బాదల్‌ సర్కార్‌కి క్షమాపణలతో….

డా. కల్లూరి శ్యామల
ఆ వారమంతా కాలేజీలో డ్రామా ఫెస్టివల్‌ అవుతోందని శారద ప్రతిరోజు లేటుగానే ఇంటికి వెళ్తోంది. యూనివర్సిటీలో చేరిన మొదటి సంవత్సరంలోనే కాలేజీ కల్చరల్‌ అసోసియేషన్‌లో చేరి డ్రామాల్లో డిబేట్లలో పాల్గొంటున్నా నాటకాలంటే ఆమెకి వున్న పిచ్చి మాత్రం ఎక్కువనే చెప్పాలి.
ఈ తరం పిల్లలు మామూలుగా ఇంజనీరింగులనీ మెడిసిన్‌ అనీ తొమ్మిదో తరగతి నించీ ప్రిపరేషన్లు మొదలెట్తుంటే శారద ఆ వయస్సులోనే తనవేమి చదవననీ సాహిత్యంలోనే డిగ్రీలు డాక్టరేట్లూ చేస్తానని చెప్పేసింది. ఆ వయస్సులో టీచర్‌ ఇష్టమైతే చాలు సబ్జక్టుమీద ఇష్టం వచ్చేస్తుంది. తనే పెద్దయితే నలుగుర్నీ చూసి మనస్సు మార్చుకుంటుందిలే అనుకున్న తల్లిదండ్రులకి నిరాశ కలిగిస్తూ తను కోరుకున్న సాహిత్యం, మనస్తత్వ విజ్ఞానం, సామాజిక విజ్ఞానం సబ్జక్ట్స్‌తో బీఏ చేసింది. అక్కడగూడా నాటకాలలో విపరీతమైన మమకారంతో పాల్గొని ఆక్టింగ్‌కి ప్రైజులు గూడా తెచ్చుకుంది. బిఎ అవుతూండగానే నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామాలో పి.జి. కోర్సుకి అప్లై చేసింది. ఉన్నదే ఒక్క నేషనల్‌ ఇన్సిస్ట్యూట్‌ అందులో వున్న ఇరవై సీట్లలో ఎనిమిది రిజర్వేషన్కి పోను ఓపెన్‌ సీట్స్‌ పన్నెండు అయితే ఇండియాలో వున్న స్టేట్స్‌ లెక్క చూస్తే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక సీట్‌ కూడా లేనప్పుడు శారదకి సీట్‌ రాలేదంటే ఆశ్చర్యమేమీలేదు. చాలా నిరాశపడినా యూనివర్సిటీలో చేరి చదువుకుంటూనే తన హాబీ పెంపొందించుకుంటోంది. ఎప్పుడైనా సరే డ్రామాలవుతూంటే ఎక్కడికైనా వెళ్ళిపోతుంది. లేటుగా వస్తే తమకెంత వర్రీగా వుంటుందోనని తల్లిదండ్రులెంత చెప్పినా ప్రపంచంలో వున్న యాక్సిడెంట్లన్నీ తనకే అవుతాయా ఏమిటి వీళ్ళ చాదస్తం అనుకుని కొట్టి పారేస్తూ వుంటుంది కూడా! ఆ వయస్సులో తక్కిన పిల్లలందరూ ఏడుగంటలకి లేచి ట్యూషన్లు ముగించుకుని కాలేజీలకొచ్చి సగం నిద్ర మెలకువ స్థితిలో పాఠాలు విని మళ్ళీ అటునుంచటే ట్యూషన్లకెళ్ళి ఏ రాత్రి తొమ్మిది గంటలకో ఇల్లు చేరుతారు సగం చచ్చిన మనస్సు శరీరాలతో. వాళ్ళ కిష్టమైనదంటూ అసలేమైనా వుందా అని ఆలోచించుకునే వ్యవధి కూడా వాళ్ళకి వుండదు. వాళ్ళకి వాళ్లు పనిచేసే మెషీన్‌కీ తేడులేదనిపిస్తుంది. జాలి పడాలో తెలియదు విచారించాలో తెలియదు. వాళ్ళ బాల్యాల్ని, యవ్వనాన్ని కొల్లగొట్టి డబ్బు దాని విలువ సులభంగా దాన్ని సంపాదించే విధానాలు చూపించి, దానికనువైన కోర్సులలో చేర్పించి ఇదే ధ్యాసతో వాళ్ళు జీవితం గడుపటానికి తోడ్పడతారు. అదృష్టవశాత్తు శారద తను వీటన్నిటినుంచీ బయటపడ్డాననుకుంటూ వుంటుంది. తన చదువు చదువుచుంటూనే తనకి వీలున్నంత సమయాన్ని తన హాబీలకోసం వెచ్చిస్తుండటంతో తల్లిదండ్రులకి కూడా విచారించవలసిన అవసరం ఎప్పుడూ రాలేదు. అయితే శారద కార్పొరేట్‌ కల్చరంటే చూపించే విముఖత్వం వాళ్ళకి జీర్ణమవటంలేదు. అది వేరే సంగతి. ప్రస్తుతం పరీక్షలు దగ్గర పడుతుండటంతో కొంచెం చదువు పట్ల శ్రద్ధ చూపిస్తోంది. కానీ ఈ రోజు రాత్రి బాదల్‌ సర్కార్‌ నాటకం వుంది. తక్కినవన్నీ వెనక్కి పెట్టి డ్రామా ఫెస్టివల్లో పాల్గొంటూ రోజు ప్రేక్షకురాలిగా వస్తోంది. ఈ రోజు కూడా లేటయింది అమ్మ తిట్తుంది అనుకుంటూ గబగబా అడ్డదారిలో పార్కింగ్లోనుంచి గేటువైపుగా అడుగులు వేస్తూ నడుస్తోంది.
ఉన్నట్టుండి వెనకాల ఎవరో పరిగెట్తున్న శబ్దం. వెనకాలే మోటార్‌ సైకిల్‌ స్లో మోషన్లో నడుస్తూ ఆ పరిగెట్తున్న అమ్మాయి వెనకాల… శారద గబుక్కున ఒక కారు వెనకాల దాక్కుండిపోయింది. ఆ కారువెనక నుంచి అటుచూసిన శారద కొయ్యబారినట్టు నిలబడిపోయింది. బైకుమీద ముగ్గురు అబ్బాయిలు ఒక అమ్మాయిని ఫాలో అవుతున్నారు. పరిగెట్తున్న ఆ అమ్మాయి గట్టిగా అరుస్తూ వేగం హెచ్చించి అడ్డదిడ్డంగా పరిగెట్తూ వాళ్ళని తప్పించుకోటానికి ప్రయత్నిస్తోంది. ఒక వంద గజాలు ముందుకెట్తేనే కానీ జన సంచారం, గేటు రావు. ఊపిరి బిగబట్టి ఆదుర్దాతో చూస్తున్న శారదకి ఏమీ సరిగ్గా కనిపించటం లేదు. కళ్ళు చించుకుని చూస్తోంది, భయంభయంగా! వాళ్ళు హఠాత్తుగా చేతుల్లో వున్న బాటిల్లో వున్నదాన్నేమిటో ఆమె మీద విసిరినట్లు పోసేసి స్పీడ్‌ ఎక్కించి నిమిషంలో మటుమాయమయిపోయారు. ఆ చీకటిలో రెండునిమిషాలు అల్లాగే నిలబడి నెమ్మదిగా ధైర్యంచేసి ముందుకు అడుగువేసి ఆ పడిపోయిన అమ్మాయికేసి నడిచింది. అరుపులు లేవు. ఎందుకు నిశ్శబ్దమైపోయింది అనుకుంటూ ఆ అమ్మాయికేసి చూసిన శారద భయంతో ఒక అడుగు వెనక్కి వేసి స్పీడుగా పరిగెత్తుతూ అరుస్తూ ఏడుస్తూ పార్కింగ్‌ దాటి గేట్‌ దగ్గరికి చేరింది. జనసంచారం చేరుకున్న తర్వాత కూడా ఏడుపు భయం కేకలు మిళితమయిపోయిన గొంతుతో ఆమె ఏమంటోందో ఎవరికీ అర్థమవలేదు. ఏదో చెప్పాలని ప్రయత్నిస్తూ నోట మాట రాక అల్లాగే నిలబడిపోయిన ఆమెని చూసిన నలుగురైదుగురు ”ఏమయింది, ఏమయింది?” అంటూ అడుగుతూ శారదని కుదపటం మొదలెట్టారు. ఒక విద్యార్థి తన దగ్గరున్న నీళ్ళ బాటిల్లోంచి కొన్ని నీళ్ళు ఆమె ముఖంమీద చిలకరించి కొన్ని తాగించాడు. రెండు గుటకలు త్రాగి ”అక్కడ ఎవరో ఒక అమ్మాయిని ఏదో చేసేసి పారిపోయారు. ఆ అమ్మాయి పడిపోయింది. స్పృహలేదు” అని గబగబా చెప్పింది శారద. అందరూ ఆ దిశలో పరిగెట్టారు. స్పృహలేకుండా అమ్మాయిని చూసి ‘ఎవరిదగ్గరన్నా టార్చిలైటుందా?’ అడిగారెవరో. అప్పుడే కొంతమంది విద్యార్థులతో అటే వచ్చిన హిస్టరీ మేడమ్‌ మిస్‌ జ్యోతి గుమిగూడిన విద్యార్థుల దగ్గరికి వచ్చి ఏమయిందని అడిగి సంగతి తెలుసుకుని ఒక్క నిమిషం కూడా వేస్ట్‌ చెయ్యకుండా కారు హెడ్లైట్‌ అటుగా ఫోకస్‌ చేసారు. ఆ అమ్మాయి తిప్పి చూసిన ఇద్దరు అబ్బాయిలు దెబ్బతిన్నట్టు లేచి నిలబడిపోయారు. ఎవరో కూడా గుర్తుతెలియనంతగా ఆసిడ్‌ పోసి ఆమె ముఖాన్ని ఎవరో కాల్చేశారు. జ్యోతి మాడమ్‌ కారుదిగివచ్చి షాక్‌ తిన్నట్టు నిలబడిపోయారు. ఆ డ్రెస్‌ తనకి తెలుసు. ఇవ్వాళ రోజంతా తన వెనకాలే తిరిగి తను చెప్పిన ప్రతి విషయాన్ని వేదంలా పాటించిన సునందని గుర్తించటంలో ఆమె ఏమీ పొరపడలేదు. తను డ్రమాటిక్‌ సొసైటీకి టీచర్‌ ఇన్‌చార్జి అయితే ఈ అమ్మాయి విద్యార్థి సెక్రటరీ. ఈ రోజు తెరవెనకవుండి కథ నడిపించిందంతా సునందే.
ఆవిడ ”కార్లో కూర్చోపెట్టండి. హాస్పిటల్కి తీసుకెళ్దాం. శారదా! నువ్వు కూడా రామ్మా! నీకు సునందా వాళ్ళిల్లు ఎక్కడో తెలుసుకదా!” ఇంకో ఇద్దరు అబ్బాయిలు కూడా ముందుకు వచ్చారు. మరో ఇద్దరు బైకు మీద వెనకాలే వస్తామన్నారు.
సునందనెక్కించుకుని దగ్గర్లోవున్న హాస్పిటల్కి తీసుకెళ్ళారు. అక్కడ అదృష్టవశాత్తు  బర్న్స్‌ వార్డ్‌ కూడా వుంది.
సునందని చేర్పించి విషయం చెప్పి ఇద్దరబ్బాయిల్ని అక్కడే వుండమని చెప్పి కాలేజి ప్రిన్సిపాల్‌కి ఫోన్‌ చేసి విషయం చెప్పి బయటికి వచ్చారు జ్యోతి మేడమ్‌, శారద. ”సునంద వాళ్ళిల్లు నీకు తెలుసుకదూ! తన ఇంటి ఫోన్‌ నంబరు వుందా?”
”లేదు, మేడమ్‌! నాకు తనతో అంత పరిచయం లేదు, కాలేజీలోనే డ్రామా ఫెస్టివల్‌ టైములోనే మేము మాట్లాడుకుంటాం. వాళ్ళిల్లు అయితే తెలుసు. క్రితం ఏడాది వెళ్ళాం అందరం తన ఎంగేజిమెంటు అయినప్పుడు.”
‘ఎంగేజిమెంటు అయి త్వరలో పెళ్ళవబోతున్నదన్నమాట!’ జ్యోతి మనస్సులో ఒక విషాదం…ఆలోచనగా వచ్చి మటుమాయమైంది. హడావుడిగా సునంద ఇంటికి బయలుదేరారు. దారిలో కారులోనుంచి ఇంటికి ఫోన్‌ చేసింది. ‘అమ్మా!’ తన గొంతు వింటూనే ”ఎక్కడవున్నావు తల్లీ? టైము చూశావా? మీ నాన్నగారు చాలా కోపంగా వున్నారు. నేను భయంతో చచ్చిపోతున్నాను” అమ్మ అందుకుంది.
”అమ్మా! ముందు నామాట విను. నేను ఇంటికి వచ్చేసరికి ఇంకో గంట పడుతుంది. అనుకోకుండా ఒక ప్రాబ్లెమ్‌ వచ్చింది. ”శారద ఏమీ పూర్తిగా చెప్పకుండానే ఆవిడ అందుకుంది, ”వుండు నాన్నగారితో మాట్లాడు!” ఫోన్‌ అందివ్వబోతుంటే శారద ఫోన్‌ కట్‌ చేసేసింది. తండ్రి కోపం సంగతి తనకి బాగా తెలుసు.
వాళ్ళు అర్థరాత్రి వెతుక్కుంటూ సునందా వాళ్ళింటికి వెళ్ళేసరికి వాళ్ళింటినిండా దీపాలు వెలుగుతున్నాయి. అందరూ ఆదుర్దా నిండిన ముఖాలతో ముందుగదిలోనే కూర్చుని వున్నారు. శారద, జ్యోతి అందర్నీ అక్కడే చూసి ఏంచెప్పాలో తెలియనట్టు నిలబడిపోయారు. వాళ్ళని చూడగానే సునందా వాళ్ళ అమ్మ, నాన్న, అత్త అందరూ నిలబడ్డారు.
”సునంద తండ్రిగారా అండీ, మిమ్మల్ని కలవడానికీ మీతో మాట్లాడటానికీ వచ్చాము. మీరు దయచేసి ఖంగారు పడకుండా మేము చెప్పేది వినండి. ఈ రోజు కాలేజీలో డ్రామా ముగిసిన తర్వాత అందరు వెనక్కి వచ్చేస్తుంటే మీ అమ్మాయికి ఒక దుర్ఘటన జరిగింది. తను షార్ట్‌కట్‌ అని పార్కింగులోనుంచి వస్తూంటే ఎవరో దుండగులు ఆసిడ్తో ఎటాక్‌ చేసారు. ఆ చీకట్లో ఎవరయిందీ ఎవరికీ తెలియలేదు. బైకుమీద ముగ్గురబ్బాయిలున్నారట. నేను అదే కాలేజీలో హిస్టరీ టీచర్ని. మేమంతా కలిసి సునందని హాస్పిటల్లో చేర్పించాము. కొందర్నక్కడుంచి మీకు చెప్పటానికి మేమిద్దరం వచ్చాము. డాక్టర్లనడం ప్రాణానికేమీ ప్రమాదంలేదని కానీ ప్రస్తుతం ఇంకా సీరియస్‌గానే వుందని అంటున్నారు. మీరు త్వరగా బయలుదేరి వస్తే మిమ్మల్ని హాస్పిటల్లో దింపి మేమింటికి వెళ్తాం.”
”అయ్యొయ్యో! ఇదేమి ఖర్మండీ! ఎవరికి ఏం అపకారం చేసిందని నా కూతుర్నిలా ఎటాక్‌ చేసి నా కొంప ముంచారు? అదేం పాపం చేసిందండీ?” ఏడుస్తున్న ఆ తల్లికెవరూ సమాధానం చెప్పలేకపోయారు. తమ్ముడు, అత్త కూడా కళ్ళనీళ్ళ పర్యంతమయ్యారు. తండ్రి మాత్రం ఒక్క నిమిషంలో తేరుకుని ”ముందు పద, హాస్పిటల్కి వెళ్దాం. అదొక్కత్తీ వుందక్కడ. రమణీ, చిన్నాడ్ని వాళ్ళ బాబాయింటికి పంపి విషయం చెప్పి ఎంత డబ్బుంటే అంత తీసుకుని హాస్పిటల్‌కి రమ్మన్నానని చెప్పు. ముందు ఫోన్‌ చేసి వెళ్ళమను. స్కూటర్‌ తీసుకుని వెళ్ళమను.” అని మళ్ళీ అప్పుడే అక్కడికొచ్చిన కొడుకుతో ”ఒరే, జాగ్రత్తగా వెళ్ళు. ఖంగారేమీలేదు. నాదగ్గర కొంత వుంది. అవసరం పడుతుందేమోనని అంతే! తెలిసిందా? నువ్వు పద” అంటూ ఏడుస్తున్న భార్యని చెయ్యిపట్టి బయలుదేరదీశాడాయన. అయితే ఆ పట్టుకోటం ఆ తీసుకెళ్ళటం లాక్కెళ్తున్నట్టే వున్నాయి. ఆ ఆతృతలో అంతకంటే ఆలోచించటానికి వ్యవధి దొరకలేదా దంపతులకి.
హాస్పిటల్లో సునందకి రక్తం అవసరమయితే అక్కడున్న విద్యార్థులలో ఒకడు వెంటనే రక్తం ఇచ్చాడు. మరో ఇద్దరికి ఫోన్లు చేసి రప్పిస్తున్నారు విద్యార్థులే! ప్రిన్సిపాలుగారు వచ్చి చూసి హాస్పిటల్‌ అధికారులతో మాట్లాడి పోలీసులతో కూడా మాట్లాడి అన్నీ సరిగా వున్నాయోలేదో చూసుకుని వెళ్ళారు. జ్యోతి మాడమ్‌ అనుకుంది, అందరూ రాక్షసులయితే మనుష్యులకి మానవత్వం మీద నమ్మకం పోతుందని కొంతమంది దేవతల్లాంటి వాళ్ళనికూడా సృష్టించాడన్నమాట. నిజానికి సునంద వీళ్ళెవరికీ వ్యక్తిగతంగా తెలియదు. అయినా అర్థరాత్రి దాకా ఆమెకి కాపలా వుండటమే కాక రక్తదానం వాలంటరీగా చేయటానికి ముందుకు వచ్చిన విద్యార్థులని, పోలీసు ఇన్వెస్టిగేషన్‌ వల్ల కేసు ట్రీట్మెంటు లేటవకుండా కాపాడిన ప్రిన్సిపాలుగారిని తలుచుకుని ఆమె ఇంకా ప్రపంచంలో మంచితనం చావలేదన్న మాటే అనుకున్నారు.
అంతా అయి శారద ఇల్లు చేరేసరికి ఒంటిగంటయింది. తల్లిదండ్రులిద్దరూ గేట్‌ దగ్గరే ఎదురయ్యారు. తండ్రిని చూస్తూనే బావురుమని ఏడుస్తూ అతన్ని కరుచుకుపోయింది శారద. గత గంటా, గంటన్నరలో తండ్రి కోపిష్టితత్వాన్ని దాని వెనకాలవుండే ఆందోళనని, తన తల్లి చాదస్తాన్ని ఒక కొత్త కోణంలోనుంచి చూసి అనుభవించింది శారద. కూతురు చేతులు విడదీయటానికి ప్రయత్నిస్తూ ”ఏం తల్లీ! ఏమయింది?” ఆందోళనగా అడిగాడు. ఆయన గొంతులో ఒక జీర, ఒక ఖంగారు.
తల్లి ”ఇంతసేపు ఎక్కడున్నావే అమ్మా? భయపడిచస్తున్నాం మేము!” అంది.
”ఇవ్వాళ కాలేజీలో ఒక ప్రమాదం జరిగిందండి. ఇందాకనుంచి బాగానే వుంది. భయాన్ని, దుఃఖాన్ని బిగపట్టు కున్నట్టుంది. నేనసలు గమనించనేలేదు. నేను ఇదే కాలేజీలో లెక్చరర్ని. నా పేరు జ్యోతి” అని తనని తాను పరిచయం చేసుకుంది జ్యోతి మేడమ్‌.
శారద తేరుకుని ”సారీ మేడమ్‌, అమ్మా! మా జ్యోతి మేడమ్‌. డ్రమాటిక్స్‌ ఇన్‌చార్జి గూడా!” అని పరిచయం చేసింది.
”రండి మేడమ్‌, లోపలికి రండి. ఏమయింది మా శారదకి? ఏమన్నా సీరియస్‌ ప్రమాదమా? ఎందుకలా ఏడుస్తోంది.”
”సీరియస్‌ అండ్‌ ప్రమాదం! రెండూ! కానీ శారదకి కాదు. జ్యోతి విషయమంతా వివరించి చెప్పింది. ”మీ అమ్మాయి బాగా భయపడినట్టుంది. మీరు లేటయిందని కోప్పడతారని ఒక భయం. అన్నీ తన కళ్ళతో చూసింది కదా! అంతేకాక చాలాసేపునుంచి వుగ్గబెట్టుకున్న దుఃఖం అల్లా పెల్లుబికి వచ్చింది. అంతకంటే ఏమీ ప్రమాదంలేదు. ప్లీజ్‌ మీరు ఎక్కువ అప్సెట్‌ అయి కోపం తెచ్చుకుని కేకలెయ్యకుండా ప్రాక్టికల్గా ఆలోచించి ఒక నిద్రమాత వేసి పడుకోనివ్వండి. నేను కూడా అదే చెయ్యబోతున్నాను.” జ్యోతి ఖచ్చితంగానే చెప్పింది ఇంటికి వెళ్ళటానికి బయలుదేరుతూ.
”వృత్తిచేత నేను డాక్టర్ని. మీరు చెప్పినట్టే చేస్తాను. మీకు…? మీ దగ్గర నిద్రమాత్ర వుందా, నేను ఇవ్వనా?” అని అడుగుతూ ”మీ ఇల్లెక్కడ మేడమ్‌, కూడా రమ్మంటారా? ఒక్కరూ వెళ్ళాలికదా!” మర్యాదగా అడిగారు శారద తండ్రి డాక్టర్‌ కృష్ణమోహనరావు.
”అబ్బే, రెండువీధులవతలేనండీ వెళ్ళిపోగలను. మా అమ్మగారు కూడా ఎదురుచూస్తూండివుంటారు నేనెళ్ళొస్తాను శారదా, చాలా థాంక్స్‌! ఈ రోజు నువ్వక్కడ వుండటం ఎంత మంచిదయిందో చూడు. సునంద ఇల్లు కనుక్కోలేక అవస్థలు పడి వుండేవాళ్ళం అందరం. ప్రిన్సిపాల్‌ గారికీ లేటెస్ట్‌ విషయాలన్నీ చెప్పి నేను వెళ్ళి పడుకుంటాను.”
తండ్రి శారదకి నిద్రమాత్ర ఇచ్చి తల్లి ఆమెనేదో అడగబోతుంటే వారించి ”శారదకి వేడిపాలు తాగించు. రేపు వివరంగా మాట్లాడదాం” అని చెప్పి తన గదిలోకి నడిచాడు.
పడుకున్నారేగానీ ఆ తల్లిదండ్రులిద్దరికీ ‘ఈ రోజెంత ప్రమాదం తప్పింది శారదకి! కానీ శారదవ్వొచ్చు, సునంద అవ్వచ్చు వేరే మరెవరి ఆడపిల్లయినా అవ్వొచ్చును. ఇది ఎంత అమానుషం! ఇరవైఏళ్ళ అమ్మాయిమీద ఆసిడ్‌ పోసి, జీవితంలో కోలుకోలేనంతగా దెబ్బతీసిన దుర్మార్గులెవరు? ఎల్లాంటి శిక్ష విధిస్తే ఆ అమ్మాయికి న్యాయం జరుగుతుంది? ఆ పిల్ల ఈ రోజు కోల్పోయినదాన్ని ఏ న్యాయస్థానం తెచ్చి ఇవ్వగలదు?”
ఈ ప్రశ్నలు శారద తల్లిదండ్రులనే కాదు ఆడపిల్లలున్న వాళ్ళందర్నీ వేధించాయి మర్నాడు పేపర్లో వార్త చదవగానే! పేపర్లు కూడా పాత కేసులన్నీ తిరగరాయడంతో నగరాల్లో స్త్రీల మనుగడ, రక్షణ, వారి స్వేచ్ఛ లాంటి అనేక విషయాలు చర్చలోకొచ్చాయి మళ్ళీ! అర్థరాత్రి డ్యూటీ నుంచి వస్తూ హత్యకి గురయిన జర్నలిస్టు, ఇంటిలో అడుగుపెట్తూ ఫోన్‌ కాల్‌ అటెండ్‌ అవడం కోసం రెండు మూడు నిమిషాలు ఇంటి కాల్బెల్‌ కొట్టడం ఆలస్యంచేసి దుండగుల అఘాయిత్యానికి గురయ్యి మృత్యువాత పడ్డ కాల్సెంటర్‌ వుద్యోగిని, ఒక సంగీత సభ తర్వాత బయటకి వస్తూ ఆడిటోరియమ్‌ బయట పార్కింగ్‌ ప్లేస్‌లో బలాత్కారానికి గురయిన విదేశీవనిత, ఒకటేమిటి, ఎన్నెన్ని కేసులు! అన్నిట్లోను అమ్మాయిలు డ్యూటీలు చేసి, సాంస్కృతిక కార్యక్రమాలు చూసి ఇళ్ళకి వెళ్తున్నవాళ్ళే కాని పనీ పాటాలేక అర్థరాత్రి పార్టీలనో మరో సరదాకోసమనో షికార్లు చెయ్యటంలేదు. ఏమిటివీళ్ళ తప్పు? పదేపదే అందరి మనస్సులలో మెదిలిన ప్రశ్నలివి?
ఆ రోజు కాలేజీలో డ్రామా ఫెస్టివల్‌ ముగింపు. హాస్పిటల్లో సునంద జీవితం ముగిసిపోయింది కూడా ఆరోజే! ఎవరికీ ఉత్సాహంలేదు. కానీ అన్నీ సహజసిద్ధంగా వున్నట్టు జరిగితీరాలని ప్రిన్సిపాలుగారు పట్టుదలగా చేయిస్తున్నారు. అల్లా చెయ్యలేకపోతే ఈ రకమైన దాడులకి దిగేవాళ్ళు విజయగర్వంతో ఛాతీ విరుచుకు తిరుగుతారు. ఆ అవకాశాన్ని మనమివ్వకూడదు అన్న ఆమె వాదనలో నిజాన్ని అందరూ గుర్తించారు.
ముందు సంతాపసభ! తర్వాత ముగింపు సభ! పిల్లలందరూ నిస్సత్తువగా నిశ్శబ్దంగా ఏమాత్రం హుషారు ఉత్సాహం లేకుండా పనులు చేసుకుపోతున్నారు. మీటింగ్‌ మూడుగంటలకే మొదలయింది. ప్రిన్సిపాల్‌ అందరిచేతా రెండునిమిషాలు మౌనం పాటింపజేశారు. జ్యోతి మేడమ్‌ ముగింపు వాక్యాలు చెప్పి కళ్ళనీళ్ళ పర్యంతమవుతూ ఆరోజు జరిగిన సంఘటన గురించి వివరంగా చెప్పారు. ”మగవాళ్ళలో దుర్మార్గులున్నట్టే మంచి వాళ్ళున్నారనటానికి ఆరోజు రక్తదానం చేసిన మన విద్యార్థులు వుదాహరణ అంటూ అమ్మాయిలూ భయపడి జీవితాన్ని జీవించటం మరిచిపోకండి ఇది మీ హక్కు” అని ముగించారు. రక్తదానం చేసిన విద్యార్థి సోదరులకి అభినందనలతో ప్రిన్సిపాల్స్‌ బెనిఫిట్‌ ఫండ్‌ నుంచి ఒక్కొక్కరికి అయిదువేల రూపాయిల నగదు బహుమానం ప్రకటించారు.
చివరగా శారద వందన సమర్పణ చెయ్యటానికి స్టేజి ఎక్కింది.
”సభాసదులందరికీ నమస్కారం. ఏ ఫెస్టివల్‌ విజయ వంతంగా ముగియాలన్నా ఎందరో కార్యకర్తలు ముందూవెనకా వుండి తమ బాధ్యతలని సక్రమంగా నిర్వహించటం అవసరం. అల్లా నిర్వహిస్తేనే కార్యక్రమం చక్కగా ముగుస్తుంది. ఈ సందర్భంలో కొన్ని సంగతులు చెప్పటానికి ప్రిన్సిపాలు గారి పర్మిషన్‌ తీసుకుని మీముందుకి వచ్చాను. ఆ రోజు మనం బాదల్‌ సర్కార్‌ రచించిన ”పగ్లా ఘోడా” నాటిక చూశాం! ఆలోచిస్తే అందులో ఆత్మహత్య చేసుకున్న స్త్రీకి నేటి స్త్రీకి తేడా ఏమిటనిపిస్తుంది. వాళ్ళ కోరికలు ఆశయాలు ఆశలు ఆకాంక్షలు పెరిగాయి. మారాయి కూడా. అందులో ఒక స్త్రీ శవాన్ని దహనం చెయ్యటానికి వచ్చిన నలుగురు పురుషులు స్మశానవైరాగ్యంతో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వాళ్ళు ప్రేమించిన స్త్రీలని వాళ్ళెలా కించపరిచి, బాధలు పెట్టి మృత్యుముఖంలోకి నెట్టిందీ తలుచుకుంటారు. ఆ స్త్రీలందరూ ప్రేమకోసం పరితపించినవాళ్ళు. ప్రేమ ఉండి వంచింపబడినవాళ్ళు. అయితే స్త్రీలందరూ మరే ధ్యాసలేకుండా ప్రేమ ప్రేమ అని తపన పడతారా నేటి సమాజంలో అని మనకనిపిస్తుంది ఆ నాటిక ఈ రోజు చూస్తే! మనం మన కాలేజీలో ఆ రోజు ఏం చూశాం? సునందకానీ మరే స్త్రీ కానీ ఈ రోజేం కోరుకుంటున్నారు? తమ ఇష్టాయిష్టాలకనుగుణంగా జీవించటానికి అనుకూలమయిన వాతావరణాన్ని కోరుతున్నారు. నేడీ నగరంలో హత్యలు చెయ్యబడుతున్న స్త్రీలెవరు? తమ జీవితాలపట్ల నిర్దిష్టమైన అభిరుచులుండి వాటికనుగుణంగా ఉద్యోగాలు చేసుకుంటూ బ్రతుకుదామనుకుంటున్న నేటి తరం యువతులు. ప్రేమొక్కటే జీవితమనుకున్న బాదల్‌ సర్కార్‌ గారి నాయికలు కాదు. కానీ అప్పుడూ, ఇప్పుడూ కూడా వారి జీవితాలొక రకంగానే ముగుస్తున్నాయి. దీనికి మనం ఎవరికి థాంక్స్‌ చెప్పాలి? క్రితం వారం అంతర్జాతీయ స్త్రీల దినోత్సవాన్ని గర్వంగా జరుపుకుంటున్న రాజధాని నగరంలో పట్టపగలు కాలేజీ విద్యార్థినిని కాల్చి చంపిన వెధవకి ఉరిశిక్ష పడినా అమ్మాయిల పరిస్థితి బాగుపడుతుందా? నేటి మహానగరాలలో అమ్మాయిలు చదువుకోవాలి. అబ్బాయిలతో సమానంగా ఉద్యోగాలు చెయ్యాలి, కలలు కనాలి, వాటిని సాకారం చేసుకోవాలి అని తపిస్తున్నారు. అదే వారిపట్ల శాపంగా మారుతోంది. వారి భయాలు, ఎదుర్కొనే ప్రమాదాలు తలిదండ్రులతో చెప్పటానికి కూడా వెరుస్తున్నారు. ఇంట్లో చెపితే చదువులు మాన్పించి ఇంట్లో కూర్చోబెడతారేమోనని ఎవరికీ చెప్పకపోవడం వలన మరీ ప్రమాదాలొస్తున్నాయి.
మామూలుగా అయితే మేమీ థాంక్స్‌ ఒక ఫార్మాలిటీలాగా చెప్పాలి. కానీ ఆ రోజు మాకండగా నిలబడి మాకు ధైర్యం చెప్పిన కలలు కనడానికి శక్తినిచ్చిన తల్లిదండ్రులకీ, ఉపాధ్యాయులకీ ప్రత్యేకంగా థాంక్స్‌ చెపుతూ ముగిస్తున్నాను.
ఎప్పటిలా చప్పట్లు మోగలేదు కానీ ఒక కొత్త శక్తితో అందరూ హాలు వదిలి బయటకు నడిచారు.

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో