఇంటి ఖర్చు చూసుకుని, చేసుకుంటారు. భార్యకి మందులతోపాటు పళ్లు తీసుకుని వస్తాడు. అందులోనే తన కూతురికి కూడా ఇస్తుంది స్మిత. తను తిన్నదాంట్లోనే అన్నీ బలమైన వస్తువులు ఆ కూతురికి పెట్టకుండా తినదు.  స్మిత కూడా తనకు చేతనయినంత వరకు కూరలు తరగడం, పిల్లని తయారు చేయడం, కూర్చుని బట్టలుతకడం, పిల్లకి భర్తకి తిండిపెట్టడం వగైరా పనులు చేస్తుంది.
బేబీ పుట్టిన రోజునాడు నేను కొన్ని ఒరియా బొమ్మల పుస్తకాలు, పెయింటింగ్‌ కోసం కలర్‌ బాక్సూ, డ్రాయింగు పుస్తకం వగైరాలు కొని తెచ్చాను. ఆరతి రెండు మంచి గౌనులు కొంది. స్మిత చాలా మొహమాట పడిపోయింది. సిగ్గు పడుతూ తీసుకుంది. ఎందుకివన్నీ తెచ్చారంది. అసలు స్మితకి కూడా ఏదయినా కొందామనుకుని ఊరికున్నాను ఆమె స్వాభిమానానికి అవమానంగా భావిస్తుందని  నాలో అనిపించి. ఒకరిమీద ఆధారపడే మనుషులు కారు  వాళ్లు. కూతురు చదువుకోసమని పట్నం వచ్చారు వాళ్లు- పల్లెనించి.
ఒకరోజు, నేను తొందరగా పదిగంటలలోపే క్లాసుకి వెళ్లాలని తొందరగా తయారవుతూంటే ఆరతి వచ్చి పిలిచింది కంగారుగా- ”ఆంటీ- త్వరగా రండి స్మిత ఒంట్లో బావులేదు” అంటూ. వెంటనే నేను పరుగు పెట్టాను తనతోపాటే. స్మిత మంచంమీద ఉంది. ఒకటే ఆయాస పడ్తూంది. డాక్టరు చూస్తున్నాడు. కిషోర్‌ జాలిగా, కంగారుగా డాక్టర్‌వైపు చూస్తున్నాడు. బేబీ ఇంకా రాలేదు స్కూలునించి. హఠాత్తుగా ”లాభం లేదు- ఇక్కడ ఏం చేయలేం. కటక్‌ తీసుకొని వెళ్లిపోండి” అని కిషోర్‌కి చెప్పి డాక్టరు వెళ్ళి పోయాడు. ఇక్కడున్న కాపిటల్‌ హాస్పిటల్లో కావలసిన ఎమర్జన్సీ అవసరాలు ఏమీ లేవు. నేను, ఆరతీ, ఆమె అత్తగారు బొమ్మల్లా నిల్చుండిపోయాం. కిషోర్‌ టాక్సీ తేవడానికి వెళ్లిపోయాడు. ఆరతికి ఆయాసం ఎక్కువయింది. ఊపిరి అందుతున్నట్లు లేదు. నోరు తెరుచుకుని ఊపిరి పీలుస్తోంది. ఆరతి స్మిత అరికాళ్లు రాస్తూ కూర్చుంది పక్కనే. నేను స్మిత చెయ్యి పట్టుకున్నాను- ఆరతి అత్తగారు చిన్న విసనకర్రతో విసుర్తోంది. పైన ఫాన్‌ గాలి చాలినట్లనిపించడంలేదు.
అంతలో కిషోర్‌ టాక్సీ తెచ్చాడు. టాక్సీ డ్రైవరూ, కిషోరూ, కొంచెం ఆరతి సాయం చేయగా స్మితని కారులో వెనక సీట్లో పడుకోపెట్టారు. ఈలోగా ఆరతి, నేనూ ఇళ్లల్లోకి పరుగెత్తుతున్నట్లు వెళ్లి చేతికందినంత డబ్బు తెచ్చి కిషోర్‌ చేతిలో పెట్టాం. అతను మొహమాట పడ్తూనే తీసుకున్నాడు. ఆరతి కిషోర్‌లకి స్నేహితుల్లాగ మరో జంట ఆరతి వాళ్ళ ఇంటి తర్వాత మరో ఇంట్లో అద్దెకున్నారు ఇద్దరు మగపిల్లలతో, ఆ అబ్బాయి ఒక కార్పెంటరు. అతని పేరు జగన్నాథ్‌. అతనూ కిషోర్‌తో వెళ్లాడు. అతని భార్య రోజలిన్‌ బేబీని తను చూసుకుంటానని కిషోర్‌కి చెప్పింది. ఆమె స్మిత కంటె కొంచెం పెద్దది. తర్వాత రెండ్రోజుల వరకూ స్మితకి బావులేదని కిషోర్‌ ఫోన్‌ చేస్తూనే ఉన్నాడని చెప్పింది ఆరతి.
అలా టాక్సీలో వెళ్లిపోయిన స్మిత మరి ఇంటికి రాలేదని మూడోరోజున మా అందరికీ తెలిసింది. ఆరతి వాళ్లత్తగారు కన్నీళ్లతో నిల్చున్నారు నేను వెళ్లేసరికి. వాళ్లని చూడగానే నాకూ దు:ఖం ముంచుకొచ్చింది. ముగ్గురం అలా ఆ అమ్మాయి గురించి, బేబీ చదువు గురించి ఆమె పడిన తాపత్రయం, ఆమె ఆశయం, కల గురించి, ఎంతోసేపు మాట్లాడుకుంటూ ఉండీ ఉండీ కన్నీళ్లు పెట్టుకుంటూనే ఉన్నాం. పాపం… స్మిత….. బేబీని వదిలి ఎలా వెళ్లిపోయిందో మరి… బేబీ ఏమవుతుంది? అదే మా అందరి బాధ.
ఇంటికి వెళ్లి మావారికి చెప్పాను. ముందు రోజు రాత్రి గుండె ఆగి స్మిత పోయిందని చెప్పి భోరున ఏడ్చాను. ”అలా చిన్నప్పుడే పెళ్లిళ్లు చేసి, ఆడపిల్లల్ని చంపడానికి ఎవరు వాళ్లకి అధికారం ఇచ్చారు? ఏం సంఘం ఇది! ఏమిటీ కట్టుబాట్లు?” అని. ”వాళ్లని హాయిగా బ్రతకనీరు. మనం ఏమీ చెయ్యలేకపోతున్నాం. ఈ మూర్ఖత్వం నించి ఆ పల్లె జనాన్ని మార్చలేక పోతున్నాం. ఆడపిల్లల్ని చదువుకోనీరు. వాళ్ల జీవితాన్ని శాసిస్తారు.” ఏదో అంటూనే ఉన్నాను. ”అదే మనదేశంలో జరుగుతున్న పెద్ద అత్యాచారం. మావారు మరింక ఏమీ అనలేకపోయారు.
స్మిత పాపం కష్టపడి ప్రైవేటుగా పదవక్లాసు పాసయింది. తర్వాత ఇంటరు కూడా చదువుకుంది. ఈలోగా పిల్లలు. దాంతో మరి చదవలేక, తన కూతురి మీద తన ఆశలు నింపుకుని బ్రతికింది. ”మా డాక్టర్‌ హెబీ. మోమాకు ఓషధో దేబీ.” (నేను డాక్టర్ని అవుతాను. మా అమ్మకి మందు ఇస్తాను” అనేది బేబీ. వాళ్లమ్మ కళ్లల్లో మెరుపులు, ఏదో సంతృప్తి, గర్వం కనిపించేవి నాకు. ఎప్పుడూ క్లాసులో ఫస్టు వచ్చేది బేబీ. ఒకటో క్లాసు కూడా అయిపోవస్తోంది, ఆ పిల్లచేత గ్లాసు కూడా కడగనిచ్చేది కాదు స్మిత- ”నేను కష్టపడినట్లు నా కూతురు కష్టపడకూడదు” అనేది ఏం సుఖపడిందని ఆమె?
స్మిత అంత్యక్రియలు తమ పల్లెటూర్లో చేశాడు కిషోర్‌. బేబీ రోజలిన్‌, జగన్నాథ్‌ల దగ్గరే ఉండిపోయింది. అసలు ఆ చిన్నపిల్లకి తల్లిపోయినట్లు ఎవరూ చెప్పినట్లు లేదు. బేబీ స్కూలుకి వెళ్తూ ఆగి, నన్ను చూసి పరిగెత్తుకుని వచ్చి ”అమ్మ మరో రెండ్రోజుల్లో వస్తుంది, ఊరికెళ్లింది ఆయీ” అంది.
ఆరతి దగ్గర కూర్చున్నాను. ఇద్దరం మళ్లీ స్మిత గురించే మాట్లాడుకున్నాం. ”అయితే మరి కిషోర్‌ ఏం చేస్తాడు బేబీ చదువుగురించి?” అని నేనన్న దానికి ఆరతి ” ఈ పిల్లని ఏం చూసుకుంటాడు పెళ్లి చేసుకోకుండా? చూస్తూండండి ఆర్నెల్లలో ఎలాగో పెళ్లి చేసుకునే వస్తాడు”.
అప్పుడే అటు ఆఫీసుకి వెళ్లబోతున్న ఆరతి భర్త ప్రశాంత్‌ వచ్చి కోపంగా అన్నాడు భార్యను కసురుకుంటూ ”రెండు రోజులు కూడా కాలేదు భార్యపోయి, అప్పుడే పెళ్లి మాటలేంటి? పిచ్చిగా మాట్లాడకు.”
నేనూ టాపిక్‌ మార్చేశాను. బేబీ మేనమామతో ఉంది ఆ ఊళ్లోనే అని విన్నాను.
నిజంగానే ఆర్నెల్లలో కొత్త పెళ్లి కూతురితో ఆ ఇంటికి వచ్చాడు కిషోర్‌ ఒక రోజు కార్లో. బేబీ కూడా దిగింది కాని మమ్మల్ని చూసి అదివరకులా పరిగెత్తుకుని రాలేదు. ఇంట్లోకి వెళ్లిపోయింది, సందడిగా అందరూ దిగారు కారులోంచి. ఆరోజు నేను సరిగ్గా ఆ పెళ్లికూతుర్ని చూడలేదు. నాలుగయిదు రోజుల తర్వాత చూశాను. ఆమె పేరు సబిత. మోటుగా, ఆరోగ్యంగా పొడవుగా ఉంది. పూర్తి పల్లెటూరి వాటం, మాటల తీరు ఆమెవి. తొమ్మిదో క్లాసు పరీక్షలివ్వ కుండానే పెళ్లయిపోయింది. పద్నాలుగు పదిహేనేళ్లకంటే మించి ఉండవు ఆపిల్లకి. కిషోర్‌కి ముప్పయి ఏళ్లు పైనే ఉంటాయి. పాతికేళ్లు రాకుండానే స్మిత పోయింది.
ఆ తర్వాత నేను గమనించిందేమిటంటే బేబీ వాళ్లమ్మ పోయిన తర్వాత పూర్తిగా మూగదయిపోయింది. అడగ్గానే అన్నీ అప్పచెప్పి, కిలకిల నవ్వుతూ ఆనందంగా, హాయిగా, సంతోషంగా ఉండే పసిపిల్ల మమ్మల్నందర్నీ చూస్తే ఇంట్లోకి పారిపోతోంది. స్కూలుకి వెళ్తోందికాని, మాకు మరి కనిపించడం మానేసింది. ఎలా అలా ఎందుకు బేబీ మారిపోయిందో మాకెవరికీ అర్థం కాలేదు. నెమ్మది నెమ్మదిగా సబిత సవతి తల్లి రూపం బయట పడడం మొదలు పెట్టింది. చిన్న చిన్న పనుల్తో మొదలుపెట్టి ఆ చిన్నిపిల్ల చేత అన్ని పనులూ చేయిస్తోందని చెప్పింది ఆరతి. గిన్నెలు, కంచాలు వగైరా వెనకపక్క కుళాయి దగ్గర కడిగించడం ఆరతి, అత్తగారు చూసి చాలా బాధపడ్డారు. అది చూడలేక ఆరతి అత్తగారు సబితని అడిగితే” అడపిల్ల పనులు చేయక ఏం చేస్తుంది? వాళ్లమ్మననాలి. పిల్లకి పనులు నేర్పించక పాడు చేసింది. నేను పెద్ద పెద్ద గిన్నెల్లో అన్నం వార్చి, వంట చేసేను ఆ వయసుకి. అసలు నా స్నేహితులందరూ పన్నెండేళ్లు పదమూడేళ్లకే పెళ్లిళ్లు చేసుకుని, వెళ్లిపోయారు. నాకే ఆలస్యమయిపోయింది. ఇంకా పిల్లలెప్పుడు పుడ్తారని ఊళ్లో వాళ్లు మా ఇంట్లో వాళ్లు అంటున్నారు. మా నాయనమ్మ, అమ్మమ్మ అయితే మా ఆయన ఆపరేషను చేసుకుని చెప్పలేదేమో అని అనుమాన పడ్తున్నారు. అడిగితే అదేం లేదన్నాడాయన..” అలా ఆరిందలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడ్తుండేది.
మాకందరికీ చాలా బాధగా అనిపించింది. ఎదురుగా అన్యాయం జరుగుతూంటే ఏం చేయలేక, చూస్తూ ఉండిపోయాం. మరోసారి ఆరతితో సబిత అన్నమాటలు విన్నాక, అసలు ఏం చేయగలమా అనిపించింది. ”కట్నమిచ్చుకోలేక పెద్దవాడికిచ్చి పెళ్లి చేశారు మా అమ్మానాన్న, అతనికి కూతురుందని తెలిసి కూడా. నేను మాత్రం ఏం చేస్తాను వాళ్ల మాట వినక? నేను లావుంటానని నన్నెవరూ పెళ్లి చేసుకుంది రాలేదు, నేను నచ్చక పెద్ద చదువులు చదివి మాత్రం ఏం చెయ్యాలి? ఇంకా ఇద్దరు చెల్లెళ్లున్నారు, తమ్ముడితోపాటు చెల్లెళ్ల పెళ్లిళ్లు తమ్ముడి చదువు ఎలా అవుతుంది ముందు నా పెళ్లి అవకపోతే? ఇంకోమాట చెప్పనా? మా ఇంట్లో అందరూ నాకు అబ్బాయి పుట్టాలనే కోరుకుంటున్నారు ఆడపిల్లల్తో విసిగిపోయి బాల్యవివాహం కేసు పెట్టమని అంటారుగాని, ఈ పరిస్థితుల్లో ఎవరుముందుకి వస్తారు ఆ పని చేయడానికి? అన్ని పల్లెటూళ్లల్లో అదే అవస్థ. చదువులేం వస్తాయి ఆ ఆడపిల్లలకి? అది మిలియన్‌ డాలర్ల ప్రశ్న అందరి మనసుల్లో పట్నాల్లో బతుకుతున్న వాళ్ల సంగతి వేరు.
సబిత కోరుకున్నట్లే, మరో నాలుగు నెలల్లో అది పుట్టింటికి వెళ్లింది పురుటికి. బేబీ మళ్లీ మేనమామ దగ్గరే ఉంది ఆర్నెల్లు. స్కూలుకి దింపుతున్నాడుట అతను. కిషోర్‌ ఇంటికి తాళం వేస్తుంటే ఓసారి చూసి అడిగాను. ”సబిత బావుందా? బేబీ ఎలా ఉంది?” అని. ”బావున్నారని” తలవంచుకుని వెళ్లిపోయాడతను. ఒకరోజు సబిత ఒక ఆడపిల్లని ఒడిలో పెట్టుకుని తల్లితో సహా దిగింది. బేబీ మర్నాడు వచ్చింది. కాని దాని అవతారం పూర్తిగా పాడయిపోయింది. మట్టికొట్టుకున్న సాక్సు, పాలిష్‌ లేని నల్లబూట్లు, నలిగిమాసిపోయిన నీలంరంగు స్కర్టూ, తెల్లచొక్కా, మట్టి కొట్టుకున్న ఎర్ర బెల్టూ పల్చబడిన జుట్టూ, జీవంలేని కళ్లూ… చూడలేకపోయాను దాన్ని. వాళ్లమ్మ రోజూ కుర్చీకి గేరేజి గ్రిల్లుకి తాడుకట్టి అక్కడ డ్రస్సూ, సాక్సూ ఆరవేయడం జ్ఞాపకం వచ్చింది. నాకు కన్నీళ్లు తిరిగాయి. ఆ తల్లి కల ఇలా ఆరిపోతోందా అనిపించింది. సబిత ఆమె తల్లిపిల్లని బయట ఎండలో చాపమీద పడుక్కోపెట్టి కబుర్లు చెప్పుకుంటూంటే మరమరాలు, గిన్నెల్లో, మంచినీళ్ళ సీసా తెచ్చి పెట్టేది బేబీ స్కూలు నించి వచ్చాక. ఆ పిల్లని తినమని కూడా వాళ్లు అడగరేమో? మొదటిసారి చదువుకుంటూ తల్లి టిఫిను తినిపిస్తే తింటూన్న బేబీ జ్ఞాపకం వచ్చింది నాకు.
ఒకరోజు పొద్దున్నే లేచి చూస్తే ఆ ఇంటి ముందెవరూ లేరు. ఆరతి దగ్గరికి వెళ్లి అడిగితే, ”వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు. అసలు నేనే ఖాళీ చేయమందామనుకున్నాను ఆ తల్లీ కూతుళ్ల బిహేవియర్‌కి. బేబీని పల్లెటూళ్లో గవర్నమెంటు స్కూల్లో చదివిస్తారుట. ”ప్రయివేటు స్కూలుకి డబ్బులు దండగ. ఎలాగూ పదిహేనేళ్లు వచ్చేసరికి పెళ్లి చెయ్యాలి కదా.” అంది సబిత. ఆ తల్లీ కూతుళ్లు పెట్టే బాధ చూడలేక మా అత్తగారు వాళ్లని కొంచెం దమాయించి పిల్లని బాగా చూసుకోకుంటే ”మీకు మరో ఆడపిల్ల కూడా ఉంది. మా కష్టాలు మావి. మీలా మేము డబ్బున్న వాళ్లం కాదు. ఏదో పల్లెటూరి వాళ్లం. ఆ కట్టడిలోనే బ్రతకాలి మరి!” అన్నరని ఎంతో బాధ పడ్డారు. మంచిదయింది వెళ్లిపోయారు. ఆ పిల్లబాధలు చూడలేక పోతున్నాం అంది. ఆ తర్వాత మేము మరి వాళ్లని చూడలేదు. ఆ తల్లికల కరిగిపోయిన అలాంటి బేబీలు ఎంతమంది ఈ దేశంలో? ఎప్పటి వరకూ ఇలా ….

Share
This entry was posted in కధలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో