ఆవృతం

– శారదా మురళి

చిన్నప్పటినుంచీ వినయ్‌కి ఆడవాళ్ళంటే చాలా జాలి. ఆడవాళ్ళ బ్రతుకు చాలా దుర్భరమనీ, వాళ్ళకీ ఏ మాత్రం ఆత్మగౌరవం లేకుండా చేయటమే కుటుంబ వ్యవస్థ ధ్యేయమనీ అతను నమ్మేవాడు. తన తల్లినీ, నానమ్మనీ, ఇంకా అత్తయ్యల్నీ, పిన్నమల్నీ చూసి అతనా అభిప్రాయాని కొచ్చాడు. తనకి చాలా దగ్గరగా వుండే ఆడవాళ్ళ కష్టాలనీ, కన్నీళ్ళనీ చూసి అతను వాళ్ల మీద సానుభూతి ఏర్పరుచు కున్నాడు. తోటి మగ పిల్లలందరూ ఆడపిల్లల మీద అసహ్యకరమైన కామెంట్లు చేసినప్పుడల్లా అతను ఎక్కడ లేని చిరాకూ, అసహానమూ ప్రదర్శించేవాడు.

నానమ్మ అత్తగారితో, భర్తతో పడ్డ కష్టాలన్నీ అతను చాలా సార్లు విన్నాడు. మళ్లీ మళ్లీ చెప్పించుకుని విన్నాడు. అయితే ఆవిడ వాటిని కష్ట్టాల్లా కాకుండా ఏదో అడ్వెంచర్‌ గురించి చెప్తున్నట్టు చెప్పేది. ఎవరో బంధువుల పెళ్లి లో అందరి ముందూ ఆవిడ మీదకి తాతయ్య చెప్పులు విసిరాడని మొదటిసారి విన్నప్పుడు చాలా ఆశ్చర్యపోయాడు. ”చెప్పులు విసిరేయడం ఎందుకూ?”

”మరి దూరంగా చేరి కూర్చున్నాగా? ముట్టుకోకుండా ఎలా కొట్టటం?”

”ఎన్ని చెప్పులు విసిరాడేమిటి?”

‘ఆ ! ఒక పది చెప్పులదాకా విసిరి వుంటాడు. అన్నీ కుప్ప పోసి వాటి మీద మహారాణీలా నవ్వుతూ కూర్చున్నాను!”, చెప్తూ విరగబడి నవ్విందావిడ. కట్టుకున్న భార్యని అంత హీనంగా చూసే తాతని తల్చుకుని బాధ పడాలో, దాన్నో పెద్ద జోక్‌లా చెప్పుకుంటున్న ఆవిడ సెన్స్‌ ఆఫ్‌ హ్యూమర్‌కి ముచ్చట పడాలో అర్ధం కాలేదతనికి.

”నువ్వు కాబట్టి వూరుకున్నావు. నేనయితేనా ఆ చెప్పులాయన మీదికే విసిరి వెళ్ళిపోయేవాన్ని.”

”చాల్లే నీ మొహం! అయినా మగాడన్నాక ఒక దెబ్బ వేయకుండా వుండడు. ఆడదన్నాక ఒక దెబ్బ తినకా తప్పదు. అందులోనూ వరసగా ఆడపిల్లలు పుట్టు కొసుంటే ఎలాంటి మగాడికయినా చిర్రెత్తుకొస్తుంది.”

”ఛీ!ఛీ! అంత మాత్రానికి కొడతారా ఎవరయినా? అయినా అందులో నీ తప్పేం వుంది?” అంటే అర్థం కానట్టు చూసేది.

”ఇంకా మీ తాతయ్య చాలా నయం. మా చిన్నాన్నయితే ఆరుగురు ఆడప్లిలు పుట్టటంతో మా పిన్ని బ్రతికుండగానే ఇంకొకావిడని చేసుకున్నాడు. వంశం నిలబెట్టొద్దా, అంటూ! మరి వంశోద్ధారకుడి మీద ఆ మాత్రం ఆశ వుండదా ఏమిటి?”

నానమ్మ తరం స్త్రీల కష్టాలే తను దుర్భరమనుకుంటే, ఆవిడ తనకంటే ఇంకొక తరం ముందు స్త్రీలతో పోల్చుకుని తనెంతో అదృష్టవంతురాలనుకుంటోంది. పిల్లల్నీ, ముఖ్యంగా కొడుకులనీ కనటం తప్ప జీవితంలో ఇంకే విధమయినా పాత్రా వుండకపోవటం ఎంత అన్యాయం! ఆ తరాల్లోని ఆడవాళ్లు చదువులేక మూఢ నమ్మకాలతో, అమాయత్వంతో మగవాళ్ళ బ్రతుకులకి చాలా సార్లు అడ్డుపడి వుంటారు. వాళ్ళు ఆ ఇబ్బందిని సహిస్తూ, తమకంటే మానసికంగా తక్కువ స్థాయిలో వున్న ఆడవాళ్ల బరువు మోయటానికి ఒప్పుకున్నారు కానీ కొంచెం స్త్రీలకి వికాసం కలిగించే ప్రయత్నాలేవీ చేయలేదు. మరీ మాట్లాడితే వాళ్లని అలాగే వుంచటానికి శాయాశక్తులా పాటు పడ్డారు. అన్నిటికంటే ఈ విషయం చాలా అన్యాయంగా, కౄరంగా అనిపించింది వినయ్‌కి.

అయిదుగురు ఆడపిల్లల మధ్య పుట్టటంతో, తండ్రి జీవితంలో ఏ విధమయిన ఆనందమూ పొందినట్టు లేడు. ఒక్క చదువు కున్న తల్లిని పెళ్లాడటం తప్ప. కుటుంబ బాధ్యతల్లో తండ్రికి చేయూతనివ్వటానికి తల్లి ఉద్యోగంలో చేరింది.

నానమ్మ కంటే ఎక్కువే చదువుకుని వుద్యోగం చేస్తున్నా తన తల్లి పరిస్థితి అంతంత మాత్రమే అనిపించిందతనికి. మొదటి కాన్పులోనే తను పుట్టటంతో, ఇంకా కంటే ఆడపిల్లలు పుట్టేస్తారన్న భయయో ఏమో, వెంటనే ఆపరేషను చేయించుకుంది.

”మన ఇంట్లో ఒక్క చెల్లెలుంటే బాగుంటుందమ్మా” అని తననప్పుడు, తల్లి మొహం అసహ్యాంగా పెట్టి,

”మీ అత్తయ్యలున్నారు చాలదూ, ఇంకా ఆడపిల్లలెందకూ, ఇల్లంతా దోచుకెళ్ళటానికి” అంది. చిన్నతనం వల్ల తల్లి మాటలర్ధం కాలేదు. అలా అనే తల్లి బయట పేరంటాలల్లో మాత్రం,

”ఎంతయినా ఇంట్లో ఆడపిల్లలుంటే ఆ అందమే వేరమ్మా!” అంటుంది. ఈ హిపోక్రసీ అర్ధం కావటానికి మాత్రం ఎక్కువ కాలం పట్టలేదతనికి.

తన తల్లిని డబ్బు సంపాదించే యంత్రం లా చూస్తూ, ఆమె శక్తిని దోచుకుంటున్నారని అప్పుడప్పుడూ అనిపించినా అత్తయ్యల మీద కూడా అతనెక్కువగా ద్వేషం పెంచుకోలేక పోయాడు. వాళ్ళూ నిస్సహాయులై పుట్టింటినుంచి కానుకలూ పెట్టుపోతలూ ఆశించారు. వాళ్ళే మగపిల్లలై పుట్టి వుంటే తమ్మునికి భారంగా వుండేవాళ్ళా? అత్తవారింట్లో గౌరవం పొందటం కోసం అన్నదమ్ములని బ్రతిమాలటం వాళ్ళ ఆత్మ గౌరవాన్నెంత బాధిస్తుందో పాపం, అనుకునేవాడు.

చదువు వల్ల ఆడపిల్లల పరిస్థితి బాగుపడుతుందేమోననిపించినా, అది కూడా అంత సరిగ్గా అనిపించలేదతనికి. ఇంట్లో, బయటా చచ్చేంత చాకిరీ చేస్తుందని ఏ మాత్రం సానుభూతి లేకపోగా, నానమ్మ, అమ్మ తనకీ తండ్రికీ ఏమయినా పని అప్పగిస్తుందేమోనని వెయ్యి కళ్ళతో చూసేది. ఒక రోజు అమ్మకి సాయం చేద్దామని కంచాలెత్తబోతుంటే, ”ఇంత బ్రతుకూ బ్రతికి వాళ్ళ నిప్పుడు ఎంగిళ్ళెత్తమంటావా?” అంటూ పెద్ద పురాణం విప్పింది. తనకి చచ్చేంత కోపం వచ్చింది.

”మా ఇంట్లో విషయం నీకెందుకు” అంటూ ఎదురు తిరిగేవాడు కూడా, తల్లి కళ్లతో వారించకపోతే.

తండ్రి పొద్దున్నే లేచి, పళ్ళు తోముకుని, కాఫీ తాగి, స్నానం చేసి, పేపరు చదివి, టిఫిను తిని ఆఫీసుకెళ్లి పోతాడు. అమ్మ మాత్రం, ఇంటిల్లి పాదికీ వంట చేసి, నానమ్మ పూజకి కావాల్సినవి అందిచ్చి, తినీ తినకా ఆఫీసుకి పరిగెత్తేది. ఆఫీసునించి వచ్చిన తరువాతా అంతే.నాన్నేమో అలిసిపోయాను అంటూ సోఫాలో కూర్చోగానే, నానమ్మ, ”మా నాయనే! అలిసిపోయావా నాయనా? కొంచెం కాఫీ తెస్తానుండు” అంటూ మంగళహారతులెత్తేది. అమ్మ రాగానే, ”ఇవాళ రాత్రికి వంటేం చేస్తావ్‌?” అనడిగేది, చెప్పులయినా విప్పకుండానే, ఆవిడ కొంచెం సానుభూతితో అమ్మకి సాయం చేస్తే ఎంత బాగుండేది? తనందుకే పదో తరగతిలోకి రాగానే అమ్మకి ఆఫీసునించి రాగానే టీ పెట్టి ఇవ్వటం, వంటింట్లో కూరగాయాలు కోసివ్వటం లాంటి పనులు నేర్చుకున్నాడు, నానమ్మ ఏమన్నా పట్టించుకోకుండా. నానమ్మ పోయినా, ఇంకా కనపడని సంకెళ్లేవో అమ్మ కాళ్లకి చుట్టుకున్నట్టే వుండేది.

ఆఫీసులో చికాగ్గా వున్నప్పుడూ, డబ్బు ఇబ్బందులెదురయినప్పుడూ నాన్న నిర్మోహమాటంగా అమ్మని నానా తిట్లూ తిట్టి టెన్షన్‌ వదిలించుకునేవాడు. తనకి చాలా కోపం వచ్చేది. ”నా తప్పేం లేనప్పుడు నన్నలా తిడితే మర్యాద దక్కడు” అని నిర్భయంగా చెప్పకుండా కళ్ళలో నీళ్ళు పెట్టుకునే తల్లిని చూస్తే అసహానంగా కూడా వుండేది. ఆవిడా బయట చికాకులొస్తే ఎవరి మీద అరుస్తుంది? చదువుకుని మంచి వుద్యోగం చేస్తూ కూడా ఆమెకంత పిరికితనం ఎందుకని? కొన్ని సార్లు అతనికి నానమ్మకీ తల్లికీ పెద్ద తేడా లేదనిపించేది.

తను మాత్రం, బాగా చదువుకుని స్వతంత్ర భావాలు గల యువతిని పెళ్లాడి, ఆమె వ్యక్తిత్వానికి ఎప్పుుడూ అడ్డు రాకుండా హుందాగా వుండాలని అతను ఇరవై ఏళ్ల వయసులోనే నిర్ణయించుకున్నాడు. చూస్తూ వుండగానే వినయ్‌ పెద్ద చదువులు పూర్తి చేసుకుని, మంచి వుద్యోగం సంపాదించు కున్నాడు. ఇంట్లో పెళ్లి ప్రసక్తి రాగానే అతను తల్లితో తన ఆశలూ, అభిప్రాయాలూ అన్నీ చెప్పాడు. ఆమెకి ఎంత అర్ధమయ్యాయో తెలియదు కానీ, ”సరేలే, బాగా చదువుకున్న అమ్మాయి కోసమే చూద్దాం”, అంది.

పెళ్లి చూపుల్లో నిరాడంబరంగా సల్వార్‌ కమీజ్‌ వేసుకుని నవ్వు మోహంతో ”హల్లో” అంటూ వచ్చి కూర్చున్న కవిత మొదటి చూపులోనే చాలా నచ్చింది వినయ్‌కి. ఆమె తెలివి తేటలూ,చదువూ, ఉద్యోగమూ ఇంకా నచ్చాయి. ఎవరికీ ఏ అభ్యంతరాలూ లేకపోవటంతో తాంబులాలూ పుచ్చుకున్నారు.

తల్లి చూచాయగా కట్నం గురించి వాళ్ళని అడిగిందని యధాలాపంగా కవిత చెప్పిందొక రోజు ఫోన్‌లో. చాలా ఆశ్చర్యపోయాడు. ఇంటికొచ్చి తల్లినడిగాడు. ఆవిడ డైరెక్టుగా సమాధానం చెప్పకుండా తప్పించుకోవటానికి ప్రయత్నించింది.

”అమ్మా, నువ్వు నగల ప్రసక్తీ, కట్నాల ప్రసక్తీ తేవొద్దు. ప్లీజ్‌, నాకు చాలా అవ మానంగా వుంటుంది.”

”అప్పుడే కాబోయే పెళ్లాన్ని వెనకేసు కొస్తున్నావే!”

”నేనెవ్వరినీ వెనకో ముందో వేసు కోవటం లేదు. నీకు కావాల్సినవి కొనివ్వ టానికి చెట్టంత కొడుకుని నేనుండగా నువ్వు నగల కోసం, ఇంట్లో వస్తువుల కోసం, బట్టల కోసం ఎవ్వర్నీ అడగొద్దు.” తల్లిని ఇంకేమీ రెట్టించి అడగలేదు కానీ, తమ కుటుంబం గురించి కవిత ఏమనుకుందో అని భయపడ్డాడు. వాళ్లిద్దరూ ఒక సాయంత్రం హోటల్లో కూర్చుని కాఫీ తాగేటప్పుడు అతను ”కట్నాల గురించీ, నగల గురించీ మీ ఇంట్లో ఏమీ బెంగ పడొద్దని చెప్పు” అన్నాడు. అలా అనేటప్పుడు మగవాడు ఆడదానికి తర తరాలుగా చేస్తున్న అన్యాయాలన్నిటికీ జవాబు చెప్తున్నానే అనుకున్నాడు, సిన్సియర్‌గా.

”ఎందుకలా అంటున్నారు? దాన్లో పెద్ద ప్రాబ్లమేమీ లేదు. మీ అమ్మ గారడింది కూడా పెద్ద మొత్తమేమీ కాదు. మా వాళ్లు ఆ డబ్బు సంతోషంగా ఇస్తారు.”

”డబ్బు గురించి కాదు. నాకే, ఇన్‌ ప్రిన్సిపుల్‌, ఇష్టం లేదు. నీకు మాత్రం కట్నం డబ్బులిచ్చి మొగుణ్ని కొనుక్కోవటం బాగుంటుందా?” నవ్వుతూ అడిగాడు.

”ఇప్పుడంత పెద్ద మాటలెందుకు? నేనంత లోతుగా ఆలోచించను. జస్ట్‌, నాదొక ఆరునెలల జీతం, అంతేకదా! మంచి అబ్బాయిని పెళ్లాడాలంటే ఆ మాత్రం ఇవ్వడానికయినా సిద్ధంగా వుండరా యేమిటి?” తనూ నవ్వుతూనే అంది. అతనికెందుకో చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఆ క్షణంలో అతనికి ఏడ్చో మొత్తుకొనో తమ్ముణ్ని అడిగి డబ్బు పట్టుకెళ్లే అత్తయ్యలు గుర్తొచ్చారు. అతనింకా ఆడపిల్లలకి చాలా ఆత్మాభిమానం వుంటుందనీ, కట్నాలిచ్చి పెళ్ళి చేసుకోవడం అవమానంగా భావిస్తారనీ అనుకున్నాడు. ఆడవాళ్ళు చదువూ ఉద్యోగాలతో మారుతున్నారా లేదా?

???

అతనింకా ఆశ్చర్యపోయే సంఘటన పెళ్లయిన ఆర్నెళ్లకి జరిగింది.

”ఒరేయ్‌! మనింట్లో బుజ్జి బాబొస్తున్నాడు తెలుసా!” సంతోషంగా చెప్పింది తల్లి. అతనికి కొంచెం సేపయింది అర్ధం కావటానికి.

”పిల్లాడికి గొలుసూ, మురుగులూ మనం చేయిద్దాం. మొలతాడు కవిత వాళ్ళమ్మా నాన్నా చేయిస్తారు, ” తల్లి చెప్పుతూ పోతోంది.

ఇంతలో ఏడుపు మొహంతో ఇంట్లో అడుగుపెట్టిన కవితని చూసి కంగారు పడ్డారందరూ.

”అత్తయ్యా! ఆ జ్యోతిష్కుడు ఆడపిల్లే పుడుతుందని చెప్పాడు.”

”నీ మొహం! ఆ జ్యోతిష్కుడు చెప్పినట్టే అవుతుందని ఎక్కడా రాసిలేదు. మగపిల్లాడే పుడతాడు”, తల్లి ధీమాగా చెబుతోంది.

”మీరిద్దరూ ఆ గోల ఆపండి! ఆడపిల్లయినా, మగపిల్లాడయినా పెద్ద తేడా యేమీ లేదు. నువ్వసలు జ్యోతిష్కుల దగ్గరికెందుకెళ్తావు?”అసహనంగా అడిగాడు భార్యని.

”స్కానింగులో చెప్తారో లేదోనని! ఈ మధ్య చెత్త రూల్సేవో వచ్చి పడ్డాయిగా మన మీద?” కవిత చెప్పింది.

అతనికి ఒక్క క్షణం ఎక్కడలేని ఆవేశం వచ్చింది.

”ఇప్పుడు పుట్టబోయేది ఆడో మగో తెలుసుకుని నువ్వేం చేద్దామని?”

”ఏముందీ? ఆడ పిల్లయితే వదిలించు కోవటమే”. తేలిగ్గా అంది కవిత.

నెత్తిన పిడుగు పడ్డా అతనంత నిర్ఘాంత పోయేవాడు కాదేమో!అతని ఆశ్యర్యం చూసి, మళ్లీ ఎక్స్‌ప్లెయిన్‌ చేసింది కవిత,

”మనం కనేది ఒక్కళ్లనే అయినప్పుడు, ఆ ఒక్కళ్లనీ మనకి నచ్చిన వాళ్ళని కనటంలో తప్పేం వుంది?”

తప్పేం లేదా?

క్రితం సారి జనాభా లెక్కల్లో, పట్టణాల్లో బాగా చదువూ డబ్బూ వున్న మధ్య తరగతి కుటుంబాల్లో, అయిదేళ్లలోపు వున్న బాలురి సంఖ్య కంటే, బాలికల సంఖ్య చాలా అసహజంగా తక్కువగా వుందని చదివి బాధ పడ్డాడు. మధ్య తరగతి కుటుంబాల్లో, అయిదేళ్లలోపు పిల్లల తల్లి దండ్రులు అంటే, చదువూ సంస్కారం వుండి, వుద్యోగాల్లో వున్న వయసుమళ్లని కొత్త తరం వాళ్లే అయి వుండాలి. అలాంటి వారికే ఆడపిల్లల పట్ల ఇంత విముఖతా? ఇంపాజిబుల్‌, అనుకున్నా డప్పుడు. ఆడవాళ్లు చదువూ, ఉద్యోగాల వల్ల మారుతున్నారా? మళ్లీ తనకి తనే ప్రశ్న వేసుకున్నాడు. నానమ్మకీ, అమ్మకీ, కవితకీ తేడా వుందా? ఇంకా కవిత సమర్ధించు కుంటూ వుంది.

”మనకి కావలసిన ప్రభుత్వాలనీ ఎన్నుకుంటాం. నచ్చకపోతే సినిమాలనీ తిప్పి కొడతాం. దేన్లోనయినా మనకిష్టమైన వాటినే ఎన్నుకుంటున్నప్పుడు కడుపున పుట్టే బిడ్డని కూడా కావల్సినట్టు కంటే తప్పేముంది?” అతనికి ఆ పైన మాటలు వినిపించలేదు. ఒక్క క్షణంలో అంతా అర్ధయినట్టనిపించింది.

ఆడవాళ్లు మారకపోవడం ఏమిటి? చాలా మారేరు. పాపం, నానమ్మ, తను చేసే పనులూ, తన అభిప్రాయాలు తప్పో ఒప్పో తెలియక చాలా బాధ పడేది. ఇప్పుడా బాధ లేదు. వాళ్లు దేన్నయినా అందమయిన, తెలివయిన వాదనతో సమర్ధించుకోగలరు. చదువూ, పెళ్లి, సుఖశాంతులూ, కావాలంటే బిడ్డలు అన్నీ కొనుక్కోగలరు. ఆడవాళ్ల పరిస్థితి మునుపటి కన్నా ఎంతో బాగుంది. అతనికి ఒక పెద్ద బాధ్యత తీరినట్టనిపించింది. నానమ్మ ఫోటోలో నుంచి నవ్విన చప్పుడు వినిపించింది

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

One Response to ఆవృతం

  1. Vennela says:

    శారద గారికి, మీ కథ ఆవృతం బావుంది. నా భావాలకు దగ్గరగా ఉంది. కానీ కథాంతం వాకు అర్థం కాలేదు. మీరు ఈ రకం పరిస్థితిని సమర్థిస్తున్నారనిపించింది. ధైర్యంగా ఆలోచించాల్సిన విషయాలెన్నో ఉండగా ఆడవాళ్ళు కేవలం ఇటువంటి (ఎవరిని కనాలి వంటి) విషయాల్లో మాత్రమే ప్రగతి సాధించారనిపించదా? ఏమో.. స్త్రీలు ఇంకొంత నిర్మాణాత్మకంగా ఆలోచిస్తే బావుంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.