అద్భుతానందాన్ని కల్గించిన హిమాలయాల ట్రెక్కింగు

– బీడుపల్లి భాగ్య

ఆకులో ఆకునై పూవులో పూవునై ఈ అడివి దాగిపోనా….. అని కృష్ణశాస్త్రి గీతం అడవి మాధుర్యాన్ని, సౌందర్యాన్ని గుర్తుచేస్తుంది. అంతగొప్పగా హిమాలయాలు ఆ పరిసరాలు మనల్ని ఎంతో పరవశింపచేస్తాయి. ఈ మురికి, ఇరుకు జీవితాల నుండి విముక్తి చేయగలిగే మహాశక్తి హిమాలయాలకు వుందని చెప్పటం అతిశయోక్తికాదు.

ఆకాశాన్ని అంటినట్టు భ్రమింప చేసే హిమశిఖరాల్ని చూడాలన్నా, స్వేచ్ఛా ప్రపంచంలో కొంతకాలమైనా జీవించాలని వున్నా? స్వచ్ఛమైన గాలిని పీల్చాలని అనుకుంటున్నా? కలత నిద్రకు స్వస్తిచెప్పి బంధాలకు, అనుబంధాలకు అల్లంత దూరంలో అరుదుగానైనా జీవించాలనుకున్నా, బతికి వున్న జీవితంలో స్వర్గం ఎలా వుంటుందో చూడాలని అను కుంటున్నా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిమాలయాలకు ట్రెక్కింగు వెల్లటమే. పేద వాళ్ళకు వీలు కాక పోవచ్చు. కానీ దిగువ మధ్యతరగతి వారికి సాధ్యమే, జీవితంలో యాత్రలకో, దేవుని గుళ్ళకో పెట్టే ఖర్చుకు కొంత అదనంగా జమచేసుకుంటే రూ. 7000/- లతో హిమాలయాల్ని చుట్టేసుకొని జీవితాన్ని ధన్యం చేసుకొనే మహత్తర అనుభవాన్ని సులభంగా పొందవచ్చు. ఢిల్లీలో వుండే YHAI, Yuvjan Charan Sanstha, 5 Nyaya Marg, Chanakyapuri, New Delhi – 110 021. Website: www.yhaindia.org. 26871969, 26110250, 26116285 సంస్థ ద్వారా ఎంతో సురక్షితంగా మనకు వీలౌతుంది.

12 మే 12.30 గంటలకు విజయవాడ నుండి లాలూప్రసాద్‌ యాదవ్‌ ప్రవేశపెట్టిన గరీబీరధ్‌లో హిమాలయాస్‌ గుర్తొచ్చే కూల్‌లో 8 మంది పెద్దలం 10 మంది 15 సంవత్సరాలలోపు పిల్లలం కలసి బయలుదేరాము. 13వ తారీఖు 10గం|| ఢిల్లీ చేరాము, అక్కడ అక్షరధామం అన్న ప్రసిద్ధస్వామి నారాయణ ఆలయం చూసి అక్కడినుండి రైల్లో బయలుదేరి 14 ఉదయం 9గం|| అమృత్‌సర్‌ చేరాం. అక్కడ జలియన్‌వాలాబాగు, స్వర్ణదేవాలయం చూడ్డంతో పాటు నిత్యం అపరిమిత స్థాయిలో భక్తులకు వడ్డిస్తున్న ఉచిత భోజనశాలలో మేము భోజనం చేశాం. అక్కడ సిక్కుల చరిత్ర తెలిపే హింసాత్మక పోరాటాల చిత్రపటాలను చూశాం. భారత్‌, పాకిస్థాన్‌ సరిహద్దు ప్రాంతంలో ప్రతిరోజు సాయంకాలం జరిగే సౌహార్ద్ర సాంస్కృతిక కార్యక్రమాలను ఆసక్తిగా, తిలకించటం, ఆలకించటం. అర్దాంతరంగానే హడావుడిగా 8గం|| బస్సు పట్టుకొని 15వ తారీఖు 12 గంటలకు మనాలి చేరాము. అక్కడ హిడింబి ఆలయం, మనాలి షాపింగు చేసి సా|| 7 గంటలకు బస్సెక్కి పిల్లలు గడిపే నేచర్‌ క్యాంప్‌ కు రాత్రి 8 గం|| చేరాము. కసోల్‌ అన్న స్థలానికి మరొక 70 కి.మీ. ప్రయాణించడానికి ఆ సమయంలో బస్సు లేనందున ఆ రాత్రి అక్కడే గడిపి మరుసటి రోజు ఉదయం 9.30 గం|| KASOL అన్న ప్రాంత బేస్కేంపుకు చేరుకున్నాము. ఆ రోజు ట్రాక్‌ బ్యాచ్‌ సభ్యులందరికీ ట్రెక్లో చూడబోయే ప్రాంతం, తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకెళ్లాల్సిన లైట్‌ లగేజు, ఏ రకంగా గడపగలిగితే బ్యాక్‌ టు నేచర్‌ ట్రెక్కు సద్వినియోగం చేసుకోవచ్చు లాంటి అంశాల గురించి ఫీల్డ్‌ డైరక్టర్‌ వివరించారు. మేమంతా ఫాం పూరించినాక కేటాయించిన టెంట్‌ కెల్లి యిచ్చిన స్లీపింగు బ్యాగు, ఉలన్‌ బ్లాంకెట్‌, రుక్‌శాక్‌ పేరుతో వెనుక వీపుకు తగిలించుకొనే బ్యాగు అక్కడుంచి తొందరగా షూ వేసుకొని వాటర్‌బాటిల్‌, రైన్‌ కోట్‌తో బయట అందరిని ఒకచోట హాజరుపరిచారు. మా బ్యాచ్‌లో మొత్తం 40 మంది ఇందులో 14 మంది స్త్రీలు ఆంధ్రప్రదేశ్‌ నుండి నేను. ఢిల్లీ, ఇండోర్‌, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌, కర్నాటక, ఆంధ్ర, కేరళ తదితర ప్రాంతాలవారున్నారు. acclimatization and orientation పేరుతో 16, 17 ట్రెక్కుకు టీంను మానసికంగా, శారీరకంగా సంసిద్ధం చేయటం, ముగ్గురు గైడ్స్‌ ఆధ్వర్యంలో రెండు కిలోమీటర్ల నడకతో ఒక పెద్దకొండ గంటపాటు 6500 అడుగుల ఎత్తు బేస్‌ క్యాంపు నుండి 7500 అడుగుల ఎత్తువరకూ మమ్మల్ని ఎక్కించారు. ఆరోజు మాత్రం అందరికీ చెమటలు పట్టటంతో పాటు ఆయాసం పెరిగింది, అందరితో కలిసి సకాలంలో అనుసరించటం కొందరికి కష్టమైంది. నిజంగా మిగిలిన 7 రోజులలో 13,800 అడగులకు ఎక్కి సజావుగా వెనక్కి రాగలమా? అన్న ప్రశ్న వేసుకోనివారుండరేమో? పైకి వెళ్ళినా మిగిలిన అందరికోసం, కాసేపు విరామం కోసం కూర్చోమన్నారు. వెంటనే బాగా వర్షం, కొందరి దగ్గరే రైన్‌ కోట్సున్నాయ్‌, లేని వారితో పంచుకున్నారు ఒంట్లో చెమట తగ్గి ఒణుకు మొదలైంది. చినుకుతో విరామ సమయం ముగిసింది. వచ్చిన దారినే తిరుగు ప్రయాణం ఎక్కటం ఎంతకష్టమైందో దిగటమూ అంతే కష్టమైంది, ప్రత్యేకించి ఊత కర్ట లేకుండా మధ్యాహ్న భోజనానంతరం బేస్‌ క్యాంపుకు దగ్గరనే వున్న మణికరణ్‌ అన్న చిన్నపాటి టౌన్‌ వింతలు చూడ్డానికి వెళ్ళాం. వారు సూచించిన హంటర్‌ షూ, జర్కిన్‌, రైన్‌ కోట్‌, హేండ్‌ గ్లౌస్‌, మంకీ క్యాప్‌, సాక్స్‌ ఇవన్నింటితోటే అందరూ వచ్చారు, కాని అవి నాణ్యంగా లేవు వాతావరణానికి తట్టుకోగలిగినవి, సమస్యలు లేకుండా సజావుగా ట్రెక్‌ ముగించడానికి, వారు సూచించినవి కొనడానికే అందరూ ఆ టౌనుకు వెళ్ళాము. అక్కడ పొగలు గక్కుతూ వేడి నీళ్ళొస్తున్నాయ్‌, పక్కనే పార్వతి రివర్‌, గురుద్వారలో ప్రతిరోజు లంగరు పేర ఉచితంగా వడ్డించే అన్నాన్ని కట్టెలు, గ్యాస్‌లేకుండా ఈ నీళ్లలో వండుతున్నారు. చాలా మంది ఒడ్డున నిల్చొని చిన్న, చిన్న గుడ్డ సంచుల్ని పొడుగునాడ కట్టి నీటిలో వదలి వున్నారు. మరికొంతమంది అలా వండిన సంచుల నుండి ఉడికిన బఠానీలు, ముడిశెనగలు లాంటి గుగ్గిల్లను యితరులకిస్తూ వారు తింటూన్నారు. మరికొన్ని చోట్ల స్త్రీలు, పురుషులు, పిల్లలు, సాధువులు ఆ నీటిలో స్నానం కూడా చేస్తున్నారు. కారణం చర్మవ్యాధులు వుంటే పోతాయట, లేకుంటే రావట. యేళ్ళ తరబడి ఆ ప్రవాహం భూగర్భంలో భాస్వరం ప్రభావం కారణంగా వేడినీరు అలా యేళ్ళతరబడి వస్తూనే వున్నదట. బాగా చలిగా వుంది. భోజనం తరువాత camp fire అన్న పేరున ప్రతి రోజు క్యాంపు జరుపుతారు. ఈ రోజు ట్రెక్‌ ముగించిన 14వ బ్యాచ్‌, రేపు, ఎల్లుండి ట్రెక్‌కు వెళ్ళబోయే 15, 16వ బ్యాచ్‌, అందరూ దాదాపు 150 నుండి 200 మంది ఒక్కచోట చేర్చి వారి అనుభవాల్ని పంచుకొనేలా చూడటం, సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుకోవటం చివరిగా, సర్టిఫికెట్స్‌ పంపణీ చేయటం. బ్యాచ్‌కు ఒకటిన్నర నెలలపాటు జరిగే సాంప్రదాయం. క్యాంప్‌ ఫైర్‌ అంటే చెప్పలేని ఆనందమని చెప్పవచ్చు.

17వ తేదీ ఉదయం రెండు కిలోమీటర్ల నడక తర్వాత నడుముకు బెల్టు కట్టి చేతులకు గ్లౌసు యిచ్చి పక్కదారి నుండి పైకి ఎక్కమని పైనుండి సాధ్యమైనన్ని తక్కువ జంపులతో కుడి చేత్తో తాడును ముందు వదులుతూ ఎడుమ చేత్తో నడుము వెనక పట్టుకొని దిగటం నేర్పారు. గైడు మూడు గెంతలతో దిగి చూపించారు? ఇందులో అందరూ సాహసించకపోయినా 30 మంది దాకా చేయగలిగారు. మాతో వున్న యిద్దరు గైడ్లు, నైనిటాల్‌ యువకులు, తేలికపాటి శరీరాలతో సూనాయాసంగా ఎలాంటి ఆధారం లేకుండా చేతులు, కాళ్ళ సహాయంతో పైకి సాదా సీదా నడకతో ఎక్కటం, అందరిని అబ్బురపరచింది. దీన్నే ర్యాప్లింగు అంటారు. మధ్యాహ్న భోజనానంతరం అక్కడినుండి రాక్‌ క్లైంబింగు కోసం మా నడుముకు తాడు కట్టిపైన ఒక గైడు ఆ తాడును పట్టుకొని మేమెక్కగలిగినంతలో తాడును పడిపోకుండా పట్టుకొని వుంటాడు. బండ సాఫీగా వుంది. పేద్ద పేద్ద అంగలేస్తే ఒక్క సూది మొనలాంటి కొసలో షూతో బొటనవ్రేలు మోపినంత స్థలంలో చేతులు, కాళ్ల ఆదారంతో ఎక్కటం చాలా కష్టమైంది. ఎక్కువమంది ప్రయత్నించి విఫలమయ్యారు, మొత్తంపైన 15 మంది కంటే ఎక్కువ ఎక్కలేక పోయారు. ఎక్కిన వారిలో యిద్దరు స్త్రీలు కూడా వున్నాం. జిమ్నాస్టిక్స్‌లో విజయం సాధించినట్టు ఎక్కిన వాళ్ళు, అనుభూతి చెందారు. 18వ తారీఖు అసలైన ట్రెక్‌ ప్రారంభం, ప్రాతఃకాలాన్నే లేవటం 7 రోజుల ట్రెక్‌కు తీసుకెళ్ళే లగేజు రుక్‌ శాక్‌లో వుంచి మిగిలిన లగేజు క్లాక్‌ రూంలో వుంచాం. తీసుకున్న స్లీపింగు బ్యాగు, బ్లాంకేట్‌ పద్దతిగా మడచి అప్పజెప్పి, మా టెంటు శుభ్రం చేసి బయట వచ్చాం. అందరి బ్యాగుల బరువు చెక్‌ చేసి తక్కువ బరువుతో ప్రయాణిస్తే క్షేమకరం అన్నారు. వారి వారికిచ్చిన నంబరింగును నిర్ధారించుకొని కొన్ని సూచనలతో కొంతమంది నిపుణులతో ముందుకు కదిలాం. గతరాత్రి విజయవంతంగా ముగించుకొచ్చిన ట్రెక్‌టీం లయబద్ధంగా చప్పట్లు చరిస్తూ మాలా మీరు విజేయుల్లా రండని సాగనంపారు.

మేము ఎవరెస్ట్‌ ఎక్కబోతున్న ఉత్సాహంతో అడుగుల్ని ముందుకు వేశాము. ఊతకర్ర లేంది అడుగుముందుకెయ్యద్దు అన్నట్టు ఊతకర్రలు ముందు పెట్టుకొని వెళ్ళే దారిలో నిలుచున్నారు. నిలువునా 500మీ. దిగితే పార్వతినది వచ్చింది. నదిలో కాక నదిపౖౖె వెళ్ళటం ఈత యిష్టమైన వారికి నిరుత్సాహమేసింది. వంతెన మీదుగా ఆవలికి చేరి అక్కడి నుండి పైకి పైకి పాకినట్లుగా ఎక్కి 12 గంటలకు సీలాగావ్‌ చేరుకున్నాము. మరొక అరగంటకు లంచ్‌బ్రేక్‌, ఎక్కడ ఆగినా మెత్తటి కార్పెట్‌ పరచినట్టుండే ఆకుపచ్చ గడ్డిలో యాపిల్‌ చెట్ల నీడన గుంపులుగా కూర్చొని వారి లంచ్‌ బాక్సులు విప్పి చుట్టూ కొండల సౌందర్యాన్ని తిలకిస్తూ చలి, చిరు గాలిని ఆస్వాదిస్తూ వృత్తి, ప్రవృత్తి గురించిన కబుర్ల, చర్చల, జోకులతో విశ్రాంతి తీసుకున్నాం. ఎలాంటి బిడియాలకు ఆస్కారం లేకుండా ఎంత అందం అనుకుంటూ ఆకాశంవైపు చూస్తూ అంతటా మేమూ అన్నట్టు స్త్రీలు పడుకోవటం నాకు నచ్చింది. 3.30 గం|| గుణాపాణి అన్న మాట్రెక్‌ మొదటిరోజు రాత్రి గడిపే క్యాంపుకు చేరుకున్నాం. నంబరింగుతో హాజరుచెప్పడంతో పాటు 40 మంది షీట్లు అక్కడి YHAI లీడర్‌కి అప్పజెప్పాలి యిది చివరివరకూ జరిగే క్రమం. మొత్తం 5 టెంట్లున్నాయ్‌. స్త్రీలకు రెండు పురుషులకు మూడు కేటాయించారు.

ప్రతిచోట welcome Drink పేర అంత చలిలో వేడిగా తాగాలనివున్నా చల్లనిపానీయాలే ప్రతిఒక్కరితో ప్రతిరోజు తాగించారు. 15 నిమిషాల తేడాతో టీ విత్‌ స్నాక్స్‌ అపుడే అక్కడే తయారుచేయించినవి యిచ్చేవారు. ఆరు ఏడు మధ్య రాత్రి భోజనం, క్యాంపు ఫైర్‌ తరువాత హార్లిక్స్‌ తోటి పాలు, ఎక్కడా ఎలాంటి పరిమితి లేదు. చాలా వరకూ కోరిన మేరకు వడ్డించారు. ప్యూర్‌ వెజిటేరియన్‌, యే కూరలోనూ చింతపండు వుండదు. పరిమిత స్థాయిలో ఆయిల్‌, ఉప్పు, కారం ద్రవరూపంలో స్వీటు, కూల్‌డ్రింక్‌, టీ, మిల్క్‌ పేర ఒక్కొక్కరు మూడు, నాలుగు లీటర్లకు తక్కువ గాకుండా తీసుకొనేలా నిర్వాహకులు చూశారు. ట్రెక్‌ అనుభవజ్ఞులు కొంత మంది పానీయం సేవించటానికి అరలీటరు పట్టేంత పెద్ద గ్లాసులు తెచ్చుకున్నారు.

పుల్కా, తండూరి రోటీ, ఆలు కలిపి చేసిన రొట్టెలు, ఎక్కువ బఠానీ, ముడిశెనగలు, పెసలు, సోయాబీన్స్‌ లేదా, ఆలు లాంటివి ఘనరూపంలో చేసినవే ప్రతిచోట ఎక్కువగా యిచ్చారు. ప్రత్యేకించి లంచ్‌ బాక్సుకు తప్పని సరిగా అన్ని రకాల కూరగాయలు వెనిగార్‌ మిక్స్‌ తో తయా రించిన ఊరగాయను కూడా పెట్టారు. లంచ్‌కు ఆపిన ప్రతి పాయింటులోనూ స్థానిక ట్రైబల్‌ లీడర్‌ ప్రమేయంతో కంపెనీ డ్రింక్స్‌, ఎగ్గు, టీ, యిలాంటివి సహితం అవసరార్థం కొనడానికి అందుబాటులో వుంచారు. కొన్నిచోట్ల టెంపరరీ టాయ్‌లెట్లను పురుషులకు, స్త్రీలకు అమర్చారు. కొన్ని చోట్ల స్త్రీలకు మాత్రమే, మరికొన్ని చోట్ల మరొక ట్రెక్‌కు లాగా కేటాయించిన బహిర్భూమికి వెళ్ళమన్నారు. బాగా తినటం తేలికగా నడవటం బయటపోవటం పర్వతారోహణ చేయటం, దిగటం కష్టంతో కూడినది కాబట్టి జాగ్రత్తలతో పరిమితంగా తినేలా చూశారు. వణుకు పుట్టించే చలి, నీళ్ళు తాకితే చేతులు తిమ్మిర్లు, కొన్ని చోట్ల వర్షం,జారుడు చీకటి, బ్యాటరీ సహాయంతోనే అన్ని జరగాలి. అంతటి నిర్మానుష్య ప్రాంతమైనా ఎలాంటి భయంలేక ఎవరితోడు కోరక స్త్రీలు ఒంటరిగా ఎవరికి వారు లేచి అంతదూరం ఎక్కి, దిగి క్షేమంగా చోటుకు చేరుకోవటం గమనించదగ్గది. 18న ఇలా 5 గంటల నడకతో 8000 అడుగుల ఎత్తులోని గుణాపాణి క్యాంపుతో ప్రారంభించి 13,800 అడుగుల ఎత్తుకు వెళ్ళి 23న బండక్‌ టాచ్‌ క్యాంపుతో మా యాత్ర చివరిదశకు చేరుకుంది. 24న 9 గంటలకు బయలుదేరి 2 గంటల నుండి 4 గంటల నడకతో బర్సానీ అన్న గ్రామానికొచ్చి బస్సులో మణికరన్‌లో భాస్వర ప్రభావంతో వుండే సహజ వేడినీటితో స్నానం చేసి కసోస్‌ క్యాంపు చేరుకోవటం రాత్రి రేపు, ఎల్లుండి ట్రెక్‌కు వెళ్ళే 2 బ్యాచ్‌లతో కలసి అనుభవాలు పంచు కుని సర్టిఫ ికెట్‌లను తీసుకొని 25 ఉదయం వెళ్ళే బ్యాచ్‌కు టాటా చెప్పి స్వంత ప్రాంతాలకు ప్రయాణం కట్టాం.

ఆ రోజు 6 మందిమి గైడ్స్‌ యిద్దరితో పాటు అందరి కంటే అరగంట ముందొచ్చాం ఒకచోట జలపాతం పారుతోంది. అందులో నుండి ఆవలి ఒడ్డుకు చేరాలంటే 20 అడుగుల లోతుకు తాడు సహాయంతో దిగాలి. అందరూ వచ్చేదాకా ఆగమనటంతో కూర్చొని జలపాతం స్వరాలను వింటూ చూస్తూ వున్నాను. ముందు హిమశిఖరం, రెండువైపులా ఎతైన పొడుగైన కోట గోడల లాంటి కొండలు. మధ్య సొరంగంలో అందమైన సెలయేరు. మంచు కొండలు కరగి నీటి రూపంలో ప్రవహించే ప్రవాహ జలపాతం సప్తస్వరాలు పలికిస్తూ పారుతోంది. నన్ను దాటిపోలేవన్నట్టు పెద్ద పొడుగు మొద్దులు వాటి మధ్య సందుల్లోనూ స్థలం యివ్వకూడదన్నట్టు పిల్ల కర్టలు అయితేనేం మనదెప్పుడూ రహదారే అంటూ ఘీంకారంతో శబ్దం చేస్తూ వేగంగా పారుతోంది. రెండు పక్షులొచ్చాయ్‌ తెల్లటి తల, నల్లటి శరీరం, ముదురు ఎరుపురంగు తోక చూస్తున్నంత సేపు రా రా అని తోకాడిస్తూ పిలుస్తున్నాయ్‌. దీన్నే అంటారేమో మనుషులతో పక్షుల స్నేహం?

వాతావరణ ప్రభావమో, స్వచ్ఛమైన గాలి వెలుతురు ప్రభావమో సమయానుకూల తిండి ప్రభావమో, క్రమం తప్పని కాలకృత్యాల ప్రభావమో, జీవితానికి సుదూరంగా, స్త్రీననే సంకోచ భావనకు అతీతంగా గడిపిన స్వేచ్ఛాజీవన ప్రభావమో, లేక అన్నింటి ప్రభావమో గతాన్ని, భవిష్యత్తును మరిచి ప్రస్తుతంలోనే వుండే జీవితం ఒకటివుందని గమనించిన అనుభవం నాకు కల్గింది. అందరూ ప్రత్యేకంగా స్త్రీలు ఎంత హాయిగా గడిపారో? చూస్తే స్త్రీలకు ప్రత్యేకంగా ఈ యాత్ర వీసా, పాస్‌పోర్ట్‌, అనుమతులు, పరిమితులు, హద్దులు సరిహద్దులు లేని విశాల ప్రపంచంలో అత్యంత ఎత్తుకు ఎగిరిన పక్షిలో నేను ఒకటయ్యాననిపించిన మధుర భావనలెన్నెన్నో.

ప్రకృతిలో ప్రకృతితో మమేకమయ్యే పలు దృశ్యాలు.

ప్రయాణంలో ఎక్కడం దిగటంలో ఏమాత్రం ఏమరుపాటు వున్నా, అజాగ్రత్తగా అడుగులు వేసినా నిమిషాల్లో నీవుండవ్‌ అన్నట్లు వుండే అత్యంత లోతైన లోయలు, నిత్యం మాలో స్పృహను పెంచాయి. ప్రకృతి నాతో సవాల్‌ చేయకు అని హెచ్చరిస్తూన్నట్టు సిక్త్స్‌ సెన్సు హెచ్చరిస్తుండటంతో ఒళ్ళు, మనసు దగ్గర పెట్టుకొని అడుగు అతిజాగ్రత్తగా వేస్తూ, వయసుతో సంబంధం లేకుండా క్షేమంగా గమ్యం చేరటం అందరివంతూ అయింది.

సాధారణ జీవితంలో నేను ఇలా చేయలేను, నేను నడవలేను. లిఫ్ట్‌ లేనందున నేను అపార్ట్‌మెంట్‌ ఇంటిలో వుండలేను, యిప్పటిదాకా ఎందరు ప్రోత్సహించినా ఏడుకొండల్ని ఎక్కలేక పోయినాను. యిలా నిత్యజీవితంలో ప్రతిసారి ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో పరిష్కారమార్గాలెతికే నేను ఇప్పుడు ఇలా ఇంత ఎత్తుకు ఎక్కగలిగామంటే హిమాలయాల మహిమ?, శివుడి ఆశీస్సులో అనుకోవటం చాలా ఎక్కువమందిలోనే కనిపించింది. 15 నుండి 24 దాకా పదిరోజుల పాటు ఒక్కరూ స్నానం చేయలేదు. చేయాల్సిన అవసరమూ రాలేదు. దాని ప్రభావం మా దేహాల మీద ఏమీ లేకపోవటం ఆశ్చర్యకరం.

పక్షులు, మనుషులు, జంతువులు వృక్షాలు నివశించే అనుకూల వాతావరణం లేనందున Plain lands లో కనిపించినన్ని రకాలు యిక్కడ కనిపించలేదు. కొంత ఎత్తు వరకూ 90 శాతం మహావృక్షాలు దేవదారువే, అక్కడక్కడ బల్లూకం నడిచిన గుర్తులు, బల్లూకంలా భ్రమింపజేసే నల్లటి ఆవులు తప్ప నిజమైన ఎలుగుబంట్లు ఎక్కడా కనిపించలేదు. ఆ తరువాత మంచుతో కప్పబడిన హిమకొండలు లేదా భూమికే కార్పెట్‌ పరిచినట్టు ఎత్తులేకుండా అతుక్కొని వున్న ఒకేరకం పచ్చిగడ్డి. కొన్ని ప్రాంతాలలో ఈ పచ్చ గడ్డిపై అందంగ అలంకరించినట్టు రంగు రంగుల పూలు చూస్తూంటే. మనసుకు మహా ఆనందమైంది అద్భుతమైన ఆ దృశ్యం వర్ణించనలవికాని, మాటలకు, రాతలకు లొంగని ఆ సౌందర్యం. ఎంత సౌందర్యోపాసకులైన మహామహా కవుల రచనలకు సైతం సంపూర్ణంగా సాధ్యం కానిదనిపిస్తుంది.

యిక్కడి శివపార్వతులు కలసివుండటంవల్ల ఈ ప్రాంతాన్ని శివాలిక్‌ రేంజ్‌ అని, పారే నదిని పార్వతి రివర్‌ అని అంటారు. ఇక్కడి గిరిజనవాసులు, 6 నెలలు పని చేసుకుంటారు. మిగిలిన 6 నెలలు వారికి పనిచేసే వాతావరణముండదు విపరీత చలి. ముందుగానే ఆరు నెలలకు ప్లాన్‌ చేసుకొని ధాన్యం నిలువ వుంచుకుంటారట. వీరి ఇళ్లచుట్టూనే అక్కడక్కడ ముక్కలుముక్కలుగా వున్న భూమిలో గోధుమ, సోయాబీన్స్‌, యాపిల్స్‌ పండిస్తారు. యాపిల్‌ చెట్లు మన ప్రాంతంలో సీతాఫలం చెట్ల కంటే ఎక్కువగానే ఎక్కడ చూసినా వున్నాయ్‌. ప్రధాన ఆహారం జొన్న, ఆలు, సోయా, కొంతవరకూ అన్నం. చింతపండు అసలు వాడరట. చాయ్‌ ఎక్కువ మోతాదులో తాగుతారట. 130 నుండి 140 సంవత్సరాల వరకూ బ్రతుకుతారట. దుస్తులు మన ప్రాంతంలో సుగాలి వేషధారణలా వుంది. ప్రతి యింటా పొట్టి ఆవులు హిమాలయాస్‌ వైల్డ్‌కౌవ్స్‌ కనిపించాయి. కొంతవరకే పిల్లలు బడికెళుతున్నారు. అమ్మాయికి డబ్బిచ్చి పెళ్లి చేసుకుంటారట.

ట్రెక్‌లో వింత, నో స్మోకింగు, నో డ్రింకింగు, దారిలో ఎక్కడా తాగి పడేసిన ముక్కలు గానీ ఖాళీ ప్యాక్‌లుగానీ కనిపించలేదు. ఎక్కువమంది సహజంగానే పాటిస్తారట. అక్కడక్కడ మంచులో నడవటం, ఆకుపచ్చటి కార్పెట్‌ కొండలకు కప్పారా? అందులో కొన్ని ప్రత్యేకతలను తప్పక పంచుకోవాలనుంది. 21వ తారీఖు రంగు రంగుల పూలు ఉదయం నుండి అక్కడక్కడ పూల గుబుర్లు, పొదలు సాయంకాలం క్యాంపు ప్లేస్‌కి చేరగానే పట పట వర్షం మొదట ముత్యాలు రాసి పోసినట్టు ఆ తరువాత కాసేపటికి సుగర్‌ క్రిష్టల్స్‌ లా మారాయ్‌, ఆ తరువాత వర్షం నీరుగా కరగటం నిమిషాల్లో మా చుట్టువున్న ప్రాంత మంతా టెంట్‌తో సహా మంచుతో కప్పబడివున్న దృశ్యాలు నా జీవితానికి మొదటి అనుభవాలు, ఒక దానిపై మరొకటి 5, 6 జతల గుడ్డలు, స్వెట్టర్‌ తలకు చేతులకు కాళ్ళకు అన్ని ఉలన్‌ దుస్తులేసుకున్నా వెన్నెముకలో చలి వణికిస్తూంది. 22వ తారీఖు ట్రేక్‌ ప్రత్యేకత 4 గంటలకే లేవటం కర్టలున్నవారు లేని వారు జంతువుల్లా నాలుగుకాళ్లపై పాకుతూమంచుపై నడవటం, పైకెక్కటం చేతులు కాళ్ల ఉపయోగించి 2 గంటల నడకతో ట్రెక్‌లో అత్యంత ఎత్తు అయిన 13,800 అడుగుల ఎత్తుకు చేరుకున్నాం. చాలా సార్లు చాలా మంది జారి పడే ప్రమాదం నుండి యితరుల సహాయంతో బయటపడ్డారు. పైన హిమాలయాస్‌ రేంజ్‌ 370 డిగ్రీసు చూట్టం. ఈ ప్రత్యేకతల కారణంగా దీన్ని సర్పాస్‌ ట్రెక్‌ అంటారు. 90 శాతం మంచుగడ్డలపైనే నడిచాం. ఒకరిద్దరికి altitude sickness పేర ఆక్సిజన్‌ సమస్యలొచ్చాయి. వచ్చింది. 1000 నుండి 1500 వందల మీటర్ల దిగువకు పైనుండి స్నోలో Sliding జారటం జారి గంటైనా వెనుక భాగం తిమ్మిర్లు తగ్గకపోవటం అందరూ బాల్యంలోకి వెళ్లినట్లు, మళ్లీ ఎప్పుడొస్తామా అనే ఫీలింగు అందరి కళ్లలో కనిపించటం విశేషం.

హిమాలయాల ట్రెక్కింగు నా జీవితంలో కొత్త ఆలోచనల్ని, కొత్త అనుభవాల్ని రేపింది. అవి జీవితంలో ఓ స్త్రీగా నేను పొందిన అన్ని బాధల్ని, బరువుల్ని మరిపించటం కాదు నాలో ఎక్కడో అంతరాలలో కొన్ని రోజులైన ఈ ప్రపంచబంధాల నుండి విముక్తురాలిని కాగలిగితే ఆ అనుభవం ఎలా వుంటుందో రుచి చూపించింది. అందుకు కృతజ్ఞతలు హిమాలయాలకి అని చెప్పటం కంటే ఏం చేయగలను.

Share
This entry was posted in ప్రత్యేక వ్యాసాలు. Bookmark the permalink.

One Response to అద్భుతానందాన్ని కల్గించిన హిమాలయాల ట్రెక్కింగు

  1. Sutocu says:

    What kind of stuff are you talking about? I didn’t get a word of it! I’ve never understood people, who spend their time on commenting stuff like that.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో