ఆ పుస్తకం పేరు చెబుతారా…!

 సామాన్య
మా ఇల్లు చాలా బాగుంటుంది. ఇంటి చుట్టూ బాగా ఎత్తుగా, పకడ్బందీగా, అందంగా కట్టిన బండ రాతి గోడలూ, ఇంటి ముందు చక్కటి లానూ, ఇంటి ఆవరణలోనే చిన్ని పళ్ళ తోటా, ఆర్గానిక్‌ కూరగాయల తోట, వాటి మధ్యన రెల్లు కప్పు వేసిన వెదురు గుంజల గుండ్రటి గది ఒకటి. అందులో కుర్చీలు, చుట్టూ పూల మొక్కలు. వెనక ఆవు కోసం షెడ్డు. నిజానికి మేముంటున్నది పెద్ద నగరం నట్ట నడి మధ్యన. ఇక్కడ ఆవును పెంచడం కష్టంతో కూడుకున్న పని. కానీ నాకు ఆవులంటే చాలా ఇష్టం. నా భర్తకి నేనంటే చాలా ఇష్టం. అందుకని, ఇబ్బందైనా నన్ను ఆవును పెంచుకోనిచ్చాడు. ఆవుల్ని చూసినప్పుడల్లా నాకు నా బాల్యం, గోధూళి మధ్య అస్తమించే సూర్యుడు, ఉదయించే చంద్రుడూ, మా పల్లెటూరు గుర్తొస్తాయ్‌. ఇంటి వెనుక నుండి మా ఆవు అంబా అన్నప్పుడల్లా నా హృదయం వెలిగి పోతుంది. దిగులు చెలమలు చప్పున ఆవిరై పోతాయి.
మా ఇంటి వాకిట్లో నుండి లోపలికొస్తే మధ్యస్థమైన హాలు ఒకటి వుంటుంది. హాలు మధ్యలో విండ్‌ బెల్స్‌ వుంటాయి. అవి నేనే తగిలించా. బయటి నుండి వచ్చేప్పుడూ వెళ్ళేప్పుడూ గుడిలో గంట కొట్టినట్లు వాటిల్ని కదిలించి మృదువైన ఆ శబ్దం వినడమంటే నాకు చాలా ఇష్టం. హాలుకి నా పుస్తకాల గది వుంటుంది. పక్కకు తిరిగితే మేడపైకి రావడానికి మెట్లుంటాయి. మెట్లు దాటి కొంత నడిచాక నా పడక గది వుంటుంది.
నా బెడ్‌ రూం చాలా బాగుంటుంది. మిల మిల లాడే గ్రానైటు రాళ్ళపై బంగారు రంగులో మెరిసిపోయే చెక్కడాల మంచం వుంటుంది. మంచం తలాపిన ఒక చెక్క బీరువా వుంటుంది. అందులో నేను సగం చదివిన పుస్తకాలు, కొత్త మేగజైన్లు, పెన్నులూ అవీ ఇవీ ఉంటాయ్‌. మంచం కాళ్ళవైపుగా కొంత దూరంలో అచ్చు మంచం డిజైన్‌ లోనే రెండున్నర అడుగుల బుజ్జి అల్మారా వుంటుంది. దాని పైన మధురై నుండి తెచ్చిన వెన్న తింటున్న చిన్ని కృష్ణుడి పంచలోహపు బొమ్మ వుంటుంది. కృష్ణుడు పెద్ద వృక్షం కింద కూర్చుని ఉంటాడు. ఆ చెట్టు పైన నెమలి కూడా వుంటుంది. ఆ బొమ్మ పక్కనే, చక్కగా నవ నవలాడుతూ గ్లాస్‌ జార్లో విష్‌ ప్లాంట్‌, దాని పక్కనే ఒకటే ఒక చేప వున్న బుజ్జి ఎక్వేరియం వుంటాయి.
దాదాపు రెండేళ్ళ క్రితం నా కూతురు నాలుగేళ్ళది, ఎక్వేరియం కావాలని గోల పెట్టింది. సరేనని షాపుకి తీసికెళ్ళాం. షాపతను చాలా రకాల చేపలు చూపించాడు. అదృష్టాన్ని తెచ్చే చేపలూ, ఎక్వేరియంని క్లీన్‌ చేసే స్వీపర్‌ చేపలూ.. ఇట్లా చూస్తూ వుంటే ఒక వైపు అరలో పది పదిహేను చిన్న చిన్న గాజు సీసాలు కనిపించాయి. ప్రతి సీసాలోనూ ఒక్కటే చేప వుంది. నాకెందుకో గబుక్కుమని ఆ బుజ్జి ఎక్వేరియం కొనుక్కోవాలనే కోరిక కలిగింది. నా భర్తకి చెప్పాను… నేను కూడా ఆ ఒక్క చేప వుండే బుజ్జి ఎక్వేరియం తీసుకుంటానని. తను సరేనన్నాడు. ఒంటి చేపలలో రకరకాలవీ, రంగు రంగులవీ వున్నాయి. వాటిలో నాకు మెరిసే సముద్ర నీలం మీద మావి చిగురు ఎరుపు అద్దకమున్న బుజ్జి చేప నచ్చింది.
ఆ చేప జాతి పేరు ‘బెట్టా’ అట. షాపతను ”దిస్‌ ఫిష్‌ ఈస్‌ క్వైట్‌ హార్డీ అండ్‌ విల్‌ అడాప్ట్‌ టు మోస్ట్‌ అక్వేరియం కండిషన్స్‌. దేర్‌ స్పెషల్‌ ‘లేబరింత్‌ ఆర్గాన్‌’ ఎనేబెల్స్‌ దెం టు సర్వైవ్‌ ఇన్‌ ఆక్సిజన్‌- డిప్లీటెడ్‌ వాటర్స్‌. బికాస్‌ అప్‌ దిస్‌ దే కెన్‌ సర్వైవ్‌ ఇన్‌ స్మాలర్‌ స్పేసెస్‌”, అంటూ గడగడ మని దాని లక్షణాలు చెప్పుకొచ్చాడు.
ఆ చేప వచ్చినప్పటి నుండి నాకో వ్యసనం పట్టుకుంది. నిశ్శబ్దంగా వుండే మా ఇంట్లో, అంతకన్నా నిశ్శబ్దంగా వుండే నా పడక గదిలో, ఆకు కదిలినంత శబ్దం కూడా చేయకుండా ఆ చిన్ని ఎక్వేరియంలో అటూ ఇటూ తిరుగుతూ వుండే ఆ చేపని చూడటం నా రోజులో ప్రధాన విషయమై పోయింది. నేను దాన్ని నీలిమా… అని పిలుస్తాను. సరిగా ఆవగింజంత వుండే మూడు గుళ్ల మేతని పొద్దునోసారి రాత్రో సారి తింటుంది అది. ఆ మేత వేసి జార్‌ లోకి ముఖాన్ని వంచి ”నీలిమా… దా దా” అని పిలుస్తాను. అట్లా పిలవగానే అది నీటి పైకి వచ్చి ఆ గుళ్ళని బుజ్జి నోటితో అందుకుని చప్పరించి మింగుతుంది. ఒక్కోసారి కాసేపటి తర్వాత ఊసేస్తుంది. మళ్ళీ ఎప్పుడో నిదానంగా తింటుంది. ఆ జార్లో చిన్న మొక్క ఒకటి వుంటుంది. ఆ మొక్క ఆకుల చుట్టూ కాసేపు, నీటికి బాగా అడుగున కాసేపు అలా తిరుగుతూ వుంటుంది నీలిమ.
చాలా సార్లు దానికి జోడీ తెద్దామా అనిపిస్తుంది. మళ్ళీ ఎందుకనో తెలీదు దానికి తోడు దొరుకుతుందంటే ఏదో బాధ మొదలవుతుంది. మనసులో ఎక్కడో ఒక మూల చుప్పనాతి తనం మొలకేస్తుంది. ఊహూ.. అలాగే ఉండనీ… ఎందుకు జోడీ అనిపిస్తుంది. ఒంటరిగా అదేమి ఆలోచిస్తుందో ఊహించుకోవడం నాకో సరదా!
ఆ చిన్ని నీటి ఆవరణ అంతా సందడి సందడిగా వుంటే బాగుండు అనుకుంటుందా? ఏదైనా మగ చేప గురించి కల గంటుందా? నా ఇంటికి రావడానికంటే ముందు, ఆ షాపుకి రావడానికంటే ముందు.. అంటే చాలా చాలా ముందు ఎప్పుడో దాని చిన్నప్పుడు నదిలోనో ప్రవహించే యేరులోనో ఉన్నప్పటి రోజుల్ని జ్ఞాపకం చేసుకుంటుందా? ఎవరైనా తనని ప్రేమిస్తే బాగుండు అనుకుంటుందా? ఆ చిన్ని గాజు బుడ్డిలోకి అలవి కాని వసంతం వచ్చి పడిపోతే బాగుండు అనుకుంటుందా? లేదంటే హటాత్తుగా ఓ రోజు పొద్దుటికి పొద్దునే దానికి చాలా బలమైన రెక్కలు మొలిచేసి, ఇంట్లో నాకు, ఇంకెవరికీ తెలియకుండా ఆ గాజు బుడ్డినీ, ఈ తలుపులూ, కిటికీలనీ బద్దలు కొట్టి వెళ్ళిపోతే బాగుండు అనుకుంటుందా? ఇట్లా… ఏవేవో ఆలోచిస్తూ వుంటాను. దానికి జోడీ దొరికితే నా ఊహలకి అంతరాయం కదా. అందుకని ఇంకో చేపని ఆ ఎక్వేరియంలో వేయడం నాకు ఇష్టం వుండదు.
నా కూతురు ఒక్కోసారి దాని ఎక్వేరియం లోని చేపని నా బుజ్జి ఎక్వేరియంలో వదులుతుంది. అప్పుడు క్షణాల్లో పాపని కొట్టేద్దామా అన్నంత కోపమొచ్చేస్తుంది నాకు. అయినా అందరూ విచిత్రంగా అనుకుంటారేమో అని భయం వేసి కోపాన్ని బయట పడనీకుండా ఓర్చుకుంటాను. కానీ నా నీలిమ ఆ కొత్త చేపతో కలవదు. త్రుటిలో నీటి అడుగుకు వెళ్ళిపోతుంది. అప్పుడిక నేను ”పాపాయి నీ చేపని తీసెయ్యమ్మా నీలిమకి భయం వేస్తుంది చూడూ” అంటాను. పాపాయి తన చేపని తీసేస్తుంది. నాకు పోయిన ప్రాణం తిరిగొచ్చినట్టు అనిపిస్తుంది. సంతోషం వేస్తుంది. మళ్ళీ నీలిమ గురించి నా ఊహలు కూ… ఛుక్‌.. ఛుక్‌… మంటూ ఒక దాని వెంట ఒకటి బయల్దేరుతాయ్‌.
మల్లెల కాలం. నా పడకగది మీదుగా అల్లి వుంటుందో మల్లె తీగ. సందె వాలీ వాలగానే పనిపిల్లలు దాన్ని వేధించడం మొదలు పెడతారు. ఆ వేదనకేమో తీగ అటూ ఇటూ కదులుతుంది. పాపాయి అవతలి గదిలో భరత నాట్యం నేర్చుకుంటూ వుంది. మువ్వల రవళి, పాద తాడనం, టీచర్‌ గొంతూ మా ఇంటి నిశ్శబ్దం లో బ్లాక్‌ హోల్‌లో పడ్డ పదార్ధాల్లా లయమై పోతున్నాయి. మంచానికి ఎదురుగా వున్న కిటికీ పై పసుపు రంగు పిట్ట ఒకటి వాలి అస్థిమితంగా దిక్కులు చూస్తుంది. నేను తల కింద మూడు మెత్తటి దిళ్ళు వేసుకుని పొట్టపై బుజ్జి ఎక్వేరియంని ఉంచుకుని నీలిమని చూస్తూ వున్నాను. పనమ్మాయి ఇరవై ఏళ్లది మెల్లగా నడుచుకుంటూ వచ్చి ”అమ్మ! నీ ఫ్రెండ్‌ ఫోన్‌ చేసింది. మాట్లాడుతావా అమ్మా” అన్నది. నాకు కోపమొచ్చింది. ఈ పిల్ల ఇల్లంతా అదిరి పోయేట్టు దడ దడా నడవకూడదా? ఇట్లా నడుస్తుందేం మెల్లగా? అంత చిన్నగా మాట్లాడుతున్దేం? నిశ్శబ్దంలో నిశ్శబ్దం లా. ఈ పిల్లని పనిలోంచి తీసెయ్యాలి… చిరాగ్గా అన్నాను ” ఆ… మాట్లాడుతా”
చిన్నప్పుడు నాకు బోల్డు మంది స్నేహితులు వుండే వారు. హేమలత, మంజుల, శారద, సుమతి, అరుణ… అరుణకి ఏడో తరగతి లోనే పెళ్ళై పోయింది. వాళ్ళ ఊరి పేరు కుక్కలపల్లి. ఆ ఊరి పేరు ఎప్పుడు గుర్తొచ్చినా ఎందుకో బలే నవ్వొస్తుంది. ఏడో తరగతి ఎండా కాలం సెలవుల్లో దానికి పెళ్ళై పోయింది. అదింక ఎనిమిదో తరగతి చేరనే లేదు. అరుణ ఏదీ అని మేమందరం అనుకుంటూ ఉండగానే దాని దగ్గరనుండి నాకో వుత్తరం వచ్చింది. ఆ వుత్తరం ఇంకా నా దగ్గర భద్రంగా వుంది. ”మీకేమబ్బా… మీరు హాయిగా చదువుకుంటారు కదా” అంటూ అది రాసిన మాట నాకు బాగా గుర్తు.
అరుణ తెల్లగా పిండిలా వుండేది దాని పెదాలు హైబ్రీడ్‌ గులాబుల్లా నిండుగా ఎర్రగా ఉండేవి. ఆ పెదాల్ని మాటి మాటికీ నాలికతో తడుపుతూ వుండేది. ఆ పిల్ల మొహం నాకు ఆ పెదాల వల్లే గుర్తు. ఇంకో జ్ఞాపకమేమంటే వాళ్ళ ఊరి అడ్రస్సు… కుక్కలపల్లి గ్రామం, నక్కలపల్లి (పోస్ట్‌) అని. ఇట్లా కుక్కలపల్లి, నక్కలపల్లి అని ఎక్కడైనా ఉంటాయా అని బలే నవ్వొస్తుంది. ఉత్తరం చివర్న ”నన్ను మరిచిపోవు కదా? గుర్తు పెట్టుకుంటావ్‌ కదా” అని రాసినా, ఆ పిల్లకి నేనెప్పుడూ వుత్తరం రాయనే లేదు. ఎందుకు రాయలేదో తెలీదు కానీ, నేనెప్పుడూ ఆ పిల్లని మరిచిపోనే లేదు.
అరుణ ఎప్పుడు గుర్తొచ్చినా ఏడో తరగతిలో ఆ పిల్లకి కొంచెమన్నా రొమ్ములు వచ్చి ఉంటాయా అని ఆలోచిస్తాను. ఎంత ఆలోచించినా పచ్చ పాపడా తెల్ల రవిక వేసుకున్న ఆ అమ్మాయి గుర్తొస్తుంది కానీ ఆ పిల్ల చాతీ గుర్తుకు రాదు. మా స్కూలు పక్కనే పిండి మర వుండేది. మా స్కూల్‌ టైమింగ్స్‌, పిండి మర టైమింగ్స్‌ ఒక్కటే. క్లాసులు జరిగినంత సేపు అది పనిచేసేది. అరుణ ఆ పిండి మర వాడిని తిడుతూ వుండేది. ఆ తిట్లూ జ్ఞాపకం వస్తుంటాయ్‌. ఎనిమిదో తరగతిలో మేం ఇంకో రూం కి మారాం. అక్కడ పిండి మర గందరగోళం వుండేది కాదు. కానీ అప్పటికి అరుణ స్కూల్‌ మానేసింది. అట్లా ఆ పిల్ల అడిగినట్లు తనని నేను మరిచిపోనే లేదు.
ఫోన్‌ చేసిన అమ్మాయి కాత్యాయని. బి.ఏ మొదటి సంవత్సరంలో ఉండేప్పుడు రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీ ఒకటి జరిగింది. అప్పట్లో పోటీలంటే ఎంత ఉత్సాహమో. యూనివర్సిటీలో చదివేటప్పటి సంగతి, వ్యాసరచనలోనే అనుకుంటా. ఫస్ట్‌ ప్రైజ్‌ వచ్చేసింది. నా ముందు ఇంకేదో బహుమతి తీసుకోడానికి ఇంగ్లీష్‌ డిపార్ట్‌మెంట్‌ అమ్మాయి వెళ్ళింది. కేరళ పిల్ల. పెద్ద అందగత్తె. ఒకటే చప్పట్లు. కేరింతలు. చప్పున పెద్ద దిగులొకటి పట్టుకుంది… నేనేమో అందగత్తెను కాదు, అయినా కాకున్నా పెద్ద ఇంట్రావర్ట్‌ ని. నాకేం పరిచయాలున్నాయని, ఎవరు తెలుసని? చప్పగా వెళ్లి ప్రైజ్‌ తీసుకోవాలి, దిగులు నల్లగా కమ్ముతూ వుంది. ఇంతలో పేరు పిలిచారు… అబ్బ ఎంతటి చప్పట్ల ప్రభంజనం. ఆశ్చర్యంగా… అరె నాకెవరూ తెలియదు కదా..? అవును నిజమే, కానీ నేనందరికీ తెలుసు. యెట్లా తెలుసు? ఏమో ఎట్లాగో తెలుసు! మినిస్టర్‌ దగ్గరి నుండి ప్రైజ్‌ తీసుకుంటున్న ఫోటో చాలా సార్లు గుర్తొస్తుంది. చిలక పచ్చపట్టు పరికిణీ, ఓణీ వేసుకుని నోరు ఈ చెవ్వు నుండి ఆ చెవ్వు వరకూ సాగదీసి నవ్వుతూ వుంటాను అందులో… అసలు అప్పుడు అంత నవ్వు ఎందుకు వచ్చినట్టు లెక్చరర్లు అనేవారు ”నోటి మీద మూత పడదేమో నీకు, ఎప్పుడు చూసినా ఆ పళ్ళు బయట వుండాల్సిందేనా?” అని ఎక్కడికెళ్ళినా బహుమతులు లేకుండా తిరిగొచ్చిన సందర్భాలే లేవు. అయినా ఇప్పుడెందుకని అట్లా నవ్వు రాదు? ప్చ్‌ ”నవ్వుల నిర్యాణం” అని ఒక కవిత రాయాలి. అవునవును రాయాలి, పేరు బలే వుంది.
మొన్నో సారి పెళ్ళికెళ్ళానా… ఒక పిల్ల ఉత్సాహంగా వచ్చి పలకరించింది. కాలేజ్‌లో నాకు జూనియరట. మా వాళ్ళ పిల్లాడినే పెళ్ళి చేసుకుందట, అందుకని నాకిప్పుడు బంధువట. చాలా ఆరాధనగా నాతో మాట్లాడేస్తుంది. నాకెందుకో ఆ పిల్ల మీద చిరాకు కలిగింది. ఈ పిల్లనెట్లా వదిలించుకోవాలి అనిపించింది. ఎప్పుడూ సున్నితంగా, మృదువుగా మాట్లాడతానా అప్పుడు మాత్రం ఎందుకనో తెలీదు. హటాత్‌గా ఆ మేళ తాళాల మధ్య ”తల్లిని చూసి పిల్లని, పాడిని చూసి బర్రెని ఎంచుకోవాలిట” ఈ సామెత విన్నావా నువ్వు? మీ అమ్మ ఎటువంటిది నీలాగే ఇలా మాట్లాడేస్తుందా అనేసాను. అన్నానే కానీ ఒక్కసారిగా భయం వేసేసింది. ఏంటిలా మాట్లాడాను అని. కానీ ఆ అసందర్భపు మాటకు ఆశ్చర్యంగా ఆ పిల్లేం నొచ్చుకోలేదు. మళ్ళీ అట్లాగే మాట్లాడుతూనే ఉండింది.
ఆ రాష్ట్ర స్థాయి పోటీకి న్యాయ శాస్త్రానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్‌ కావలసి వచ్చింది. మా లెక్చరర్‌ అన్నారు- ”నా ఓల్డ్‌ స్టూడెంట్‌ ఒకమ్మాయి లాయర్‌గా చేస్తుంది. నువ్వెళ్ళి కలువు” అని. అట్లా మొదటిసారి తనను కలిసాను. ఎందుకనో మా ఇద్దరికీ గట్టి స్నేహం కుదిరింది. మేడం అన్నట్లు తను లాయర్‌గా ప్రాక్టీసేమీ చేసేది కాదు. ఆడవాళ్ళు బయటికెళ్ళి వుద్యోగం చెయ్యడం ఊళ్లేలడం వాళ్ళ వాళ్ళకి నచ్చదు. తను క్వాలిఫైడ్‌ గాయని. లాయర్‌ గా కాదు గాని గాయనిగా ఎదగాలని తనకో తపన. దానికీ అవకాశం లేదు. తను చాలా అందగత్తె… చాలా సార్లు నాకేమనిపిస్తుందంటే గైడీ మొపాసా తన గురించి కథ రాయాల్సి వస్తే ఆ కథకేం పేరు పెట్టివుండే వాడూ…? అని… బహుషా ”యూజ్‌ లెస్‌ బ్రెయిన్స్‌” అనేమో..
తనెప్పుడు ఫోన్‌ చేసినా ”ఏం చదివావ్‌ ఈ మధ్య” అంటుంది. నీలిమ వచ్చినప్పటి నుండి ”ఏం చేస్తుంది నీ నీలిమ” అని కూడా అంటుంది. నేను ”ఇంకేం చేస్తుంది నీలిమ దాని చిన్న ఇంట్లో పనులు చక్క బెట్టుకుంటుంది” అంటాను. అట్లా మా సుదీర్ఘ సంభాషణలు మొదలవుతాయ్‌. తనకి ”వొన లచ్చి” అనే యెంకి పాట నేను పాడితే వినడం చాలా ఇష్టం. ఈ రోజు కూడా పాడమని అడిగింది.
ఆ పాట నాకు పదమూడేళ్ళు వున్నప్పుడు నేర్చుకున్నది. అప్పుడు మా నాన్న వేరే ఊళ్ళో వుద్యోగం చేసేవారు. ఆ కొత్త ఊళ్ళో మా ఇంటికి నాలుగిళ్ల అవతల సంగీతం టీచరు వుండేది. వాళ్ళది బాగా పాత కాలం ఇళ్ళు. బయటి గేటు పైనున్న ఆర్చికి అల్లుకుని రంగూను మల్లి తీగ గుత్తులు గుత్తులుగా విరబూసి వుండేది. పూల చుట్టూ ఝుమ్మని బోలెడు తేనెటీగలు తిరుగుతుండేవి. లోపలి నుండి మృదువుగా వీణ పాటలు విన్పించేవి. ఆ పిక్చర్‌ మొత్తం మధురంగా అనిపించేది. ఇప్పటికీ నా మనసులో ఆ ఇమేజ్‌ మాసి పోకుండా నిన్న నిన్నటిలా ఫ్రెష్‌గా వుంటుంది. దాంతో పాటు ఒక విషాదం కూడా.
వాళ్ళ ఇంటి వరండా లోనే ఆవిడ మాకు వీణ నేర్పించేది. లోపల వంట ఇంటికి ఎదురుగా నవారు మంచం మీద వాళ్ళ అమ్మ పడుకుని వుండేది. ఆమెకి కుడికాలు, చేయికి పక్షవాతం ఉండేవి. ఆ ఇంట్లో ఆవిడతో మాట్లాడేందుకు ఎవరూ వుండే వాళ్ళు కాదు. టీచరేమో మా క్లాసులతో, వంటతో, ఇంటి పనితో క్షణం తీరిక లేకుండా వుండేది. పెద్దావిడ మాట్లాడించబోయినా ఎందుకనో కసురుకున్నట్లు మాట్లాడేది. టీచరు ఎట్లైనా బయటికెళ్లినపుడు ఆమె నన్ను పిలిచి దగ్గర కూర్చోబెట్టుకుని యెప్పటెప్పటివో విషయాలు జ్ఞాపకం చేసుకునేది. ఆవిడ చెప్పే విషయాలు నాకు పాత కాలపు ఏడుపు సినిమాలు చూసినట్టు మరీ అబద్దంగా అనిపించేవి.
ఆవిడకి పన్నెండేళ్లపుడు పెళ్ళయి పోయిందట. ఒకసారి వాళ్ళ అమ్మ ఊరికెళ్ళినప్పుడు ఆమె నాన్న, భార్య పోయిన తన పెద్దక్క కొడుకుకిచ్చి బలవంతంగా పెళ్ళి చేసేసాడట.. పెళ్ళంటే మరేం లేదు. పసుపు కొమ్ము కట్టిన ఒక దారాన్ని ఈవిడ మెడలో కట్టడమేనట. ఆవిడ అమ్మ ఊరి నుండి వచ్చి ఏడ్చి మొత్తుకుని మెడలోని ఆ తాడుని లాగేసేయ బోయిందట. చుట్టు పక్కల వాళ్ళు బంధువులూ ఒకసారి తాడు పడ్డాక ఆ దేవుడైన చేయగలిగిందేమీ లేదనేసారట. అంతే ఆవిడ అత్తగారింటికి వెళ్ళిపోయింది. తల్లిలా పెంచిన పెద్దక్కయ్యంటే ఈమె తండ్రికి చాలా ప్రేమంట. తల్లిలేని తనని స్వంత బిడ్డలతో కలిపి పెంచి పెద్ద చేసిందని.. ఆమె రుణాన్ని అలా తీర్చుకున్నాడు ఆయన.
అత్తగారింట్లో ఈవిడ వంటా వార్పు కోసం ఎదురు చూస్తూ ఈవిడ కంటే పెద్ద కొడుకులూ, కూతుర్లూ ఉన్నారట. అందరికంటే చిన్నది ఈ వీణ టీచరు. ఈవిడకి సొంత పిల్లలు లేరు. ఒకసారి నేనే మీకెందుకు పిల్లలు పుట్టలేదు అని అడిగా అందుకు- నన్ను పెళ్ళి చేసుకునే నాటికి నా పెనిమిటికి పిల్లలు పుట్టించే వయసు దాటి పోయింది అని నవ్విందావిడ.
ఈవిడకి పుస్తకాలు చదవడమనేది ఒక వ్యసనం. ఎలాగో కూర్చుని ఆ పక్షవాతంలో కూడా కళ్ళు పొడుచుకుని ఏదో చదువుకుంటూ వుండేది.. చిన్నప్పుడు కూడా వంట చేస్తూ, రాత్రుళ్ళు కూడా ఆ పొయ్యి వెలుగులో చదువుకుంటూ ఉండేదట. అట్లా చదువుకుంటూ అప్పుడప్పుడూ తనకు తోచినవేవో నోడ్సులో రాసి పెట్టుకునేదట. ఆవిడ చదవటం, ఏదో రాసుకోవడం, తన లోకంలో తాను వుండటం ఆవిడ భర్తకి ఇష్టముండేది కాదట. చాలా సార్లు చదివే పుస్తకాన్ని లాగి పొయ్యిలో పడేసేవాడట.
మొదట మొదట్లో ఆమె మాటలు మరీ సినిమా టిగ్గ్గా అనిపించేవి అని చెప్పా కదా, ఆ తర్వాత తర్వాత అవే మాటలు నన్ను భయపెట్టడం మొదలెట్టాయి. అప్పట్లో మరీ చిన్న దాన్ని కదా. ఆవిడ జీవితంలోని విషాదం మనసులోకి వెళ్లి గుచ్చుకుని నిలబడి పోయింది. ఎంత ఇన్‌ఫ్లూయెన్స్‌ అయి పోయానంటే పొరపాటుగా కూడా అటువంటి విషాదం నా జీవితం లోకి రాకూడదని పదే పదే కోరుకునే దాన్ని. ఆవిడ మంచి గాయని. నాకు కొన్ని ఎంకి పాటలు నేర్పింది. ”వొన లచ్చిమి” అందులో ఒకటి. ”జాము రేతిరి ఎలా జడుపు గిడుపూ మాని సెట్టు పుట్టా దాటి సేనులో నేనుంటే మెల్లంగా వస్తాది నా ఎంకి సల్లంగా వస్తాది నా ఎంకి అని పల్లవి. అందులో చివరి చరణం ‘సెందురున్నీ తిట్టు నా యెంకి సూరియున్ని తిట్టు నా యెంకి’ ఆ చరణానికి వచ్చిన ప్రతిసారి ఆవిడ ఎందుకో కన్నీళ్ళు పెట్టుకునేది. ఆవిడ కన్నీళ్ళవల్ల  ఆ పాట నేర్చుకోడానికి నాకు చాలా రోజులు పట్టింది. అంతే కాదు ఆ పాట ఏడుపు పాట కాదని పెద్దయ్యే వరకూ తెలియదు నాకు. అది ఏడుపు పాట కామోసు ఎఫెక్ట్‌ కోసం ఏడుస్తుంది అనుకునే దాన్ని.
ఆ మంచం మీద అట్లా నిరాధారంగా పడి వుండి, ఆవిడ పాడే ”నగు మోము గనలేని నా జాలీ తెలిసీ…” పాట విని తీరాలి. ఒకవేళ ఆ నగు మోము దేవుడే వుండి వుంటే తన నవ్వుల మొహాన్ని ఆవిడకి చూపించాల్సిందే… నాకు తెలుసు కదా దేవుళ్ళూ గీవుళ్ళూ వట్టి డొల్ల. ఆవిడ తన చివరి దినాలని అతి దుర్భరంగా గడిపే చనిపోయింది. చనిపోవడానికి ఒక నాలుగు నెలల ముందు నేనావిడ్ని చివరిసారిగా కలిసాను. మా నాన్నకి ఆ ఊరి నుండి బదిలీ అయిపోయింది. చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆవిడ నాకో పుస్తకం ఇచ్చి ”ఈ నవలంటే నాకు చాలా ఇష్టమమ్మా, నా గుర్తుగా  ఇది నువ్వుంచుకో” అన్నారు.
నేనా నవలని రెండు సార్లేమో చదివాను. దాన్ని ఎవరి కిచ్చానో, యెట్లా పోగొట్టుకున్నానో జ్ఞాపకం లేదు. మళ్ళీ సంపాదిద్దా మంటే పేరు జ్ఞాపకం రావటం లేదు. కథ కూడా లీలగా జ్ఞాపకం. ఒక డాక్టరుతో మొదలవుతుంది కథ. అతను అవివాహితుడు. ఒక సందర్భంలో దేవాలయం దగ్గర అతనో వివాహిత స్త్రీని చూస్తాడు. ఆవిడ చాలా సంప్రదాయ బద్దంగా వుంటుంది. చేతి నిండుగా గాజులూ, ముఖంలో పెద్ద కుంకుమ బొట్టూ చూసీ చూడగానే అతనికి ఆవిడ పట్ల గౌరవం కలుగుతుంది. అట్లా అప్పుడప్పుడూ ఆవిడని చూస్తూ ఉంటాడు.
ఒకసారి అతనికి ఒక పేషంట్‌ నుండి కబురొస్తుంది. ట్రీట్మెంట్‌ చెయ్యడానికి వాళ్ళ ఇంటికి వెళ్లాడు. అది దేవాలయం దగ్గర అతనెప్పుడూ చూస్తూ ఉంటాడే ఆవిడ ఇల్లు. పేషంట్‌ ఆవిడ భర్తే. అతను మరణపు అంచులలో ఉంటాడు. ఆవిడ భర్తకి శ్రద్ధగా సేవలు చేస్తూ వుంటుంది. ఆవిడ మీద ఈ డాక్టర్‌కి గౌరవం పెరిగిపోతూ వుంటుంది. తరచూ ఆ ఇంటికి వెళ్ళాల్సి రావడంతో డాక్టర్‌కి ఆవిడతో పరిచయం పెరుగుతుంది. ఒకరోజు సాయంత్రం ఆమె అతనికి ఈవెనింగ్‌ గౌన్‌లో కనిపిస్తుంది చాలా ఉత్సాహంగా వుంటుంది. ఆ ఉత్సాహంలోనే నా భర్త చనిపోతే నేనింక ఇక్కడ ఉండను నా జీవితాన్ని నా ఇష్టమొచ్చినట్టు జీవిస్తాను. హాయిగా వుంటాను ఢిల్లీకి వెళ్లిపోతాను అంటూ ఏమిటేమిటో చెప్తుంది, సంతోషంగా చెప్తుంది. ఆ మాటలు విని అతను ఆశ్యర్య పడతాడు ఆవిడని అసహ్యిచుకుంటాడు. ఇంతకు మునుపు వున్న గౌరవం తుడిచి పెట్టుకు పోతుంది.
కొన్ని రోజులకి ఆవిడ భర్త చనిపోతాడు. భర్త పోయిన తరువాత ఒక రోజు ఆమె ఇంటికి వెళ్తాడు డాక్టర్‌. ఆవిడ మొండి చేతులూ బోసి నుదురుతో విదవ అవతారంలో అతనికి కనిపిస్తుంది. అతను ఎక్కడికో వెళ్లిపోతానన్నారు కదా, మీ జీవితం మీరు జీవిస్తున్నారు కదా? వెళ్ల లేదా అని అడుగుతాడు. ఆవిడ అంటుంది పోలేదు! పోలేను!! ఇవి కనపడని సంకెళ్లు అని.
కిటికీ ఊచలకవతల జామ చెట్టు మీద వాలిన పసుపు రంగు పిట్ట సుదీర్ఘంగా ఏమిటో ఆలోచిస్తూ వుంది. కిటికీ లోపల వున్న నేనూ, నీలిమా దానికి ఎలా అనిపిస్తూ ఉండొచ్చు? ఆ ఆలోచనకి నవ్వొచ్చింది. నాకెందుకో చాలా సార్లు ఆ పుస్తకాన్ని మళ్లీ చదవాలనిపిస్తుంది. ఎవరైనా ఆ పుస్తకం పేరు చెప్పగలరా…..!

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

23 Responses to ఆ పుస్తకం పేరు చెబుతారా…!

 1. BHUSHAN says:

  కథ రాసిన భాష బాగుంది. కథలో ఏం చెప్పదలచారో అర్థం కాలేదు. అన్ని పుస్తకాలు చదివిన మనిషి ఏమీ నేర్చుకున్నట్టు కనపడదు. పక్షుల్ని పంజరాల్లో పెంచితే వాటికి ఎంత అసౌకర్యంగా, బాధగా ఉంటుందో, చేపల్ని గాజుతొట్టెల్లో పెంచితే వాటికి కూడా అంతే కదా! ఆ చేపకి నీలిమ అని పేరు పెడితే మాత్రం దాని బాధ తీరుతుందా? చెరువులోనో, సముద్రంలోనో ఉన్నంత స్వేచ్చ దానికుంటుందా? ఈ మనిషికి ఆ చేప గురించి అన్ని ఊహలూ వొస్తుంది గానీ, ఈ ఊహ రాదు. ఈవిడ పుస్తకాలూ, నవలలు చదువుతుంది గానీ వాటి పేర్లు గుర్తుండవు ఎన్ని సార్లు చదివినా. నవల్లో వొచ్చిన స్త్రీ డాక్టరు దగ్గిర ఆమె భర్త జబ్బుగా ఉన్నప్పుడే, భర్త చనిపోతే డిల్లీ వెళ్ళిపోతాను, హాయిగా ఉంటాను అంటుంది. జబ్బుగా ఉన్నప్పుడదుభర్త చనిపోవడం గురించి మాట్లాడితే ఆ భర్త ఈవిడకి నచ్చలేదు అని అనుకోవాలా? ఆ డాక్టరుకి, ఈ స్త్రీ పట్ల గౌరవం ఎందుకంటే పెద్ద బొట్టూ, చేతినిండా గాజులవల్లా! జబ్బు పడ్డ భర్త చనిపోయినా ఆవిడకి ఏవో సంకెళ్ళట! కథ చదివినంత సేపూ ఏదో చెప్పడానికొచ్చినట్టే వున్నారు. కానీ చివరికి చప్పగా ఉంది. – భూషణ్

 2. NS Murty says:

  Stream of Consciousness తరహాలో రాసిన ఈ Introvert Story చాలాబాగుంది. ఇందులోని ప్రతి ఇమేజీ ఒంటరితనాన్నీ, చెప్పకుండా చెప్పిన ఒంటరితనం కోరుకోవడం, అదే నీలిమని ఒంటరిగా ఉంచడంలో ప్రతిఫలించడం, ఈ కథలోని శిల్పాన్నీ, దానికోసం రచయిత్రి తీసుకున్న శ్రధ్ధనీ చూపిస్తున్నాయి. నేను ఈ మధ్యకాలంలో ఇంత మంచి కథ చదివినట్టు గుర్తు లేదు. రచయిత్రికి నా మనః పూర్వక అభినందనలు.

 3. swaroop says:

  ఒక స్త్రీ ఒంటరి తనం లోకి అలోవోకగా చేసిన ప్రయాణం ఈ కథ.neelima as a metaphor is superb and discovered this loneliness in a great style.అనేక సంవత్సరాల తర్వాత తెలుగు కథ కి నూతన ఉత్సాహనిచ్చేవి ల ఉంటున్నాయి రచయిత /రచయత్రి కథలు.

 4. Murali says:

  భాఘూణ్డీ

 5. sreenivasa sharma says:

  భూషణ్ గారూ కథలో ఏం చెప్పదలచుకున్నారో అర్థం కాలేదని చెప్పి మళ్ళీ అంత పొడుగు విమర్శ యెట్లా రాసారు.ఒకటి నమీకు కథ అర్థమై నచ్చక పోవడం వెనుక మీకున్న మగవాద దృక్పదం ప్రధాన పాత్ర వహించి వుండాలి .లేదా మీ అజ్ఞానం ది పై చెయ్యి అయినా అయి వుండాలి.పోతే చేప ఎక్వేరియంలో వుంటే స్వేచ్ఛ కోల్పోతుందని కనిపెట్టిన మొదటి శాస్త్రవేత్త మీరే ఉన్నట్లున్నారు. ”ఈవిడ పుస్తకాలూ, నవలలు చదువుతుంది గానీ వాటి పేర్లు గుర్తుండవు ఎన్ని సార్లు చదివినా.”అని మీరు ఎవర్ని ఉద్దేశించి అన్నారు?రచయిత్రి కథకి ఎత్తుగడ కదా అది!కథకి అదే ప్రాణం కదా !కథ శైలీ శిల్పాల గురించి మీకేమయినా అవగాహన వుందా అసలు .అది మీకు లేదు కనుక అలా ఉన్న వాళ్ళని చూసి ఏడుస్తున్నట్లున్నారే! కథలు చదవడం కూడా రాని వాళ్ళు కథలు చదివి కామెంటడం ఎందుకు ?కథ చప్పగా కాక కారంగా ఉండాలంటే యెట్లా ఉండాలో మీరేమైనా రాసుంటే ఆ అద్భతమైన కథలు చదివి అందరినీ నేర్చుకోమని పదిమంది రచయితల చేత రాయించుకుని ప్రచారం చేయించండి లేకుంటే . Anyways ,people knows who gives all these type of comments

 6. BHUSHAN says:

  శ్రీనివాసశర్మగారూ, కధ అర్ఘం కాకపోతే మగవాద దృక్పథం అనీ, అర్థమైతే మీరేదో స్త్రీవాద దృకథంతో అర్థం చేసుకున్నారనీ చాలా బాగా చెప్పారే! జ్ఞానవంతులైన మీకు చేప స్వేచ్చ గురించి కూడా అర్థం కాలేదు కానీ స్త్రీ వాద దృక్పథంతో ఆలోచిస్తారన్నమాట! ”ఈవిడ పుస్తకాలూ, నవలలు చదువుతుంది గానీ వాటి పేర్లు గుర్తుండవు ఎన్ని సార్లు చదివినా.” అని ఎవర్ని అన్నాను? కథలో ఎవరు ఆ పని చేశారో వాళ్ళనే అన్నాను. ఒక కథని విమర్శించాలంటే కథకులు కావాలన్నమాట. మరి మీరేం కథలు గిరికారో? కథ చప్పగా ఉందంటే, కారంగా ఉండాలనా అర్థం?

 7. raghavareddy says:

  బూషన గారు చూద బొతె మీరు చెప వాది లగున్నరె ,మీరు ఇంతకి బొచ చెప వాద ?పులుస చెప వాద?

 8. సామాన్య says:

  భూషణ్ గారు
  1 . కథలో ఆవిడ చేపకి స్వేచ్చ ఎందుకు ఇవ్వలేదంటే ఆవిడకి స్వేచ్చ లేదు కనుక .అనివార్యంగా ,అవాంచితంగా తానేట్లా బందీ అయి వుందో దానికి నీలిమ ప్రతీక .నీలిమ స్వేచ్చ ఆవిడ స్వేచ్చ రెండూ ఒక దానిపై ఒకటి ఆధార పడి వున్నాయి .దీని నే ప్రతీకాత్మక కథనం అంటారు .ప్రతీకలో ఒక విషయం మరో విషయానికి ప్రాతినిద్యం వహిస్తూ వుంటుంది. డైడాక్ టిక్ రైటింగే అయినప్పటికీ అది మరీ సూటిగా వుంటే రచన అందం చెడుతుంది.నిజానికి కథ చివరికి వచ్చేప్పటికి తెలియకుండా మిమ్మల్ని ఓ గ్లూమీనెస్ ఆవరించి వుండాలి .అది రాకుండా మీకు అడ్డుపడింది నా అంచనా మేరకు తప్పకుండా ఆవిడ సంపన్నత అయి వుండాలి .సంపన్నుల పై మీకున్న వ్యతిరేక భావం అయి వుండాలి .కరెక్టుగా నేను అసహ్యించు కుంటున్నదీ అదే .ప్రతి మనిషి మెదడుకీ పని కావాలి .మనుషులను పనిలేని వాళ్ళుగా ”యూస్లెస్ బ్రైన్స్”గా చేసే సంపన్నత ఎవరికీ వుండకూడదు .ఇందులో ప్రధానాంశం ఇదే .మిగిలినవి కథను బలపరచే అనెక్ డోట్స్ . .

  2.పాపం కథలో ఆవిడ మరచి పొయిన పుస్తకం పేరు అదొక్కటే కదా అండీ ” పేర్లు గుర్తుండవు ఎన్ని సార్లు చదివినా ”అని బహువచనం ఎందుకు వాడారు ?పదమూడు పద్నాలుగేళ్ళ చిన్న వయసులో ,కేవలం రెండు సార్లు చదివిన పుస్తకం పేర్లు మీకేన్ని గుర్తున్నాయో చెబుతారా ?ఒక వేళ మీకు గుర్తున్నా అందరికీ మీలాగే జ్ఞాపకం ఉండాలని రూల్ లేదు కదా .అదీ కాక బాగా విస్త్రతంగా చదివే వాళ్లకి మరిచి పోవడం తప్పనిసరిగా వుంటుంది .లోడ్ ఎక్కువైతే ఎరేస్ అవడం నార్మలె కదా!

  3.నవలలో ఆవిడ కి ఆ భర్త ఇష్టమో అయిష్టమో చర్చ సంగతి పక్కన పెడితే వైధవ్యం తరువాత ఆవిడ ఎక్కడికో వెలి పోవాలనుకున్నా వేళ్ళ లేక పోయింది కదా !మన ఇష్టాలని ఆపిన వాటిని సంకెళ్ళు ,గుది బండలు అనే కదా పిలుస్తాం మనం .

  4:ఇదొక ఎక్స్పేరిమెంటల్ రైటింగ్ .అన్నింటినీ ఎప్పుడూ ఒకే తరహాలో పండు వలిచినట్లు చెప్పడం పాటకులను మరీ తక్కువ అంచనావేయడమే అని నా భావన .ఏమైనా మీకు అర్థం చేయించలేక పోయినందుకు బాధగానే ఉంది.

  5.విమర్శ దురుసుగా వుండటం నా దృష్టిలో తప్పు కాదు .కానీ అది ఎప్పుడంటే ఆ రచన లేదా కళా రూపమో వ్యాపార దృక్పదాన్ని కలిగినదైనపుడు మాత్రమే బాగుంటుంది.ఇది వ్యాపార కథ కాదు.కథ అన్ని సార్లూ పాటకుడ్ని ఉద్రిక్త పరచేదిగానో,ఉద్వేగ పరిచేదిగానో ఉండాల్సిన అవసరం లేదు అని నా అభిప్రాయం .అదీ కాక నేను ఇప్పుడిప్పుడే రాస్తున్నాను కనుక వ్యక్తీకరణ నేను ఆశించిన ఫలితాన్ని తీసుకురావడం లో విఫలమై ఉండొచ్చు .నేర్చుకునేందుకు తప్పక ప్రయత్నిస్తాను .

  ఏమైనా నా అవగాహనా పరిధి మేరకు నేనిచ్చిన ఈ ఏన్నోటేషన్ మిమ్మల్ని సమాదానపరస్తుందని భావిస్తాను

  @శ్రీనివాస శర్మ
  ఒక అపరచిత రచయితని అంతలా వెనకేసుకొచ్చిన మీ సహృదయతకు ధన్యవాదాలు సర్ .

 9. సామాన్య says:

  swaroop గారూ ,NS Murty గారూ,Murali గారూ raghavareddyగారూ మీ స్పందనకు హ్రుదయపూర్వక దన్యవాదాలు.

 10. అక్వెరియంలొ నీలిమ, నీలిమని పెంచు కుంటున్న స్త్రీ లేదా రచయిత్రి
  లా చదివి ప్రాక్తీసు ఛెయని స్త్రీ, వీణ పిన్ని,భర్థ ఎప్పుదు చనిపొతాదా దిల్లీకి వెల్లి పొతాను అనే స్త్రీ ..అందరి కథల లోను స్వేచ్చ ని కోల్పొయిన వైనం కానరాని సంకెళ్ళు సుస్పస్టంగా కనబదుతుంది వెరొక చెపతొ కలవలేని ఒంటరి తనం ని వెదుక్కున్న నీలిమ ఈ స్త్రీ లందరు కి చక్కని సింబాలిజం.
  జెండర్ మెయిన్ స్ట్రీమింగ్ ని అనేక రూపాలలో ఉన్న వైనాన్ని నవ్యతతో.. చెప్పే ప్రయత్నం చేసిన సామాన్య గార్కి అభినందనలు

 11. BHUSHAN says:

  సామాన్యగారూ,

  1. మీ అంచనా కొంతవరకూ కరెక్టే. కానీ కొంచెం పనిచేసే సంపన్నులకి ఉండేదంతా యూజ్ ఫుల్ బ్రెయిన్సే అంటారా? అయినా అది వేరే టాపిక్ లెండి.
  2. మతిమరుపు అన్నది సహజం. కానీ అంత చిన్న వయసులోనే రెండు సార్లు చదివిన పుస్తకం పేరు గుర్తుండదా అన్నదే నా ప్రశ్న.
  3. ఆవిడ ఇష్టాలని ఆపిన సంకెళ్ళు ఏమిటో నాకర్థం కాలేదు.
  4. నా విమర్శ ఏ మాటలవల్ల మీకు దురుసుగా అనిపించింది? ఏ కథైనా విమర్శించదగ్గదే అని నా అభిప్రాయం.

 12. ravulamma says:

  భూషణ గారు ,

  మీరు ఎనిమిదొవ తరగతి లో ఏమేమి పుస్తకాలు చదివారో కాస్త పట్టిక ని ఇవ్వగలరు.

  అన్ని కథలు విమర్శించా దగినవే ఐనప్పుడు మనుష్యులం మనం రాసేవి,చిట్టి కథలు కావొచ్చు ,పొట్టి కథలు కావొచ్చు,పోయే కాలం కథలు కావొచ్చు ,ఎందుకు పని కట్టుకొని మిత్రులని పొగడమని పోరు పెడతాము?

  సాహితి విమర్శకి తిట్లకి మధ్యనున్న బేధాలను ఒక టేబుల్ రూపం లో సోదాహరణంగా వివరించగలరు.

 13. jilukara says:

  కథ చాలా విలక్షణమైంది. టెక్నిక్ గురించి వస్తువు గురించి లోతుగా పరిశీలించాలి. మొపాసా కథలను గుర్తు చేసేలా ఈ కథ రాసిన సామాన్యను తప్పక అభినందించాలి. భూషణం చేసిన వాఖ్యలకు సామాన్య గారిచ్చిన జవాబు సరిపోతుంది. కథ మీద కాకుండా చదివిన పుస్తకాల గురించి, మెమరీ పవర్ గురించి మాట్లాడటం అంటే రచన సారం గ్రహించకపోవటమో, రచయిత పట్ల అసూయో వుండాలి. అసూయా ద్వేషాలకు సాహిత్య విమర్శలో గౌరవం లేదు.

 14. harikumari says:

  భూషణ్ గారూ ,
  1 ) మనకో విద్య తెలిసి ఉండి దాన్ని ఉపయోగించట్లే దు అనే ఉద్దేశం లో రచయిత్రి గారు “useless brain” అన్నారు. అందుకు ఒక కారణం సంపన్నత అయి ఉండొచ్చు .
  2 ) మతిమరుపు సహజం అని మీరే అంటున్నారు మరి “ఎలా మరిచిపోయారు” అని ఎందుకు ప్రశ్నిస్తున్నారు ???????
  3 ) తన భర్త లేకుంటే తన ఇష్టం వచ్చినట్టు జీవించొచ్చు అనుకున్న ఆమె తన భర్త చనిపోయిన తర్వాత అతని జ్ఞాపకాలు ఆమె వొంటరితనం తన ఇష్టం వచ్చినట్టు జీవించకుండా ఆమెను ఆపిన సంకెళ్ళు.
  భూషణ్ గారూ ,
  మీరు మీ మనసుకి ఉన్న అసూయ అనే సంకెళ్ళు తీసి చదవండి…….చదవాలని నా కోరిక.
  సామాన్య గారూ ,
  వొంటరితనం మీద మీరు రాసిన ఈ కథ నాకు చాలా బాగా నచ్చింది ……

 15. sreenivaasa sharma says:

  బూషణం
  నువ్వు కుళ్ళుతో కుళ్ళిన కోడిగుడ్డు వాసన వేస్తున్నావ్ .కథ నీకు అర్థం కాలేదని మొదటే మాకందరికీ అర్థమయింది.నీకు వేరే పనేమీ లేదని అందరికీ లేదనుకుంటే ఎలాగా ? నువ్వెవరో నీ ముసుగు ఏమిటో అందరికీ తెలుసు కానీ ఇక ఆపు.

  అమ్మా సామాన్య మీ బ్లాగ్ కూడా చూసాను .ఇటువంటి పురుగులకి విలువ ఇచ్చి అంత స్పందించడం వృధా ,మీ దారిలో మీరు రాసుకెల్లండి.గాడ్ బ్లెస్ యు తల్లీ !

 16. D.R.Krishna says:

  చేపలు అనేవి చాలా రకాలు సొర, పులస, బొచ్చె , గెండి ఇలా చెప్పుకుంటూ పోతే మనకి తెలియనివి కూడా చాలా వుంటాయి వాటిని మనం వేటాడితే మనకి ఆహారం అవుతాయి వేటాడకపోతే స్వేచ్చగా నీటిలో తిరుగుతాయి…..ఇకపోతే aquarium లో పెట్టే చేపలు గోల్డ్ ఫిష్ , ఫైటర్ ఫిష్ , కాట్ ఫిష్ ఇలాంటివి, ఇవి aquarium లో మాత్రమే పెడతారు వాటివల్ల గృహానికి అందం , ఆరోగ్యమైన వాతావరణం , శోభ వుంటాయి అంతే కాని వీటిని తీసుకెళ్ళి నదిలో వదిలితే పెద్ద చేపల బారిన పడతాయి ఒకవేళ పెద్ద చేపల్ని aquarium లో వేస్తే అది పగిలి చేతికి వస్తది. అందుకనే ఏది ఎక్కడుండాలో అక్కడే వుండాలి అది సృష్టి ధర్మం.

  సామాన్య గారూ మీరు రాసిన ఈ కథ చాలా బాగుంది. సాధారణ వ్యక్తులైన వాళ్ళకి ఒకటికి రెండు మూడు సార్లు చదివితే తప్ప దానిలోనే విషయం బోధపడదు.

 17. krishh says:

  BHUSHAN గారు .
  కథలో రచయిత్రి చేప తో ఒక రకమైన అవ్యాజ్యనీయమైన బంధం ను ఏర్పరచుకోవటం ,దాన్ని నీలిమ గానే చూడటం,.POSSESSIVENESS వల్ల ,దానికి తనకు మద్య మరొకరు ఉండకూడదనుకోవటం
  …ఇవన్ని రచయిత్రి అంతరంగిక,కాల్పనిక భావాలకు,తన ఒంటరి తనానికి ప్రతీకలే గాని ,చేప స్వేఛ్చ ని హరిచే మనస్తత్వం గ మీకు కన్పించటం ….రియల్లీ షాకింగ్.
  ఏమైనా మీ “చేప స్వేఛ్చ” కాన్సెప్ట్ పాటకులలో కలకలం రేపింది..మీ కామెంట్ చూసాక … బ్రతికిన చేపలతో కలిపి గుటుక్కు మనిపిస్తూ ప్రసాదం పెడ్తున్న బత్తిన సోదరుల ల ను జీవ హింస చట్టం కింద
  “BLUE CROSS ” వాళ్ళ చేత కేసు పెట్టించి బొక్క లో తోయ్యోచ్చని మెరుపు లాంటి ఐడియా వచ్చింది …. …. …. “చేపస్వేఛ్చ— భూషణ్ గారి స్కెచ్” టాపిక్ ఇంకా దెతైలెద్ గ నెక్స్ట్ కామెంట్ లో.

 18. krishh says:

  “”చేపస్వేఛ్చ— భూషణ్ రచ్చ””
  టాపిక్ లోకి మళ్లీ వెళ్తే…!
  భూషణ్ గారికి కథ అర్ధం కానందుకు నాకు చింత లేదు ,ఎందుకంటే పాటకునిఆలోచనా సరళి,పరిధి ని బట్టి కథలు ఒక్కోసారి అర్ధం అయ్యీ అవనట్టు ఒక్కోసారి అసలు అర్ధమే కానట్టు వుండటం
  సహజమే…కాకపోతే తనకు అర్ధం అయ్యినంత లో అన్నీఅభ్యంతరాలే ఉండటమే…కొత్త కోణం .
  భూషణ్ గారు…!
  కథ లో రచయిత్రి అపురూపంగ దాచుకున్న,జ్ఞాపకాల దొంతరలను సున్నితంగా స్పృశిస్తూ … ఒక connectivity తో చెప్పుకు పోవటం …మీరు గమనించలేద?…
  మనమైనా
  ఒంటరిగా గత జ్ఞాపకాల లోకం లో విహరిస్తుంటే వచ్చే ఆలోచనలు ఒక సబ్జెక్టు లోనుండి చిన్ని కనెక్షన్ తీసుకుని మరో సబ్జెక్టు లేదా సంఘటన లోకి జారుకుంటూ వెళ్ళటం మీకు ఎప్పుడుఅనుభవం కాలేదా…ఎందుకు అంత confuse అయ్యారు!?
  నా వరకైతే
  రచయిత్రి జ్ఞాపకాల తో బాటు ప్రయాణించాక… ,తన స్పందించే సున్నిత స్వభావం ,భావుకత తో కూడిన ఆలోచనల అల్లికలు , తన చిన్ని ప్రపంచం లో ఏకాంతం గ విహరిస్తూ తన వారిని వదలలేని possessiveness ,స్పష్టం గ కనిపించాయి.
  వస్తువులతో ,చేపతోనే కాక జ్ఞాపకాల తో కూడా స్నేహం చెయ్యటం, అన్యులతో కలవలేని ఒక రకమైన ఒంటరితనం ,నచ్చినవారిని వదలలేని ప్రేమైక బలహీనత ,బిడియం,కొంచం ఉత్సాహం కలగానే అంతలోనే వెయ్యి వాట్ల బల్బులా నవ్వటం …తనను మన కళ్ళ ముందుకు తీసుకురావటం లేదా?…
  రాక పోతేమరొక్కసారి ఈ వాక్యాలు చూడండి…

  “చాలా సార్లు దానికి జోడీ తెద్దామా అనిపిస్తుంది. మళ్ళీ ఎందుకనో తెలీదు దానికి తోడు దొరుకుతుందంటే ఏదో బాధ మొదలవుతుంది. ”
  ”నన్ను మరిచిపోవు కదా? గుర్తు పెట్టుకుంటావ్‌ కదా” అని రాసినా, ఆ పిల్లకి నేనెప్పుడూ వుత్తరం రాయనే లేదు. ఎందుకు రాయలేదో తెలీదు కానీ, నేనెప్పుడూ ఆ పిల్లని మరిచిపోనే లేదు.”
  “కేరళ పిల్ల. పెద్ద అందగత్తె. ఒకటే చప్పట్లు. కేరింతలు. చప్పున పెద్ద దిగులొకటి పట్టుకుంది… నేనేమో అందగత్తెను కాదు .అయినా కాకున్నా పెద్ద ఇంట్రావర్ట్‌ ని”….

  అరుణ మరచిపోవుకదా అన్నా ,తను ఆ అమ్మాయితో పరిచయం ను కొనసాగించక పోయుండొచ్చు ,కాని ఆ పిల్ల జ్ఞాపకాలు ఈవిడ జీవితం లో చాల విలువైనవి.
  ఇక కథ లో పాత్రల విషయానికొస్తే
  ఆ ముసలావిడ అన్ని పుస్తకాలు చదివింది కదా ముసలి తనం ఎందుకొచ్చింది?మంచాన ఎందుకు పడింది?కన్నీళ్లు ఎందుకు పెట్టుకున్నది? అలా కాక కట్టు బాట్లు కు అంత ఈజీ గ ఎందుకు లొంగిపొయింది ?అనా మీ డౌట్ లేక బాగా చదువుకుంటే ఇవన్ని రాకుండా చూడొచ్చని అనుకుంటున్నారా?
  ఇక ముసలావిడ ఇచ్చిన పుస్తకం లో ని స్త్రీ పాత్ర భర్త విషయం లో కొంచం strange గ behave చేసి ఉండొచ్చు,అది డాక్టర్ కీ
  ఇబ్బంది గ ,తప్పు గ అనిపించింది . .డాక్టర్ perspective తో చూస్తే ఆమె behaviour అభ్యంతరకరం, కాని అదే ఆవిడ ని అడిగితే … తన ప్రత్యేక పరిస్థితుల్లో “బంధాల సంకెళ్ళు” “బాధ్యతల బరువులు” “స్వేచ్చా కై తపన ” ల మద్య సంగర్షణ లో నేను అన్నది కరెక్టే అనొచ్చు..
  .మీరేమో సంప్రదాయాల పై గౌరమున్న డాక్టర్ కరెక్ట్ కాదు,విరుద్ధంగ అనిపించిన ఆవిడ కరెక్ట్ కాదు అంటారు . కట్టు,బొట్టు,మాట తీరు చూసి గౌరవిస్తే తప్పా (ofcourse అవి సరిగా వున్నంతలో అందరూ మంచి కాక పోవచ్చు ).
  ఐనా అన్ని పాత్రల స్వభావాలు రచయిత్రి స్వభావాన్ని reflect చెయ్యవు అలాగే ఒకే మూసలో లాగా ప్రవర్తించవు కదా. .

  ఇక టైటిల్ గుర్తుండాల్సిందే బుక్ చదివాక…సినిమా చూసాక…కథ విన్నాక ..అని మీరు అంటే ……అది ఏ వాదం!?? నాకైతే నవ్వాలో ఏడవాలో తెలీట్లేదు.
  కాకపోతే టైటిల్ నా comment title లా కత్తిలాగుంటే ..కసుక్కున గుచ్చుకుని గుర్తుందిపోద్ది……………అది .అలా లేదేమో లే.

  అయినా మీ మనసు మూలలో ………. మీ చేప స్వేఛ్చ గురించి హేళనగా మాట్లాడమని గట్టిగ అనిపిస్తోంది కదా…ఇంతలోనే తొందర పడి శర్మ గారిని అన్నట్టు “”మీకు చేప స్వేచ్చ గురించి కూడా అర్థం కాలేదు కానీ స్త్రీ వాద దృక్పథంతో ఆలోచిస్తారన్నమాట! ”” అంటూ కోప పడకండి…..చేప టాపిక్ ఇంకా మిగిలే వుంది.

 19. krishh says:

  భూషణ్ గారూ…!
  ఇక “పక్షులను పంజరాలలో పెంచితే అసౌకర్యం గ ఉన్నట్టే చేప ను గాజు తొట్టి లో పెడ్తే
  వాటికి అది బాధే కదా” … , మరి ఆ మాట అన్నందుకు మీపై ముప్పేట దాడి చెయ్యటమే గాక … హేళన చేస్తున్నామని మీకు కలచి వేస్తుండొచ్చు.చేప హక్కు ను కాల రాస్తున్న ఈ మనుషులంటే మీకు ఉక్రోషం గ ఉండొచ్చు.

  ఇక్కడ కించపరచటానికి కాదు కాని మీ వాదన లో వాస్తవానికి ఆవకాశం ఎంతో మనం కొంత SCIENTIFIC కోణం లో అలోచించి నిర్ణయానికొద్దామా?…
  .”జీవ హింస “అంటే జీవమున్న వాటిని అనుచితం గ హింసించటం, శారీరకం గ లేదా మానసికంగా … .
  మరి ఈ సూత్రం అన్ని ప్రాణమున్న జీవులకు ఒకేలా వర్తింప చేయం ఎందుక ని?…Especially మొక్కలకు కూడా జీవ ముంటుంది కదా…!?
  ఎందుకంటే… మొక్కలకు Brain , peripheral Nervous system వుండవు . So ,ఆలోచనలు,భావాలు,స్పర్స,నొప్పి… ల్లాంటి ఎటువంటి స్పృహ
  feel వాటికి వుండవు.But ప్రాణం వుంటది.కాని మనము కవితాత్మకం గ…మన ఆలోచనల ను వాటికి అన్వయించుకుని … “పుష్పవిలాపం”… ల్లాంటి అధ్బుత బావాలకు ప్రాణం పోస్తుంటాం.

  plants నుండి Animal kingdom లోకి వస్తే ఏక కణ జీవులైన MICROSCOPIC size లో వుండే protozoa నుండి పరిణామ క్రమం లో వివిధ systems , organs డెవలప్ అవుతూ…Earthworm ,cockroaches , spiders ల్లాంటి insects లనే ఆకసేరుకాలను(invertebrates) దాటుకుని …సకసేరుక(vertebrates ) ప్రపంచం లోకి అడుగిడిన తొలి జీవరాసి మన చేప.
  మళ్లీ ఈ
  చేపలు D.R.Krishna గారు వ్యాక్యానిన్చినట్టు చాలా రకాలైనా broad గ చెప్పుకుంటే Two types based on their shells,scales n fins అవి1) FIN FISH 2) SHELL ఫిష్(షెల్ ఫిష్)………………….(మనలాగా selfish కాదఅండో భూషణ్ గారూ…)

  NEUROTRANSMITTERS వల్ల ఆకసేరుకాల్లో కొన్నిటికి ,VERTEBRAL COLUMN ,BRAIN DEVELOPMENT స్థాయిని బట్టి చేపలకు ,నొప్పి ,VISION ,HEARING అయితే ఉంటాయి కాని …సౌకర్యా అసౌకర్యాల తారతమ్యాలను అవి ఫీల్ కాలేవని ఒక శాశ్త్రీయ మైన అంచనా…………..వాటికి మీ స్థాయి ఆ స్థాయి లో బ్రెయిన్ డెవలప్ కాక పోవటమే అందుక్కారణం.

  మరి మీరన్న స్వేచ్ఛను అన్ని జీవులకు ఒక్కలాగే ఆపాధిద్ధామా? గాజు తొట్టిలో పెట్టడాన్ని స్వేచ్ఛను హరించడం క్రిందేపరిగణ లోకి తీస్కున్ధమా?

  మనుషులు ,జంతువులు, పక్షులు ఫీల్ అయ్యినట్టు COMFORTABLENESS ను దోమ, ఈగ,చేప
  గ్రహించలేవు (అయితే మనం తలచుకుంటే దోమ లు మాట్లాడగలవు, చేపలు చిందేయ్య గలవు, ఈగలు పగ పట్టగలవు(రాజమౌళి ఈగ లాగ) .
  అలాగే,.కథలో రచయిత్రి , చేప…. ఆలోచనలను అంచనా వెయ్యటం,తన చిన్ని ప్రపంచం లోని పాత్రలన్నీ మనుషుల స్థాయి గానే ఆలోచించటం… ఒక కవితాత్మక ధోరణి, అందులో తర్కానికి తావు లేదు.

  ఇంకా ఆ చేపలోకి పరకాయ ప్రవేశం చేసి …తన అందమైన ఆలోచనలు చెయ్యటం అదో అందమైన అలవాటు .అలాకాక ఆ చేపను నది లో వదిలేస్తే,లేక దానికి తోడు తెస్తే అలాంటి ఉహలకు తావే లేదు కదా?
  ఇక్కడ మనం రచయిత్రి మాటల్లో చూస్తే….

  “ఒంటరిగా అదేమి ఆలోచిస్తుందో ఊహించుకోవడం నాకో సరదా….ఎవరైనా తనని ప్రేమిస్తే బాగుండు అనుకుంటుందా? ఆ చిన్ని గాజు బుడ్డిలోకి అలవి కాని వసంతం వచ్చి పడిపోతే బాగుండు అనుకుంటుందా? ఇట్లా… ఏవేవో ఆలోచిస్తూ వుంటాను. దానికి జోడీ దొరికితే నా ఊహలకి అంతరాయం కదా. అందుకని ఇంకో చేపని ఆ ఎక్వేరియంలో వేయడం నాకు ఇష్టం వుండదు.”
  చాల చక్కగా వ్యక్తీకరించలేదూ…..

  ఏదేమైనా ….మన నీలిమ కి తోడు ను తీసుకు రమ్మని, తనకు ఇష్టం లెకపొఇనా రచయిత్రిని పోరాదాం ,చేప కల్యాణం కోసం తప్పు లేదు..కాని నదిలోనో సముద్రంలోనే వదిలే కార్యక్రమం ను ప్రస్తుతానికి postpone చేద్దాం .
  చివరగా ఇంకో విషయం …. ….మీరు నాలా సాగ తీత లేకుండా
  కథ మీద విమర్శ ను “సూటిగా చెప్పాను సుత్తి లేకుండా” అనుకుంటున్నారేమో… అందులో లేనిది
  లేనిది సుత్తి కాదు “శ్రుతి”.. అని తెలుసుకుని ,”అపశ్రుతి” లేకుండా విమర్శ ఉండేలా చూసుకో గలరని ,,సహృదయం తో గమనించ గలరని ఆశిస్తున్నాను.

 20. Ramani says:

  భూషణ గారు,

  మీరు రాసింది చాలా కరెక్టు.

  ఒక లాజికలు రీజనింగు ఇవ్వలెని వాల్లు ఎందుకు కథలు రాసి జనాల మీదకు వదులుతారూ ఎంటొ

  ఈ బ్లాగు ల్లొ చెంచాగిరి వెలగబెట్తె వాల్లు చాలా మందెఅ ఉన్నారు లెంది

 21. sridevi says:

  సామాన్య గారు కథ చాలా బాగుంది .పాటకుని స్థాయిని అనుసరించి కథలు అర్థమవుథాయి.చర్చ సరదాగా వుంది .అంత చర్చ జరిగినా రమని లాంతి వాల్లకి అర్థమ కాలెదు .మనకు ఉండనే ఉంది కదా పద్యం ”థిమిరి ఇసుక నుండి తైలంబు తీయవచ్చు ….చేరి మూర్కుని మనసు రంజింప లేమని”మీరి ఏం చేసీ ఆ భూషణ్ ఈ రమణి లాటి మూర్ఖుల మనసు రంజింప చేయ లేరు అందుకనీ బైబిల్ లో ఓ మాట ఉంది ”వారేం చేస్తున్నారో వారికే తలియదు ప్రభువా దయ వుంచి క్షమించు ”అని …వారిని క్షమించండి .
  రమణి గారూ మీకు లేని చెంచా గాళ్లా అండీ?చెంచాలతోనే కదా మీరు నడుస్తుందీ… చెంచాలే కదా మిమ్మల్ని నడిపిస్తున్నదీ …టైం వేస్ట్ ఎందుకూ ?ఏడిస్తే ఏమీ రాదు భగవంతుడు మన మెదడుకు ఎంత తెలివి ఇచ్చాడో అంతే మనకు ప్రాప్తి .

 22. krishh says:

  రమణి గారు…!
  విషయం లేకుండా, కథ గురించి లేక భూషణ్ గారి వ్యాఖ్యల గురించి ఎంటువంటి explanation లేకుండా
  లేకుండా మీరు అలా
  చర్చలో పాల్గొన్న వాళ్ళను ఆడిపోసుకోవటం … …. అభ్యంతరకరం కాదా?.
  మీరు ఏదైనా మీకు తోచిన reasoning లేక logic చెప్పి మీ సమర్ధన ను పోస్ట్ చేసి వుంటే అప్పుడు అది మీరన్నట్టు
  చంచాగిరి కోవ లో కాకుండా అభిప్రాయం గా వుండేది కాదంటారా?

 23. sekhar says:

  అమ్మ రమణి

  నీ అసలు పేరేంటో చెప్పమ్మా

  నువ్వుండే ఊరేందో చెప్పమ్మా .

  ఇతరులు రాసిన కథలని ఒడుపుగా మాండలికం లో రి రైటు చేసి చివరన అరువు తెచుకొన్న “సామ్రాజ్య వాద వెతిరేకత”రాయాలని మీ ఉద్దేశ్యం కాబోలు.(ఒక వైపు kfc lo ఫ్యామిలీ తో ఔటింగులు.రచయిత గ పేరు కోసం మాత్రం marxism ).ఇటువంటి టిక్కు టాకు యవ్వారం అందరికి సాధ్యం కాదు లే అమ్మ.మీరు మీ మొదటివారికి మాత్రమే సాధ్యం.ఇష్టమైన dining ప్లేస్ chutneys ,మంచి నవల అంటే రేగడి విత్తులు ,ఉద్యోగం కోసం కెరీర్ కోసం తెలంగాణా వాదం.మీ గురించి మీ మొదటి వారి గురించి మాకు బాగా తెలుసమ్మా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో