ఇంట్లో ప్రేమ్‌చంద్‌ – 36

శివరాణీ దేవి ప్రేమ్‌చంద్‌

అనువాదం : ఆర్‌. శాంతసుందరి
(గత సంచిక తరువాయి)
1936 నాటి మాట. ఒకరోజు ఈయన ఉదయాన్నే వ్యాహ్యాళికి వెళ్ళివచ్చారు. ఫలహారం తినేందుకు కూర్చుంటూ ఎందుకో నవ్వి, ”ఎంత మంచి తిండి తిన్నా ఒంట్లో బలం మాత్రం పుంజుకోవటం లేదు. కాసేపు అలా నడిచి వచ్చినందుకే కాళ్ళు లాగుతున్నాయి,” అన్నారు.
”మీరు బొంబాయిలో కూడా ఇలాగే అనేవారు. ఒక మంచి డాక్టర్‌కి చూపించుకుని మందు తీసుకోండి. అలా అలసట అనిపించటం మంచిదికాదు,” అన్నాను.
”భలేదానివే! ఏదైనా చెపితే చాలు ఏమేమో ఊహించుకుంటావు. ఇది సహజమే కదా? నాకు కూడా అరవై దగ్గరపడుతున్నాయి. అసలు చిన్నవాళ్ళకన్నా నేనే చక్కగా పనిచెయ్యగలను. మరి ఇంకేమిటి? ఇక ఇలాటివి తప్పవు. ముసలితనాన్ని ఓడించాలని నేను ఎంత ప్రయత్నించినా అది మొండిగా నన్ను అణిచేందుకే చూస్తున్నట్టుంది! కానీ నేనేనా తక్కువతిన్నవాణ్ణి? దానితో పోరాటం కొనసాగిస్తూనే ఉంటాను, ఏమనుకున్నావో!”
నాకు చాలా కోపం వచ్చింది, ”అవును మీకు పనిలో నలిగిపోవటం ఎప్పుడూ ఉన్న వ్యసనమేగా! దాన్నెలా వదుల్తారు?” అన్నాను.
ఆయన పగలబడి నవ్వుతూ, ”ఇంతవరకూ వదలనిదాన్ని ఇప్పుడుమాత్రం ఎలా వదుల్తాను? అది నా వృత్తి అయిపోయింది,” అన్నారు.
నాకు విపరీతమైన కోపం వచ్చింది, ”ఇప్పుడు కనక మీ అమ్మ బతికుంటే లాగి చెంపదెబ్బ కొట్టేవారు!” అన్నాను.
”అదే జరిగుంటే నాకీ అలవాటు వచ్చేదే కాదుగా?” అన్నారు.
”అయితే నన్ను ఏడిపించేందుకే ఇలా చేస్తున్నారా?”
”ఏమో? అందుకే అవచ్చు!”
నేను కోప్పడితే డాక్టర్‌ దగ్గరకి వెళ్తారనుకున్నాను గాని, ఇలా నా మాటని నవ్వులాటగా కొట్టిపారేస్తారని అనుకోలేదు.
ఆయనకేసి కోపంగా చూడసాగాను. ”చూడు రాణీ! డాక్టర్‌ దగ్గరకి వెళ్తే ఏదో ఒక జబ్బు ఉందనే అంటాడు. నాకే అనారోగ్యమూ లేదు. నా మాట నమ్ము,” అన్నారు.
”ఏం? డాక్టర్‌ మీకు శత్రువా అలా అనటానికి?” అన్నాను.
”నీకు తెలీదు, వాళ్ళ వృత్తే అలాటిది. నామాట విను.”
”ఒకసారి చూపిస్తే నష్టమేముంది?”
”అలాగే, వెళ్తాను, కానీ ఒకటి రెండు రోజులాగి వెళ్తాను, సరేనా? ఏదీ కిళ్ళీ ఇవ్వు. ఈసరికి బోలెడంత పని చేసుకునుండేవాణ్ణి. అనవసరంగా ఊరికే మాటల్లో పెట్టావు!”
రెండు రోజులు గడిచాక, ”వెళ్ళారా?” అని అడిగాను.
”చెపితే నమ్మలేదు నువ్వు. నాకు జబ్బేమీ లేదన్నాడు డాక్టర్‌. ప్రతి చిన్నదానికీ డాక్టర్‌ దగ్గరకి పరిగెత్తితే ఇక ప్రపంచంలోని పనులన్నీ ఆగిపోవలసిందే!”
అదే ఏడాది జూన్‌ నెలలో ఆయన ఏదో పనిమీద ఎక్కడికో వెళ్ళారు. ఒకరోజు సాయంకాలం ఆరుగంటల ప్రాంతంలో ఇంటికొచ్చారు. ఇంట్లో  ఇంకెవ్వరూ లేకపోవటంతో నేను ఆ సమయంలో గదిలో పడుకుని ఉన్నాను. ఇంట్లోకొస్తూనే తిన్నగా నా గదిలోకొచ్చారు. ”కొద్దిగా మంచినీళ్ళిస్తావా? చాలా దాహంగా ఉంది?” అన్నారు.
నేను లోపలికెళ్ళి కొద్దిగా మిఠాయి తెచ్చి ఆయనముందు పెట్టాను. అది తిని, ”కొంచెం బెల్లం ఉంటే తీసుకురా,” అన్నారు.
నేను మళ్ళీ వెళ్ళి బెల్లం, మంచినీళ్ళూ తెచ్చిచ్చాను. ”ఎక్కడికెళ్ళారు మీరు?” అన్నాను. ఇంత దాహం ఎందుకేస్తోంది?”
”పట్నం వెళ్ళాను. రేపు అచ్చు వేసేందుకు కాయితాలు లేవు.”
”మంచివారే, నాకు ఒక్కమాటన్నా చెప్పలేదు? ఇంత ఎండ మండిపోతూంటే అంత దూరం వెళ్తారా?”
”నేను ఎప్పుడో వచ్చాను. నువ్వు గాఢనిద్రలో ఉన్నావు, లేపబుద్ధి కాలేదు. మూడు గంటలకెళ్తే ఆరు గంటలకి పని పూర్తయింది!
”చల్లబడ్డాక వెళ్ళాల్సింది.”
”అవన్నీ డబ్బున్నవాళ్ళ వేషాలు.”
”భూభారమంతా మీరే మోస్తున్నట్టు మాట్లాడతారు!”
దీపాలుపెట్టే వేళయింది. ఆయన కిళ్ళీ వేసుకుని తన గదిలోకి రాసుకునేందుకు వెళ్ళిపోయారు. రాత్రి తొమ్మిది గంటలదాకా అలా రాసుకుంటూనే ఉన్నారు. అప్పుడింక నేను వెళ్ళి భోజనానికి లేవమన్నాను.
”ఇంకా తొమ్మిదేగా?” అన్నారు గడియారంవంక చూపిస్తూ.
”మీ గడియారంలో ఎప్పుడూ తొమ్మిది దాటదు!” అన్నాను.
”ఏం సేసామన్నా దానికి లంచం ఇస్తున్నానా? నువ్వే చూడు టైమెంతయిందో!” అన్నారు నవ్వుతూ.
అన్నం తినటానికి కూర్చున్న మనిషి ఒక రొట్టె కూడా తినలేకపోయారు. ”నాకస్సలు ఆకలే వెయ్యటంలేదు,” అన్నారు.
”మామిడికాయ గుజ్జు తినండి,” అన్నాను.
”వద్దు, నాకేమీ తినాలని లేదు,” అన్నారు.
”చాలా వేడిగా ఉంది వాతావరణం. చలవ చేసేవి తినాలి మీరు.”
నేను కూడా భోజనం చేశాక ఆయనకి మంచినీళ్ళు ఇవ్వటానికి వెళ్ళాను. నాకు కూడా ఒంట్లో భారంగా అనిపించింది. నేనాయన గదిలోకెళ్ళేసరికి ఆయన ఏదో రాసుకుంటున్నారు. నన్ను చూడగానే, ”ఎందుకో తెలీదు కడుపు నొప్పిగా ఉంది,” అన్నారు.
”ఎప్పట్నించీ?”
”ఇప్పుడే అన్నం తిన్నప్పట్నించీ.”
”అసలివాళ్ళ మీరేమీ తిననే లేదు, మరి కడుపునొప్పంటు న్నారేమిటి?”
అలా నేనింకా మాట్లాడుతూండగానే ఆయనకి వాంతికొచ్చేట్టనిపించింది. నేను పరిగెత్తి ఆయన దగ్గరకి వెళ్ళి ఆయన మెడా వీపూ నిమరసాగాను. తరవాత ఆయనకి వాంతి అయింది. కిళ్ళీ, ఏలక్కాయా ఇచ్చాను. కిళ్ళీ నోట్లో పెట్టుకోబోతూండగా మళ్ళీ వాంతి అయింది. అలా మూడుసార్లు వాంతి చేసుకున్నారు. నాకు కంగారు పుట్టింది. నేను కూడా పాయిఖానాలోకి పరిగెత్తవలసి వచ్చింది. నేను మళ్ళీ వచ్చేసరికి ఆయన నీరసంగా కూర్చునున్నారు.
”ఇప్పుడెలా ఉంది?” అని అడిగాను.
”ఇంకా కడుపునొప్పి తగ్గలేదు” కానీ వాంతులు ఆగినట్టున్నాయి.”
ఆయన తన పొట్ట నాకు చూపించారు. పొట్ట బాగా ఉబ్బిపోయుండటం చూసి నాకు భయం వేసింది. ”వెళ్ళి ఎవరైనా డాక్టర్ని పిలుచుకొస్తాను,” అన్నాను.
”కంగారేం లేదులే,” అంటూ నా చెయ్యి పట్టుకుని కుర్చీలో కూర్చోబెట్టారు. ఈయనకి పుదీనా ఆకులు నూరి ఇస్తే మంచిదేమోనని నాకనిపించింది. పుదీనా నూరి రసం చేసి తెచ్చి ఇచ్చాను. సీసాలో వేడినీళ్ళు నింపి ఆయన పొట్టకి కాపడం పెట్టసాగాను. చాలా సేపటికి ఆయనకి నొప్పి తగ్గింది. తెల్లారగట్ల ఏ మూడింటికో ఆయనకి నిద్ర పట్టింది. అప్పుడు నేను కూడా వెళ్ళి పడుకున్నాను.
అదే రోజు ఆయనకి ఉదయం రక్తవిరోచనాలు పట్టుకున్నాయి. మళ్ళీ ఆయన ఏరోజూ సరిగ్గా భోంచెయ్యలేదు, కంటినిండా నిద్ర పోలేదు. మూడు నాలుగు రోజుల పాటు హోమియోపతీ మందులు వేసుకున్నారు. ఆ తరవాత ఇరవై మూడో తారీకున ఆలోపతీ డాక్టర్‌ దగ్గరకి వెళ్ళారు. అదే రోజు పిల్లలు కూడా వచ్చారు.
ఆయన్ని భోజనానికి రమ్మంటే ఆకలి లేదన్నారు. ”పోనీ కొద్దిగా పాలైనా తాగండి” అన్నాను.
”అసలేమీ తినాలనీ తాగాలనీ లేదు, నాకేమీ వద్దు,” అన్నారు.
ఆగస్టు 1936. గోర్కీ మరణం గురించి ‘ఆజ్‌’ ఆఫీసులో మీటింగ్‌ పెట్టారు. రాత్రి నిద్రపట్టకపోవటంతో మా ఆయన లేచి కూర్చుని, వ్యాసం రాయసాగారు.  అప్పట్లో రాత్రిళ్ళు నాకు కూడా నిద్రపట్టేది కాదు. నాకు మెలకువ వచ్చి చూద్దును కదా, ఈయన నేలమీద కూర్చుని రాసుకుంటున్నారు.
”ఏమీ లేదే!” అన్నారు.
”ఏదో రాస్తున్నారు.”
”ఎల్లుండి ‘ఆజ్‌’ ఆఫీసులో గోర్కీ గురించి మీటింగ్‌ ఉంది.”
”ఏం మీటింగ్‌ అది? ఒక పక్క ఒంట్లో బాగాలేనప్పుడు, ఈ రాతలేమిటి? ఇప్పుడు టైమెంతో తెలుసా? అర్థరాత్రి రెండు గంటలు!”
”నిద్ర రావటం లేదు ఏం చేసేది. అందుకే ఉపన్యాసం రాసుకుంటున్నాను.
”ఒంట్లో బాగాలేకపోయినా రాయాల్సిందేనా?”
”అవును, రాయకపోతే కుదరదు. పైగా నాకిష్టమైన పని చేసేప్పుడు కష్టమనిపించదు! నా కర్తవ్యం అనుకుని చేసేపని ఏదైనా కానీ, కష్టంగా తోచదు. అవే ఒక మనిషికి అన్నిటికన్నా ముఖ్యమని అనిపిస్తాయి.”
”అసలదే ఎలాంటి మీటింగ్‌?”
”సంతాప సభ.”
”అతనెవరు, భారతీయుడేనా?”
”అదే మన సంకుచిత మనస్తత్వం! గోర్కీ మహా రచయిత. ఆయనని ఒక ప్రాంతానికీ, దేశానికీ సంబంధించిన వాడని అనలేం. ఒక రచయిత ఎక్కడివాడని అడక్కూడదు. ఆయన రచనలు ప్రపంచంలోని అందరికీ మేలు చేసేవే అనుకోవాలి.”
‘సరే! కానీ ఆయన మన దేశానికి కూడా పనికివచ్చే విషయాలేవైనా రాశాడా?’ అని అడిగాను.
‘రాణీ, ఇంకా నువ్వు తప్పు దారినే ఉన్నావు. అసలు రచయిత దగ్గర ఏం ఉంటుంది అందరికీ విడివిడిగా పంచిపెట్టేందుకు? అతనికున్న ఆస్తల్లా అతని తపస్సు. దాన్నే అందరికీ పంచగలడు. దానివల్ల అందరూ లాభం పొందుతారు. అతను తన తపఃఫలాన్ని  తనకోసమంటూ ఏం మిగుల్చుకోడు. సామాన్యంగా అందరూ తపస్సు చేసేది సొంతలాభం కోసం, కానీ రచయిత చేసే తపస్సు వల్ల జనం బాగుపడతారు.”
”పల్లెల్లో ఎవరికీ బహుశా గోర్కీ పేరే తెలిసి ఉండదు,” అన్నాను.
”మన దేశంలోని పల్లెలైతే చెప్పవూ? ఇక్కడి జనానికి తమ సొంతవాళ్ళ పేర్లే తెలీదు. అంతమాత్రాన ఇక్కడి జనానికి లాభం చేకూర్చే పనులు చెయ్యకూడదని నేననటం లేదు.”
”మీరు మరీనూ, తులసీ, సూర్‌, కబీర్‌.. వీళ్ళ పేర్లు వినని వాళ్ళెవరు?”
”వీళ్ళ గురించి తెలిసిన వాళ్ళు పల్లెల్లో లేరులే. కారణం తెలుసా? నిరక్షరాస్యత! మనదేశంలో చాలా కొద్దిమందికి చదువు సంధ్యలు అందుబాటులో ఉన్నాయి. అందుకే ఇక్కడ జరిగేవన్నీ కొద్దిమందికి మాత్రమే తెలుస్తున్నాయి. ఇంటింటా చదువు సంధ్యల ప్రాధాన్యత తెలిసి వచ్చిందంటే, అప్పుడు చూడు, గోర్కీ ప్రభావం ప్రతి ఇంట్లోనూ కనిపించకపోతే అడుగు! తులసీనీ, సూర్‌ దాస్‌ నీ పెట్టుకున్నట్టే ఆయన్ని కూడా నెత్తి మీద పెట్టుకుంటారు.”
”ముందు మన దేశంలో ఉండే వాళ్ళకి గౌరవం ఇవ్వనివ్వండి! ఆగ్రాలో జరిగిన కవి సమ్మేళనం మీకు గుర్తులేదా? హరి ఔధ్‌ గారిని నిండు సభలో ఎంత ఘోరంగా తిట్టి అవమానించారు! మీకు కోపం కూడా వచ్చింది, కానీ మిగతా వాళ్ళెవరూ పల్లెత్తుమాట అనలేదే?”
నా మాటలు విని ఆయన మొహం గంభీరంగా మారింది. ”అది రచయితలూ, పాఠకులూ చేసుకున్న దురదృష్టం! అసలు అలాటి మేధావుల పట్ల జనం మనసులో ప్రేమ, గౌరవం లేకపోతే, వాళ్ళు చెప్పే మాటలమీద మాత్రం శ్రద్ధ ఎందుకుంటుంది?”
”అందరికన్నా తామే తెలివైనవాళ్ళమని అనుకుంటారు వాళ్ళు. మునుపటి రోజుల్లో బి.ఏ., ఎమ్‌.ఏ. డిగ్రీలు ఒక వ్యక్తి యోగ్యతకి ప్రమాణాలని ఎవరూ అనుకునేవారు కారు. అందుకే అవతలి వ్యక్తిని గౌరవించేవారని అనుకుంటా,” అన్నాను.
”డిగ్రీలు సంపాదిస్తే సరిపోదు, భగవంతుడు ప్రతి మనిషికీ ఏదో ఒక ప్రత్యేకత ఉండేటట్టు చూస్తాడు. కబీరు, తులసీ ఏ డిగ్రీలు సంపాదించారని? కానీ వాళ్ళు అందించిన జ్ఞానం ఇవాళ ఎవరైనా అందించగలుగుతున్నారా? అంత దాకా ఎందుకు? పల్లె పట్టుల్లో ఆడవాళ్ళు పాడే పాటలు కవిత్వానికి ఎంత మాత్రం తీసిపోవు, ఒప్పుకుంటావా? వాళ్ళు కనీసం తమ పేర్లు కూడా చెప్పుకోరే?”
అలా కబుర్లు చెప్పుకుంటూ కూర్చునే ఉన్నాం, తెల్లారి పోయింది. ఎదురుగా బల్లమీది గడియారం నాలుగ్గంటలు చూపుతోంది. గడియారం వైపు చూసి, ”నాకు ఎలాగూ నిద్ర పట్టదు, కానీ నువ్వెందుకిలా పొద్దు పోయేవరకూ మేలుకున్నావు? నీ ఆరోగ్యం కూడా దెబ్బతిన్నదంటే ఇక మన పని గోవిందా! వెళ్ళు, వెళ్ళి పడుకో!” అన్నారు.
”నాకూ నిద్ర రావటం లేదు,” అన్నాను.
”కనీసం నడుం వాల్చు, వెళ్ళు, నేను కూడా పడుకుంటాను,” అన్నారు. నేనక్కడినించి వెళ్ళిపోతే మళ్ళీ రాసుకోవటం మొదలుపెడతారన్న భయంతో, అక్కడే ఒక పక్కగా పడుకున్నాను. ఆయన రాసుకునేప్పుడు ఆయన మొహంలో సంతోషం కనిపించటం లేదు, సరి కదా అప్పుడప్పుడూ కళ్ళనీళ్ళు తిరగటం కూడా చూశాను.
మర్నాడు ఉదయాన్నే ఏదో మీటింగు ఉందని వెళ్ళేందుకు సిద్ధమయ్యారు. ”మీరు అసలు నడవలేకపోతున్నారు, ఎందుకండీ అనవసరంగా హైరానా పడతారు?” అన్నాను.
”నడిచి వెళ్ళటం లేదులే, టాంగా లోనేగా వెళ్ళేది,” అన్నారు.
”కానీ మెట్లు ఎక్కి దిగాలిగా?”
”అది తప్పదు, వెళ్ళకుండా ఉండటం నా వల్ల కాదు,”
మా పెద్దబ్బాయిని ఆయనకి తోడుగా వెళ్ళమన్నాను. కింది దాకా సాగనంపేందుకు వెళ్ళాను. మెట్లమీద పడిపోతారేమోననై నాకు భయం వేసింది.
ఆయన మీటింగ్‌ నుంచి వెనక్కి వచ్చే సమయానికి గుమ్మంలో ఎదురుచూస్తూ నిలబడ్డాను. మెట్లెక్కేప్పుడు ఆయన కాళ్ళు తడబడ సాగాయి. నేను పట్టుకోవటానికి దగ్గరే ఉన్నానన్న సంగతి ఆయనకి తెలీకూడదని ఆయన వెనకే మెట్లెక్కసాగాను. పైకి రాగానే ఆయన మంచం మీద పడుకున్నారు. బాగా డీలా పడిపోయారు. ఆయన పక్కనే కూర్చుని కాళ్ళు ఒత్త సాగాను. కాస్త తెరిపిన పడ్డాక, ”అక్కడ నిలబడటం నా వల్ల కాలేదు. ఉపన్యాసం ఇవ్వటం మాట అలా ఉంచు, ఇంకోరెవరిచేతో దాన్ని చదివించాల్సి వచ్చింది!” అన్నారు.
”మీరసలు ఎప్పుడైనా నా మాట వినిపించుకుంటేగా? అనవసరంగా అవస్థ పడ్డారు.”
”ఎంత నీరసంగా ఉన్నా, కదలకుండా కూర్చోగలనా, చెప్పు?”
”అక్కడికెళ్ళి ఇలా నీరసపడిపోవటంకన్నా ఆ ఉపన్యాసం ఎవరిచేతైనా పంపిస్తే బావుండేది కదా?”
”ఆ ఆలోచనే రాలేదు. కానీ నిజంగానే ఇంత నీరసం వస్తుందనుకోలేదు.”
”కొద్దిగా పాలు తాగండి.”
”బాగానే తింటున్నా కదా?”
”ఏం తినటం లేదు!”
”గోర్కీ చనిపోవటం నాకు చాలా బాధగా ఉంది. ఆయన వదిలివెళ్ళిన ఖాళీని భర్తీ చెయ్యగలవాళ్ళు ఇంకెవరూ లేరనిపిస్తోంది.”
గోర్కీ చనిపోవటం గురించి చాలా కాలం ఆయన అలా మాట్లాడుతూ, బాధ పడుతూనే ఉన్నారు. గోర్కీ గురించి మాట్లాడినప్పుడల్లా ఆయన మనసు బాధతో కుంగిపోయేది. గోర్కీ అంటే ఆయనకి అపారమైన గౌరవం. ఆ రోజు మీటింగ్‌లో వినిపించినదే ఆయన చివరి ఉపన్యాసం. తరవాత రెండు నెలలు కూడా గడవకుండానే ఆయన కూడా గోర్కీని అనుసరించి వెళ్ళిపోతారని అప్పుడు మాకేం తెలుసు? ఆయన పోవటం హిందీ సాహిత్యానికీ, ముఖ్యంగా.. వ్యక్తిగతంగా నాకూ, తీరని లోటుగా మిగిలింది! గోర్కీ గురించి అంత బాధ పడిన మనిషి ఎంత అవలీలగా మమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు!

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో