తెలంగాణా తొలితరం కథలు -స్త్రీపాత్రలు

 ప్రొ. మాదిరెడ్డి అండమ్మ
తెలంగాణాకథ – మహిళాజీవిత చిత్రణ కోసం తెలంగాణా తొలితరం కథలు, తొలినాటికథలు, చౌరస్తా, తెలంగాణా కథలు, ఎల్లమ్మ కథలు, ఎచ్చమ్మ కథలు, మావూరి ముచ్చట్లు మొదలైన అనేక కథాసంకలన గ్రంథాలను క్షుణ్ణంగా (దాదాపు 200 కథలను – ఒక్కో కథను రెండుమూడుసార్లు కూడా) చదవడం జరిగింది. ఐతే సమయాభావం, స్థలాభావం కారణంగా ఇక్కడ ఈ వ్యాసానికి కేవలం ‘తెలంగాణా తొలితరం కథలు’ అనే కథాసంకలన గ్రంథంలోని 35 కథలను మాత్రమే తీసుకోవడం జరిగింది. ఆ 35 కథలు :
1) హృదయశల్య – 1912, 2) లండన్‌ విద్యార్థి – 1927, 3) పరమాణువులో మేజువాని – 1927, 4) రక్త మూల్యం – 1928, 5) ఆదిలక్ష్మి – 1928, 6) ప్రతిఫలం – 1934, 7) ఈ రాధేనా – 1938, 8) సంఘాల పంతులు – 1940, 9) తిరుగుబాటు – 1940, 10) వారంరోజుల అవస్థ – 1940, 11) గప్‌ చుప్‌ – 1940, 12) పందెం – 1941, 13) తెలియక ప్రేమ తెలిసి ద్వేషము – 1945, 14) సమాధి స్థలము – 1945, 15) ప్రమాదము – 1945, 16) చల్లపులుసు – 1945, 17) ఆత్మఘోష – 1945, 18) చెరువొడ్డున – 1946, 19) గొల్ల రామవ్వ – 1948, 20) ఎవరి కథరాయను – 1948, 21) పరిగె – 1952, 22) తిల్లానా – 1953, 23) జీవితగతి – 1953, 24) నారయ్యబతుకు – 1954, 25) అంగుడుపొద్దు – 1954, 26) ఇజ్జత్‌ – 1955, 27) ఏయిర్‌ మేల్‌ – 1956, 28) కొత్త నాగలి – 1956, 29) తిరిగిరాను – 1956, 30) నౌకరి – 1956, 31) మణెమ్మ గారి మనవడు – 1956, 32) సర్కారు కిస్తు – 1956, 33) సిపాయిరాముడు – 1947 తర్వాత వ్రాసింది. 34) కాని కాలం వస్తే – 1956 కి పూర్వం వ్రాసింది. 35) యుగాంతం – 1948 తర్వాత వ్రాసింది.
సాహిత్యం – సమాజం పరస్పరాధారితం. ‘బొమ్మాబొరుసు’ లాంటివి. ఇవి ఒకటి లేకుండా మరొకటి ఉండవు కాబట్టి తెలంగాణా కథాసాహిత్యంలో ‘మహిళాజీవితచిత్రణ’ గురించి తెలుసుకోవడమంటే తెలంగాణా సమాజంలో స్త్రీ స్థానం గురించి తెలుసుకోవడమే అవుతుంది. అలాగే కథారచయిత మగైనా, ఆడైనా ఆ కథావస్తువు తెలంగాణా ప్రాంతానికి అనుగుణ్యమైనదా లేదా అని ఆలోచించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆయా పాత్రల్లో రచయిత సరిగ్గా పరకాయ ప్రవేశం చేసారా? లేదా? తాను ఆశించిన ప్రయోజనం పొందారా? లేదా? అని కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. కథల్లోని అనేక పాత్రల్లో ఒక పాత్ర – మహిళ. కాబట్టి ఆమె జీవితచిరతణ చేయడం అంటే స్త్రీ పట్ల రచయిత ఉద్దేశం గురించి, ఆ నాటి సమాజం గురించి తెలుసుకోవడమే అవుతుంది.
తెలంగాణా తొలితరం కథలు : విభజన
ఈ కథల్లో మహిళా జీవితచిత్రణను మనం – కాలం, కథా రచయితలు, పాత్రలు, కథావస్తువు, కులం, వృత్తులు, మతం, సంస్కృతి, ఆర్థిక సామాజిక రాజకీయ రంగాలనుబట్టి ఇలా ఎన్నో రకాలుగా  విశ్లేషించుకోవచ్చు.
కాలం :
ఈ కథలను ‘ప్రచురించిన కాలాన్ని’ ప్రామాణికంగా తీసుకుంటే – ఈ కథలు 20వ శతాబ్దంలో ఒక అర్థశతాబ్దపు సమాజానికి (దాదాపు 40 సంవత్సరాల కాలానికి), కాలపరిణామానికి సంబంధించినవి. అంతేగాకుండా ఇవి ప్రాచీన, ఆధునిక సమాజాలకు ప్రతిబింబాలుగానూ, 40 సంవత్సరాల కాలపు మహిళా జీవిత పరిణామానికి గీటురాయిగా నిలుస్తున్నాయి.
కథా రచయితలు :
కథారచయితలను బట్టి ఈ కథలను చూస్తే – పైన చెప్పుకున్న 35 కల్లో పురుషులు రాసినవి – 32 కథలు. స్త్రీలు రాసినవి మూడే మూడు కథలు. అవి : అ) ఈ రాధేనా, ఆ) పందెం, ఇ) కాని కాలం వస్తే (7, 12, 34 సంఖ్య కథలు).
‘ఈ రాధేనా’ కథను రచయిత్రి ఎల్లాప్రెగడ సీతా కుమారి (1938లో), ‘పందెం’ కథను రచయిత్రి నందగిరి ఇందిరాదేవి (1941లో), ‘కాని కాలం వస్తే’ కథను రచయిత్రి ఇల్లిందల సరస్వతీదేవి (1956కి పూర్వం) రాసారు. సంఖ్యా పరంగా పురుషులు రాసిన కథలే (32) అత్యధికం. కాబట్టి కథల్లో ‘మహిళా జీవితచిత్రణ’ ఎక్కువగా పురుష భావజాలానుగుణంగానే కొనసాగిందని చెప్పవచ్చు.
స్త్రీలు రాసిన పై మూడు కథల్లో – ‘ఈ రాధేనా’ కథలో ఒకే ఒక స్త్రీ పాత్ర (రాధ) ఉంటుంది. ఇందులోని ఇతివృత్తం వివాహసంబంధితం. రాజారాం అనే వ్యక్తి తనకు కాబోయే భార్య ఎలా ఉండాలనే (పురుషుని) ఆలోచనలను, అతని ఊహా ప్రపంచాన్ని తెలియజేస్తుంది. అంతేగాకుండా ఆనాటి తెలంగాణా ప్రాంత అవివాహిత అమ్మాయి వ్యక్తిత్వం ఎలా ఉంటుందనే విషయాన్ని సూచిస్తుంది. ఇందులోని స్త్రీపాత్ర చిత్రణను చూస్తే ఇది సమకాలీన తెలంగాణా ప్రాంతానికి సంబంధించిన పాత్రేనా అనే సందేహం తప్పనిసరిగా ఎవరికైనా వస్తుంది. ఎందుకు, ఏమిటి అనే విషయం తదుపరి తెలుసుకుందాం.
ఇక ‘పందెం’ కథలో స్త్రీపాత్ర లేనే లేదు. ఇది పురుషులకు – అందులోనూ జల్సాపురుషులకు సంబంధించిన కథ. ఇందులో ఆర్థిక సంబంధాలు, ఐహిక సుఖాలు, వైరాగ్యం మొదలైనవి చర్చించబడ్డాయి.
‘కాని కాలం వస్తే’ కథలో నలుగురు స్త్రీ పాత్రధారులుంటారు. ఇందులోని ఇతివృత్తం మాత్రం అచ్చంగా సమకాలీన తెలంగాణా ప్రాంతానికి, హైదరాబాదు సంస్థానానికి సంబంధించిందని చెప్పవచ్చు… ఇది ఆర్థికంగా చితికిపోయిన ముస్లిం నవాబుల కుటుంబానికి సంబంధించిన కథ. ఇందులో ప్రసంగవశాన – తెలంగాణా ప్రాంతంలో ముస్లింలు చేసిన దురాగతాల గురించి కూడా తెలుస్తుంది. హైదరాబాదు సంస్థానం కేంద్రంలో విలీనమైతే హిందువులు తమపై ప్రతీకారం తీర్చుకుంటారనే భయంతో పాకిస్తాన్‌ పారిపోవాలనుకున్న ఒక కుటుంబం గాథ ఇది.
ఇందులో నవాబు భార్య, అతని కూతుళ్లు, ఇతర స్త్రీలు, అతని నౌకరులు అనుభవించిన మానసికవేదనను, మానసిక సంఘర్షణను, వారు తీసుకున్న నిర్ణయాలను రచయిత్రి చాలా చక్కగా వివరించారు. రచయిత్రి – నౌకరులకు, స్థానిక పరిస్థితులకు అత్యధిక ప్రాధాన్యమిచ్చి, తీర్చిదిద్దారు.
స్త్రీలు రాసిన మూడు కథల్లో ఈ ఒక్క కథ మాత్రమే స్త్రీ హృదయాన్ని, ఆలోచనలను ప్రతిబింబిస్తున్నది. ఇక మిగిలిన కథల్లో – మహిళల ప్రాధాన్యతను బట్టి చూస్తే – కొన్ని కథల్లో అధిక ప్రాధాన్యం, మరి కొన్ని కథల్లో అల్పప్రాధాన్యం, కొన్నింట్లో నామమాత్ర ప్రాధాన్యం మాత్రమే ఉంది. కొన్ని కథల్లో మహిళా పాత్రధారులే లేరు. మొత్తం మీద ‘తెలంగాణా తొలితరం కథలు’ సంకలన గ్రంథంలోని కొన్ని కథలను స్త్రీలు రాసినా, అవి కూడా పురుష భావజాల ప్రతిబింబాలుగానే ఉన్నాయని చెప్పవచ్చు.
కథలు – స్త్రీ పాత్రలు :
తొలితరం పుస్తకంలోని 35 కథల్లోన – 7 కథల్లో (పరమాణువులో మేజువాని (3వ కథ), రక్తమూల్యం (4వ కథ), పందెం (12వ కథ), తెలియక ప్రేమ తెలిసి ద్వేషము (13వ కథ), అంగుడు పొద్దు (25వ కథ), కొత్త నాగలి (28వ కథ), నౌకరి (30వ కథ), స్త్రీ పాత్రధారులు అసలే లేరు. 20వ కథలో కథలో ప్రసంగ వశాన స్త్రీలు ఉన్నా, వారివి వ్యక్తిత్వంలేని నామమాత్రం పాత్రలు.
హృదయశల్యం (1వ కథ) – కాకతీయ రుద్రమదేవి వ్యక్తిత్వాన్ని వివరించే కథ. చారిత్రిక ఇతివృత్తం. ఇందులో ఇద్దరు స్త్రీలు ఉంటారు. ఈ కథను మాడపాటి హనుమంతరావు గారు (పురుషుడు) రాసినా మహిళలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. రచయిత వారి పట్ల సానుభూతిని ప్రదర్శించారు.
లండన్‌ (2వ కథ) – ఇందులో ఇద్దరు స్త్రీలు ఉంటారు. వారు 1) తుకారాం మొదటి భార్య, 2) రెండవ భార్య – కొంగా దొరసాని. మొదటి ఆమె పురుషుని (భర్త) చేత తృణీకరించబడిన స్త్రీ. రెండవ ఆమె పురుషుని (భర్త) మోసాన్ని గ్రహించని స్త్రీ. ఈ కథ విదేశీ చదువు మోజును, కుటుంబ విలువలను, స్త్రీల అమాయకత్వాన్ని వివరిస్తుంది. తుకారాంకు సెకండరీ చదువులో ఉన్నపుడే వివాహమౌతుంది. తండ్రి తోడ్పాటుతో చదువు నిమిత్తం విదేశాలకు వెళ్తాడు. అక్కడి అమ్మాయిని మోసంతో వివాహం చేసుకొని, ఇండియా వస్తాడు. ఇండియాకు వచ్చిన తర్వాత తన మొదటి భార్యను గుర్తించడు.
ఆదిలక్ష్మి (5వ కథ) – కథాశీర్షికను బట్టే ఇది స్త్రీ పాత్ర (ఆదిలక్ష్మి) ప్రాధాన్యం కలిగిన కథ అని చెప్పవచ్చు. ఈ కథలో మొత్తం ఆరుగురు ష్త్రీలు ప్రస్తావించబడ్డారు. అందులో నలుగురు స్త్రీలు రంగంలో ఉన్నారు. మిగిలిన ఇద్దరు ప్రస్తావనలో భాగంగా వస్తారు. ఈ కథ తెలంగాణా సంస్కృతిని, పరోపకారాన్ని వివరిస్తుంది.
ప్రతిఫలం (6వ కథ) – ఇందులో ప్రధాన పాత్రధారి బేలీబీ. బేలీమీ పేరుకు ఒక్కరే ఐనా ఇతర స్త్రీల ప్రస్తావన కూడా వస్తుంది. బేలీబీ పరోపకారం చేసి, ప్రాణానికే ముప్పు తెచ్చుకున్నది. ఇది చారిత్రిక ఇతివృత్తంతో కూడిన కథ. తానీషా కాలంలో గోల్కొండ సంస్థానం మొగలాయీల వశం ఎలా అయ్యింది. అక్కడన్నమాదన్నలు ఎలా వధించబడ్డారు అనే విషయాన్ని వివరిస్తుంది.
ఈ రాధేనా (7వ కథ) – ఇందులో ప్రధాన స్త్రీ పాత్రధారి రాధ ఒక్కరే. ఐనా ఇతర స్త్రీల ప్రస్తావన కూడా వస్తుంది. రచయితలు కథారచనకు కావాల్సిన వస్తువు కోసం ఎంత అవస్థ పడేవారో వివరించే కథ. హైదరాబాదుకు సంబంధించిన కథ.
సంఘాలపంతులు (8వ కథ) – ప్రధాన స్త్రీ పాత్రధారులు ఇద్దరు. 1) అమీన్‌ సాబు పెండ్లాము, 2) మాదిగ ముసలి స్త్రీ.               నిజాం అధికారుల దౌర్జన్యాలను వివరించే కథ. ఇది నిజాం ఇలాకా గ్రామం కథ.
తిరుగుబాటు (9వ కథ) – ఇందులో ప్రధాన స్త్రీ పాత్రధారి సరోజ ఒక్కరే. సరోజను భర్త వదిలేసిన తర్వాత, సంఘాన్ని ఎదిరించి, కష్టపడి, చదువుకొని, వకాలతు వృత్తిలో ప్రవేశించి, లాయరుగా, సంఘసేవకురాలుగా పేరు ప్రతిష్ఠలు పొందినది. ఇది ఒక స్త్రీ జీవిత కథ. కాని ఇతర స్త్రీల ప్రస్తావన ఉంది. స్త్రీల హక్కులను ప్రతిపాదించిన ఒకే ఒక కథ.
వారంరోజుల అవస్థ (10వ కథ) – అన్యోన్య దాంపత్యం ఒకవైపు, అందుకు విరుద్ధంగా రుసరుస దాంపత్యం (ముసలి సెట్టి, పడుచు భార్య) మరోవైపు. స్త్రీల కోసం పురుషులు చేసే వెకిలి చేష్టల వర్ణనలు, వివరణలు ఇందులో ఉన్నాయి. కథా రచనకు వస్తువుకోసం రచయిత పడ్డ అవస్థను కూడా ఈ కథ వివరిస్తుంది.
గప్‌ చుప్‌ (11వ కథ) – రోగంతో మంచానపడ్డ భర్తకు, ఆకలితో అలమటించే పిల్లలకు పట్టెడన్నం పెట్టలేని ఓ గృహిణి (రామి) వ్యథను వివరిస్తుంది. అంతేగాకుండా ఆకలిబాధను, భూస్వామి దౌష్ట్యాలను కూడా ఈ కథ వివరిస్తుంది.
సమాధిస్థలం (14వ కథ) – ఇందులో ఉన్నది ఒకే ఒక స్త్రీ. ఆమె శ్రీమంతుని కొడుక్కు స్తన్యమిచ్చి, తన కొడుకును చంపుకుంటుంఇ. ఇది ఓ తల్లి వ్యథ. ఆ శిశువును పూడ్చడానికి కూడా స్మశానంలో స్థలం దొరక్క అడవిబాట పట్టింది. ఇది ఓ తల్లి కన్నీటి గాథ. ‘ప్రపంచం విశాలమైందే కాని మానవ హృదయం సంకుచితం’ అని చాటిచెప్పింది.
15వ కథ ప్రమాదం – సుమతి (భార్య) తన జీవితంలో జరిగిన సంఘటనను కృష్ణమూర్తి (భర్త)కి చెప్తుంది. అతను ఆ విషయాన్ని కథగా (లలిత, సత్యనారాయణ అనే పాత్రల పేర్లతో) రాస్తాడు. కాని ముగింపు వేరుగా రాస్తాడు. భార్య (సుమతి) నుండి వాస్తవం రాబట్టాలని ప్రయత్నం చేస్తాడు. ఆ కథను ఆమెతో చదివిస్తాడు. సుమతి ఆ కథ ముగింపు చదివి, అది అబద్ధం అని, రుసరుస లాడుతుంది. భార్యను నమ్మకపోవడం ఇందులో కనిపిస్తుంది. ఇందులోని ఉన్నది ఇద్దరు స్త్రీలు – ఒకరు లలిత, మరొకరు ఆమె స్నేహితురాలు సత్యం. ఇది జీవితంలో కథ, కథలో జీవితం ఇతివృత్తంగా కలిగినటువంటిది…
చల్లపులుసు (16వ కథ) – ఒకే ఒక స్త్రీ పాత్రధారి ఇందులో ఉంటుంది. ఆమె కూడా ఛాందసురాలిగా, మంచి వంటచేసే  వ్యక్తిఆ చిత్రీకరించి బడింది. చదువుకునేరోజుల్లో భార్య గురించి, ఎన్నో మధురస్వప్నాలు కన్న వ్యక్తికి, ‘అప్టుడేటు భార్య’ కావాలనుకున్న వ్యక్తికి ఈ ఛాందసురాలు భార్యగా లభిస్తుంది. వారింటికి అతిథిగా వచ్చిన తనభర్త చిన్ననాటి స్నేహితునికి (వాసుకు) ఆమె చల్లపులుసు వడ్డిస్తుంది. ఆ అతిథి ఆమె చల్లపులుసును మెచ్చుకుంటాడు. భర్త ఆ పేరుతో ఆమెను అప్పుడప్పుడు ఆటపట్టిస్తుంటారు. ఇతను కూడా రాజారాం లాగా భార్య గురించి, కలలుకంటాడు. ఊహల్లో తేలుతుంటాడు. అసలు సిసలైన గృహిణి కథ ఇది.
ఆత్మఘోష (17వ కథ) – ఇందులోని స్త్రీలు – లక్ష్మి (శాలోళ్ళ బత్తుల ఆశన్నగారి భార్య), బత్తుల ఆశన్నగారి ఇద్దరు కూతుళ్ళు, దాసరిసింగంగారి కూతురు, కర్ణాలపాపయ్యగారి కూతురు రాధ మొదలైన వారు. సోదరుని వర్ణాంతరవివాహ ప్రభావం కేవలం ఆ పెళ్ళి చేసుకున్న వ్యక్తుల (వెంకటేశ్వర్లు, రాధ) మీదనే గాకుండా, ఆ కుటుంబంలోని వివాహితులైన ఆడపడుచుల మీద, మొత్తం కుటుంబ సభ్యుల మీద కూడా పడుతుందని ఈ కథ నిరూపించింది. సోదరుని వర్ణాంతరవివాహం వల్ల బాధితులైనవారు. ప్రధానంగా ఆ యింటి ఆడపడుచులు. వీరి భర్తలు కులం తప్పుకు భయపడి, వీరిని పుట్టింటికి పంపించి, పునర్వివాహం చేసుకుంటారు. చివరకు వారి సోదరుడు ముస్లింగా మతం మార్చుకొని, వారి మతంమార్చి, వారి వివాహం ముస్లింలతో చేస్తాడు. ఈ కథలో ఐదారుగురు స్త్రీపాత్ర ధారులు ఉన్నా, అందరూ పరిస్థితులతో సర్దుకుపోయేవారే, వారంతా నామమాత్రులే. ఆ ఆత్మఘోషను అందరి కన్నా ఎక్కువగా భరించినవాడు వారి సోదరుడు.
గొల్ల రామవ్వ (19వ కథ) – ‘గొల్లరామవ్వ’ అనేది కథాశీర్షిక. ఆ శీర్షికను బట్టే ఇది స్త్రీ ప్రాధాన్యం కలిగిన కథ అని చెప్పవచ్చు. ఇందులోని ఇద్దరు స్త్రీలు – రామమ్మ, మల్లమ్మలు. ‘గొల్లరామవ్వ’ కూడా బేలీబీ లాగ పరోపకారి. చీకట్లో గాయాలతో ఇంట్లోకి వచ్చిన అబ్బాయిని పోలీసోళ్లనుండి ‘గొల్లరామవ్వ’ రక్షిస్తుంది. కాని బేలీబీ లాగ అమాయకురాలు కాదు, గడుసరి. ఏకసమయంలో బహుపాత్రాభినయం చేయగల సమర్థురాలు.
రజాకార్ల సమయంలో ప్రజలు ఎలా భయాందోళనలకు ఎలా గురయ్యారనే విషయాన్ని తెలియజేసే కథ. ఈ ‘గొల్లరామవ్వ’ కథ ద్వారా, ప్రతిఫలం కథ ద్వారా, వారి మాటలద్వారా తురకల వల్ల హిందువులు, ప్రధానంగా స్త్రీలు ఎన్ని ఇడుముల పాలయ్యారో తెలుస్తుంది. ఉదా :
1)”ఈ తురకోల్లతోటి చావొచ్చింది. మొన్ననే నలుగుర్ని తుపాకివేసి చంపింన్రు. ఇప్పుడుగూడా ఏదో గసొంటి అగాయిత్తమే చేసిన్రేమో. ఏం పోగాల్లమో వీల్లకు” (గొల్లరామవ్వ కథ – 107 పేజి).
2)”పోలీసో, రజాకారు తురకవాడో ఇంట్లో దూరాడు. ఇంకేముంది. తనకు చావు తప్పదు. తానల్లారుముద్దుగా పెంచి పెండ్లి చేసిన తన మనుమరాలికి మానభంగం తప్పదు. ఎవరెదిస్తారీ రాక్షసుల్ని. ….. ఆనాడు అంత పెద్ద కరణం గారి కూతుర్ని బలాత్కారం చేసి ఎత్తుకుపోయినప్పుడెవరేం చేయగలిగారు. ఎవరడ్డం వచ్చారు” (గొల్లరామవ్వ కథ…. 108 పేజి).
3)”స్త్రీ లోకమంతా కోరికలన్నిటిలోకి మిన్నగా ఉంచుకునేవి సౌందర్యం, యవ్వనం. ఆ….యిప్పుడు వాళ్ళకి శత్రు రూపం దాల్చాయి. అవి వుండా మురిసిన వాళ్లే యెక్కువ బాధపడుతోన్నారు. శత్రుసైన్యం రాకముందే యేదో శక్తి తమని కురూపిణులుగా వృద్ధులుగా మార్చేస్తే ధన్యులనుకుంటోన్నారు” (ప్రతిఫలం కథ – 35 పేజి).
4)”పరదాలు దాటి బైటికి రాని సుందరాంగులు మెరుపులా సౌందర్యం మెరిసిపోగా వొంటి గుడ్డల్ని సైతం లెక్కపెట్టకుండా వొళ్ళంతా కంటినీళ్లచేతా చెమటచేతా స్నానంచేసినట్లయి, పట్టుగుడ్డలు దేహానికి అతుక్కుపోగా భర్త మెడలకి వేళ్ళాడపడి వీధుల్లోపడుతున్నారు” (ప్రతిఫలం కథ – 35 పేజి).
5)”భుజం మీద రెండేళ్ళ కొడుకునెత్తుకొని, నిలవటానికి సైతం శక్తిలేని అతిసౌందర్యవతియైన యిరవైయేళ్ళ యువతిని యీడుస్తో కిల&ఆలవేపు వొస్తోన్న పారసీ ఉమ్రావొహడు…” (ప్రతిఫలం కథ – 36 పేజి).
పరిగె (21వ కథ) – ఇందులో ఒకే ఒక స్త్రీ పాత్ర ఉంటుంది. ఆమెది పది, పన్నెండేళ్ల వయసు. ఆమె గ్రామ బేగారిగా పని చేసే మల్లయ్య చెల్లెలు. పరిగె కారణంగా మల్లయ్య జైలుకు వెళ్లాల్సి వస్తుంది. అన్న లేని సమయంలో, ఆమె గ్రామ బేగారి పని చేస్తుంది.
తిల్లానా (22వ కథ) – ఈ కథలోని స్త్రీలు – తల్లికూతుళ్లు. ఒకరు చిత్రకారుని భార్య, మరొకరు కూతురు. చిత్ర కారుడు అకస్మాత్తుగా అంధుడు కావడంతో అతని కుటుంబం వారు పడే కష్టాలు, వారి మానసిక సంఘర్షణ, వేదన, వారి ఆర్థిక పరిస్థితులు ఈ కథ వల్ల తెలుస్తాయి. ఆకలి సొదను వినిపించే కథ. ఇది బతికిచెడిన వారి బతుకును వివరించే కథ. చిత్రకారుని చితికిన బతుకు కథ.
జీవితగతి (23వ కథ) – ఈ కథలో అమ్మ ఒక్కతే స్త్రీ. కాని, ఆమె భర్త వల్ల పొందిన కష్టాలు, తల్లిపై కొడుకు ప్రేమను ఇందులో చూడవచ్చు. ఓ మధ్యతరగతి జీవి సుబ్బారావు. అతను ఆవేశంతో చేసిన పనికి జైలుకు వెళ్తాడు. కాని అమ్మ అంటే ప్రాణం. ”మనుషులెలాగూ చచ్చిపోతూనే ఉంటారు… కాని తన అమ్మ చనిపోతుందని మాత్రం ఎన్నడూ అనుకోలేదు” అని అతను అనడాన్ని బట్టి ఇది అమ్మ మీది ప్రేమను ప్రతిబింబించే కథ అని చెప్పవచ్చు.
నారయ్యబతుకు (24వ కథ) : ఇది మొత్తం నలుగురి స్త్రీల జీవితం. గౌండ్లోల్ల నారయ్యకు ముగ్గురు భార్యలు, ఒక కోడలు. ఈ కథ గౌండ్ల స్త్రీల, పురుషుల కష్టనిష్ఠూరాలను వివరిస్తుంది.
ఇజ్జత్‌ (26వ కథ) – ఇందులోనూ నలుగురు స్త్రీలుంటారు. వారిలో ఇద్దరు నామమాత్రం. మిగిలిన ఇద్దరు స్త్రీలు – తల్లి కూతుళ్లు. తల్లి – విధవ. ఆమె కూతురు ఛాయ. వారిది మధ్యతరగతి బ్రాహ్మల జీవితం. వరకట్న సమస్య కారణంగా ఛాయ అవివాహితంగానే ఉండిపోవాల్సి వచ్చింది. ఛాయ సోదరుడు రంగారావు. రంగారావు పిత్రార్జితం భూమిని అమ్మి, చెల్లె ఛాయ పెండ్లి చేయాలనుకుంటాడు. పెండ్లి కోసం భూమిని అమ్మడానికి ప్రయత్నం చేస్తాడు. కాని, ఆ భూమిని సాగు చూస్తూ, బతికే పాలేరుమల్లయ్య – తన కూతురు పెండ్లి చేసి అప్పులపాలౌతాడు. ఆ కారణంగా రంగారావుకు చెల్లించాల్సిన కౌలు కూడా ఇవ్వలేకపోతాడు. కచ్చితంగా అడిగేసరికి ఇజ్జత్‌ పోయిందని చనిపోతాడు. ఆ తర్వాత రంగారావు భూమి అమ్మలేదు. చెల్లె ఛాయ పెండ్లి చేయలేదు. ఈ కథలో వివాహ సమస్య, వరకట్న సమస్య, వ్యవసాయం సమస్యలు మొదలైనవి చర్చించబడినాయి.
ఏయిర్‌మేల్‌ (27వ క) – ఈ కథలో ఒకే ఒక స్త్రీ ఉంది. ఆమె పూర్ణిమ. భర్తకు అనుకూలంగా ఉండే స్త్రీ. ఈ కథ భార్యాభర్తల అనుబంధానికి, అన్యోన్య దాంపత్యానికి సంబంధించింది. ఒక రోజు పూర్ణిమ పుట్టింటికి ప్రయాణమై వెళ్తుంటుంది, మధ్యలో రైలు దోపిడీ…
తిరిగిరాను (29వ కథ) – ఇందులో ఉంది ఒకే ఒక స్త్రీ – ఆమెనే రఘుభార్య. ఆమె మిక్కిలి ఆత్మాభిమానం కలిగిన వ్యక్తి. కాని ఆమెనుభర్త రఘు సరిగా అర్థం చేసుకోలేడు. పరస్పర విరుద్ధ స్వభావంకల భార్యాభర్తలు.
మణెమ్మగారి మనవడు (31వ కథ) – ‘మణెమ్మగారి మనవడు’ అనేది కథా శీర్షిక. ఆ శీర్షికను బట్టే ఇది స్త్రీ ప్రాధాన్యం కలిగిన కథ అని చెప్పవచ్చు. మణెమ్మగారికి చుట్ట, బీడి, సిగరెట్‌ మొదలైన వాటి వాసన పడదు. కాని, ఒకరోజు ఇంట్లో సిగరెట్‌ పొగవాసన వస్తుంటుంది, కాని మనుష్యులు కనిపించరు. పొగ తాగేవాళ్లను తిడుతుంటుంది. కాని ఆ పొగ తాగేవాడు తన మనవడనీ, వాడు మంచం కింద దాక్కోని సిగరెట్‌ తాగుతున్నాడనే విషయాన్ని ఆమె గమనించదు. అందినీ తిడుతుంటుంది. ఇందులో మణెమ్మగారిదే ప్రధానపాత్ర.
సర్కారు కిస్తు (32వ కథ) – అత్తాకోడండ్లు ఇందులో ప్రధాన స్త్రీ పాత్రధారులు. భర్త కాలం చేసిన తర్వాత కొడుకును పెంచి, పెద్దచేసిన అత్త (స్త్రీ మూర్తి) గాథ. రైతులబాధలను తెలియజేసే కథ.
సిపాయి రాముడు (33వ కథ) – ఈ కథలో ముగ్గురు స్త్రీలుంటారు. వారు – ఎల్లి, మల్లి, సీత. అల్లుడు ఎలా ఉండాలనే విషయంతో కొన్ని నిర్దిష్టమైన ఆలోచనలు సీత తల్లికి ఉంటాయి. కూతురు సౌఖ్యాన్ని ఒకరు, కొడుకు సౌఖ్యాన్ని మరొకరు కోరుకునే ఇద్దరు తల్లుల కథ ఇది. సీత అమాయకురాలు.
తెలంగాణా ఆడపిల్లలకు ఏ లక్షణాలుంటాయని, ఈ రాధేనా కథలో రాజారం చెప్పాడో – ఆ లక్షణాలను అన్నింటిని పుణికి పుచ్చుకున్న పిల్ల ఈ సీత. ఆకతాయి రాముడు సిపాయిరాముడిగా మారిన తర్వాత సీతను ఇచ్చి వివాహం చేయడం ఇందులోని కథ. ఇద్దరు స్త్రీల సర్దుబాటు ధోరణి మనకు ఇందులో కనిపిస్తుంది.
కాని కాలం వస్తే (34వ కథ) – ఇందులో నలుగురు స్త్రీలుంటారు. వారు – నవాబు భార్య, అతని ఇద్దరు కూతుళ్లు – నసీమ్‌, వహీదాలు, సేవకురాలు – ఫాతిమా. నవాబుల దివాలా తీసిన ఆర్థిక పరిస్థితి, తిరగబడిన కాలం (పరిస్థితులు), వెరసి కష్టాలు. ఆ కష్టాలను వివరించిన కథ. ఇండియానుండి ముస్లింలు కొందరు పాకిస్తాన్‌కు వెళ్లిపోవడానికి గలకారణాలను, యజమానుల పట్ల సేవకుల విశ్వాసాన్ని ఈ కథ తెలియజేస్తుంది. అదే సమయంలో ఇండియాలో ముస్లింలు చేసిన దురాగతాలను తెలియజేస్తుంది. మొత్తం మీద ఈ కథ ముస్లింల కుటుంబానికి సంబంధించిన కథ అని చెప్పవచ్చు.
యుగాంతం (35వ కథ) – ఇందులో స్త్రీలు ఇద్దరు ఉంటారు. ప్రత్యక్షంగా ఒకే ఒక పాత్ర – స్వామి అమ్మ కనిపిస్తుంది. ఈ కథ కూడా ఇండియా నుండి ముస్లింలు పారిపోవడాన్ని తెలియజేస్తుంది. హిందూ ముస్లింల స్నేహాన్ని, రజాకార్ల దుర్మార్గాలను, అవినీతిని కూడా ఈ కథ క్లుప్తంగా వివరిస్తుంది.
మొత్తం మీద ఇందులోని కథలు, పాత్రలు – పేర్లను బట్టి గానీ, వారి ప్రవర్తనను బట్టి గానీ, వస్తు పరంగా గానీ, చూసినట్లైతే 13వ శతాబ్దం – 20వ శతాబ్దం వరకు (కాకతీయుల కాలం నుండి ఆధునిక కాలం వరకు) ప్రతిబింబాలనవచ్చు.
ఇందులోని కథలు కూడా – కొన్ని చారిత్రికం, మరికొన్ని సాంఘికం, కాల్పనికం, రాజకీయం మొదలైన ఇతివృత్తాలతో కూడుకొని, వస్తువైవిధ్యంతో ఒప్పారుతున్నాయి.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.