టిక్కు టాక్కు సెప్పుల గుంటకాన…

 మల్లీశ్వరి
1993వ సంవత్సరంలో నాకు ఆంధ్ర విశ్వకళా పరిషత్తులో పి.హెచ్‌డి సీట్‌ వచ్చింది. అమ్మకి నాన్నకి తీరిక చిక్కకపోవడంతో ఒక్కదాన్నే పెట్టె బేడా సర్దుకుని రైల్లో విశాఖపట్నానికి బయలుదేరాను. హింసాద్రిగా పేరుపొందిన సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌లో కిటికీపక్క చోటు దొరకబుచ్చుకుని నా కలల నగరం గురించి ఆలోచిస్తూ కూర్చున్నాను.
రైలు కిటకిటలాడుతోంది. అనకాపల్లిలో కూరగాయలబుట్ట నెత్తిన పెట్టుకుని యాభైఏళ్ళు పైబడిన ఒకావిడ రైలెక్కింది. అడ్డుగుండారు కోకగట్టి, పక్క కొప్పు చుట్టి, ముక్కుకి నత్తు, బేసరి, కాళ్ళకి వెండి కడియాలు… అదే మొదటిసారి ఉత్తరాంధ్ర స్త్రీల వస్త్రధారణ ఆభరణాలు ప్రత్యక్షంగా చూడటం.
ఆమె రైలెక్కగానే అందర్నీ తోసుకుని కాస్త చోటు చిక్కించుకుని కూరగాయల బుట్ట సీటుకిందకి తోసి, ప్రయాణీకులు తిరిగే తోవలో యిసరాయంగా కూచుని అడ్డపొగ వేయడానికి మొమహాటపడి సుట్టముక్క వాసన సూత్తా కూచుంది.
కాసేపటికి ఏదో పని మీద ఆమెని దాటుకుని అవతలికి వెళ్ళాల్సి వచ్చింది. యిలా దాటానో లేదో…. వెనకమాల కెవ్వుమన్న కేక…
”ఓలమ్మో… మట్టేసినాది… గుంటకానా…” అన్న అరుపులు విన్పించాయి. అదిరిపడి వెనక్కి తిరిగిచూస్తే ఆ ‘గుంట కానా’ని నేనేనని అర్థమయి బిక్కచచ్చిపోయాను అందరూ నన్నే చూస్తున్నట్టనిపించి.
”నేనేం మట్టేయలేదు…” రోషంగా అన్నాను.
”యిదేటిది! ఈళంతా సూత్తండగానే మట్టేసినావు మల్ల యింతలోపటికే యిలగంతన్నావు!” అనేసి గయేమంది. ”మట్టేయడానికి రైల్లో మట్టి ఎక్కడ దొరుకుతుంది?…” తెలివిగా ప్రశ్నించేను.
చుట్టూ వున్న కొందరు నన్ను చూసి ఘొల్లున నవ్వారు. ఆమెమాత్రం నవ్వలేదు.
”టిక్కు టాక్కు సెప్పులేసుకుని ఆకాశం కాసి సూసి నడుత్తే ఎలగ? కాత్త కిందన సూసి నడవటం నేర్సుకో… నా కాలు మట్టేసినావు గదా!…” అని కుడికాలి బొటనవేలు సవ్వరదీసుకుంటూ అన్నాక గానీ ‘మట్టేయడం’ అంటే ‘తొక్కేయడం’ అని అర్థం కాలేదు. అప్పటినుంచీ ఈ పద్దెనిమిదేళ్ళలో ‘కాత్తి కిందన సూసుకుని నడవడం’తో పాటు, ‘ఈ టిక్కు టాక్కు సెప్పుల గుంటకాన’కి ఎందరు ఉత్తరాంధ్ర స్త్రీలు ఎన్నిసార్లు జీవితపు పొరల్ని వొలిచి చూపెట్టారొ!
తక్కిన ప్రాంతాలకన్నా భిన్నంగా ఉత్తరాంధ్రలో తొంభైశాతం స్త్రీలు రోజువారీ కాయకష్టం చేసుకుని బతికేవారే. జీవితాన్ని శాసించే సాధనాల గుట్టుమట్లు తెలిసినవారు కాబట్టే వాళ్ళు సాధారణంగా మాట్లాడే మాటల్లో కూడా చమక్కుమని బుద్ధిని, హృదయాన్నీ తాకే మెరుపు వాక్యాలుంటాయి.
జీవితం నుంచి పిండుకున్న భాష కాబట్టే. దాని సాయంతో గొప్ప పండితుల్ని కూడా అబ్బురపరిచేలా తర్కాన్ని వాడతారు. అసలే జీవశక్తి కలిగిన మాండలికం, అందులోనూ చురకలు, వాతలు వెట్టే వ్యంగ్యం, నివ్వెరపరిచే తర్కం, అలవోకగా చెప్పే జీవితసత్యాలు కలిసి ఉత్తరాంధ్ర స్త్రీల మాటల సమోహనాశక్తికి తలలు వంచాల్సిందే.
పోరాట సందర్భాల్లో అయితే వారి మాటలు బహురూపులై ‘అశ్శరభశ్శరభ’ అంటూ కదం తొక్కుతుంటాయి. ”మామీద అత్యాచారం జరిగిందని మేవే సెపతన్నాం… బూవి సెపితే ఆకాశం నమ్మదా?” అన్న వాకపల్లి గిరిజన మహిళలు ”ఇపుడు యిక్కడున్నవి రెండే పార్టీలు… ఒకటి ప్రజల పార్టీ… రెండు కంపెనీ పార్టీ ఏది కావాలో తేల్చుకోండి” థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టుని వ్యతిరేకిస్తూ అన్న సోంపేట మహిళలు, ”మా మొండిగోడల మీద కట్టే భవనాలు కడల్లా ఎలగ వుండిపోతాయో సూద్దుము” అన్న గంగవరం నిర్వాసిత మహిళలు… ఒకరా? యిద్దరా? యిక్కడ ప్రతి మహిళా జీవితాన్ని అర్థం చేయించే ఒక ప్రవక్త.
గొప్ప గొప్ప సమస్యల్ని కూడా చిన్నపాటి కామన్‌సెన్స్‌తో వ్యాఖ్యానించడమూ వారి ప్రత్యేకతే. ఆ మధ్య సమైక్యాంధ్రకి మద్దతుగా విశాఖలో బంద్‌ నిర్వహిస్తూ దుకాణాలు మూయించేస్తున్నపుడు బైట చిన్న జంగిడిలో చుప్పులు, జంతికలు పెట్టుకుని అమ్ముకునే ఒక మామ్మ ”ఆళు, మావు మీతోటి వుండమని దలాయించి సెప్పేత్తంటే ఈళేటే ఆళని వదకుంతన్రు… ఈ బావులు సేత్తన్న పనేటీ బాగునేదు…” అనేసి తీర్పు చెప్పేసింది. సామూహిక పోరాటాల్లోనే కాదు. ఒంటరి పోరాటాల్లోనూ యిక్కడి మహిళలకి అదే వాక్చాతుర్యం… అదే తెగువ… అదే సాహసం… రోజూ నాకు ఎదురయ్యే చాకలి దాలమ్మ, చేపలమ్మే మోయిని, ఇడ్లీబండి నడిపే రావులమ్మ, యింటిపనుల్లో సాయంచేసే లచ్చిమి వీళ్ళంతా నామవాచకాలు కాదు సర్వనామాలే.
అందుకే కదా రావిశాస్త్రి మన కళ్ళకి కట్టినట్టుగా చూపించిన మరిడీ మాలక్ష్మినీ, నూకాలమ్మనీ, రత్తాలునీ , వియత్నాం విమలనీ చూసి అబ్బురవడి వూరుకోకుండా నెత్తిన పెట్టుకున్నాం.

Share
This entry was posted in లోగిలి. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో