జండర్‌ స్పృహ ఆధునిక తెలుగు సాహిత్యంలో ప్రతిఫలనాలు

కాత్యాయనీ విద్మహే
అంతర్జాతీయ పరిస్థితులు, పరిణామాలు ప్రేరణగా భారతదేశం మొత్తంమీద  సమాజంలో స్త్రీ హోదా స్థితిగతుల అధ్యయనం ఒక అత్యవసర విషయంగా 1975 తరువాత ముందుకు వచ్చింది.  ఈ సందర్భమే  కాకతీయ విశ్వవిద్యాయంలోనూ మహిళా జనజీవన సమస్యల అధ్యయనానికి చోదకశక్తి అయింది. 1978 నాటికి ఉత్తర తెలంగాణలోకి ప్రవేశించి వ్యాపిస్తున్న విప్లవోద్యమం 1977లో తెలంగాణకు గుండెకాయ అయిన వరంగల్లులో ఏర్పడిన కాకతీయ విశ్వవిద్యాలయంలో, సామాజిక శాస్త్ర అధ్యయనాలకు ‘వర్గస్పృహ’ను అందించింది.  వర్గస్పృహ వున్న చోట ‘జండర్‌ స్పృహ’ ఏర్పడటానికి అన్ని అవకాశాలు వున్నాయి. ఈ అవకాశాలను వినియోగించుకోగలిగిన మానవవనరుల కారణంగానే 1980లలో స్త్రీల జీవిత అధ్యయనాలు ముమ్మరమయ్యాయి.
ఈ క్రమంలో రెండు మంచి పరిణామాలు సంభవించాయి. ఒకటి- సామాజిక శాస్త్ర పరిశోధనలలో భౌతిక సామాజిక ప్రమేయాలకు తోడు సాంస్కృతిక ప్రమేయాలు కూడా జతపడితే అవి మరింత సజీవమూ, మానవీయమూ అవుతాయన్న గ్రహింపు కలగటం, తత్ఫలితంగా సమాజంలోని వైరుధ్యాలు సంఘర్షణలే సాహిత్యానికి ముడిసరుకు కనుక సామాజిక అంశాల అధ్యయనానికి సాహిత్యాన్ని మూలాధార విషయంగా స్వీకరించటం. రెండు సాహిత్యం వ్యక్తిని ప్రత్యేక నిర్దిష్ట అనుభవ సీమల నుంచి సరిహద్దులు లేని సర్వత్రా వ్యాపించిన సర్వజీవానుభవ స్థాయికి చేర్చే సాధనమూ, సాధన రెండూ కావచ్చు. అంతకంటే అది మానవ జీవన సంబంధాలను చలన చైతన్యాలతో ప్రతిఫలించే సంకల్ప పూర్వకమైన మానవ చర్య అన్న అవగాహన కలగటం, తత్ఫలితంగా సాహిత్యాన్ని సామాజిక సంబంధాల పరిణామాల దృష్టికోణంనుండి అధ్యయనం చేసే సంసిద్ధత, నిబద్ధత అభివృద్ధి చెందటం. ఈ పరిణామాలు సమాజ సాహిత్య సంబంధాలను కొత్తగా నిర్వచించి వాటిలోని శక్తిని సమగ్రతను ఆవిష్కరించాయి. దీనిని సంపూర్ణంగా వాడుకొంటూ సామాజిక శాస్త్ర సాహిత్య విభాగాలలో పరిశోధనలు జరిగాయి. జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు ”జండర్‌ స్పృహ- ఆధునిక తెలుగు సాహిత్యంలో ప్రతిఫలనాలు” అనే అంశంపై ఈ రెండు రోజుల జాతీయ సందస్సును నిర్వహించడం జరుగుతున్నది.
జండర్‌ ఒక సామాజిక భావన. సమాజంలో స్త్రీ పురుష సంబంధాల  స్వభావం అర్థం చేసుకొనటానికి నిర్దిష్టార్థంలో అందివచ్చిన ఒక పరికరం. స్త్రీ పురుష లింగభేదం శారీరకమైది. సహజమైంది. పుట్టుకలతో వచ్చేది. కానీ స్త్రీ పురుషుల మధ్య అంతరాలు, అసమానతలు, స్త్రీని ఒకరకంగా వర్తించే ద్వంద్వ నైతిక విలువలు పై నుంచి రూపొంది అమలవుతున్న సామాజిక వికృతులు. వీనిని అర్థం చేసుకొనటానికి రూపొందినదే జండర్‌ భావన.
జండర్‌ స్పృహ’ జండర్‌ సెన్సిటైజేషన్‌ అనే మాటకు బదులుగా వాడుతున్న మాట. స్త్రీ పురుషుల మధ్య వున్న సామాజిక వివక్షా సంబంధాలను గురించి సూక్ష్మ స్థాయిలో సున్నితంగా ప్రతిస్పందించగల చైతన్యాన్ని కలిగించడం ఉద్దేశంగా ‘జండర్‌ సెన్సిటైజేషన్‌” అనే పదబంధం రూపొందించింది. సమస్త సామాజిక అసమానతలలో స్త్రీ పురుష అసమానత చాలా సంక్లిష్టమైంది. వర్ణ, వర్గ అసమానతలు కనిపించినంత స్పష్టమైన రూపంలో ఇది కనబడదు.వర్గ, వర్ణ అసమానతలు రెండు వేరే వేరు శిబిరాలకు చెందిన వాళ్ళ మధ్య సంబంధాలు. అవి సులభంగానే అర్థం అవుతాయి. స్త్రీ పురుష అసమానతలు ఒకే శిబిరంలో వున్న వాళ్ళ మధ్య సంబంధాలు. తండ్రి కూతుళ్ళ, అక్కా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళు, భార్యా భర్తలు మొదలైన రక్తసంబంధాలు, కుటుంబ సంబంధాలు అసమానతల స్వరూపాన్ని కనబడకుండా, స్వభావాన్ని అర్థం చేసుకోకుండా నిరోధిస్తుంటాయి. అందువల్లనే వర్గ వర్ణ అసమాన మానవ సంబంధాలలో ఘర్షణ కనిపించినంత త్వరగానో తీవ్రంగానో స్త్రీ పురుషుల మధ్య ఘర్షణ కనిపించదు. లోలోపల మసులుతూ లోపలి నుండి మానవ సంబంధాలను అది విధ్వంసం చేస్తుంటుంది. ఈ పరిస్థితి ఆరోగ్యకరమైన సమాజాభివృద్ధికి ఆటంకం కావటమే కాదు. దేశాభివృద్ధిని కూడా కుంటు పరుస్తుంది.  స్త్రీ పురుషులకు అసమానతల గురించి స్పృహ కలిగించటం, మార్పు గురించిన ఆలోచనను రేకెత్తించటంద్వారా ఈ దుష్పరిణామాలను అధిగమించే వీలుంది. కనుకనే ఇటీవలి కాలంలో ప్రభుత్వాలు ప్రజలలో జండర్‌ స్పృహను కలిగించడానికి కార్యక్రమాలు చేపడుతున్నాయి.
స్త్రీ పురుషుల మధ్య వివక్షా సంబంధాలు స్త్రీల అభివృద్ధికి ఆటంకంగా వున్నాయి. కాబట్టి జండర్‌ సెన్సిటైజేషన్‌ కార్యక్రమాల అవసరం ఏర్పడింది. సంక్షేమం నుంచి అభివృద్ధికి తన విధానాన్ని పరివర్తింపచేసుకొన్న ప్రభుత్వాలకు స్త్రీల అభివృద్ధికి  అవకాశాలు కల్పించటం ఒక అవసరం అవుతుంది. జండర్‌ సంబంధాలలో అణచివేత హింసను సహించి ఆమోదించి బతికే స్త్రీలు అభివృద్ధి సాధనలో ముందుకు రాలేనంతగా తమకు తెలియకుండానే తమలో తాము ఇంటి నాలుగు గోడల మధ్య బందీలై వుంటారు. అలాంటి వాళ్ళలో చలన చైతన్యాలు కలిగించినప్పుడే అభివృద్ధి క్రమంలో వాళ్ళను భాగస్వాములను చేయటం కుదురుతుంది. జండర్‌ సెన్సిటైజేషన్‌ లక్ష్యం అదే. ఇందులో జండర్‌ వివక్షా స్వభావాన్ని గురించిన అవగాహన కలిగించటం, బాధిత జండర్‌కు ఊరటను, న్యాయాన్ని ఇచ్చే సంస్కరణలను ప్రవేశపెట్టం అనే రెండు కోణాలు వున్నాయి.
1995లో ది యునైటెడ్‌ నేషన్స్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (యుఎన్‌డిపి) ప్రకటించిన హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌ రిపోర్టు రెండంశాలను ముందుకు తెచ్చింది. ఒకటి -జండర్‌ సంబందిత అభివృద్ధి సూచికను నిర్మించి  అభివృద్ధిని స్త్రీల స్థితిగతుల సాపేక్ష సంబంధంలో నిర్వచించి వ్యాఖ్యానించింది. రెండు – ‘జండర్‌ ఎంపవర్‌మెంటు’కు కొలమానాలు రూపొందించింది. విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, నిర్ణయాధికారం స్త్రీలకు ఏ స్థాయిలో వున్నాయో దానిని బట్టి స్త్రీల అభివృద్ధి వుంటుంది. స్త్రీలకు ఆర్థిక భాగస్వామ్యం, నిర్ణయాధికారం వున్నప్పుడు సాధికారత సాధ్యమవుతుంది. స్త్రీల అభివృద్ధికి, సాధికారతకు సానుకూల వాతావరణాన్ని కల్పించటం ”జండర్‌ సెన్సిటైజేషన్‌” కార్యక్రమాల అంతిమ ప్రయోజనం.
ఈ నేపథ్యంలో భారతదేశంలో ప్రత్యేకించి ఆంధ్రదేశంలో ఇవి స్త్రీ పురుషుల చైతన్యస్థాయిలో జీవన ప్రమాణాల పెరుగుదలలో తెస్తున్న మార్పును, అభివృద్ధిని అంచనా వేయడం అవసరమవుతుంది. అయితే ఇదంతా రాజకీయ శాస్త్రమో, అర్థశాస్త్రమో చదివే వాళ్ళపని కదా! తెలుగు సాహిత్య విభాగాల వారికి దీనితో ఏమి పని అని ఒక ప్రశ్న రావచ్చు. సామాజిక శాస్త్ర విషయాలతో నింపి సాహిత్యాన్ని సాహిత్యంగా మిగలనీయటం లేదన్న ఆరోపణ కూడా రావచ్చు. అయితే సాహిత్యంలో అనావిషృత జీవనరంగాలను, జీవిత పార్శ్వాలను ఆవిష్కరించే అర్థవంతమైన పరిశోధనలను అభివృద్ధి చేయాలంటే అది ఇటువంటి సామాజిక సంబంధమైన, స్త్రీ పురుషుల వాస్తవ జీవిత సంబంధమైన విషయాలను గురించిన వర్తమాన చర్చ పరిగణనలోకి తీసుకొన్నప్పుడే సాధ్యమవుతుంది. ఆ దృష్ట్యానే ‘జండర్‌ సెన్సిటైజేషన్‌” అన్న మాటను స్థూలార్థంలో ‘జండర్‌ స్పృహ’గా అనువదించుకొని అది ఆధునిక తెలుగు సాహిత్యంలో ఏ విధంగా ప్రతిఫలించిందో పరిశీలించడం లక్ష్యంగా ఈ సదస్సుకు రూపకల్పన చేయటం జరిగింది.
సామాజిక స్పృహ ఒకప్పుడు తెలుగు సాహిత్య విమర్శలో  విస్తృతంగా ఉపయోగించబడినమాట. సమాజంలోని ఉత్పత్తి శక్తులకు, సంబంధాలకు మధ్యవున్న వైరుధ్యాల, సంఘర్షణల ఫలితంగా వస్తున్న పరిణామాలకు, ఫలితాలకు సంబంధించిన అవగాహన స్థూలంగా ‘సామాజిక స్పృహ’ అనబడుతుంది. ఈ అవగాహన రచయితకు ఏ మేరకు వుంది? సమాజంలో భిన్న వర్గాల మధ్య భేదాలను ప్రయోజన వైరుధ్యాలను గుర్తించి రచనలో భాగం చేయటంలో రచయితల చైతన్య స్థాయి ఏ విధంగా పనిచేసింది మొదలైన ప్రశ్నలు ‘సామాజిక స్పృహ’ గురించిన చర్చల్లో ప్రధానమయ్యాయి. సామాజిక స్పృహ వంటిదే జండర్‌ స్పృహ.
సాహిత్యం అంటేనే మానవ జీవన సంబంధాల సంపుటి. అందులో స్త్రీలు వుంటారు. పురుషులు ఉంటారు. స్త్రీలకు, పురుషులకు మధ్య కౌటుంబిక సంబంధాలుంటాయి. సామాజిక సంబంధాలుంటాయి. సామాజిక సంబంధాలంటే రాజకీయార్థిక సంబంధాలు, వ్యవసాయ ఉత్పత్తి సంబంధాలు స్థిరపడిన కొద్దీ సామాజిక వర్గాలలో అధికార ఆధీన వర్గాలు రూపొందినట్లే పురుషులకు స్త్రీలకు మధ్య కూడా అటువంటి సంబంధాలు అభివృద్ధి చెందుతూ  వచ్చాయి. రూపంలో పెద్దగా వ్యక్తం కాకపోయినా  సారంలో మాత్రం అవి వాస్తవం అయ్యాయి. స్త్రీల సమస్త జీవితం పురుషాధీనమైందిగా నిర్వచించబడటంతో ఇంట్లోను బయట స్త్రీల సమస్త ఆలోచనలు, చర్యలు పురుష ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ధేశించే, నియంత్రించే వ్యవస్థ తయారైంది. ఈ విధంగా స్త్రీ పురుషుల మధ్య శారీరక లింగ భేదాలను మించిన సామాజిక వివక్షను స్థిరీకరించే ప్రక్రియ కౌటిల్యుని అర్థశాస్త్ర కాలం నాటికే ప్రారంభమై మనుధర్మశాస్త్ర వాత్స్యాయన కామ సూత్రాలతో పూర్తయింది.
స్త్రీ పురుషుల అసమ సాంఘిక సంబంధాలకు మానవధర్మం అని మనుధర్మ శాస్త్రం న్యాయ సంబంధ్ధతను సమకూరిస్తే ఆ ప్రాతిపదిక మీదనే కామశాస్త్రం లైంగిక సంబంధ వ్యవస్థను నిర్థారించింది. నీతిశాస్త్రాలు, ధర్మశాస్త్రాలు వాటిననుసరించే రాజ్యం,మతం, కులం తదితర వ్యవస్థలు, అవి నిర్మించి ప్రచారం చేసిన భావజాలం లింగ వివక్షను పెంచి పోషించాయి. విచిత్ర మేమిటంటే అది వివక్ష అని తెలియరానంతగా  దానిని కీర్తించటంలో, ఒక ఆదర్శంగా ప్రతిపాదించి చూపటంలో, సాహిత్యం ప్రముఖ పాత్ర వహించింది. దాని ప్రభావం ఎంతటిదంటే ఆధీనతను గురించిన స్పృహే లేకుండా చేసేటంతటిది.. ఆధీనత వున్నదని గుర్తించటానికి, అంగీకరించటానికి పురుషులేకాదు. స్త్రీలు కూడా సంసిద్ధంగా లేకపోవటం, స్త్రీలు పురుషులు సమానమేనన్న భ్రమలో జీవించటనాకి అందరూ అలవాటు పడటం దాని ఫలితం. ఇటువంటి పరిస్థితులలో అన్ని సామాజిక అసమానతలను గుర్తించి వాటిని రూపుమాపటానికి సంస్కరణోద్యమాల నుండి విప్లవోద్యమాల వరకు అనేక ఉద్యమాలు నిర్మించుకొన్న ఆధునిక యుగంలోనైనా, సాహిత్యరంగంలో రచయితలు ఎంతవరకు ‘జండర్‌ స్పృహ’తో రచనలు చేశారో, పరిశీలించి స్త్రీ పురుషుల ఆలోచనా ధోరణిలో మార్పును ఆశించి పనిచేశారో అంచనా వేయాలన్న ఉద్దేశ్యంతో ”జండర్‌ స్పృహ-ఆధునిక తెలుగు సాహిత్యంలో ప్రతిఫలనాలు” అనే ఈ సెమినారును  ఏర్పాటు చేయటం జరిగింది.
పద్ధతి-పరిధి
సాహిత్యంలో ‘జండర్‌ స్పృహ’ గురించిన చర్చ ప్రారంభించ టానికి ప్రాథమికంగా స్త్రీ పురుషుల మధ్య వివక్ష వున్నదన్న అంగీకారం వుండాలి. స్త్రీల తక్కువ తనం గురించిన భావనను ప్రశ్నించగలగాలి. స్త్రీలు భౌతికంగా మానసిికంగా దుర్భలులు, మేధోజ్ఞానం, లౌకిక జ్ఞానం అంతగా లేనివాళ్ళు. కొన్ని విషయాలు పురుషులవలె స్త్రీలు నేర్చుకోలేరు. కొన్ని పనులు చేయలేరు. మొదలైన స్థిరపడిన ఈ భావనలు సరియైనవే, సత్యమే అనుకొంటే జండర్‌ స్పృహ లేనట్లే. ఇవి ఏ మేరకు వాస్తవం? వాస్తవం అయితే వాటికి కారణాలేమిటి? వాస్తవం కాకపోతే అవి ఎందుకిలా కల్పించబడ్డాయి? ఏ ప్రయోజనం కోసం? వీటిని అధిగమించటానికి స్త్రీలు పడుతున్న ఆరాటమేమిటి?  అధిగమించటానికి వున్న ఆవరోధాలేమిటి? ఈ ఆరాట పోరాటాలలో స్త్రీలు ఏ మేరకు నిలదొక్కుకొంటున్నారు?ఎక్కడ జారిపోతున్నారు? ఎందుకు రాజీపడుతున్నారు? ఈ మొదలైన ప్రశ్నలతో సాహిత్యాన్ని, ఇతివృత్తాలను తర్కించటం జండర్‌ దృక్పథంలో భాగం.
స్త్రీల జీవితం పురుషులకు ఆధీనమైంది అన్న నమ్మకాన్ని బద్దలుకొట్టాలి. పురుషుల అవసరాలు అభివృద్ధి మార్గాలకు అనుగుణంగా స్త్రీల జీవితం ఎప్పటికప్పుడు కుదించబడి కుంచించబడుతున్న క్రమంలోని రాజకీయ స్వభావాన్ని గుర్తించి ప్రశ్నించాలి. ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ వుంది అనేది ఇదివరలో స్త్రీలకు గర్వించదగిన అంశమే అయివుండవచ్చు. కానీ ఇప్పుడు తరచి చూడవలసినది. ఇన్నాళ్ళు సోదెలోకి రాకుండా పోయిన స్త్రీల జీవితాలు, ఆకాంక్ష, అభివృద్ధి, వాటికి సాహిత్యంలో లభించిన స్థానమెంత?  సాహిత్యంలో అవి నిర్వచించబడిన తీరు ఏమిటి? అనే దిశలో సాహిత్య అధ్యయనం జరగాలి.
ఇంట్లో నివసించేది స్త్రీ పురుషులిద్దరూ అయినా స్త్రీ పురుషుల సంబంధంలోనే కుటుంబం ఏర్పడినా ఇల్లు కుటుంబం స్త్రీకి మాత్రమే చెందినదిగా ఎందుకు వున్నాయి అనేది ఈనాటి ప్రశ్న. ఆదర్శగృహిణి, ఆదర్శ భార్య, ఆదర్శ మాత మొత్తానికి ఆదర్శ స్త్రీ – ఈ మొదలైన నమూనాలన్నీ స్త్రీల నుండి ఏమి ఆశిస్తున్నాయి. ఈ నమూనాలలో వున్న అధికార రాజకీయాలను ఇప్పటికైనా గుర్తిస్తున్నారా? గుర్తిస్తే ఏ మేరకు అవి సాహిత్యంలో భాగమవుతున్నాయి? అనితరచి చూడడం ఇప్పుడు జరగాల్సిన పని.
ఇప్పుడిక జండర్‌ స్పృహ గురించిన అధ్యయమనమంటే సాహిత్యంలో స్త్రీ పాత్ర చిత్రణ కాదు. స్త్రీ సమస్య చిత్రణకాదు. స్త్రీ పాత్ర చిత్రణ అన్నప్పుడు స్త్రీ పాత్రలు ఇంకా ఇలా చిత్రించబడ్డాయి అని ఒక సమాచారం ఇయ్యటంగా వుంటుంది. యధాతథస్థితి స్వీకరణే ఇందులో ప్రధానమవుతుంది. స్త్రీ సమస్యా చిత్రణ అన్నప్పుడు బాల్య వివాహానికో, సతికో, వరకట్న సమస్యకో, కుటుంబ హింసకో అది పరిమితమవుతుంది. సానుభూతి వ్యక్తీకరణగా వుంటుంది. ఈ పరమితులను మించిన పరిధి ‘జండర్‌ స్పృహ’కు ఉంటుంది. ఇది మొత్తం రచనలో వ్యాపించి వుంటుంది. ఇతివృత్తం అంతటా విస్తరించి సంభాషణలో, సన్నివేశ చిత్రీకరణలో, పాత్రల అంతరంగంలో చెలరేగే భావోద్వేగాలలో మౌనంలో, మౌనాన్ని బద్దలు కొట్టటంలో రకరకాల రూపాలలో జండర్‌ స్పృహ వ్యక్తమవుతుంది. కేవలం ఉపరితల కథా విషయంలో మాత్రమే దానికి ఉనికి వుంటుందను కొనరాదు. రచనను మళ్ళీ మళ్ళీ చదువుతుంటే తప్ప అది అవగాహనకు రాదు. శబ్దానికి వ్యావహారిక వాచ్చ్యార్థాన్ని మించిన విశేషార్థస్ఫూర్తి సన్నివేశాన్ని సందర్భాన్ని, ఉద్దేశాన్ని బట్టి కలుగుతుందని, మననం వలన భావనాశక్తి వలన అది పాఠకులకు అందివస్తుందని ‘ధ్వని సిద్ధాంతం’లో ఏది చెబుతామో అది సాహిత్యంలో అంతర్భాగంగా వుండే జండర్‌ స్పృహను గుర్తించటానికి కూడా అన్వయించుకోదగిందే.
ఆధునిక తెలుగు సాహిత్యంలో జండర్‌ స్పృహను గురించిన అధ్యయనానికి ప్రాతపదికలుగా తీసుకొనవలసిన మూడంశాలు 1. రచయిత చైతన్యం 2. రచయిత సంకల్పం 3. రచయితపై నియంత్రణ
రచయిత చైతన్యం సామజిక పరిణామ సంబంధజ్ఞానం వల్ల, సమకాలపు సమాజ గతి శీల లక్షణం గురించిన అవగాహనవల్ల, అభివృద్ధికర శక్తుల ఎదుగుదల గురించిన ఆకాంక్షల నుండి రూపొందుతుంది. వాళ్ళు వాళ్ళ సామాజిక భౌతిక జీవిత సంస్కారాలు, దృక్పథాల నుండి రచయితల చైతన్య స్థాయిలో భేదాలుంటాయి. దానిని బట్టి ఆయా రచయితలలో జండర్‌ స్పృహ భిన్న భిన్న స్థాయీ భేదాలతో వుండటానికి వీలుంది. ‘ఆడచెత్త మగ మాణిక్యం’ అన్న భావన సమాజంలో వుందని గ్రమించి నిరసన స్వరంతో సత్యవతీ చరిత్ర నవలలో చెప్పిన కందుకూరి వీరేశలింగం పంతుకు సంస్కరణోద్యమంలో భాగంగా జరుగుతున్న వితంతు వివాహాలు మళ్ళీ పెద్దలు కుదిర్చి చేసే పెళ్ళిళ్ళులాగా వున్నాయి తప్ప అందులో ఆడపిల్లల అభిప్రాయాలకు ఇష్టాలకు తావులేకుండా పోయిందని గుర్తించి కన్యాశుల్కం నాటకంలో బుచ్చమ్మ ప్రాజ్ఞరాలై తానెవరిని పెళ్ళాడాలో తానే నిర్ణయించుకొంటుందని అందుకు అవకాశమిచ్చే జ్ఞాన చైతన్యాల వికాసానికి ఆమెను చదువులో ప్రవేశపెట్టిన గురజాడ అప్పారావుకు, ఆలోచించే మెదడు అనుభూతి చెందే హృదయం అనుభవం పొందగల శరీరం వున్న మానవ వ్యక్తిగా స్త్రీని గుర్తించి ఆమె ఇచ్ఛలు, ఆమె ఆశలు, ఆమె ఆకాంక్షలు, ఆమె ఆదర్శాలు, కౌటుంబిక అధికార సంబంధాలతో ఆమె పెనుగులాట వస్తువుగా చేసి నవలలు కథలు రాసిన చట్టానికి, ఆడపిల్ల పుడితే ఇంట్లో ఎవరో చనిపోయినంతగా దిగులును దు:ఖాన్ని పడేంతగా అమానవీయ అసమానతలకు దిగజారిన కుటుంబాన్ని, ఆ కుటుంబంలో సెలవులు, జీతమూ లేని నౌకరుగా స్త్రీలకి వున్న స్థానాన్ని, మొత్తం మీద పేదవాళ్ళుగా పుట్టడం, తక్కువ కులాల్లో పుట్టడం అనేవి మనిషిని అన్ని అవకాశాలకు గౌరవాలకు దూరం చేసినట్లేగా స్త్రీగా పుట్టడం స్త్రీని మరింతగా వాటికి దూరం చేస్తూ విషాదంలోకి నెట్టి వేస్తున్న స్థితినీ చెప్పగలిగిన నవలలు, కథలు రాసిన కొడవటిగంటి కుటుంబరావుకు చైతన్యస్థాయిలో స్పష్టమైన భేదం వుంది. ఇది వాళ్ళ వాళ్ళ జీవిత నేపథ్యాలనుండి, వాళ్ళ కాలానికి అందివచ్చిన జ్ఞానం నుండి, వాళ్ళు అభివృద్ధి చేసుకొన్న దృక్పథం నుండి రూపొందిన చైతన్యం. అందువల్ల చైతన్యస్థాయిలో భేదాలను గుర్తిస్తూ అవి ఎందువల్ల ఆ విధంగా వున్నాయో నిర్థారించుకొంటూ అధ్యయనం సాగించాల్సి వుంటుంది.అదే విధంగా ఒక కాలంలో వున్న వాళ్ళందరి చైతన్య స్థాయి కూడా  ఒక రకంగా వుండవు. ఒకే దేశకాల పరిస్థితులలో జీవిస్తూ కూడా భిన్న జీవిత దృక్పథాలను రచయితలు అభివృద్ధి చేసుకొంటారు. జీవితానికి చోదక శక్తులు ఏవో గుర్తించటంలో వచ్చే ప్రాధాన్యతల ప్రయోజనాల ప్రమేయాన్ని బట్టి ఒకే కాలంలో రచయితల సాహిత్య జీవిత దృక్పథాలు భిన్న భిన్నంగా రూపొందుతాయి. చలానికి సమకాలికుడైన విశ్వనాథ సత్యనారాయణ జండర్‌ వివక్ష ధర్మబద్ధమైనదని ప్రతిపాదిస్తూ వివరిస్తూ సమర్థిస్తూ రచనలు చేసిన విషయం గమనించదగింది.  జండర్‌ స్పృహకు సంబంధించిన అధ్యయనాలకు ఇలాంటి వైరుధ్యాలను అర్థం చేసుకొనటం కూడా అవసరమే.
రచయిత చైతన్యం సంకల్పానికి దారి తీస్తుంది. తాను జీవిస్తున్న సమాజంలో తన చుట్టూ వున్న మనుషులలో లింగవివక్ష, వైరుధ్యాలు, సంఘర్షణలు ఏయే రూపాలలో వ్యక్త మవుతున్నాయో, ఏ పరిష్కారాన్ని పొందుతున్నాయో తమ సాహిత్యంలో చిత్రించి చూపాలని, రచయితలు సంకల్పిస్తారు. తాము ఏ విధమైన దిశా నిర్దేేశం చేయాలనుకొంటారో అది కూడా ఆయా సాహిత్యేతి వృత్తాలలో భాగమవుతుంది. ఇటువంటి రచయితలను మనం సులభంగానే గుర్తించవచ్చు. చలం, కుటుంబరావు, రంగనాయకమ్మ మొదలైనవారు ఈ కోవకు చెందినవారు.
లింగవివక్ష గురించిన అవగాహన, విమర్శ పెద్దగా లేకుండానే అసంకల్పితంగానే  అయినా రచయితలు దానిని తమ సాహిత్యేతి వృత్తాలలో భాగం చేయవచ్చు. రచయితకు సమాజంతో వుండే సజీవ సంబంధంవల్ల సమాజంలోని ఏ అంశాన్ని సాహిత్య వస్తువుగా తీసుకొన్నా ఆ పరిధిలోనే స్త్రీ పురుష సంబంధాలు రచయిత  యొక్క కళాత్మక ప్రతిభ కారణంగా వాస్తవ స్థితిలో ఆవిష్కరించబడతాయి. అది వాళ్ళ దృక్పథాలన్ని పట్టిచ్చే అంశం కాడూ కావచ్చు. కనుక ఏ రచయితనైనా ఈ ‘జండర్‌ స్పృహ’గీటురాయిగా అధ్యయనం చేయవచ్చు. ఇందువల్ల ఒక్కొక్కసారి అద్భుతమైన ఫలితాలు రావచ్చు. ఒక్కొక్కసారి కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోవచ్చు. కానీ ఏ కాస్త కొత్తనైనా ఆవిష్కరించాలంటే ప్రయోగాలు పరిశోధనలు- అవి అన్ని సందర్భాలలో ఫలవంతం కాకపోయినా చేయవలసే వుంటుంది.
రచయితలు తమ అంతర్గత భావ సంఘర్షణను, చరిత్రమీద వర్తమానం మీద తమకు కలిగిన అభిప్రాయాలను భవిష్యత్తు మానవ జీవితం గురించిన  తమ ఊహలను ఆదర్శాలను వ్యక్తం చేయటానికి రచనలు చేస్తున్నా, కవిత్వంలో కంటే  వచన రచనా ప్రక్రియలైన నవల కథ మొదలైన వాటిలో తమను తాము ఏ ముసుగులు లేకుండా ఆవిష్కరించుకోగలరు అనుకొన్నా అన్ని వేళలా అది సాధ్యం కాకపోవచ్చు. తమ భావాలను అభిప్రాయాలను, ఆదర్శాలను స్వేచ్ఛగా ప్రకటించకుండా  అడ్డుపడే ప్రకటిత సామాజిక ఆంక్షలకు అప్రయత్నంగానే లోబడి పోవచ్చు. స్త్రీల విషయంలో ఇది మరీ ఎక్కువ. వివక్ష వాళ్ళ అనుభవంలోకి వస్తూనే వుంటుంది. దానిపై కోపం కూడా కలుగుతుంది. వ్యతిరేకించాలన్న కాంక్ష, తిరగబడాలనే తపన బలీయమవుతాయి. పెంపకంలో ఇవ్వబడిన శిక్షణ, స్త్రీ గురించి ప్రచారంలో వున్న నమూనాలు  ఇవన్నీ స్త్రీలను వివక్షపట్ల చాలా సందర్భాలలో మౌనంగా వుండేటట్లు చేస్తాయి. రాజీ పడేట్లు చేస్తాయి. వీటిని అర్థం చేసుకొనాలంటే స్త్రీల రచనలను ముఖ్యంగా కథలను నవలలను జాగ్రత్తగా అధ్యయనం చేయాల్సి వుంటుంది.
ఆత్మగౌరవం, స్వాభిమానం వంటి విలువల సంగతి తెలిసీ తమను తాము అభావం చేసుకొనే స్త్రీల జీవిత విషాదాన్ని శివరాజు సుబ్బలక్ష్మి, ఆచంట శారదాదేవి తదితరుల రచనలో చూడవచ్చు. నన్ను నన్నుగా గుర్తించమని కోరే చైతన్యంకల స్త్రీలను సెక్రటరీ వంటి నవలలో సృష్టించిన యద్దనపూడి సులోచనారాణి స్త్రీల అభివృద్ధికి అభ్యుదయానికి నిర్మించబడిన స్త్రీ ఉద్యమాలనే స్త్రీలకు హానికరమైనవిగా చూపించే సౌగంధిలాంటి నవలలు ఎందుకు రాయవలసి వచ్చిందో కూడా మనం చర్చించాల్సి వుంది. స్త్రీల సమస్యలను చాలావరకు గుర్తిస్తూ, వ్యక్తిత్వ వికాసంతో ప్రవర్తించటాన్ని ఆశిస్తూ కూడా కౌడూరి కౌసల్యాదేవి వాళ్ళందరినీ చివరికి కుటుంబ సంప్రదాయానికి, ఎందుకు లోబరచిందో జవాబు తెలుసుకొనేందుకు సందర్భాన్ని సమకూర్చేది జండర్‌ దృక్పథంతో చేసే అధ్యయనమే.
అభివృద్దికి కొలమానాలుగా చెప్పబడిన విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, నిర్ణయాధికారం అనే నాలుగు అంశాలకు స్త్రీల జీవితంలో ఎంత అవకాశం వుందో దానిని బట్టి సాధికారతా దిశలో స్త్రీ గమన వేగాన్ని అంచనా వేయవచ్చు. అందుకు సాహిత్యాన్ని మూలాధార విషయంగా తీసుకొని పరిశోధనలు చేయాలి. స్త్రీకి ఇవ్వవలసిన విద్య గురించిన భావనలు, అభిప్రాయాలు, ఆచరణలు, విద్య గురించిన స్త్రీల తపన విద్యకోసం పడిన ఘర్షణ – ఎదుర్కొన్న అవరోధాలు, సాధించిన విజయాలు పొందిన ఓటములు, పడిన రాజీలు మొదలైన వన్నీ సాహిత్యేతి వృత్తాలలో ఎలా భాగమయ్యాయో పరిశీలిస్తే అది స్త్రీలకు తెలియని స్త్రీల చరిత్రని పునర్నిర్మించటానికి వీలు కల్పిస్తుంది. ఏదో ఒక రచనే విద్యా విషయంలో ఎదుర్కొంటున్న వివక్షను సర్వసమగ్రంగా ఆవిష్కరించ లేకపోవచ్చు. అనేక రచనలలో వేరు వేరుగా ఇతివృత్తాలలో భాగంగా చర్చించబడిన అంశాలను ఒక దగ్గరకు సమీకరిస్తే ఆ జ్ఞానపరిమాణం స్త్రీ విద్య విషయంలో గుణాత్మక విలువల నిర్ధారణకు తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. అందుకోసం కాలపరిధినో, ప్రక్రియనో, నిర్ధారించుకొని చేసే శాంపిల్‌ సర్వేలు వంటివి సాహిత్యంలో కూడా జరగాలి. ఉద్యోగాది తదితర విషయాలలో కూడా జరగవలసినది ఇదే. సాహిత్యం సమాజ గమనగతి అనుసరిస్తున్నదో వేగవంతం చేస్తున్నదో, వెనుకబడివుందో దీనితో స్పష్టమవుతుంది. అట్లానే జీవితంలో వున్న విస్తృతిని, సంక్లిష్టతను సాహిత్యం సక్రమంగా  ప్రతిఫలించగలిగిందా లేదా అని విచారించటానికి కూడా ఈ విధమైన అధ్యయనాలు తోడ్పడతాయి. ఇలాంటి అధ్యయనాలు పెరిగే కొద్దీ సమాజ చలన సంబంధాలను ప్రతిఫలించే శక్తివంతమైన సాధనంగా సాహిత్యంగా పదునెక్కించు కొనటానికి అవకాశాలు ప్రయత్నాలు మరింత మెరుగవుతాయి.
ఆధునిక యుగంలో అభివృద్ధి చెందిన సంస్కరణోద్యమ జాతీయోద్యమ విప్లవోద్యమాలు కలిగించిన ప్రభావాలు రచయితల జండర్‌ దృక్పథంలో ఏమైనా  గుణాత్మకమైన మార్పులు కలిగించాయోమో కూడా ప్రత్యేకంగా అధ్యయనం చేయాలి.  స్త్రీల జీవితంమీద స్త్రీల అధికారం అనేది సంస్కరణోద్యమం పరిధిలోకే రాదు. జాతీయోద్యమం ఆ సరిహద్దులనే తాకలేదు. విప్లవోద్యమం  అయినా స్త్రీల జీవితం మీద స్త్రీల అధికారం అన్న అవగాహనను కనబరచగలిగిందా అంటే ఆగి ఆలోచించవలసే వుంటుంది.  శ్రమ దోపిడికి తోడు ఆడవాళ్ళు లైంగిక దోపిడికి, మగవాళ్ళ పెత్తనానికి, కుటుంబ హింసకు బలి అవుతుంటారు. అన్న విషయంలో అంగీకారమైతే వుంది. కానీ విప్లవోద్యమంలో భాగస్వాములు కావటమే దానికి పరిష్కారం అన్న యాంత్రిక ధోరణిలోకి జారిపోవటం అందులో జరిగిందన్న ఆరోపణ విప్లవోద్యమ సాహిత్యంపై వుంది. అందులో సత్యాసత్యాలు తేలాలంటే విప్లవ సాహిత్యాన్ని జండర్‌ దృక్పథంతో పున:సమీక్షకు, విమర్శకు పెట్టాలి.
స్త్రీల జీవితంపై స్త్రీలకు అధికారంలేని స్థితిని స్త్రీవాద సాహిత్యం స్పష్టంగా రంగంమీదికితి తెచ్చి చూపింది. స్త్రీల జీవితంపై స్త్రీలకు అధికారం వుండాలంటే సాధికారత సాధించబడవలసిన లక్ష్యం అని నిజాయితీగా నమ్మితే, భిన్న జీవిత పార్శ్వాలను జీవన రంగాలను అల్లుకుపోయిన లింగవివక్షా సంస్కృతి అమానవీయమైనది, అప్రజాస్వామికమైనది అని గుర్తించి దానిని ధ్వంసం చేసి నూతన ప్రజాస్వామిక సంబంధాలు స్త్రీ పురుషుల మధ్య నెలకొనటానికి చిత్తశుద్ధితో కృషి చేయవలసి వుంటుంది. స్త్రీవాద సాహిత్యం ఆ ప్రయోజనాపేక్షతోనే వస్తున్నది. దళిత స్త్రీవాదం దానిని ఇంకా సూక్ష్మ స్థాయిలో పడునెక్కిస్తున్నది. ఈ విధంగా వచ్చే సాహిత్యం సమాజంలో జండర్‌ స్పృహను పెంచటానికి రూపొందించే కార్యక్రమాలలో భాగంగా భావజాల వ్యాప్తికి సరళ సుందరము శక్తివంతమూ అయిన సాధనంగా ఉపయోగపడగలుగుతుంది కూడా. పి. సత్యవతి రాసిన ఇల్లలకగానే కథ, ఓల్గా రాజకీయ కథలు, విమల వంటిల్లు వంటి కవితలను ఇందుకు సమర్థవంతంగా వాడుకొనటం ఇప్పటికే ప్రారంభమైంది. సమాజం నుంచి సాహిత్యానికి సాహిత్యం నుండి సమాజానికి నిరంతరం ప్రవహించే ఈ భావధార అర్థవంతమైన సంభాషణ ఇటు సాహిత్యంలోకి కొత్త వస్తువును అభివ్యక్తి రీతిని తీసుకొని వస్తుంటే అటు సమాజంలె కళ్ళముందున్న జీవితంలో కనబడని కోణాలను చూడగలిగిన కొత్త చూపును ఇస్తున్నది. కనుక ”జండర్‌ స్పృహ – ఆధునిక తెలుగు సాహిత్యంలో ప్రతిఫలనాలు” అనే అంశం మీద ఈ రోజు రేపు జరుగనున్న ఈ సదస్సు ఆధునిక సాహిత్యంలో ఇన్నాళ్ళు అనావిష్కృతంగా వున్న కొత్త జీవిత కోణాలను, భావాలను వేటిని ఏ మేరకు ఆవిష్కరించగలిగినా ఆశించిన ప్రయోజనం సిద్ధించినట్లే.
(జండర్‌ స్పృహ – ఆధునిక తెలుగు సాహిత్యంలో ప్రతిఫలనాలు – యుజిసి జాతీయ సదస్సు 29,30 నవంబరు 2003 యూనివర్సిటీ ఆర్ట్స్‌ మరియు సైస్స్‌ కళాశాల, కాకతీయ విశ్వవిద్యాలయం, అవగాహన పత్రం).
(సాహిత్యాకాశంలో సగం-కాత్యాయనీ విద్మహే)

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.