‘నఖాబ్‌’ తెరిచి చూస్తే…….

డా|| పొన్నంరెడ్డి కుమారి నీరజ
‘నఖాబ్‌’ షాజహానా కవితా సంపుటం. షాజహానా ముస్లిం మైనారిటీల సమస్యలను అర్థం చేసుకుని ఆర్తితోనూ, ఆవేదనతోనూ, ఆవేశంతోనూ కవితలు రాసింది.
20వ శతాబ్దంలో ఆధునిక తెలుగు సాహిత్యంలో భాగంగా పుట్టుకొచ్చిన సాహితీ వాదాల్లో స్త్రీ, దళిత, ముస్లిం మైనారిటీ వాదాలు ప్రధానం. 90వ దశాబ్దపు చివరి సంవత్సరాల్లో ముస్లిం మైనారిటీ వాద కవిత్వం ఉధృతంగా వచ్చింది. అందులో భాగంగానే ‘ముస్లిం స్త్రీ వాదమూ’ వచ్చింది. ఖాజా, స్కైబాబ గొంతులతో మొదలైన ఈ వాదం హనీఫ్‌, గౌస్‌ మొహియుద్దీన్‌ల మీదుగా షాజహానాతో వికాస దశకు చేరుకుంది.
ఏ వర్గపు స్త్రీనైనా రెండు శక్తులు దారుణంగా కట్టడి చేస్తాయి. ఒకటి మతం, రెండు పురుషాధిపత్యం. ఇతర స్త్రీలకంటే భిన్నమైన సమస్యలు ముస్లిం స్త్రీలవి. ఎంతోమంది ముస్లిం స్త్రీలు ఎన్నో ఏళ్లనుంచి ఇళ్ళలోనో, గోడచాటునో, కలల్లోనో, గుసగుసగానో అనుకున్న వాటినే షాజహానా కవిత్వీకరించింది. ఈమె కవితలు చాలా పదునుగా హిందూ మతోన్మాదాన్ని ఖండిస్తాయి. ఇస్లాంలోని స్త్రీల అణచివేతను ప్రశ్నిస్తాయి. నిజాయితీ, నిర్భయం, సూటిదనం పాఠకుల హృదయాలను కదిలిస్తాయి. మెదళ్లను ఆలోచనలతో రగిలిస్తాయి. మేల్కొలుపుతాయి.
విన్న కథల్లోంచి కాకుండా కన్న నిజాల్లోంచి, అనుభవించిన జీవితంలోంచి కవిత్వ వస్తువును తీసుకుంటూ తనదైన గొంతుతో తన భావాల్ని నిస్సంకోచంగా వ్యక్తం చేస్తోంది షాజహానా. ఇతర వర్గాల స్త్రీలతో సరిసమానంగా జీవితాల్ని అనుభవించలేని స్థితిని చిత్రించింది.
షాజహానా ‘నఖాబ్‌’లో గోషా, పరదా, బురఖా, నఖాబ్‌, నిఖా, అణచివేత, లైంగిక హింస వంటి స్త్రీ సమస్యలే కాకుండా పరమత సహనం, సామ్రాజ్యవాదం, భగ్నప్రేమ, దారిద్య్రం, అస్తిత్వం, కళానైపుణ్యం, లౌకికవాదం మొ||న వాటిని గూర్చి తన వాణిని ప్రదర్శిస్తుంది. హిందూ మతోన్మాదాన్నీ తీవ్రంగా ఖండిస్తుంది.
గోషా (ఘోషా) : ముస్లిం స్త్రీకి గోషా జైలులాంటిది. ఖైదీలాగా బందీయై ఉండాలి. పిల్లినైనా, చిన్న పిల్లనైనా బందీగా ఉంచితే మొదట ఏడుస్తారు. అరుస్తారు. పిల్లైతే పులిలా మారిపోతుంది. షాజహానా కూడా అంతే. తన మీద నమ్మకం లేకనా, లేక మత కాలుష్యాన్ని చేస్తాననా అని సూటిగా స్పష్టంగా ఇలా ప్రశ్నిస్తూ
”ఎవరితోనో లేచిపోయ్యి
ఎక్కడ మత కాలుష్యాన్ని చేస్తాననేగా
గోషాల చెరసాలలు
…………..
కొట్టాల్లో పశువులు –
ఫారాల్లో కోళ్లు – చీకటి కోట్లలో మేము!” (ఖౌసెఖిజా)
కొట్టాల్లో పశువులను బంధించి అవసరమైనప్పుడు బయటకు తోలుకెళ్తారు. కోళ్లను లోపలే పెట్టి కావాల్సిన మేత వేస్తారు. అలాంటిదే మా స్థితి అంటుంది ఆర్ద్రంగా.
పరదా : గుమ్మానికి కట్టే పరదాలు అందం కోసం. అందంగా ఉన్న ముస్లిం స్త్రీలు కనబడకుండా ఉండటం కోసం. ముస్లిం స్త్రీ ఆ పరదాల మాటునే ఉండాలి. ఎన్నో కలలు ఆ పరదాల గుహల్లో బలైపోతుంటాయి. ఎన్నో ఆశలూ, ఆశయాలూ నెరవేరకుండా పోయుంటాయి. పుట్టినప్పటినుండీ వాన, వెన్నెల, వసంతం దేని రుచీ తెలియకుండా ఆంక్షల్లో ఆడ బానిసగా పెరుగుతుంది.
అణగి మణగి ఉండేకొద్దీ అణచాలనే అనుకుంటారు. వెర్రి ఆచారాలు మర్రి చెట్ల లాగా వేళ్లూనుకుని పోయాయి. అలాంటి వాని నుండి బయట పడాలంటే ఒక్కసారి ముసుగు తీసి చూడమని ఆదేశిస్తుంది.
”అణగదొక్కబడుతున్న కొద్దీ ఆడదాన్ని అణచాలనుకునే
వెర్రి ఆచారాల మర్రి వృక్షాలున్న చోట….
ఒక్కసారి ముసుగు తీసి చూడు….. (పదా హటాకె దేఖో…!)          అంటుంది.
లేకుంటే ఇంకెన్ని రకాలుగా బాధపడాల్సి వస్తుందో, కనీసం          ఇప్పటికైనా మేలుకో అంటుంది.
ఇంకా తీవ్రంగా”ఆ పరదా పంజరాన్నిప్పుడు నిలువునా          చీలుస్తున్నా
నన్ను కాఫీర్‌వన్నా బాధలేదు” (ఖబర్దార్‌) అంటుంది.
పంజరంలోని చిలుక స్థితి మనకు తెలుసు. అలాంటి పంజరాన్ని నేను చీలుస్తున్నానంటుంది. ఆ సంప్రదాయాల పంజరం నుంచి బయట పడాలనుకునే నన్ను ‘కాఫీర్‌’ అన్నా పర్వాలేదు అంటుంది. అందుకు నేనేమీ బాధపడను, భయపడనని సూచిస్తుంది.
బురఖా : బురఖా శరీరాన్నే కాదు ఆలోచనలన్నింటినీ లోపలే అణచేస్తుంది గబ్బిలాల్లా. చీకటిని కప్పుకుని తిరగాల్సిన స్థితి మాది అంటుంది. ఎందుకూ కొరగానితనాన్ని మనసుకీ ముసుగేసుకోవాల్సి వచ్చినప్పుడు
శరీరానికేసినట్టు మనసులకీ ముసుగులేసుకొని
రంగు రుచి వాసనా లేని బతుకీడుస్తున్న గబ్బిలాలం”          అంటుంది. ఆనందంగా (ఖబర్దార్‌)
బతకడం వేరు. బతుకును ఈడవడం వేరు. ఎంత భారంగా          బతుకుతున్నారో అర్థమవుతుంది.
అలాంటి బతుకును ఈడవలేక”బుర్ఖాల్ని దుపట్టాల్ని
పీలికలుగా చేసి నీ మీదికి విసిరేస్తున్నా” (ఖౌసెఖిజా) నంటుంది. ఈ మాటల వెనుక ఎన్నో సంవత్సరాలుగా అనుభవిస్తున్న జీవితంపై బాధ, అసహ్యం తప్ప మరోటి కనిపించవు.
నఖాబ్‌ : చదువెలాగూ లేదు. కోరికలూ ఉండకూడదనే ఉద్దేశంతో నఖాబ్‌ తెచ్చారంటుంది. గాలిని కూడా స్వేచ్ఛగా పీల్చుకునే అవకాశం లేకుండా ముక్కుపైకి గుడ్డ వేసుకోవాలి. పైరు దున్నేటప్పుడు పైరు తినకుండా ఎడ్ల మూతికి బుట్టలు కట్టినట్లుందని వాపోతుంది.
”చదువు లేదు ఏ ఇచ్ఛా ఉండకూడదు
ఎడ్ల మూతికి బుట్టలాగా
గాలి పీల్చే స్వేచ్ఛ కూడా లేకుండా నఖాబ్‌లు” (ఖౌసెఖిజా)
నిఖా (వివాహం) : చిన్నప్పటి ముద్దు ముద్దు మాటలు అందరికీ ఇష్టం. ఇంకా ఇంకా మాట్లాడించి వినాలనుకుంటారు. అమ్మా, నాన్న, అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు, పక్కింటి వాళ్ళు, బంధువులు అందరూ వారి బోసి నవ్వును చూసి పరవసించిపోతారు.
కొంచెం పెద్దైన తర్వాత కహానీలు విని స్నేహితులు మైమరచిపోతారు.
”అసలు నేను నవ్వులు పూసే ఆకాశం!    అలల పకపకల్తో ఉరుకులెత్తే ఒక స్వరజలపాతం…..” (గుంగీ) అని తనను తాను గొప్పగా చెప్పుకుంటుంది.
ఐతే పెళ్లైన తర్వాత ఇవన్నీ బందైపోతాయి. నవ్వుల్ని పూసే ఆకాశం, ఉరుకులెత్తే జలపాతం మారిపోతాయి. అందుకే అంటుంది ఆమె పెళ్లి ఒక కుట్ర అని.
”నిజంగా నికాహ్‌ కుట్రే….
షాదీ ఐన్నాటినుండీ
నేను అతని హవాలా అయిన్నాటినుండీ
ఆకాశమంత నవ్వుని కత్తిరించి
చిర్నవ్వుగా మార్చాడు!
నన్ను బావిలో ఊటని చేశాడు” (గుంగీ)
పెళ్లైన స్త్రీ అతని ఆస్తి. దానికి ఆలోచనలూ, ఊహలూ, కోరికలూ ఉండవు, ఉండకూడదు. దాన్ని తన ఇష్టం వచ్చినట్లు మార్చుకోవచ్చు, మలచుకోవచ్చు.
పెళ్లైన ఎవరితోనూ స్వేచ్ఛగా మాట్లాడకూడదు. అతని బుద్ధి వంకరగా ఆలోచిస్తుంది. చిన్నప్పటి మాటలూ, మనసూ లేదంటుంది ఆర్ద్రంగా.
”ఎవరితో మాట్లాడినా నరాలు తెగ్గొట్టే హావభావాలు!
మాట లెక్కడా మనసులెక్కడా
కన్నీళ్లతో పాటు అవెప్పుడో రాలిపొయ్యాయి”. (గుంగీ)
మాట, మనసు కూడా కన్నీళ్లతో పాటు రాలిపొయ్యాయంటే ఆ బాధ ఎంతో అర్థం చేసుకోవచ్చు.
ముస్లిం స్త్రీ ఎదుర్కొనే మరో భయంకరమైన ‘నిఖా’ సమస్య అరబ్‌ షేక్‌లకిచ్చి పెళ్లి చేయడం.
అధిక సంతానం, పేదరికం, డబ్బుపై వ్యామోహం – కారణాలేవైనా తమ అందమైన, అమాయకమైన ఆడపిల్లలను కొందరు తల్లిదండ్రులు అరబ్‌ షేక్‌లకిచ్చి పెళ్లి చేస్తారు. ఇదో రకంగా మేత లేనప్పుడు పశువులను కబేళాలకు అమ్మేసినట్లు అమ్మేయడమే. వాడికి ఎన్ని పెళ్లిళ్లైనా అయ్యుండచ్చు. ఎంత ముసలాడైనా కావచ్చు. అక్క తానో బానిస. పావు అంతే. స్థానం మారుతూ ఉంటుంది. షేక్‌ మోజు తీరిన తర్వాత అక్కడ ఎందరికైనా అమ్మేయచ్చు.
మెహర్‌ (కన్యాశుల్కం) ఇచ్చి ఎందరినైనా కొనుక్కుంటాడు. ఆ విషయం తెలిసీ ఏమీ చేయలేని తమ అసహాయ స్థితిని తెలియజేస్తూ….
”మెహర్‌ మొహానకొట్టి పెళ్ళాలను మార్చుకునే             టెంపరరీ మొగుళ్ళనీ తెలిసీ
త్యాగాల దుపట్టాని చిరునవ్వుల చమ్కీల్తో
అలంకరించుకుంటున్న వాళ్ళం (ఖబర్దార్‌) అంటుంది.
తల్లిదండ్రులే కటికోనిలాగా అమ్మేస్తుంటే తానేం చేయాలో అర్థం కాని స్థితి ఆమెది.
”ఇవ్వాల్టి పద్నాలుగేళ్ల – నా వసంతాన్ని
అరవై ఏళ్ల శిశిరానికంకితమియ్యమంటే
…………….
నా శరీరం ముద్దకు వాడు వెలకడుతోంటే
కటికోడు కిలోలకొద్దీ మాంసం అమ్మినట్లు
కిరాతకంగా నన్ను వ్యభిచార బానిసగా అమ్మేస్తుంటే
స్వేచ్ఛ……
……………..
కలలో అనుభూతించటానిక్కూడా అర్హత లేనిదాన్ని!
…………..
అరబ్‌ కబేళాలో
ఆడదాని మాంసానికింత రేటుందని తెలియనిదాన్ని……! (పర్దా హటాకే దేఖో….!)
కబేళాలోని మాంసాలు తినడానికి. ‘అరబ్‌ కబేళాలో ఆడదాని మాంసం’ హృదయాన్ని ద్రవింపజేసే ప్రయోగం. నవనాదులా చలించిపోతాయి.
దూదేకుల వాళ్లు ముస్లింల దృష్టిలో ముస్లింలు కాదు. వారి సంప్రదాయాలు, ఆచారాలకు భేదం ఉంటుంది. దూదేకులను ముస్లింలు పెళ్లి చేసుకోరు. వారు ఆ కులంలో తక్కువ వాళ్లు. ఒక వేళ దూదేకుల అమ్మాయిని ముస్లిం పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి అదృష్టవంతురాలు. ముస్లింల ఇంట్లోకి ఆ అమ్మాయి వెళ్లినా అందరికీ వంగి సలామ్‌ చెయ్యాలి. కొందరి ముందుకు రాకూడదు. పైటలోనే తలను బిగించాలి. ఉర్దూనే మాట్లాడాలి. ఇలా ఎన్నో ఆచారాలు, సంప్రదాయాలు. వీటి మధ్య ఎన్నో అవమానాలు, ఛీత్కారాలు.
రెండు సంస్కృతుల మధ్య ఎలా నలిగిపోయిందో చెప్తూ
”రెండు దవడల మధ్య ఉండ చుట్టిన పాన్‌నయ్యాను.
మా వాళ్లు మాత్రం
అస్లీ తురకమ్మాయినని ఖరారు చేశారు” (లద్దాఫ్ని) అంటుంది.
సాధారణంగా ఏ మతంలో కులాంతర వివాహం జరిగిన భర్త కులాన్నే భార్య స్వీకరించాలి. అలాగైతేనే ఆ అమ్మాయిని ఇంట్లోకి రానిస్తారు. ఆదరిస్తారు. దీన్ని జీర్ణించుకోలేని షాజహానా దూదేకులతనాన్ని భర్త ఆపాదించుకోనప్పుడు ఆ ముస్లిం ముద్రను నేను మాత్రం ఎందుకు భరించాలి అని ప్రశ్నిస్తుంది.
”నా దూదేకుల తనాన్ని షోహర్‌ ఆపాదించుకోనప్పుడు
అస్లీ ముస్లిం ముద్రని మాత్రం నేనెందుకు భరించాలి?” (లద్దాఫ్ని) అంటుంది.
పెళ్లైన స్త్రీకి షేక్‌లతో ఎదురయ్యేవి ఒకరకమైన సమస్యలైతే, మన దేశంలోని భర్తలతో ఎదురయ్యే సమస్యలు మరోరకం. ఆమె భర్త ఆజ్ఞానుసారం నడుచుకోవాలి. అన్నింటికీ అతని అనుమతి కావాలి. ఆమెకు అనుభూతులండకూడదు. ఉన్నా అవి బయట రాకుండా లోపలే అణిగి ఉండాలి. అతనికి ఇష్టం వచ్చినప్పుడు ఆమె చెంత చేరి ఆనంద పరచాలి అంతే!.
”ఏ అర్తరాత్రో అతని కామం లాకులెత్తినపుడు
నేను నవరస నాయకినై ప్రవహించాలి
కదలని అతని కాలం ఓడకి నేనో తెరచాప”……….. (గుంగీ) అంటుంది.
యజమాని, నమ్మకమైన బానిసల సంబంధం తప్ప ఇంకేం లేదంటుంది.
”నా విశ్వాస బానిసత్వమూ
తన నిరంకుశ యాజమాన్యత్వమూ
మా గుండెలయలు దగ్గరయిందెప్పుడూ
శరీరాల ఆబత్వం తప్ప” (ధుత్కార్‌) అని మధనపడుతుంది.
ప్రస్తుత సమాజంలో చాలామంది కుటుంబానిన పోషించలేక, ధన సంపాదన కోసం అరబ్బు దేశాలకు వలస పోతున్నారు. సంవత్సరాల తరబడి అక్కడే ఉంది డబ్బు పంపిస్తూ కుటుంబాల్ని నెట్టుకొస్తున్నారు. అవసరాలే వాళ్ళను అలా తరిమేస్తున్నాయి అంటుంది. అలా వెళ్లిన భర్తను తలచుకునే భార్య మనోవేదనను షాజహానా కవిత్వీకరించిన తీరు అద్భుతం.
”నువ్వు పంపే కరెన్సీ కాయితాలకు
నీ స్పర్శెలా వస్తుంది
ప్రతి రాత్రీ ఖాళీగా వెక్కిరించే సగం పక్క……. (దూస్రా             ఆస్మాఁ)” అంటుంది.
భార్యాభర్తల సంబంధాల్లోని సుదీర్ఘ విరహానికి, దుఃఖానికి             ప్రతీక ఈ కవిత.
అతను తిరిగి కొద్ది రోజులకు వచ్చినా ఆమెలో మళ్ళీ             ఎప్పుడు వెళ్ళిపోతాడోననే భయం. అందుకే అంటుంది
”ప్రతిసారీ ఆకాశాన్ని చీల్చుతూ పైకెగిరే నువ్వు
ఒక్క సారి వెనక్కి తిరిగి చూడు
కిటికీవతల శూన్యం నింపుకున్న రెండో ఆకాశం!” (దూస్రా             ఆస్మాఁ)
ప్రతిసారీ విమానంలో అలా ఎగిరి వెళ్లిపోయేటప్పుడు ఒక్కసారి నన్ను గుర్తు తెచ్చుకుని ఇలా చూడు ఖాళీ మనసుతో నేను కనిపిస్తానని గుర్తు చేస్తుంది.
బహుభార్యత్వం : ఎన్ని సార్లైనా ముస్లిం పురుషుడు పెళ్లి చేసుకోవచ్చు. మూడు సార్లు ‘తలాఖ్‌ చెప్పి పెళ్లి చేసుకున్న భార్యను వదిలించుకోవచ్చు. అలా చేస్తే భగవంతుడు క్షమిస్తాడా? అలా చేస్తే దాన్నేమంటారు అని తీవ్రంగా ప్రశ్నిస్తుంది.
”ముప్పై సార్లు తలాఖ్‌ చెప్పి
నువ్వైతే ముప్పై మూడుసార్లు నిఖా పేరు మీద
నిఖార్సయిన వ్యభిచారం బహిరంగంగా చెయ్యొచ్చు
దయామయుడైన అల్లా ఏ ఆంక్షలు విధించడు” (ఖౌసెఖిజా)             అంటుంది.
అతని సరదాలు తీర్చడమే తనపని తప్ప తనకెలాంటి             ఆశలు, ఊహలు ఉండకూడదని బాధపడుతుంది.
”నేను మాత్రం కలుగులో ఎలుకలా
చీకటి మహల్‌లో ఒంటరి దయ్యాన్నై
నీ సరదాల మంచానికి
నేను ఐదో కోదునై
శాశ్వతంగా పాతుకుపోవాలి” (ఖౌసెఖిజా) అని తన ఆర్తిని             వెళ్ళగక్కుతుంది.
మంచం కోడుకు ప్రాణం ఉండదు. చలనం ఉండదు. ఆలోచన ఉండదు. భరిస్తుంది. అలాగే తానూ ఉండాలి అని మదనపడుతుంది.
సంతానం : సంతానం విషయంలో పురుషుడిదే నిర్ణయం. కుటుంబ నియంత్రణ పాటించరు. ఆమెకు శక్తి లేకున్నా భర్త ఇష్ట ప్రకారమే నడుచుకోవాలి. వారి సుఖం కోసం వీరి ప్రాణాలతో చెలగాటం. ప్రసవం వేదనాభరితం. తన ప్రాణాలను పణంగాపెట్టి ప్రసవ వేదనను అనుభవించడానికి పూనుకుంటుంది. అలా చేస్తేనే ఆమె స్వర్గానికెళ్తుంది. లేకుంటే నరకం తప్పదు. ఆ విషయాన్నే వ్యంగ్యంగా
”మీ సుఖం కోసం
ప్రాణం చీల్చుకు పన్నెండు మందిని కనమనండి
లేకపోతే నరకం
యిప్పుడనుభవిస్తున్నదే పక్కా స్వర్గం” (ఖబర్దార్‌) అంటుంది. ‘పక్కా స్వర్గం’ అనడంలోని ఆంతర్యం అర్థం చేసుకోవచ్చు.
లైంగిక హింస : గుజరాత్‌ అల్లర్ల సందర్భంలో ఎందరో ముస్లిం స్త్రీలు హింసకు గురయ్యారు. తమ మతము, ఆచారాలు, తమ మతానికి చెందిన పురుషులూ తమను అణచివేశారు, ఎన్నో బాధలు పెట్టారు. ఇప్పుడు హిందువులూ బాధిస్తుంటే ఏం చేయాలి? అని ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఎక్కడ ఏ గొడవ జరిగినా తన మాన ప్రాణాలకు అపాయం సంభవిస్తుంటే నేనెక్కడికెళ్ళనూ అని వాపోతుంది.
”ఏ గొడవెక్కడ జరిగినా
నా మానప్రాణాలే పేలాలై
గాలిలోకెగురుతూంటే
ఎక్కడికని పరిగెత్తను?
ఏ రాతి గుహల్లో దాక్కోను?” (ఒంటరి కఫన్‌) అంటుంది.
రాత్రి గుహల్లో ఎప్పుడూ దాక్కున్నామో మనందరిక తెలుసు. నాగరికంగా ఇంత అభివృద్ధి చెందామని చెప్పుకుంటున్న ఈ కాలంలో రాతి గుహల్లో దాక్కునే స్థితి దాపురిస్తోందంటే సమాజం ముందుకా? వెనక్కా? ఎటు వెళ్తూంది? ఆలోచించాలి.
స్త్రీల పట్ల రాక్షసంగా ప్రవర్తించడాన్ని, వారికి జరిగిన ఘోరాన్ని తలుస్తూ
”ఇప్పుడు బుర్ఖా వేసినా, వేయకున్నా
ప్రపంచమంటే –
కాషాయిశిల….!
కత్తి మొన…..!
పొడుచుకొచ్చిన పురుషాంగం…..!” (కాలీదునియాఁ) అంటుంది.
ఆ ఘోరాలను చూసిన హిందూ స్త్రీలూ బాధపడి ఉంటారని, నిన్ను కన్నందుకు నీ తల్లి అసహ్యించుకుని ఉంటుందంటూ
”మగనా కొడుకుల ఊపిరి
బయటికి రాకుండా నొక్కేస్తే
పీడా పోతుందని ఒక్కసారైనా
మీ అమ్మ అనుకొనే వుండాలి
ఈ మగజాతంతా యింతకంటే యేంచేయగలదు?” (కాలీ దునియాఁ)
ఆ మాటల్లో ఎంత బాధ, కసి దాగుందో అర్థం చేసుకోవచ్చు
తీవ్ర స్వరంతో ఎవరెన్ని చెప్పినా, ఎన్ని రకాలుగా బాధించినా
”భారతదేశం నా మాతృభూమి!
భారతీయులంతా నా సహోదరులు!!” అంటుంది. ఈ పంక్తుల్లో ఎంతటి విశాల భావముందో అర్థం చేసుకోవచ్చు. ఈ మాటలను ఎంత కఠినమైన మనసైనా కరిగిపోతుంది.
”కౌగిలించుకున్న ఈ చేతులే
కాళ్లు పట్టుకున్న ఈ చేతులే
…పిడికిళ్లు బిగిస్తున్నాయ్‌!” (ఖబర్దార్‌) అనే హెచ్చరిక ఎందరి నోళ్లనో మూయాలి. మరెందరినో ఆలోచింపజేయాలి. అప్పుడే ఆమె కోరిక నెరవేరుతుంది.
షాజహానా, ఇతర ముస్లిం స్త్రీలూ ఇలాంటి కవితలు ఎన్నో రాయాలని, వాటిని సహృదయంతో అందరూ అర్థం చేసుకోవాలని అభ్యర్థిస్తూ, ఎన్ని వాదాలు వచ్చినా మానవతా వాదాన్ని మరచిపోకుండా గుర్తుచేసుకోవాలి.

Share
This entry was posted in పుస్తక సమీక్షలు. Bookmark the permalink.

One Response to ‘నఖాబ్‌’ తెరిచి చూస్తే…….

  1. buchi reddy says:

    తెరిచి చూస్థె—సాహితి ము త్యాలు కనిపిస్థాయి
    నా అభిమాన రచయిత్రి షా జ హా నా గారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.