స్త్రీల మానసిక ఆరోగ్యం – మానసిక ఆరోగ్య శాస్త్రాల్లో ఒక నూతన దృక్పథం

డా. యు. వింధ్య
ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక (2001) లెక్కల ప్రకారం ప్రపంచంలో సుమారు 45 కోట్లమంది స్త్రీ పురుషులు మానసిక రోగాలతో బాధపడుతున్నారు. జనాభాలో 25 శాతం మంది వారి జీవితకాలంలో ఏదో ఒక సమయంలో మానసికమైన ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటారంటే ఇది ఎంతో విస్తృతమైన సమస్యగా అర్థమవుతోంది. ప్రపంచంలోని మొత్తం రోగాల్లో మానసిక రోగాల వాటా 12 శాతం వరకూ వుంటుంది. ఈ కారణాల దృష్ట్యా మానసిక ఆరోగ్య సమస్యని ఒక కీలకమైన ప్రజారోగ్య సమస్యగా గుర్తించడం జరిగింది.
ఒకప్పుడు మానసిక సమస్యలు చాలా కొద్దిమందికే పరిమితం అనీ ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలకీ, ధనిక వర్గాలకే ఇవి ఎదురౌతాయనీ అనుకొనేవారు. మనదేశంలో పారిశ్రామికీకరణ, పట్టణీకరణ తక్కువ స్థాయిలో వున్నందున మానసిక ఆరోగ్య సమస్యలు మనలో అంతగా వుండవని భావించేవారు. కాని యిటీవలి కాలంలో జరిగిన పరిశోధనల్లో ఇందుకు భిన్నమైన ఫలితాలు వెలువడ్డాయి. సమస్యల విస్తృతిలో పాశ్చాత్యదేశాలకీ మనదేశానికి పెద్ద తేడాలు లేవని తేలింది. అయితే స్త్రీ పురుషుల మధ్య వున్న తేడాలు, రోగ చిహ్నాల వ్యక్తీకరణ – వీటిల్లో కొన్ని మౌలికమైన తేడాలు ఉన్నట్లు తెలిసింది. వీటిని గురించి తరవాత ప్రస్తావిస్తాను.
స్త్రీల మానసిక ఆరోగ్యం అనే అంశం ఇటీవలి కాలంలోనే ఒక ప్రత్యేకమైన విషయంగా గుర్తింపు పొందింది. పురుషులకు భిన్నంగా స్త్రీలకు ప్రత్యేకమైన మానసిక ఆరోగ్య సమస్యలంటూ వేరే వుంటాయా, అలా వుంటే గనక, అందుకు కారణాలేమిటి – అనే ప్రశ్నలకు గత రెండు దశాబ్దాలుగా జరుగుతున్న పరిశోధనలు జవాబుల్ని సూచిస్తున్నాయి. అప్పటివరకూ స్త్రీల మానసిక ఆరోగ్యం పురుషుల మానసిక ఆరోగ్యానికి భిన్నంగా వుండదనో లేదా అటువంటి తేడాలేమైనా వుంటే వాటికి కేవలం శారీరకమైన కారణాలు మాత్రమే వుంటాయనో భావించేవారు. స్త్రీల మానసిక ఆరోగ్య స్థితికి మూలకారణాలన్నీ రుతుస్రావంతోనూ, అందుకు సంబంధించిన హార్మోన్ల అసమతుల్యంతోనూ మాత్రమే ముడిపడి వుంటాయని అనుకొనేవారు. స్త్రీలు ఎదుర్కొనే మానసిక ఆరోగ్య సమస్యలన్నీ వాళ్ళ పునరుత్పత్తి భూమికకు సంబంధించినవేనన్న అవగాహనే సర్వసాధారణంగా వుండేది. సమాజం స్త్రీలకి నిర్దేశించిన పాత్రల్లో (కుటుంబ సంరక్షణ, పిల్లల పెంపకం, ఇంటిపని) దేన్నయినా కాదని కాస్త దూరంగా వెళ్ళేందుకు ప్రయత్నిస్తే ఆయా స్త్రీలకి మానసిక రోగులనే ముద్ర పడేది. ఉదాహరణకి పందొమ్మిదవ శతాబ్దంలో సాహిత్య, సామాజిక విషయాల్లో ఆసక్తికనబరచి, తమతమ రంగాల్లో గుర్తింపు పొందిన ఛార్లెట్‌ గిల్‌మన్‌, ఎడిత్‌ వార్టన్‌ వంటి మహిళలను మానసిక రోగులుగా చిత్రించిన సందర్భాలున్నాయి. బెడ్‌రెస్ట్‌ పేరుతో తనని నిర్భంధించారనీ, ఇతరులను కలవనియ్యలేదనీ, బలవంతంగా తిండి తినిపించి లావెక్కేలా చేశారనీ – గిల్‌మన్‌ తన ఆత్మకథలో రాస్తుంది. అలాగే చొరవ ప్రదర్శించే స్త్రీలకీ, విడాకులు కోరుకున్న స్త్రీలకి మెదడుకి సంబంధించిన శస్త్రచికిత్స అవసరమని భావించిన వైద్య నిపుణులున్నారు. మానసిక అనారోగ్యం స్త్రీలలో సర్వసాధారణం అనీ స్త్రీల అస్థిరత, భావోద్రేకం ఇందుకు కారణాలనీ భావించడం మనదేశంలో కూడా చూస్తుంటాం. హిస్టీరియా, దాని చుట్టూ అల్లబడిన మిత్‌ మనకు తెలిసినవే. శారీరక, మానసిక, సామాజిక అంశాల పరస్పర ప్రమేయాల ద్వారానే మానసిక స్థితి, ఆరోగ్యం నిర్దేశించబడతాయని నేటి పరిశోధనలు తెలియజేస్తున్నాయి.
స్త్రీవాద ఉద్యమాల వలన, వాటి వెంట వచ్చిన అవగాహన వలన మానసిక శాస్త్రాలలో కూడా అనేకమైన మార్పులు వచ్చాయి. మానసిక ఆరోగ్య సమస్యల వెనక శారీరక కారణాలతో పాటు బలమైన సామాజిక కారణాలు కూడా వుంటాయనేది స్త్రీవాద భావజాలం చేసిన ప్రధానమైన ప్రతిపాదన. ఈ రకమైన ప్రతిపాదనలు ఇతర సైద్ధాంతిక చట్రాలనుండి మొదలైనప్పటికీ స్త్రీవాదమే దీన్ని బలోపేతం చేసింది. 1972లో ఫిల్లిస్‌ ఛెస్లర్‌ రాసిన ” వుమెన్‌  అండ్‌ మ్యాడ్‌నెస్‌” అనే పుస్తకం ఈ ధోరణికి నాంది పలికింది.
స్త్రీల మానసిక ఆరోగ్యానికి సంబంధించిన స్త్రీవాద దృక్పథం ఏమి చెబుతున్నది?
1.    మానసిక ఆరోగ్యానికి కేవలం శారీరక కారణాలే కాకుండా, సామాజిక కారణాలు కూడా ఎంతగానో దోహదం చేస్తాయి. స్త్రీల విషయానికి వస్తే, వారి సామాజిక ప్రతిపత్తి, వాళ్ళు నిర్వహించే విధులు, పోషించే పాత్రలు వారి మానసిక ఆరోగ్యంపై లోతైన ప్రభావాన్ని చూపిస్తాయి. స్త్రీల అన్ని ఆరోగ్యసమస్యలకూ వారి సామాజిక స్థాయికీ ప్రత్యక్షమైన, బలమైన సంబంధం వుంటుంది. మానసిక ఆరోగ్యం అనేది మొత్తం ఆరోగ్యానికి సంబంధించిన  ఈ అంశాల ప్రభావంలో ఒక భాగం మాత్రమే. స్త్రీల ప్రతిపత్తి నాలుగు మార్గాల ద్వారా వారి మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. స్త్రీలకు  నిర్దేశింపబడ్డ పాత్రల్ని పోషించడంలో ఏర్పడే వత్తిళ్ళు, ఏకకాలంలో అనేక పాత్రల్ని పోషించాల్సిన పరిస్థితి ఒక ప్రధాన కారణం. ఉదాహరణకి ఉత్పత్తి (ఇంటి బయట పనిచెయ్యడం), పునరుత్పత్తి (కుటుంబంలో ఇతరుల సంరక్షణ). ఈ రెండూ భారాలూ స్త్రీల పాత్రల్ని నిర్దేశిస్తాయి. చాలా వర్గాల స్త్రీలు ఈ రెండు భారాల్నీ ఒకేసారి మోస్తారు. భర్త లేదా ఇతర కుటుంబ సభ్యుల సహకారం, స్త్రీల ఉద్యోగం, వృత్తి వీటి పట్ల అనుకూల వైఖరి, ఇంటిపనిలో పాలు పంచుకోవడం మొదలైన అనుకూల పరిస్థితులు లోపిస్తే స్త్రీలు అధికస్థాయిలో మానసిక ఒత్తిడికి గురౌతారని పరిశోధనల్లో నిర్ధారించబడింది. ఈ రకమైన ఒత్తిడి కొనసాగితే స్త్రీలలో డిప్రెషన్‌, ముఖ్యంగా బాలింతలలో ప్రసవానంతర మానసిక వేదన, తద్వారా ఇతర మానసిక సమస్యలు తలెత్తవచ్చు.
2.    సమాజంలో స్త్రీల పట్ల వున్న వివక్ష కూడా పరోక్షంగా స్త్రీల మానసిక అనారోగ్యానికి దారితీస్తుంది. చదువు, ఉపాధి అవకాశాలు, ఆరోగ్య సేవలు, రాజకీయ ప్రాతినిధ్యం – ఇవన్నీ మనుషులందరి అభివృద్ధి, సాధికారత. మానసిక ఆరోగ్యాలకి తోడ్పడతాయి. మనదేశంతో సహా ఎన్నో దేశాల్లో ఇటువంటి వనరులు, అవకాశాలు (పురుషులతో పోలిస్తే) స్త్రీలకు తక్కువగా వుంటాయి. స్త్రీ పురుషుల మధ్య సమానత్వం వైపు మొగ్గు చూపే సమాజాల్లో స్త్రీల ఆరోగ్యస్థాయి, మానసికారోగ్యం మెరుగ్గా వుంటుంది. ఎక్కడైతే స్త్రీలపట్ల వివక్ష అధికస్థాయిలో వుంటుందో ఆ సమాజాల్లో స్త్రీల ఆరోగ్యం క్షీణిస్తుంది.
3.    వివక్షతో బాటు పేదరికం, హింసాత్మక ఘటనలు, యుద్ధాలు, ఇవి కూడా స్త్రీల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అయితే ఇవి పురుషుల్ని కూడా బాధిస్తాయి కదా అనే సందేహం కలగవచ్చు. నిజమే కాని అవి స్త్రీలని మరింత హెచ్చు స్థాయిలో కృంగదీస్తాయి. ప్రపంచంలోని నిరుపేదల్లో 70 శాతం మంది స్త్రీలే. పేదరికం వలన స్త్రీలు కొన్ని అదనపు భారాల్ని మొయ్యాల్సి వస్తుంది. భర్తలు తమని వదిలి వెళ్ళడం, పిల్లల పోషణకూ, ఆర్థిక బాధ్యతలకూ ఏకైక బాధ్యులు కావడం, అభద్రతకూ వేధింపులకూ గురికావడం, భర్తలున్నా వాళ్ళు తాగుబోతులు కావడం, స్త్రీలు శ్రమించి తెచ్చుకున్న కొద్దిపాటి సంపాదనని కూడా వాళ్ళు కాజెయ్యడం – ఇవన్నీ ఒకెత్తయితే హింస, లేదా హింసా ప్రయోగం జరగవచ్చనే శాశ్వత అభద్రత మరో ఎత్తుగా స్త్రీల మానసిక ఆరోగ్యాన్ని నాశనం చేసే వివిధాంశాలు.
అత్యాచారాలు, లైంగిక వేధింపులు, క్రూరత్వం స్త్రీలని భయాందోళనలకు గురిచెయ్యటమే కాక వారిని మానసికంగా ఎంతో కృంగదీస్తాయి. వారికున్న కొద్దిపాటి స్వేచ్ఛని కూడా కుదించి వేస్తాయి. భీభత్సకర హింసా సంఘటనల్ని ఎదుర్కొన్న స్త్రీలు ”పోస్ట్‌- ట్రుమ్యాటిక్‌ స్ట్రెస్‌ డిసార్టర్‌” అనే మానసిక అనారోగ్యస్థితి వైపు నెట్టబడతారు.
4.    ప్రపంచంలోని చాలా దేశాల్లో పురుషులకన్నా స్త్రీలే ఎక్కువగా మానసిక రోగాలకి గురౌతారని గణాంకాలు తెలియచేస్తున్నాయి. అయితే మనదేశంలో ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఎదురౌతున్నది. హాస్పిటల్‌ లెక్కల ప్రకారం పురుషులే మానసిక రోగులుగా ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్నారు. ఈ గణాంకాల ఆధారంగా కొంతమంది సైకియాట్రిస్టులు, ఎపిడెమియాలజిస్టులు (రోగాల వ్యాప్తిని, వాటి కారణాలను అధ్యయనం చేసేవారు) మన సమాజంలో పురుషులే ఎక్కువ వత్తిళ్ళకు గురౌతారు. వారితో పోలిస్తే స్త్రీలు వత్తిళ్ళు అంతగా లేని సుఖప్రదమైన జీవితాన్ని గడుపుతున్నారనే తప్పుడు నిర్ధారణకు వచ్చేసారు! అయితే జెండర్‌ కేంద్రిత అధ్యయనాలు ఇందుకు విరుద్ధమైన విశ్లేషణని వెల్లడించాయి. హాస్పిటల్‌ లెక్కలైతే మానసిక రోగుల్లో  పురుషులే అధికంగా వున్నారని చెబుతున్నాయిగాని కమ్యూనిటీ సర్వేలలో (జనాభాలో ఎంతమందికి మానసిక రోగాలున్నాయని అంచనా వేయడం ద్వారా) వెలుగు చూసిన లెక్కల్లో స్త్రీలే అత్యధిక సంఖ్యలో మానసిక రోగాల బారిన పడుతున్నారని వెల్లడయింది. దీని అర్థం ఏమిటి? ఒకటి, మనదేశంలో పురుషులతో పోలిస్తే స్త్రీలకు వైద్య సదుపాయాలు అందుబాటులో లేవు. రెండోది మన మానసిక ఆసుపత్రులు కొన్ని రకాల రోగాలకే ప్రాధాన్యతనిస్తాయి. ఉదాహరణకి స్కిజోఫ్రేనియా లాంటి తీవ్రమైన మానసిక రోగాలకి అధిక ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతోంది. పైగా ఇటువంటి రోగాలకి ఇప్పటికీ ఎలక్ట్రిక్‌ షాక్‌ వంటి ట్రీట్‌మెంట్‌ (ఇది ఎన్నో దేశాల్లో నిషేధింపబడినప్పటికీ) ఇస్తూంటారు. ఇక స్త్రీల విషయానికి వస్తే, వాళ్ళు ఎక్కువగా సాధారణ మానసిక రుగ్మతలతో (కామన్‌ మెంటల్‌ డిసార్డర్స్‌) బాధ పడుతూ వుంటారు. తీవ్రమైన దిగులు, విపరీతమైన భయాలు, ఆందోళన, శరీరంలో ఏవేవో నెప్పులున్నాయని అనిపించడం, ఫిర్యాదు చెయ్యడం, ఇవన్నీ ఈ కోవకి చెందుతాయి. ఒకవైపు స్త్రీలు అధికసంఖ్యలో ఇటువంటి సమస్యలతో నిత్యం బాధపడుతూ వుంటే మరోవైపు మన ఆసుపత్రులు వీటికి ఎట్టి ప్రాధాన్యత ఇవ్వకపోవడం కొనసాగుతూ వస్తున్నాయి. అయితే ఇటువంటి అనేక కేసుల్లో మందులకన్నా, ఎలక్ట్రిక్‌ షాక్‌లకన్నా కూడా కౌన్సిలింగ్‌ ఎంతో మేలు చేస్తుంది. అయితే కావలసిన మేరకు కౌన్సిలింగ్‌ మద్ధతు మన స్త్రీలకు లభించడం లేదు. ఇదీ మనదేశానికి సంబంధించి స్త్రీల మానసిక ఆరోగ్య చిత్రపటం. 1982లో మనం ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ మానసిక ఆరోగ్య పథకంలో కూడా స్త్రీల నిర్దిష్ట మానసిక ఆరోగ్య సమస్యలని విస్మరించడం జరిగింది. ఈ విధంగా అసంఖ్యాకులైన స్త్రీలు ఆరోగ్య వ్యవస్థనుండి సంరక్షణ లేక, సైకలాజికల్‌ కౌన్సిలింగ్‌ సదుపాయాలు అందుబాటులో లేక, ఎన్నో మానసిక ఆరోగ్య సమస్యలతో నలిగిపోతున్నారు. వారి ఇబ్బందులు మరింత జటిలం అవుతూ వస్తున్నాయి.
పైన చెప్పినదాని సారాంశాన్ని ఈ విధంగా తీసుకోవచ్చు. తీవ్రమైన మానసిక రోగాలకు సంబంధించి స్త్రీలకూ పురుషులకూ మధ్య ప్రత్యేకమైన తేడాలంటూ పెద్దగా లేవు. సాధారణ మానసిక రుగ్మతల విషయంలో మాత్రం స్త్రీలే ప్రధాన బాధితులుగా, అత్యధిక సంఖ్యలో వున్నారు. ఈ ధోరణికి ప్రధాన కారణాలు సామాజికమైనవే. స్త్రీల జీవితాల్లోని వివక్ష, హింస, భయాందోళనలు, అభద్రత, అనేక పాత్రల్ని పోషించాల్సిన పరిస్థితులు, కుటుంబ సంరక్షణా భారం ఎక్కువగా వాళ్ళమీదనే పడడం, ఇంటి పనులన్నీ వాళ్ళే చెయ్యాల్సిన శ్రమ విభజన, భర్త, ఇతర కుటుంబ సభ్యుల సహకారం లోపించడం – ఇవన్నీ మన సమాజం నుండి పుట్టుకొచ్చిన అంశాలే. అందుచేత స్త్రీల మానసిక ఆరోగ్య స్థాయి వారి సామాజిక ప్రతిపత్తిపైననే ప్రధానంగా ఆధారపడి వుంటుందనడానికి ఎట్టి సందేహం అక్కర్లేదు.
స్త్రీల సామాజిక స్థితిగతుల్లో, స్వేచ్ఛాస్వాతంత్య్రాల్లో, ఆర్థికంగా స్వశక్తిపై ఆధారపడడంలో, స్వయం నిర్ణయాధికారాన్ని చేజిక్కించుకోవడంలో పరిష్కారమార్గం నిక్షిప్తమై వుంది. ఈ మార్గం ద్వారానే స్త్రీల ఆరోగ్య సమస్యలు, మానసిక రుగ్మతలు సమసిపోయే అవకాశం ఏర్పడుతుంది. స్త్రీవాద స్ఫూర్తితో ఇటీవలికాలంలో జరిగిన పరిశోధనలు కూడా ఇదే పరిష్కార మార్గాన్ని బలపరుస్తున్నాయి.
(జూలై- ఆగష్టు 2004)

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.