చేయిదాటిపోయిన చేనేత

కొడవీటి సత్యవతి, పి. శైలజ
చేనేత రంగంలో ఆంధ్రప్రదేశ్‌ గొప్ప చరిత్రను కలిగి వుంది. వ్యవసాయం తరువాత చేనేత పరిశ్రమలోనే ఎక్కువ మంది జీవనోపాధిని పొందుతున్నారు. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో అత్యంత నైపుణ్యంతో వస్త్రాలను నేసే మాస్టర్‌ వీవర్స్‌ వున్నారు. గద్వాల, కొత్తకోట, వెంకటగిరి, పోచంపల్లి చీరలకు దేశవ్యాప్తంగా మార్కెట్‌ వుంది. నైపుణ్యం తొణికిసలాడే వస్త్రాలకు పుట్టినిల్లైన ఆంధ్రప్రదేశ్‌ క్రమక్రమంగా తన వైభవాన్ని కోల్పోతోంది. దీనికి కారణం ప్రభుత్వ విధానాలే గాని చేనేత పనివారిలో నిపుణత లోపించడం ఎంత మాత్రం కాదు. వారు అహరహం పనిచేస్తూనే వున్నారు. అద్భుతమైన వస్త్రాలను అల్లుతూనే వున్నారు. అయితే లోపభూయిష్టమైన ప్రభుత్వ విధానాల వల్ల ఈ రోజు చేనేత రంగం తీవ్ర సంక్షోభంలో మునిగి పోయింది. చేనేత కార్మికులు అర్థాకలితో అలమటిస్తున్నారు.
దేశం మొత్తం మీద చేనేత రంగం 14,000 కోట్ల విలువైన వస్త్రాలని ఉత్పత్తి చేస్తోంది. 124 లక్షల మంది ఈ రంగంలో పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి 2.5 లక్షల మంది చేనేతలో పనిచేస్తూ 1,400 కోట్ల రూపాయల విలువైన వస్త్రాలను సృష్టిస్తున్నారు. అయినప్పటికి చేనేతని పరిశ్రమంగా గుర్తించక పోవడం మనం గమనించాలి. దీనికి కారణం ఈ రంగమంతా గ్రామీణ ప్రాంతాల్లోనే వుండడం, అది కూడా గృహాల్లోనే కొనసాగడంవల్ల వీరికి సంస్థాగతమైన రుణాలేవీ లభించడం లేదు. పరిశ్రమ రంగానికి అందే సహాయం, రుణాలు వీరికి అందడం లేదు. ప్రభుత్వ సాయంగాని, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని వృద్ధిచేసుకునే వీలుకాని, పరిశోధన, శిక్షణ లాంటివిగాని చేనేత రంగంలో పనిచేస్తున్న వారికి అందుబాటులో లేవు. దీని మీద ఆధారపడి బతుకుతున్న లక్షలాది కార్మికులు ఆకలి వేపు, ఆత్మహత్యల వేపు నెట్టేయబడుతున్నారు.
కొయ్యలగూడెం చేనేత సహకార సంఘం కార్యదర్శులు చంద్రమౌళి, సత్యనారాయణ మొదలైన వారు సంఘం పనితీరును వివరించారు. పోచంపల్లి, కొయ్యలగూడెం సహకార సంఘాలు 1950లలో ఒకటిగా ఉన్నా (కొండా లక్ష్మణ్‌ బాపూజీ) ప్రారంభించారు) ఆ తర్వాతి దశలో విడిపోయాయి. వీరి సంఘంలో 200 కుటుంబాలదాకా పనిచేస్తున్నాయి. వీరిలో దాదాపు 90 శాతం దాకా పద్మశాలీ కమ్యూనిటీ వారే.
ప్రతి కుటుంబంలోను చిన్న పిల్లల దగ్గరనుంచీ అందరూ నేత పనిచేస్తారు. ముఖ్యంగా స్త్రీలు ఇంటిపని, వంటపనితో పాటు మగ్గం పనిలో కూడా తప్పనిసరిగా చెయ్యాల్సివుంటుంది. నూలు వొడికి దారం తయారీ దగ్గర నుంచి మొదలు పెట్టి బట్ట తయారయ్యే అన్ని స్థాయిల్లోను చాలా ఎక్కువ సమయం చేసిన పనే చేస్తూ శ్రమ పడేది స్త్రీలే. వీరి ఇళ్ళల్లో అధిక స్థలాన్ని ఆక్రమించేది మగ్గాలే. అవే ఇంటికి కేంద్రబిందువు. దాని చుట్టూ నేయబడి వుంటాయి స్త్రీల జీవితాలు. నేతపనికి కేటాయించిన పనిగంటలంటూ ప్రత్యక్షంగా వుండవు. అయినప్పటికి కుటుంబ ఆదాయాన్నంతా లెక్క గట్టి చూస్తే కనీస వేతనాల్లో మూడోవంతు కూడా ఆదాయముండదని మనకి స్పష్టమవుతుంది. ఇందరు పనిచేసినా నెలకు రూ. 1200-1500 దాకా మాత్రమే ఆదాయం గడిస్తారు. వచ్చిన ఆర్డర్స్‌ను బట్టి సభ్యులకి పని అప్పగించబడుతుంది. వారు చేసే ఉత్పత్తికి కూడా సంఘం మార్కెటింగ్‌ చేయాల్సి వుంటుంది. ఇది చాలా ఇబ్బందులతో కూడుకున్న పని. చేనేత సంఘాలకి సొంత షాపులు కానీ, పెట్టుబడులు కానీ లేవు. ఆప్కో కాక ఢిల్లీ, బొంబాయి, కలకత్తా, బెంగళూరు వంటి పెద్ద నగరాలనుండి ఆర్డర్లు వస్తుంటాయి. ఆ వ్యాపారస్థుల నుండి అడ్వాన్స్‌లు తీసుకుని చేనేత వస్త్రాలు అందజేస్తుంటారు. ఇతర ప్రదేశాల్లో కూడా స్టాల్స్‌ ఏర్పాటు చేసి ఎగ్జిబిషన్‌ చేస్తుంటారు. ఆక్స్‌ఫామ్‌, సిఫామ్‌ లాంటి సంస్థలకి కూడా సరఫరా చేస్తుంటారు. కానీ మొత్తం వస్త్ర ఉత్పత్తులను అమ్ముకోలేకపోతున్నారు.
రాష్ట్రవాప్తంగా తయారయ్యే చేనేత ఉత్పత్తులను ఒక చోటికి చేర్చి, మార్కెటింగ్‌ చేసేందుకు ఆప్కో సంస్థ ఏర్పడింది. ఆంధ్ర హేండ్లూమ్‌ వీవర్స్‌ కోఆపరేటివ్‌ సొసైటి, హైదరాబాద్‌ హేండ్లూమ్స్‌ సెంటర్‌ అసోసియేషన్‌, రాయల సీమ ఫ్యాబ్రిక్‌ సంస్థలు మూడు కలిసి ఆప్కో కింద 1976లో ఏర్పడినాయి. చేనేత రంగంలో సుప్రసిద్ధులైన ప్రగడ కోటయ్య, ముప్పన రామారావు, కొండా లక్ష్మణ్‌ బాపూజీ, మాచాని సోమప్ప లాంటి నాయకులు ఆప్కోకి ప్రాణం పోసారు. చేనేత కార్మికులకు చేతినిండా పని కల్పించి, వారు ఉత్పత్తి చేసిన వస్త్రాలను మార్కెటింగ్‌ చేయడం కోసమే ఆప్కో సంస్థ ఆవిర్భవించింది.
చేనేత రంగానికి పెద్ద దిక్కుగా వున్న ఆప్కో సంస్థ నష్టాల పేరుతో మూసివేతకు అతి దగ్గరగా పయనిస్తోంది. పోచంపల్లి ఎక్కువగా చీరలను ఉత్పత్తి చేస్తే, కొయ్యల గూడెం డ్రెస్‌ మెటీరియల్స్‌, దుప్పట్లు ఎక్కువగా తయారు చేస్తారు. ఆప్కోకి అందజేసిన వస్త్రాలకుగాను, ఆప్కో నుంచి దాదాపు 50 లక్షల రూపాయలు బకాయిలు ఇంకా అందాల్సి ఉంది. సంఘం దగ్గర 30 లక్షల సరుకు ఉన్నా ఆప్కోకి డబ్బు వసూలు కాదు కాబట్టి అందజేయలేదు. చేనేత సహకార సంఘాల కార్మికులకు ఆప్కో, వడ్డీలు లేని రుణాలు ఇవ్వాలని, గ్రాంట్స్‌ అందజేయాలని, ఎంత కోరినా ఆప్కో ఖాతరు చేయదు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల చేనేత సంఘాలకి వంతులవారీగా ప్రధాన నగరాలలో షాపులు ఇప్పించాలని కోరినా ప్రయోజనం లేకపోయింది. ఇటువంటి పరిస్థితులలో చేనేత రంగానికి పెద్ద దిక్కులనదగిన ప్రగడ కోటయ్య, కొండా లక్ష్మణ్‌ బాపూజీ వంటి వారు కూడా చేనేత వృత్తులవారు ఇతర రంగాలలో ఉపాధి వెతుక్కోక తప్పదేమోననే బాధను వెలిబుచ్చేవారు.
ఇతర ప్రైవేటు వ్యాపారస్థులు, డ్వాక్రా మహిళా బజార్లు తక్కువ నాణ్యతగల చేనేత వస్త్రాలను చవక ధరలకి అమ్మి రంగులు, నూలు, నేత డిజైన్లలో నాణ్యత గల చేనేత సంఘాల అమ్మకాలకు గండికొడుతున్నాయి. కుదించిన అంటే పొడుగు, వెడల్పు తగ్గిన సైజులు, నాసిరకం రంగులు నఫ్థాల్‌ రంగులు, సింగల్‌ యార్న్‌ పద్ధతిని వాడి రూ. 150 ధర పలికే బట్టలను డ్వాక్రా రూ. 110 కే అమ్మగలుగుతున్నారు. వారు కోయంబత్తూరు, బొంబాయి మార్కెట్‌ల నుంచి రెండవ శ్రేణి నూలు కొనుగోలు చేసి వస్త్రాలను తయారు చేసి చవకగా అమ్మగలుగుతున్నారు. అయితే చేనేత సంఘాలు ఈ విధంగా చేయలేవు. జాతీయ చేనేత అభివృద్ధి సంస్థ, సహకార సంఘాలకు నాణ్యమైన నూలుకు సరఫరా చేస్తుంది. సంఘాలు వెజిటబుల్‌ రంగులు మాత్రమే వాడాలి, బట్ట నాణ్యత కాపాడాలి, అందుకే అవి తక్కువ ధరలకు అమ్మడానికి వీలుపడదు.
బ్యాంకుల నుంచి ఎక్కువ వడ్డీకి అప్పులు తెచ్చి చేనేత వస్త్రాలు నేస్తున్నా ఆప్కో కనీసం వడ్డీలు కూడా చెల్లించదు. చేనేత సహకార సంఘాల ఉన్నత సంస్థ ఆప్కో, సంఘ ప్రతినిధుల స్వప్రయోజనాసక్తి, బాధ్యతారాహిత్యాలకి, ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యానికి, అలసత్వానికి గురైంది. సహకార ఉద్యమాల ప్రధాన లక్ష్యం, స్ఫూర్తి, ప్రయోజనాలు దెబ్బతిని ఉద్యమం దిక్కు లేకుండా, పనికి రాకుండా పోయింది. ఈ సంస్థ ప్రధాన లక్ష్యం దెబ్బ తినడానికి ప్రభుత్వ విధానాలే కారణంగా మనం అర్థం చేసుకోవాలి. సరళీకృత ఆర్థిక విధానాల నేపథ్యంలో ప్రభుత్వ రంగ సంస్థలెన్నింటినో మూసివేస్తూ లక్షలాది మందిని రోడ్ల పాలు చేస్తున్న ప్రభుత్వం తన శీతకన్నును ఆప్కో మీద కూడా ప్రసరించడంతో సహకార రంగంలో అతిపెద్ద సంస్థ అయిన ఆప్కో మూసివేత దిశగా అతివేగంగా పరుగులు తీస్తోంది. నష్టాలలో వున్న సంస్థను ఆదుకోకుండా, సిబ్బంది స్వచ్ఛంద పదవీ విరమణని ప్రోత్సహిస్తూ దానికోసం నిధులు మంజూరు చేస్తోంది. 518 మంది సిబ్బంది స్వచ్ఛంద పదవీ విరమణ కోసం ఆప్కోకు 9 కోట్ల రూపాయలు విడుదల చేయడంలో అత్యుత్సాహం చూపించిన ప్రభుత్వం, నూలు సబ్సిడి, జనతా సబ్సిడి మొత్తాల కింద 5.20 కోట్లు, ప్రభుత్వ శాఖల నుండి రావలసిన సుమారు 2 కోట్లను మాత్రం విడుదల చేయడం లేదు. ”ఈ విధంగా రాష్ట్రంలో సహకార రంగంలో ఉపాధి పొందుతున్న లక్షాలాది కుటుంబాలకు అండగా వుంటున్న ఆప్కో సంస్థను సహకార రంగాన్ని నాశనం చేసే విధానాలను ప్రభుత్వం అమలుపరుస్తోంద”ని, సజ్జా నాగేశ్వరరావు, ఉపాధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ చేనేత కార్మిక సంఘం అంటున్నారు. కేరళ రాష్ట్రంలో ప్రభుత్వం చేనేత పరిశ్రమ రక్షణకు, చేనేత కార్మికుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలను చేపట్టిందని, వాటిలో ముఖ్యమైనవి నూలు మీద సబ్సిడి, చేనేత వస్త్రాలకు రిబేటు, సంక్షేమ పథకాల విషయానికొస్తే ప్రతి చేనేత కుటుంబానికి సాలుకు రూ.1500 వైద్య సహాయాన్ని కేరళ ప్రభుత్వం అందిస్తోందని, 60 సంవత్సరాలు దాటిన ప్రతి చేనేత కార్మికునికి నెలకు రూ.150 వృద్ధాప్య పెన్షన్‌ అందిస్తోందని సజ్జా నాగేశ్వరరావు పేర్కొన్నారు. అయితే మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చేనేత రంగం దివాలాతీసి మూతబడే దుస్థితికి నెట్టేస్తోందని ఆయన పేర్కొన్నారు.
మారుతున్న కాలం, ఫ్యాషన్‌ రంగాలలో వస్తున్న అభివృద్ధి, డిజైన్లు, రంగులు, రకరకాల దుస్తుల తయారీలను దృష్టిలో పెట్టుకోకుండా ఉపేక్షించడం చేనేత రంగానికి శాపమైంది. కుటుంబమంతా ఎక్కువ గంటలు శ్రమచేసినా పెరగని ఉత్పత్తి విధానం, ఆధునిక ఉత్పత్తి ప్రక్రియలను ప్రవేశపెట్టాలనే ఆలోచన లోపించడం, రంగులు, డిజైన్‌లలో ఏమాత్రం నూతన పోకడలను ప్రవేశపెట్టకపోవడం, కార్మికులకు శిక్షణ కల్పించకపోవడం, చేనేత రంగాన్ని తిరోగమన దారిని పట్టించాయి. వీటితో పాటుగా ముడిసరుకుల ధర పెరగడం, మార్కెట్లో గట్టిపోటీ, చేనేత వస్త్రాలకి సరైన మార్కెటింగ్‌ లేకపోవడం ఇవన్నీ అధిగమించలేని అడ్డంకులుగా తయారయాయి.
అంతర్జాతీయ మార్కెట్లో భారత చేనేత ఉత్పత్తుల పట్ల కావలసినంత డిమాండ్‌ ఉన్నా వాటిని మనకు అనుకూలంగా మార్చుకోలేని లోపభూయిష్టమైన జౌళి విధానాన్ని మన ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయి. చేనేత సంఘాలు ప్రత్యక్షంగా ఎగుమతులు చేయలేని విధంగా మన లైసెన్సు వ్యవస్థ అడ్డుపడుతోంది. కాలానుగుణంగా మార్పులు చేపట్టి ఆధునికీకరించుకున్న ఇతర రాష్ట్రా చేనేత సంఘాలు విరివిగా అమ్మకాలు, ఎగుమతులు కూడా చేపట్టగలుగుతున్నాయి.
ప్రస్తుతం చేనేత రంగం ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని నివారించాలంటే ప్రభుత్వం తన విధానాలను మార్చుకు తీరాలి. ఆప్కోను మూసివేయడం పరిష్కారం కానే కాదు. ఆ సంస్థలో పేరుకుపోయిన అవినీతిని, సమూలంగా ప్రక్షాళనం చేసే చర్యలు చేపట్టాలి. చేనేత వస్త్రాలకు విపరీతమైన డిమాండ్‌ ఉన్నప్పటికీ, ఆప్కో షాపుల్లోకి అడుగు పెట్టే సాహసం ఎవ్వరూ చేయకపోవడానికి కారణం, ఆ షాపుల నిర్వహణ, అక్కడ సిబ్బంది అనాసక్త ధోరణి. ఒక ప్రయివేటు షాపులో అమ్మకాలకి, ఒక ఆప్కో షాపులో అమ్మకాలకి వుండే తేడాని తేలికగానే అంచనా వేయవచ్చు. ఇలాంటి వాటిని సవరించి షాపుల్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్ది, అమ్మకాలపై రిబేటును పునరుద్ధరిస్తే, ఆప్కో తప్పకుండా బలోపేతమౌతుంది. ముఖ్యంగా ప్రభుత్వోద్యోగుల కిచ్చే రుణ సౌకర్యం, వివిధ ప్రభుత్వ శాఖల అవసరాలకు తప్పని సరిగా ఆప్కో నుండే వస్త్రాల కొనుగోలు లాంటివి అత్యవసరంగా పునరుద్ధరించాలి. అంతేకాక ఆ సొమ్మును వెంటనే ఆప్కోకు అందే ఏర్పాటు చెయ్యాలి. వివిధ శాఖలు భారీగా కొనుగోలు చేసే, సొమ్ము ఎగవేయడంవల్ల ఆప్కో నష్టాల్లో కూరుకుపోయి, ప్రాథమిక సంఘాలకు చెల్లించాల్సిన సొమ్మును సకాలంలో చెల్లించలేకపోతోంది. దీనివల్ల ప్రాథమిక సంఘాలు దివాళా తీసి కార్మికులకు పని కల్పించలేక, పని చేసిన వారికి జీతాలు చెల్లించలేక చతికిలబడి పోతున్నాయి. దీని పర్యవసానం నేరుగా చేనేత కార్మికుల మీద తీవ్రంగా పడి వారి జీవితాలు అతలాకుతలమై పోతున్నాయి. సరిపడిన పనిలేక, పని చేసినా జీతాలు రాక, నేసిన వస్త్రాలకు గిట్టుబాటు ధర లేక ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో చేనేత కార్మికులు గిల గిల తన్నుకుంటున్నారు. ఈ దుస్థితికి ప్రధాన కారణం ప్రభుత్వమే నన్నది నిర్వివాదాంశం.
చేనేత రంగాన్ని కష్టాల ఊబిలోంచి బయట పడేయడానికి ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టాలి. ఆప్కో పేరుకుపోయిన బకాయిలను చేనేత సంఘాలకు వెంటనే చెల్లించాలి. చేనేత సంఘాలకి ప్రధాన నగరాలలో షాపులు కేటాయించాలి. డిఆర్‌డిఏ, బ్యాంకుల ద్వారా వడ్డీలు లేని రుణాలు మంజూరు చేయాలి. రంగులు, సాంకేతిక ప్రక్రియలు, డిజైన్‌ల్లో అతివేగంగా మార్పులు రావాలి. రాజస్థాన్‌, గుజరాత్‌ రాష్ట్రాల చేనేత రంగం, రంగు రంగుల ఆకర్షణీయమైన దుస్తులు, దుప్పట్లు, ఇతర వస్త్ర సముదాయం, ప్రపంచవ్యాప్తంగా ఎగుమతులను పెంచి మార్కెట్లో చొచ్చుకుపోతోంది. తమిళనాడు చేనేత సంఘాల సంస్థ కో ఆప్టెక్స్‌ కూడా ఒక మంచి ఉదాహరణ.
రాష్ట్ర స్థాయిలో చేనేత సంస్థల, వ్యక్తుల సమాఖ్య ఏదీ లేకపోవడం మూలంగా, ఒక గ్రూపుగా ఏర్పడి తమ సమస్యలను, వాటి పరిష్కారాలను సమర్థవంతంగా ప్రభుత్వ అధికారులతో లాబీ చేయగల చాకచక్యం, వాదించి, పోరాడి గెలవగలిగే సామర్థ్యం చేనేత రంగానికి లేదు. సహకార సంఘాల ప్రతినిధిగా ఉన్న ఆప్కో ఆ ప్రయోజనాలను పట్టించుకోవట్లేదు. త్వరితగతిన చేనేత రంగాన్ని ఆధునికీకరించే ప్రయత్నాలు మొదలుపెట్టాలి.(సెప్టెంబరు-డిసెంబరు 2000)

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.