నవ్వుల పువ్వుల్ని పూయించిన వేసవి శిబిరం

మే మొదటివారంలో ఓ రోజు ఉదయాన్నే సి. సుజాత ఫోన్‌ చేసింది. మూసాపేటలోని ఒక మురికివాడలో తాము ఒక వేసవి క్యాంప్‌ పెట్టబోతున్నామని, నన్నూ రమ్మని ఆ ఫోన్‌ సారాంశం. అంతేకాదు ప్రముఖ నవలారచయిత్రి యద్దనపూడి సులోచనారాణి తన పేరు మీద ఒక ఫౌండేషన్‌ (వై.ఎస్‌.ఎస్‌.ఆర్‌. ఫౌండేషన్‌) ఏర్పరచారని, దానిమీదనే ఈ క్యాంప్‌ మొదలు పెడుతున్నా మని కూడా చెప్పింది. ఆ క్యాంప్‌ చూడడానికి వెళ్ళాను నేను. మూసాపేటలో ఓ మారు మూల ఉన్న చిన్న పాఠశాల. అందులో చదివేది అందరూ ముస్లిమ్‌ పిల్లలే. అక్కడ సులోచనా రాణి, డా|| సునంద, సి. సుజాత ఇంకా కొంత మంది మిత్రులు కలిసారు. మాటల సందర్భంలో తను ప్రిన్సిపాల్‌గా రిటైర్‌ అయ్యా నని, ఎవరైనా పిల్లలు వుంటే వాళ్ళకు ఆంగ్లం నేర్పాలని ఉందని సునంద అన్నారు. కుందన్‌బాగులో ప్రయత్నం చేద్దాము లెండి అన్నాన్నేను.

అలా ఒక చిన్న ప్రయత్నానికి బీజం పడిందక్కడ. ఆ బీజం మొలకౌవుతుందని, చిగురుల్లాంటి పిల్లలలో నేను వేసవి శెలవుల్ని గడుపుతానని అస్సలు అనుకోలేదు. అంతవరకు నాకు అలాంటి ఆలోచనే లేదు. సరే. ఆలోచనను ఆచరణ లోకి తేవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాను. మా ఇంటి ఆవరణలోనే వుండే షమీమ్‌, ఆయేషాలని పిలిచి నా ఆలోచన గురించి చెప్పాను. కుందన్‌బాగులో ఎక్కడైనా చిన్న స్థలం దొరికితే మనం సమ్మర్‌ క్యాంపు పెట్టుకుందామన్నపుడు మా స్కూల్‌లోనే పెడదామన్నారు వాళ్ళు. వాళ్ళతో కలిసి వెళ్ళి వాళ్ళ స్కూల్‌ వివేకానంద విద్యాలయ చూసొ చ్చాను. బావుంది. ఆ స్కూల్‌ యజమాని కేంప్‌ నడుపుకోడానికి ఒప్పుకున్నాడు.

ఈ ప్రాంతాన్ని మక్తా అంటారు. మురికివాడ లక్షణాలు పూర్తిగా లేకున్నా మురికివాడ కిందకే వస్తుంది. ఊళ్ళలో పనులులేక, ఉపాధి అవకాశాలు లేక హైదరాబాదుకు వలస వచ్చినవారు ఎక్కువగా వుంటారిక్కడ. ముఖ్యంగా శ్రీకాకుళం లాంటి దూరప్రాంతాలనించి వచ్చినవారు చాలామందే వున్నారు. మామూలుగా వేసవిలో నడిచే ఖరీదైన క్యాంపులకు వెళ్ళగలిగే ఆర్థికస్తోమతలేని పిల్లలు ఇక్కడ చాలామంది వున్నారు.

షమీమ్‌, ఆయేషాలు సైకిల్‌ మీద ఆ ప్రాంతమంతా తిరిగి సమ్మర్‌ క్యాంపు గురించి ప్రచారం చేసారు. కుందన్‌బాగు బంగ్లాలలో పనిచేసే అటెండర్ల పిల్లలకు కూడా కబురు అందించాం. షమీమ్‌ వాళ్ళు రెండు రోజులు తిరిగి ముప్ఫైమంది పిల్లల్ని పోగేసారు. ఇంకేం స్థలం దొరికింది. పిల్లల్ని కూడేసాం. మే 10న క్యాంప్‌ ప్రారంభించాలనుకున్నాం.

మే పదిన సులోచనారాణి, డా|| సునంద, డా|| వహీదా, సుజాత గార్లు వచ్చారు. ముప్ఫైమంది పిల్లలు వచ్చారు. రకరకాల వయస్సులవాళ్ళు అమ్మాయిలు అబ్బాయిలు వచ్చారు. అలా మా క్యాంప్‌ మొదలైంది. పిల్లలు ఎంతో ఉత్సాహంగా, సంతోషంగా వుండేవారు. ఉదయం తొమ్మిదికి మొదలుపెట్టి పదకొండు, పదకొండున్నర మధ్య ముగించేవాళ్ళం. ఆటలు, పాటలు, డాన్సులు, డ్రాయింగులు నేర్పేవాళ్ళం. సునందగారికి పిల్లలకి ఇంగ్లీషు నేర్పాలని ఉండేది. అయితే పిల్లలు ఎక్కువమంది చిన్నవాళ్ళు అవడంవల్ల కొంచం కష్టంగా వుండేది. పదిరోజుల తర్వాత తనకు వ్యక్తిగత పనులు వున్నాయని ఇక రాలేనని సునందగారు చెప్పి వెళ్ళిపోయారు.

ఈ క్యాంప్‌ని ఇరవై నాలుగు రోజులు నడిపాం. పిల్లలకి పాటుల నేర్పడం కోసం నేను పాటలు నేర్చుకున్నాను. భూపాల్‌ రాసిన పిల్లల పాటల్ని వాళ్ళకి నేర్పాను. ఒక్కసారి చెప్పగానే చకాచకా నేర్చేసుకునేవాళ్ళు. ఇరవైకన్నా ఎక్కువ పాటలు నేర్పాను. వాళ్ళు కాంప్‌కి రాగానే వందేమాతరం, మా తెలుగు తల్లికి పాటలతో మొదలుపెట్టి జణగణమనతో ముగించేవాళ్ళు. ఆరోగ్యంగా వుండడం గురించి, పళ్ళు శుభ్రంగా తోముకోవడం గురించి, అమ్మా నాన్నల్ని, చదువుచెప్పే గురువుల్ని ఎలా గౌరవించాలి, కొట్టుకోకుండా తిట్టుకోకుండా ఎలా వుండాలో అన్నీ పాటలద్వారా చెప్పేదాన్ని. వాళ్ళు చక్కటి అభినయంతో పాడేవాళ్ళు.

మధ్యలో డా|| విష్ణుప్రియ నాతో చేరారు. ఆవిడ, నేనూ కలిసి చివరిదాకా క్యాంప్‌ నిర్వహించాం. పిల్లలతో ఉత్తరాలు రాయించడం, కథలు చెప్పించడం, బొమ్మలు వేయించడం లాంటివి చేయించాం. బుల్లి కొబ్బరిపిందెలతో, ఆలుముక్కలతో, దొండకాయ ముక్కలతో చక్కగా రథాలు చేసి ఆకులతో పూలతో అలంకరించారు. నా ఫ్రెండ్‌ భార్గవి ఒక రోజు కేంప్‌కి వచ్చి రంగురంగుల కొవ్వొత్తులు ఎలా తయారు చేస్తారో చూపించి పిల్లల్ని సంభ్రమంలో ముంచెత్తింది. అంతేకాదు తాను తెచ్చిన ప్రమిదల్లో రంగురంగుల వేక్స్‌పోసి, వొత్తిపెట్టి అవి పిల్లలకే ప్రజంట్‌ చేసినపుడు ఆ పసిముఖాల్లోని ఆనందాన్ని చూసి తీరాల్సిందే! ఎన్ని రాశుల డబ్బులు పోసినా ఆ ఆనందాన్ని కొనలేం. అనుభవించా ల్సిందే.

పిల్లల చేత ఆడించి, పాడించి, బొమ్మ లేయించిన తర్వాత వాళ్ళకి పండ్లు, స్వీట్లు, బిస్కట్‌లు, చాక్‌లెట్‌ లాంటివి పంచే వాళ్ళం. వాటిని ఆరగించి, సంతోషంగా నవ్వుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. ఆ… అన్నట్లు ఈ కేంప్‌లో మేము ముగ్గురి పుట్టిన రోజులు కూడా జరిపాం. ఒకరు రిథమ. రెండు రాణి. మూడు శివ. కేకులు కట్‌ చేసి, ఐస ్‌క్రీమ్‌లు పంచాం. ఇక్కడ శివ గురించి కొంచం చెప్పాలి. ఈ కుర్రాడు సెవెంత్‌ చదువు తున్నాడు. చాలా తెలివైన, ప్రతిభావంతుడైన కుర్రాడు. నేను నా మిడిమిడి జ్ఞానంతో ఒక గిరిజన నృత్యాన్ని నాలుగు స్టెప్పు లు నేర్పిస్తే వాడు దానిని పద మూడు స్టెప్పు లుగా విస్తరించి, అందరికీ చక్కగా నేర్పాడు. మూడు నాట కాలను వాడే రూపొందించి నటింపచేసాడు. అమ్మాపులి, చెట్టు సాక్ష్యం, అపాయంలో ఉపాయం నాటకాల్లో శివ హీరో. మూడు నాటికలను పిల్లలు చక్కగా ప్రదర్శించారు.

కొంతమంది పిల్లలకి జూన్‌ మొదట వారంలోనే స్కూల్స్‌ తెరుస్తుండటంతో జూన్‌ 2న మా క్యాంప్‌ ముగిద్దామ నుకున్నాం. ముగింపు కార్య క్రమానికి యద్దన పూడి, సునంద, వహీదా, విష్ణు ప్రియ, గీత హాజరయ్యారు. పిల్లలు రంగురంగుల పువ్వుల్లా ముస్తాబై వచ్చారు. రెండు న్నర గంటల పాటు వాళ్ళు నేర్చుకున్న వన్నీ ప్రదర్శించారు. దాదాపు ఇరవై పాటల్ని అభినయం తో పాడి విన్పించారు. హైలెస్సా డాన్సు చేసారు. మూడు నాటికలు ప్రదర్శించారు. వాళ్ళు వేసిన బొమ్మల్ని ఎగ్జిబిషన్‌లాగా పెట్టాము. చివర్లో వాళ్ళ కోసం కొన్న బహుమతుల్ని పంచిపెట్టాము. ఒక టిఫిన్‌ బాక్సు, వాటర్‌బాటిల్‌, కలర్‌ పెన్సిల్స్‌, పెన్సిల్‌ బాక్సులు పంచాం. అన్నింటిలోను ప్రతిభ కన్పరిచిన శివకుమార్‌కి, రెగ్యులర్‌గా క్యాంపుకి వచ్చిన గిరీష్‌కి మొమెంటోలిచ్చాం. వివిధ పోటీల్లో నెగ్గినవారికి చెస్‌, టిన్నికాయిట్‌, క్రికెట్‌బాల్‌ లాంటివి ఇచ్చాం. అగ్గిపెట్టెలో వస్తువులు పెట్టుకురమ్మని చెప్తే ఒక్కొక్కళ్ళు 160, 150, 140 బుల్లిబుల్లి వస్తువుల్ని సేకరించిపెట్టారు. అలా ఆటల్తో, పాటల్తో సమ్మర్‌కాంప్‌ ముగిసింది.

ఈ కేంప్‌ని ఆర్గనైజ్‌ చేసిన సందర్భంగా నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. మనం దేన్నైనా మనస్ఫూర్తిగా మొదలుపెడితే ఏదీ దానిని ఆపలేదు. అలాగే ఏదైనా చెయ్యడానికి డబ్బు ఒక్కటే ముఖ్యం కాదు. ఇలాంటి క్యాంపులు ఎవరి ప్రాంతంలో వాళ్ళు పెట్టగలిగితే, ఏ సౌకర్యమూ లేని మురికివాడల పిల్లలు కూడా వేసవిశిబిరాల సంతోషాన్ని పొందుతారు. నేను ఈ క్యాంప్‌ మొదలు పెట్టినపుడు డబ్బు గురించి ఆలోచించలేదు. యద్దనపూడి గారు ఇప్పటికే మొదలుపెట్టారు కాబట్టి వాళ్ళ బానర్‌నే పెట్టాము. దీనిద్వారా భూమిక హెల్ప్‌లైన్‌ నంబరును ఆ ప్రాంతంలో ప్రాచుర్యానికి తేగలిగాను. క్యాంపు చూడడానికి వచ్చిన కె.బి. లక్ష్మి రూ.500/- విరాళం ఇచ్చింది. సునంద కూడా రూ.500/- ఇచ్చారు. ఇక శాంతసుందరి గారయితే వెయ్యి రూపాయలిచ్చారు. వహీదా మొదటిరోజునే పిల్లలందరికి పెన్సిల్‌బాక్సులిచ్చింది. విష్ణుప్రియ కలర్‌ పెన్సిల్స్‌, తినుభండారాలు తెచ్చారు. భార్గవి తానే అన్నీ కొనుక్కుని వచ్చి కొవ్వొత్తుల తయారీ చూపించింది. అక్కడికొచ్చిన స్త్రీల కోసం ఫినాయల్‌, సబీనా పౌడర్‌ తయారీలను కూడా చూపించింది. సులోచనారాణి గారు వచ్చినపుడల్లా పండ్లు తెచ్చి పంచేవారు. ముగింపు రోజున పిల్లలకి స్వీట్లు పంచారు. ఇదంతా నేను ఎందుకు చెబుతున్నానంటే మనం ఓ చెయ్యి వేస్తే పదిచేతులు సహాయంగా వస్తాయని చెప్పడం కోసమే. మనం ఓ అడుగేస్తే, పది అడుగులు మనని అనుసరిస్తాయని నిరూపించడం కోసమే.

నేను సాధార ణంగా వేసవిలో ఎటైనా దూర ప్రాంతాలకెళ్ళి గడుపుతుంటాను. అది నాకు చాలా ఇష్టం. అయితే ఈ వేసవిలో నేను ఒక్క రోజు కోసం కూడా హైదరాబాదు దాటి వెళ్ళలేదు. అయితే విహార యాత్రకి వెళ్ళినప్పటికంటే ఎక్కువ సంతోషాన్నే నేను పొందాను. పిల్ల లతో కలిసి ఆడాను, పాడాను, నృత్యాలు చేసాను. ఈ పిల్లలంతా మే పదికి ముందు నాకు అపరి చితులు. కానీ జూన్‌ 2 నాటికి నాకు చాలా ఆత్మీయులైనారు. ముగింపు రోజున నాకు చాలా దుఃఖ మన్పించింది. పిల్లల్ని వదిలిరావడం కష్టమైంది.

మొత్తానికి అనుకోకుండా, ఎలాంటి ప్లానింగు లేకుండా మొదలైన చిన్న ప్రయత్నం విజయవంతంగా ముగిసింది. ఆ పిల్లల ముఖాల్లో నవ్వుల్ని పూయించడమే ఈ క్యాంప్‌ ముఖ్య ఉద్దేశ్యంగా మొదలై, వాళ్ళ నవ్వుల మధ్యే ముగిసింది. పిల్లల చల్లటి చిరునవ్వులు, వేసవికాలపు సాయంత్రాలు హఠాత్తుగా కురిసే చిరుజల్లుల్లా నన్ను అలరంచి సేదతీర్చాయని గర్వంగా, సంతోషంగా చెప్పగలను.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో