ఇంట్లో ప్రేమ్‌చంద్‌ – 35

శివరాణీ దేవి ప్రేమ్‌చంద్‌

అనువాదం : ఆర్‌. శాంతసుందరి
(తరువాత భాగం)
ఆయన నవ్వి, ”నేను పువ్వులా అంత సుకుమారమైన వాణ్ణి కాను. ఇంత చిన్న దానికే జబ్బు పడిపోతానా ఎక్కడైనా?”
సాయంత్రం దాకా ఇద్దరం అలా కూర్చునే ఉండిపోయాం.
సాయంత్రం రేడియోలో కథ చదివేందుకు వెళ్తూ, ”నువ్వు కూడా రారాదా?” అన్నారు.
”అక్కడికొచ్చి నేనేం చేస్తాను?” అన్నాను.
”ఇక్కడికొచ్చింది బైట తిరగటానికా, ఇంట్లో కూర్చోటానికా? పద, రేడియోలో ఎలా మాట్లాడతారో చూద్దువుగాని.”
”నాకు రావాలని లేదు.”
ఆయన వదలక పోయేసరికి చాలా కష్టంమీద ఒప్పుకున్నాను.
మర్నాడు ఉర్దూ, హిందీ రచయితల సభ జరిగింది. ఆయన గౌరవార్థమే ఏర్పాటు చేసినట్లున్నారు. మళ్లీ ఈయన నన్ను రమ్మని ఇబ్బంది పెట్టసాగారు. రాననేసరికి, ”బైటికెళ్ళటమంటే మరీ ఇంత భయమేమిటి నీకు?” అన్నారు.
”అక్కడ కొత్త విషయం ఏముంటుంది? రచయితలూ, సంపాద కులూ వస్తారు. ఒకళ్లతో ఒకళ్లు వాదించుకుని కొట్లాడుకుంటారు. వాళ్ల మధ్య కెళ్లటం నాకు నిజంగానే బావుండదు. రచయితలూ, సంపాదకులూ చాలా ప్రమాదకరమైన వాళ్లు, బాబోయ్‌! వాళ్లకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది!” అన్నాను.
”మరి నువ్వు కూడా అటువంటి ప్రమాదకరమైన మనిషిలా తయారవాలనేగా ప్రయత్నిస్తున్నావు?”
”నేను రాను బాబూ! బొత్తిగా పనీపాటా లేని బాపతుగాళ్ల సభకి!”
ఆ రోజు ఆయన వెళ్లిపోయారు. నేను వెళ్లలేదు. మర్నాడు ఉదయం మేం పాత ఢిల్లీ చూసేందుకు వెళ్లాం. ముందు కుతుబ్‌మినార్‌కి వెళ్లాం.
ఆయన మినార్‌ ముందు నిలబడి అన్నిటినీ శ్రద్ధగా గమనించసాగారు.
”పైకి వెళ్దాం, వస్తారా?” అని అడిగారు మహాత్మా.
”నేను పైకి ఎక్కను,” అన్నారీయన.
”నేను వెళ్తాను పైకి, అన్నాను.
”మీనార్‌ మీదికెక్కి దాన్ని పాడు చేస్తావా?” అన్నారీయన నవ్వుతూ.
”అదేమిటి? ఎక్కినంత మాత్రాన పాడు చేస్తానా?”
”చూడు, ఇక్కణ్ణించి చూస్తే అదెంత ఎత్తుగా కనిపిస్తోందో! నువ్వు పైకి వెళ్తే దాని గొప్పదనం తగ్గిపోదూ?”
”అయితే చూడొద్దంటారా?”
”ఇక్కణ్ణించే చూడాలి!”
ఆయన మాటల గురించి నేను లోతుగా ఆలోచించసాగాను. ఆ మీనార్‌ని అలా కళ్ళప్పగించి చూస్తూనే ఉన్నాను, నా కళ్లవెంట నీళ్లు ధారాపాతంగా కారిపోసాగాయి. దాని వెనక ఉన్న చరిత్ర గురించి ఆలోచించటం మొదలుపెట్టాను- ఎన్ని జ్ఞాపకాలని పోగొట్టుకుందో ఈ మినార్‌! దీన్ని నిర్మించినవాళ్లు ఇప్పుడు ఎక్కడున్నారు? మనిషి శాశ్వతం కాదు. అసలు మనిషి ఒక విచిత్రం తప్ప మరేమీ కాడు! ఇలా రకరకాల ఆలోచనలు బుర్రలో తిరగటం మొదలుపెట్టాయి. కానీ మొత్తం మీద అందరం పైకి ఎక్కాం. కిందికి దిగాక మా ఆయన, ”ఏమిటలా అయిపోయావు? పద పాత ఢిల్లీ చూద్దాం,” అన్నారు. అక్కడ నేను పాదుషాల మహళ్లు చూశాను. ఎప్పుడో కట్టిన ఆ భవనాలు ఇంకా కొత్తగా, వాటిలో పాత స్మృతులు నాట్యం చేస్తున్నట్టు, అనిపించాయి.
పాదుషాల హిందూ రాణుల మహళ్లూ, ముస్లిమ్‌ రాణీల మహళ్లూ విడివిడిగా ఉన్నాయి. అక్కడి ఆచారాలు వేర్వేరు. మునుపు రోజుల్లో అందరూ ఎంత ఐకమత్యంతో ఉండేవారో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అక్కడ కూడా నాకు కన్నీళ్లు ఆగలేదు.
”వీళ్లు హిందూ అమ్మాయిలని ఎందుకు పెళ్లి చేసుకునేవారు?” అని అడిగాను.
”అలా చేసుకోవటం వల్ల వాళ్లకి ఆనందం లభిస్తే తప్పేముంది? ముస్లిమ్‌లు సమాజాన్ని అభివృద్ధి చేశారు. హిందువులనీ, ముసల్మానులనీ సమానంగానే చూడాలి,  అసలు మనమధ్య ఈ విభేదాలని కల్పించింది బ్రిటిషు వాళ్లు,” అన్నారు.
”అవునా?” అన్నాను.
”ఆ ! వాళ్లే ఈ పోట్లాటలు సృష్టించేది.”
”కానీ వీళ్లా సంగతి అర్థం చేసుకోవాలి మరి.”
”ముప్ఫై ఐదు కోట్ల జనం మీద ఒకటిన్నర లక్ష మంది ఆధిపత్యం చేస్తున్నారు!” అన్నారు.
ఢిల్లీలో ఎనిమిది రోజులుండి అలహాబాద్‌కి వెళ్లాం. అక్కడ రైలు మారాలి. మాకు మూడు గంటలు టైముంది. మా అన్నయ్య ఇంటికెళ్లాం, ”ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను, చూశారా?” అన్నారీయన మా వదినతో.
అదే ఆయన జీవితంలో చివరి హోలీ! మా వదినలు ఆయనతో హోలీ ఆడారు. నేను ఎంత వారిస్తున్నా ఆయనమీద రంగులు పులిమారు. వాళ్లు రంగులు వెయ్యటం అయిపోయాక, ”మీరు కూడా వాళ్లమీద వెయ్యండి!” అన్నాను. ఆయన పగలబడి నవ్వి, ఇంత కిందికి లాక్కున్న ముసుగుల వెనకాల మొహం ఎక్కడుందో తెలిస్తేగా? అంతకన్న నోరుమూసుకూర్చోటం మంచిది!” అన్నారు.
మా వదిన ఎంత బతిమాలినా ఉండకుండా, ”ఇంటి దగ్గర ఎవరూ లేరు, వెళ్లాలి,” అంటూ బైల్దేరి పోయారు.
ఇంటికి చేరుకుని, వదిన కట్టిచ్చిన రొట్టెలూ, కూరా తిన్నాం. మర్నాడు ఉదయం విశ్వవిద్యాలయంనుంచి చాలా మంది హోలీ శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చారు. ఎవరైనా హోలీ రంగులు వెయ్యటానికి వస్తే కట్టుకోమని మా వదిన నాకు ఒక ముదురు రంగు చీర ఇచ్చింది. ఆరోజు నేనా చీర కట్టుకున్నాను. వచ్చిన వాళ్లు వెళ్లిపోయాక ”ఈ చీర నీకు నప్పలేదు,” అన్నారు మా ఆయన.
”ఏం?” అన్నాను.
”ఏమో, బాగాలేదు. వెళ్లి మార్చుకో!” అన్నారు.
నేను లోపలికి వెళ్లి చీర మార్చుకుని వచ్చేసరికల్లా మేష్టర్లు వచ్చారు. వాళ్లు ఆయన్ని కలవటం అదే ఆఖరిసారి… గడచిపోయిన ఆ రోజులు మళ్లీ వస్తాయా? పగళ్లూ అవే, రాత్రులూ అవే, నా చుట్టూ ఉన్న వస్తువులు కూడా అవే. మనుషులు మాత్రం ఉండరు! లోకం తనదారిన తన పనులు చేసుకుంటూ పోతుంది. మనసులో నిలిచిన మనుషుల రూపాలు మాత్రం ముళ్లలా గుచ్చుకుంటూ గుండె కలుక్కుమనేలా చేస్తాయి. అసలు మనసుని తొలిచే బాధలే నిజంగా శాశ్వతమైనవి అనాలేమో! మనకి దొరికే వస్తువు ఎప్పుడూ మనకి సొంతం కాదు. ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. మనసులోని వేదన మాత్రమే చనిపోయేదాకా తోడుగా ఉంటుంది.
జ              జ              జ
1936, ఏప్రిల్‌ నెల. మా ఆయనకి లాహోర్‌ నించి రమ్మని పిలుపు వచ్చింది. కథా సదస్సు జరుగుతోంది. ఎప్పట్లాగే నన్ను కూడా తన వెంట రమ్మని బలవంతపెట్టారాయన.
”ఇప్పటికే మీ వెంట చాలా ప్రదేశాలు తిరిగాను, బాగా అలిసిపోయాను. పైగా ఇంట్లో ఎవరో ఒకరు ఉండాలిగా!” అన్నాను.
”ఇంటికి కాపలా అవసరమా? ఇక్కడేముందని? నిన్ను విడిచి వెళ్తే నా మనసంతా ఇక్కడే ఉంటుంది. ఇద్దరం వెళ్దాం.” అన్నారు.
”నెలల తరబడి ఇల్లు వదిలి ఇద్దరం తిరుగుతూనే ఉన్నాంగా? పైగా డబ్బు దండగ.”
”నాకు వాళ్లు డబ్బిస్తున్నారు, నీకయే ఖర్చు నేను పెట్టుకుంటాను.”
”దండగ ఖర్చులు చెయ్యకండి. డబ్బు ఆకాశం నించి ఊడిపడటం లేదు. ఎంతో కష్టపడి సంపాదిస్తున్నారు.”
”అయినా ఆకాశం నించి డబ్బు ఊడిపడిందే అనుకో, అప్పుడు కూడా దాన్ని ఏరుకుని దాచుకుంటాం కదా? ఆ ఏరుకోవటం కూడా శ్రమే కదా? పైగా ఆ డబ్బులు తలమీద పడితే దెబ్బ కూడా తగలచ్చు. అది కూడా నువ్వు భరించలేవేమో. దెబ్బ తగుల్తుంది, డబ్బులు ఏరకండి, అంటావేమో!”
”లేదు, నాకు ఎక్కడికీ రావాలనిపించటం లేదు. ఈ తిరుగుడుతో నాకు గాభరాగా ఉంది. అసలు మీరు వెళ్లటం కూడా నాకిష్టం లేదు. ఎంత లేదన్నా వెళ్లి వచ్చేందుకు పది పన్నెండు రోజులు పడుతుంది. మీ గురించి బెంగపడుతూ నేనిక్కడ కూర్చోవాలి!”
”నాకూ వెళ్లాలని లేదు, కానీ తప్పించుకునే మార్గమేదీ?”
”లీడర్‌ అవటం అంత తేలికైన పనా?”
”అరే, లీడర్‌ అవాలని నాకేం లేదు. నీకెన్నో సార్లు చెప్పాను, ఇంటిదగ్గర కూర్చుని రాసుకుంటే వచ్చే ఆనందం నాకు బైట తిరిగితే రాదు. పని పాడవటమే కాక, బైటికెళ్లటం ఇబ్బందిగా కూడా ఉంటుంది నాకు. నువ్వు కూడా నాతో వచ్చావు కదా? ఏమైనా ఆనందం అనిపించిందా? మళ్లీ బైటికే రానని భీష్మించుకున్నావు. ఇద్దరం వెళ్తేనే అంత బాగా గడిచింది, ఇప్పుడు నేనొక్కణ్ణీ వెళ్తే ఏం ఆనందిస్తాను? పైగా నీ గురించి బెంగ ఒకటి.”
”సర్లెండి, ఎంతైనా రచయితలు కదా! మీతో మాట్లాడి గెలవటం ఎవరికి సాధ్యం?”
తను వెనక్కి వస్తానన్న రోజుకి ఆయన రాలేదు, మూడు రోజులు ఆలస్యంగా వచ్చారు. ఆయన వచ్చే సరికి నేను మొహం మాడ్చుకుని కూర్చున్నాను. ఆయన లోపలికి రాగానే, ”అబ్బ, చాలా త్వరగా వచ్చారే! చెప్పిన తేదీకి మీరెప్పుడూ రారు. అక్కడికెళ్లాక ఇంట్లో పెళ్లాం ఉందనే సంగతే గుర్తుండదనుకుంటా! ఇలా ఆలస్యంగా వస్తే ఇంట్లో వాళ్లు ఎంత గాభరా పడతారో కదా, అనే ఆలోచన కూడా రాదు మీకు. వెళ్లేప్పుడు మాత్రం వెళ్లటం అసలు ఇష్టం లేనట్టే ప్రవర్తిస్తారు, కానీ అక్కడికెళ్లాక ఇంటిదగ్గర మీకోసం ఎదురుచూస్తూ ఒక మనిషి కూర్చుని ఉందని కూడా మర్చిపోతారు లాగుంది. ఈ మూడు రోజులూ నేనెలా గడిపానో మీరసలు ఊహించలేరు. అసలు టెలిగ్రామ్‌ పంపిద్దామనుకున్నాను. మేనేజర్‌ని పిలిచి అడిగితే, ఈపాటికి బైలుదేరిపోయి ఉంటారన్నాడు. అలా మూడు రోజులు గడిచిపోయాయి!”
నా చెంపమీద సుతారంగా తట్టి, ”ఏయ్‌, పిచ్చిపిల్లా! ముందు నేను చెప్పేది విను!” అన్నారు.
నేను ఆయన్ని విదిల్చికొట్టి అవతలికి జరిగాను, ”నాకేమీ చెప్పద్దు, నేనేమీ వినను. నన్ను మీరు చాలా విసిగించారు!” అన్నాను.
”అరే, నేనెప్పటికీ నీ ఖైదీనేగా! నిన్ను వదిలి పారిపోయే మనిషినా, చెప్పు? అందుకే నిన్ను కూడా రమ్మన్నాను. నువ్వే రానన్నావు. నాకు ముందే తెలుసు ఇలా ఆలస్యం అవుతుందని. వాళ్లు సభలకీ, సదస్సులకీ రమ్మని పిలుస్తారు, కానీ తీరా అక్కడికి వెళ్లాక ప్రతివాడికీ నాతో అవసరం పడుతుంది. నాకేమో అసలే నిన్నొక్కదాన్నీ ఇంటిదగ్గర వదిలేశానే అని బెంగగా ఉంది. కానీ చాలా చోట్ల నన్ను మాట్లాడమని పిలిచారు. నిన్నంతా నాకు జ్వరం, రాత్రి ఏ రెండింటికో తగ్గింది. నాకు బస ఏర్పాటు చేసిన ఇంట్లోవాళ్లకి చెప్పా పెట్టకుండా టాంగా పిలిచి స్టేషన్‌కి పారిపోయాను. అందుకే ఐదు గంటల రైలు పట్టుకోగలిగాను. రెండ్రోజులుగా ఏమీ తినలేదు నేను.”
”అలా చెప్పకుండా పారిపోయి ఎలా వచ్చారు? వాళ్లేమనుకుంటారు?”
”చెప్పి ఉంటే ఇంకా అక్కడే ఉండిపోవలసి వచ్చేది. ‘రాత్రంతా జ్వరంతో ఉన్నారు, ప్రయాణం ఎలా చేస్తారు?’ అంటూ అడ్డు చెప్పేవాళ్లు.”
”ఓహో మీరంటే అంత ప్రేమా? అబ్బో, ఇవాళ కూడా వెళ్లనివ్వఉండా అడ్డు పడేంత మంచివాళ్లన్నమాట!” అన్నాను అక్కసుతో.
”నువ్వే చెప్పు, మనింటికి ఎవరైనా వచ్చి ఇక్కడ జబ్బు పడితే, వాళ్లని నువ్వు వెళ్ళిపోనిస్తావా? నేనైనా ఒప్పుకుంటానేమోకాని, నువ్వు మాత్రం అసలు ఒప్పుకోవని నాకు తెలుసు.”
”నేను నేనే, మీరు మీరే.”
”అయితే నువ్వు ఓడిపోయినట్టే, నీ చేత్తోనే చెంపదెబ్బ కొట్టుకో! ఒకవేళ ప్రయాణంలో నా రోగం ముదిరిపోతే, అలాంటి స్థితిలో నన్ను వెళ్లనిచ్చినందుకు వాళ్లనే తప్పుపట్టేదానివి, అవునా?”
”సరే, ఇక మన పోట్లాట ఆపుదామా? పాలు వేడిచేసి తీసుకొస్తాను, తాగేసి విశ్రాంతి తీసుకుందురుగాని.”
”అలాగే, పాలు తీసుకురా. అన్నట్టు నువ్వు కూడా ఏం తినలేదు కదూ?”
”ఎందుకు తినను? ఇంట్లోనే ఉన్నాగా?”
”నిజం చెప్పు, తిన్నావా?”
”తినకుండా ఎలా ఉంటానండీ?” తిన్నాను.”
”మొహం ఎలా వాడిపోయిందో చూడు! కోపంగా ఉన్నావు, అందుకే ఏమీ తినుండవు. నామీద ఒట్టేసి చెప్పు, తిన్నావా?”
అలా ఆయన ఒట్టు వేసి చెప్పమనగానే నిజం చెప్పక తప్పలేదు. నేను కూడా రెండు రోజులుగా ఏమీ తినలేదు. ఒక పక్క కోపం, మరో పక్క ఆయన ఎందుకు రాలేదో అనే ఆందోళనా. ఆ విషయమే చెప్పాను.
”నీకు కొంచెం కూడా బుద్ధిలేదు. ఒంటరిగా ఉంటే తిండి కూడ మానేస్తావా? అసలు వంటే చేసి ఉండవుగా? సరే, నువ్వు కూడా పాలు తాగు.”
ఆయన నా వెనకాలే వంటింట్లోకి వచ్చారు. పాలు మాత్రమే తాగారు. నేను కూడా పాలు తాగి, తమలపాకులు ఆయనకిచ్చేందుకు గదిలోకి వెళ్లాను. ”నా తల కొద్దిగా నొప్పుెడుతోంది,” అన్నారు కిళ్లీ తీసుకుంటూ.
”తలకి నూనె మర్దన చెయ్యనా?” అన్నాను.
”అడుగుతావేమిటి? నూనె పట్రా!”
కాసేపు నూనెతో మర్దన చేశాక, ”ఊఁ! తలనొప్పి పోయింది!” అన్నారు.
”అయితే తల దువ్వనా?” అని దువ్వుతూంటే, ”ఇప్పుడెవరైనా వచ్చి మననిలా చూస్తే ఏమవుతుంది? అబ్బో చాలా డబ్బున్నవాడిలా ఉన్నాడే, ఏం వైభోగం! పెళ్లాం తలకి నూనె రాయటమే కాక, తల కూడా దువ్వుతోందే! అనుకుంటాడు!” అన్నారు.
”ఇదేమైనా అపరాధమా? అందరిళ్లల్లోనూ జరిగేదేగా?”
”ఇంకా ఎంత సేవ చేస్తావు? రా నీ చేతులు పడతాను!” అన్నారు. నేను చేతులు వెనక్కి పెట్టుకునే సరికి, ”సరే దేవిగారూ! వద్దు లెండి! ముందు నన్ను తనివితీరా కోప్పడ్డావు, తరవాత ఇంత సేవ చేశావు. ఇదేదో నాకు బాగానే ఉంది!” అన్నారు.
జ              జ              జ
ఒకప్పుడు ఇలాంటి మాటలు రోజూ మాట్లాడుకునేవాళ్లం. ఈరోజు అవన్నీ ఒక కథగా మీముందు ఉంచుతున్నాను. మనిషి జీవితం ఎక్కడినించి ఎక్కడికి, ఎలా మారిపోతుందో, దీన్ని గురించి పొరపాట్న కూడా ఎవరూ ఆలోచించరు కదా! ఇలా జరిగిన సంగతులన్నీ రాయాల్సి వస్తుందని నేనెన్నడైనా అనుకున్నానా? లేదు, కానీ కాలం మన చేత ఏవేవో పనులు చేయిస్తుంది. కాలం చేతిలో మనిషి ఒక కీలుబొమ్మ. అది ఆడించినట్టల్లా ఆడవలసిందే. నాదీ అలాంటి పరిస్థితే.
జ              జ              జ
1936 మే నెల. ‘గోదాన్‌’ ప్రచురించబడింది. ‘మంగల్‌సూత్ర్‌’ ఇతివృత్తం గురించి ఆలోచిస్తున్నారాయన. గోదాన్‌ ప్రతి నా చేతికి వచ్చింది. చదవటం మొదలుపెట్టాను. ఆయన తన గదిలో ఉన్నారు, నేను నా గదిలో కూర్చుని నవల చదువుకుంటున్నాను. తనొక్కరే గదిలో ఉంటే ఏదో ఒక సాకుతో నా దగ్గరకి తప్పకుండా వస్తారు. నేను గోదాన్‌లో హోరీ చనిపోయే సంఘటన చదువుతూ, ఏడవసాగాను. ఏడుపు ఆగక వెక్కిళ్లు పెట్టసాగాను. ఆయన కిళ్లీ కావాలన్న సాకుతో నా దగ్గరకొచ్చారు. నా దుఃఖంలో నేను ఆయన రావటం గమనించలేదు. నా పక్కనే కూర్చుని, ”ఎందుకేడుస్తున్నావు?” అని అడిగారు.
నేను జవాబేం చెపుతాను? అసలు మాట పెగిల్తే కదా? కానీ ఆయనకి నేనెందుకేడుస్తున్నానో అర్థమైంది. ‘గోదాన్‌’ పుస్తకం నా గుండెలమీద ఉంది. దాన్ని తీసి పక్కన పెడుతూ, ”నువ్వుట్టి పిచ్చిదానివి. ఆ నవలలోని పాత్రలు కల్పితాలు. వాటి గురించి ఏడుస్తావేమిటి? ఎప్పుడూ గర్వంగా అంటూ ఉంటావే, ఆడవాళ్లకి ఏడుపు రోగం ఏమీ లేదని? మరిప్పుడు నువ్వే ఆ పని చేస్తున్నావు? నేను కాక ఇంకెవరైనా రాస్తేనన్నా అర్థం ఉంది,” అన్నారు.
నేను కొంచెం సంకోచాన్ని పక్కనపెట్టి, ”పాపం అతన్ని ఎందుకలా చంపేశారు? పాపం ఆ ఝనియాని వితంతువుని చేసేశారు!” అన్నాను.
ఆయన నవ్వి, ”సరే, నువ్వు ఓడిపోయావు కదా! జరిమానా చెల్లించు! పద, నాగదిలోకి రా!” అంటూ నా చెయ్యి పట్టుకుని తన గదిలోకి తీసుకెళ్లారు. అక్కడ ఫాన్‌ ఉంది. దాన్ని ఆన్‌ చేసి, ”ఇప్పుడు నాకు కిళ్లీ ఇచ్చి, ఒక్కసారి నవ్వితే నీకు నా కొత్త నవల ప్లాట్‌ గురించి చెపుతాను,” అన్నారు. రెండు బీడాలు ఆయన నోటికి అందించి, ”ఇప్పుడే చెప్పకండి!” అన్నాను.
”వినక!” అన్నారు.
”నాకు వినాలనిపించటం లేదు.”
”ఫరవాలేదులే, అయినా ఎంతసేపట్నించీ ఏడుస్తున్నావో! నువ్వు పడుకో, నీ తల పట్టనా?” అన్నారు.
”వద్దు, నాకు తలనొప్పి లేదు లెండి!”
నేను వద్దన్నా ఆయన వినలేదు. నా తల ఒత్తసాగారు. నాకు నిద్ర వచ్చేసింది. అలా ఎంత సేపు నా తల ఒత్తుతూ కూర్చున్నారో తెలీదు. నిద్ర లేచాక నాకు చాలా సిగ్గనిపించింది.
ఆ విషయాలన్నీ ఇప్పుడు గుర్తొస్తే ఎంత బాధ వేస్తుందో!
జ              జ              జ
1935లో నేను పట్నంలో ఉన్నాం. ఊరినించి మంగలి అతని భార్య వచ్చింది. ఆమె కొడుకు ఇల్లొదిలి పారిపోయాడు.
”ఎలా ఉన్నారు?” అన్నారీయన ఆమెని చూడగానే.
తన కొడుకు పారిపోయాడని చెప్పిందామె.
”ఎక్కడికి పోయుంటాడు?” అన్నారు.
”ఎనిమిది రోజులుగా కనిపించటం లేదండీ,” అందావిడ.
”నీకు ఒంట్లో బాగా లేదా?” అన్నారు.
”బాగానే ఉంది. వాడి గురించి బెంగతో ఇలా తయారయాను.”
”మరీ చిన్న పిల్లాడేం కాదుగా, ఎందుకంత బెంగ? నన్నడితే వాడికే నీ గురించి బెంగ ఉండాలి!”
”ఏమిటండీ, ఏడ్చి ఏడ్చి ఈమె ఎలా తయారైందో చూడండి!” అన్నాను.
”అనవసరంగా ఏడవకూడదు,” అన్నారు.
”ఆమెకు కంగారుగా ఉండదా, ఎటుపోయాడో, ఎలా ఉన్నాడో అని?”
”వాడికీ యుక్తవయసు, అందుకే పారిపోయాడు. పనికిమాలిన వెధవ. తన స్వార్థం చూసుకున్నాడు. నువ్వు ఇక్కడే ఉండు, నీకే లోటూ రానివ్వం. నీ గురించి వాడికేం పట్టలేదు. ఎప్పుడొస్తాడో రానీ. పెరిగి పెద్దవాడయ్యాడు, వాడు పారిపోతే ఏడుస్తావేమిటి? ఆడపిల్లైతే, అది వేరు!” అన్నారు.
”లేదు బాబుగారూ, మనసు కుదుటపడటం లేదు!” అందామె.
”వాడికి ఆరోగ్యం పాడైతే నువ్వు దిగులు పడినా అర్థముంది. లేదా, ఎవరైనా వాణ్ణి బలవంతంగా ఎత్తుకెళ్లినా నువ్వు బాధ పడచ్చు. వాడికి నీమీద ప్రేమే లేనప్పుడు ఏం చేస్తావు?”
ఆమె గడచిన రోజులు తల్చుకుని ఏడ్చేసింది.
”ఏమిటా ఏడుపు? నీ కొడుకులాంటి వాళ్లని చూస్తే నాకు మండిపోతుంది. నువ్వు మా దగ్గరే ఉండు. నీకేం కావాలన్నా అమ్మగార్ని అడుగు,” అన్నారు.
”ఈమెకి ఏమీ అక్కర్లేదండీ! కొడుకు మీదే బెంగ,” అన్నాను.
”అది ఈమె చేస్తున్న పొరపాటు!” అన్నారు.
నెలరోజులు ఆవిడ అలా మధనపడుతూనే ఉంది. ఆ దిగులుతోనే మా ఇంట్లో ఉండగా ఆమె ఆరోగ్యం దెబ్బతింది. ఈయనే స్వయంగా ఆమెకి వైద్యం చేశారు. ఎనిమిది రోజులు గడిచాక ఆమె రెండో కొడుకు వచ్చాడు. ఆమెని ఇంటికి తీసుకుపోయాడు.
ఆ తరవాత ఆమెకి ఈయన చాలాసార్లు డబ్బు పంపించారు.
పని వాళ్లని పనివాళ్లలా చూడకుడదన్నది ఆయన సిద్ధాంతం. నౌకర్లంటే మనకి సాయంచేసే మనుషులు. నీకు పని మనిషి అవసరం ఎంతో పనిమనిషికి నీ అవసరమూ అంతే, అలాగే అనుకోవాలి. ఆయన ఎప్పుడూ నాకూ, మిగతావాళ్లకీ ఇలాంటివి చెబుతూ ఉంటారు. ఆయనకి ఆరోగ్యం బాగా పాడయినప్పుడు కూడా రెండుసార్లు మాత్రమే ఆయనకి కోపం రావటం చూశాను. లేకపోతే సాధారణంగా శాంతంగానే ఉండేవారు ఒంట్లో బావుండకపోతే ప్రతివాళ్లకీ కోపమూ, చిరాకూ వస్తాయి. కానీ ఆయన మాత్రం ఆరోగ్యంగా లేనప్పుడు కూడా శాంతంగానే ఉండేవారు. ఉదయం తను పలహారం తినగానే నేను తిన్నానా లేదా అని అడిగేవారు. నేను తినేదాకా వదిలేవారుకాదు. ఎప్పుడూ నా గురించే ఆలోచన.
ఒకసారి ఆయన కోపం చూసి నేను హడిలిపోయాను. ప్రెస్‌లో ఏదో అచ్చు వేయించమని చెప్పారు. తరవాత ఆ పని చేశావా అని వాణ్ణి అడిగారు.
”ఇంకా లేదు,” అన్నాడు ధున్నూ.
గట్టిగా చేత్తో బల్లని చరుస్తూ, ”ఎందుకు చెయ్యలేదు?” అని అరిచారు.
”ఏమిటండీ? ఎందుకంత ఆవేశం?” అన్నాను బతిమాలుతున్న ధోరణిలో.
ఆయన కోపంతో ఆయాస పడుతూ, ”వీణ్ణి చూడు! నే చెప్పిన మాటని కొంచెమైన ఖాతరు చేస్తున్నాడా?” అన్నారు.
”చిన్నవాడు కదా, మర్చిపోయుంటాడు లెద్దురూ!” అన్నాను.
”అలా చెప్పిన పని మర్చిపోయే వాళ్లని చూస్తే నాకు మహచెడ్డ చిరాకు. ఏదో కొంచెం పని చేస్తున్నాడో లేదో, చాలా గొప్పవాణ్ణి అనుకుంటున్నట్టున్నాడు!”
”కోప్పడకండి. ఇంకా పెద్ద వయసేం లేదుగా వాడికి, బెదిరిపోగలడు!”
ఆ రోజుకి ఆయన శాంతించారు. ఒకసారి మంచం మీదే విరోచనమైంది. బట్టలన్నీ ఖరాబయాయి. నేను శుభ్రం చేస్తూ అనుకోకుండా, ”బట్టలన్నీ ఖరాబయాయి!” అన్నాను. ఆయన నా మాటల్ని అపార్థం చేసుకున్నారు.
”నువ్వు నాకేం సేవ చెయ్యక్కర్లేదు. నా గదిలోకి రాకు. నేను చచ్చిపోతే పోతాను!” అన్నారు.
ఆ రోజు కూడా ఆయన అలా అనే సరికి నాకు కంగారు పుట్టి, ”ఎందుకండీ! అంతకోపం పనికి రాదు, ఊరుకోండి!” అన్నాను.
ఆయనేమీ అనకపోయేసరికి, నేను అనునయంగా, ”మీరిలా మంచం పట్టటం నా దురదృష్టం. నేను మిమ్మల్ని అసహ్యించుకుంటానని మీరెలా అనుకున్నారు?” అన్నాను.
ఆయన వెంటనే బాధపడుతూ చేతులు జోడించి, ”నన్ను క్షమించు, రాణీ!” అన్నారు.
”మీ మాటలకి నేనేమీ బాధపడలేదు. మీరిలా కోపం తెచ్చుకుంటే ఆరోగ్యం మరింత పాడవుతుందన్న భయం మాత్రం ఉంది నాకు. ఇంక మీదట అలా కోపం తెచ్చుకోకండి.”
నన్ను అలా అన్నందుకు ఆయన చాలా బాధ పడ్డారు. ఎప్పుడూ అందరికీ సుఖమే పంచివ్వాలని చూసిన గొప్ప మనసు ఆయనది. అలాంటి మనిషి ఇంకొకర్ని ఎలా బాధ పెట్టగలరు? అందుకే ఆయన కోపగించుకున్నా, నా మనిషే కదా, ఇంత మంచి మనిషికి భార్యనయే అదృష్టం నాకు దొరికింది కదా అనే ఎప్పుడూ అనుకునేదాన్ని.
– ఇంకా ఉంది.

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.