బ్రహ్మసూత్రాలు

కె. సుభాషిణి
మొద్దుబారి సున్నితత్వాన్ని కోల్పోయి కాయలు కాచిన తన చేతులు చూసుకుంటుంటే బ్రహ్మదేవుడికి దిగులు ముంచుకొచ్చింది. బొమ్మలు చేయడం… రాత రాసి ప్రాణం పోయటం… రాత్రి లేదు పగలు లేదు. యుగాలు తరబడి యిదేపని చేసి చేసి బ్రహ్మ అలసిపోయాడు. పక్షుల కికిలకిలరావాలు. సెలయేళ్ళ గలగలలు, సుగంధాలను వెదజల్లుతున్న రంగురంగుల పుష్పాలు… యివేవి బ్రహ్మ అలసటను పొగొట్టలేకపోతున్నాయి. ఎప్పటినుండో అవే దృశ్యాలు… ఇసుమంత కూడా మార్పు లేని దృశ్యాలు. బ్రహ్మకు విసుగ్గావుంది. చేతులు తిమ్మిరి ఎక్కినట్టు అనిపిస్తే వేళ్ళు విరుచుకున్నాడు. ఎంతో కాలంగా బిగుసుకుపోయిన వేళ్ళు అవి.
”ఆ….ఆ….ఆ….ఆ…” వొళ్ళు విరుచుకుంటూ దీర్ఘంగా, తృప్తితీరా ఆవులించాడు.
సరస్వతీదేవి వులిక్కిపడింది. వీణ వాయిస్తున్న చేతులు పట్టు తప్పడంతో అపశృతి పలికింది. బ్రహ్మ వైపు చూపు సారించింది.
ముడతలు పడిన శరీరం… అలసటతో మూసుకుపోతున్న కళ్ళు… నెరిసిన నాలుగు తలలు… వాటికి కిరీటాలు… పొడుగాటి గడ్డాలు… ఎప్పుడు బిగించుకొని వుండే పెదాలు…
‘నాలుగు నోర్లు… ఎనిమిది పెదాలు… కాని ఏం లాభం… ఒక ముద్దు లేదు ముచ్చట లేదు. చిరునవ్వుతో పలకరింపుకు కూడా నోచుకోని జన్మ తనది…. తన వైపు కన్నెత్తి కూడా చూడనంత పని స్వామికి… శ్రమ స్వామిది… పెత్తనం హరిది… లక్ష్మీదేవిదే సుఖం. భర్తతో సన్నిహితంగా వుంటుంది. ఆ… ఏం సుఖంలే… నిరంతరం భర్త పాదాలు వొత్తుకుంటూ… నొప్పి పుట్టదూ? పాపం… యుగాల తరబడి అంత బాధను ఎలా భరిస్తోందో! దానికన్న వీణ వాయించుకుంటూ గడపటమే సులభం… అయినా వీణ వాయిస్తుండేది ఎవరి కోసం… స్వామికి విసుగు రాకుండా, పనిలో అంతరాయం కలుగకుండా ఒకే స్థాయిలో వీణ వాయించడమే తన కర్తవ్యం… స్వామి నుండి చిన్న మెప్పు కూడా వుండదు. అసలు వింటున్నాడా అని పెద్ద అనుమానం. బహుశ వీణ వాయించడం ఆపితే గమనిస్తాడేమో….’ అపశృతిని గమనించే స్థితిలో లేదు సరస్వతి.
మంద్ర స్థాయిలో వినిపించే వీణానాదంలో ఏదో తేడా కనిపించింది బ్రహ్మకు. భ్రుకుటి ముడి వేసి సరస్వతి వైపు చూశాడు.
కళ్ళు వాల్చుకొని తన పని తాను చేసుకుపోతోంది. పొడుగాటి వేళ్ళు… వజ్రపు వుంగరాలకే వన్నె తెచ్చిన వేళ్ళు… చూస్తూనే ముద్దుపెట్టుకోవాలన్న కోమలంగా వున్న వేళ్ళు. కొద్దిసేపు తదేకంగా చూశాడు.
‘అమృతం తాగిన శరీరాలు తమవి. ఆమెకు వృద్ధాప్యం రాదు. తనకేమో యవ్వనం తిరిగిరాదు…’ భారంగా నిట్టూర్చాడు. ‘దేవి ఎన్నడయినా ఈ విషయం ఆలోచించి వుంటుందా? యిలాంటి క్షుద్ర, క్షణికమైన కోరికలు దేవికి ఎలా కలుగుతాయి.! కలగవ్‌.. ఆమెకు తన జన్మ రహస్యం తెలుసు. తన కర్తవ్యం ఏమిటో క్షుణ్ణంగా తెలుసు. పతిని ఆనందింప చేయడం.. సేవ చేయడం కంటే సతులకు వేరే ఆనందం ఏం వుంటుంది? ఆడవారిని సృష్టిస్తున్నది కూడా అందుకే… పైగా పురుషుల వంశాలను వృద్ధి చేసే బాధ్యత కూడా అదనంగా వుంది. ఆడవాళ్ళకు రాత వ్రాస్తుండేది ఈ సూత్రం ఆధారంగానేకదా!….’
సరస్వతిని పలకరించడానికి బ్రహ్మ నాలుగు ముఖాలు వుబలాట పడ్డాయి. ”దేవి…” కొంచెం ప్రేమ, కొంత దర్పం కలిపి పిలవడానికి పెదవులు కదిలించాడు. సంవత్సరాల తరబడి బిగుసుకుపోయిన గొంతు… గురకతో కూడిన శబ్దంతో కర్ణకఠోరంగా వుంది.
సరస్వతి అదిరిపడింది. కనుపాపలు భయం భయంగా కదిలాయి. ముఖం పాలిపోయింది.
‘తన మనసులో మాట స్వామికి తెలిసిపోయిందా…? శపిస్తాడా….?’
యింతలో కిర్రుమంటూ బ్రహ్మలోకం తలుపులు తెరుచు కున్నాయి. ద్వారపాలకుడు వచ్చి బ్రహ్మకు, సరస్వతికి వంగి నమస్కారం చేశాడు.
”స్వామి… యమధర్మరాజు సేవకులు నలుగురు భూలోకవాసులను మన ముఖద్వారం వద్ద వదిలి వెళ్ళారు. తమరితో అతి ముఖ్యమైన విషయం మనవి చేసుకోవాలట… వారిని లోనికి ప్రవేశ పెట్టమంటారా…?’
‘ఏమిటీ వైపరీత్యం.. మానవులను బ్రహ్మలోకానికి పంపడమా? అదీ స్వయంగా యమధర్మరాజే పంపడమా? ఇది ఏ అనర్థానికి దారి తీస్తుందో…’ గతంలోని అనుభవాలు బ్రహ్మలో గుబులు లేపాయి.
బ్రహ్మదేవుని ద్యాస తన మీద నుండి పక్కకు మళ్ళినందుకు సరస్వతీకి ఆనందంగా వుంది. విషయం ఏమిటో అనే కుతూహలం కూడా మొదలయ్యింది. చేతిలోని వీణను పక్కకు పెట్టింది. సంవత్సరాల తరబడి పద్మాసనం వేసుకొని కూచున్న కాళ్ళను కిందికి దించింది సరస్వతి.
………………………….
ద్వారం దగ్గర నుండే బ్రహ్మకు, సరస్వతికి వంగి వంగి దండాలు పెట్టుకుంటూ వచ్చారు నలుగురు వ్యక్తులు. బ్రహ్మలోక సౌందర్యాన్ని, సంపదను చూస్తుంటే వాళ్లకు కళ్ళు చెదిరిపోతున్నాయి. వీక్షించడానికి రెండు కళ్లు చాలడం లేదు. ‘ఇద్దరికి యింత సంపదా! ఎంత పెద్ద లోకం… ఓహ్‌! వారసులు ఎవరో…ఓ….వీరు దేవతలు…. జీవన్మరణాలు వుండవు…’ లెంపలు వేసుకున్నాడు ఒక వ్యక్తి.
దగ్గరగా బ్రహ్మ… ఒకే శరీరం…. నాలుగు తలలు కన్పించేసరికి వాళ్లకు వొళ్ళు గగుర్పొడిచింది. వీణానాదం లేకపోవటం కొంచెం వెలితిగా అనిపించింది.
”చెప్పండి మా సన్నిధికి రావటంలోని ఆంతర్యం ఏమిటి….?” గుచ్చి గుచ్చి చూశాడు వారి వైపు.
సాష్టాంగ నమస్కారం చేయబోయారు కాని బొజ్జలు, మోకాళ్లు అందుకు సహకరించకపోవటంతో ఆ ప్రయత్నం మానుకున్నారు.
”స్వామి నా పేరు…” అలవాటు ప్రకారం వివరాలు చెప్పబోయాడు ఒక వ్యక్తి.
”మీ వివరాలు మాకు తెలుసు.. మీ నుదుటి మీద వున్న రాత మాకు మాత్రమే గోచరం…”
బ్రహ్మను పూర్తిగా మాట్లాడనివ్వలేదు వాళ్ళు.
”మరి మీకు మా రాత కనిపించడం లేదా బ్రహ్మదేవా…? మగవాళ్లకు ఎందుకు యిలాంటి రాత వ్రాస్తున్నారు. అలనాటి పురుషుల వైభవం ఎక్కడా…! దిగజారిపోయిన మా పరిస్థితులు ఎక్కడా…! దీనికంతా ఆడవాళ్లు కారణం అనే విషయం మీకు తెలియకుండానే జరుగుతోందా స్వామి…”
సరస్వతి, బ్రహ్మ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు.
”మా సన్నిధిలో మమ్మల్నే ప్రశ్నిస్తారా? కాని ఒక్క మాట, ఆడవాళ్ళ నుండి పురుషులకు లభించేది సుఖాలు, ఆనందాలు, సేవలే కాని కష్టాలుగా కలగాలని ఎన్నటికి రాత వ్రాయం…” గంభీరంగా పలికాడు బ్రహ్మదేవుడు.
”లేదు స్వామి ఎవరో ఒకరిద్దరు పురుషులకు తప్ప అలాంటి భాగ్యం అందరికి దక్కటం లేదు స్వామి… మా దీన గాథలు వింటే మీరు వ్రాసిన రాతను మీరే తిరగ వ్రాస్తారు…”
నలభై ఐదు సంవత్సరాలు వుంటాయి అతనికి కాని యువకుని మాదిరిగానే కనిపిస్తున్నాడు
”బ్రహ్మరాతను మార్చడమా..! అసంభవం….”
”అయితే నా కథ వినండి స్వామి. నాకు తల్లిదండ్రులు పెట్టిన పేరు శ్రీనివాస్‌… కాని నన్ను అందరు పెండ్లి కాని ప్రసాదు అంటారు….” తలవంచుకున్నాడు.
”నీకు వివాహం కాలేదా….! ఆశ్చర్యంగా వుందే…! నీకు యిరవై ఎనిమిదవ సంవత్సరంలో కల్యాణ యోగం వుండాలే…. ఏం జరిగింది…” బ్రహ్మ భ్రుకుటి ముడి పడింది.
ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, ఎక్కడ మొదలు పెట్టాలి అని ఆలోచిస్తూ రెండు నిమిషాలు మౌనంగా నిలబడ్డాడు శ్రీనివాస్‌. తల పైకెత్తి చూస్తే.. తననే తదేకంగా చూస్తున్న సరస్వతిని చూసి గుటకలు మింగాడు. మెల్లిగా నోరు విప్పాడు.
”సరిగ్గా నాకు ఇరవై ఎనిమిదవ ఏట పెండ్లి కుదిరింది. శుభలేఖలు కూడా అచ్చు వేయించాము. బంగారం, బట్టలు అన్నీ కొన్నాము. పెండ్లికి ముందరే ఖర్చులకని కట్నం డబ్బులు ముందే సగం యిప్పించుకున్నాం. పెండ్లి కూతురు ఒక్కటే కూతురు వాళ్లకు. వున్నదంతా ఎప్పటికయినా ఆ అమ్మాయికే చెందుతుంది. ఏమయిందంటే… అమ్మాయి తల్లితండ్రులు వుంటున్న యింటిని మా పేరు మీద రిజిష్టర్‌ చేయించమని పెండ్లి నాలుగురోజుల ముందు మా అమ్మ నాన్న అడిగారు. దాంతో సీన్‌ మొత్తం మారిపోయింది. అనుకున్నది ఒక్కటి. అయ్యింది ఒక్కటి… ఆ అమ్మాయి పెండ్లి ససేమిరా చేసుకోను అని చెప్పేసింది. యిక ఏముంది పెండ్లి పెటాకులు అయిపోయింది….”
సరస్వతి ఆశ్చర్యంగా చూస్తే… బ్రహ్మ చెవులు మూసుకున్నాడు.
”ఏమిటి పెండ్లి రద్దు చేసుకున్నారా…? మరి పరువు ప్రతిష్టల మాటేమిటి…”
”పరువు ప్రతిష్టల గురించి ఆలోచించడం మానేశారు ఈ కాలపు ఆడపిల్లల తల్లితండ్రులు. ఆత్మాభిమానం, వ్యక్తిత్వం ముఖ్యమైనాయి ఈ కాలపు అమ్మాయిలకు…”
”వూ… వాళ్ళ పాపం పండుతుంది. నరకంలో ఫలితం అనుభవిస్తారు. నీకేం మగాడివి… ఏం కాదు… నష్టం అమ్మాయికే… జీవితాంతం ఆమె అవివాహితగానే మిగిలిపోయుంటుంది…”
”కాని స్వామి ఆ అమ్మాయికే పెండ్లి అయ్యింది….”
సరస్వతి పెదవులు విచ్చుకున్నాయి. బ్రహ్మకు నాలుగు తలలు తిరిగినంత పనయ్యింది. ఎదురు దెబ్బలు తట్టుకోలేక పోతున్నాడు. ‘బ్రహ్మరాతకు వ్యతిరేకంగా నడుచుకునేంత శక్తి మానవులకు ఎలా వచ్చింది…’ వుక్రోషం ముంచుకొచ్చింది బ్రహ్మకు.
”అయితే మాత్రం… ఆ అమ్మాయి కాకుంటే యింకొక అమ్మాయి. ఆడపిల్లలకు కరువా…?”
”అది గత వైభవం బ్రహ్మదేవా! ఇప్పటి పరిస్థితి వేరు. మాలాంటి వాళ్ళను పెండ్లి చేసుకోకూడదని ప్రచారం చేస్తూ కుట్రలు పన్నే శక్తులు ఎక్కువయ్యాయి… మమ్మల్ని శిక్షించాలట… దానికొరకు ప్రత్యేక కోర్టులు, చట్టాలు వుండాలట..” ఆవేశంతో శ్రీనివాస్‌ ముఖం ఎర్రబడింది.
శ్రీనివాస్‌ భుజం మీద చెయ్యి వేసి మెల్లిగా తట్టాడు పక్కనే వున్న రాజారావ్‌. సరస్వతి వైపు తిరిగి, ”తలీ!్ల నీవు అయితే మా పరిస్థితిని సరిగ్గా అర్థం చేసుకుంటావని మా ఆశ….”
ముఖం చిట్లించింది సరస్వతి.
‘ఏమిటి ఈ మానవులు! ఆయననేమో స్వామి అంటారు… దేవుడా అని తలుచుకుంటారు. నన్నేమో తల్లీ, అమ్మా అంటారు. ఎందుకీ వ్యత్యాసం… అవునులే… దేవీ అని పిలిస్తే స్వామి వుగ్రులైపోరూ…’ కొత్త కొత్త ఆలోచనలన్ని సరస్వతిని చుట్టు ముట్టుతున్నాయి. తన వైపే చూస్తున్న రాజారావ్‌ మీద చూపులు స్థిరంగా వుంచింది.
”మగవాడి వయస్సు ఎక్కువయితే మూతి తిప్పుతారు.. వుద్యోగం లేకపోతే కన్నెత్తి చూడరు… కట్నం మాట చెవిన పడితే అగ్గి మీద గుగ్గిలం అయిపోతారు. వుద్యోగాలు చేస్తున్నామని గీర ఎక్కువయ్యింది ఆడవాళ్లకు….”
సరస్వతికి ముచ్చట వేసింది. అమాంతంగా ఆ అమ్మాయిలని వాటేసుకొని ముద్దు పెట్టుకోవాలనిపించింది.
సృష్టి కార్యంలో పడి, కాలక్రమంలో ఏం జరుగుతోందో గమనించకుండా వున్నందుకు బ్రహ్మ మధనపడ్డాడు. అసలు విషయం తెలుసుకోవాలనుకున్నాడు.
మౌనంగా నిలబడ్డ వెంకటరమణను ”నీ అభియోగం ఏమిటి….” బ్రహ్మ ఎడమ వైపు తల పలకరించింది.
శబ్దం ఎటు వైపు నుండి వచ్చిందో అర్థం కాక తికమక పడ్డారు.
”ఇదిగో నిన్నే అడుగుతున్నట్టుంది చెప్పు….” వెంకటరమణ డొక్కలో పొడిచాడు గోవిందరాజులు.
”ఏముంది స్వామి దీనికంతా కారణం స్త్రీలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్‌ కల్పించటమే. మేము చదవాల్సిన చదువులు వాళ్లేే చదివేస్తున్నారు. మాకు రావాల్సిన వుద్యోగాలు వాళ్లకే వస్తున్నాయి. మగపిల్లల జీవితం యిలా కాలి బూడిద అవుతుంటే చూస్తూ ఎలా వూరుకుంటున్నారు స్వామి….”
సరస్వతికి భూలోకానికి బ్రహ్మలోకానికి తేడా స్పష్టంగా తెలిసిపోయింది. దానితో ఆమెకు ఎక్కడ లేని తెగింపు వచ్చింది. ఒక్కసారిగా దిగ్గున లేచి నిలబడింది. సరస్వతి ఆవేశాన్ని చూసి బ్రహ్మ నిశ్చేష్టుడయ్యాడు.
”కొంపదీసి బ్రహ్మలోకంలో కూడా స్త్రీలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్‌ వుండాలి అంటుందా…?”
”భూలోకంలో స్త్రీలు సగం మంది వున్నారు. కాని మొత్తం అవకాశాలో రెండు భాగాలు మీకే దక్కుతున్నాయి…..”
”హమ్మయ్య… దేవి దృష్టి భూలోకంపైనే వుంది…”
”నాకు ముగ్గురూ కొడుకులే. అంతా ప్లస్సులే అని మురిసిపోయాను. కొడుకులకు వచ్చే కట్నంతో ఇల్లు, కారు కొనాలని ఆశ పెట్టుకొంటిని. నా కలలు అన్నీ బుగ్గిపాలయ్యాయి. ఒక్కనికి సరైన వుద్యోగాలు రాలేదు. మంచి సంబంధాలు రాలేదు. కట్నం అంతంతమటుకే. వచ్చిన కట్నాలు పెండ్లి ఖర్చులకు కూడా చాలలేదు. వాళ్ల చదువుల కోసం పెట్టిన ఖర్చులు కూడా రాలేదు….”
రాజారావ్‌ అందుకొని ”ఒక మాట అనకూడదు కోడళ్లని, మొగుడు ఒక్క దెబ్బ వేస్తి మా మగవాళ్ల పని అయిపోయినట్టే. కొందరయితే అలిగి పుట్టింటికి పోతారు. యింకా కొందరయితే మరీ సున్నితం. టార్చర్‌ పెడ్తున్నారని కేసులు పెట్టి విడాకుల నోటీస్‌ యిస్తారు…”
”స్త్రీలకు యింత ధైర్యం ఎలా వచ్చింది?”
”పుస్తకాలు, మహిళా సంఘాలు, చట్టాలు లాంటివి. ఎంత ఇబ్బందులను కలిగిస్తున్న లెక్కచేయడం లేదు వాళ్లు.” పళ్ళు కొరుకుతూ చెప్పాడు గోవిందరాజులు.
నలుగురు చేతులు జోడించి…
”పురుషులకు న్యాయం చేయండి స్వామి….”
”తప్పకుండా. మహిళా సంఘాలను అచేతనంగా వుండేట్టు చేస్తాం. వారికి నిధులు లభించకుండా చేద్దాం. స్త్రీలు ధైర్యంగా మారడానికి కారణమయిన పుస్తకాలని నిషేదిస్తాం. చట్టాలను దుర్వినియోగం అవుతున్నాయి అని వాటిని రద్దు చేసే ప్రయత్నం చేద్దాం.” మీసాలు దువ్వుకుంటూ బ్రహ్మ చెప్పాడు.
సరస్వతి కొయ్యబారిపోయింది. వున్నట్టుండి బ్రహ్మదేవుని మీసాలు పెద్ద తాళ్ల మాదిరిగా సాగి చుట్టేసినట్టుగా అనిపించింది సరస్వతికి.
ఆనందబాష్పాలు రాల్చుతూ నిలుచున్నారు నలుగురు భూలోకవాసులు.
”ధన్యులం స్వామి. మీ రాత తూచ తప్పకుండా అమలు జరగాలని మేం భూలోకంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తాం. స్త్రీల చేతనే వ్రతాలు చేయిస్తాం. వూరు వూరున బ్రహ్మదేవునికి గుడులు కట్టి పూజలు చేసి నైవేద్యాలు పెట్టి కానుకలు సమర్పించుకుంటాం….”
బ్రహ్మ నాలుగు ముఖాలు వెలిగిపోయాయి. సంభ్రమాశ్చర్యా లతో వుబ్బి తబ్బిబ్బుయ్యాడు. అంతలోనే తన నిస్సహాయత గుర్తుకు వచ్చి చప్పున చల్లారిపోయాడు. మెల్లిగా ఒక నోరు పెగుల్చుకొని, ”మేము చావు పుట్టుకల గురించి మాత్రమే వ్రాత రాస్తాం. జ్ఞానం పొందడం లాంటివి మాపరిధిలోకి రావు. మా దేవేరి పరిధిలోకి వస్తాయి. వారిని ఆదేశించి…”
బ్రహ్మ మాట పూర్తి కాకమునుపే సరస్వతి దిగ్గున లేచి నిలబడింది. వొళ్ళు దహించుకుపోతోంది ఆమెకు. ‘ఎంత కుట్ర… ఎంత మోసం… ఆడవాళ్లు తాము ఆడించినట్టు ఆడటం లేదని, తమ ఆటలు సాగడం లేదని ఎంత ఘోరానికి పాల్పడ్డారు ఈభూలోక పురుషులు. వీరికి స్వామి వంత పాడుతున్నారు. ఎట్టి పరిస్థితిలోనూ వీళ్ల ఆటలు సాగనివ్వకూడదు. జ్ఞానం పొందిన స్త్రీలను అజ్ఞానులుగా చేయమని ఆదేశించాలని స్వామి అనుకుంటున్నారు… వద్దు… వీణ వాయించుకుంటూ ఈ బ్రహ్మలోకంలో యిలా వూడిగం చేసేకంటే… భూలోకానికి పోయి స్త్రీలను మరింత ధైర్యవంతులుగానూ, జ్ఞానవంతులుగానూ చేయడమే ముఖ్యం…’
తల మీద వున్న కిరీటాన్ని బ్రహ్మ ముందు పడేసి విసవిస నడుచుకుంటూ భూలోకం వైపు కదిలింది సరస్వతి.

Share
This entry was posted in కధలు. Bookmark the permalink.

One Response to బ్రహ్మసూత్రాలు

  1. nirmala says:

    Hello Suhasini,

    Nee kadha adbhutam. idi natakam gaa veyyacchu.

    nirmala

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.